25, మే 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (167) – భండారు శ్రీనివాసరావు

నిజానికి 102 డిగ్రీలు ఒక జ్వరమా?
డాక్టరు చెప్పాడని ధర్మామీటర్ రీడింగ్స్ రాసుకుని, ఆ నోట్స్ అన్నీ దాచుకోవడం అవసరమా! కాకపోవచ్చు. కానీ ఏదో ఒక రాత్రి, నిద్ర పట్టని రాత్రి ఆ రాతలే ఘడియలు లెక్కపెట్టుకోవడానికి అవసరం అవుతాయేమో ఏం చెప్పగలం.
2019 ఆగస్టు 15 రాత్రి ఎనిమిది గంటల 15 నిమిషాలకు 102.3 డిగ్రీలు
ఆగస్టు 16 ఉదయం ఆరున్నరకు 99.2 డిగ్రీలు
ఆగస్టు 16 మధ్యాన్నం ఒకటిన్నరకు 100 డిగ్రీలు
పిన్నికి ఒంట్లో బాగా లేదని జూబ్లీ హిల్స్ అపోలో లో పనిచేస్తున్న మా కజిన్, డాక్టరు బాబీ (సుసర్ల కామేశ్వర రావు) కి ఫోన్ చేస్తే, ఏదో టాబ్ లెట్ చెప్పి, టెంపరేచర్ నోట్ చేయమని చెప్పాడు.
ఆగస్టు 17 కల్లా నెమ్మదించింది. ఓకే అనుకున్నాను. బాబీ ఇంటికి వచ్చి చూసి పరవాలేదు అన్నాడు.
ఆ మర్నాడు అంటే 18 రాత్రి చెప్పాపెట్టకుండా దాటిపోయింది.
ఆమె మరణం అరుదైన అదృష్టం. నా జీవనం చెప్పుకోలేని దురదృష్టం.
అందుకే ఆగస్టు అంటే, నేను పుట్టిన రోజు ఆ నెలలోనే అయినా, ఒక రకమైన అయిష్టత. అకారణ ద్వేషం.
అదే ఆగస్టు నేను నిరుడు అమెరికాలో వుండగా వచ్చింది. ఆగస్టు ఏడో తేదీ కూడా వచ్చింది. సియాటిల్ నగరంలో ఆ ఉదయం తొలి వెలుగు రేఖలు విచ్చుకుంటూవుంటే, నా కంటి ముందు మరో వెలుగు కనబడింది. కనబడడమే కాదు నాతో మాట్లాడింది కూడా.
‘నా పొరబాటో, నీ గ్రహపాటో తెలియదు. మొత్తం మీద 78 దాటుతున్నావు. నువ్వు అడగకుండానే నీకో అపూర్వమైన వరం ఇవ్వాలని అనిపించి వచ్చాను. అయితే ఓ షరతు. దానికి ఒప్పుకుంటేనే సుమా!’
‘.............’
‘చెబుతా విను. ఇక నుంచయినా నువ్వు ఆనందంగా వుండు. ఇతరులని సంతోషంగా ఉంచు. ఇలా చేస్తే నేనిచ్చే వరమేమిటో తెలుసా? సంతృప్తి. ఇంగ్లీషులో కంటెంట్ మెంట్ అంటారుట. అది సాధిస్తే, ఇక నాకిది కావాలి, అది కావాలి అని నన్ను ఎప్పుడూ సాధించవు. ఇలా తెల్లవారకుండానే వచ్చి నీకు వరాలు ఇచ్చే పని నాకూ వుండదు. తెలిసిందా! డెబ్బయి ఎనిమిదేళ్లు వచ్చిన తర్వాత కూడా తెలియకపోతే నీ ఖర్మ. వస్తా!’
దేవుడో, దేవతో ఆ వెలుగు మాయం కాగానే, పళ్ళెంలో హారతి వెలుగుతో మా కోడలు భావన ప్రత్యక్షం. ఆమె వెనుకనే సందీప్, మనుమరాళ్లు సఖి సృష్టి బర్త్ డే గ్రీటింగ్స్ పాడుతూ. తెల్లవారుఝామున కలలో కనిపించిన ఆ వెలుగు చెప్పినట్టు ఇంతకంటే సంతృప్తి మరేముంటుంది.
