3, జనవరి 2011, సోమవారం

అయినను పోయి రావలయు హస్తినకు - భండారు శ్రీనివాసరావు

అయినను పోయి రావలయు హస్తినకు - భండారు శ్రీనివాసరావు


నేడే విడుదల – రేపే ఆఖరి రోజు - ఇవ్వాళే చూడండి - అనే తీరులో రేపేం జరగబోతోంది అనే దానికి ‘గడువు తేదీలు’ మారిపోతున్నాయి.

డిసెంబర్ 31 తరవాత ఏమిటి అనే ప్రశ్న స్తానంలో, జనవరి ఆరో తేదీ తదుపరి ఏమిజరగబోతుందనే మరో ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. గడువుకు ఒకరోజు ముందే శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోం మంత్రికి అందచేసి తన పని పూర్తిచేసుకుంటే, ఆరో తేదీ సమావేశం పేరుతొ కేంద్ర హోం మంత్రి శ్రీ చిదంబరం మరో గడువు పెట్టారు. కొన్నేళ్లుగా రాష్ట్రాన్ని పట్టి కుదుపుతున్న తెలంగాణా అంశంపై సమగ్ర అధ్యనం చేయడానికి కేంద్రం నియమించిన శ్రీ కృష్ణ కమిటీ తనకు ఇచ్చిన గడువులోపలె నివేదిక రూపొందించి కేంద్రానికి అందించింది. తన నివేదిక ఆంద్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలవారికి తృప్తి కలిగించే విధంగా వుంటుందని పేర్కొంటూ ఆ కమిటీ - ఆరు వందల పేజీల నివేదిక సారాన్ని ఒక్క ముక్కలో చెప్పి చేతులు దులుపుకుంది. ముందే రాసిపెట్టుకున్న స్క్రీన్ ప్లే మాదిరిగా నివేదిక చేతిలోకి రాగానే ఒక్క క్షణం కూడా ఆలశ్యం చేయకుండా జనవరి ఆరో తేదీన రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీలను పేరు పేరునా కేంద్ర హోం మంత్రి ఆహ్వానించడం,పార్టీకి ఇద్దరు చొప్పున రావాలని ఆహ్వానాలు పంపడం అంతే వేగంగా జరిగిపోయింది. ఆహ్వానం అందుకున్నప్పుడు ఆహా ఓహో అన్న కొన్ని పార్టీలు పునరాలోచనలో పడి సన్నాయి నొక్కులు ప్రారంభించాయి. ఆరో తేదీకి ముందుగానే హస్తిన వెడుతున్నట్టు ప్రకటించిన కేసీఆర్ ఆ తరువాత ఢిల్లీ సమావేశం తెలంగాణాపై కాలయాపనకు ఉద్దేశించినదిగా భావించి కేంద్రం ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశం వల్ల తెలంగాణాను కోరుతున్న వారికి ఒనగూరేదేమీ లేదన్నది ఆ పార్టీ ఉద్దేశ్యం గా తోస్తోంది. అందుకే కేంద్రం పిలుపుని తిరస్కరించాలని ఇతర పార్టీలకు కూడా ఆ పార్టీ పిలుపు ఇచ్చింది. ఢిల్లీ సమావేశానికి పార్టీకి ఇద్దరిద్దరు చొప్పున పిలవడాన్నికూడా ఈ పార్టీ తప్పుపడుతోంది. చట్టసభలలో మాదిరిగా ఈ అంశంపై వోటింగ్ జరిపి అక్కడికక్కడే మెజారిటీ ప్రకారం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోయినప్పటికీ - టీ ఆర్ ఎస్ ఈ పాయింట్ లేవదీయడం లోని హేతుబద్ధతను కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణాకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క స్వరం కూడా ఢిల్లీ సమావేశంలో వినబడకూడదన్నది ఆ పార్టీ ఉద్దేశ్యం కాబోలని వారు విశ్లేషిస్తున్నారు.

సరే! డిసెంబర్ 31 వచ్చి వెళ్ళినట్టే జనవరి ఆరో తేదీ కూడా వస్తుంది. పిలుపు అందుకున్న పార్టీలన్నీ కాకపోయినా కొన్ని పార్టీలయినా ఆ భేటీకి తమ ప్రతినిధులను పంపుతాయి. అందరికీ నివేదిక కాపీలు ఇస్తారు. బహుశా నివేదిక సారాంశం ప్రతిని కూడా జతచేస్తారు. వివిధ పక్షాల అభిప్రాయాలు కోరతారు. కాంగ్రెస్, టీడీపీ మినహా సమావేశానికి హాజరయ్యే మిగిలిన పార్టీలది నిర్ణయాత్మక పాత్ర కాదు కనుక వాటికి తమ పార్టీ వైఖరిని మరో సారి పునరుద్ఘాటించడం తప్ప మరో రకమయిన కార్యాచరణకు పూనుకునే ఉద్దేశ్యం వుండక పోవచ్చు. కాంగ్రెస్, టీడీపీలకు ఈ వెసులుబాటు లేదు. అయితే, మామూలుగా కోర్టు తీర్పుల విషయంలో మాదిరిగానే వాటి స్పందన వుండవచ్చు. వ్యతిరేకంగా వస్తే, పూర్తి పాఠం చదివినతరువాతగానీ వ్యాఖ్యానించలేమని చెప్పినట్టు చెప్పేసి అప్పటికి తప్పించుకోవచ్చు. కానీ తెలంగాణా విషయంలో విస్పష్టమయిన వైఖరి వెల్లడించాలని ఆ రెండు పార్టీలకు విపక్షాలనుంచి ఎదురవుతున్న వొత్తిడి మరింత పెరుగుతుంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన తమ పార్టీ వారినుంచి వొత్తిళ్ళు వున్నప్పటికీ సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్నందువల్లా, మధ్యంతరం వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం తమ చేతులోనే వున్నందువల్లా కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ కంటే కొంత తీరుబాటుగా వ్యవహరించే వీలుంది. కానీ శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ ఏవిధంగా వచ్చినా ఇరకాటాన పడేది మాత్రం టీడీపీనే. ఏది ఎలావున్నా, కొంచెం హెచ్చుతగ్గులుగా ఈ రెండు పార్టీల్లోనే ఆరో తేదీ గురించిన ఆందోళనలు మొదలయ్యాయన్నది కానవస్తూనేవుంది. తెలంగాణాకు చెందిన కాంగ్రెస్ ఎంపీల సమావేశాలు, నాగం వంటి టీడీపీ అధినాయకుల ప్రకటనలు ఈ వాస్తవానికి అద్దం పడుతున్నాయి. తెలంగాణాకు చెందిన ఈ రెండు పార్టీల నాయకులు, పైకి గాంభీర్యం ప్రదర్శిస్తూ వున్నప్పటికీ, అనుచరగణం నుంచి వస్తున్న వొత్తిళ్ళు వారిని తీవ్రమయిన వొత్తిడికి గురి చేస్తున్నాయని ఆంతరంగిక సమావేశాల్లో బాహాటంగా వొప్పుకుంటున్నారు. తెలంగాణా కాంగ్రెస్ నాయకులది ఒక విచిత్రమయిన పరిస్తితి. అధిష్టానం మనసులో ఏముందో వారికి తెలియదు. ఢిల్లీ పెద్దల వ్యూహాలు ఏమిటో తెలియదు. కార్యకర్తలనుంచి వొస్తున్న వొత్తిళ్ల గురించి పై వారికి చెప్పుకోలేరు. వారికి తెలిసినదల్లా ‘అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి వుంటాం, శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ కి కట్టుబడి వుంటాం’ అని అప్పుడప్పుడు మొక్కుబడి ప్రకటనలు చేయడం. కాకపొతే, కేకే వంటి సీనియర్ నాయకులు ‘తెలంగాణా ఇవ్వకపోతే సీ డబ్ల్యు సీ పదవిని మూలకు విసిరి పారేస్తాన’ని బహిరంగ వేదికలపై ప్రకటించడం కేడర్ ను ఏమాత్రం సంతృప్తి పరుస్తుందో వేచి చూడాలి. ఇలాటి వ్యాఖ్యలను అధిష్టానంపై తిరుగుబాటుగా పరిగణిస్తారా లేక తెలంగాణా అంశం తమ చేజారి పోకుండా - ఇదంతా పైనుంచి ఢిల్లీ పెద్దలు ఆడిస్తున్న నాటకంలో ఒక భాగమా అని అనుమానిస్తున్నవారు కూడా లేకపోలేదు.

ఇక టీడీపీ – ఈ పార్టీ పని అయిపొయింది, నాయకత్వం మార్పుకోసం పార్టీలోనే చర్చలు సాగుతున్నాయి అనే వదంతుల నడుమ – ఈ ఆరో తేదీ ఆ పార్టీ నెత్తి మీద కత్తిలా వేలాడుతోంది. రైతుల సమస్యమీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎనిమిది రోజుల నిరాహారదీక్ష చేసి జాతీయ స్తాయిలో కూడగట్టుకున్న ప్రతిపక్ష పార్టీల సంఘీభావం రాజకీయ ఫలితాలు ఇవ్వకముందే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక రూపంలో అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. తెలంగాణా ప్రాంతానికి చెందిన కొందరు నాయకుల నుంచి వినవస్తున్న ధిక్కార స్వరాలు - ఆరో తేదీకి ముందు ఆ పార్టీకి ఆందోళనకరంగా మారాయి.

అలాగని టీ ఆర్ ఎస్ కు ఆరో తేదీ ఆందోళన లేదని కాదు. కమిటీ రిపోర్ట్ అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా వుంటుందని వెలువడుతున్న కధనాలు, కేంద్ర బలగాల మోహరింపు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి కీలక స్తానాల్లో వున్నవారు చేస్తున్న ప్రస్తావనలు సహజంగానే టీ ఆర్ ఎస్ కు ఇబ్బంది కలిగించేవే. కాకపొతే, ఇన్నేళ్ళుగా తాము సాగిస్తూ వచ్చిన వేర్పాటు ఉద్యమానికి వ్యూహాత్మక ముగింపు లభించబోయే తరుణంలో ఆ పార్టీ కూడా వ్యూహాత్మకంగానే కొంత సంయమనం పాటిస్తున్నదనుకోవాలి. కానీ నివేదిక తమ ఆశలపై నీళ్ళు చల్లే పక్షంలో ఏమి చేయాలన్న విషయంలో ఆ పార్టీ నేతలు లోలోపల మల్లగుల్లాలు పడుతున్నారు. మధ్యంతరం వస్తే ఇటు తెలంగాణాలో తాము, అటు ఆంధ్రాలో జగన్ పెట్టబోయే పార్టీ ఘన విజయాలు సాధించడం తధ్యమనీ, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోతాయనీ చేస్తున్న ప్రకటనలకు కారణం ఇదే అని భావిస్తున్నవారు వున్నారు. మధ్యంతరం రాని పక్షంలో మరి కొన్నేళ్లపాటు ఉద్యమ స్పూర్తి అణగారిపోకుండా, ఇన్ని సంవత్సరాలుగా సాగిస్తూ వచ్చిన శాంతియుత పోరాటం అదుపు తప్పకుండా చూసుకోవడం అలవికి మించిన భారమే.

పోతే, శ్రీ కృష్ణ కమిటీ నివేదిక రాష్ట్ర విభజనకు పచ్చ జండా వూపగలదేమోనన్న సందేహాలు, ఏదో ఒక మేరకు వారి మనసుల్లో సమసిపోయాయేమోగానీ ఆంద్ర ప్రాంత నేతలనుంచి – ఏ పార్టీ వారయినా కానీ – ఆరోతేదీ గురించిన ఆందోళనలు అంతగా వ్యక్తం కావడం లేదనే చెప్పాలి.

ఏదిఏమయినా రాష్ట్రాన్ని గత కొన్నేళ్లుగా వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా జరుగుతున్న ప్రయత్నంలో శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పించడం అనే మరో అంకం ముగిసింది. బంతిని తన చేతిలో పెట్టుకుని కేంద్రం, సమస్యతో సంబంధం వున్న రాష్ట్ర రాజకీయ పక్షాలను ఢిల్లీ సమావేశానికి ఆహ్వానించింది. సమావేశానికి హాజరయ్యేవారు కూడా అప్పటికప్పుడు నిర్ణయం ప్రకటించగలిగిన స్తితిలో లేనప్పుడు ఆరో తేదీన ఏదో తుది పరిష్కారం లభించగలదని అనుకోవడం అత్యాశే అవుతుంది. కాకపొతే రాజకీయ చదరంగంలో కాకలు తీరిన రాజకీయ పక్షాలన్నీ తమ నైపుణ్యాన్ని మరో మారు ప్రదర్శించడానికి ఈ సమావేశం ఒక వేదికలా ఉపయోగపడుతుంది.

‘ఆరో తేదీ మీటింగ్ లో ఏమీ జరగదు, ఎలాటి తుది నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు’ అని తెలిసి కూడా వెడుతున్నాయంటే అవి సమస్యను దాటవేయాలని చూస్తున్నాయని చెప్పడం సబబు కాదు కానీ, ఏదో ఒక విధంగా కొంత సమయం చేజిక్కించుకుని, ప్రత్యర్ధులపై పై ఎత్తులకు పాచికలు సిద్ధం చేసుకోబోతున్నాయని భావించడానికి మాత్రం వీలుంది.

ఇక- ఆరో తేదీ తరవాత ఏదయినా జరగొచ్చు. ఏమీ జరగకపోవచ్చు. రాజకీయ క్రీడలతో సంబంధం లేని వాళ్లందరూ రెండోదే జరగాలని మనసారా కోరుకుంటారు. (03-01-2011)

4 కామెంట్‌లు:

cbrao చెప్పారు...

అయినను పోయి రావలయు హస్తినకు అనే మీ విశ్లేషణ బాగుంది. బ్లాగర్ లో ఉంచే సమయంలో శీర్షిక పేరు పెట్టడం మరిచినట్లున్నారు. బ్లాగు సంకలినిలలో శీర్షిక లేని వ్యాసంగా కనపడుతోంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

Thanks Rao garu I have corrected it.-Bhandaru Srinivasrao

nagireddy gaddam చెప్పారు...

Bandaru garu! ide vishayam paina Vanam garu raasina tapa choosaranukunta. Mee iddari tapalu oka samaikyavadi mariyoka telanganavadi(iddaroo vishayaparignam gala medhavule kada) abhiprayalni pratiphalistunnayi. Naenu meekante Vanam gari abhiprayamtone ekibhavisthanu. Nyayam, Stayam ennatikaina gelvakapovu ankuntanu.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

dear sri nagireddy garu - naa abhipraayamto yekeebhavinchanane mee abhipraayamto yekeebhavinchadam maatrame kaadu daanni gouravistaanu koodaa. ade prajaaswaamyam. - bhandaru srinivasrao