శ్రీ కె. రామచంద్ర మూర్తి గారి సారధ్యం లోని హెచ్ ఎం టీవీ వారు “తెలుగుభాష –దశ దిశ” అనే పేరుతొ గతవారం ఒక కార్యక్రమం ప్రసారం చేసారు. తెలుగునేల నాలుగు చెరగులకు చెందిన అనేకమంది కవులు, రచయితలు, భాషా శాస్త్రవేత్తలు, భాషాభిమానులు ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఏకబిగిన కొన్ని గంటలపాటు సాగినప్పటికీ, ఆసాంతం చూడగలిగిన విధంగా ఈ ప్రసారం వీక్షకులను ఆకట్టుకోగలిగిందంటే, తెలుగు భాష పట్ల జనాలలో ఆసక్తి ఇంకా ఎంతో కొంత మిగిలే వుందనుకుని సంతోషపడాలి.
ఇందులో మరో రసవత్తరమయిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఒక ప్రాంతం వారి భాషను, యాసను మరో ప్రాంతం వారు అణగదొక్కి తమ ప్రాబల్యాన్ని భాషపై కూడా విస్తరిస్తూ పోయారన్న అబిప్రాయం వ్యక్తమయింది. “బిడ్డ పోయి అమ్మాయి, కొడుకు పోయి అబ్బాయి, కక్కయ్య పోయి బాబాయి, చిన్నమ్మ పోయి పిన్నమ్మ - ఇలా ఒక ప్రాంతానికి చెందిన పదాలు క్రమక్రమంగా కనుమరుగయి పోతున్నా”యని సింగిడి తెలంగాణా రచయితల సంఘం కన్వీనర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు వెల్లడి చేసిన ఆవేదనతో కొంతవరకు ఏకీభవించక తప్పదు. ప్రాంతీయపరమయిన ఉద్యమం నడుస్తున్న నేపధ్యంలో ఇలాటి అభిప్రాయాలు మరింత బలంగా వేళ్ళూనుకోవడం సహజమే. ఇందులో తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. అయితే, పరిణామక్రమాన్ని కూడా కొంత పరిశీలించు కోవాల్సిన అవసరం వుంది.
నలభయ్ యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదులో దుకాణాల పేర్లు, వీధుల పేర్లు తెలుగులో ఎలారాసేవారో గుర్తున్న వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఇదేవిధమయిన ఆవేదనకు గురయ్యారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతొ దేశంలో తొట్ట తొలిసారి ఏర్పడ్డ తెలుగు రాష్ట్రంలో తెలుగుకు ఈ దుర్గతి ఏమిటని బాధపడేవారు. సబ్బులు, తలనొప్పి గోళీల గురించి సినిమా హాళ్ళలో వేసే ప్రకటనల్లో కూడా తెలుగు పరిస్తితి అదే విధంగా వుండేది. ఎందుకంటె ఆరోజుల్లో ఇలాటి ప్రకటనలన్నీ బొంబాయి లో తయారయ్యేవి. హిందీలిపిలో తెలుగు రాయించి, తెలుగు కొద్దిగా తెలిసివాళ్ళచేత చదివించడంవల్ల వచ్చిన అపభ్రంశపు తెలుగునే తెలుగువారిపై రుద్దేవారు. ఈనాడు అరవై ఏళ్ళు దాటిన ప్రతిఒక్కరికీ ఇది అనుభవైకవేద్యమే.
మా కుటుంబంలో మా బావ గార్లూ, వాళ్ళ పెద్దవాళ్ళూ ఉర్దూ మీడియంలో చదువుకున్నవాళ్ళే. గ్రామాల్లో రాతకోతలన్నీ ఆ భాషలోనే జరగడంవల్ల ఉర్దూ మాట్లాడగలిగినవారికి అయాచిత గౌరవం లభించేదని చెప్పుకునేవారు.
ఆ రోజుల్లో ఖమ్మం జిల్లా మొత్తానికి కలిపి ఒకే ఒక్క డిగ్రీ కాలేజి ఖమ్మంలో వుండేది. అక్కడినుంచి హైదరాబాదుకు ఒకే ఒక్క పాసింజర్ బస్సు. దాదాపు పన్నెండు గంటల ప్రయాణం. బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకేఒక్క రైలు నైజాం పాసింజర్. కుంటుకుంటూ నడిచే ఆ రైలు బొగ్గుకోసం, నీళ్ళ కోసం మధ్య మధ్యలో ఆగుతూ, పడుతూ లేస్తూ ఎప్పటికో హైదరాబాద్ చేరేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు తక్కువ. పైగా భాష తెలియకపోవడం మరో ఇబ్బంది. అయినా, పై చదువులకోసం హైదరాబాద్ తప్పనిసరిగా రావాల్సిన పరిస్తితి. మరోవైపు, రాష్ట్ర రాజధాని కావడం వల్ల ఏదో ఒక పనిపై రాకుండా వుండలేని స్తితి. ఈ క్రమంలో రాకపోకలు పెరిగాయి. ఉద్యోగాలకోసం, ఉపాధుల కోసం వలసలు పెరిగాయి. వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్యా పెరిగింది.
ఫలితంగా – గత యాభయ్ ఏళ్లలో పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రవాణా సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రోజుకొక పాసింజర్ బస్సు స్తానంలో గంటగంటకూ నడిచే ఎక్స్ ప్రెస్ బస్సులు వచ్చాయి. నలుమూలలనుంచి హైదరాబాదుకు రైళ్ల సౌకర్యం ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిమంది జనం హైదరాబాదుకు వచ్చి స్తిరనివాసాలు ఏర్పరచుకోవడం మొదలయింది. ఆ రోజుల్లో ఆయా ప్రాంతాలలో వున్న అక్షరాస్యతను బట్టి చూస్తె బయట నుంచి వచ్చే ఇలాటివారి సంఖ్య గణనీయంగా వుండడం ఆశర్యకరమేమీ కాదు. వలసలు వచ్చిన వాళ్ళు వారితో పాటే తమ సంస్కృతిని, ఆచారవ్యవహారాలను, భాషలో తమదయిన నుడికారాలను వెంటబెట్టుకువస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. ఉదరపోషణార్ధం ఇతరదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిన తెలుగు వాళ్ళు చేస్తున్నదీ ఇదే. ఇదంతా సహజ సిద్దంగా జరిగేదే కానీ ఒక దాడి ప్రకారం, ఒక పధకం ప్రకారం జరుగుతోందని అనుకోవడం అంత సబబు కాదు. వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలకోసం వచ్చేవారు, స్తానికులకు చేసే అన్యాయాలతో ముడిపెట్టి, ఈ అంశాన్ని చూడడం కూడా సరికాదనిపిస్తుంది. పట్టణీకరణ (అర్బనైజేషన్) వల్ల వచ్చిపడే అనర్థాలలో ఇదొకటి కాబట్టి సర్దుకుపోవాలని చెప్పడం కాదు కానీ, ఈవిధమయిన పరిణామాలు అనివార్యం అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో వారి వారి భాషలు, యాసలు పదిలంగా వుండడాన్నిబట్టి చూస్తె, వలసలు ఎక్కువగా వుండే పట్టణ ప్రాంతాలలోనే ఈ రకమయిన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా అనుకోవాలి.
భాష పట్ల మమకారం లేని వాడు వుండదు. అది కన్న తల్లితో సమానం. పరాయి భాషల వాళ్ళు మన భాషలో తడి పొడిగా యేవో రెండుముక్కలు మాట్లాడితే మురిసి ముక్కచెక్కలయ్యేది అందుకే.
మాండలికాలు ఎన్ని వున్నా తల్లి వేరు ఒక్కటే. భాషకు యాస ప్రాణం. పలికే తీరులోనే వుంటుంది మాధుర్యమంతా. చిన్నప్పుడు స్కూల్లో రసూల్ సారు ఉర్దూలో అనర్ఘలంగా మాట్లాడేవారు. ఆయన మాట్లాడే దానిలో మాకు ఒక్క ముక్క అర్ధం అయ్యేది కాదు. కానీ ఇంకా ఇంకా వినాలనిపించేది. అదీ భాషలోని సౌందర్యం.
మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అనేక తెలుగు మాండలికాలు వున్నాయి. ఒక్కొక్కదానిదీ ఒక్కొక్క తరహా. దేనికదే గొప్ప. కొన్ని పదాలు అర్ధం కాకపోయినా చెవికి ఇంపుగా వుంటాయి. ప్రతి భాషలో వుండే ఈ యాసలు ఒకదానికొకటి పోటీ కాదు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయమూ కాదు. కాకపొతే భాషను సుసంపన్నం చేయడంలో వీటి పాత్ర అమోఘం.
భాషలో ‘తమవి’అనుకున్న పదాలు తమవి కాకుండా పోవడమే కాకుండా మాయమయి పోతూవుండడం పట్ల నారాయణరెడ్డి గారు వ్యక్తం చేసిన ఆవేదనతో ఏకీభవించని వారు వుండరు.
భాషాభిమానులందరు బాధ పడాల్సిన అంశాలు మరికొన్ని కూడా వున్నాయి. నాన్నను ‘ఒరే’ అనడం – అమ్మను ‘ఒసే’ అనడం వంటి వికృత ప్రయోగాలు తెలుగునాట, ముఖ్యంగా తెలుగు సినిమాలలో నానాటికీ ముదిరిపోతున్నాయి. తెలుగు భాషకు, సంస్కృతికి చీడపురుగుల్లా మారుతున్న ఈ ధోరణులకు సయితం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.
ఎన్ని కొమ్మలు వేసినా తల్లి వేరు ఒక్కటే. కలివిడిగా తల్లిని ప్రేమించడానికి ఏమయినా ఇబ్బందులు వుంటే విడివిడిగా తల్లిని ఆరాధించడమే బిడ్డలు చేయాల్సిన పని. (03-11-2010)
5 కామెంట్లు:
వ్యాసం చాలా బాగుంది. ప్రతీ భాషలోనూ కాలక్రమేణా మార్పులు వస్తూ ఉంటవి అవి ఎవరో తీరికగా కూర్చుని, తల్చుకుని, కుట్రతో చేసేవి కాదు.
Thanks Lakkaraju garu -Bhandaru Srinivas Rao
బాగుంది మీ వ్యాసం
బాగా చెప్పారు.
చాల చక్కగా విపులీకరించారు. నాకు చాల నచ్చింది మీ వ్యాసం
కామెంట్‌ను పోస్ట్ చేయండి