దేశంలో దరిద్ర నారాయణుల లెక్కలు లెక్కించే కార్యక్రమం జోరుగా సాగుతోంది.
దారిద్ర్యరేఖ (బీపీఎల్)కు దిగువన జీవిస్తున్న కుటుంబాల అంచనా జాబితాను పదిరోజుల్లోగా ప్రభుత్వానికి అందిస్తామని కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా సెలవిచ్చారు.
దేశంలో ఆరున్నర కోట్ల నిరుపేద కుటుంబాలు వున్నట్టు గతంలో తాము వేసిన అంచనాకు కాస్త ఎక్కువగా అంటే సుమారు ఎనిమిది కోట్ల బీపీఎల్ కుటుంబాలు వున్నట్టు లెక్క తేల్చిన టెండూల్కర్ కమిటీ నివేదికను పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు.పత్రికలలో ఈ వార్త వచ్చిన రోజునే ‘రాజ్య సభలో వందమంది కోటీశ్వరులు’ వున్నారన్న సమాచారం కూడా ప్రచురించారు.
మన రాష్ట్రానికి చెందిన టి. సుబ్బరామిరెడ్డి కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న విషయం ఆయనకు పెద్ద విశేషం కాకపోవచ్చు. ఎందుకంటె వేదికలనుంచి వేడుకల దాకా ప్రముఖ స్తానంలో కానవచ్చేవారికి మూడో స్తానం లో నిలవడం అంత ముచ్చట కలిగించే అంశం అంతకంటే కాకపోవచ్చు. ఇక్కడ కోటీశ్వరులంటే ఏదో ఒక్క కోటి మాత్రమె సంపాదించారని అర్ధం కాదు. వందల కోట్లు కూడబెట్టుకున్న వాళ్ళని అర్ధం చేసుకోవాలి. అంతే కాదు ఈ మొత్తం అంతా కూడా లెక్కల్లో చూపించగల ‘తెల్ల ధనం’ మాత్రమె అన్న మరో పరమార్ధాన్ని కూడా గుర్తించగలగాలి. ఇంకా కానరాని ‘నల్ల డబ్బు’ యెంత వెనకేసుకునివుంటారో అన్నది ఆ ఈశ్వరుడికే తెలియాలి. లేదా ఆ ఘనత వహించిన ఆ ఆహ్లూవాలియా మహాశయులవారే తీరిక చేసుకుని ఆరా తీయిస్తే బాగుంటుంది.
బీపీఎల్ కుటుంబాల విషయానికి వస్తే –
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ‘ధరలు పెరగడము తధ్యము సుమతీ’ అన్నది ప్రపంచీకరణ సిద్ధాంతకర్తల సాధారణ ఉవాచ. ధరలు పెరగడం వల్ల ఉత్పత్తిదారుడికి గిట్టుబాటు ఆదాయం లభిస్తుంది. ఆదాయం పెరగడం వల్ల లాభాలు పెరుగుతాయి. పెరిగిన లాభాల్లో కొంత మేరకు తిరిగి పెట్టుబడులరూపం లోకి మల్లించడం వల్ల ఉత్పత్తి మరింత పెరిగి వస్తులభ్యత గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా మార్కెట్ శక్తుల ప్రభావంతో ధరల స్తిరీకరణ జరిగి వినియోగదారుడికి ధరలు అందుబాటులోకి వస్తాయి
.ఏసీ గదుల్లో కూర్చుని చేసే ఇలాంటి ఊహాపోహలన్నీ ఆచరణ వద్దకు వచ్చేసరికి ఆవిరయిపోవడం కళ్ళారా చూస్తున్నదే. ఎందుకంటె- ఎలాటి పధకాలకయినా చిల్లులు పొడిచి పబ్బం గడుపుకునే ఘనులెప్పుడు సమాజంలో సిద్దంగానే వుంటారు. ఇందుకు మంచి ఉదాహరణ మన రాష్ట్రంలో అమలు జరుగుతున్న ‘తెల్ల రేషన్ కార్డుల పధకం’.
భుత్వాలు మారినప్పుడల్లా ఈ కార్డుల రంగులు మారుతూరావడం మన రాష్ట్రంలో ప్రత్యేకత. దీన్నిబట్టి పార్టీల వోటు బ్యాంకుల నిర్మాణంలో వీటి ప్రాధాన్యత యెంత వుందో అర్ధం చేసుకోవచ్చు. పేదలకోసం ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పధకాలకన్నింటికీ ఈ తెల్లకార్డు ఒక్కటే కీలకం కావడంతో వీటికి ప్రాధాన్యతా, గిరాకీ రెండూ విపరీతంగా పెరిగిపోయాయి.
కార్పొరేటు ఆస్పత్రులలో ఉచిత వైద్యానికి పనికివచ్చే ఆరోగ్యశ్రీ కార్డుని పొందాలన్నా కూడా ఈ తెల్లకార్డే దిక్కు కావడంతో దీని డిమాండ్ ఆకాశం అంచుల్ని తాకింది. సబ్సిడీ బియ్యం, ఇళ్ళ పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు- ఇలా ఇదీ అదీ అనే తేడా లేకుండా అన్నింటితో ఈ తెల్ల కార్డుని ముడిపెట్టడం వల్ల ఇది నల్ల బజారు సరుకుగా మారిపోయింది. పేదవారి కోసం వుద్దేశించిన ప్రయోజనాలన్నీ పేదవారుగా మారడంవల్ల పొందవచ్చనే పేరాశ కలవారిలో సయితం కలిగిన ఫలితంగా బోగస్ తెల్లకార్డులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి.
మధ్యలో వున్నది మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు
లబ్ధిదారుల్లో అర్హులయిన పేదలను సరిగ్గా గుర్తించి, అనర్హులయిన వారి కార్డులను నిష్కర్షగా, నిజాయితీగా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలను లెక్కచేయకుండా రద్దు చేయగలిగిననాడే బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమానికి అర్ధం పరమార్ధం సిద్దిస్తాయి. కాని పక్షంలో ఏరుదాటి తెప్ప తగలేసారనే అపప్రధను ప్రభుత్వం మూటగట్టుకోకతప్పదు.
(25-4-2010)
NOTE: All the images in this blog are copy righted to their respective owners.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి