30, మే 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (171) – భండారు శ్రీనివాసరావు

 సృష్టి జననం

2003 సెప్టెంబర్ 15 వ తేదీన మా పెద్ద కుమారుడి చిన్న కుమార్తె సృష్టి, రెంటన్ లోని వ్యాలీ మెడికల్ సెంటర్ లో జన్మించింది. అందుకోసమే నేను మా ఆవిడ నిర్మల ఇద్దరం పురిటి సమయానికి కొద్ది రోజులు ముందుగానే సియాటిల్ చేరుకున్నాము. ఆడపిల్ల అనగానే మా ఆవిడ సంతోషం ఇంతా అంతా కాదు.
బారసాల రోజున శాన్ ఫ్రాన్సిస్కోలో వుంటున్న మా రెండో అన్నయ్య కుమారుడు లాల్ బహదూర్, కోడలు దీప, దీప తండ్రి, నా మేనల్లుడు రామచంద్రం, అతడి భార్య కరుణ, కుమార్తె స్పురిత సియాటిల్ వచ్చారు. బాలసారకు ముందే సృష్టి అనే పేరు హాస్పిటల్ రికార్డులలో నమోదు అయింది. బియ్యంలో పేరు రాయడం అనేది కేవలం లాంఛనమే.
ఒక రోజు స్నోకాల్మీ ఫాల్స్ (SNOQUALME FALLS) కి కారులో వెళ్ళాము. సియాటిల్ నుంచి సుమారు గంటన్నర ప్రయాణం.
ఎత్తయిన పర్వతాలు,లోతయిన లోయల మీదుగా విశాలమయిన రహదారి. రోడ్డుకు రెండువైపులా నింగిని తాకుతున్నాయా అనిపించేంత పొడవయిన చెట్లు. వాటిని నరికి అడవులను ధ్వంసం చేస్తున్న దాఖలాలు మచ్చుకు కూడా కనిపించవు. చెట్లను నరకడంపై గట్టి నిషేధాలు వున్నాయి. కార్చిచ్చుల కారణంగా అడవులు తగలబడి పోవడం తప్పిస్తే దొంగతనంగా చెట్లను నరకడం అన్నది జరగదు.(ఇటీవల కాలిఫోర్నియాలో ఇలాటివి జరిగి వందల ఎకరాల విస్తీర్ణంలో అడవులు కాలిపోయాయి.)
నిజానికి స్నోకాల్మీ ఫాల్స్ అన్నది ఒక కృత్రిమ జలపాతం. లోయల్లో పారుతున్న నీటిని ఒక ఎత్తయిన ప్రదేశం మీదుగా మళ్లించి ఈ జలపాతం ఏర్పడేలా చూసారు. పర్యాటకులకు అవసరమయిన వసతులు అద్భుతంగా కల్పించారు. కాలిబాట మీదుగా లోయలోకి దిగి వెళ్లి ధారగా దూకుతున్న జలపాతాన్ని చూడవచ్చు. పైనుంచి పడుతున్న జలధారలతో కింది భాగంలో నీటి మడుగు ఒక సరస్సు మాదిరిగా తయారయింది. దానిలో బోటింగ్ చేయడానికి రోజూ వందలాదిమంది అక్కడకు వస్తుంటారు. నిజానికి ఇది మన నాగార్జునసాగర్ సమీపంలో వున్న ఎత్తిపోతల జలపాతం కంటే పెద్దదేమీకాదు. అయినా పర్యాటకులను ఆకర్షించడానికి చేసిన ఏర్పాట్లు, రహదారి సౌకర్యాలు అద్భుతం.
మరో రోజు మౌంట్ రేనియర్ అనే అగ్ని పర్వతం చూడడానికి వెళ్ళాము. అక్కడకు చేరడానికి కొన్ని వందల అడుగుల ఎత్తున నిర్మించిన విశాలమయిన ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాలి. ఇక్కడ ఘాట్ రోడ్డు అంటే మలుపులు తిరుగుతూ వెళ్లే రోడ్డు కాదు. ఏటవాలుగా సరాసరి కొండమీదికే రోడ్డు నిర్మిస్తారు. ఒక దాని వెంట మరొకటిగా వందలాది కార్లు అమిత వేగంతో ఆ రోడ్లపై పరుగులు తీయడం గమనిస్తే కళ్ళు తిరిగిపోతాయి.
