31, జులై 2011, ఆదివారం

మగవారికి మాత్రమే - భండారు శ్రీనివాసరావు

మగవారికి మాత్రమే - భండారు శ్రీనివాసరావు

(తమలపాకుతో నీవిట్లంటే తలుపుచెక్కతో నేనిట్లంటా)




(కొందరు ఆడవాళ్ళను గురించి మరికొందరు మగవాళ్లు సరదాగా చెప్పిన మాటలు ఇవి. వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు అందరు ఆడవాళ్ళకు వర్తించాలని రూలేమీ లేదు)

“పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు గా వుంటారు. కలసివున్నట్టుగా కనిపిస్తారు కానీ ఎన్నటికీ కలవలేరు.”- అల్ గోరె
“మగవాళ్ళు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మంచి భార్య దొరికిందా సుఖపడతారు. లేకపోతే నష్టం లేదు. పెద్ద వేదాంతి గా మారే అవకాశాలు పెరుగుతాయి.”- సోక్రటీస్

“తన భర్త గొప్పగొప్ప పనులు చేసి విజయాలు సాధించాలని ప్రతి భార్యా ఉత్సాహపడుతుంది. అతడిని ఆవైపుగా ప్రోత్సహిస్తుంది. కానీ, అంతవరకే. మొగుడు వాటిని సాధించడం మాత్రం ఇష్టపడదు.” - మైక్ టైసన్

“బహుశా ఎవ్వరూ జవాబు చెప్పలేని ప్రశ్న ఏదయినా వుందా అని నన్నడిగితే నా మెదడుకు ఒక్కటే తడుతోంది- ఆడది కోరుకునేది ఏమిటి ? అన్నదే ఆ ప్రశ్న.” – జార్జ్ క్లూనీ

“నేను మా ఆవిడతో మాట్లాడింది కేవలం మూడంటే మూడే ముక్కలు. ఆమె బదులుగా ఏకంగా ఒక దండకమే చదివింది.” – బిల్ క్లింటన్

“మీరూ మీ ఆవిడా ఇన్నేళ్ళుగా కలసి కలతలు లేని కాపురం చేస్తున్నారు. ఏమిటి ఇందులో రహస్యం అని నా మిత్రులు అడుగుతుంటారు.ఇందులో పెద్దగా దాచుకోవాల్సింది ఏమీ లేదు. ఎన్ని పని వొత్తిడులు వున్నా వీలు చేసుకుని వారానికి రెండు సార్లు ఏదయినా రెస్టారెంటుకు వెళ్లి మంచి సంగీతం వింటూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తుంటాము. కాకపొతే ఆవిడ ప్రతి మంగళవారం శుక్రవారం వెడుతుంది. నేను మాత్రం శని,ఆదివారాల్లో వెడుతుంటాను.” – జార్జ్ డబ్ల్యు. బుష్

“ఉగ్రవాదం అన్నా ఉగ్రవాదులన్నా నాకు భయమనిపించదు. నేను పెళ్లి చేసుకుని రెండేళ్ళయింది.”- -రూడీ గిలానీ

“ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్నమాటేకాని నిజానికి సుఖపడిందేమీ లేదు. మొదటి భార్య నన్ను వొదిలేసింది. రెండో ఆవిడ ఆ పని చెయ్యకపోగా ముగ్గురు పిల్లలకు తండ్రిని చేసింది.” – డొనాల్డ్ ట్రంప్

“కాపురం పది కాలాలపాటు సజావుగా సాగాలంటే భర్తలకు నేను చెప్పే సలహాలు రెండే రెండు.
ఒకటి. మీరు చెప్పేది రైట్ కాదని తెలిసినప్పుడు నిజాయితీగా దాన్ని భార్యముందు వొప్పుకోండి. రెండు. మీరే రైట్ అనుకున్నప్పుడు దాన్ని మీ ఆవిడతో చెప్పకుండా నోరుమూసుకోండి.” - షాక్విల్ ఓ’ నీల్

“భార్య పుట్టినరోజు మరచిపోకుండా గట్టిగా గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఒక మార్గం వుంది. ఓ ఏడాది దాన్ని గురించి మరచిపోయి చూడండి. ఆ తర్వాత గుర్తుంచుకోవడం ఎలాగో ఆవిడే నేర్పుతుంది.” - కోబె బ్రియాంట్
“పెళ్ళికి ముందు ఏం చేసానో తెలుసా ? జీవితంలో ఏవేం కావాలనుకున్నానో అన్నీ చేసికూర్చున్నాను.”.- డేవిడ్ హాసెల్ హాఫ్

“నేనూ మా ఆవిడా ఇరవై ఏళ్ళపాటు హాయిగా, నిశ్చింతగా వున్నాము. ఆ తర్వాతే ఇద్దరం కలుసుకోవడం, పెళ్ళిచేసుకోవడం జరిగింది.”- అలెక్ బాల్డ్విన్

“మంచి భార్యకో మంచి లక్షణం వుంటుంది. తప్పు తనదైనప్పుడు భర్తను ఉదారంగా క్షమిస్తుంది.”-బరాక్ ఒబామా

“వివాహం అనేది ఒక యుద్ధం లాటిది. కాకపొతే ఈ యుద్ధరంగంలో శత్రువులిద్దరూ కలసి ఒకే చోట నిద్రిస్తారు.” – టమ్మీ లీ

ఒకడు చెప్పాడు.” నా భార్య దేవత”
“అంత అదృష్టం అందరికీ వుంటుందా. మా ఆవిడ బతికే వుంది.” – జిమ్మీ కిమ్మెల్

“లేడీస్ ఫస్ట్ అంటారు ఎందుకని ?”


“దేవుడు కూడా ఆ మాటనే నమ్ముకుని ఆడవాళ్లనే ముందు లోకంలోకి పంపాడు. వాళ్లు మొత్తం ప్రపంచాన్ని ఒక మెస్ చేసికూర్చుంటారని ఆయనకూ తెలియదు” – డేవిడ్ లెటర్ మాన్

“ముందు ఎంగేజ్ మెంట్ రింగ్. తరువాత మ్యారేజ్ రింగ్. ఆ తరువాత ...”
“ఇంకేం రింగ్. మిగిలేది ఒక్కటే. సఫరింగ్” - జే లెనో

(31-07-2011)

30, జులై 2011, శనివారం

అవినీతి వ్యతిరేక పోరాటంలో రాజకీయ కోణాలు – భండారు శ్రీనివాసరావు

అవినీతి వ్యతిరేక పోరాటంలో రాజకీయ కోణాలు – భండారు శ్రీనివాసరావు

(30-07-2011 ‘సూర్య’ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

ఆగస్టు ఒకటినుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభ కానున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ సమావేశాలు ఎంత సజావుగా సాగగలవన్న దానిపై ఉజ్జాయింపుగా ఒక అంచనాకు రావడం కష్టమేమీకాదు. అయితే, ఈ సమావేశాల పుణ్యమా అని - లోక్ పాల్ ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం, కర్నాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు- అనే రెండు కీలక అంశాలపట్ల రెండు ప్రధాన రాజకీయ పార్టీలు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చింది.

రాజకీయ అవినీతికి సంబంధించిన పలు వార్తలు వివిధ కోణాలలో వెలువడుతున్న నేపధ్యంలో కేంద్ర క్యాబినెట్ గత గురువారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సమావేశమై లోక్ పాల్ ముసాయిదా బిల్లును ఆమోదించింది. స్పెక్ట్రం కుంభకోణం తాలూకు కారుమేఘాలు వర్షాకాల సమావేశాలను కబళించే వాతావరణం ప్రస్పుటంగా కానవస్తున్న దృష్ట్యా, లోక్ పాల్ బిల్లుకు ఏదో ఒకవిధమయిన స్వరూపం ఇవ్వక తప్పని పరిస్తితిని- ప్రతిష్ట మసకబార్చుకున్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎదుర్కుంటోంది. అందుకే కేంద్ర మంత్రివర్గం, లోక్ పాల్ బిల్లు వ్యవహారాన్ని ప్రాధాన్యతా క్రమంలో ముందుకు తీసుకురావాల్సివచ్చింది. అయినా సరే, ఈ బిల్లుకు సంబంధించి పౌరసమాజ ప్రతినిధులు చేసిన ప్రధానమయిన సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెట్టి తను అనుకున్న పద్ధతిలోనే లోక్ పాల్ బిల్లుకు తుది రూపం ఇచ్చింది. ఈ బిల్లు పరిధి నుంచి ప్రధానమంత్రినీ, న్యాయ వ్యవస్థను మినహాయించి లోక్ పాల్ వ్యవస్థకు వుండాల్సిన కోరలు తొలగించారు. ప్రధాని పదవిని కూడా బిల్లు పరిధిలోకి తీసుకురావాలని మన్మోహన్ సింగ్ మొన్నటి క్యాబినెట్ సమావేశంలో పట్టుబట్టినప్పటికీ మంత్రివర్గంలోని ఇతర సభ్యులు అందుకు ససేమిరా అంగీకరించలేదన్న స్క్రోలింగులు ఈ వార్తతో పాటే టీవీ తెరలపై దర్శనమివ్వడం విశేషం. ముసాయిదా బిల్లు తనకు అసంతృప్తి కలిగించిందనీ, మళ్ళీ ఆగస్టు 16 నుంచి దీక్ష ప్రారంభిస్తాననీ అన్నాహజారే వ్యాఖ్యానించడాన్నిబట్టి చూస్తే ఇది పార్లమెంటులో బతికి బట్టగట్టి చట్టరూపం తీసుకుంటుందన్న ఆశలు నీరుగారిపోతున్నాయి.

యూ.పీ.యే. సర్కారుపై వస్తున్న అవినీతి ఆరోపణలు, వెలుగుచూస్తున్న కుంభకోణాలపై ప్రభుత్వ పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రధాన ప్రతిపక్షం బీ జే పీ వ్యూహరచన చేస్తూ వుండడంతో లోక్ పాల్ బిల్లును పార్ల మెంటులో ప్రవేశ పెట్టి అవినీతి నిర్మూలనలో తనకూ చిత్తశుద్ధి వుందని నిరూపించుకోవడం కోసమే ఈ ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం ఆమోదించి వుంటుంది.

పోతే, బీ.జే.పీ. పరిస్తితి మరింత విడ్డూరం.

స్పెక్ట్రం కుంభకోణం దర్యాప్తులోను, తదుపరి విచారణ లోను వెల్లడవుతున్నసంచలనాత్మక సమాచారాన్ని పదునయిన అస్త్ర శస్త్రాలుగా సమకూర్చుకుని పార్ల మెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీపై ముప్పేట దాడి చేసి దానిని ప్రధమ ముద్దాయిగా నిలబెట్టి రాజకీయ లభ్దిపొందాలని పధకాలు సిద్ధం చేసుకుంటున్న ఆ పార్టీ అధిష్టానానికి కర్నాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం తెచ్చిపెట్టిన తలనొప్పి అంతా ఇంతా కాదు. ఏ అవినీతిపై గళం విప్పి, కదను తొక్కి పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ ను ఓ పట్టు పట్టాలని అనుకున్నదో అదే అవినీతి భాగోతం కర్నాటక లోకాయుక్త రూపంలో బీ.జే.పీ. గొంతులో పచ్చి వెలక్కాయగా మారింది. దానితో, ఇష్టం వున్నా లేకున్నా యడ్యూరప్పను ముఖ్య మంత్రి పదవినుంచి తొలగించాల్సిన అనివార్య పరిస్తితి ఆ పార్టీకి ఎదురయింది. గతంలో, ఈ మాదిరి రాజకీయ సంక్షోభాలు, పదవీ గండాలు యడ్యూరప్పకు కొత్తేమీ కాదు. 2008 మార్చి మాసంలో కర్నాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి, రాజకీయ పరమపద సోపాన పఠంలో యడ్యూరప్ప పలు పర్యాయాలు పెద్దపాము నోటబడి అట్టడుగుగుకు దిగజారే ప్రమాదం అనేకమార్లు ఆయనకు ఎదురయింది. అయినా తప్పించుకుని పీఠానికి అంటిపెట్టుకునే వుండగలిగారు. కానీ, ఈసారి పరిస్తితి పూర్తిగా మారిపోయి ఆయన మాజీ సీ యెం కాక తప్పని పరిస్తితి ఏర్పడింది. వర్షాకాల సమావేశాల్లో బీ.జే.పీ. అనుసరించదలచిన వ్యూహమే ఇప్పడు యడ్యూరప్పకు అడ్డుగోడగా తయారయింది. పార్ల మెంటులో కాంగ్రెస్ పార్టీని కడిగి గాలించాలంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్యూరప్పను వొదిలించుకోక తప్పదు. ఆ క్రమంలోనే బీ.జే.పీ. అధిష్టానం ముఖ్యమంత్రి మార్పుకు పచ్చ జెండా వూపాల్సివచ్చింది.

ఇక, కేంద్రంలో కాంగ్రెస్ పరిస్తితి నానాటికి తీసికట్టు అన్న సామెత చందంగా తయారవుతోంది. యూ.పీ.ఏ. ప్రభుత్వం మొదటి దఫా పదవీకాలం అయిదేళ్ళలో సంపాదించుకున్న ఘనకీర్తి యావత్తూ రెండో మారు అధికారంలోకి వచ్చిన అచిర కాలంలోనే ఆవిరయిపోయింది. ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిగత నిజాయితీ, నిస్వార్ధ వ్యక్తిత్వం సయితం యూ.పీ.ఏ. సర్కారుపై వెల్లువెత్తిన కుంభకోణాల మాటున మసకబారిపోయాయి. ఆయన మంత్రివర్గంలో కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖను నిర్వహించిన రాజా స్పెక్ట్రం కుంభకోణం విచారణ సందర్భంగా వెల్లడించిన విషయాలు మన్మోహన్ సింగ్ గురించి ప్రజలు వేరే విధంగా ఆలోచించే పరిస్తితిని కల్పించాయి. మరో మూడేళ్లలోపు రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పీఠం పై కూర్చోబెట్టాలనే లక్ష్యసాధన దిశగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ అధినాయకత్వం- తమది పరిశుద్ధ ప్రభుత్వమని నిరూపించుకునే క్రమంలో తన భాగస్వామ్య పక్షం డీ.ఏం.కే. నాయకులనే అవినీతి కేసుల్లో ఇరికించి జైలుకు పంపి ప్రజలనుంచి మంచి మార్కులు రాబట్టాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు కోర్టు సమక్షంలో రాజా చేస్తున్న తీవ్రమయిన ఆరోపణలు సాధారణ రాజకీయ ఎత్తుగడల్లో భాగమని జనం నమ్మేలా చేయడానికి మన్మోహన్ సింగ్ ఎంతో శ్రమించాల్సివుంటుంది. డ్రగ్స్ వాడకం వంటి కేసుల్లో పట్టుబడిన వ్యక్తులు వెల్లడించే పేర్లు ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ఉబలాటపడే అధికార యంత్రాంగానికి సదా ఉపయోగపడే ‘చట్టం’ – ప్రధాని మన్మోహన్ సింగ్, ఇప్పటి హోం మంత్రి, ఒకప్పటి ఆర్ధిక మంత్రి అయిన చిదంబరం గురించి న్యాయస్తానంలో మాజీ కేంద్ర మంత్రి రాజా బాహాటంగా చేసిన ప్రస్తావనల పట్ల కూడా అదేవిధంగా ‘తన పని తాను చేసుకుపోతుంది’ అనే నమ్మకం జనంలో కలిగించగలిగితే అంతకన్నా ఆహ్వానించాల్సిన అంశం మరొకటి వుండదు. కానీ, ఒకరిపట్ల ఒకరకంగా, మరొకరిపట్ల మరోరకంగా అవసరాన్నిబట్టి చట్టాల అన్వయం మారిపోతూ వుండడమే మన వ్యవస్థ లోని విషాదం. అందుకే చట్టాల పట్ల సామాన్యుడికి విశ్వాసం సన్నగిల్లుతోంది. అవినీతిపై ఆయా రాజకీయ పార్టీలు ఎక్కుబెట్టే బాణాలన్నిటి వెనుకా పైకి కనబడని రాజకీయ లక్ష్యాలు, ఉద్దేశ్యాలు ఏవో దాగున్నాయని ప్రజలు నమ్మే పరిస్తితి దాపురిస్తోంది.

మొన్నటికి మొన్న అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమం పట్ల భారత ప్రజానీకం ముఖ్యంగా యువత స్పందించిన తీరు గమనించిన వారికి దేశ భవిష్యత్తు గురించి కొత్త ఆశలు రెక్కలు తొడిగాయి. కల్మాడీ, కనిమొళి, రాజాల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతున్న విషయాలు గమనించిన తరువాత ఈ ఆశలు మరింత ముప్పిరిగొన్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయ అవినీతి కేసుల విషయంలో న్యాయస్తానాలు స్పందిస్తున్న తీరు సయితం హర్షనీయం.

అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న సామెత చందంగా రాజకీయ అవినీతి గురించి జరిగిన దర్యాప్తులు, అవి నిగ్గు దేల్చిన నిజాలు కాలగర్భంలో కలసిపోతున్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాల కాలంలో అవినీతి, లంచగొండితనం ఆరోపణలు రుజువై శిక్ష పడ్డ రాజకీయ ప్రముఖులు కలికానికి కూడా కానరారు. నేరానికి తగిన శిక్ష తధ్యం అన్న భయం వున్నప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేర ప్రవృత్తి సయితం తగ్గుముఖం పడుతుంది.

మనకంటే చిన్న దేశాల్లో కూడా లంచగొండి రాజకీయనాయకులు చట్టం నుంచి తప్పించుకోలేక జైల్లో మగ్గుతున్న సందర్భాలు వున్నాయి. ఉదాహరణకు 1997-2002 నడుమ నికరాగువా అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్నాల్డోపై తీవ్రమయిన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని గురించి విచారించిన ఆ దేశపు సుప్రీం కోర్టు ఆర్నాల్దో కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే, గతంలో యుగోస్లావియా అధ్యక్షుడిగా పనిచేసి కోట్లాది డాలర్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కున్న మిలోసెవిక్ ప్రస్తుతం జైలు వూచలు లెక్కబెడుతున్నాడు. 1990 – 2000 మధ్య పెరు ప్రెసిడెంటుగా వున్న ఫ్యుజిమోరి తన పదవీకాలంలో దేశంలో టెర్రరిజాన్ని పూర్తిగా మట్టుబెట్టగలిగాడు. కానీ, సంపూర్ణ అధికారం అతడిని ఒక టెర్రరిస్టుకన్నా ప్రమాదకారిగా మార్చింది. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టాడు. దానితో విసిగిపోయిన ప్రజలు తిరగబడి అతడిని గద్దె దించారు. ఫ్యుజిమోరి దేశం విడిచిపెట్టి పారిపోయినా అతడిని పట్టుకుని పెరు తీసుకువచ్చి జైల్లో పెట్టారు.

చట్టం అందరిపట్లా ఒకే రకంగా వ్యవహరించినప్పుడే ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనే వాక్యానికి అర్ధం వుంటుంది. లేని పక్షంలో అది ఒక పనికిరాని వూతపదంగా మిగిలిపోతుంది. (28-07-2011)

29, జులై 2011, శుక్రవారం

సులభంగా చావాలంటే? – భండారు శ్రీనివాసరావు

సులభంగా చావాలంటే? – భండారు శ్రీనివాసరావు


జీవితమే మధురమూ అని పాడుకోవడం సులభమే. కాని జీవించడం అంత వీజీ ఏమీ కాదు. అందుకని దాన్ని అర్ధం చేసుకోవాలనే అర్ధం పర్ధం లేని ఆలోచనలను వొదిలేసుకుని ఎంచక్కా జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టండి.

దానికి కొన్ని చిట్కాలున్నాయి. హాయిగా నవ్వుకోవడం. వీలయితే నవ్వించడం.

“హాయిగా జీవించడం సరే ! సులభంగా జీవితాన్ని అంతం చేసుకునే నిఖార్సయిన పద్ధతులు ఏమయినా వున్నాయా గురువుగారూ!” అని అడిగాడొక శిష్యులుంగారు.

“మూడున్నాయి రాసుకో’ అని మొదలు పెట్టాడు మూడొచ్చిన గురువు.

“మొట్టమొదటి పధ్ధతి. రోజూ పది పెట్టెలు సిగరెట్లు వూదేసేయ్. పదేళ్లు ముందుగానే గుటుక్కుమంటావ్.

“రెండోది – రోజూ క్రమం తప్పకుండా మందు కొట్టు. ముప్పయ్యేళ్ళు ముందుగానే టపా కట్టేస్తావ్.

“ఇక ఆఖరు చిట్కా ఏమిటంటే – కనుముక్కుతీరు చక్కగా వున్న అమ్మాయిని చూసి నిజాయితీగా ప్రేమించడం మొదలు పెట్టు. ముందుగా ఏం ఖర్మ. ప్రతిరోజూ చచ్చి బతుకుతుంటావ్.”

(29-07-2011)

28, జులై 2011, గురువారం

ఆనందమె జీవిత మకరందం - భండారు శ్రీనివాసరావు

ఆనందమె జీవిత మకరందం





అందమే ఆనందం అని ఒకరంటే ఆనందమె జీవిత మకరందం అని మరొకరన్నారు.

ఆనందం అర్ణవమైతే ఇంకా కావాల్సింది ఏముంది అని కూడా ఇంకొకరన్నారు.

ఈ ఆనందాన్ని యెలా కోరుకోవాలి అన్నదానిపై ఈ మధ్య నెట్లో ఓ సూక్తి షికార్లు చేస్తోంది.

‘వినదగునెవ్వరు చెప్పిన’ అన్నారు కాబట్టి వింటే (చదివితే) ఓ పనయిపోతుంది.

ఆ ఇంగ్లీష్ సూక్తికి తెలుగు అనువాదం. అవధరించండి. 

ఓ గంట సేపు ఆనందం కోరుకుంటే ఒక కునుకు తీయండి సరిపోతుంది.

కాదు కూడదు ఒక నెలపాటన్నా ఆనందం సొంతం కావాలనుకున్నారనుకోండి.

ఓ చక్కటి పిల్లను చూసి పెళ్లి చేసుకోండి ఆ కోరిక తీరిపోతుంది.

అలా ఇలా కాదు ‘జీవిత పర్యంతం’ ఆనందాన్ని అనుభవించాలని గట్టిగా అనుకుంటే మాత్రం అవసరంలో వున్న వారికి మీ చేతనయిన సాయం చేయండి. తద్వారా లభించే ఆనందం మాత్రం జీవితాంతం మీ వెంటే వుంటుంది.

కావాలంటే ప్రయత్నించి చూడండి!

(28-07-2011)

27, జులై 2011, బుధవారం

24, జులై 2011, ఆదివారం

చదవడానికెందుకురా తొందరా! – భండారు శ్రీనివాసరావు

చదవడానికెందుకురా తొందరా! – భండారు శ్రీనివాసరావు

చదువుకునే రోజుల్లో ప్రతిఒక్కరికీ ఫస్ట్ క్లాస్ మీద ఆసక్తి ఫస్ట్ క్లాస్ గా వుంటుంది. బళ్ళో లాస్ట్ బెంచీలో కూర్చునే వాళ్లకు కూడా క్లాసులో ఫస్ట్ రావాలనే తాపత్రయం మాత్రం అపరిమితం. అయితే ఈ ఫస్ట్ క్లాస్ థియరీపై పరిశోధన చేసి ఒకాయన కనుక్కున్న సంగతులు మాత్రం వేరుగా వున్నాయి.

చదువులో ఫస్ట్ క్లాస్ సంపాదించే వాళ్ళలో చాలామంది టెక్నికల్ కోర్సుల్లో చేరి డాక్టర్లో ఇంజనీర్లో అవుతుంటారు.

ఇక సెకండ్ క్లాస్ స్టూడెంట్లు ఎంబీయే లాటి కోర్సులు ఏవో చేసి, ఐ.ఎ.ఎస్. లయిపోయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అయిన డాక్టర్లను, ఇంజినీర్లను ఆజమాయిషీ చేస్తుంటారు.

పోతే, థర్డ్ క్లాస్ స్టూడెంట్లు డింకీలు కొట్టికొట్టి అత్తెసరు మార్కులతో పాసయినామని అనిపించుకుని ఏ ఉద్యోగాలు దొరక్క రాజకీయాల్లో చేరి మంత్రులుగా మారి పైవాళ్ళందర్నీ తమ చెప్పుచేతల్లో వుంచుకుంటారు.

ఇక ఆఖరు రకం అంటే ఏ పరీక్షా పాసుకాకుండా చదువుకు ఆదిలోనే స్వస్తి చెప్పి అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళేమో అండర్ వరల్డ్ డాన్ లుగా అవతారం ఎత్తి పైఅందరిపై పెత్తనం చేస్తుంటారు.

కాబట్టి ఇది చదివినతరవాత ఏమనిపిస్తోంది ? చదవడానికెందుకురా తొందరా! అని పాడుకోవాలనిపిస్తోందా!

ఏదో సరదాకు రాసిందాన్ని సీరియస్ గా తీసుకుని చదువులు చెడగొట్టుకోవద్దు సుమా.
(24-07-2011)

23, జులై 2011, శనివారం

ఇగో అను నర గర్వభంగం కధ – భండారు శ్రీనివాసరావు

ఇగో అను నర గర్వభంగం కధ – భండారు శ్రీనివాసరావు




యమధర్మరాజు మహిష వాహనం ఎక్కి యమపాశం చేతబట్టి భూలోకం బయలుదేరాడు.

కాలం తీరిన మనుషుల ప్రాణాలు పట్టి యమలోకానికి చేర్చడానికి యమభటులు వున్నప్పటికీ యముడు స్వయంగా భూలోక యాత్ర పెట్టుకోవడానికి ఓ కారణం వుంది.

నరలోకంలో ఓ నరుడు శాస్త్ర పరిశోధనలు చేస్తూ చేస్తూ ఒక ప్రయోగంలో గణనీయమైన విజయం సాధించాడు. మనుషులను పోలిన మనుషులను సృష్టించే ఒక ఫార్ములాను కనుగొన్నాడు. అచ్చం తన మాదిరిగా వుండే మరో డజను మంది శాస్త్రవేత్తలను ఆ ఫార్ములా సాయంతో తయారుచేసాడు.

కానీ ఈ లోగా ఆ శాస్త్రవేత్తకు భూమిమీద నూకలు చెల్లే తరుణం ఆసన్నం కావడంతో అతడిని కొనిపోవడానికి నరకం నుంచి యమభటులు వచ్చారు. ఆ వచ్చిన యమ భటులకు ఆ పదముగ్గురిలో అసలు శాస్త్ర వేత్త ఎవరన్నది అర్ధం కాలేదు. కనుముక్కు తీరులో కానీ, మాట వరుసలో కానీ, నడకలో కానీ ఆ పదమూడుమంది అచ్చంగా ఒకే రకంగా వుండడంతో కాసేపు గుంజాటనపడి ఎటు తేల్చుకోలేక వారు నరకానికి తిరిగి వెళ్ళిపోయి తమ ప్రభువుతో విషయం విన్నవించుకున్నారు.

యమధర్మరాజు స్వయంగా పాశం పట్టుకుని భూలోకం రావడానికి ఇదీ నేపధ్యం.

తీరా వచ్చిన తరువాత కానీ తన భటులు పడ్డ అవస్థ ఆయనకు అర్ధం కాలేదు. వాళ్లు చెప్పినట్టు ఆ పదమూడుమందిలో అసలు శాస్త్రవేత్త ఎవరన్నది గుర్తుపట్టడం అతి కష్టం అని ఆయనకు కూడా తొందరగానే అర్ధం అయిపోయింది. కానీ సమవర్తి తన వోటమిని అంత తేలిగ్గా యెలా వొప్పుకుంటాడు చెప్పండి?

అప్పుడాయన ఏం చేశాడన్నదే ఈ చిన్న కధకు క్లైమాక్స్.

తన ఎదుట కనబడుతున్న పదముగ్గురిలో ఒకడే తనకు కావలసిన వాడు. ఆ ఒక్కడినీ కనిపెట్టడం యెలా! అందుకని వారందరినీ వుద్దేశించి ఇలా అన్నాడు.

“అయ్యా శాస్త్రవేత్త గారు. మీ మేధస్సు అమోఘం. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన మీ తెలివితేటలకు నా జోహారు. ఇటువంటి మేధావిని నా ఇన్ని కోట్ల సంవత్సరాల సర్వీసులో ఎన్నడూ చూసి ఎరుగను. మీ పదముగ్గురిలో అసలు ఎవరు? మిగిలిన ఆ పన్నెండుమంది నకిలీలు ఎవరన్నది తెలుసుకోగలగడం ఆ విధాతకు కూడా సాధ్యం కాదనిపిస్తోంది. కాకపొతే పరీక్షించి చూడగా చూడగా నా కళ్ళకు ఏదో ఒక చిన్నలోపం కానవస్తోంది. ఇంత అద్భుత సృష్టి చేసిన మహానుభావులు మీరు అంత చిన్న లోపాన్ని కనిపెట్టి ఎందుకు సరిచేయలేకపోయారన్నది నా కర్ధం కావడం లేదు..........”

........యమధర్మరాజు మాటలు ఇంకా పూర్తికానేలేదు.

ఇంతలో ఆ పదముగ్గురులోనుంచి ఒకడు తటాలున ముందుకు వచ్చి “నా పనిలోనే తప్పు పట్టేంత మొనగాడివా నువ్వు. తప్పు చేశానని వూరికే అంటే సరిపోదు. ఎక్కడ ఆ తప్పు చేసానో కూడా చెప్పు” అన్నాడు.

యముడు క్షణం ఆలశ్యం చేయకుండా ఆ మాటలు పలుకుతున్న వ్యక్తిపై పాశం విసురుతూ చెప్పాడు. “ఇదే నువ్వు చేసిన తప్పు. దీన్ని మీభాషలో ఇగో (EGO) అనో గర్వం అనో అంటారు. దాన్ని చంపుకుని వుంటే ఇప్పుడు నీకీ చావు తప్పేది.”

(23-07-2011)





19, జులై 2011, మంగళవారం

మొదటి పెళ్ళాం – రెండో కాపురం – భండారు శ్రీనివాసరావు

మొదటి పెళ్ళాం – రెండో కాపురం – భండారు శ్రీనివాసరావు


కలియుగం నాలుగోపాదంలో ఒకానొక ధూర్తుడు, రౌరవాది మహా రాక్షస గణాలకు ఓ దేవ రహస్యం తెలియచేసాడట.


“వేరే ఆడదానితో అక్రమ సంబంధం వున్నట్టు భార్యకు తెలియనంత కాలం భర్తకు స్వర్గమే . తెలిసిన మరుక్షణం నుంచీ ప్రత్యక్ష నరకమే!” అన్నది దాని సారాంశం.

నేను జానకితో చనువుగా మసలుతున్న సంగతి తెలిసిన నా మిత్రుడు శంకరం- దేవరహస్యం పేరుతొ నాకీ హితబోధ చేసాడు. అయితే, జానకితో నేను సాగిస్తున్న వ్యవహారం గురించి మా ఆవిడకు తెలుసునని నాకు చాలాకాలం వరకూ తెలవదు. అయినా గుంభనగా వుండిపోయిందంటే శంకరం చెప్పిన సూత్రం అందరు భార్యలకు వర్తించదని అనుకోవాలి.

రోజులు గడుస్తున్నకొద్దీ జానకి నుంచి రోజురోజుకూ నామీద వొత్తిడి పెరిగిపోతోంది. ఇక ఆ పోరుపడలేక లాయరుతో మాట్లాడడం, ముగ్గురు పిల్లల తల్లి అని చూడకుండా మా ఆవిడకి విడాకుల నోటీసు ఇప్పించడం కూడా జరిగిపోయింది.

నోటీసు పంపిన రోజు నేను కావాలనే బారులో పీకలదాకా తాగి ఇంటికి బయలుదేరాను. జానకి పరిచయం అయిన తరవాత ఆలస్యంగా ఇంటికి చేరడం అన్నది అప్పటికే నాకు అలవాటుగా మారింది. ఆఫీసు నుంచి నేరుగా జానకి పనిచేసే చోటుకు వెళ్లడం, ఆమెను స్కూటర్ పై ఎక్కించుకుని వాళ్లింటికి వెళ్లి అక్కడ కొంతసేపు కాలక్షేపం చేసి ఇంటికి చేరడం నాకు దినచర్యలో భాగమయిపోయింది. అదేమిటో, పెళ్ళాం పిల్లలున్న నేను ఇలా చేయడం తప్పని నాకు కానీ, జానకికి కానీ ఒక్కనాడూ అనిపించకపోవడం విచిత్రం.

మా ఆవిడ సీతతో నేను మాట్లాడాల్సిన తీరు గురించి జానకి నాకు ముందుగానే బాగా తర్పీదు ఇచ్చింది. ఇలాటి సందర్భాలలో ఇల్లాలు పెట్టుకునే కళ్ళనీళ్ళకు కరిగిపోకూడదని హితబోధ చేసింది. ముందు ముందు భార్యగా తననుంచి అందబోయే సుఖాలను మనసులో వుంచుకుని సీతతో కఠినంగా ప్రవర్తించమనీ దాదాపు ఆర్డర్ మాదిరిగానే చెప్పింది.

ఇంటికి వెళ్లేసరికి పరిస్తితి నేను అనుకున్నట్టుగా లేకపోవడం చూసి ఆశ్చర్య పోయాను. పిల్లలు నిద్రపోతున్నట్టున్నారు. ఎప్పటిమాదిరిగానే మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ కనిపించింది. భోజనం తిననని తెలిసి కూడా వడ్డించమంటారా అని అడిగింది . వద్దని సైగ చేసి నేను బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాను.

నేను పంపిన విడాకుల నోటీసు సీత అందుకున్న సంగతి ధ్రువపరచుకున్న తరువాతనే ఇంటికి వచ్చాను. అయినా ఇల్లు ప్రశాంతంగా వుంది. ఏడుస్తూ నానా యాగీ చేస్తుందనుకున్న ఇల్లాలు మామూలుగా వుండడం చూసి ఆశ్చర్యపోవడం నావంతయింది.

మా ఆవిడ భోజనం పెట్టింది. తిని చేతులు కడుగుకున్నతరవాత ఆమె చేయిపట్టుకున్నాను. నా కళ్ళల్లోకి ఓసారి చూసి నెమ్మదిగా చేయి విడిపించుకుంది. ఆమె వంక చూడడానికి గిల్టీ గా అనిపించి తల దించుకున్నాను. ఏదో చెప్పాలని వుంది. ఎంతో చెప్పాలని వుంది. కానీ నోరు పెగలడం లేదు.మాట రావడం లేదు. ఆమె మెల్లగా లేచింది. మౌనంగా ప్లేటులో వడ్డించుకుంది. మాటా పలుకూ లేకుండా భోజనం అయిందనిపించింది. ఆమె కళ్ళల్లో నీరు వూరుతూ వుండడం నాకు కనిపిస్తూనే వుంది.

ఆమెనుంచి నాకు విడాకులు కావాలి. సీతను ఎలాగయినా వొప్పించి తీరాలి. కానీ మనసులోని ఈ మాటను చెప్పడం ఎలా? పక్కకు తిరిగి గొంతు సవరించుకున్నాను. మనసులోని భావాలను మాటల్లోకి మార్చి గోడతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఆమెకు ఎరుక పరిచాను. చిత్రం ఏమిటంటే నా మాటలు వింటున్నప్పుడు, విన్నతరవాత కూడా ఆమె ఎలాటి బాధను వ్యక్తం చేయలేదు. పైగా, విడాకులా?ఎందుకు? అని ముక్తసరిగా అడగడం నన్ను మరింత ఆశ్చర్యపరచింది. ఈ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలి? అందుకే విననట్టు నటించాను. దానితో అంతవరకూ బిగపట్టుకునివున్న ఆమె కోపం కట్టలు తెంచుకుంది.

‘నువ్వొక మగాడివేనా?’ – అంటూ ఒక్కసారిగా ఆమె అరవడంతో నిద్రపోతున్న పిల్లలు లేచారు. మా ఇద్దరి మధ్యా ఏదో జరిగిందని గ్రహించి ముగ్గురూ ఏడవడం మొదలుపెట్టారు. ఆ రోదనలతో ఇల్లు మార్మోగింది.

ఆ రాత్రి మా మధ్య మాటలు సాగలేదు. రాత్రల్లా ఆమె రోదిస్తూనే వుంది. మా వివాహ బంధం ఇలా ఎందుకు తెగిపోయిందో తెలుసుకోవాలన్నది ఆమె తపనగా నాకు అర్ధం అయింది. కానీ, ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర వుంటేగా. తన మీద వున్న నా ప్రేమ ఇప్పడు జానకి వైపు మళ్లి౦దని ఎలాచెప్పను ?

విడాకుల ఒప్పంద పత్రంలో ఇల్లూ, కారూ, కంపెనీ ఇచ్చిన షేర్లలో మూడో వంతు ఆమె పేరిట, పిల్లల పేరిట రాసాను. ఇది కాక నెల నెలా కొంత మొత్తం చేతికందేలా ఏర్పాటు చేసాను. ఈ విషయంలో మిగిలిన మొగాళ్ళ కంటే నేనే నయమని నేననుకుంటున్నాను.

తెల తెల వారుతుండగా నేను ఆమె ముందు విడాకుల అంగీకార పత్రాన్ని వుంచాను. అది చూడగానే ఆమె కళ్ళు విస్పులింగాల్లా మారాయి. ఒప్పంద పత్రాన్ని ముక్కలు ముక్కలు గా చించి విసిరివేసేంతగా ఆమె కోపం తారాస్తాయికి చేరుకుంది.
పదేళ్లకు పైగా నాతో జీవితాన్ని పంచుకున్న సీత ఈ రోజు పరాయి వ్యక్తిలా మారిపోయింది.

ఇంతకాలం నా సమయాన్ని, ధనాన్ని, శక్తి యుక్తుల్ని ఈమె కోసమా వెచ్చించింది అని బాధపడ్డానే కాని ఆమె పడుతున్న క్షోభను పట్టించుకునే పరిస్తితిలో నేను లేను. ఎంత త్వరగా సీతను విడాకులకు ఒప్పించి ఆ చల్లని కబురు జానకికి చేరవేద్దామా అని అనుకుంటున్నానే కాని సీత మనస్సులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలు ఏమిటన్న విషయాన్ని నేను ఏమాత్రం పట్టించుకునే పరిస్తితిలో లేను.

పైగా ఆమె రోదన నాకు స్వాంతన కలిగిస్తోంది. విడాకులకు ఒప్పుకుంటుందన్న ఆశను రగిలిస్తోంది. దానితో, సీతతో తెగతెంపులు చేసుకోవాలనే నా కోరిక మరింత బలపడసాగింది. ఎంత త్వరగా ఈమెని వొదుల్చుకుని జానకి చెంతకు చేరగలనా అన్నఆత్రుత నాలో పెరిగిపోసాగింది.

మర్నాడు కూడా ఇంటికి పొద్దు పోయే వచ్చాను. నిజానికి అది నా ఇల్లన్న అభిప్రాయం నానుంచి ఎప్పుడో తొలగిపోయింది.

సీత భోజనాల బల్ల వద్ద కూర్చుని ఏదో రాస్తోంది. నా రాక గమనించి ప్లేట్లు సదరబోయింది. కానీ, అన్నం తినడానికి మనస్కరించక నేరుగా నా గదిలోకి వెళ్ళిపోయాను. అప్పటికే పగలంతా జానకి సమక్షంలో గడిపివచ్చాను. అలసటతో వొల్లెరుగని నిద్ర పట్టింది.

తెల్లవారు ఝామున మెలకువ వచ్చి చూస్తే ఇంకా ఆమె డైనింగ్ టేబుల్ దగ్గరే రాస్తూ కనిపించింది. ఆమెను పట్టించుకోనట్టుగా పక్కకు తిరిగి నిద్రపోయాను.

ఉదయం నేను లేచేసరికల్లా సీత తయారయివుంది.

“విడాకులు ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు.” ఆమె నోట్లో నుంచి వచ్చిన ఈ మాటలతో నోట్లో పంచదార పోసినట్టు ఫీలయ్యాను. నెత్తిమీది బరువు సగం దిగిపోయింది.

“ మీ ఇల్లూ, కారూ, ఆ డబ్బూ కూడా నాకక్కరలేదు.” సీత కంఠం నిశ్శబ్దంగా వున్న ఆ గదిలో మారు మోగింది.

“అయితే ఒక కండిషన్. దానికి ఒప్పుకుంటే విడాకుల అంగీకారపత్రం పై సంతకం చేయడానికి నేను సిద్ధం.”

ఆ షరతు ఏమిటో వినడానికి నా చెవులు వెంటనే నిక్కబొడుచుకున్నాయని వేరే చెప్పనక్కరలేదనుకుంటాను.

“నాకొక నెల వ్యవధానం కావాలి. ఆ నెల రోజులు ఇష్టం వున్నా లేకపోయినా మీరు నాతో, పిల్లలతో మామూలుగా మునపటి మాదిరిగా గడపాలి.”

ఇందుకు ఆమె చూపించిన కారణాలు కూడా ఆక్షేపించదగినవిగా లేవు. పెద్ద పిల్లాడి పరీక్షలు నెలరోజుల్లో అయిపోతాయి. ఈ విడాకుల వ్యవహారం అతడి చదువును చెడగొట్టడం ఆమెకు ఇష్టం లేదు.

నెల అంటే ఎంత ముప్పయి రోజులు.

ఇట్టే గడిచిపోతాయి. దీన్ని కాదనుకుని విడాకులకోసం ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం కంటే నెల రోజుల ‘బలవంతపు కాపురమే’ నయమన్న నిర్ధారణకు వెంటనే వచ్చాను. ఈ షరతుకు జానకి కూడా సులభంగా వొప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది.

‘మరో సంగతి” సీత స్వరం లో చిన్న మార్పు.

“ఇది షరతు కాదు. ఇన్నేళ్ళు మీతో కాపురం చేసిన భార్యగా ఓ కోరిక కోరుతున్నాను. మన్నిస్తే అదృష్టవంతురాలినని అనుకుంటాను.”

ఆ స్వరంలోని మృదుత్వం నన్ను కరిగించింది. వరాలిచ్చే దేవుడి ఫోజులో సరే! అన్నాను.

ఆమె కోరిన ఆ కోరిక విన్న తరువాత – విడాకుల షాక్ లో ఇలా వింతగా ప్రవర్తిస్తున్నదేమో అన్న అనుమానం కలిగింది. కానీ, జానకితో నా రెండో పెళ్లి త్వరగా జరగాలంటే ఇలాటి ఒకటి రెండు కోర్కెలు ఒప్పుకోక తప్పదు.

నేను మర్నాడు వెళ్లి సీత పెట్టిన షరతులు గురించీ, ఆమె  అడిగిన కోరిక గురించి జానకితో చెప్పాను. ఆమె ఒక్క పెట్టున నవ్వి సీతను ఓ పిచ్చిదానికింద జమకట్టి సరిపుచ్చుకుంది. అన్నీ సవ్యంగా జరుగుతూ వుండడంతో ఎంతో రిలీఫ్ గా ఫీలయ్యాను.

సీతకు విడాకులు ఇవ్వాలనే నిర్ణయానికి వొచ్చినప్పటినుంచి ఆమెతో ఎడమొగం పెడమొగమే. పడక గదులే వేరయిపోయాయి. ముద్దుముచ్చట్ల సంగతి దేవుడెరుగు ఆమెతో మాట్లాడడానికే నాకు మనస్కరించేది కాదు. ఇప్పుడు మళ్ళీ సీతకు ఇచ్చిన మాట ప్రకారం ‘తొలి రాత్రి’ సన్నివేశాన్ని రిపీట్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. తనకూ కొంత ఇబ్బందికరం గానే వున్నట్టు అనిపించింది. కాకపొతే, ఇంట్లో సన్నిహితంగా మసలుతున్న మమ్మల్ని చూస్తూ మా పిల్లలు మాత్రం ఎంతో సంతోషపడ్డారు. చాలా రోజుల తరువాత మళ్ళీ మేము మా పడక గదిలోకి వెళ్లడం చూసి మా పెద్ద పిల్లవాడు వెనుకనుంచి చప్పట్లు కొట్టాడు. మనసు మూలల్లో ఏదో కదిలిన ఫీలింగ్. మంచం మీదకు చేరగానే సీత కళ్ళు మూసుకుని నెమ్మదిగా అంది. “దయచేసి మన విడాకులు గురించి పిల్లలతో అనకండి.”

పైకి తల వూపాను కాని మళ్ళీ ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. పదేళ్లనాటి చీరెను భద్రంగా  దాచి ఆ రాత్రి కట్టుకోవడం చూసి తల దించుకున్నాను.

మర్నాడు నా స్కూటర్ మీదనే సీతను తన ఆఫీసులో దింపాను. దారిపొడుగునా భుజం మీద తల వాల్చి మాట్లాడుతూనే వుంది. నా నడుం చుట్టూ బిగించి పట్టుకున్న చేతిని దిగేదాకా వొదలలేదు. నేను నా ఆఫీసుకు వెళ్ళిపోయాను.

సీతకిచ్చిన మాట ప్రకారం వెనుకటి రోజుల్లోలాగా సాయంత్రం తన ఆఫీసుకుకు వెళ్లి ఆమెను తీసుకుని ఇంటికి వచ్చాను. మా ఇద్దర్నీ మునుపటిలా చూడడం కోసమే అన్నట్టు పిల్లలందరూ గుమ్మం ముందరే కనబడ్డారు.

రెండో రోజు మా ఇద్దరి నడుమా మరికొంత సాన్నిహిత్యం పెరిగినట్టనిపించింది. స్కూటర్ మీద వెడుతున్నప్పుడు తను నాకు మరింత హత్తుకుని కూర్చుంది. ఆమె నుంచి వెలువడుతున్న పల్చటి పరిమళం నా మెడను దాటుకుని నెమ్మదిగా వ్యాపిస్తోంది. సీతను అంత దగ్గరగా చూసిన జ్ఞాపకం ఈ మధ్య లేదు. పెళ్ళయిన కొత్త రోజులు మనసులో మెదిలాయి. స్కూటర్ దిగి ఆఫీసులోకి వెడుతున్నప్పుడు కాకతాళీయంగా ఆమె వైపు చూసాను. గంభీరతతో కూడిన మందహాసం మేళవించి నాకు చెయ్యి వూపి వీడుకోలు పలికింది. ఎన్నో ఏళ్ళ తరువాత మళ్ళీ అనుభవంలోకి వచ్చిన  సన్నివేశం.

నాలుగో రోజున నేనే చేయి అందించి ఆమెను స్కూటర్ పై కూర్చోపెట్టుకున్నాను. నాకు భార్యగా వుంటూ, నా పిల్లలకు తల్లిగా వుంటూ మరోపక్క ఉద్యోగం చేస్తూ ఇంటి పనీ, బయట పనీ సంభాలించుకుంటూ ఇన్నేళ్ళు చాకిరీ చేసిన మనిషి ఈమేకదా అనిపించింది. ఎప్పుడన్నా, ఏనాడన్నా తన గురించి పట్టించుకున్నానా అని ఒక్క క్షణం చివుక్కుమనిపించింది.

రోజులు మారుతున్న కొద్దీ సీతను గురించి నా అభిప్రాయాలు కొద్ది కొద్దిగా మారుతుండడం గమనించాను. అదేమిటో కానీ ఇవేవీ జానకికి చెప్పాలనిపించలేదు.

క్రమంగా ఇంట్లో నేను గడిపే సమయం పెరుగుతూ వస్తున్న సంగతి నేను గమనించనే లేదు. పిల్లలతో ముచ్చట్లు, పెద్ద పిల్లవాడి పరీక్షలు గురించి ఆరా తీయడం వీటన్నిటితో మళ్ళీ ఇంటి పెద్ద పాత్రలో వొదిగిపోయాను. ఓ రోజు ఏకాంతం దొరికినప్పుడు పెళ్ళికిముందు నేను రాసిన ప్రేమలేఖలు చూపించింది. నా ఉత్తరాలను పదేళ్లుగా తాను పదిలంగా దాచుకున్న తీరు నన్ను నివ్వెరపరచింది. తను రాసినవి నేను ఏం చేసానని అడగలేదు. అడిగివుంటే ఏం జవాబు చెప్పాలా అని కొద్ది సేపు మధన పడ్డ మాట వాస్తవం.

వారం రోజులు గడిచాయో లేదో పిల్లవాడి పరీక్షల పేరుతొ నేను పదిరోజులు సెలవుపెట్టాను. ఈ సంగతి తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కాని తను కూడా లాంగ్ లీవ్ పెట్టింది. అందరం కలసి ఇంట్లో చాలాసేపు గడపడం చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ మొదలయింది.

ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది.

శ్మశాన నిశ్శబ్దానికి అలవాటుపడ్డ ఇంటిని మాటలు, ముచ్చట్లు, నవ్వులు మళ్ళీ మనుషులు తిరిగే ‘నివాసం’ గా మార్చాయి. తెలియకుండానే చోటుచేసుకుంటున్న మార్పులన్నీ నన్ను కొత్త మనిషిగా మార్చడం తెలియకుండానే జరిగిపోతోంది.

పాత సంగతులు గుర్తుకొస్తున్నాయి. కొత్త విషయాలు మరపున పడుతున్నాయి.

జీవితం పాత బాటలో కొత్త పరుగు తీస్తోంది. సీతతో కాపురం సరికొత్త మధురిమను అందిస్తోంది.

ఒక్క నెల రోజుల్లో ఇది సాధ్యమా అంటే సాధ్యమే అనిపిస్తోంది.

సీత పెట్టిన గడువు పూర్తవుతున్న విషయం నాకు గుర్తుకు రాలేదు. చిత్రం ఏమిటంటే, గత కొద్ది రోజులుగా ఒక్క రోజు కూడా జానకి గుర్తుకు రాలేదు.

ఓ రోజు సీత తను సంతకం చేసిన విడాకుల అంగీకార పత్రాన్ని నాకు అందించింది. అప్పుడు కానీ నెల రోజుల గడువు పూర్తయిన విషయం నాకు తట్టలేదు.

కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ ఆమె అందించిన కాగితాలను తీసుకున్నాను. అవే చేతులతో ఆమెను పొదివి పట్టుకున్నాను. నా గుండెలపై తల ఆన్చి మౌనంగా రోదిస్తున్న సీతకు తన వీపును చుట్టుకున్న నాచేతులు ఏం చేస్తున్నాయో తెలిసే వీలు లేదు.

ఇక జీవితంలో సీతను విడిచి పెట్టేది లేదు అన్న నా దృఢ నిశ్చయానికి అనుగుణంగా నా చేతులు అంతే బలంగా మా విడాకుల పత్రాన్ని నలిపి నాశనం చేస్తున్నాయి.

(కలిసివున్నప్పుడు విడి విడిగా మసిలే భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. సన్నిహితంగా మెలగడం ద్వారా విడిపోవాలనే కోరిక దూరం చేసుకోవచ్చన్నదే ఈ కధలో నీతి. విడిపోవాలనుకున్న దంపతులు ఈ కధలో లాగా తిరిగి ఒకటవడం సులభం కాకపోవచ్చు. కానీ అసాధ్యం మాత్రం కాదు.)

(19-07-2011)

వెర్రి మొహాన్ని చూడాలని వుందా ? – భండారు శ్రీనివాసరావు

వెర్రి మొహాన్ని చూడాలని వుందా ? – భండారు శ్రీనివాసరావు


చూడాలని వుంటే ఈ నాలుగు ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి.

యక్ష ప్రశ్నలు కాదు కాబట్టి ప్రయత్నించి చూస్తేపోయేదేమీ వుండదు.

సమాధానం మాత్రం వెంటనే చెప్పాలి సుమా. ఆలోచిస్తూ పోతే కుదరదు.

ఇదిగో! ఇదే మొదటి ప్రశ్న.

మీరో పరుగు పందెంలో పాల్గొంటున్నారు..

రెండో స్తానంలో వున్న ప్రత్యర్ధిని మీరు దాటిపోయారు.

అప్పుడు పందెంలో మీరే స్తానంలో వున్నట్టు?

అవును! అదే అనుకున్నాను.

మొదటి స్తానం చేరుకున్నట్టు జవాబు చెబుతారని.

అయితే ఆ జవాబు పూర్తిగా తప్పు.

పందెంలో రెండో స్తానంలో వున్న వ్యక్తిని దాటిపోయారంటే అతడి స్తానంలో మీరు చేరినట్టు. అంటే ఈ ప్రశ్నకు సరయిన సమాధానం రెండో స్తానం అన్నమాట.

ఇప్పుడిక రెండో ప్రశ్న

ఈ పరుగు పందెంలో మీరు చిట్టచివరవున్న ప్రత్యర్ధిని దాటారనుకుందాం.

అప్పుడు మీరు ఏ స్తానంలో వున్నట్టు.

దీనికి మీ సమాధానం పందెంలో చివరివాడికంటే ముందున్నట్టు. అవునా!

అయితే మాత్రం మళ్ళీ పప్పులో కాలేసినట్టే.

ఎందుకని మీరు అడగక్కరలేదు. నేను చెప్పక్కరలేదు.

వరుసలో ‘చిట్ట చివరివాడి’ని దాటిపోవడం అన్నది ఎవరికయినా అసాధ్యం కనుక.

పోతే ముచ్చటగా మూడో ప్రశ్న.

కాకపొతే, చాలా చిక్కు ప్రశ్న – నోటితోనే టక్కున జవాబు చెప్పాలి. పెన్నూ కాగితం తీసుకుని లెక్కలు వేసుకుంటూ కూచుంటామంటే కుదరదు.

ముందు వెయ్యి అంకె తీసుకోండి. దానికి నలభయ్ కలపండి. మళ్ళీ మరో వెయ్యి కలపండి.తరవాత ముప్పై, ఇంకో వెయ్యి, ఆ తర్వాత ఇరవై, మరో వెయ్యి, ఇంకో పదీ ఇలా కలుపుతూ పోండి. ఇప్పుడు చెప్పండి. అన్నీ కూడితే ఎంత వచ్చింది?

అయిదువేలా ! కాదు.

ఈ ప్రశ్నకు సరయిన సమాధానం 4100 సుమా! నమ్మకపోతే కాలిక్యులేటర్ తీసుకుని లెక్కవేయండి.


అయ్యో! ఒక్క ప్రశ్నకు జవాబు తట్ట లేదని బాధపడకండి.

ఇంకో ప్రశ్న అలాగే మిగిలుందిగా!

అదే ఇది.

సీగాన పెసూనాంబ (శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు ముళ్ళపూడి బుడుగు పెట్టిన ముద్దుపేరు) తండ్రికి అయిదుగురు ఆడపిల్లలు.

అందులో ఒకరి పేరు సుబ్బలక్ష్మి

మరో అమ్మాయి వెంకట లక్ష్మి

ఇంకో అమ్మాయి మహాలక్ష్మి

నాలుగో అమ్మాయి పేరు విజయలక్ష్మి

ఐదో అమ్మాయి పేరేమిటి? ఆదిలక్ష్మి అనుకుంటున్నారా?

కాదు. మన సీగాన పెసూనాంబ.

నాలుగూ అయిపోయాయి. ఏ ఒక్కదానికీ మీ దగ్గర ఆన్సర్ లేదు.

బాధ పడకండి.

ఈ ప్రశ్నలు నన్నడిగినా నేను వేసేది కూడా ఆ వెర్రి మొహమే!



(19-07-2011)

18, జులై 2011, సోమవారం

బుడుగు (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో)

బుడుగు (ముళ్ళపూడి వారికి క్షమాపణలతో)  
-భండారు శ్రీనివాసరావు




(ఇంగ్లీషులో TINTUMON అని మరో బుడుగ్గాయ్ వున్నాట్ట. వాడి గురించిన ఇంగ్లీష్ జోకులు ఈ మధ్య ఎవరో పంపితే వాటిని   అచ్చ తెలుగులో అనువదిస్తే యెలా వుంటుందన్న ఆలోచనకు అక్షర రూపమే ఇది.- అచ్చంగా ఇది నా సొంతం కాదని బ్లాగు గుద్ది మరీ మనవి చేసుకుంటున్నాను.- భండారు శ్రీనివాసరావు)




“ఒరేయ్ బుడుగు కన్నా. నేను నీ నాన్ననుకదా. నువ్వు అల్లరి చేస్తే నాకు కోపం రావాలి కదా. వచ్చి బెత్తంతో గాట్టిగా కొట్టాననుకో. నీకూ ఉక్రోషం రావాలి కదా. అప్పుడు ఏం చేస్తావురా?”


“నువ్వు నాన్నగాడివికదా. కొట్టేస్తావ్. నేను చిన్న పెద్దోడిని కదా.నిన్నేమీ అనలేను కదా. అందుకని లెట్రిన్ లోకి వెళ్లి కమోడ్ శుభ్రం చేస్తాను.”


“అదేమిటి? కమోడ్ కడిగితే నీ కోపం తగ్గుతుందా.యెలా?”


“యెలా ఏమిటి యెలా. అదే మీ పెద్దోళ్ళకు మా చిన్నోళ్ళకు తేడా. నేను లెట్రిన్ కడిగేది నీ టూత్ బ్రష్ తో.”



బుడుగుని తీసుకుని వాళ్ల నాన్న ఆరోజు జూ పార్క్ కు వెళ్లాడు. బోనులో వున్న పులిని చూపించి అది ఎంత భయంకరమయిన జంతువో కొడుక్కుచెప్పసాగాడు.ఓ కంటితో పులిని చూస్తూ ఓ చెవితో తండ్రి చెబుతున్నది వింటున్న బుడుగు వున్నట్టుండి ఇలా అడిగాడు. “పులి అమాంతం బయటకు వచ్చి నిన్ను తినేసింధనుకో. అప్పుడు ఇంటికి వెళ్ళడానికి నేను యే బస్సు ఎక్కాలి?”



బుడుగు స్కూలుకు వచ్చిన ట్రాఫిక్ పోలీసులు పిల్లలకు ట్రాఫిక్ పాఠాలు నేర్పిస్తున్నారు. బుడుగును పిలిచి ఏదయినా స్లోగన్ రాయమన్నారు. బుడుగు రాసిన స్లోగన్ ఇలా వుంది.


“ఇది స్కూలు జోన్. చిన్నపిల్లలు రోడ్డు దాటుతుంటారు. వాహనాలు వేగంగా నడిపి మమ్మల్ని చంపకండి. టీచర్లు వచ్చేదాకా ఆగండి”



బుడుగు స్కూల్లో అసెంబ్లీ జరుగుతోంది. పిల్లలు ఎవరిమట్టుకు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ప్రిన్సిపాల్ చెప్పేది ఎవరికీ వినబడడం లేదు. ఆయనకు చర్రున కోపం వచ్చింది.


“ఏమిటిది ? ఇది స్కూలనుకున్నారా!మీ ఇల్లనుకున్నారా! వెధవలందరూ ఒకచోట చేరినట్టుంది. ఒకరి తరవాత ఒకరు మాట్లాడలేరా? ఆయ్!” అంటూ గయ్యిమన్నాడు.


బుడుగు లేచి అన్నాడు.


“సరే!ముందు మీరు మొదలు పెట్టండి”



బుడుగుతో టీచరు చెప్పింది.


“నువ్వొక బిల్ గేట్స్ అంత ధనవంతుడివి అనుకో. అనుకుని నీ జీవిత చరిత్ర రాయి”


బుడుగు ఉలుకూ పలుకూ లేకుండా కూచోవడం చూసి ఎందుకు రాయడం లేదని అడిగింది.


“నా సెక్రెటరీ కోసం చూస్తున్నాను” బుడుగు జవాబు చెప్పాడు.



మెడిసిన్ చదువుతున్న సీగాన పెసూనాంబ అనే రెండు జెళ్ళ సీతను వాళ్ళింటి కొచ్చిన ప్రొఫెసర్ అడిగాడు.


“ఎటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటే ఏమిటి” అని.


పక్కనున్న బుడుగు వెంటనే జవాబు చెప్పాడు.


“జంబలకడి పంబ”


ప్రొఫెసర్ అర్ధం కాలేదన్నాడు.


“మీరడిగింది నాకూ అంతే”-బుడుగు జవాబు.

(18-07-2011)

16, జులై 2011, శనివారం

నాన్న చెప్పిన మాట – భండారు శ్రీనివాసరావు

నాన్న చెప్పిన మాట – భండారు శ్రీనివాసరావు

ఇన్నేళ్ళ తరువాత కూడా నా చిన్ననాటి ఈ సంఘటన నాకు బాగా గుర్తుంది.

ఆ రోజుల్లో ఇంటెడు చాకిరీతో అమ్మ ఎంతో కష్టపడుతుండేది. అయినా, ఎన్ని పని తొందరలు వున్నా నాకిష్టమయిన చిరుతిళ్ళు మాత్రం టంచనుగా చేసిపెడుతుండేది. చిన్నతనం వల్ల కావచ్చు, అమ్మ చేసిన గారాబం వల్ల కావచ్చు అమ్మ ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక పెట్టి సతాయించేవాడిని.

ఓ రాత్రి అమ్మ నాన్నకు భోజనం పెడుతుంటే చూశాను. అన్నం మాడిపోయివుంది. దానికి తోడు చల్లారిన చారు. కానీ నాన్న మారుమాట్లాడకుండా, మారు అడిగి మరీ భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయాను.

మర్నాడు అమ్మ నాన్నతో అంటోంది. “రాత్రి అన్నం మాడిపోయింది. మళ్ళీ చేసిపెట్టే టైం లేకపోయింది. మీరు అలానే తిని నైట్ డ్యూటీకి వెళ్లారు. నాకెంతో బాధ వేసింది.”

అప్పుడు నాన్న చెప్పిన జవాబు నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.

“భలేదానివే. అన్నం మాడిపోయిందని నీవనుకుంటున్నావు. నాకు మాత్రం మాడిపోయిన అన్నం చెక్కలంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ అలా మాడిపోయిన అన్నం చెక్కలపై పేరు నెయ్యి  రాసి పెడితే ఆవురావురుమంటూ తినేవాడిని తెలుసా!”

నాన్న మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఆ రాత్రి అమ్మ వంటింట్లో పనిలో వున్నప్పుడు చూసి అడిగాను.

“ ఒరేయ్ నాన్నా”

నాన్న నన్ను ముద్దుగా ‘నాన్నా’ అని పిలుస్తాడు.

“అమ్మ వుదయం నుంచి రాత్రిదాకా ఎంత కష్టపడుతున్నదో రోజూ చూస్తున్నాం కదా. అప్పటికే బాగా అలసిపోయి వుంది. అంత రాత్రప్పుడు మళ్ళీ ఏం వొండి పెడుతుంది చెప్పు. అయినా ఒక్క రోజు మాడిన అన్నం తింటే ఏమవుతుంది ? కడుపు మాడదు కదా!

“ఒక మాట చెబుతున్నాను గుర్తుపెట్టుకో.

“జీవితంలో అన్నీ మన కిష్టమయినట్టు జరగవు. మనం ఇష్టపడ్డ మనుషులే మనకు తారసపడరు. అన్నీ సవ్యంగా సక్రమంగా జరగాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ సవ్యంగా జరగని వాటికి మనం ఇతరులను తప్పు పట్టటం పెద్ద తప్పు. ఆ తప్పు నువ్వెప్పుడు చేయకు. ఇంకో విషయం. నాకు వొంట చేయడం రాదుకదా కనీసం గ్యాస్ పొయ్యి వెలిగించడం కూడా రాదు. ఇక అమ్మ చేసే వంటకు వంక పెట్టే హక్కునాకెలా వుంటుంది చెప్పు.

“ఇన్నేళ్ళ జీవితంలో నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఇతరుల పొరబాట్లను మంచి మనసుతో స్వీకరించగలగాలి. అప్పుడే నలుగురితో మన సంబంధాలు బాగుంటాయి. ఆ సంబంధాలే పది కాలాలపాటు చెక్కుచెదరకుండా వుండి జీవితాలకు శోభనిస్తాయి.

“మళ్ళీ చెబుతున్నా విను. ఇతరులలోని మంచితనాన్ని గ్రహించే శక్తిని భగవంతుడు నీకివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే పక్కవారి తప్పులను ఎత్తిచూపే దుర్గుణం నీనుంచి దూరం కావాలన్నది కూడా నా కోరిక.

“నీ జీవితంలో ఎదురయ్యే చెడు సంఘటనలను, నీ మనసులో మెదిలే చెడు ఆలోచనలను ఆ భగవంతుడి పాదాలవద్ద వొదిలెయ్యి. నువ్వు గ్రహించిన మంచిని నీలోనే వుంచుకో. ఆ చెడ్డ విషయాల సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. నీ మంచి మాత్రం నిన్ను మంచి దోవలో నడిపిస్తుంది. అప్పుడు మాడిపోయిన అన్నం కూడా నీకు పరమాన్నంలా అనిపిస్తుంది.”

ఇదో కధ అనుకుంటే ఇందులోని నీతి:

జీవితంలో మీరు కలిసే వారెవరో, మీకు తారసపడేవారెవరో కాలమే నిర్ణయిస్తుంది.
మీరు కోరుకునే వ్యక్తులను మీ మనసే నిర్ణయిస్తుంది.
కానీ జీవితంలో మీ వెంట నడిచే వ్యక్తులెవరన్నది మీ ప్రవర్తనే నిర్ణయిస్తుంది.
ఇతరుల తప్పిదాలను తేలిగ్గా తీసుకుని, ఇతరులతో విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుని ముందుకు నడిస్తే ఇతరులతో మీ సంబంధాలు శాశ్వితం అవుతాయి. జీవితం పూల పానుపు అవుతుంది. లేకపోతే ముళ్ళ కంపగా మారుతుంది.
 (16-07-2011)

15, జులై 2011, శుక్రవారం

అమ్మా నాన్నా ఒక అమ్మాయి - భండారు శ్రీనివాసరావు

అమ్మా నాన్నా ఒక అమ్మాయి - భండారు శ్రీనివాసరావు

‘డియర్ నాన్నా!’

ఒక్క క్షణం ఆ తండ్రికి చేతులు వొణికాయి. మనసు కీడు శంకించింది. భార్యను పిలుద్దామనుకున్నాడు. లిప్తపాటు ఆలోచించి ఆ ఆలోచన మానుకున్నాడు. మనసు కుదుట పరచుకుని కుమార్తె రాసిన ఉత్తరాన్ని చదవడం ప్రారంభించాడు.

“డియర్ నాన్నా! ఇలా నిన్ను పిలిచే అదృష్టానికి నా అంతట నేనే దూరం జరుగుతున్నాను. అల్లారుముద్దుగా, ఏలోటూ తెలియకుండా నన్ను పెంచారు. దానికి ప్రతిఫలంగా నేనిస్తున్న కానుకే ఇది.

“కారణం తెలియదు కానీ, రామూని నేను మరచిపోలేకపోతున్నాను. అందుకే అతడితో వెళ్లి పోతున్నాను. నాన్నా! ఇంత నిస్సిగ్గుగా రాస్తున్నానన్న కోపంతో ఈ ఉత్తరాన్ని చించేయకండి. దయచేసి చివరదాకా చదవండి నాన్న. దగ్గరగా లేకపోయినా మీ కంటిలోని తడిని నేను దూరంనుంచే చూడగలుగుతున్నాను. ఈ క్షణంలో భూమి బద్దలయితే బాగుండని అనుకుంటూ మనసులో పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకోగలుగుతున్నాను. ఒక్క విషయాన్ని మీరూ పెద్దమనసుతో అర్ధం చేసుకోండి నాన్నా. ఇంతవరకు నా జీవితంలో అపరిమితమయిన ప్రేమను పంచి ఇచ్చింది మీరూ అమ్మా మీరిద్దరే. అలాగే నాకో నమ్మకం, మీకంటే, అమ్మకంటే నన్ను ఇంతగా ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో మరెవరూ వుండరని. కానీ రామూ పరిచయంతో ఆ నమ్మకం కాస్తా ఆవిరై పోయింది.

“రామూ లాంటి వ్యక్తులు మీకు నచ్చరని తెలుసు. అలాగే, అతడికున్న అలవాట్లను మీరు కలలో కూడా భరించలేరని, క్షమించలేరని కూడా నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేసే సాహసం చేయలేకపోయాను. కానీ, మీరు తెలుసుకోవాల్సింది కూడా వుంది నాన్నా. రామూ అంటే నాకు పిచ్చి ప్రేమ. ఆ ప్రేమ ముందు అతడి అలవాట్లు, అతడి మొరటుతనం ఏదీ నాకు ఆనడం లేదు. అతడిమీద ప్రేమతో నా కళ్ళు మూసుకుపోయాయి. అతడి చెడ్డ అలవాట్లన్నీ ఇప్పుడు నాకు మంచిగా కనబడుతున్నాయి. అతడి సమక్షంలో నేను వేరే వ్యక్తిని అన్న భావన కూడా రాదు. అతడికేది ఇష్టమయితే దాన్నే నా ఇష్టంగా మలుచుకోవడం నాకిష్టం. ఆ ఇష్టంతోనే అతడికిష్టమని నేనూ సిగరెట్లు తాగుతున్నాను. అతడి కోసమే మందు, భంగు అలవాటు చేసుకున్నాను. రామూ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నా నాకు మరో విధంగా అనిపించడం లేదు. అంటే అతడిపై నేను ఎంతగా ప్రేమను పెంచుకున్నానో, దాని తీవ్రత ఎంతగా వుందో దయచేసి అర్ధం చేసుకోండి నాన్నా.

“నిజమే! కాదనను. వయస్సులో మా ఇద్దరి మధ్యా ఎంతో వ్యత్యాసం. కొద్ది అటూ ఇటూగా మీ వయసు అతడిది. అయితేనేం! అతడి మీద నాకున్న ప్రేమ కూడా అంతే పెద్దది. అంతే గొప్పది. అది అర్ధం చేసుకోండి నాన్నా. అన్నీ అర్ధం అయిపోతాయి.

“అల్లరి చిల్లరగా తిరుగుతాడనే రామూ వాళ్ల అమ్మా నాన్నా అతడిని వొదిలేశారట. ఇంటి నుంచి తరిమేశారట. ఈ స్తితిలో నా తోడు కూడా అతడికి దూరం అయితే ఏమయిపోతాడో అని నా బెంగ. ఇంకో విషయం కూడా ఈ మధ్యనే తెలిసింది. దానితో అతడి పట్ల నా జాలి మరింత పెరిగిపోయింది. రామూకు ఎయిడ్స్ అని డాక్టర్లు చెప్పారట. ఇన్ని రోగాలకు మందులు కనుకున్న శాస్త్ర వేత్తలు ఏదో ఒకనాడు ఎయిడ్స్ కు చికిత్స కనుక్కోలేకపోతారా నేను బాగుచేయించలేకపోతానా చెప్పండి.

“బాధ పడకండి డాడ్! ఇప్పుడు నా వయసెంతని. నిండా పదిహేనేళ్ళు కూడా నిండనే లేదు. కాకపోతే నా బాగోగులు నేనే చూసుకోగల మనస్తయిర్యాన్ని మీ పెంపకంలో అలవర్చుకున్నాను. అదే పదివేలు. ఏదో ఒక రోజు మీ మనుమడిని తీసుకుని రామూని వెంటబెట్టుకుని మిమ్మల్నీ అమ్మనీ చూడడానికి వస్తాను. అంతదాకా సెలవ్ – మీ – ముద్దుల కూతురు”

పీ ఎస్: - "డాడ్! పైన రాసినదంతా శుద్ద అబద్ధం. నేను పక్కింట్లో సుధక్కతో కూర్చుని చెస్ ఆడుతున్నాను. రామూ లేడూ సోమూ లేడూ అంతా ఉత్తిదే. నా స్కూలు ప్రోగ్రెస్ కార్డు కంటే దారుణమయిన విషయాలు లోకంలో ఇంకా చాలా వుంటాయని చెప్పడానికే ఇదంతా రాశాను. కార్డు పక్కనే సొరుగులో వుంది. చూసీ చూడనట్టుగా చూసి సంతకం పెట్టండి. పెట్టి ఫోను చేయండి. ఇంటికి వస్తాను.”

(15-07-2011)

నమ్మకం – అపనమ్మకం – భండారు శ్రీనివాసరావు

నమ్మకం – అపనమ్మకం – భండారు శ్రీనివాసరావు

ఒక పోలీసు అధికారిని డిఫెన్స్ లాయరు కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాడు.

ఆ సంభాషణ ఇలా సాగింది.

“ఘటనా స్తలం నుంచి నా క్లయింట్ పారిపోవడం మీరు చూసారా?”

“లేదు. కానీ ఘటన జరిగిన ప్రదేశం నుంచి కొద్ది దూరంలో ముద్దాయిని పోలివున్న ఒక వ్యక్తి పారిపోతుండగా చూసాను.”

“ముద్దాయి పలానా విధంగా వుంటాడని మీకు చెప్పిందెవరు?”

“నా కంటే ముందు అక్కడికి వెళ్ళిన నా కింది అధికారి చెప్పాడు.”

“ముద్దాయి అని అనుకుంటున్న వ్యక్తి పలానా విధంగా వుంటాడని మీ తోటి అధికారి చెప్పాడని అంటున్నారు. అతగాడు చెప్పినదానిని ఎంతవరకు నమ్మవచ్చు?”

“ నావద్ద చాలాకాలంగా పనిచేస్తున్నాడు కాబట్టి నాకు బాగా తెలుసు. అతడిని నమ్మకపోవడం అంటే నన్ను నేను నమ్మకపోవడమే.”

“ ఇప్పుడు అడిగే ఈ ప్రశ్న మీకు అసంబద్ధంగా అనిపించవచ్చు కానీ దయచేసి సమాధానం చెప్పండి. మీరు పనిచేసే పోలీసు స్టేషనులో మీరు, మీ సిబ్బంది యూనిఫారం మార్చుకోవడానికి విడిగా ఏదయినా గది లాంటిది వుందా?”

“వుంది. ఎవరి దుస్తులు వారు భద్రపరచుకోవడానికి అందులో లాకర్ల సౌకర్యం కూడా వుంది”

“ ఆ లాకర్లకు తాళాలు వుంటాయా? వుంటే వాటి తాళం చేతులు మీ దగ్గర వుంటాయా లేక మీరు నమ్మదగ్గ వ్యక్తి అని బల్లగుద్ది చెబుతున్న మీ సహచరుడి దగ్గర వుంటాయా?”

“ఎవరివి వాళ్ల దగ్గరే వుంటాయి. అయినా ఇది అంత సందేహపడాల్సిన సంగతేమి కాదుకదా!”

“అయితే ఇప్పుడు నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పండి ఆఫీసర్! అంత నమ్మదగ్గ వాడు అని మీరు అంత గట్టిగా అనుకున్నప్పుడు మీరు మీ లాకర్ కు తాళం వేసుకోవాల్సిన అగత్యం ఏమిటి?”

“అయ్యా లాయరు గారు. మీ అనుమానం సహేతుకమయినదే. మా స్టేషను కూడా కోర్టు ఆవరణలోనే వుంది. అప్పుడప్పుడు మీలాటి లాయర్లు మా స్టేషనులో తిరుగాడుతూ వుంటారు. మరి అటువంటప్పుడు, మాకు తాళాల అవసరం వుండదని అంత ఖచ్చితంగా యెలా చెప్పగలం చెప్పండి.” (15—07-2011)

14, జులై 2011, గురువారం

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు


“ ఆ రోజులే వేరు. వొంట్లో యువ రక్తం సలసలా మరుగుతుండేది. మొత్తం ప్రపంచాన్ని ఒక్కమారుగా మార్చేసి నాకు నచ్చిన లోకాన్ని సృష్టించాలని తహతహ లాడుతుండే వాడిని. కానీ ఏమయింది. ప్రపంచాన్ని మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది. పోనీ, ప్రపంచం సంగతి అక్కడితో వొదిలేసి నా దేశాన్ని సంస్కరించుకుంటే సరిపోలా అని అనుకున్నాను.

“ఆ ప్రయత్నం కూడా వృధా అని త్వరలోనే తెలిసిపోయింది. దాంతో దేశం గొడవ పక్కనబెట్టి మా వూరిని బాగుచేద్దామని పూనుకున్నాను.

“అయితే వూరును బాగుచేయడం అన్నది నా ఒక్కడివల్లా అయ్యే పని కాదని తెలిసిరావడానికి కూడా ఎక్కువ కాలం పట్టలేదు.

“ఇక అప్పుడు కానీ నాకు నా కుటుంబం గుర్తుకు రాలేదు. ముందు కుటుంబం బాగోగులు చూడాలనిపించింది. కానీ అప్పటికే వయసు మీద పడింది. వెనుకటి సత్తువా లేదు. మునుపటి ఓపికా లేదు.

“బోధి వృక్షం లేకుండానే నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ముందు నన్ను నేను మార్చుకుంటే యెలా వుంటుంది అన్న ఆలోచన మొదలయింది. మొదటే ఈ పని చేసివుంటే ఎంత బాగుండేదో కదా!

“క్రమంగా నా ఆలోచనలు కొత్త రూపం తీసుకున్నాయి.

“మార్పు అనేది ముందు నాతో మొదలయివుంటే ఆ ప్రభావం నా కుటుంబం పైన పడేది. నేనూ నా కుటుంబం కలిసి మా వూరిని మార్చేవాళ్ళం. మా వూరు బాగుపడితే దానివల్ల నా దేశం బాగుపడివుండేది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చిన్నతనంనుంచి కంటున్న నా కల ఆ క్రమంలో ఫలించి వుండేది. కానీ ఏంలాభం? శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన తరవాత కానీ తత్వం బోధపడలేదు.

“ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం లో నేను చేసిన ఈ పొరబాటు మరెవ్వరూ చేయకూడదని చెప్పడానికే ఈ నాలుగు ముక్కలు.” (పదకొండో శతాబ్దానికి చెందిన ఓ సన్యాసి చెప్పిన నీతి కధ ఆధారంగా)

(14-07-2011)

13, జులై 2011, బుధవారం

మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే!

మొత్తం ప్రపంచంలో అదృష్టవంతుడయిన మొగవాడు ఎవడంటే!


(నెట్ లో చక్కర్లు కొడుతున్న జోక్)


ఇంకెవ్వరు?

 
మన కనిమొళి మొగుడు జి.అరవిందన్

ఎందుకంటారా?బాంకులోనేమో 214 కోట్లు –
భార్య మాత్రం భద్రంగా బందిఖానాలో
(అనుభవించు 'రాజా' అనుభవించు)

రేడియో తాతయ్య ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

రేడియో తాతయ్య ఇక లేరు – భండారు శ్రీనివాసరావు


1938 జూన్ 16 వ తేదీ

మద్రాసులో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన రేడియో కేంద్రాన్నిప్రారంభించిన రోజది. అప్పటికి ఆలిండియా రేడియో ‘ఆకాశవాణి’ గా రూపాంతరం చెందలేదు. మద్రాసు పేరు మార్చుకుని చెన్నైగా అవతరించనూ లేదు. ప్రారంభ కార్యక్రమంగా అనుకుంటా బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయ్ కచ్చేరీ పెట్టారు. దాని గురించి అనౌన్స్ చేసే  బాధ్యత మల్లంపల్లి ఉమామహేశ్వర రావు గారిపై పడింది. మద్రాసు రేడియో కేంద్రం అధికారికంగా మొదలుకాక ముందు నుంచే ఆయన అక్కడ పనిచేస్తూ వచ్చారు. ప్రసారాలకు అవసరమయిన రచనలకు ప్రతులు రాయడం ఆయన ఉద్యోగం. రేడియో కేంద్రం పనిచేయడం మొదలు పెట్టేసరికి ఆయన్నే అనౌన్సర్ గా పనిచేయమన్నారు. ఆ విధంగా ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తొలి అనౌన్స్ మెంట్ చేసిన ఘనత మల్లంపల్లి వారి ఖాతాలో చేరిపోయింది.

తదనంతర కాలంలో రేడియో తాతయ్యగా సుప్రసిద్దులయిన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు రేడియోలో పనిచేసిన వారందరికీ ప్రాతః స్మరణీయులు. ఈ రోజు ఉదయం ఆయన్ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భం అత్యంత బాధాకరంగా మారింది. మల్లంపల్లి వారు తమ 99 వ ఏట చెన్నై లో ఈ తెల్లవారుఝామున కన్ను మూసిన సంగతిని హైదరాబాద్ రేడియో కేంద్రం డైరెక్టర్ గా పదవీ విరమణ చేసిన పీ ఎస్ గోపాల కృష్ణ గారు కన్నీళ్ళ పర్యంత మవుతూ నా చెవిన వేశారు. నిజానికి నేను ఆయన్ని గురించి వినడమే కాని చూసి ఎరుగను. 1975 లో నేను హైదరాబాదు రేడియో కేంద్రం లో చేరిన రెండు సంవత్సరాలకే మల్లంపల్లి వారు నలభై ఏళ్ళ సుదీర్ఘ రేడియో జీవితాన్ని విరమించి 1977 మే 31 వ తేదీన ఉద్యోగ విరమణ చేశారు.

ఆకాశవాణి అనౌన్సర్లు, న్యూస్ రీడర్లు, డ్రామా వాయిస్ స్టాఫ్ ఆర్టిస్టుల సంక్షిప్త జీవన రేఖలను స్పృశిస్తూ ‘వాచస్పతి’ పేరుతొ అంబడిపూడి మురళీ కృష్ణ, మడిపల్లి దక్షిణామూర్తి కలసి సంకలనం చేసిన గ్రంధంలో మల్లంపల్లి వారు తన గురించి రాసుకున్న కొన్ని జ్ఞాపకాలు ఈ సందర్భంగా నలుగురి దృష్టికి తీసుకురావడం సముచితంగా వుంటుందని భావిస్తూ వాటిని పేర్కొంటున్నాను.

“అప్పట్లో మద్రాసు, ఆంధ్ర, తమిళ, కన్నడ ప్రాంతాలు కలగలిపి అవిభక్తంగా ఉండడం వల్ల సంగీత కార్యక్రమాలకు నేను తెలుగులోనే ప్రకటనలు చేసేవాడిని.”

“రేడియో మొదటి రోజుల్లో ఆచంట జానకిరామ్ గారు నాటకాలు రూపొందించేవారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదిన్నర దాకా నాటకం ప్రసారమయితే ఆ తర్వాత నాటకంలో పాల్గొన్నవాళ్లు, తక్కిన ఉద్యోగులు అందరు ఆరుబయట ఆయన ఏర్పాటు చేసిన విందు భోజనం చేసికానీ కదిలే వీలు వుండేది కాదు. ఆ విందు ఖర్చులన్నీ ఆయనవే.”

“రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక రోజు ఉదయం సేట్ కాలనీలో వున్న మా ఇంటి నుంచి ఎగ్మూర్ మార్షల్స్ రోడ్ లోని రేడియో స్టేషన్ కు బయలుదేరి వస్తుంటే దారిలో పోలీసు ఒకాయన ఆపి ‘ఎక్కడికి’ అని అడిగాడు. చెప్పాను. ఆయన- ‘ఇట్లా వెడితే మునిగిపోతావు. పాంతియన్ రోడ్ వైపు వెళ్ళు’ అన్నాడు. తీరా వెడితే రేడియో స్టేషన్ గేటు దగ్గర గుండె లోతు నీళ్ళు పారుతున్నాయి. చెంగల్పట్ జిల్లా లోని చెరువుకట్ట తెగి ఆ నీళ్ళు నగర ప్రవేశం చేశాయన్నమాట. స్టేషన్ లోకి అడుగు పెడుతుండగానే అక్కడ డైరక్టర్ ఎస్. గోపాలన్ గారు గ్రామ ఫోన్ రికార్డులు తీసుకునిపోతూ కనిపించారు. ఆయన నన్ను చూసి చాలా సంతోషపడి వెళ్లి అనౌన్స్ చేయమన్నారు. ప్రసారానికి సంబంధించిన పరికరాలన్నీ బల్లలపైకి ఎక్కి కూచుని కనిపించాయి. రోజంతా నేనొక్కడినే అనౌన్సర్ని. నీళ్లలోనే నిల్చుని అలా అనౌన్స్ చేస్తుండగా సాయంకాలం అయ్యేసరికి కరెంట్ పోయింది. ఆ పోయిన కరెంట్ మర్నాడు పొద్దున్న కానీ సరిపడలేదు. ఈ లోగా రేడియో కార్యక్రమాలు వినబడక పోయేసరికి నగరంలో కొందరు ప్రజలు జపాన్ వాళ్లు రేడియో కేంద్రాన్ని కూల్చేసినట్టున్నారని భయపడ్డారు.”

“ఒక ప్రముఖ విద్వాంసుడు ఎప్పుడు తన గానం ప్రసారం చేయడానికి వచ్చినా సింహ స్వప్నంగా వుండేది. ఆయన పాడినంత సేపూ అందుకు తగ్గట్టు అనౌన్సర్ తల వూపకపోతే ప్రాణం మీదికి వచ్చేది.”

“బాలగురుమూర్తిగారు కార్యక్రమ నిర్వాహకులుగా వున్నప్పుడు పిల్లల కార్యక్రమానికి ఒక పాత్ర కావలసి వచ్చింది. ఆయన నన్ను గొంతు మార్చి ప్రయత్నించమని చెప్పారు. అట్లా నేను తాతయ్య అవతారం ఎత్తాను. తాతయ్యగా చాలా ప్రఖ్యాతి సంపాదించాను. రేడియో స్టేషన్ కు వచ్చిన వాళ్లు తాతయ్యను చూపమని నన్నే కోరేవాళ్ళు. మరికొందరు నేనే తాతయ్యను అంటే నమ్మలేక పోయేవాళ్ళు.”

“ఒకసారి ఒక తెలుగు పత్రికా సంపాదకులు ప్రసంగం చేయడానికి వచ్చారు. అప్పటికి రికార్డింగ్ సౌకర్యం లేదు. ఆయన ప్రసంగిస్తారని నేను అనౌన్స్ చేసి చూస్తే ఆయన చెమటలు కక్కుతూ,వణుకుతూ కనిపించారు. ఎంత ప్రయత్నించినా ఆయన నోరు విప్పక పోయేసరికి నెమ్మదిగా ఆయన చేతుల్లోనుంచి ప్రసంగం ప్రతి తీసుకుని నేనే చదివేశాను.”

నిండు జీవితం జీవించిన ఆ పూర్ణ పురుషుడికి ముకుళిత హస్తాలతో శ్రద్ధాంజలి ఘటిద్దాం. (13-07-2011)

11, జులై 2011, సోమవారం

Cong’s hide-and-seek game on T - Bhandaru Srinivas Rao (I.I.S.)

Cong’s hide-and-seek game on T  - Bhandaru Srinivas Rao (I.I.S.)


As I have written in these columns in the past, the people of


Telangana are yet again set to get betrayed by their own leaders. A

conspiracy has already been launched none other than at 10 Janpath in

New Delhi, the official residence of UPA Chairperson and Congress

President Sonia Gandhi, to dilute the issue. The ‘resignation drama’

script which was penned by the coterie of Sonia was enacted to

perfection by the region’s MPs and MLAs, to give an impression about

their commitment.



But, now their reluctance to carry forward their mounted pressure on

the Centre, is a clear indication of their real intentions. The

‘escape route’ they found expressing apprehensions on T-JAC leadership

not at all convincing. Simply because, the T-JAC bound to act in

accordance of TRS diktat as both were committed to take the fight for

separate statehood to its logical conclusion. Why then, find fault

with T-JAC for working as an arm of TRS? It will and it shall, as far

as an ‘honest’ Telanganite is concerned.



Attributing motives against T-JAC Convenor Prof Kodandaram and

demanding for his removal, uncalled for. To me he appears working in

accordance with the aspirations of people of the region and no where

deviated from the task entrusted to him. Absolutely, there is no

logic in Congress leaders demand to replace Prof Kodandaram with

either educationists' Chukka Ramaiah or Prof Haragopal. This doesn’t

mean I hold any grouse against the two, who enjoy equally greater

credibility as individuals.



Today, it appears, the Congress leadership in New Delhi yet again

determined to betray the people of Telangana. It has betrayed in 1969

and now. The only difference I find between 1969 movement for

separate statehood spearheaded then by Dr Marri Chenna Reddy of

Telangana Praja Samiti (TPS) and now by the Telangana Rashtra Samiti

(TRS) headed by K Chandrasekhara Rao, the sincerity and honesty of the

leadership. Unlike Chenna Reddy, Rao appears more honest and ‘shrewd’

not to fall a prey to the lures of Congress. Had Rao like Chenna been

a power-hungry leader, he too could have got trapped by Delhi

leadership.



His pre-condition laid to Cong for ‘merging his party’’ only after

declaration of separate statehood for Telangana is undoubtedly

appreciable. Congress ‘game plan’ is clear – assessing pros and cons

on bifurcation. That’s why the state political affairs in-charge

Gulam Nabi Azad as well senior Congress leader and party’s core

committee member Pranab Mukherjee wanted to know from those who

resigned to MP and MLA seats from the Telangana region whether they

can retain their seats if byelections thrust upon. Though, the TRS

assures Delhi of ensuring the party’s existence better in the past, if

separate state carved out, yet it appears ill-afford to lose their

base in other two regions of the state – Andhra and Rayalaseema.



The party had also apparently realized that the demand for separate

statehood took an ugly turn, if not slipped out of hands, only after

the death of a strong leader like Y S Rajasekhara Reddy. Today, the

party lacks such a strong leader in the state, who is acceptable to

all three region people. Had Sonia and her advisors been

‘accommodative’ at least to the young YSR scion YS Jaganmohan Reddy by

entrusting him the job of Pradesh Congress Chief, the situation

wouldn’t have precipitated to this far. That did not happen, reasons best known to the

Congress leadership. Thus far, what one can infer is that YSR

adversaries succeeded in poisoning the mind of Sonia. That she

developed animosity against the late leader is evident from the

revelation of YSR widow at her party’s first plenary at Idupulapaya in

native Kadapa district. As honorary President of the newly formed YSR

Congress party, she blurt out what transpired between her and Sonia,

when she met the latter along with her son and MP Y S Jaganmohan Reddy

at 10 Janpath. Instead of acknowledging the efforts of her husband

YSR for bringing back the party to power in 2004 after a decade long

isolation, apparently boasted of attributing that achievement to

herself. No wonder Sonia’s unsavoury remarks hurt the YSR widow and

endorsed son’s proposal to launch a new party to teach a lesson or two

to egoist Sonia and her Congress party.



Well, the YSR Congress has already inflicted enough humiliation when

YSR widow Vijayalakshmi and her son Jaganmohan Reddy registered

resounding victories in the by-elections from Pulivendula assembly and

Kadapa parliament constituencies, not so long ago. Even the first

plenary of YSR Congress party proved a grand success, though those

from Telangana region, who attended in big numbers, gave vent to their

feelings by reverberating the meeting place with ‘Jai Telangana’

slogans.



Congress or other opposition parties criticism for YSR Congress party

not announcing its stand on state bifurcation, sounds silly as well

funny. It’s the Congress leadership at the Centre, in particular

Sonia Gandhi, who has to take the call on Telangana and decide either

way. Today, it is clear the Congress headed by Sonia Gandhi lack

courage to take a decision on Telangana as it fears of irreparable

loss to party in other two regions of the state. This apart, it also

equally feared as the BSP leader and Uttar Pradesh Chief Minister

Mayawati’s request for division of her state

pending with the UPA government for action.



While one appreciate the commitment and dedication of TRS leader K

Chandrasekhara Rao for accomplishing his goal, his party’s next plan

of action should pressurize the Congress and TDP MPs and MLAs to force

them ensure their resignations are accepted by the Speakers of both

Lok Sabha as well Legislative Assembly. If necessary, they should not

hesitate to accept the demand for replacement of Prof Kodandaram with

either Chukka Ramaiah or Prof Haragopal, once they fulfil their

promise of ensuring their resignations acceptance. The TRS should put

continuous pressure, especially Congress MPs and MLAs and never allow

them drift away from the stand they have taken. It should also ensure peace in the region as in the past as the decision lies more in the political process than in the streets.



People of the region are emotively surcharged and appear willing for

any sacrifices. Now the onus is more on TRS as it could succeed in

pushing the issue to this far, and now with another ‘strong push”

(dakka) it can ensure Telangana becoming a reality.



Today, the Congress MLAs and MPs too have no escape route. Time has

come for them to decide whether they would like to be remembered as

‘villains of T’ in history, or the ‘real martyrs.’ It’s up to them

to decide as no ‘buyers’ for the ‘blame game’ either on the TDP or YSR

Congress! ( 11-07-2011)

10, జులై 2011, ఆదివారం

‘ఎన్నాళ్ళిలా ? ఎన్నేళ్ళిలా ?’ - భండారు శ్రీనివాసరావు

‘ఎన్నాళ్ళిలా ? ఎన్నేళ్ళిలా ?’ - భండారు శ్రీనివాసరావు


తెలంగాణా ఎంపీల రాజీనామాలపై వచ్చే నెల ఒకటో తేదీన నిర్ణయం తీసుకుంటానని లోకసభ స్పీకర్ మీరాకుమార్ వెల్లడించి ఈ వ్యవహారం పై ముసురుకున్న సస్పెన్స్ ను మరో మూడు వారాలు పొడిగించారు. బహుశా శాసన సభ సభ్యత్వానికి రాజీనామాలు చేసిన తెలంగాణ నేతల విషయంలో కూడా స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఇలాటి నిర్ణయమే తీసుకోవచ్చు. ఈ ఇద్దరు సభాపతులు రాజీనామాల ఆమోద ప్రక్రియ ప్రారంభించి దాని పూర్తి చేయడానికి మరి కొన్ని రోజులు అదనంగా వ్యవధి తీసుకునే అవకాశం వుంది. అంటే రాజీనామాల వల్ల రగిలిన వాడీ వేడీ ఎంతో కొంత చల్లారేలా చూడడమే ఇందులోని పరమార్ధం కావచ్చు. మరి రాజీనామాలు చేసిన మంత్రులు అన్ని రోజులు విధులకు దూరంగా వుంటే అసలే అంతంత మాత్రంగా వున్న పాలన మరింత గాడి తప్పే ప్రమాదం వుంది. ఇప్పటికే సచివాలయంలో వందలాది ఫైళ్ళు అతీగతీ లేకుండా పడివున్నట్టు మీడియాలో సమాచారం. ఒక్క ముఖ్యమంత్రి కార్యాలయం లోనే సుమారు పన్నెండు వందలకు పైగా ఫైళ్ళు ముఖ్యమంత్రి సంతకం కోసం పడిగాపులు పడుతున్నాయని, నలుగురయిదుగులు మంత్రులు మినహా రాజీనామాలు చేసిన వారు, చేయని వారు సచివాలయం వైపే రావడం లేదని భోగట్టా. రాష్ట్రంలో సాగుతున్న రాజకీయాల తీరుతెన్నుల ప్రభావం పరిపాలనపై, దానిని నడిపే యంత్రాంగం పై యెలా పడుతుందో తెలుసుకోవడానికి ఇదో ఉదాహరణ. రాజీనామాలు చేసిన మంత్రుల పేషీల్లో ఫైళ్ళు పేరుకుపోవడాన్ని కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఇదే పరిస్తితి వుండడాన్ని యెలా సమర్ధిస్తారు? అధిష్టానంతో చర్చలకోసం తరచుగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిరావడం వల్ల, రాష్ట్రానికి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ రాకతో పాటు ఆమె పాల్గొంటున్న కార్యక్రమాలు, పర్యటనల వల్ల సీయెం పేషీలో ఫైళ్ళ పరిష్కారంలో కొంత జాప్యం జరుగుతుండవచ్చు. సమర్ధన కోసం చెప్పే ఇలాటి సంజాయిషీలన్నీ రాష్ట్రంలో పాలన స్తంభించి పోయిందని వస్తున్న వార్తలను ఖరాకండిగా ఖండించడానికి ఎంతమాత్రం పనికిరావు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరవాత నిదానంగా పాలనా పగ్గాలను తన చేతిలోకి తీసుకోగలుగుతున్నారని, మెల్లగా పాలనపై తనదయిన పట్టు బిస్తున్నారని జనం అనుకోవడం మొదలయ్యీ కాకముందే మళ్ళీ పరిస్థితులు ఆయన చేజారిపోతున్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించడం దురదృష్టం.

పాలన కుంటుపడడం వల్ల కలిగే విపరీత పరిణామాల ప్రభావం పరిపాలించే వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై వెంటనే పడే అవకాశాలు లేని వ్యవస్థ మనది. ప్రభుత్వం అమలు చేయాల్సిన పధకాలు జాప్యం కావడంవల్ల వాటిల్లే ఇబ్బందులకు జనం ఇప్పటికే అలవాటు పడిపోయారు. కానీ వ్యక్తిగత సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో పడిపోతే దానివల్ల వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అందుకే, రాజకీయ సంక్షోభ పరిష్కారం పట్ల ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చిందనే సాకులను ప్రజలు జీర్ణించుకుని అర్ధం చేసుకోవడం కష్టం. దీనికి తోడు రాజకీయ ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా కదులుతున్న ఉద్యోగ సంఘాలు మరో సారి సహాయ నిరాకరణకు పూనుకోబోతున్నట్టు వస్తున్న వార్తలు కూడా సామాన్య జనానికి ఆందోళన కలిగిస్తున్నాయి. బహుశా ఇవ్వాళో రేపో తెలంగాణా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఈ మేరకు సమ్మె సైరన్ మోగించవచ్చు. గతంలో పద్దెనిమిది రోజులపాటు జరిపిన సహాయనిరాకరణ, లక్ష్య సాధనలో ఎంత ఉపకరించిందన్న విషయాన్ని పక్కన పెడితే ప్రజలు మాత్రం తాముపడ్డ ఇబ్బందులు మాత్రం మరచిపోలేదు. అప్పట్లో విద్యార్ధుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాటి ఇబ్బంది కలిగించకూడదన్న సదుద్దేశ్యంతో తెలంగాణా ఉద్యోగ సంఘాల జే.యే.సీ. సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించారు. పరిపాలనను స్తంభింప చేయడం, రాస్తారోఖోలు చేయడం, నడి రోడ్లపై ధర్నాలకు పూనుకోవడం వంటి చర్యలు ప్రజాస్వామిక హక్కుల్లో భాగం కావచ్చు కానీ, ఈ రకమయిన ఆందోళనలను ఒక కాల పరిమితి లేకుండా నిరవధికంగా నిర్వహిస్తూ పోవడంవల్ల, ఎవరి బాగుకోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ ప్రజలే వాటివల్ల నష్టపోతున్నారని, లేనిపోని ఇబ్బందులకు గురవుతున్నారని అర్ధం చేసుకుని వ్యవహరించడం వల్ల సాధారణ ప్రజలనుంచి లభించే సానుభూతి, సహకారం ఉద్యమకారుల లక్ష్య సాధనకు దోహదపడే అవకాశం వుంటుంది. రెండు రోజులపాటు నిర్వహించాలని తలపెట్టిన రైల్ రోఖో, వంటావార్పూ కార్యక్రమాలను వాయిదా వేసినట్టు తెలంగాణా జేయేసీ చైర్మన్ కోదండరాం ప్రకటించిన వెంటనే జనం అమ్మయ్య అని నిట్టూర్పు వొదలడం ఇందుకు ఉదాహరణ.

రాష్ట్ర విభజన అనేది సున్నితమైన, సంక్లిష్టమయిన సమస్య అని అంగీకరించే వారు కూడా ఈ సమస్యకు సత్వర పరిష్కారం కోరుకుంటున్నారని భావించడం సత్య దూరం కాదు. ఎందుకంటె, ఈ సమస్యను ఏళ్లతరబడి నానుస్తూ పోవడం వల్ల మరింత జటిలం కావడం మినహా మరే ప్రయోజనం వుండదని అందరూ అర్ధం చేసుకునే రోజులు దగ్గరపడ్డాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేయాలన్న అభిలాష ఆ ప్రాంతపు ప్రజల్లో నాలుగు దశాబ్దాలకుపైగా పాతుకుపోయి వేళ్ళూనుకున్న కోరిక. అప్పటినుంచి ఇప్పటివరకు వారి ఆకాంక్షలో ఎటువంటి మార్పు వచ్చివుండక పోవచ్చు. కానీ, పరిణామక్రమంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న నూతన ఆర్ధిక సంస్కరణల పవనాల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై కూడా పడడంలో ఆశ్చర్యం లేదు. ప్రాంతాలను దాటుకుని పెట్టుబడులు ప్రవహించాయి. సంస్కరణల వల్ల సంస్కృతి బీటలు వారింది. సంపాదనే లక్ష్యంగా మారి విలువలు వెనక్కు పోయాయి. మానవ సంబంధాలు మరుగున పడి ఆర్ధిక సంబంధాలు అవనిక పైకి వచ్చాయి. చదువుల విలువ తెలిసిన వారు అప్పట్లో ఉన్నతవర్గాల్లో మాత్రమే వుండేవారు. ఇప్పుడా పరిస్తితి పూర్తిగా మారి బడుగు బలహీన వర్గాలు సైతం విద్యవల్ల లభించే సాంఘిక గౌరవంలోని రుచిని ఆస్వాదించడం మొదలయింది. విద్యకు తగిన ఉద్యోగాలు, ఉద్యోగాలకు తగిన ఆర్జన - గౌరవప్రదమయిన జీవితాలకు పునాదులు వేయడంతో సమాజ స్వరూప స్వభావాల్లోనే సమూల మార్పులకు బీజాలు పడ్డాయి. పిల్లలను పెద్ద చదువులు చదివించాలన్న తపన తలితండ్రుల్లో పెరిగిపోయింది. బీదా గొప్పా తారతమ్యం లేకుండా వానయినా వంగడయినా పిల్లలను క్రమం తప్పకుండా బడులకు పంపడం అలవాటుగా మారిపోయింది. నలభయ్ ఏళ్ళ క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ చెలరేగిన ఉద్యమంలో చాలాకాలం విద్యాసంస్తలు పనిచేయలేదు. కలిగిన వాళ్లు బయటి ప్రదేశాలకు పిల్లలను పంపి చదివించుకున్నారు. లేనివాళ్ళు బడులు నడవకపోవడమే అవకాశంగా తీసుకుని తమ పిల్లలను కూలీ పనుల్లో పెట్టి వారి చదువుకు స్వస్తి చెప్పారు. ఇందుకు వారిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటె వారి ఆర్ధిక నేపధ్యం అలాటిది మరి.

మరి ఇప్పుడో. ఒక్క పూట కూడా బడికి ఎగనామం పెట్టే వీలు లేదు. పరీక్షల సీజను మొదలయిందంటే చాలు తలితండ్రులే ఆఫీసులకు సెలవు పెట్టి చదివించాల్సిన రోజులివి. పెళ్ళిళ్ళు పేరంటాల జోలికి పోకుండా పిల్లల్ని చదివించే తలితండ్రులు లెక్కకు మిక్కిలి కానవస్తారు. అలాగే, ప్రయివేటు ఉద్యోగులు. వాళ్లు ఆఫీసులకు రావడం ఒక్క నిమిషం ఆలశ్యం అయినా అందువల్ల వాటిల్లే నష్టాన్ని రూపాయల్లో లెక్కలు వేసుకుని, వారిని వాహనాల్లో ఆఫీసులకు తరలించే కొత్త యజమానులు తయారయ్యారు. ఉరుకులు పరుగులతో జీవితాలు పరుగులు తీస్తున్నాయి. వేగమయ జీవితాలతో కొత్త సమాజం ఆవిష్కృత మవుతోంది.

ఈ వాస్తవాలను ఉదహరిస్తున్నది ఉద్యమకారుల ఉద్దేశ్యాలను శంకించడానికో, ప్రజాస్వామ్య హక్కులను హేళన చేయడానికో కాదు. మారిన పరిస్తితులకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవడం అన్నది అనాదిగా వస్తోంది. స్వాతంత్రోద్యమ సమయంలో అనుసరించిన పద్దతులు ఆనాటి స్తితిగతులకు తగినట్టుగా వుండవచ్చు. ఈ నాటి పరిస్థితులు, అవసరాలకు తగినట్టుగా ఆందోళనల స్వరూపాలు మారితీరాలనే వాదన సర్వత్రా ప్రబలుతోంది. ఈ వాస్తవాన్ని గమనించి నడుచుకుంటే ప్రజల మన్నన, మద్దతు మరింత ఎక్కువగా లభిస్తాయి.

తెలంగాణా రావాలని మనసా వాచా కర్మణా కోరుకునే వాళ్లు ఎందరో వున్నారు. కానీ వారిలో చాలా మందికి నోరూ వాయీ లేదు. తెలంగాణా కోసం పార్టీలు , సంఘాలు పెట్టి పోరాడుతున్న వారూ వున్నారు. మీడియా ద్వారా మాట్లాడే అవకాశం వీరికున్నట్టుగా నోరు లేని మూగ జీవులకు లేదు. ఆయా పార్టీలు, సంఘాలు చేసే ప్రతిదానినీ సమర్ధించని వారిని తెలంగాణా వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరికాదు. చిన్న విషయాన్ని కూడా గోరంతను కొండంత చేసి యాగీ చెయ్యడం సభ్యత అనిపించుకోదు. తెలంగాణాను మనమెంత గట్టిగా కోరుకుంటున్నామో వద్దని అనుకునేవారు కూడా అంత గట్టిగానే కోరుకుంటూ వుండవచ్చు. మనలాగానే అది వారికున్న ప్రజాస్వామిక హక్కు. లక్ష్య శుద్ధి వున్నంతకాలం ఫలితంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీరిని వారూ వారిని వీరూ

ఆడిపోసుకుంటూ మీడియాలో మాటల యుద్ధాలు చేసుకుంటూ పోవడం వల్ల ఉద్యమ స్పూర్తి పలచబడే అవకాశం వుంటుంది. గమ్యం చేరుకునే క్రమంలో ఎవరో అడ్డం పడుతున్నారని అనుకుంటే మాత్రం మనలో పోరాట శక్తి తగ్గుతోందనే అనుకోవాలి. ఇన్నాళ్ళు ఆగినవాళ్ళం మరికొన్నాళ్ళు ఆగలేమా? – ఆలోచించండి! (08-07-2011) 

8, జులై 2011, శుక్రవారం

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి! – భండారు శ్రీనివాసరావు

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి! – భండారు శ్రీనివాసరావు


(08-07-2011 తేదీ సాక్షి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

"అయాం సోల్డ్" - అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు.
ముఖ్యమంత్రి అమ్ముడుపోవడమా!అందులోను వైఎస్సార్? ఎవరికి అమ్ముడుపోయారు? ఎంతకు అమ్ముడుపోయారు?

అది డిసెంబరు నెల. 2007 వ సంవత్సరం.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సు ధ్వనిని అనుకరిస్తూ దాని ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే - సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది.అదే ఎఫ్ డీ హెచ్ ఎస్. -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశిత దిన వైద్య సేవలు. ఇందుకు పూర్వ రంగం గురించి కొంత ప్రస్తావించాల్సివుంటుంది.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు

ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.ఈ నేపధ్యంలో -

అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ

సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.


ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులేన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెచ్ ఎం ఆర్ ఐ నిర్వాహకులు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ తీసుకుని ఒకనాడు సచివాలయానికి వెళ్ళారు. ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో- రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హటాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.

అంతే! దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

కానీ, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఇప్పుడు ఆయనా లేరు. ఆ పధకాలూ ఆయన లాగానే అంతర్ధానం అయిపోతున్నాయి. ఇవ్వాళో రేపో వాటిని పూర్తిగా అటకెక్కించినా ఆశ్చర్యంలేదు.

(ఈ రోజు కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి)

6, జులై 2011, బుధవారం

తెలంగాణాపై కాంగ్రెస్ తేల్చుడా ? నాన్చుడా ? - భండారు శ్రీనివాసరావు




తెలంగాణాపై కాంగ్రెస్ తేల్చుడా ? నాన్చుడా ?
-భండారు శ్రీనివాసరావు

(06-07-2011 తేదీ ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)

ఏదో జరగబోతోంది అన్న భ్రమలను కల్పించి ప్రజల దృష్టిని మళ్ళించడంలో కాంగ్రెస్ నాయకులు మరోసారి తమ ప్రజ్ఞను నిరూపించుకున్నారు. గత రెండు మూడురోజులుగా రాష్ట్రంలో చక చక కదులుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించినప్పుడు ఈ అభిప్రాయం కలగకమానదు. మూకుమ్మడి రాజీనామాల పర్వం ద్వారా వారు సాధించింది ఏమిటన్న ప్రశ్న జవాబు లేకుండా మిగిలిపోయింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకోలేని చందంగా వారి రాజీనామాల వ్యవహారం సాగుతోంది. 12 మంది మంత్రులు, 42 మంది శాసనసభ్యులు, 9 మంది లోకసభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుదు, 12 మంది ఎమ్మెల్సీలు ఇంత మంది, ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఒకే ఒక్క రోజున రాజీనామా చేసిన సందర్భం మన రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విషయమే. రానున్న రోజుల్లో ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశాలు కూడా వున్నాయి. అయినా ఇంత సాహసోపేతమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నా దానివల్ల వొనగూడిన ఫలితం మాత్రం అంతంత మాత్రమే కావడం వారి దురదృష్టం. తాబేలు, కుందేలు కధలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ హఠాత్తుగా ఒకడుగు ముందు వేసి మూకుమ్మడి రాజీనామాలు ఇవ్వడంలో తాను ఎంతమాత్రం వెనుకబడిలేనని నిరూపించుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన రాజకీయ మైలేజి కాస్తా టీడీపీ ఖాతాలో జమ పడిపోయింది.

‘ఈ రోజు – జులై నాలుగు. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. తెలంగాణలో రైతాంగ పోరాటం చేసిన చాకలి ఐలమ్మ ప్రాణ త్యాగం చేసిన రోజు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అసువులు బాసిన రోజు ‘ అంటూ తమ రాజీనామాల నిర్ణయాన్ని మీడియాకు వెల్లడిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పంచాయతీరాజ్ శాఖామంత్రి జానారెడ్డి అభివర్ణించారు. కానీ, వీర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో తొలి ఆత్మబలిదానం చేసిన దొడ్డి కొమరయ్య మరణించిన రోజు కూడా అదే అని ఆ సీనియర్ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడుకి గుర్తురాకపోవడం విచిత్రంగా వుందని కొందరు చెవులు కొరుక్కున్నారు.

కారణాలు ఏవయితేనేమి, కారకులు ఎవరయితేనేమి మొత్తం మీద తెలంగాణా ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలు చేసి జులై నాలుగో తేదీకి మరో విశిష్టత సంపాదించి పెట్టారు.

టీ ఆర్ ఎస్ ఆవిర్భావం తరవాత రాజీనామాలనేవి నిత్యకృత్యంగా మారిపోయాయని విమర్శించేవారున్నారు. కాంగ్రెస్ వారికి కూడా కొద్దో గొప్పో ఈ అలవాటు అలవడింది. కాకపొతే వాళ్ల రాజీనామాలు ఆమోదించే స్తాయిదాకా రాకుండానే వెనక్కు తీసుకోవడం జరిగింది. 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీ అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణాకు అనుకూలంగా ప్రకటన చేసిన దరిమిలా ఆ మరునాడే ఆ నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి  చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. డిసెంబర్ 23 వ తేదీన కేంద్ర హోం శాఖ చేసిన మరో ప్రకటనతో మనస్తాపం చెందిన తెలంగాణా ప్రాంతపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా మొత్తం అందరు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఇక ఇప్పడు మళ్ళీ మొన్న జూలై నాలుగో తేదీన మూడోసారి ముచ్చటగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. కాకపొతే ఈసారి ఆ వంతు తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులది కావడం విశేషం.

ఇక్కడ హైదరాబాదులో కాంగ్రెస్ శాసన సభ్యులు, అక్కడ ఢిల్లీ లో పార్లమెంట్ సభ్యులు రాజీనామాల సమర్పణలో చేసిన జాప్యం, పడ్డ మల్లగుల్లాలు ఆ పార్టీకి శోభస్కరంగా లేవు. ట్రాఫిక్ కారణంగా అనుకున్నా సమయానికి లోక్ సభ స్పీకర్ ను కలవలేకపోయామని చెప్పిన కారణాలు కూడా తర్కానికి నిలిచేవిగాలేవు. పైపెచ్చు వారి చిత్తశుద్దిని శంకించేవిగా పరిణమించడం వారి దురదృష్టం. రాజీనామాల విషయంలో వారిలో ఏకాభిప్రాయం కొరవడిందన్న అనుమానాలు రేకెత్తడానికి కారణం ఇదే.

మంచో చెడో తెలుగు దేశం పార్టీ మాత్రం రాజీనామాల విషయంలో ఆఖరు నిమిషంలో అయినా భేషయిన నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు షరతులతో కూడిన సవాళ్లు విసిరినప్పటికీ, కాంగ్రెస్ కంటే ముందే తమ పార్టీకి చెందిన శాసన సభ్యులందరితో రాజీనామాలు ఇప్పించి తెలంగాణా విషయంలో గతంలో ఆ పార్టీపై ముసురుకుని వున్న అనుమాన మేఘాలను కొంతవరకు తొలగించుకోవడంలో జయప్రదమయిందనే చెప్పాలి.

సరే! రాజీనామాలు ఇవ్వడం వరకు జయప్రదంగా జరిగిపోయింది. కానీ, జరగాల్సింది వారి ‘చేతి’లో లేదు. కాంగ్రెస్ అధిష్టానం సయితం సొంత పార్టీవారి ఈ ‘నిరసన’ను అంతగా పట్టించుకున్న దాఖలా కనబడం కనబడడం లేదు. రాజీనామాలకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యతను కూడా అధిష్టానం ఇవ్వడం లేదు. పైపెచ్చు గులాం నబీ ఆజాద్ హైదరాబాదులో ఆడిన నిష్టూరాలనే మరో మారు ఢిల్లీలో వల్లె వేసారు. తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ‘నాన్సెన్స్’ అంటూ కొట్టివేసిన తన వ్యాఖ్యలనే అక్షరం పొల్లుపోకుండా తిరిగి అప్పచెప్పారు. తమ రాజీనామాలతో ఢిల్లీ పెద్దలు దిమ్మతిరిగి దోవకు వస్తారని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్న గంపెడు ఆశలపై కుండెడు నీళ్ళు గుమ్మరించారు. రాజీనామాలపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవడానికి ఏండ్లూ పూండ్లూ పట్టకపోయినప్పటికీ రూలు ప్రకారం పోయినా అంత త్వరగా తెమిలే వ్యవహారం కాదని నిపుణులు చెబుతున్నారు. హీనపక్షం వర్షాకాల సమావేశాల వరకు వేచిచూడక తప్పదు. అలాగే, శాసన సభ్యుల రాజీనామాలు.

మరి ఫలితం వెంటనే ఇవ్వని రాజీనామాలు ఎందుకు ఇచ్చినట్టు?
ఇందులో ఎవరి స్వలాభాలు వారికున్నాయి.

కాంగ్రెస్ వారికి ప్రజలవద్ద మొహం చెల్లుతుంది. ఛీ కొట్టిన జనం చేతనే జై కొట్టించుకునే మహత్తర అవకాశం లభిస్తుంది. అధిష్టానం తమను ప్రతి విషయంలో కించపరుస్తున్న అధిష్టానానికి ఒక ఝలక్ ఇవ్వగలిగామన్న తృప్తి మిగులుతుంది.

‘రెండు కళ్ళ సిద్ధాంతం’ తో ఆత్మరక్షణలో పడిపోయిన తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో మళ్ళీ కాలు కూడ దీసుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది.

‘ఇదిగో తెలంగాణా వస్తోంది, అదిగో వస్తోంది’ అంటూ ఎప్పటికప్పుడు జనాలకు నచ్చచెప్పుకోవాల్సిన పరిస్తితి తెలంగాణా రాష్ట్ర సమితిది. ఇంతపెద్ద సంఖ్యలో శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులచేత- అదీ ఇతర పార్టీలకు చెందిన వారిచేత రాజీనామాలు ఇప్పించగలిగేలా వొత్తిడి తెచ్చిన ఘనత తమదే అని చెప్పుకోవడానికి ఆ పార్టీకి వీలు చిక్కుతుంది.

ఇక - తెలంగాణా సమస్య ఇంత జటిలం కావడానికి మూలకారణమయిన కేంద్రంలోని యూ.పీ.యే. ప్రభుత్వానికి ఈ రాజీనామాల వ్యవహారం మరో విధంగా ఉపయోగపడే అవకాశం వుంది. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ పరిస్తితి చక్కదిద్దలేనంత అధ్వాన్నంగా తయారయిన సంగతి పార్టీ అధిష్టానానికి తెలియని విషయం కాదు. అలాగే, తెలంగాణా అన్నది తక్షణమే పరిష్కరించాల్సినంత ప్రాధాన్య విషయమూ కాదు. ఇవన్నీ పార్టీ అధినాయకత్వం దృష్టిలో అత్యల్ప స్వల్ప విషయాలు. ఎందుకంటె సోనియా నాయకత్వంలో వున్న కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం ఒకటే. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా ఆ పార్టీ నాయకత్వం చేయడం లేదు కూడా. 2014 తరవాత రాహుల్ గాంధీని ప్రధాని పీఠం పై ప్రతిష్టించడం ఒక్కటే ఆ పార్టీ నాయకత్వం ప్రధాన ధ్యేయం. ఆ లక్ష్య సాధనలో తెలంగాణా అంశం ఉపయోగపడుతుందని అంచనాకు వచ్చిన వెంటనే పార్టీ అధిష్టానం పచ్చ జెండా వూపుతుంది. అలా జరిగే అవకాశాలు శూన్యం అనుకున్నప్పుడు ప్రజాభీష్టాన్ని కూడా తోసిరాజని తెలంగాణా అంశాన్ని ఆటకెక్కించడం తధ్యం. రాష్ట్ర విభజన అంశం పరిశీలించేటప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి పెట్టేది ఈ కోణం నుంచే. యెలా చేస్తే ఎక్కువ లోక సభ స్తానాలు గెలుచుకోవడానికి వీలుంటుంది అన్న ఒక్క లెక్క పైనే అన్ని లెక్కలు ఆధారపడివుంటాయి.

ఈ లెక్క తేలగానే అన్నీ తేలిపోతాయి. అది తేలనంతవరకు ప్రస్తుతం సాగుతున్న నాన్చుడు వ్యవహారమే మరికొంత కాలం సాగుతుంది. రాష్ట్రపతి పాలనలు, స్పెషల్ పాకేజీలు రంగప్రవేశం చేస్తాయి.ఎన్నికలకు నిండా మూడేళ్ళ వ్యవధానం వున్న యే అధికార పార్టీ అయినా ఇలానే ఆలోచిస్తుంది. ఎన్నికలప్పుడు చూసుకుందాంలే!

అన్న ధీమాతో ముందుకు అడుగేస్తుంది. ఇక రాజీనామాలా? వాటి పరిష్కారానికి వెయ్యి మార్గాలున్నాయి. బుజ్జగింపులు, లాలింపులు, ఝాడింపులు, బెదిరింపులు. సామదానబేధదండోపాయాలతో సాధించరానిదేదీ లేదన్న సూక్తి రాజకీయాల్లో వున్నవారికి తెలియనిదేమీ కాదుకదా.

అంతవరకూ ఆందోళన బాటలో ప్రజా సంఘాలు, రాజకీయ ప్రయోజనాలు దక్కించుకునే పనిలో రాజకీయ పార్టీలు తలమునకలుగా వుంటాయి. ఒకరిపై మరొకరు ప్రయోగించుకోవడానికి తగినన్ని అస్త్రశస్త్రాలు వారి అంబుల పొదిలో ఎప్పుడూ సిద్ధంగానే వుంటాయి. ఎత్తులు పై ఎత్తులతో వాళ్లు బిజీ. చిక్కులు, చీకాకులతో జనం బిజీ.

అయినా ఎన్నికలు దూరంగా వున్నప్పుడు జనాన్ని దగ్గరకు తీయడం రాజకీయులకు ఇంటావంటా లేని పని. (05-07-2011)

3, జులై 2011, ఆదివారం

వెనుకటి గుణమేలమాను – భండారు శ్రీనివాసరావు


వెనుకటి గుణమేలమాను – భండారు శ్రీనివాసరావు

మునుపటి రోజుల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా తమ అధినాయకులను కలుసుకోవడానికి పడే ప్రయాస అంతా ఇంతా కాదని చెప్పుకునేవారు. ఇక అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీని కలవడం అంటే ముఖ్యమంత్రులకు సయితం బ్రహ్మ ప్రళయంగా వుండేది. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపుకోసం ఎదురుచూస్తూ ఏ పీ భవన్లో మన ముఖ్యమంత్రులు రోజుల తరబడి ఎదురుచూస్తూ పడిగాపులు పడిన సందర్భాలు అనేకం వున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్వ్యూ ఓ పట్టాన దొరక లేదంటే ఇక ఆ ముఖ్యమంత్రికి త్వరలోనే పదవీ గండం తధ్యం అనుకునే వాళ్లు. ఈ నేపధ్యం తెలిసినవారికి ఇప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ విషయంలో చాలా అదృష్ట వంతులనే అభిప్రాయం కలగడంలో వింతేమీ లేదు. ముఖ్యంగా యూ పీ యే - 1 ప్రభుత్వ పాలనాకాలంలో ఈ మార్పు మరింత స్పుఠంగా కానవచ్చింది. సోనియా గాంధీ పట్ల ప్రజల్లో కొంత సానుకూల వైఖరి ప్రబలడానికి ఇది కొంత మేరకు దోహదం చేసింది. ఇందిరాగాంధీతో పోల్చి చూసుకుని సోనియాకు కొన్ని మార్కులు అదనంగా వేయడం కూడా మొదలయింది. కాంగ్రెస్ అధిష్టానం తన సహజ వైఖరి నుంచి క్రమంగా దూరం జరుగుతూ ప్రజాస్వామ్య విలువలకు కొద్ది కొద్దిగా దగ్గరవుతున్నదేమో అన్న భ్రమలు ప్రజల్లో కలగసాగాయి. యూపీయే మొదటి అయిదేళ్ళ పాలన పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవడానికి సోనియా అనుసరించిన ఈ విధానం ఓ మేరకు ఉపయోగ పడిందనే చెప్పాలి. సహజంగా మృదు స్వ భావి, మంచివాడు అని జనసామాన్యంలో మంచి పేరున్న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన మానాన తన పని చేసుకుపోవడానికి కూడా దీనివల్ల వీలు పడింది. మరోవైపు, సోనియా గాంధీ తన అత్తగారు ఇందిరలా పేనుపెత్తనం చేయదన్న మంచి పేరు ఆమె ఖాతాలో జమ పడింది. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను పదేపదే మార్చడం వంటి అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలకు కాంగ్రెస్ అధిష్టానం స్వస్తి చెప్పినట్టేననన్న అభిప్రాయం ప్రజల్లో బలపడడం ప్రారంభమయింది. కీర్తిశేషులు రాజశేఖరరెడ్డి నిరాఘాటంగా మొదటి అయిదేళ్ళ పదవీ కాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకోవడానికి అప్పట్లో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన ఈ మెతక విధానం ఆయనకు బాగా కలసివచ్చిందని అనుకునేవాళ్ళు కూడా వున్నారు. కానీ, ఖండాంతరాలకు తెలుగు ఖ్యాతిని విస్తరిస్తూ తొమ్మిదేళ్ళకు పైగా చంద్రబాబునాయుడు సాగించిన హైటెక్ పాలనకు ప్రజలు స్వస్తివాక్యం పలికేలా చేయడంలో రాజశేఖరరెడ్డి జరిపిన పాదయాత్ర, ప్రజాసమస్యలపై ఆయన చేసిన నిరంతర పోరాటాలు చాలావరకు ఉపయోగపపడ్డాయనడం వాస్తవానికి దగ్గరగా వుంటుంది.

సరే! ముఖ్యమంత్రుల హస్తిన యాత్రలు గురించి చెప్పుకోవాలంటే ఆ నాటి ముఖ్యమంత్రి రామారావు గురించి గుర్తుచేసుకోవాలి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్తాయిలో రాజకీయ శక్తుల ఏకీకరణకు ఆయన చేసిన ప్రయత్నాలు ఇన్నీ అన్నీ కావు. ఎన్టీయార్ దురదృష్టం ఏమిటంటే ఆయన ముఖ్యమంత్రిగా వున్నన్ని రోజులూ

కేంద్రంలో ఆయనతో ఏమాత్రం పొసగని ఉప్పు నిప్పు లాటి కాంగ్రెస్ ఏలుబడి వుండేది. ఒక వేళ ఢిల్లీ యాత్ర పెట్టుకున్నా, అక్కడ వున్నసమయమంతా ప్రతిపక్ష పార్టీల అగ్రనాయకులను కలుసుకుని సంప్రదింపులు జరపడంలోనే గడిచిపోయేది. ప్రధానమంత్రిని కానీ, కేంద్ర మంత్రులను కానీ కలుసుకోవాల్సివచ్చినా అది కేవలం మొక్కుబడిగా సాగిపోయేది. అయితే, ఆయన ఢిల్లీ లో ఎంతటి వున్నత స్తానంలో వున్న వ్యక్తులను కలుసుకోవాలని అనుకున్నాకానీ వేచిచూడాల్సిన అవసరం ఆయనకు ఎంతమాత్రం వుండేది కాదు. ముందుగా నిర్దేశించుకున్న అప్పాయింట్ మెంట్ల ప్రకారం ఎన్టీయార్ తన ఢిల్లీ పర్యటనను అనుకున్న వ్యవధిలో, అనుకున్న పద్ధతిలో ముగించుకుని తిరిగి వచ్చేవారు.

పోతే, ఆ తరువాత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన చంద్రబాబు నాయుడుకి మరింత చక్కని వెసులుబాటు లభించింది. ఎవరు ప్రధానిగా వున్నా, కేంద్ర ప్రభుత్వం ఆయన కనుసన్నల్లో నడిచేదే కాబట్టి ఢిల్లీలో పనులు చక్కబెట్టుకురావడం అన్నది ఆయనకు నల్లేరుపై బండి నడకలా వుండేది. ఎన్టీయార్ వొదిలివెళ్ళిన కాంగ్రెస్ వ్యతిరేక వారసత్వం పుణ్యమా అని ఢిల్లీ లోని ఏలికలందరూ చంద్రబాబు మాటకు ఎదురుచేప్పే సాహసం చేసేవారు కాదు. అందుకే దేశరాజకీయాల్లో చక్రం తిప్పగల సమర్దుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

ఇక రాజశేఖరరెడ్డి విషయానికి వస్తే – ఆయన అధికారంలోకి వచ్చేసమయానికి ఢిల్లీ స్తాయిలో కాంగ్రెస్ అధిష్టానం తీరుతెన్నులే సమూలంగా మారిపోయాయి. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తరచూ మార్చే దుష్ట సంస్కృతికి సోనియా గాంధీ మంగళం పాడారు. కాంగ్రెస్ బలానికి తన సొంత బలాన్ని జోడించి, ప్రజలను కాంగ్రెస్ దిక్కుగా మళ్లించి ఇక కాంగ్రెస్ కు రాష్ట్రం లో పుట్టగతులు లేకుండా పోయాయని  అనుకుంటున్న విపత్కర తరుణంలో తెలుగు దేశాన్ని ఓడించి కాంగ్రెస్ కు మళ్ళీ పట్టం కట్టించిన వీరుడిగా అధిష్టానం మెప్పును రాజశేఖరరెడ్డి పొందగలిగారు. అందుకే మరోమాట లేకుండా పార్టీ అధినేత్రి ఆయనకు రాష్ట్ర పాలనా పగ్గాలను అందించారు. ఢిల్లీ పెద్దల అనుగ్రహం పూర్తిగా వుండడంతో రాష్ట్రంలో ప్రత్యేకించి సొంత పార్టీలో వైఎస్సార్ కు ఎదురుచెప్పేవారు లేకుండా పోయారు. కాంగ్రెస్ సంస్కృతిలో భాగమయిన అసంతృప్తి వెల్లుబికి వెల్లువెత్తకుండా నిరోధించగలిగారు. అక్కడక్కడా, అప్పుడప్పుడూ కొందరు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సన్నాయి నొక్కులు నొక్కడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అసంతృప్తి సెగలు ఢిల్లీ వరకు సోకకుండా ఒక స్తాయిలోనే అణిగిపోయాయి.

రాజశేఖరరెడ్డి మొదటి అయిదేళ్ళ పాలన అధిష్టానం జోక్యం అంతగా లేకుండానే అవిచ్చిన్నంగా సాగిపోయింది. వైఎస్సార్ 2004 లో కాకుండా అంతకుముందే అవకాశం లభించి ముఖ్యమంత్రి అయివుంటే గతంలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మాదిరిగానే ఒకటి రెండేళ్లు పాలించి మాజీ ముఖ్యమంత్రుల జాబితాలో చేరిపోవాల్సి వచ్చేదని భావించేవాళ్ళున్నారు. సరయిన సమయంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం వల్లనే ఆయనకు పూర్తి అయిదేళ్ల కాలం పరిపాలించగల అవకాశం చిక్కింది. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్ అధిష్టానం తన వైఖరిని ఎంతో కొంత మార్చుకోవడమే దీనికి కారణం.

రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం తరువాత కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. అప్పటికే వైఎస్సార్ అధినేత్రికి చెక్ చెప్పగల స్తాయినీ, స్తోమతనూ సముపార్జించుకున్నాడన్న సమాచారాన్ని ఆయనంటే గిట్టని కొందరు ఢిల్లీకి చేరవేయడంతో వైఎస్ మరణంతో లభించిన అవకాశాన్ని తనకనుకూలంగా మార్చుకునే చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగానే మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు వుందని పరోక్షంగా ప్రకటించుకున్న వైఎస్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ని పక్కన బెట్టి రోశయ్యను ముఖ్యమంత్రి గద్దె ఎక్కించింది. అది తాత్కాలికమయిన ఏర్పాటు కావచ్చన్న భ్రమలో జగన్ వర్గం – తాను తాత్కాలిక ముఖ్యమంత్రినే అన్న భావనలో రోశయ్య వుండగానే అధిష్టానం చకచక పావులు కదిపి  రాజశేఖరరెడ్డి కాలంలో  రాష్ట్ర పార్టీపై తాను కోల్పోయిన పాత పెత్తనాన్ని తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకునే ఎత్తుగడలకు పూనుకుంది. రోశయ్యను మార్చి ఆ స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టి, మళ్ళీ వెనుకటి విధానాలకే మళ్లి పోతున్న సంకేతాలను ఇచ్చింది. దానితో, ఇక కుదిరేపనికాదనుకున్న జగన్ సొంత కుంపటి పెట్టి కడప ఉపఎన్నికల్లో చావుదెబ్బ కొట్టడంతో దిమ్మతిరిగి తెప్పరిల్లిన ఢిల్లీ మేధావులు తమ మేధస్సులకు పనిపెట్టి, పదును పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కాయకల్ప చికిత్స మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే, చిరంజీవి పార్టీకి మంగళం పాడించి ఆయనకు కాంగ్రెస్ తీర్ధం ఇవ్వడం, బొత్స సత్యనారాయణకు పీసీసీ పీఠం అప్పగించడం, డిప్యూటీ స్ప్పీకర్ నాదెండ్ల మనోహర్ కు స్పీకర్ గా పదోన్నతి కల్పించడం, తెలంగాణాకు చెందిన ఎస్ స్సీ కాంగ్రెస్ నాయకులు రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి, మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడం మొదలయిన చర్యలన్నీ రాకెట్ వేగంతో తీసుకున్నారు.

కానీ ఎన్ని చేసినా ఏదో ఇంకా మిగిలి పోయిందన్న గుబులే కాంగ్రెస్ ను పట్టి పీడిస్తోంది. జగన్ సమస్యకు పరిష్కారం కనుగొనగలుగుతామన్న ఆశ మినుకు మినుకుమంటూ వుండగానే తెలంగాణా అంశం పీకలమీదకు వచ్చింది. దాంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరోమారు హస్తిన సందర్శన తప్పలేదు. ఢిల్లీలో సోనియాతో సహా అధినాయకులనందరినీ కలిసి వచ్చానన్న సంతోషం ఆయనకు ఎంతో సేపు నిలవలేదు. ఈ లోగా, తెలంగాణా కాంగ్రెస్ నాయకులందరూ హైదరాబాదులోని ఎగ్జిబిషన్ మైదానంలో సమావేశమై ఈ నెల నాలుగో తేదీన మూకుమ్మడి రాజీనామాలు ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కే అందచేస్తామని మరో ఆఖరు గడువుతో పాటు ఆఖరి అస్త్రాన్ని కూడా ఒక్కుమ్మడిగా సంధించారు. ప్రత్యేక తెలంగాణా విషయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీ ప్రకటనకే కేంద్రం కట్టుబడి వుండాలని, తెలంగాణా ఏర్పాటు మినహా తమకు మరేదీ సమ్మతం కాదనీ వారు తెగేసి చెప్పారు. ఈ వ్యవహారం తెగేదాకా సాగుతుందో, తెగకుండానే మరో ముడి పడుతుందో హైదరాబాద్ వచ్చివెళ్ళిన రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ కే తెలియాలి. (01-07-2011)


1, జులై 2011, శుక్రవారం

గాయత్రి మంత్ర అంతరార్ధం – భండారు శ్రీనివాసరావు

గాయత్రి మంత్ర అంతరార్ధం – భండారు శ్రీనివాసరావు



ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం


భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్



‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం

గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.

ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రం లోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం ఇలా చెబుతారు.

• ఓం – భగవంతుడు సర్వ రక్షకుడు.

• భూ: - ఉనికి కలిగినవాడు

• భువః – జ్ఞాన రూపుడు

• స్వః – ఆనంద స్వరూపుడు అంటే దుఖః రహితుడు

• తత్ – అటువంటి లక్షణాలు కలిగిన పరమేశ్వరుడు

• సవితు: - ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త

• వరేణ్యం – అందరితో ఆరాధింపబడేవాడు

• భర్గః – పరిశుద్ధుడు

• దేవస్యః – ఆవిధమయిన దివ్య గుణములు కలిగిన దైవ స్వరూపుడు

• ధీమహి – ఆత్మలో ఎకమయిన

• యః – ఆ పరమేశ్వరుడు

• నః ధ్యః – మా బుద్ధులను

• ప్రచోదయాత్ – సత్కర్మలలో ప్రేరేపించి శ్రేయస్సు పొందేవిదంగా సమర్ధులను చేయుగాక.

ఇక మూలార్ధం తీసుకుంటే దాని భావం ఇలా వుంటుంది.

“ఓ భగవాన్!
ఏకకాలంలో సమస్త ప్రదేశాలలో వుండగలిగిన ఓ విశ్వరూపీ! అపరిమితమయిన శక్తికలిగిన ధీశాలీ! పరమేశ్వరా!
ఈ చరాచర ప్రపంచంలో లభ్యమయ్యే సమస్త జ్ఞానం నువ్వే. సర్వ ప్రకాశానివి నువ్వే. వరప్రదాతవు నువ్వే.
మాలో భయాన్ని పోగొట్టేది నువ్వే. ఈ విశ్వానికి సృష్టికర్తవు నువ్వే. సర్వోత్తముడివి నువ్వే. శిరసు వంచి నమస్కరిస్తున్నాము. మా మనస్సు, మేధస్సు సత్కర్మలవైపు ఆకర్షించబడేలా చూస్తూ సన్మార్గంలో నడిచేలా మాకు మార్గం చూపు.”

గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి.

ఆదునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి.

ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.

మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.

• ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)

ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.

గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి.
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం.

అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.

ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.

తత్స వితుర్వరేణ్యం

తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.

ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు.

ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.

ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు.  విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే.

గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు.

భర్గో దేవస్య ధీమహి

భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు.
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.

దియోయోనః ప్రచోదయాత్

ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.

ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.

భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.

కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.


ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః –రిగ్వేద

(అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)- (29-06-2011)