12, ఫిబ్రవరి 2011, శనివారం

విశ్వాసమా! విలీనమా! - భండారు శ్రీనివాసరావు

విశ్వాసమా! విలీనమా! - భండారు శ్రీనివాసరావు


ఎన్నికల సీజనులో అవసరార్ధం ‘తోక పార్టీలు’ పుట్టుకొస్తుంటాయి. ఒక్కోసారి అసలు పార్టీలకన్నా ఈ తోక పార్టీల హవా ఎక్కువగా వుంటుంది. తోక పదం బాగాలేదనుకున్నారో ఏమో కానీ ఈ మధ్య వీటిని బ్రాంచ్ ఆఫీసులని పిలుస్తున్నారు. కాంగ్రెస్ ను మధ్య పెట్టుకుని, టీ ఆర్ ఎస్, టీ డీ పీ నడుమ సాగిన ఈ బ్రాంచ్ ఆఫీసుల గొడవ మీడియా పుణ్యమా అని గంటల్లోనే ముదిరిపోయి, చివరకి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మెడకు చుట్టుకునేలావుంది.

కాంగ్రెస్, టీ ఆర్ ఎస్ నడుమ లోపాయకారీ వొప్పందం వున్నట్టు తెలుగుదేశం నాయకుడు ఒకరు చేసిన ఆరోపణ- టీ ఆర్ ఎస్ అధినేతను ఎక్కడ తాకకూడదో అక్కడే తాకింది. టీ ఆర్ ఎస్ పార్టీ, కాంగ్రెస్ కు బ్రాంచ్ ఆఫీసుగా తయారయిందని టీ డీ పీ చేసిన ఆరోపణనీ, చిరంజీవి తరహాలోనే టీ ఆర్ ఎస్ కూడా కాంగ్రెస్ లో కలిసిపోతుందని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు పదేపదే చేస్తున్న ప్రకటనలను ఆయన జీర్ణించుకోలేకపోయారు. మాటల తూటాలు పేల్చడంలో చంద్రశేఖరరావుని మించిన రాజకీయ నాయకుడు రాష్ట్రంలో మరొకరు లేరు. తనదయిన తరహాలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి ఓ సవాలు విసిరారు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయి, సీమాంధ్రలో జగన్ కు చెక్ పెట్టడానికీ, ఇటు తెలంగాణా వాదాన్నిదెబ్బతీయడానికీ లోపాయకారీ వొప్పందం కుదుర్చుకున్నారని ప్రత్యారోపణ చేసారు. వచ్చేవారం మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాల్లో, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెడతామని, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా చెప్పుకుంటున్న టీ డీ పీకి ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా ఆ తీర్మానాన్ని సమర్ధించాలంటూ చంద్రశేఖరరావు బంతిని మళ్ళీ టీడీపీ కోర్టులోకే గిరాటు వేసారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీ డీ పీ కి ఈ సవాలుతో గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రధాన ప్రతిపక్షంగా దాన్ని సమర్ధించాల్సి వస్తుంది. టీడీపీ మద్దతు వుంటే తీర్మానం నెగ్గడం ఖాయం. నెగ్గితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం మరింత ఖాయం. ప్రభుత్వం పడిపోయి రాష్ట్రపతి పాలన వొచ్చినా, లేక మరికొన్నాళ్లకు మధ్యంతర ఎన్నికలు వచ్చినా దానివల్ల ఇటు తెలుగు దేశానికి కానీ, అటూ కాంగ్రెస్ కు కానీ ఒరిగేదేమీ వుండదు. ఆ పార్టీలనుంచి ఎన్నికయిన వారెవ్వరూ ఇంత త్వరగా మరో మారు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఎన్నికలంటూ వస్తే కొద్దో గొప్పో ఉపయోగం జగన్ పెట్టబోయే పార్టీకి కానీ, తెలంగాణలో టీ ఆర్ ఎస్ కు కానీ వుంటుంది. ఇవన్నీ గ్రహించిన టీడీపీ నాయకులు నష్ట నివారణ ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే టీ ఆర్ ఎస్ కు కనీసం ముప్పయి మంది శాసన సభ్యుల బలం వుండాలని, కేవలం పదకొండుమంది సభ్యులను పెట్టుకుని చేతకాని సవాళ్లు విసురుతోందనీ వాళ్ళు ఎదురుదాడి ప్రారంభించారు. ఈ వాద ప్రతివాదాలు ప్రకటనల వరకే పరిమితం అయితే పరవాలేదు. కానీ, అసెంబ్లీ దాకా చేరినప్పుడు పరిణామాలు ఆసక్తికరంగానే కాకుండా, అనూహ్యంగా కూడా వుండే అవకాశం వుంటుంది.(12-02-2011)