మౌంట్ రేనియర్ సజీవ అగ్ని పర్వతం. ఇంకా రగులుతూనే వుంది. ఏదో ఒకనాడు ఇది బద్దలు కాగలదని భావిస్తున్నారు. సియాటిల్ కి ఈ పర్వతం ఒక కొండ గుర్తు. చాలా దూరంలో వున్నా నగరంలో పలుచోట్ల నుంచి ఈ అగ్ని పర్వతం కనిపిస్తూనే వుంటుంది. సందర్శకులకు ఇక్కడ కూడా బ్రహ్మాండమయిన ఏర్పాట్లు చేసారు. అగ్ని పర్వతమే అయినా సంవత్సరంలో చాలా రోజులు మంచుతో కప్పబడే వుంటుంది. ఆ మంచుపై స్కీయింగ్ చేయడానికి సీజనులో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ అగ్ని పర్వతం చరిత్రను వివరించే పెద్ద ప్రదర్శనశాల కూడా వుంది.
ఇండియా నుంచి వచ్చి ఈ అగ్ని పర్వతం చూసేవారికి ఒక అదనపు ఆకర్షణ కూడా వుంది. దీనికి వెళ్లే దోవలో ‘నారద ఫాల్స్’ కనిపిస్తాయి. నిజానికి మన ‘నారద మహర్షి’ పేరు పెట్టారో లేదా కాకతాళీయమో కానీ ఆ పేరు చూడగానే ఎంతో సంతోషమనిపించింది.
మళ్ళీ ఇన్నేళ్లకి నిరుడు (2024) నా మనుమరాలు సృష్టి పుట్టిన రోజున నేను అమెరికాలో వుండడం యాదృచ్చికం.
ఈసారి నగరంలో ఎక్కడైనా తిరగాలి అంటే సృష్టే నాకు సమస్తం. తోడు, గైడు, సారధి (డ్రైవర్) అన్నీ తానే. సియాటిల్ లో నన్ను తిప్పని ప్రదేశం లేదు. కానీ నేను అడిగిన ఒక చోటుకు తీసుకువెళ్ళమని కోరినప్పుడు మాత్రం కొంత గందరగోళంలో పడింది.
‘స్లమ్ అంటే ఏమిటి తాతా?’
అని ఎదురు ప్రశ్నించింది నా మనుమరాలు సృష్టి.
ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సృష్టి అడిగింది, ఈరోజు ఎక్కడికి పోదామని. అదే ఒక జాబితా చదివింది స్నో కాల్మీ ఫాల్స్, ఇంకా ఏవేవో మాల్స్, పార్కులు వగైరా.
" నాకు ఈరోజు సియాటిల్ లో ఏదైనా ఒక స్లమ్ ఏరియా చూపిస్తావా " అని అడిగాను.
" నేను ఎప్పుడూ చూడలేదు, మా ఫ్రెండ్స్ ని అడుగుతాను, అదేమిటో " అంటూ ఒకరిద్దరికి ఫోన్ చేసింది.
‘ఎవరికీ తెలియదట, ఒక ఫ్రెండేమో డౌన్ టౌన్ లో ట్రై చేయమంది. వెంటనే పద పోదాం’ అని బయలుదేరతీసింది.
ఈసారి రెంటన్ మీదుగా వెళ్ళాము. ఎప్పుడూ లేనంతగా ఫ్రీ వే మీద కూడా ట్రాఫిక్ జామ్.
పదిహేనేళ్ళ క్రితం సియాటిల్ వచ్చినప్పుడు రోడ్ల మీద ఇన్ని కార్లు లేవు. విశాలమైన రహదారులు. వాటిని కొన్ని చోట్ల మరింత విశాలంగా వెడల్పు చేసే పనులు సాగుతున్నాయి. కానీ ఎక్కడా చెట్లు కొట్టి వేస్తున్న దృశ్యాలు కనపడలేదు. రెండు వైపులా గుబురుగా, అడవిలా పెరిగిన చెట్లు. క్రితంసారి రోడ్డు మీద పోతుంటే జింకలు రోడ్డు దాటుతూ కనిపించేవి. అవి తిరిగే చోట్లలో హెచ్చరిక బోర్డులు పెట్టారు. అవి ఇప్పటికీ వున్నాయి కానీ జింకల జాడ లేదు.
మొత్తం మీద సియాటిల్ డౌన్ టౌన్ చేరాము. కొండల మీద కట్టిన నగరంలా అనిపించింది. ఎగుడు దిగుడు రోడ్లపై కారులో దాదాపు రెండు గంటల పాటు కలయతిరిగాము. ఎత్తైన పొడవాటి రమ్య హర్మ్య భవంతులు. మురికి వాడలు ఎక్కడా కానరాలేదు.
మళ్ళీ ఫ్రెండ్ కి ఫోన్ చేసింది. ప్రత్యేకంగా ఒక చోట అంటూ వుండవు. అక్కడక్కడా పేవ్ మెంట్లపై టార్పాలిన్ టెంట్లు వేసుకుని వుంటారు. బాగా వెతికితే కనపడవచ్చు అని మా డాడీ చెబుతున్నారు అని జవాబు వచ్చింది. ఆ ఫ్రెండ్ ఓ హెచ్చరిక కూడా చేసినట్టు వుంది, వాళ్ళతో జాగ్రత్త , ఏ అఘాయిత్యం అయినా చేయవచ్చు అని.
అలా రోడ్ల వెంట తిరగ్గా తిరగ్గా ఒక చోట అలాంటి టెంట్ కనిపించింది. కానీ అక్కడ కారు ఆపడానికి వీలు లేదు. అంచేత పక్క రోడ్డులో వున్న జాక్ ఇన్ ది బాక్స్ అనే బర్గర్లు దొరికే హోటల్ దగ్గర కారు పార్కు చేసి, పదహారు డాలర్లు పెట్టి ఓ బర్గర్, కోక్ కొని, ఆ టెంట్ దగ్గరికి నడిచి వెళ్ళాము. ఉత్త చేతులతో అలాంటి వారి దగ్గరకు పోకూడదన్న సృష్టి ఆలోచన నాకు నచ్చింది.
ఆ టార్పాలిన్ టెంటు ముందు డెబ్బయ్ ఏళ్ల మనిషి కూర్చుని వున్నాడు. నెత్తి మీద హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, మంచి దుస్తులు, టెంట్ నిండా ఏదో సామాను, మడత పెట్టిన వీల్ చైర్, ముందు రెండు సూటు కేసులు, చేతిలో సిగారు. మరో చేతిలో మొబైల్.
సృష్టి వెళ్లి విష్ చేసి చెప్పింది, 'మీ కోసం మీల్ తెచ్చాము, ఏమైనా అభ్యంతరమా' అని.
వారి ఇద్దరి మధ్య సంభాషణ ఇంగ్లీష్ లో ఇలా జరిగింది. అది యధాతధంగా తెలుగులో:
"హలో, మేము మీకోసం కొంత ఫుడ్ తీసుకొచ్చాం!"
"వావ్, ధన్యవాదాలు!"
"నా తాతగారు భారతదేశంలో ఒక జర్నలిస్టు. ఆయన మీతో ఫోటో దిగాలని అనుకుంటున్నారు. ఆయన సియాటిల్‌లోని నిరాశ్రయుల గురించి రాస్తున్నారు. మీకు అభ్యంతరమేమైనా ఉందా అని అడగమన్నారు."
"అలా రాయడం నాకు ఇష్టం వుండదు. వద్దు. అయినా ధన్యవాదాలు."
"పర్లేదా!"
"నా సోదరికి నాకు ఇల్లు లేదని తెలీదు. ఆమెకి ఇది తెలిస్తే షాక్ తింటుంది. మీకు అర్థం అవుతుందిగా."
"మాకు పూర్తిగా అర్థమయింది. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉన్నారు?"
"వాళ్లు (బహుశా మున్సిపల్ అధికారులుకావచ్చు) మమ్మల్ని ప్రతి 3-4 రోజులకూ ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటారు. నేను ముందు గ్రీన్‌బెల్ట్ దగ్గర ఉండేవాడిని. ఒక్క నన్ను మాత్రమే అయితే వాళ్లు అంతగా పట్టించుకోరు. కానీ చాలా RVలు, గుడారాలు వంటివి ఉంటే దాన్ని 'ఎంకాంప్‌మెంట్' అంటారు. అప్పుడు మొత్తం తొలగించేస్తారు. ఈ మొత్తం ప్రాంతాన్ని ఇప్పుడు ‘ఇండస్ట్రియల్ ఏరియా’ అని పిలుస్తారు. ఇది సియాటిల్‌లోని అత్యంత దయనీయ 10 ప్రదేశాల జాబితాలో లేదు. అయినా సరే! సీహాక్స్ సీజన్‌ కోసం దీనిని కూడా క్లియర్ (ఖాళీ) చేస్తారు, ఎప్పుడూ అలానే చేస్తారు."
"మీరు ఎంతకాలంగా ఇల్లు లేకుండా ఉన్నారు?"
"నా అన్నతో ఉండేవాడిని. ఆయన కోవిడ్‌తో చనిపోయారు."
" ఈ వార్త వినడం నాకు బాధగా వుంది"
"అందుకే నాకు మరో ప్రత్యామ్నాయం లేదు."
"మీ సమయాన్ని ఎలా గడుపుతారు?"
(అతను తన చేతిలో వున్నసెల్‌ఫోన్ చూపించాడు. మేమంతా నవ్వుకున్నాం)
అతడు మమ్మల్ని అడిగాడు ఇలా:
"ఇంతవరకు మీరు (నాలాంటి) ఎంతమందితో మాట్లాడారు?"
"మీరే మొదటివారు!"
"సరే, మంచి పనిచేశారు. మీరు ఇంతవరకూ అదృష్టవంతులే! ఇక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఎందుకంటే వాళ్లు చాలా సార్లు మత్తులోనే ఉంటారు. ఇదిగో ఈ పక్కనే ఉన్నవాడిని చూసారు కదా ( దగ్గరలో వున్న మరో గుడారం వైపు చూపుతూ), అతను సాధారణంగా తన పనిలోనే ఉంటాడు. కానీ అతనికి బైపోలార్ డిసార్డర్ ఉంది. ఏ చిన్న విషయానికి అయినా అతను రెచ్చిపోవచ్చు. ఎవరెవరు ఎలా స్పందిస్తారో తెలియదు. కనుక మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీరు తెచ్చిన మీల్ కి ధన్యవాదాలు."
("సరే, మీకు మా కృతజ్ఞతలు. మేము ఇప్పుడు వెళ్తాం. మీరు భోజనం చేయండి. ధన్యవాదాలు. నమస్తే!")
"మీకు ధన్యవాదాలు. నమస్తే "
ఈ విధంగా అమెరికా దేశంలో గుడిసెలో నివసించే ఒక వ్యక్తిని కలిసి మాట్లాడాలి అనే ఓ కోరిక నెరవేరింది
థాంక్స్ సృష్టి!
కింది ఫోటోలు:
2003 లో సృష్టి జననం, సృష్టి నామకరణం, లాల్, దీప, రామచంద్రం, కరుణలతో మా కుటుంబం
స్నో కాల్మీ ఫాల్స్, మండే కొండల మీద మా షికార్లు. తన ఇరవై ఒకటో ఏట సృష్టి. వెనుక ఫోటోలో ఉన్న మా ఆవిడ తన ముద్దుల మనుమరాలికి ఆశీస్సులు అందిస్తోందని నా నమ్మకం.
(ఇంకావుంది)
All reactions:
Mandarapu Nageshwararao, Chennuri Ganesh and 5 others
2
Like
Comment
Share
View more comments
  • Like
  • Reply
  • See translation
Facebook

29, మే 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (170) – భండారు శ్రీనివాసరావు

 పౌరుడే  సుప్రీం

ముందు ఒకప్పటి సంగతి చెప్పుకుందాం.
1987 లో రేడియో మాస్కోలో నాకు ఉద్యోగం వచ్చింది. ఢిల్లీ నుంచి ఏరోఫ్లోట్ విమానంలో మాస్కో వెళ్ళాలి. దానికి ముందు హైదరాబాదు నుంచి రైల్లో ఢిల్లీ వెళ్ళాలి. మర్నాడు తెల్లారి ఉదయం భార్యాపిల్లలతో సహా బయలుదేరి సికిందరాబాదు స్టేషన్ లో రైలెక్కాలి. వీడుకోలు చెప్పడానికి చుట్టపక్కాలు చాలామంది మా ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్లకు కప్పు కాఫీ ఇవ్వడం మర్యాద. కానీ కాఫీ డికాషన్ పెట్టడానికి ఇంట్లో నీళ్ళ సమస్య. రోజు విడిచి రోజు నల్లా వదిలేవాళ్ళు. అదీ తెల్లవారుఝామున ఓ అరగంట. ఆ కాసేపట్లో ఆరు కుటుంబాల వాళ్ళు నీళ్ళు పట్టుకోవాలి. మాకు తెల్లారి ప్రయాణం కాబట్టి మిగిలిన వాళ్ళు మాకు ముందు అవకాశం ఇచ్చారు. లేని పక్షంలో కాఫీ డికాషన్ వేయడానికి కూడా నీళ్ళకు కటకట.
