20, మే 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (165) – భండారు శ్రీనివాసరావు

టైం మిషన్లో గతంలోకి ప్రయాణం

అమెరికన్లకు మార్పు ఇష్టం. స్తబ్దతను ఇష్టపడరు. ప్రతిక్షణం కదలికలో ప్రగతిని కోరుకుంటారు.
నిరుడు 2014 లో వెళ్ళినప్పుడు, అంతకు పూర్వం మా ఆవిడతో కలిసి నేను గమనించిన మరో విషయం ఏమిటంటే మార్పును ఎంత గాఢoగా కోరుకుంటారో గతాన్ని అంతగా ప్రేమిస్తారు. గతం గుర్తులను పదిలంగా దాచుకుంటారు. భావితరాల కోసం వాటిని భద్రపరుస్తారు.
మేరీ లాండ్ రాష్ట్రంలోని ఉడ్ స్టాక్ నగరానికి దాపులో సైక్స్ విల్ (Sykes Ville) అనే చోట ఒక రైల్వే స్టేషన్ వుంది. దీన్ని 1831 లో ఏర్పాటు చేశారు. 1863 లో జరిగిన రైల్వే కార్మికుల సమ్మె హింసాత్మకంగా మారింది. ఆ విధ్వంసకాండలో రైలు మార్గంతో పాటు నగరంలోని ఆస్తులు కూడా దెబ్బతిన్నాయి.
1883 లో తిరిగి ఈ రైల్వే స్టేషన్ ను ఇప్పుడున్న రూపంలో పునరుద్ధరించారు. మరుసటి ఏడాది నుంచి రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. కానీ పరిణామక్రమంలో భాగంగా 1950 లో ఈ స్టేషన్ ను మూసివేశారు. కొన్ని గూడ్స్ రైళ్లు నడుపుతున్నారు. స్టేషన్ భవనంలో ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నారు. అక్కడ విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ, వచ్చి పోయే గూడ్స్ రైళ్ళను తిలకించడానికి సెలవు దినాల్లో అనేకమంది పర్యాటకులు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ వుంటారు. సుమారు రెండువందల ఏళ్ళ నాటి రైలు బోగీలను, రైలు ఇంజన్ ను మ్యూజియంగా మార్చి అలనాటి రైళ్ళ స్వరూప స్వభావాలను నేటి తరానికి పరిచయం చేస్తున్నారు. అలనాటి రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రతి శనివారం, ఆదివారాల్లో రైతు బజార్లు నిర్వహిస్తున్నారు.
(బెజవాడలో ఇలాగే సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్ ను మూసివేశారు. ఇప్పుడు ఆ ప్రదేశం రద్దీ రోడ్లతో సమూలంగా రూపం మార్చుకుంది. స్టేషన్ అవశేషాలు మచ్చుకు కూడా లేవు. ఒకప్పుడు అక్కడ ఓ రైల్వే స్టేషన్ వుందంటే ఈ తరం వారెవ్వరూ నమ్మరు)
సైక్స్ విల్ రైల్వే స్టేషన్ దాపుల్లో, పర్యాటకుల కోసం రోడ్డుకు ఇరువైపులా హోటల్లు, రెస్టారెంట్లు, విడిది గృహాలు లెక్కకు మిక్కిలిగా వున్నాయి. గతంలోని పాత విషయాలను తెలుసుకోవడానికి, వాటిని కళ్ళారా చూడడానికి ఆ దేశపు ప్రజలు ఎంత ఆసక్తి ప్రదర్శిస్తారో అర్ధం చేసుకోవడానికి ఈ టూరిస్టుల తాకిడి చాలు.
అమెరికన్లకు పాత మీద ఎంత మోజూ నాకు ఇంతకు పూర్వం చేసిన అమెరికా యాత్రల్లోనే తెలియవచ్చింది.
పాతను ‘ఉప్పు పాతర’ వేయకుండా అక్కడవాళ్ళు యెంత జాగ్రత్త పడతారో పడుతున్నారో అర్ధం అయింది. 2010లో అమెరికా నుంచి బయలుదేరుతూ ఆఖరివారంలో చూసిన రెండు విశేషాలు పాతలోని మధురిమను మరోసారి అనుభవంలోకి తెచ్చాయి.
1889 లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సియాటిల్ డౌన్ టౌన్ లో చాలాభాగం తగులబడిపోయింది. తరవాత దాని స్తానంలో కొత్త నగరం నిర్మితమయింది. కానీ పాతనగరం జ్ఞాపకాలను అతి పదిలంగా దాచుకుంటున్న తీరే అద్భుతం. ఆదర్శప్రాయం.
దాదాపు నూట యిరవై ఏళ్ల నాటి సియాటిల్ పాత బస్తీలోని కొన్ని ప్రదేశాలను ఎంపికచేసి, బేస్ మెంట్ లో పాతవాటిని మ్యూజియంలో మాదిరిగా జాగ్రత్తచేసి, పైన పలు అంతస్తుల సుందర భవనాలను నిర్మించుకున్నారు.
అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న పాత గృహాలను, గృహోపకరణాలను రూపు చెడకుండా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, భద్రపరచి - ‘సియాటిల్ అండర్ గ్రౌండ్ టూర్’ పేరుతొ టూరిస్టులకు చూపిస్తున్నారు. దాదాపు రెండు గంటలపాటు సాగే ఈ టూరులో ఒక గైడ్ వెంటవుండి పాతరోజుల సంగతులను కొత్త కొత్తగా చెబుతుంటాడు.
ఆ కాలంలో వాడిన టైపు రైటర్లు, గోడగడియారాలు, సోఫాలు, బాయిలర్లు, ఇంటి పైకప్పులు, దర్వాజాలు అన్నిటినీ చూడవచ్చు. పదిహేను డాలర్ల టిక్కెట్టు కొనుక్కుని ఈ టూర్ లో పాల్గొనడానికి వచ్చే టూరిస్టుల సంఖ్య ప్రతిరోజూ వందల్లో వుంటుందంటే – పాత రోజులపట్ల ఇక్కడి ప్రజలకు వున్న మోజు అర్ధం చేసుకోవచ్చు.
అలాగే. ఇస్సక్క్వా (Issaquah).
సులభంగా నోరు తిరగని ఈ ఊరు సియాటిల్లోని శివారు ప్రాంతం. మైనింగ్ అవసరాలకోసం ఈ పట్టణాన్ని కలుపుతూ లోగడ ఒక రైలు మార్గం వుండేది. దాన్ని తరవాత మూసివేశారు. ఇస్సక్క్వా హిస్టారికల్ సొసైటీ వారు ఈ పట్టణం డౌన్ టౌన్ ను ఒక చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేసి, అప్పటి రైల్వే స్టేషన్ ను, రైలు పట్టాలను లాగే వుంచేసి పాత జ్ఞాపకాలకు గుర్తుగా మిగిల్చుకున్నారు.
ఆ రోజుల్లో వుండే పెట్రోల్ (గ్యాస్) బంకులను, సినిమాహాళ్ళను యధాతధంగా వుంచేసారు. ఆధునిక నగరం సియాటిల్ నుంచి వచ్చి ఆ పాత పట్టణంలో కలయ తిరుగుతూ వుంటే, ఒక్కసారిగా ‘టైం మెషిన్’ లో గతకాలంలోకి జారిపోయిన అనుభూతి కలుగుతుంది.
సైక్స్ విల్ రైల్వే స్టేషన్ సందర్శన అనంతరం, కాశ్యప్ వాహిని ఇంట్లో భోజనాల కార్యక్రమం పూర్తిచేసుకుని, తిన్నది అరగడానికి మళ్ళీ తిరగడానికి బయలు దేరాం.
చుట్టుపక్కల అంతా దట్టమైన అడవులు. వాటిగుండా వేసిన చక్కటి రహదారుల వెంట పొతే, చిట్టడవి నడుమ గలగలా పారుతున్న సెలయేరు. దాని మధ్య చిన్నాపెద్ద బండరాళ్ళు. వాటి మీద దుముకుతూ, కేరింతలు కొడుతూ పిల్లలు చాలాసేపు కాలక్షేపం చేశారు. నిజానికి అరకు లోయలో కూడా ఇలాంటి సెలయేరు వుంది. కానీ ఇంత గొప్ప రహదారి సౌకర్యం ఉందా అంటే అనుమానమే. ఏటి వొడ్డున నలుచదరంగా ఉన్న ఓ బండరాయిపై నేను విశ్రాంతి తీసుకుంటూ పిల్లలు చేస్తున్న తమాషాలను చూస్తుండిపోయాను. రమణీయమైన ప్రకృతి అందాలను, నింగిని తాకుతున్న ఎత్తైన వృక్షాలు చూస్తూ కాలక్షేపం చేశాను.
ఇదే ఊర్లో మా అన్నయ్య, మేనల్లుడు, మేనకోడలి పిల్లలు దగ్గర దగ్గరగానే (వుడ్ స్టాక్, సైక్స్ విల్, టర్ఫ్ వ్యాలీ) ఇండిపెండెంట్ ఇళ్ళు కొనుక్కుని వుంటున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తప్పిస్తే, ఉన్న పద్దెనిమిది మందిమీ కలిసి ఎవరో ఒకరి ఇంట్లో మధ్యాహ్నభోజనాలు, రాత్రి డిన్నర్లు. ఎక్కడకు వెళ్ళినా నాలుగు కార్లు కదలాల్సిందే.
పరాయిదేశంలో కూడా కుటుంబ ఆప్యాయతలు అలాగే వున్నాయి. అందరూ వర్క్ ఫ్రం హోం బాపతే కాబట్టి లాప్ టాపుల్లో ఆఫీసు పని. పనిలోపనిగా కాలక్షేపం కబుర్లు. మధ్య మధ్య వేడి వేడి పకోడీలు, కాఫీలు సరేసరి.
(30-07-2024)
కింది ఫోటోలు:
2010 లో ఇస్సక్క్వా హిస్టారికల్ సిటీలో మా కుటుంబం, సైక్స్ విల్ రైల్వే స్టేషన్ లో మా విహారం, సెలయేటి వద్ద కాలక్షేపం
(ఇంకావుంది)
Like
Comment
Share
Facebook
Facebook
Facebook

19, మే 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (164) – భండారు శ్రీనివాసరావు

 

చీకటి వెలుగుల రంగేళి

ఆరోగ్యం కోసం గాలి మార్పు, మనసు కుదుటపడడం కోసం స్థలం మార్పు అనే వాళ్ళు వెనుకటి రోజుల్లో.
అంచేత, కొన్నాళ్ళు ఎటైనా తిరిగివస్తే మనసు కుదుటపడుతుందని మా పెద్దవాడు సందీప్ కోరిన విధంగా, ఓ రెండు నెలలు అమెరికా ప్రయాణం పెట్టుకున్నాను. హైదరాబాదు నుంచి మా రెండో అన్నయ్య కుమారుడు లాల్ బహదూర్, దీప దంపతులు అమెరికా వెడుతుండడంతో వాళ్ళతో పాటు వెళ్లాను. ఒంటరి ప్రయాణం వద్దని ఈ ఏర్పాటు.
విదేశీ ప్రయాణాలు కొత్త కాదు కానీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పేరుతో చేస్తున్న కొత్త కొత్త సెక్యూరిటీ ప్రయోగాలు ప్రతి ప్రయాణంలో కొత్తగానే వుంటున్నాయి.
మేము ప్రయాణిస్తున్న ఎమిరేట్స్ విమానం, అరగంట ఆలస్యంగా హైదరాబాదులో బయలుదేరి, దుబాయ్ విమానాశ్రయానికి సకాలంలో కాకపోయినా, కనెక్టింగ్ ఫ్లయిట్ తప్పిపోయేంత ఆలస్యం మాత్రం చేయలేదు.
దుబాయ్ లో సెక్యూరిటీ చెక్ విధానాన్ని అత్యంత ఆధునికం చేయాలని అనిపించడమే తడవు, డబ్బుకు కొరత లేని ఆ దేశపు రాజులు రెండు బొమ్మల్ని తెచ్చి అక్కడ పెట్టారు. ఆ బొమ్మలు సజీవ శిల్పాల మాదిరిగా కళ్ళు కదిలిస్తూ ఎదురుగా నిలబడ్డ మనిషిని ఆపాదమస్తకం పరీక్షించి, ఎదుటి మనిషి అసలు మనిషే, నకలు కాదు అని తాము నిర్ధారించుకుంటే మాత్రం లోపలకు దయచేయమని చేయి చూపిస్తుంది. లేకపోతే బయటకు దయచేయమని వాళ్ల భాషలో వురిమి చెబుతుంది. నా వెంట వచ్చిన ( లేదా వాళ్ల వెంట నేను అంటే బాగుంటుంది) లాల్ బహదూర్, దీప ఇద్దరికీ ఈ దుబాయ్ బొమ్మ పచ్చ జెండా ఊపి, నా దగ్గరకు వచ్చేసరికి నో, నియత్, నువ్వు నువ్వు కాదు పో పొమ్మని ఎడమ చేతితో కసిరి కొట్టింది. అక్కడున్న సెక్యూరిటీ నన్ను వెంటనే బయటకు పొమ్మనకుండా, ఆ బొమ్మ ముందు నిలబడినప్పుడు రెండు పాదాలు ఎక్కడ పెట్టాలి, కళ్ళు కెమెరా లోకి ఎలా చూడాలి అనే విషయాలు బోధ పరిచి మళ్ళీ అక్కడ నిలబెట్టాడు. ఆ బొమ్మ కళ్ళు విప్పార్చి మరీ, నన్ను చూసింది. కనురెప్పలు రెపరెప లాడించింది. బొమ్మ కాస్త మెత్త బడ్డట్టు ఆనిపించింది. కాసేపు అలా చూసి మళ్ళీ కళ్ళు ఉరిమి చూసి నువ్వు నువ్వు కాదు మరొకరివి అని వాళ్ల భాషలో అరిచి చెప్పింది.
అప్పుడు లైట్ వెలిగింది.
పాస్ పోర్ట్ ఫొటోలో, అమెరికా వీసా ఫొటోలో నాకు మీసం వుంది. ఈ బొమ్మ కానీ ఆ తేడా కానీ కనిపెట్టి అలా తేడాగా బిహేవ్ చేస్తోందన్న సందేహం కలిగి, ఆ సెక్యూరిటీ అధికారికి మీసాలతో వున్న నా పాత ఐడెంటిటీ కార్డులలోని ఫోటోలు, మీసాలు లేని తాజా ఫేస్ బుక్ ఫోటోలు చూపించి, ఆ బొమ్మ కాదు అంటున్న ఆ నేను ఈ నేనే అని వచ్చీరాని అన్ని భాషల్లో చెప్పేసరికి, అతడు కరుణాంతరంగుడై, ప్రశాంత చిత్తుడై నాకు మాన్యువల్ గా సెక్యూరిటీ చెక్ చేసి మొత్తానికి కథకు శుభం కార్డు వేశాడు. కొన్ని నెలల పాటు నన్ను చూడకుండా, కటక్ లో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో వున్న నా రెండేళ్ళ మనుమరాలు జీవిక, ఆ మధ్య కటక్ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మీసాలు లేని నన్ను చూడగానే, తాతా అంటూ వాళ్ళమ్మ చంకలో నుంచి నా మీదకు ఎగిరి దూకింది. ఈ మాత్రం గ్రహింపు అంత డబ్బు పోసి కొన్న ఆ బొమ్మకు లేకపోవడం విచిత్రమే!
వృత్తి జీవితంలో ప్రతి జర్నలిస్టు కు కొద్దో గొప్పో Conducted Tours అనుభవం వుండే వుంటుంది. ఏదో మంత్రిత్వ శాఖ వాళ్లో, బ్యాంకు వాళ్ళో తమ ప్రగతిని పాత్రికేయులకు చూపించడానికి ఇలాంటి అధ్యయన యాత్రలు నిర్వహిస్తారు. జేబులో రూపాయి లేకపోయినా సరే, మగ పెళ్లి వారి మర్యాదలకు తక్కువ వుండదు.
అలాగే ఈ అమెరికా యాత్రలు కూడా.
గతంలో ఒకసారి ఆటా సభలు అనుకుంటా, డాలర్ల డిక్లరేషన్ చేసే సమయంలో అడిగిన గుర్తు, డబ్బు లేకుండా ఈ దేశంలో ఎలా బతుకుతారని. అతడికి తెలియదు, కొందరు జర్నలిస్టులు అలా బతకగలరని. నేనిది జనరలైజ్ చేసి చెప్పానని పాత్రికేయ సోదరులు కినుక పూనకండి. మెజారిటీ జర్నలిస్టులకు జీత భత్యాలు తక్కువ. ఇక ఇలాంటి ప్రెస్ టూర్లకు కూడా సొంత డబ్బు ఖర్చు చేయడం అనేది అలవికాని భారం.
ఇంతకూ నేను చెప్పవచ్చేది ఏమిటంటే ఈ ప్రయాణం కోసం నేనూ కొన్ని డాలర్లు వెంట తెచ్చుకున్నాను. కానీ మా అన్నయ్య పిల్లలు నన్ను జేబులో చెయ్యి పెట్టనివ్వ లేదు. అంతేకాదు, చేతితో ఏదీ పట్టుకోనివ్వడం లేదు. హాండ్స్ ఫ్రీ ప్రయాణం. అది మాల్ కావచ్చు, స్టార్ హోటల్ కావచ్చు, ఎయిర్ పోర్టు కావచ్చు. అన్నీ వాళ్ళే.
మొదటి రోజు నాలుగు కార్లలో రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆ పది మంది నేను మా అబ్బాయితో కలిసి సియాటిల్ విమానం ఎక్కేవరకు నా వెంటే వున్నారు.
గురువారం రాత్రి బాల్టి మోర్ ఎయిర్పోర్ట్ నుంచి పదిహేను మందిమి బయలుదేరి అర్ధరాత్రి టాంప చేరుకున్నాము. అదేదో చిన్న వూరు అనుకుంటే హైదరాబాదు కంటే అనేక రెట్లు పెద్దదిగా కనిపించింది. ఎకరాలకు ఎకరాలు రోడ్లు వేశారా అన్నట్టు చాలా విశాలంగా, అప్పుడే వేసినట్టు నల్లగా నిగనిగలాడిపోతూ వున్నాయి. అమెరికాలోనే వుంటున్న మా అన్నయ్య మనుమరాళ్ళు శిఖిర, శిశిర, కోడలు హేమ మా కంటే ముందుగానే టంపా చేరుకుని మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రెండు పెద్ద సైజు అద్దె కార్లలో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయంలో ఒకే ఒక ప్రవేశ ద్వారం వుండడం చేత, వచ్చి పోయే ప్రయాణీకుల వాహనాలతో బయట చాలా రద్దీగా కనిపిస్తుంది. వెళ్ళే వాళ్ళు, వెంట వచ్చిన వాళ్ళు నిమిషాల మీద లగేజి దింపుకుని హడావిడిగా బయట పడాలి. అయితే వాషింగ్ టన్ డీసీ, బాల్టి మోర్ ఎయిర్పోర్ట్ ల్లో పరిస్థితి వేరేగా వుంది. ఒక్కో ఎయిర్ లైన్స్ కు ఒక్కో గేటు పెట్టారు. అంచేత ఎక్కడా రద్దీగా వుండదు. హాయిగా కారుని నేరుగా గేటు దగ్గర ఆపుకుని ఎయిర్ పోర్టులోకి వెళ్లి పోవచ్చు. మనతో వచ్చిన వాళ్ళు కూడా మనతోనే లోపలకు వచ్చి కాసేపు గడిపిపోవచ్చు. అదొక మంచి సదుపాయం అని నాకు అనిపించింది.
టంపా ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ ఆయిన తర్వాత ఏవో సాంకేతిక కారణాలు చెప్పి నలభయ్ నిమిషాలు మమ్మల్ని విమానంలోనే వుంచేసారు, వెనుకటి రోజుల్లో ప్లాటుఫారం ఖాలీ లేక బెజవాడ వెళ్లే నిజాం పాసింజర్ రైలును రాయనపాడు స్టేషన్ లో నిలిపేసినట్టు.
ఆ సమయంలో మా వాళ్ళు అందరూ టాంపా వాట్స్ అప్ గ్రూపులో చాట్ చెయ్యటంలో మునిగిపోయారు. వాళ్ళ చాట్ లో ప్రధాన విషయం ఏమిటంటే,
ఈ వూర్లో మాకు వసతి కల్పించాల్సిన Gary's AIR BNB ( BNB అంటే బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ అని తర్వాత తెలిసింది ) కంపెనీ వాడు అంతమందికి వసతి కుదరదని మెలిక పెట్టాడుట. వెంటనే గ్రూపులోని వార్ రూమ్ టీమ్ ముందు నన్ను, ఆడవాళ్ళు పిల్లల్ని ముందుగా రిజర్వ్ చేసుకున్న వసతి గృహానికి పంపించారు. అప్పటికప్పుడు ఆన్ లైన్లో కోర్టు యార్డ్ మ్యారియేట్ హోటల్లో రెండు గదులు బుక్ చేసి నన్ను కూడా అక్కడికి తీసుకు వెళ్ళారు.
ఉడ్ స్టాక్ నుంచి చక్కగా విడివిడిగా ప్యాక్ చేసి వెంట తెచ్చుకున్న పులిహార, పెరుగన్నం పదార్థాలకు బాల్టి మోర్ ఎయిర్ పోర్టు సెక్యూరిటీ నో చెప్పింది. పెరుగన్నం తేమగా వుండడంతో ఆ ప్యాకెట్లను రకరకాలుగా శోధించి వీలు కాదన్నారు. సాయివాళ్లకు నచ్చచెప్పాడు. ఏ కళన వున్నాడో కానీ చివరికి పెరుగన్నం ప్యాకెట్లను అనుమతించారు.
అప్పటికే విమానం బోర్డింగ్ టైం కావడంతో హడావిడిగా తినేసి ఫ్లయిట్ ఎక్కాము.
కోర్టు యార్డ్ మ్యారియేట్ హోటల్ కు దగ్గరలో వున్న మెక్ డొనాల్డ్ కు వెళ్లి అర్ధరాత్రి మూడు గంటల సమయంలో డిన్నర్ కం బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకున్నాము.
ముందే చెప్పినట్టు అమెరికాలో నా ప్రయాణం Conducted Press Tour లాగా సాగుతోంది.
నాకేల చింత! అనుకున్నా!
కింది ఫోటోలు:
మొదటి ఫోటో: అమెరికాలో అడుగుపెట్టినప్పుడు ఎదుర్కోలు చెప్పడం కోసం వాషింగ్ టన్ డీసీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఈ బృందమే, రెండు నెలల తర్వాత వీడ్కోలు చెప్పడానికి అదే విమానాశ్రయానికి వచ్చింది.
రెండో ఫోటో: ఉడ్ స్టాక్ లో మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి ఇల్లు.
మూడో ఫోటో: విందులు, వినోదాలు
(ఇంకావుంది)
Like
Comment
Share
Facebook
Facebook