8, జులై 2011, శుక్రవారం

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి! – భండారు శ్రీనివాసరావు

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి! – భండారు శ్రీనివాసరావు


(08-07-2011 తేదీ సాక్షి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

"అయాం సోల్డ్" - అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు.
ముఖ్యమంత్రి అమ్ముడుపోవడమా!అందులోను వైఎస్సార్? ఎవరికి అమ్ముడుపోయారు? ఎంతకు అమ్ముడుపోయారు?

అది డిసెంబరు నెల. 2007 వ సంవత్సరం.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సు ధ్వనిని అనుకరిస్తూ దాని ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే - సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది.అదే ఎఫ్ డీ హెచ్ ఎస్. -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశిత దిన వైద్య సేవలు. ఇందుకు పూర్వ రంగం గురించి కొంత ప్రస్తావించాల్సివుంటుంది.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు

ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.ఈ నేపధ్యంలో -

అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ

సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.


ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులేన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెచ్ ఎం ఆర్ ఐ నిర్వాహకులు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ తీసుకుని ఒకనాడు సచివాలయానికి వెళ్ళారు. ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో- రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హటాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.

అంతే! దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

కానీ, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఇప్పుడు ఆయనా లేరు. ఆ పధకాలూ ఆయన లాగానే అంతర్ధానం అయిపోతున్నాయి. ఇవ్వాళో రేపో వాటిని పూర్తిగా అటకెక్కించినా ఆశ్చర్యంలేదు.

(ఈ రోజు కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి)

6 కామెంట్‌లు:

Devika Sai Ganesh Puranam చెప్పారు...

చక్కగా చెప్పారు.

చాలా దురదృష్టకరం ఆం. ప్ర.కి రాజశేఖరరెడ్డి లాంటి నాయకుడిని కొల్పొవటం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పొయినప్పుడు కూడా ఇంత అనిశ్చితి ఎరగము.

Devika Sai Ganesh Puranam చెప్పారు...

చక్కగా చెప్పారు.

చాలా దురదృష్టకరం ఆం. ప్ర.కి రాజశేఖరరెడ్డి లాంటి నాయకుడిని కొల్పొవటం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పొయినప్పుడు కూడా ఇంత అనిశ్చితి ఎరగము.

Sreenivasulu Nallani చెప్పారు...

అంకుల్ - మీరు చెప్పింది నిజమే. కాని ప్రతిది FREE FREE FREE అని చెప్పి మొత్తం APని 30 years వెనక్కి వెల్లాం అన్నది కుడా అంతె నిజం

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Devika Sai Ganesh Puranam -ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@srinivasulu nallani - ఇక్కడ సందర్భం రాజశేఖరరెడ్డి గారి జయంతి. మీరు పేర్కొన్న 'ఆల్ ఫ్రీ' గురించి మరోసారి ముచ్చటించుకుందాం. ధన్యవాదాలతో -భండారు శ్రీనివాసరావు

Praveen Mandangi చెప్పారు...

రాజశేఖరరెడ్డి ఒక పెద్ద దొంగ. తెలంగాణాలో దుమ్ముగూడెం ప్రోజెక్ట్ నుంచి కడప జిల్లాకి కాలువలు తవ్వాలనుకున్నాడు. అది సాధ్యం కాదని చెపితే దుమ్ముగూడెం ప్రోజెక్ట్ ప్రొపోజల్‌నే చెత్త బుట్టలో పడేశాడు. అతన్ని విమర్శించకపోయినా నష్టం లేదు కానీ అతని విధానాలని అనుసరిస్తే రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలు ఎడారులవుతాయి. http://videos.teluguwebmedia.in/fbrgvtjployn