అప్పట్లో మరో సమస్య కరెంటు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలవదు. దీనికి తోడు విద్యుత్ కోతలు. వోల్టేజి సమస్యలు. ఇంట్లో అన్ని లైట్లు వేస్తే, ఇంట్లోదే కాదు, వీధిలో కరెంటు స్తంభం పైన ఫ్యూజు కూడా పోతుందని చెప్పుకునే రోజులు అవి. ముందు జాగ్రత్తగా కొవ్వొత్తులు కొని సిద్ధంగా పెట్టుకున్నాము. అదృష్టవశాత్తు వాటి అవసరం రాలేదు.
మూడో రోజు మాస్కో చేరాము. అక్కడ రేడియో మాస్కోలో పనిచేసే విదేశీ ఉద్యోగుల కోసం పదమూడు అంతస్తుల భవనంలో చిట్ట చివరి అంతస్తులో మాకు అపార్ట్ మెంటు కేటాయించారు. ఇంత ఎత్తుకు నీళ్ళు వస్తాయా! రాకపోతే ఇక్కడ కూడా హైదరాబాదు నీళ్ళ కష్టాలేనా, అనుకుంటూ లోపలకు వెళ్ళాము. వెళ్ళగానే చేసిన మొదటి పని నల్లా తిప్పి చూడడం. ధారగా నీళ్ళు వచ్చాయి. ప్రతి పంపు తిప్పి చూశాము. అన్నిట్లో నీళ్ళు. ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు.
ఇలాంటి పరిస్థితి హైదరాబాదులో చూడడం అసాధ్యం అనుకున్నాము ఆ రోజు.
ఇదేదో ఉత్ప్రేక్ష కోసం, విమర్శ కోసం రాయడం లేదు. ఆ నాటి పరిస్థితులు, మంచి నీళ్ళ కష్టాలు ఈ తరానికి తెలియచెయ్యడం కోసం ఈ ప్రయత్నం.
ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఇది కళ్ళ ముందు జరిగిన అభివృద్ధి. కానీ కనబడదు.
ఎందుకో చెబుతాను.
ఇంట్లో పిల్లాడు పెరుగుతూ ఉంటాడు. కాలం గడిచిన కొద్దీ కొద్దోగొప్పో వళ్ళు చేస్తాడు. సహజం. అది రోజూ చూసేవారికి కనబడదు. ఎప్పుడో ఒక చుట్టం దిగబడతాడు. పిల్లాడ్ని చూసి ‘అరె! వీడేనా వాడు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. పీలగా ఉండేవాడు. ఇప్పుడు కాస్త కండ పట్టి ముద్దొస్తున్నాడు’ అంటాడు. ‘నిజమేనా బాబాయ్’ అంటుంది తల్లి అనుమానంతో కూడిన ఆనందంతో.
అలాగే ఒక నగర వాసులకు తమ చుట్టుపక్కల జరిగే మార్పులు కంటికి ఆనవు.
అలాగే గత యాభయ్, అరవై ఏళ్ళలో ఇటు తెలంగాణాలో, అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరూ, ప్రతిపల్లె మారిపోయాయి. ఎటు చూసినా కళ్ళు మిరుమిట్లు కొలిపే మాల్స్. స్టార్ హోటళ్ళు. ఈ మార్పునే మనం అభివృద్ధి అనుకుంటున్నాం. మరి పౌరసౌకర్యాల మాటో. ఈ మాట ఎవ్వరికీ పట్టదు. ఇక పౌరధర్మం అంటారా! ఆ ఊసే ఎవరికీ అంటదు.
ఒకప్పుడు సప్త సముద్రాలు దాటి వెళ్ళిన అమెరికా ఈనాడు ఓ ఇరుగుపొరుగు దేశంగా మారిపోయింది. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరైనా అమెరికాలో వుంటున్నారు. సుమారుగా ప్రతి తల్లీ తండ్రీ అమెరికా చూసి వచ్చిన వాళ్ళే కనబడతారు. వారిని అడిగితే చెబుతారు. అక్కడ చట్టాలు అన్నీ పౌరుడి దృష్టి కోణం నుంచి ఆలోచించి తయారు చేశారేమో అన్పిస్తుంది.
పౌరుల సర్వసాధారణ జీవితంలో ప్రభుత్వ ప్రమేయం అతి తక్కువగా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేను గతంలో చూసిన సోవియట్ యూనియన్ లో కూడా ( పైగా అది అప్పట్లో ఇనుపతెర దేశంగా పేరుపొందిన దేశం) సాధారణ పౌర జీవితంలో ప్రభుత్వ అనవసర జోక్యం కానరాలేదు. అప్పటి సోవియట్ యూనియన్ లో ప్రజలకు నిత్యం తారసపడే ఏకైక ప్రభుత్వ ప్రతినిధి ట్రాఫిక్ పోలీసు. ట్రాఫిక్ రూలుని ఎవరయినా ఉల్లంఘించినప్పుడు చలానాలు వసూలు చేసే సందర్భాలలో వాళ్ళు పౌరులపట్ల యెంత మర్యాదగా వ్యహరిస్తారో కళ్ళారా చూసాను. అమెరికాలో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై కూడా కానరారు. మన దగ్గర ప్రజలకు అతి చేరువగా వుండే ప్రభుత్వఅధికార ప్రతినిధులు, ముఖ్యంగా పట్టణాలలో, ట్రాఫిక్ పోలీసులే. వీరి ప్రవర్తన ఎలా వుంటుందో విడిగా చెప్పాల్సిన పని లేదు. పట్టపగలు, నడి రోడ్డుపై ప్రజలపై జులుం చేస్తూ ముక్కు పిండి, గోళ్ళూడగొట్టి డబ్బులు వసూలు చేసుకునే వీలున్న ఏకైక ప్రభుత్వ వ్యవస్థ కేవలం మన దేశంలోనే వుండడం మన దురదృష్టం.
1988లో మాస్కోలో నేనూ, మా ఆవిడా ఏదో పని మీద టాక్సీలో వెడుతుంటే, డ్రైవర్ సిగ్నల్ జంప్ చేశాడు. వెంటనే అక్కడే వున్న ట్రాఫిక్ పోలీసు (పోలీసుని మిలీషియా అంటారు) టాక్సీని నిలుపుచేసి, కారులో వున్న మాకు ఫుల్ సాల్యూట్ చేసి, డ్రైవర్ ని విచారించే మిషతో మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టకుండా, వేరే టాక్సీ ఆపి అందులో మమ్మల్ని పంపించాడు.
నమ్మకం
ఆ మెయిన్ రోడ్డు తిన్నగా పొతే సియాటిల్ నగరంలో మా మనుమరాళ్ళు చదువుకునే బెల్ వ్యూ స్కూలు వస్తుంది. కానీ అది ఒక మలుపు తిరిగే చోట మరో రోడ్డు పక్కనుంచి వచ్చి దానిలో కలుస్తుంది. ఆ దోవన వచ్చే వాహనదారులు ఆ రెండు రోడ్లు కలిసే చోట కాసేపు ఆగి, మెయిన్ రోడ్డులో వేరే వాహనాలు ఏవీ రావడం లేదన్న సంగతి ధృవపరచుకుని కానీ ఆ రోడ్డులోకి ప్రవేశించేవారు కారు. అయితే, హైదరాబాద్ ట్రాఫిక్కు అలవాటు పడివున్న నాకు మాత్రం ఆ వాహనాలు అదే వేగంతో మెయిన్ రోడ్డులోకి దూసుకు వస్తాయేమో అన్న భీతి పీడిస్తూ వుండేది.
“ఎందుకంత స్పీడు. కాస్త పక్కగా వచ్చే కార్లను చూసుకుని నడపకూడదా!” అనేవాడిని మా అబ్బాయితో.
“నమ్మకం” అనేవాడు మావాడు స్థిరంగా.
“అలా దూసుకు రావని ఇక్కడ మా నమ్మకం. వచ్చి తీరుతాయని హైదరాబాదులో మీ నమ్మకం. మా నమ్మకంతో ఇక్కడ మేమిలా స్పీడుగా పోగలుగుతున్నాం. మీ నమ్మకంతో అక్కడ మీరలా ఆచితూచి నడుపుతున్నారు. ఏదయినా అక్కడ మిమ్మల్నీ, ఇక్కడ మమ్మల్నీ నడుపుతోంది నమ్మకమే!” అన్నాడు అమెరికాలో అప్పటికి పదేళ్ళకు పైగా వుంటున్న మా వాడు మరింత నమ్మకంగా.
అమెరికన్లు ఒక పట్టాన ఎవరినీ నమ్మరంటారు. కానీ వారి జీవితాలన్నీ కేవలం ‘నమ్మకం’ ప్రాతిపదికపై నిశ్చింతగా నడిచిపోతున్నాయి.
చెక్కు ఇస్తే చెల్లుతుంది అన్న నమ్మకం.
వస్తువు కొంటే నాణ్యత వుంటుందన్న నమ్మకం, నచ్చని వస్తువును తిరిగి వాపసు చేయగలమన్న నమ్మకం.
కారు నడిపేటప్పుడు వెనుకనుంచో, పక్కనుంచో అడ్డదిడ్డంగా వేరే వాహనాలు దూసుకు రావన్న నమ్మకం.
ఫ్రీ వేస్ మినహాయిస్తే మిగిలిన రోడ్లను జీబ్రా క్రాసింగ్ ల వద్ద దాటేటప్పుడు ఎంతటి వేగంతో వచ్చే వాహనమయినా స్పీడు తగ్గించుకుని, కాలినడకనపోయేవారికి దోవ ఇస్తుందన్న నమ్మకం.
బహిరంగ ప్రదేశాలలలో పొరబాటున యెంత ఖరీదయిన వస్తువును మరచిపోయినా దాన్ని పరాయివారు పొరబాటున కూడా వేలేసి తాకరన్న నమ్మకం.
పలానా టైం కు వస్తామని చెబితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం.
ఇలా నమ్మకాలమీద ఆధారపడి వారి జీవితాలు నమ్మకంగా గడిచిపోతున్నాయి.
ఇలాటి నమ్మకం ఏదయినా, ఒక్కటంటే ఒక్కటయినా మనకూ వుందని నమ్మకంగా చెప్పగలమా? లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పగలం.
అమెరికాలో లావాదేవీలన్నీ ప్లాస్టిక్ కరెన్సీ అంటే క్రెడిట్ కార్డుల ద్వారా సాగిపోతుంటాయి.
అరటి పండ్లు అమ్మేవాడి దగ్గర కూడా డబ్బులు కాకుండా ఆన్ లైన్ చెల్లింపులు చేసే పద్దతి ఈ మధ్య మన దగ్గర పల్లెటూళ్ళలో కూడా వచ్చింది. అమెరికాలో మాత్రం ఇప్పటికీ క్రెడిట్ కార్డుల ద్వారానే ఎక్కువ లావాదేవీలు నడుస్తున్నాయి. కొన్ని విషయాల్లో మనమే ముందున్నామని అనిపిస్తుంది. యోజనాలు, కోసులు, మైళ్ళు దాటి కిలోమీటర్ల వరకూ మనం ముందుకు వచ్చినా, అమెరికా ఈ విషయంలో మైలురాయి దగ్గరే ఆగిపోయింది.
వినియోగదారుడు తనకున్న హక్కులను వాడుకోవడానికి ఇక్కడ వున్న వీలుచాళ్ళు, ఆ హక్కులకు ఒక అర్ధాన్ని పరమార్ధాన్ని కలిగిస్తున్నాయి. క్రయవిక్రయాలు, సేవల విషయంలో పౌరులకు కలిగే అసౌకర్యాలకు చెల్లించాల్సిన పరిహారాలు, అపరాధ రుసుములు పెద్ద మొత్తంలో వుండడంతో వారి ఆధిక్యత మరీ పెరిగిపోయింది. వేడి కాఫీ ఒలికి వొళ్ళు కాలిందని ఒక వినియోగదారుడు వేసిన కేసులో మెక్డోనాల్డ్ వంటి సంస్త లక్షల డాలర్లలో పరిహారం చెల్లించిన సందర్భాలు వున్నాయి.
