16, మే 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (163) – భండారు శ్రీనివాసరావు


దేవుడికి ఇచ్చిన మాట

అసాధ్యం అనుకున్న కరోనా కోరల నుంచి తనని తాను కాపాడుకున్న మా రెండో వాడు సంతోష్, నిరుడు 2024 ఫిబ్రవరి నాలుగో తేదీన నా నెత్తిన ఒక బండ వేసి, మూడంటే మూడు రోజుల్లో దాటిపోయాడు.
ఆసుపత్రిలో చేర్చినప్పుడు 'నాన్నకు తెలియనివ్వకు, అనవసరంగా కంగారు పడతాడు' అని భార్యకు చెప్పాడట. మరునాడు విషమించడంతో చెప్పక తప్పలేదు. ఆ సాయంత్రం వెళ్లి చూశాను. ముక్కుకు, నోటికి అన్నీ బంధనాలు. కళ్ళు నా వైపే చూస్తున్నాయి. నేను ఏమీ అడగలేను, వాడు ఏమీ చెప్పలేడు. డాక్టర్లు రేపటికల్లా పరిస్థితి బాగుంటుంది అన్నారు షరామామూలుగా.
ఆ ధైర్యంతో ఇంటికి చేరాను. మర్నాడు ఉదయమే ఫోను, 'అందరూ వచ్చేసేయండి’ అని. అందరం ఎందుకు? అందులోనే వుంది. అర్ధం చేసుకోవాలి అంతే!
అప్పుడే మనసు శంకించింది. అలాంటి సమయంలోనే నాలాంటి వాళ్లకి దేవుడు గుర్తొస్తాడు. వచ్చాడు.
మనసులోనే అనుకున్నాను. చెట్టంత కొడుకు, ఈ వయసులో నాకు కొండంత అండగా వున్నాడు. వాడు కోలుకుని ఇంటికి క్షేమంగా ఇంటికి వస్తే, నీ కొండకి వచ్చి తలనీలాలు ఇస్తాను అని. దేవుడికి నా మాట సరిగా వినబడినట్టు లేదు. వెళ్ళే సరికి చుట్టపక్కాలు, సంతోష్ స్నేహితులు అందరూ అక్కడే వున్నారు. అంటే చిట్టచివర్లో తెలిసింది నాకే అన్నమాట. నా గుండె తట్టుకుంటుందో లేదో అని మా వాళ్ళ భయం. కానీ నా గుండె రాతితో చేసింది అని వాళ్లకు తెలియదు.
అయిదేళ్ళ క్రితమే ఇదే ఆసుపత్రిలో మా ఆవిడని అంబులెన్స్ లో నా కళ్ళ ముందే అలా లోపలకు తీసుకు వెళ్ళారు. ఓపీ లోనే చెప్పేశారు, బ్రాట్ డెడ్ అని. కాకపొతే ఆ మాట చెప్పడానికి గంట వ్యవధానం తీసుకున్నారు. చావు కబురు నిదానంగా చెప్పాలని అనుకున్నారేమో.
నేను ఐ సి యు లోకి వెళ్ళేసరికే మొహానికి, వంటికి పెట్టిన పరికరాలు, మాస్కులు, ట్యూబులు తొలగిస్తున్నారు. వాడేమో ఒళ్ళు ఎరుగని విధంగా నిద్రపోతున్నట్టు పడివున్నాడు, మంచం మీద. నలభయ్ ఏడేళ్ల జీవితానికి తెర పడిపోయింది. నిషా బలవంతాన కళ్ళ నీళ్ళు ఆపుకుంటూ, ఏవో కాగితాల మీద సంతకాలు పెడుతోంది. నా బాధ ఆ అమ్మాయి వైపు తిరిగింది. పోయిన కొడుకు పోయాడు. రెండేళ్ల పిల్లతో ఆమె జీవితం ఎలా గడవాలి? ఆ క్షోభ ముందు నాదెంత! నలుసంత.
కొండకు పోకుండానే, తలకొరివి పెట్టిన తండ్రిగా వాడి కర్మకాండలకోసం వారం రోజుల్లోనే శిరోముండనం చేయించుకోవాల్సివచ్చింది. మనం ఒకటి తలిస్తే, దైవం వేరేగా తలుస్తాడు అంటారు కదా!
హూణ మాసికం
ప్రేత సంబంధ కర్మలు అయినా, యాగ సంబంధ క్రతువులు అయినా నమ్మకం ప్రధానం అనేది నా నమ్మకం. నా తల కొరివి పెట్టాల్సిన వాడికి నేనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి నాకు ప్రాప్తించినప్పుడు, నా మనసు నా మనసులో లేదు. ఏదో కలలో జరుగుతున్న విధంగా అన్నీ సశాస్త్రీయంగా జరిగిపోయాయి, నా అన్నగారు భండారు రామచంద్ర రావు గారి పర్యవేక్షణలో.
ఆనాడు శ్రాద్ధకర్మలకు నేతృత్వం వహించింది వసిష్టుల వారు శ్రీ సి.హెచ్. యు.ఎస్. ప్రసాద శర్మ గారు. వాటిల్లో భాగంగా నా చేత అనేక దానాలు చేయించారు. మరణించిన మనిషి తాలూకు జీవి సంవత్సరం పాటు వేలాది మైళ్ళు ప్రయాణిస్తుందని, ఆ ప్రయాణంలో జీవుడు అనేక రకాల ఈతి బాధలకు గురవుతాడని, ఎర్రటి ఎండల్లో, వానల్లో, దుర్గమ, కంటక మార్గాల్లో ఆ ప్రయాణం సాగుతుందని, ఉపశమనంగా ఉండడానికి గొడుగు, పాదరక్షలు, వంట దినుసులు, కాయగూరలు, వంట పాత్రలు, నీళ్ళ పాత్ర, చెంబు వగైరాలు దానాలుగా ఇప్పించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ముఖ్యంగా 45 వరోజున ( త్రిపక్షం), 171 వ రోజున జీవుడు మరింత శ్రమకు గురవుతాడు. అంచేత ఈ రోజుల్లో కూడా తప్పనిసరిగా మాసికాలు పెట్టాలి.
జీవించి వున్న వారికి ఒక మాసం మరణించినవారికి ఒక రోజుతో సమానం కనుక నెలకోసారి మాసికం పెట్టి పిండ ప్రదానం చేస్తే, వారికి ప్రతిరోజూ భోజనం పెట్టినట్టు అవుతుందని ఓ నమ్మకం. ఇలా పన్నెండు నెలలు గడిచిన తర్వాత ఏడాది చివర్లో పెట్టే హూణ మాసికం, సాంవత్సరీకం, ఆబ్దీకంతో ఈ కర్మకాండ పూర్తవుతుంది. జీవుడి పాప పుణ్యాల ప్రాతిపదికన పునర్జన్మ, లేదా స్వర్గ, నరక లోక ప్రాప్తి నిర్ధారణ అవుతుంది.
ఈ విషయాలు అన్నీ శర్మగారు సవిస్తరంగా నాకు అప్పుడే తెలిపారు.
కానీ అప్పుడు నా గుండె, మనసు, శరీరం అన్నీ ఘనీభవించి వున్నాయి.
ముందే చెప్పినట్టు అంతా నమ్మకం.
చనిపోయింది స్వయంగా నా కుమారుడు. నా ఇహలోక ప్రయాణం సజావుగా సాగడానికి వాడు బతికి వున్నప్పుడు ఎన్నో ఎన్నో చేశాడు. పై లోక ప్రయాణంలో వాడికి ఇబ్బందులు రావు అని చెబుతున్నప్పుడు నమ్మకంగా పాటించక తప్పదు. అదే చేశాను.
వాతావరణంలో మార్పు కోసం ఓ రెండు నెలలు మా పెద్దవాడు వుంటున్న అమెరికా వెళ్లాను. అమెరికా కొత్తకాదు. అక్కడకి అనేక సార్లు వెళ్లాను. అప్పుడు నా భార్య తోడుగా వుండేది. ఈ సారి అమెరికా ప్రయాణం, మొదటి రోజే నా రెండో కుమారుడు సంతోష్ మాసికంతో మొదలయింది.
నాకు తోడుగా వచ్చిన మా రెండో అన్నయ్య రామచంద్ర రావు గారి కుమారుడు లాల్ బహదూర్, కోడలు, మేనకోడలు దీపతో కలిసి, 2024 జులై 28 ఆదివారం ఉదయం వాషింగ్టన్ డి సి విమానాశ్రయం చేరుకున్నాను. మొత్తం ప్రయాణంలో వాళ్ళు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. చిన్న లగేజ్ కూడా ముట్టుకోనివ్వ లేదు. అదృష్టం నా మొబైల్ ను మాత్రం నా చేత్తో పట్టుకోనిచ్చారు.
నన్ను సియాటిల్ తీసుకు వెళ్ళడానికి మా పెద్దవాడు వాషింగ్టన్ డి సి కి వచ్చాడు.
ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగానే బిలబిలమంటూ మా రెండో అన్నయ్య, మూడో అన్నయ్య పిల్లలు లోపలకు వచ్చారు. లగేజ్ తో బయటకు రాగానే నాలుగు మత్తేభాలు వంటి పెద్ద మోటారు వాహనాలు సిద్ధంగా పెట్టారు. వెళ్ళింది ముగ్గురం. రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది పది మంది.
వుడ్ స్టాక్ లో వుంటున్న మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు గారి కుమారుడు సత్యసాయి, శైలజ దంపతుల ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో సంతోష్ మాసికం ప్రస్తావన వచ్చింది. ఆ వూళ్లోనే మా దగ్గరి బంధువు, నాకు స్కూల్లో క్లాస్ మేట్ వనం వరదా రావు కుమార్తె స్వప్న, అల్లుడు సుగుణాకర రావు దంపతులు చాలా కాలంగా వుంటున్నారు. అక్కడ మన వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ఆయనే దిక్కు.
ఫోన్ చేసి, తిథి చెబితే ఆయన పంచాంగం చూసి ఆదివారం మధ్యాహ్నం నుంచి మరునాడు సోమవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు వుందని, అంచేత ఈ రోజే పూర్తి చేయడం మంచిదని సలహా చెప్పారు. అదే వూళ్ళో వివిధ గుళ్ళలో పనిచేస్తున్న ఇద్దరు ముగ్గురు పూజారులను సంప్రదించి చివరకు సాయిబాబా గుడి పూజారిని పట్టుకున్నారు. వెంటనే నాలుగు కార్లలో బయలుదేరి దారి మధ్యలో ఒక ఇండియన్ స్టోర్ లో పూజారి గారు చెప్పిన సంభారాల జాబితా ప్రకారం కొనుక్కుని వెళ్లాం. పేరుకు బాబా గుడి కానీ సమస్త దేవతలు అక్కడ కొలువు తీరి ఉన్నారు. పూజారి గారు నెమ్మదస్తులు. ప్రశాంతచిత్తులు. సావధానంగా కార్యక్రమం ఎలాంటి హడావిడీ చేయకుండా చక్కగా పూర్తి చేసారు. దేశం కాని దేశంలో, వచ్చిన మొదటి రోజునే పని పూర్తి అయ్యేలా చూడడం ఆ పై వాడి పనే అనుకున్నాను.
ప్రతి మాసికం నాడు, ద్వితీయ పుత్ర సంతోష్ నామధేయస్య ...ప్రేత.. అనాల్సివచ్చినప్పుడు గొంతు పూడుకు పోతుంది. మనస్సు మెలికలు తిరుగుతుంది.
అక్కడ నుంచి మళ్ళీ అమెరికా పశ్చిమ దిక్కున వున్న సియాటిల్ కు సుదీర్ఘ విమాన ప్రయాణం.
అమెరికా వచ్చి అప్పుడే నెల అవుతుందా. ఎవరో తోసుకువచ్చినట్టు వచ్చింది నా రెండో పిల్లవాడి ఎనిమిదో మాసికం.
ఆ రోజు ఉదయం మా పెద్దవాడు సందీప్ నన్నూ, కోడలు భావన, మనుమరాళ్లు సఖి, సృష్టినీ తీసుకుని బొతెల్ (Bothell) లోని హిందూ టెంపుల్ కి తీసుకువెళ్ళాడు. పూజారి హేమంత్ శర్మ వయసులో చాలా చిన్నవాడు. అమెరికా వచ్చి అయిదు నెలలే అయింది. అంతకు ముందు మారిషస్ హిందూ టెంపుల్ లో నాలుగేళ్లు పనిచేశాడు. ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతం వాడు. గుడికి వెళ్ళే ముందు మిల్ క్రీక్ ప్రాంతంలో వున్న ఆయన ఇంటికి వెళ్ళాము. ఆ కాలనీ చెట్ల గుంపుల నడుమ చాలా పొందికగా వుంది. ఆయన్ను కారులో ఎక్కించుకుని గుడికి వెళ్ళాము. డ్రైవింగ్ లైసెన్స్ రాగానే కారు కొనుక్కుంటానని దారిలో చెప్పారు.
గుడిలో కార్యక్రమాన్ని చాలా నిష్టగా జరిపించారు హేమంత్ శర్మ గారు.
పదకొండేళ్ల క్రితం ఇదే దేవాలయంలో మా అమ్మగారి తద్దినం పెట్టిన విషయం జ్ఞాపకం చేసుకున్నాము.
నెల రోజుల ముందే మా వాడు పూజారితో మాట్లాడి పెట్టడం, కోడలు భావన ఒకరోజు ముందే ఇండియన్ స్టోర్ నుంచి కావాల్సిన సంభారాలు తెచ్చి సిద్ధం చేయడం ఇవన్నీ, దేశం కాని దేశంలో ఇటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరపడానికి సాయపడ్డాయి.
