ముగ్గురు
మిత్రులు – సరస్వతి రమ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
నలభయి
ఏళ్ళ తర్వాత కలుసుకున్న ముగ్గురు మిత్రులు గురించిన ఆంధ్రజ్యోతి కధనం. ఇందులో ఒకరు
మన ఫేస్ బుక్ మిత్రుడు వేమవరపు భీమేశ్వర రావు కాగా రెండో వ్యక్తి తుర్లపాటి వెంకట
సాంబశివరావు. అతడూ ఫేస్ బుక్ లో వున్నాడు. మూడో మనిషిని నేనే కనుక నా గురించి చెప్పక్కరలేదు. మా ఇంట్లోనే జరిగింది ఈ అపూర్వ
కలయిక. కాకపొతే,
2009 డిసెంబరులో.
రాసిన విలేకరి సరస్వతి రమ. దీనికి ఆవిడ పెట్టిన శీర్హిక ‘సంగమం’.
సంగమం
ఉదయాన్నే
ఫోను మోగింది. కాఫీ తాగుతూ పేపరు చదువుతున్న శ్రీనివాసరావు ‘ఇంత పొద్దున్నే ఎవరబ్బా’ అనుకుంటూనే ఫోను తీశాడు. ‘శ్రీనివాసరావా!’ అంటూ అవతలనుంచి కాస్త వయసుమీద పడినట్టున్న
గొంతు పలకరించింది. ‘అవును.
మీరు....’
అన్నాడు శ్రీనివాసరావు. ‘గుర్తు
పట్టు చూద్దాం’
అంది అవతలి గొంతు కవ్వింపుగా. భీమేశ్వర రావు కదూ..’ అంటూ
నలభయ్ ఏళ్ళ తరువాత విన్న ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు శ్రీనివాసరావు. అప్పుడు వారి
ఆనందానికి అవధులు లేవు. మరో బాల్య మిత్రుడు సాంబశివరావుని కూడా పిలిచి
శ్రీనివాసరావు ఇంట్లో కలవాలని నిర్ణయం చేసుకున్నారు. ఓ రోజు ఉదయం కలిసారు కూడా.
నలభయ్ ఏళ్ళనాటి కబుర్లు చెప్పుకుంటూ చిన్నపిల్లలై పోయిన ఆ ముగ్గుర్నీ ఓసారి
పలకరిద్దాం పదండి –
సరస్వతి రమ
భండారు శ్రీనివాసరావు, భీమేశ్వర రావు, తుర్లపాటి సాంబశివరావు చిన్ననాటి
స్నేహితులు. స్కూలు చదువులు, పై చదువులు, ఉద్యోగాలు,పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు,
రిటైర్ మెంట్లు ఇలా అన్నీ పూర్తయ్యాక ఈ
మధ్యనే హైదరాబాదులో కలుసుకున్నారు. నలభయ్ ఏళ్ళ తరువాత కలుసుకున్నా ఆ ముగ్గురిలో
అదే స్నేహం, అదే ఆత్మీయత. చదువులు పూర్తయ్యాక, ఉద్యోగ, ఉపాధుల నిమిత్తం
ఎక్కడెక్కడో సెటిల్ అయిన తరువాత కూడా ఒకరికోసం మరొకరు ఆరా తీసుకుంటూనే వున్నారు. వీరిలో
శ్రీనివాసరావు,సాంబశివ రావు బంధుత్వం రీత్యా మధ్య మధ్య కలుసుకుంటూనే వున్నా,
భీమేశ్వర రావు ఆ ఇద్దర్నీ కలవడం నలభయ్ ఏళ్ళలో మొదటి సారి. అసలు వీళ్ళ కలయిక కూడా
చాలా విచిత్రంగా జరిగింది.
క్షణంలో చేరువైన నలభై ఏళ్ళ దూరం
భీమేశ్వరరావు కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి
రెండేళ్ళ క్రితం హైదరాబాదు వచ్చారు. వచ్చినప్పటి నుంచి కూడా తన చిన్న నాటి మిత్రుల జాడకోసం తెలిసిన
వాళ్ళ ద్వారా ప్రయత్నిస్తూనే వున్నారు. ఆయన హోమియో వైద్యం కూడా ప్రాక్టీసు చేస్తారు. తనకు పరిచయం వున్న
ఒక మీడియా మిత్రుని ద్వారా భండారు శ్రీనివాసరావు ఫోను నెంబరు పట్టుకుని
ఫోనుచేసారు. ఆ విధంగా ఈ ముగ్గురు బాల్య స్నేహితులు భండారు శ్రీనివాసరావు ఇంట్లో
కలుసుకున్నారు.
వేయిపడగల గ్రంధం
“మా జ్ఞాపకాలను, చిన్ననాటి అనుభూతులను నెమరు వేసుకోవడానికి ఇప్పుడు మాకు దొరికిన ఈ
రిటైర్మెంట్ లైఫ్ కూడా సరిపోదేమో. మా స్నేహాన్ని, మా బాల్యాన్ని వర్ణించాలంటే వేయి
పడగలంత పెద్ద కావ్యం అవుతుంది” అంటూ తమ చిన్ననాటి ముచ్చట్ల
మూట విప్పడం మొదలెట్టారు తుర్లపాటి సాంబశివరావు.