అప్పటి నుంచీ ఆ కంపెనీ విక్రయించే కాఫీ గ్లాసులపై ‘వేడి కాఫీ – జాగ్రత్త’ అని హెచ్చరికలు ముద్రించడం ఆనవాయితీగా మారింది. అలాగే ఒక రెష్టారెంటులో తడి నేలపై కాలు జారిపడ్డ వ్యక్తికి పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించాల్సి రావడంతో, అన్ని హోటళ్ళలో ‘నేల తడిగా వుంది – చూసి నడవండి’ అనే బోర్డులు పెట్టడం మొదలయింది.
అమెరికన్లు యితరుల వ్యవహారాలలో ఏ మాత్రం జోక్యం చేసుకోరు. అలాగని బావిలో కప్పల్లా వుండిపోరు. తెలియని వాళ్ళను సైతం చిరునవ్వుతో పలకరిస్తారు. మందహాసమే వారి విజయ రహస్యం అనిపిస్తుంది.
రెండు బెలూన్లు – ఒక థాంక్స్
ఓ రోజు మా మనుమరాలిని స్త్రోలర్ లో కూర్చోపెట్టుకుని నేనూ మా ఆవిడా రెండు మైళ్ల దూరంలో వున్న ఫాక్తోరియా మాల్ కి వెళ్ళాము. (ఇప్పుడు దాని పేరు మార్చారని విన్నాము)
త్రోవలో ఒక చోట ‘గరాజ్ సేల్’ అని ఒక చిన్న బోర్డు పెట్టారు.
అది స్పుటంగా కనిపించడానికి కాబోలు- దానికి గాలిలో ఎగిరే రెండు బెలూన్లు వేలాడ తీసారు. వాటిని చూసి మా మనుమరాలు ‘బెలూన్-బెలూన్’ అని అరిచింది. దాని ముచ్చట చూసి కొనిపెడదామన్నా అవి ఎక్కడ దొరుకు తాయో మాకు తెలవదు. తిరిగి వస్తుంటే ఆ బెలూన్లు మళ్ళీ కనిపించాయి. వాటిని చూపిస్తూ మా మనుమరాలు మళ్ళీ ‘బెలూన్-బెలూన్’ అని కేకలు పెట్టింది.
ఈ లోగా ఓ కారు వచ్చి అక్కడ ఆగడం, ఎవరో దిగి ఆ గరాజ్ సేల్ బోర్డుతో పాటు ఆ బెలూన్లని తీసుకుపోవడం జరిగింది. అంటే అప్పటితో ఆ సేల్ ముగిసిందన్న మాట. మరో రెండు బ్లాకులు దాటి మేము మా ఇంటికి చేరే సమయంలో, మా పక్కగా వున్న సందులోకి ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ అమెరికన్ రెండు బెలూన్లు తీసి మా అమ్మాయికి ఇచ్చాడు. అతనేదో ఇంగ్లీష్ లో చెప్పాడు కానీ మాకు ఒక పట్టాన అర్ధం కాలేదు. తరవాత తీరిగ్గా ఆలోచిస్తే తెలిసిందేమిటంటే, మా మనుమరాలు బెలూన్ చూపించి అడగడం అతను గమనించినట్టున్నాడు. అయితే ఈలోగా సిగ్నల్ పడడంతో ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటూ వెనక్కు వచ్చి బెలూన్లు ఇచ్చాడు. ఇలాటి సహృదయతనూ, సంస్కారాన్నీ మెచ్చుకోకుండా వుండగలమా?
ఇటువంటి సందర్భాలలో మనోభావాలకు అద్దం పట్టే ఇంగ్లీష్ పదం ఒకటుంది. అదే - ‘థాంక్యూ’.
అందుకే ఏళ్ళు గడిచిపోయినా ఈ సందర్భాన్ని, సన్నివేశాన్ని మరచిపోలేదు.
కింది ఫోటోలు:
సియాటిల్ లో మా దంపతులం (పదిహేనేళ్ల క్రితం)
(ఇంకావుంది)
All reactions:
Jamili Reddy Sagam, Varalakshmi Rangu Bhotla and 11 others
Like
Comment
Share
Facebook
Facebook
Facebook