ఆ రోజు సాయంత్రం సందీప్ బాగా డిమాండ్ వున్న ఒక చైనీస్ రెస్టారెంట్ దిన్ తాయ్ ఫంగ్ (DIN TAI FUNG) లో టేబుల్ బుక్ చేశాడు. చైనాకు చెందిన యాంగ్ బింగ్ యీ (Yang Bing-yi) దంపతులు తైవాన్ వలసవెళ్లి అక్కడ 1958 లో చిల్లరగా వంట నూనెలు అమ్మే వ్యాపారం మొదలు పెట్టారు. తదనంతర కాలంలో నూనెను టిన్నులలో అమ్మడం మొదలైన తర్వాత వారి వ్యాపారం మందగించింది. దానితో తన పాత యజమాని పేరు కలిసివచ్చేలా దిన్ తాయ్ ఫంగ్ అనే పేరుతొ రెస్టారెంట్ ప్రారంభించారు. అది ఇంతింతై, అంతింతై ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నూట యాభయ్ చోట్లకు హోటల్ చైన్ గా విస్తరించింది. ఆరు దశాబ్దాలకు పైగా దిగ్విజయంగా సాగుతున్నప్పటికీ, ఇప్పటికీ ఈ రెస్టారెంట్ ఒక కుటుంబం చేతుల్లోనే వుంటూ వస్తోంది.
‘’మీరు వుండేది కొద్ది రోజులే, రకరకాల దేశాల తాలూకు రెస్టారెంట్లు ఇక్కడ వుంటాయి. చైనీస్, మెక్సికన్, స్పానిష్, ఫ్రెంచ్ ఇలా చాలా వున్నాయి. అన్నీ టేస్ట్ చేయండి. తినగలిగితే తినండి. లేకపోతే ఇంటికి రాగానే భావన నిమిషాల్లో మీ పోపన్నం వేడివేడిగా నిమిషాల్లో తయారుచేసి వడ్డిస్తుంది, మీకు ఇష్టమైన గడ్డ పెరుగుతో తిందురు కానీ’ అన్నాడు సందీప్ ఇదే ఫైనల్ అన్నట్టుగా. రోములో వున్నప్పుడు రోమన్ లాగే వుండాలి. వెలుగు దేవత కూడా అదే చెప్పింది కదా!
చాలా దూరం ప్రయాణం చేసి ఆ హోటల్ కు వెళ్ళాము. ముందుగా బుక్ చేసుకున్నాము కాబట్టి సరిపోయింది. పిల్లాపాపలతో అప్పటికే అనేకమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు.
పెద్ద పెద్ద హాళ్ళు. ఒక్కో హాలులో పదిమంది కూర్చొనే పది పది టేబుల్లు. నానా కోలాహలంగా వుంది. దాదాపు నాలుగు వందల మంది ఒకేసారి భోజనం చేయడానికి సరిపడేలా వుంది. వెయిటర్లు కూడా చేతుల్లో ప్లేట్లు పట్టుకుని కాకుండా, ఎయిర్ హోస్టెస్ ల మాదిరిగా రకరకాల మద్యాలను, ఆహార పదార్ధాలను వీల్ ట్రేలపై తీసుకువచ్చి వడ్డిస్తున్నారు. మన దగ్గర బాబాయ్ హోటల్ ఇడ్లీ మాదిరిగా ఆ హోటల్లో Xiao Long Bao అనే నోరు తిరగని డిష్ చాలా ఫేమస్. ఎక్కడెక్కడి దేశాల వాళ్ళు దీని రుచి చూడడానికి ఇక్కడికి వస్తుంటారు. గుండ్రటి వుడెన్ బాస్కెట్లలో సర్వ్ చేస్తారు. పైగా దీన్ని తయారు చేసే విధానాన్ని హోటల్ కష్టమర్లు ప్రత్యక్షంగా చూడడానికి వీలుగా హోటల్ల్లోనే అద్దాల గదిలో ఓపెన్ కిచెన్ ఏర్పాటు చేశారు. గోధుమ పిండో, మైదానో తెలియదు, దాన్ని తడిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి, వాటిల్లో కస్టమర్లు కోరిన పదార్ధాలను పెట్టి, మన వైపు పూర్ణం బూరెల మాదిరిగా తయారు చేసి, నూనెలో వేగించకుండా ఆవిరిపై ఉడికిస్తారు. ఆ ఆవిరి కుడుములను వుడెన్ బాస్కెట్లలో వుంచి సర్వ్ చేస్తారు. జనాలు ఆవురావురుమని తింటుంటారు. అక్కడ వున్న కాసేపట్లో నాకు బోధపడ్డ విషయం ఇది.
భావన ఇంట్లో నాకోసం వేడివేడి పోపన్నం (అన్నంలో పోపు పెట్టి చేస్తారు, దాదాపు పదేళ్లుగా నా రాత్రి భోజనం ఇదే) గడ్డ పెరుగు, రెండు పొడవాటి అరటి పండ్లు రెడీగా వుంచుతుందని తెలుసు కాబట్టి నేను కొత్త రుచులతో కొత్త ప్రయోగాలు చేయకుండా ఆ సమయాన్ని నాదైన రీతిలో ద్రవాహారంతో సద్వినియోగం చేసుకున్నాను.
పదిహేనేళ్ల క్రితం ఓసారి మా ఆవిడతో కలిసి అమెరికా వెళ్ళినప్పుడు నా పుట్టిన రోజును పసిఫిక్ సముద్ర తీరంలోని ఒక చిన్న నగరంలో సందీప్ జరిపిన సంగతి గుర్తుకువచ్చింది.
పసిఫిక్ తీరం పొడవునా కొన్ని వందల మైళ్ల దూరం నిర్మించిన విశాలమయిన రహదారి వెంట కారులో వెడుతుంటే చెట్ల నడుమనుంచి అతి పెద్ద ఆ మహాసముద్రం దోవపొడుగునా మాతో దోబూచులాడుతున్నట్టు కానవస్తూనే వుంది.
వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్ నుంచి ఆరెగన్ రాష్ట్రంలోని డీపోబే టూరిస్ట్ రిసార్ట్ కు చేరడానికి ఆరేడు గంటలు పట్టింది. మధ్యలో ఒక పార్కులో ఆగి ఓ చెట్టుకింద కూర్చుని ఇంటినుంచి తెచ్చుకున్న పులిహోర లాగించాము. డీపోబేలో అయిదు గదులు వున్న ఒక భవనం మొత్తాన్ని నెట్లో ముందుగానే బుక్ చేశారు. కార్లో వున్న జీ పీ ఎస్ సిస్టం సాయంతో ఆ ఇంటిని తేలిగ్గానే పట్టుకోగలిగాము. మాంత్రికుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలో వున్నట్టు ఆ ఇంటి తాళం చెవిని ఇంటి ముందువున్న ఒక చిన్న లాకరులో భద్రపరిచారు. ఒక కోడ్ నెంబరు ద్వారా దాన్ని తెరిచి తాళం చెవి తీసుకుని లోపల ప్రవేశించాము.
మూడంతస్తుల భవనం. కింద రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి షెడ్డు వుంది. పైన విశాలమయిన డ్రాయింగ్ రూముతో పాటు గ్యాస్, డిష్ వాషర్, వంట సామాగ్రి, ప్లేట్లు గ్లాసులతో సహా అన్ని వసతులతో కూడిన కిచెన్ వుంది. పదిమంది భోజనం చేయడానికి వీలయిన డైనింగ్ టేబుల్, అతి పెద్ద ప్లాస్మా టీవీ, ఫైర్ ప్లేస్, సోఫాలు వున్నాయి. పైన పడక గదులు, ఒక పక్కన బాల్కానీలో ‘హాట్ టబ్’ ఏర్పాటు చేసారు. అయిదారుగురు కలసికట్టుగా అందులో కూర్చుని, జలకాలాడుతూ విశ్రాంతి తీసుకోవచ్చు. వెచ్చటి నీటి ధారలు అతి వేగంగా చిమ్ముతూ అన్నివైపులనుంచి శరీరాలను తాకుతూ మసాజ్ చేస్తుంటాయి. అందులోకి దిగిన తరవాత పిల్లలకూ పెద్దలకూ కాలం తెలియదు. చల్లని సముద్రతీరంలో వెచ్చగా జలకాలాడడం అదో అనుభూతి.
స్నానపానాదులు ముగించుకుని డీపోబే టూరిస్ట్ రిసార్ట్లో వింతలూ విశేషాలు చూస్తూ- అతిదగ్గరలో అలలతో తీరాన్ని తాకుకుతున్న అతి పెద్ద మహాసముద్రాన్ని తిలకిస్తూ కలయ తిరిగాము. అవన్నీ మరపురాని మధుర స్మృతులు.
తోకటపా:
లింకన్ సిటీ సముద్రతీరంలో ఒక ‘బుల్లి’ అద్భుతాన్ని కూడా చూసాము. నిజానికి అది పెద్ద అద్భుతమేమీ కాదు. దేన్నయినా టూరిస్ట్ ఎట్రాక్షన్ గా అమెరికన్లు ఎలా మార్చుకుంటారనడానికి ఇది మరో ఉదాహరణ.
‘ప్రపంచంలో అతి ’పొట్టి’ నదిని ఇక్కడ చూడవచ్చు.’ - అన్న బోర్డు చూసి దాన్ని చూడడానికి ఎంతో ఉత్సాహపడ్డాము. తీరా చూస్తే అదొక పిల్ల కాలువలా వుంది. తీరం పక్కన రోడ్డుకు ఆవల వున్న కొండల్లో పుట్టి సముద్రంలో కలుస్తున్న నది అని తెలిసింది. దాని పొడవు కేవలం 440 అడుగులు. అంత ‘చిన్న’ నది వచ్చి కలుస్తున్నది దేనిలో? సముద్రాలు అన్నింటిలో అతి పెద్దదయిన పసిఫిక్ మహాసముద్రంలో. అది మరో విశేషం. దాన్ని దొరకబుచ్చుకుని టూరిస్ట్ ఆకర్షణగా మార్చివేసారు.
ఈ చిట్టి పొట్టి నది సముద్రంలో కలుస్తున్న చోట ఇంకో విశేషం గమనించాము. అదేమిటంటే, ఈ నదిలో నీళ్ళు గోరువెచ్చగా వుంటాయి. ఒక్క అడుగు ముందుకు వేసి సముద్రంలో కాలు పెడితే గడ్డకట్టేంత చల్లగా వుంటాయి.
కింది ఫోటోలు :
దిన్ తాయ్ ఫంగ్ హోటల్ వెలుపలా, లోపలా దృశ్యాలు, 2010 లో డిపోబే టూరిస్ట్ రిసార్ట్ లో నా పుట్టిన రోజున కేక్ కటింగ్, పసిఫిక్ సముద్ర తీరంలో విహారాలు.
(ఇంకా వుంది)
All reactions:
Paresh Turlapati and 2 others
Like
Comment
Share
Facebook
Facebook

23, మే 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (166) – భండారు శ్రీనివాసరావు

 “ఇన్ సైడ్ వాయిస్! అవుట్ సైడ్ వాయిస్!”

నిజం చెప్పొద్దూ! నేను ఇంతవరకు వినని మాట. మా రెండో అన్నయ్య మనుమరాళ్లు స్పురిత, హసిత నోటి వెంట మొదటిసారి విన్నాను.
“టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్లు దగ్గర దగ్గరగానే కూర్చొంటారు కదా! తాతయ్యా! మరి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నట్టు మాట్లాడతారు”
ఒకప్పుడు ఈ చర్చల్లో పాల్గొనేవాడిని కాబట్టి వారి ప్రశ్న ఒకరకంగా సూటిగా నాకే తగిలిన భావన కలిగింది.
నా నుంచి జవాబు రాకపోవడంతో వాళ్ళే మళ్ళీ అన్నారు, “ఈ డిబేట్స్ లో ఇన్ సైడ్ వాయిస్ చాలు, అనవసరంగా అవుట్ సైడ్ వాయిస్ తో మాట్లాడుతున్నారు” అని.
