ఇది సినిమా రివ్యూ కాదు. ఒక అభిప్రాయం
మాత్రమే.
1970 నుంచి 1975 వరకు నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసేరోజుల్లో నండూరి రామమోహన రావు గారు
నాచేత వారం వారం సినిమా రివ్యూలు రాయించేవాళ్ళు. తెలుగు సినిమాలతో పాటు అప్పుడు
విజయవాడలో అడపాతడపా విడుదల అయ్యే హిందీ సినిమాలు చూసి సమీక్షలు రాస్తుండేవాడిని.
పాకీజా సినిమా వాటిల్లో ఒకటి.
ఇక ఇన్నేళ్ళలో రివ్యూలు రాయడమే కాదు,
అసలు సినిమాలు చూడడమే తగ్గిపోయింది. ఒకప్పుడు పిల్లలకి చూపించడానికి సినిమాలకు
వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు తీసుకువెడితే వెడుతున్నాం.
అలాగే మొన్న ఒక సినిమాకి వెళ్ళాము. ‘ఒక’
అని ఎందుకు అన్నాను అంటే హాల్లోకి వెళ్లి కూర్చునే దాకా అది 'అర్జున్ రెడ్డి' సినిమా
అని తెలవదు.
చాలా రోజులుగా ఈ సినిమా గురించి మంచీ
చెడూ చాలా విస్తారంగా చదువుతూ వస్తున్నాను కనుక పోనీలే ఒకమంచి పని జరిగింది, అదేదో
నేనే ఒక అంచనాకు రావచ్చని సర్దుకున్నాను.
చూసిన వాళ్ళు అందరూ ‘మూడు కిస్సులు, ఆరు బీర్లు’ అని ఒక్క ముక్కలో తేల్చి ఎగతాళిగా
మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను కానీ అదేదో మొదటి సీనులోనే కనిపించింది. వెనకటి
రోజుల్లో కొన్ని సన్నివేశాలతో పాత్రల స్వరూప స్వభావాలు ప్రేక్షకులకు తెలిసిపోయేలా స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు. దాన్నే ‘కేరక్టర్’ ఎస్టాబ్లిష్ చేయడం అని అంటుండేవాళ్ళు.
అలా ఈ సినిమా మొదట్లోనే హీరో కేరక్టర్ బాగా ఎస్టాబ్లిష్ చేసి ‘యితడు మారడు, ఇతగాడు
ఇంతే!’ అనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో
బలంగా నాటారు. దాంతో పుష్టి బ్రాండ్ కలిగిన ‘హీరో కం విలన్’ గానే చివరివరకు
అనిపించాడు, కనిపించాడు. అయితే చిత్ర దర్శకుడిలో నాకో చిత్రమైన గుణం కనిపించింది. అతడికి
చూసేవారి అభిప్రాయాలతో నిమిత్తం వున్నట్టు లేదు. తను చెప్పదలచుకున్నది చెప్పడం,
చూపించడం తప్పిస్తే ఎక్కడా దారి తప్పలేదు. ‘నేను ఇంతే సుమా’ అనే హీరో పాత్ర
మాదిరిగానే, దర్శకుడు కూడా అంతే. ఒక్క అంగుళం ఇటూ అటూ సర్దుబాటు తత్వం లేదు. ఈ చిత్రం అంచనాలకు మించి తారా స్థాయిలో విజయం
మూటకట్టుకుంది కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఆయన గురించి ఎన్ని వ్యాఖ్యలు
వినవచ్చేవో.
హీరో తన ప్రేమను మరీ అంత క్రూరంగా
ప్రదర్శించాలా అనిపిస్తుంది ఒక్కోసారి. ‘ ప్రేమించిన యువతికి వేరే వాళ్ళతో
పెళ్లయినా సరే, గర్భవతి అయినా సరే ఆ ఆమ్మాయినే పెళ్లి చేసుకుని తీరతాను’ అనే మొండి
పట్టుదల హీరో ప్రేమలోని స్వచ్చతకు ప్రశ్నార్ధకంగా తయారయింది. దానికి తోడు వీర తాగుడు.
యెంత గొప్ప డాక్టరు అయితేనేం, యెంత గొప్ప ప్లేయర్ అయితేనేం మానవసంబంధాలకు కనీస విలువ ఇవ్వనప్పుడు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం చూస్తుంటే మరీ అతిగా గారాబం చేస్తున్నారేమో అని కూడా
అనిపిస్తుంది. ఇతర పాత్రలు, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనేదానితో దర్శకుడు
సంబంధం పెట్టుకోలేదు. ‘ఈ హీరో పాత్ర ఇంతే, ఇలాగే వుండాలి’ అనుకున్నాడు, అలాగే
తీశాడు. ఆయన కన్విక్షన్ చాలా గొప్పది.
సినిమా చాలాసార్లు ముగింపుకు
వచ్చినట్టే ఫీల్ కలిగిస్తూ మళ్ళీ మొదలయి ముందుకు సాగింది. అసలు ఇంట్లోవాళ్ళు తన
ప్రేమను కాదనే బాపతు అయితే అతడు తన ప్రేమను పండించుకోవడానికి అంత దూరం వెళ్ళాడు అనుకోవచ్చు. కానీ అతడి ప్రేమ విషయంలోనే కాదు, చదువులో కూడా తన మాటే నెగ్గించుకున్నా
అతడి తరపువాళ్ళు ఎన్నడూ అభ్యంతర పెట్టిన
దాఖలా లేదు. అలాంటప్పుడు తన పెద్ద వాళ్ళనే
వెళ్లి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకు రమ్మంటే సరిపోయేది, ప్రేమించిన యువతి ఇంటికి నేరుగా వెళ్లి, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కళ్ళముందే
ప్రేయసిని ముద్దాడుతూ, అదో ఘన కార్యంలా వాళ్ళతో గిల్లీ కజ్జా పెట్టుకోవాల్సిన అవసరం
ఏముంది అని ప్రేక్షకుల్లో కొందరికి అనిపించి ఉండొచ్చు. కానీ దర్శకుడు అలా
ఆలోచించలేదు. ఆయన రూటే సపరేటు అన్నట్టుగా సినిమా తీసుకుంటూ పోయాడు. మంచి టాక్ మొదట్లోనే
రావడం వల్ల ప్రేక్షకులు కూడా చూసుకుంటూ పోయారు. అదీ ఒక రకంగా మంచిదయింది. ఈ సినిమా
ఇన్ని రోజుల తర్వాత చూసే అవకాశం నాకు కలిగింది.
హీరో ఓరియంటెడ్ సినిమా కావడం వల్ల ఆ
పాత్ర వేసిన విజయ్ సాయికి మంచి ప్రశంసలు దక్కాయి. నిజంగా బాగా చేసాడు కూడా. ‘అమ్మో
ప్రేమంటే ఇలా కూడా ఉంటుందా, ఇటువంటి
ప్రేమను భరించడం కష్టం బాబూ’ అని సినిమా చూస్తున్న టీనేజర్లు అనుకుని వుంటారు.
అయితే, తీసిన విధానం, ఫోటోగ్రఫీ
సూపర్బ్ గా వున్నాయి. చిన్న వాళ్ళతో తీసిన చిన్న చిత్రం అనుకున్నాకాని, బాగానే ఖర్చు చేసినట్టు
అనిపించింది.
నటన విషయంలో మార్కులు వేయాల్సివస్తే ఆ
వరస ఇలా వుంటుంది.
బామ్మ పాత్ర వేసిన కాంచన, అస్తమానం హీరోని
అంటిపెట్టుకుని వుండే స్నేహితుడు, అతడి నాన్న, హీరో తండ్రి ఆ తరవాతనే ఎవరయినా.
1 కామెంట్:
మీరు అర్జున్ రెడ్డి సినిమా చూశారా. హతవిధీ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి