వినదగునెవ్వరు చెప్పిన – భండారు శ్రీనివాసరావు
మీ మనసు మీ చెప్పుచేతల్లో వున్నంతకాలం అది మీకు మంచి స్నేహితురాలే. కానీ, ఎప్పుడయితే అది మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటుందో ఆ క్షణం నుంచి దాన్ని మించిన శత్రువు మీకు మరోటి వుండదు. – భగవద్గీత
విజేతలందరూ అనుకునే మాట ఒకటుంది.అదేమిటంటే:
‘పందెం ఇంకా పూర్తికాలేదు, ఎందుకంటె నేనింకా దాన్ని గెలవలేదు గనుక’
ప్రపంచాన్ని వొదిలిపెట్టినప్పుడు స్వర్గానికి వెళ్ళాలనుకోవడం కంటే, లోకాన్ని విడిచిపెట్టి వెళ్లేముందే నలుగురికోసం స్వర్గాన్ని నిర్మించగలిగితే అర్ధం పరమార్ధం రెండూ సిద్ధిస్తాయి.
అలారం కనుక్కున్నదెవరోకానీ, వాడు చాలా చురుకయినవాడయి వుంటాడు. దాని నోరు నొక్కేయడం కనుక్కున్నవాడు మాత్రం పరమ బద్ధకస్తుడు అయి వుంటాడు.
ఏమి సాధించాలి అన్న దానికి పరిమితులు పెట్టుకోనంతకాలం అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలం అన్నదృఢ నమ్మకాన్ని మీ తోటివారిలో కలిగించగలుగుతారు.
అబ్దుల్ కలాం గారిని ఎవరో అడిగారు ‘విషం అంటే ఏమిటి? అని. దానికి కలాం గారిచ్చిన సమాధానం ఎంత గొప్పగా వుందో చూడండి. ‘మితి మించినదేదయినా సరే అది కాలకూటవిషం కంటే ప్రమాదమే’
ఇతరుల గురించి తెలుసుకోవడం మేధావితనమే కానీ ఇతరులచేత వారిచేతనయిన పని చేయించుకోవడం మరింత తెలివికలిగిన పని అవుతుంది.
అలాగే, మన గురించి మనం తెలుసుకోవడం వివేకం. మనల్ని మనం కట్టడి చేసుకోవడం నిజమయిన బలం అవుతుంది.
మనిషి జీవితంలో మధుర ఘట్టాలు మళ్ళీ మళ్ళీ రావు. కానీ, స్నేహితులతో గడిపిన అద్భుత క్షణాలు, వారి స్మృతులు గుండెల్లో కలకాలం పదిలంగా వుండి పోతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి