9, అక్టోబర్ 2017, సోమవారం

హోదాలేని అధికారం ఎందుకు? – భండారు శ్రీనివాసరావు


కొన్ని వారాలు వెనక్కి వెడితే...
సాక్షి టీవీలో అమర్ ఫోర్త్ ఎస్టేట్ ప్రోగ్రాం. పక్కన ఎక్జిక్యూటివ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు కూడా వున్నారు, నంద్యాల ఎన్నికల తరువాత అనుకుంటాను.
“అధికారం ఉన్నదే దుర్వినియోగం చేయడానికి, లేకపోతే ఆ అధికారం ఎందుకు?” అన్నాను ఒక ప్రశ్నకు జవాబుగా.
అధికార దుర్వినియోగాన్ని నేను సమర్దిస్తున్నానా అనే భావం వారి మొహాల్లో కనిపించి నేను కొంత వివరణ ఇవాల్సి వచ్చింది.
అధికారాన్ని వినియోగించడం, దుర్వినియోగం చేయడం అనే విషయంలో చాలామందికి చాలా అభిప్రాయాలువుంటాయి.
పూర్వం నాకు తెలిసిన ఒక ఐ.ఏ.ఎస్. అధికారి వుండేవారు. ఇప్పుడు లేరు. జిల్లా కలెక్టర్ గా పనిచేసే రోజుల నుంచి తెలుసు. చాలా నిక్కచ్చి మనిషి. విజయ నగర్ కాలనీలో ఒక టూ ఆర్టీ ఇంట్లో కాపురం. ఆయన భార్య రెండు సిటీ బస్సులు మారి నారాయణ గూడాలోని మా బంధువుల ఆసుపత్రికి వచ్చి వెడుతుండేది. ఆయన ఆఫీసు కారు ఆయన ఆఫీసు వరకే. అలాంటి మనిషి ఒక మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో విలేకరుల సమావేశాలు పెడుతుండేవారు. నేను మామూలుగా అందరు విలేకరులతో వెళ్లి కూర్చుంటే, ఆయన నన్ను తన పక్కన వచ్చి కూర్చోమనే వారు. అలా ఒక విలేకరిని విడిగా మర్యాద చేయడం మర్యాద కాదని ఆయనతో ఎన్నో సార్లు మర్యాదగానే చెప్పేవాడిని. కానీ పిలిచిన ప్రతిసారీ అదే వరస. చివరికి నేను పోవడం మానేసి, వాళ్ళ పీఆర్వో తో మాట్లాడి ప్రెస్ నోట్ తెప్పించుకునే వాడిని. ఇదెందుకు చెబుతున్నాను అంటే అధికార దుర్వినియోగం అంటే తెలియని ఆ అధికారి కూడా తన తోటి సిబ్బంది దృష్టిలో మాట పడే పరిస్తితి తెచ్చుకున్నాడు. ‘ఈయన సరే లెండి, ఒక రూలూ లేదు చట్టుబండలు లేదు. తనకెంత తోస్తే అంతే!’ అనే వాళ్ళు పరోక్షంలో.
ఇప్పుడు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు ఆయన శాఖలో అధికార దుర్వినియోగానికి అడ్డు కట్ట వేసే ప్రయత్నం మొదలు పెట్టారని పత్రికల్లో చదివాను. ఉన్నతాధికారులు ఎవరి పని వాళ్ళు చూసుకోవాలని, పై అధికారులు పర్యటనలకు వచ్చినప్పుడు విమానాశ్రయాలకు వెళ్లి రిసీవ్ చేసుకునే పద్దతికి స్వస్తి చెప్పాలని, ప్రత్యేక బోగీల్లో (సెలూన్ అంటారు, ఒక స్టార్ హోటల్ గదిలా సర్వ సౌకర్యాలు వుంటాయి, వెనక మల్లికార్జున్ గారు  రైల్వేశాఖ డిప్యూటీ  మంత్రిగా వున్నప్పుడు  ఈ వైభోగం అనుభవించే అవకాశం హైదరాబాదులోని మా బోటి విలేకరులకు  తరచూ కలుగుతుండేది) ప్రయాణాలు మానుకోవాలని ఇలా అనేక ఆదేశాలు జారీ చేసారుట. సంతోషమే.
పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మంత్రులు కేంద్రంలో వున్నప్పుడు వారానికి రెండు మార్లు, ముఖ్యంగా శనాదివారాల్లో హైదరాబాదు వచ్చి పోయేవాళ్ళు. ఎన్డీయే ప్రభుత్వం, యూపీఏ తేడాలేదు. శనివారం సాయంత్రం కల్లా వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన ఓ వంద వాహనాలు ఎయిర్ పోర్టుకు చేరుకునేవి. వాటిల్లో కనీసం ఓ పాతిక అయినా అద్దెకు తీసుకున్న ఖరీదైన వాహనాలు. అవి  వచ్చే అతిధులకు, వారి పరివారం కోసం. వాటికి వారం వారం బిల్లులు కట్టడం తప్ప అవి ఎవరు వాడారు, ఎక్కడెక్కడ తిరిగారు అని ఆరా తీసే నాధుడు ఉండేవాడు కాదు. వచ్చే మంత్రి గారి శాఖ స్థాయిని బట్టి ఏర్పాట్ల స్థాయి కూడా పెరుగుతుండేది. బస చేయడానికి ప్రభుత్వ అతిధి గృహాలు ఉన్నప్పటికీ ఎందుకయినా మంచిదని అయిదు నక్షత్రాల హోటళ్ళు కూడా బుక్ చేసేవాళ్ళు. యెంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కాస్త గిట్టుబాటు వుండే శాఖల వాళ్ళు విరగబడి ఖర్చులు పెట్టేవాళ్ళు.

తోక టపా : పూర్వం ఒక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తన జన్మదినం రోజున ఎవ్వరూ పుష్ప గుచ్చాలు తేవద్దని ముందస్తుగా ప్రకటన కూడా విడుదల చేసారు. ఆరోజు ఆయన్ని కలిసి అభినందనాలు తెలపడానికి వచ్చిన వాళ్ళ చేతుల్లో పుష్ప గుచ్చాలు లేవు. వాటి స్థానంలో అత్యంత ఖరీదైన  కాశ్మీరీ  శాలువలు వున్నాయి.    

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Journalists in the good books of politicians enjoy everyone.