16, జనవరి 2011, ఆదివారం

దేవుడిదే భారం - భండారు శ్రీనివాసరావు

దేవుడిదే భారం - భండారు శ్రీనివాసరావు


ఏమి జరుగుతున్నదో తెలియదు. ఏదో జరగబోతున్నదని తెలుసు.

చుట్టూ చిమ్మ చీకటి. చుట్టూతా కీకారణ్యం.

మండల దీక్ష ముగించి, దైవదర్శనం చేసుకుని, మకర జ్యోతిని కళ్ళారా తిలకించి, ఆ తృప్తిని గుండెల్లో పదిలం చేసుకుని ఇంటి ముఖం పట్టిన వారందరికీ –

ఏమి జరుగుతున్నదో తెలియదు. ఏదో జరగబోతున్నదని మాత్రం తెలుసు.

లిప్త మాత్రంలో జరగరానిది జరిగిపోయింది. కాల యముడు పాశం విసిరాడు. వందకు పైగా ప్రాణాలు గాలిలో కలిసాయి.

ఎక్కడివాళ్లో వాళ్ళు. ఎక్కడెక్కడి వాళ్లో వాళ్ళు. దేవుడి పేరుతొ అక్కడ కలిసారు. ఆ దేవుడిలోనే కలిసిపోయారు.

ఈ మరణాలకు ఎవరు కారణం? ఈ దారుణానికి ఎవరిది బాధ్యత?

ఈ ఏడాది శబరిమల సందర్శించిన అయ్యప్పలు అరవై లక్షలమంది అని అంచనా. ఏటేటా ఈ సంఖ్య పెరుగుతూనే వస్తోంది.

అసలే క్లిష్టమయిన దీక్ష. అతి క్లిష్టమయిన యాత్ర. అయినా భక్తులకు ఇవేమీ అడ్డుకాదు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు పాతిక ముప్పయ్యేళ్లనుంచి ప్రతియేటా ఈ దీక్షాధారణ చేస్తున్నవారు వేల సంఖ్యలో వుంటూ వస్తున్నారు. స్వామియే శరణమంటూ వివిధ రాష్ట్రాలనుంచి ఏటా శబరిమలకు ప్రయాణం కడుతున్నారు. దుర్గామారణ్యం నడుమ సాగే ఈ యాత్రలో ఎన్నో అవరోధాలు, వూహించని ప్రమాదాలు సహజం. రోడ్డు ప్రమాద ఘటనల్లో అయ్యప్పల మృతి గురించిన వార్తలు ప్రతి ఏటా వింటూనే వున్నాం. కానీ ఈసారి జరిగిన దుర్ఘటన కనీ వినీ ఎరుగనిది. యాత్ర ముగించుకుని కొండవాలు మీదుగా సన్నటి కాలిబాటలో నడుచుకుంటూ వెడుతున్న భక్తుల బృందంపై వెనుకనుంచి ఒక వాహనం దూసుకురావడం, దానితో భీతావహులయిన యాత్రీకులు చెల్లాచెదరుగా పరుగులు తీయడం, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో అనేకమంది ఊపిరాడక కనుమూయడం అంతా కనుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. అంతవరకూ అయ్యప్ప నామస్మరణలతో మార్మోగిన లోయ యావత్తూ ఆ నిశీధిలో ఆందోళనకు గురయిన భక్తులు చేసే హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో వందమందికి పైగా చనిపోయినట్టు ప్రాధమిక సమాచారం. తొక్కిసలాటలో లోయలోకి కొందరు పడిపోయివుంటారని వేస్తున్న అంచనాలు నిజమయిన పక్షంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. ఇక క్షతగాత్రుల సంఖ్య రెండువందలకు మించే వీలుందని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో దాదాపు ఇరవై మంది మన రాష్ట్రానికి చెందినవారే వున్నారు.

దుర్ఘటన సమాచారం అందగానే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం సయితం స్పందించింది. జాతీయ విపత్తుగా పరిగణించింది. సైనిక దళాలను సహాయ కార్యక్రమాలకు నియోగించింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్ధిక సాయం ప్రకటించింది.

ఇవన్నీ కంటి తుడుపు చర్యలని కొట్టి పారేయడం సబబు కాదు. అలాగని ప్రభుత్వాలు చేయగలిగినదంతా చేసాయని కూడా చెప్పలేము. జరిగినదానికి స్పందించిన మాట నిజమే. కానీ ఇలాటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆలోచన చేసివుంటే మరింత బాగుండేది.

శబరిమలకు ఏటా ఒక నిర్ణీత సమయంలోనే యాత్రీకుల రద్దీ వుంటుంది. అందువల్ల మిగిలిన దేవాలయాల విషయంలో కంటే ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకోవడానికి ఎక్కువ వీలుంటుంది. క్రమబద్ధమయిన ప్రణాళికా రచనకు, దాని అమలుకు అధికారులకు మరింత వెసులుబాటు వుంటుంది.

పర్యావరణానికి చేటు కలగకుండా కొండ వాలుల్లో కాలిబాటలను ప్రమాద రహితంగా తీర్చిదిద్దడానికి తగిన వ్యవధానం, అంటే మిగిలిన దేవస్తానాలతో పోలిస్తే ఏటిపొడుగునా భక్తుల రద్దీ లేని ప్రత్యేక పరిస్తితి ఈ క్షేత్రానికి వుంది. ఆదాయానికి కొదువ లేని దేవస్తానం కాబట్టి చేపట్టే పధకాలకు నిధుల కొరత వుండే అవకాశం లేదు. కావాల్సినదల్లా కాస్త చిత్తశుద్ధి. సాయపడాలనే మంచి బుద్ధి.

దీనికి చిన్న ఉదాహరణ నా అనుభవంలోనే వుంది. ఎనభయ్యవ దశకం చివర్లో నేను మాస్కోలో వున్నప్పుడు గమనించేవాడిని. పెద్ద పెద్ద ఆటలపోటీలు జరిగినప్పుడు, భారీ ఎత్తున జనాలు తరలివచ్చే వీలున్న కార్యక్రమాలు నిర్వహించినప్పుడు, మిలీషియా (పోలీసులు) చక్కటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవాళ్ళు. స్టేడియంలనుంచి దాపునవున్న మెట్రో రైల్వే స్టేషన్ల వరకు కొన్ని వందలమంది పోలీసులు తాళ్ళు పట్టుకుని వచ్చిపోయేవారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, తోపులాటలకు అవకాశం లేకుండా, కొన్ని వేలమంది ప్రేక్షకుల రాకపోకలను క్రమబద్ధం చేసే తీరు ప్రసంశనీయంగా వుండేది.

మనదగ్గరో. జనసందోహాలను అదుపు చేయడం అంటే లాఠీలు ఝలిపించడమే. (16-01-2011)

4 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

అసలు ఆ దృశ్యాన్ని ఊహించుకోవాలంటే కూడా ధైర్యం చాలడం లేదు. ప్రత్య్క్ష సాక్షులు షాక్ తిన్నారంటే తినరూ?

సంఘటన జరిగిన తరవాత సామాన్య మానవులు కూడా స్పందిస్తారండీ. రైలు ప్రమాదాల వంటివి జరిగినపుడు చూస్తుంటాం కదా!

మీరన్నట్లు ఏడాది పొడుగునా రద్దీ లేని క్షేత్రం కాబట్టి, లక్షల మంది వస్తారని ముందే తెలుసు కాబట్టి, కాస్త చిత్త శుద్ధితో ప్రయత్నిస్తే ఇలాంటి తొక్కిసలాటల్ని, ప్రమాదాలను నివారించలేరా?

నిన్న ఒకరు "వాళ్ళందరికీ సామూహిక ముక్తి ప్రసాదించాడు దేవుడు" అంటే భయమేసింది నాకు! ముక్తి...ఇలాగా? అని!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

నా భావాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్నారు సుజాత గారు – ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

@ఏటా ఒక నిర్ణీత సమయంలోనే యాత్రీకుల రద్దీ వుంటుంది. అందువల్ల మిగిలిన దేవాలయాల విషయంలో కంటే ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా తీసుకోవడానికి ఎక్కువ వీలుంటుంది.....
కానీ తీస్కోరు...ఇప్పుడే కాదండి ...ఇంకో వందేళ్ళు అయినా కూడా పరిస్తితులు ఇలానే ఉంటాయి ..మారతాయన్న ఆశ వదిలేయండి .....

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

thanks kvsv garu -bhandaru srinivasrao