ఈ ఇద్దరూ అమెరికాలోనే పుట్టారు. కానీ మన చదువులకోసం, సాంప్రదాయకంగా వారిని పెంచడం కోసం పిల్లల్ని తీసుకుని మా అన్నయ్య కొడుకు లాల్, కోడలు దీప ఆ దేశం నుంచి వచ్చేసి హైదరాబాదులో సెటిల్ అయ్యారు. హైదరాబాదులో ఒకటి రెండు మూడు అని పెద్ద గొంతుకతో గావుకేకలు పెట్టే ప్రకటనలు ఇచ్చే పెద్ద కార్పొరేట్ కాలేజీలో ఖరీదైన ఫీజులు కట్టి చేర్పించారు. చేరిన మొదటి రోజే వారికి కళాశాల మెట్ల దగ్గర చెత్త కుప్పలు కనిపించాయి. ఏడాదికి ఒకసారయినా క్లీన్ చేస్తున్నట్టు లేదని వాళ్ళు మొహం చిట్లించారు. ( వీరిద్దరిలో పెద్డది స్పురిత ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. చిన్నది హసిత అదే దేశంలో పై చదువులు చదువుతోంది)
ఆ దేశంలో ప్రతివారికీ చిన్నప్పటి నుంచీ నలుగురిలో మాట్లాడడం ఎలాగో నేర్పుతారట. అందులో భాగమే ఈ ఇన్ సైడ్ వాయిస్, అవుట్ సైడ్ వాయిస్.
ఫుట్ బాల్ మైదానం పెద్దగా వుంటుంది. అక్కడ క్రీడాకారులు ఒకరితో మరొకరు స్వరం పెంచి మాట్లాడుకోవాల్సిన అవసరం వుంటుంది. అది అవుట్ సైడ్ వాయిస్. అటువంటి చోట్ల కొంచెం గొంతు పెంచినా ఎవరూ ఏమీ అనుకోరు.
అదే ఇళ్ళల్లో, స్కూళ్ళల్లో, మాల్స్ లో మాట్లాడుకొనేటప్పుడు స్వరం తగ్గించి మెల్లగా మాట్లాడడం అలవాటు చేస్తారు. అది ఇన్ సైడ్ వాయిస్ అన్నమాట.
గురువు అనేవాడికి వయసు ప్రధానం కాదు, జ్ఞానం ముఖ్యం. అది కలిగి వున్నవారు చిన్నవారయినా, మంచి విషయాలను వారి నుంచి నేర్చుకోవచ్చు.
ఆ విధంగా నేను, స్పురిత, హసితల నుంచి ఒక పాఠం నేర్చుకున్నాను.
అదే స్పురిత గ్రాడ్యు యేషన్ సెరిమనీ లో పాల్గొనడం ఈ సారి అమెరికా ట్రిప్ లో ప్రధాన అంశం.
అమెరికన్ విద్య వ్యవస్థలో ఈ కార్యక్రమాలకి అంత్యంత విలువ ఇస్తారు. తలితండ్రులు, కుటుంబసభ్యులే కాదు, స్నేహితులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు. మేము పదిహేడు మందిమి కట్టగట్టుకుని విమానంలో తాంపా వెళ్ళింది స్పురిత గ్రాడ్యుయేట్ పట్టా తీసుకునే దృశ్యం చూడడం కోసమే.
స్పురిత చదువుకున్న సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ చాలా గొప్పగా వుంది. ఎకరాలకు ఎకరాల ఆవరణలో విశాలమైన రోడ్లు. ఇరుపక్కలా పచ్చటి చెట్లు, అందమైన హాస్టల్ భవనాలు, తరగతి గదులు, గ్రంథాలయాలు, ఫీజు సంగతి ఏమో కానీ చదువుకుంటే ఇలాంటి చోట చదువుకోవాలి అని అసూయపడేలా వుంది.
సెరిమనీ జరిగిన సభామందిరం పరమాద్బుతంగా వుంది. అంతమంది జనం ఎలాంటి తొక్కిడి లేకుండా లోపలకు వెళ్లి రావడానికి చక్కటి ఏర్పాట్లు చేశారు. పట్టాలు తీసుకునే వాళ్ళు ఒకే రకం వస్త్ర ధారణతో వచ్చారు. ఈ దుస్తులను, నెత్తికి పెట్టుకునే టోపీని వాళ్ళు ఒక జ్ఞాపికగా దాచుకుంటారు.
కార్యక్రమం పూర్తయిన తర్వాత స్పురితను అభినందించి యూనివర్సిటీ ఆవరణ అంతా కలయతిరిగాము. కొలన్లు, సెలయేళ్ళు, నిలువెత్తు శిల్పాలతో పెద్ద ఉద్యానవనంలా వుంది.
మర్నాడు సంభవించిన భయంకరమైన సునామీని తప్పించుకుని మిగిలినవాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు. నేనూ, సందీప్ అదే రోజు వేరే విమానంలో సియాటిల్ బయలుదేరాము. అదో సుదీర్ఘ ప్రయాణం. మా రెండో మనుమరాలు సృష్టి కారు తీసుకుని ఎయిర్ పోర్టుకి వచ్చింది. కళ్ళ ముందు పుట్టిన అమ్మాయి అమెరికాలో అలవోకగా ఏనుగులాంటి కారు నడుపుతుంటే కళ్ళకు చూడముచ్చటగా అనిపించింది.
కొడుకే తండ్రిగా మారిన వేళ
'చిట్టి డెలివర్డ్ మేల్ చైల్డ్ - గోపాలరావు '
1973 ఆగస్టు అయిదో తేదీన మద్రాసు నుంచి మా మామగారు ఇచ్చిన టెలిగ్రాం బెజవాడలో వున్న నాకు మరునాడు చేరింది. ఈ టెలిగ్రాంని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను. అయితే ఆ రోజుల్లో టైపు చేసిన కాగితాలను టెలిగ్రాం పేపరుపై జిగురుతో అతికించేవారు. కాలక్రమంలో పొడిబారి అవి రాలిపోయాయి.
నాడు పుట్టిన నా పెద్ద కొడుకే ఈ సందీప్. సండే నాడు పుట్టాడు కనుక సందీప్ అని పిలవడం మొదలు పెట్టాము. బాలసారలు, నామకరణాలు గట్రా లేవు.
ఇప్పుడు పెరిగి పెద్దవాడై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడి యాభయ్యవ పుట్టిన రోజునాడు నేను కాకతాళీయంగా అమెరికాలో వుండడం తటస్థించింది.
వాడి ఫ్రెండ్స్ ఓ పదిమంది తమ కుటుంబాలతో కలసి పుట్టిన రోజు వేడుకను సియాటిల్ లోని నదిలో నౌకా విహారం చేస్తూ ఘనంగా, సందడిగా నిర్వహించారు. నా కోడలు భావన, మనుమరాళ్ళు సఖి, సృష్ఠి ఈ వేడుకకు తగిన ప్రణాళిక చాలా ముందుగానే సిద్ధం చేశారు.
అందరూ సందీప్ గురించి మాట్లాడమంటే నాకు మాటలు కరువయ్యాయి.
' 2019 లో నా భార్య నిర్మల కన్నుమూసేవరకు వాడికి నేను తండ్రిని. అప్పటినుంచి వాడు నాకు తండ్రిగా మారి కడుపులో పెట్టుకుని చూస్తున్నాడు '
ఇంతకు మించి నా నోరు పెగల్లేదు.
మాట్లాడిన వారందరూ చక్కటి తెలుగులో మాట్లాడి, సందీప్ తో తమ పరిచయాన్ని, స్నేహాన్ని, వాడి మంచితనాన్ని గొప్పగా ప్రశంసించారు.
ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఫోటో ముందు మళ్ళీ కేకు కట్ చేసి దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.
ఒకరకంగా వాడు నా కంటే రెండు రోజులు పెద్ద. నా పుట్టిన రోజు ఆగష్టు ఏడు అయితే వాడిది ఆగష్టు అయిదు.
కింది ఫోటోలు:
తాంపా యూనివర్సిటీ దృశ్యాలు, సందీప్ పుట్టినరోజు దృశ్యాలు.
All reactions:
1
Like
Comment
Share
Facebook