“ముందు నుంచీ కూడా మా భీమేశ్వర రావు చాలా క్రమశిక్షణతో
వుండేవాడు. వాళ్ళ నాన్నగారి నుంచి వాడికది అబ్బింది. మితభాషి కూడా. వాడిప్పుడు
ఇంతలా మాట్లాడుతుంటే మాకే ఆశ్చర్యంగా వుంది. ఇన్నాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో వున్నాడు
కదా! బహుశా అంచేత మాటకారిగా మారివుంటాడు’ అన్నాడు సాంబశివరావు. ముగ్గురూ హాయిగా
నవ్వుకున్నారు.
“కానీ మేమిద్దరం అలా కాదు. కొంచెం ఆకతాయిలం. అప్పట్లో వాలీబాల్
లాంటి ఆటలను గంట ఆడుకోవడానికి రెండుగంటలు
ప్రాక్టీసు చేసేవాళ్ళం. సెకండ్ షో సినిమాలు, నాటకాలు అబ్బో ..చాలా వేషాలు వేశాం”
అని తుర్లపాటి చెబుతుంటే, “అవును. మా స్కూల్లో మాకు చక్కని వినోదాన్ని పంచేవాడు
శ్రీనివాసరావు. పాటలు, పద్యాలు, కవితలు..వాడికి రాని కళలు లేవంటే నమ్మండి.
మాయాబజార్ లో పాటలూ, పద్యాలు అన్నీ కంఠస్థ౦. నేనెప్పుడు మాయాబజార్ పాటలు విన్నా నాకు శ్రీనివాసరావు చాలా గుర్తుకు
వచ్చేవాడు. ప్రతిరోజూ సాయంకాలం ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకుని గంట, గంటన్నర కబుర్లు
చెప్పుకునే వాళ్ళం. అన్నీ కూడా విజ్ఞానాన్ని పంచుకునే అంశాలే వుండేవి, మాకబుర్లలో.
అల్లరికి అల్లరి, చదువుకు చదువు అన్నీ చేసేవాళ్ళం’ అని మాటలు మొదలు పెట్టాడు,
భీమేశ్వర రావు.
“అంతేనా ఏ మాస్టారు తగిలినా ఆ మాస్టారు
మీద కవిత్వం రాసేవాళ్ళం. అయితే వీళ్ళిద్దరూ
చదువులో ఫాస్ట్. నేనేమో లాస్ట్ నుంచి ఫస్ట్. అయినా మా మీద ఇప్పటి పిల్లల మాదిరిగా ఒత్తిళ్ళు,
లక్ష్యాలు లేవండీ బాబూ. హాయిగా తిరిగాం, తిరుగుతూ పెరిగాం. బాల్యాన్ని చక్కగా ఆస్వాదించాం” అంటూ గత
జ్ఞాపకాల మాధుర్యాన్ని చవి చూసుకుంటూ చెప్పారు భండారు శ్రీనివారావు.
ఆ రోజులింక రావు ....
“మొత్తానికి ఇన్నాళ్ళ తరువాత కలుసుకోవడం
ఉద్విగ్నంగానే కాదు ఎంతో ఎమోషనల్ గా అనిపిస్తోంది.
నాకు చదువు పూర్తయిన తరువాత హైదరాబాదులోనే ఉద్యోగం సంపాదించుకుని అక్కడే
స్థిరపడాలనే కోరిక నాకుండేది. అయితే దురదృష్టవశాత్తు నాకిక్కడ ఉద్యోగంచేసే అవకాశం
రాలేదు. కానీ ఇక్కడ స్థిరపడే అదృష్టం మాత్రం దక్కింది. అయితే ఇప్పటి హైదరాబాదు
అప్పటిలా లేదు. చాలా మారింది. అప్పట్లో విజయవాడ నుంచి హైదరాబాదు రావాలంటే ఎంతో సంబరపడేవాళ్ళం.
మళ్ళీ ఇక్కడనుంచి బెజవాడ వెళ్ళాలంటే ఏడుపొచ్చేది” అని భీమేశ్వర రావు చెబుతుంటే, “
అవునురా! ఇప్పుడున్న రామోజీ సిటీ ప్రాంతంలో రోజుకు రెండు వైపులా ద్రాక్ష తోటలు
ఉండేవి. ఆ పోలిమేరల్లోకి బస్సు రాగానే వాతావరణం పూర్తిగా మారిపోయేది. బస్సు కిటికీ
రాడు చల్లగా ఐసు కడ్డీలా అయిపోయేది. అలా రాడ్లు చల్లబడ్డాయంటే హైదరాబాదు
వచ్చినట్టు లెక్కన్న మాట. అసలా హైదరాబాదుకు ఇప్పటి హైదరాబాదుకు పోలికే లేదు”
నిట్టూర్చారు శ్రీనివాసరావు.
ఇలా ఆ మువ్వురు బాల్య స్నేహితుల తమ జ్ఞాపకాల
మూటనుంచి, హైదరాబాదు మొదలుకుని ఎన్నెన్నో చిన్ననాటి ముచ్చట్లు అలా బయటకు తీస్తూనే వున్నారు. చమత్కారాలు, జోకులు, సరదాసరదా
ముచ్చట్లతో వారి సంభాషణ అనంతంగా సాగిపోతూనే వుంది.
ఆ ముగ్గురు మిత్రుల శేష జీవితం ఈ స్నేహ
మాధుర్యంతో ఆనందంగా సాగిపోవాలని కోరుకుందాం.
(సరస్వతి రమ, ఫోటోలు: బిక్షం రూధర్)