చూస్తుండగానే ఏడాది గడిచిపోయి, హైదరాబాదులో ఏడూడి పూర్తయిన తర్వాత, మా కోడలు నిషా నాతో మెల్లగా అంది.
‘సంతోష్ ఎప్పుడూ అంటుండేవాడు, జీవికను తిరుపతి తీసుకువెళ్లి తలనీలాలు ఇప్పించాలని, చనిపోయిన ఏడాది లోపల ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని ఎవరో చెప్పారు, ఇప్పడు వెళ్ళడానికి వీలుంటుందా’ అని.
వాడి కోరిక ఆఖరి కోరిక అవుతుందని ఆ అమ్మాయికీ తెలియదు. వాడి అంత్యసమయంలో నేనూ దేవుడ్ని ఓ కోరిక కోరాననే సంగతీ తెలియదు. నా మొక్కు గురించి, దేవుడికి ఇచ్చిన మాట గురించి అసలే తెలియదు.
దేవుడ్ని ఎన్నో కోరుకుంటాం. తీరితే పలానా మొక్కు తీరుస్తామని అంటాం. మనం కోరినవన్నీ తీరిస్తే ఇక ఆయనకు పనే వుండదు. ఆయనతో మనకూ పని వుండదు. ఆ సంగతి తెలిసిన వాడు కనుక ఆయన తన లీలలను ఒక్కోసారి కర్కశంగా చూపిస్తుంటాడు. అమ్మకు ఇచ్చిన మాట, దేవుడికి ఇచ్చిన మాట ఒక్కటే కనుక మొక్కు తీర్చడం మన విధి అనుకున్నాను.
కిందటి నెల ఏప్రిల్ లోనే తిరుపతి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. రానూ పోనూ టిక్కెట్లు కొన్నాము. హఠాత్తుగా మా కుటుంబానికి పెద్ద షాక్ . మా ఇంటి వేలుపువంటి మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి భార్య, పెద్ద వదిన సరోజినీ దేవి మరణంతో మా ప్రయాణం వాయిదా పడింది.
నాహం కర్తః హరికర్తః
మనకు దర్శనం ఇవ్వాలని స్వామికి అనిపించాలి కానీ, మనం అనుకుంటే సరిపోదని పీవీ ఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడో చెప్పారు. మా పెద్ద వదిన గారి దశదిన కర్మ పూర్తయిన తర్వాత మళ్ళీ మొన్న, మే పదమూడో తేదీన, మనుమరాలు జీవిక, కోడలు నిషా, అమెరికా నుంచి వచ్చిన మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి కుమారుడు రాజేష్ తో తిరుపతి వెళ్లి, తిరుమలలో స్వామి దర్శనంతోపాటు వరాహ స్వామి దర్శనం, పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని, కలిసి పద్నాలుగో తేదీ రాత్రికి తిరిగి హైదరాబాదు వచ్చాము.
టీటీడీ చైర్మన్ బీ ఆర్ నాయుడు గారి చల్లని మాటతో చక్కని దర్శన భాగ్యం లభించింది. ఎక్కడా ఇబ్బంది పడకుండా శ్రీనివాస నాయుడు గారనే ఉద్యోగి ఉదయం అయిదు గంటల నుంచి, దర్శనం పూర్తయ్యే వరకు మా వెంటనే వున్నారు. గర్భ గుడిలో గడపవద్ద మా నలుగురిని నిలబెట్టి రెండు పర్యాయాలు శఠగోపం పెట్టి హారతి ఇప్పించారు. చైర్మన్ వ్యక్తిగత సహాయకుడు ప్రసన్న గారు, టీవీ 5 ఎడిటర్ విజయ్ నారాయణ్, సాంబశివరావుగార్లు మా తిరుపతి ప్రయాణం విషయంలో మరువలేని సాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు.
కింది ఫోటోలు:
2017 లో ఒకసారి మా ఆవిడ నిర్మలతో తిరుపతి వెళ్లాను. గుండు చేయించుకున్న తర్వాత మా ఆవిడతో అన్నాను, తల బరువు తగ్గిందని. చిన్నగా నవ్వింది. ‘తగ్గాల్సింది తల బరువు కాదు, తల పొగరు’ అనే భావం ఆ నవ్వులో నాకు కనపడింది.
తిరుపతి విమానాశ్రయంలో, 2025 మే పదమూడున తిరుమల టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బీ ఆర్ నాయుడు గారితో, తిరుమలలో తలనీలాలు ఇచ్చిన తర్వాత నా మనుమరాలు జీవికతో, కోడలు నిషాతో. మా అన్నయ్య కుమారుడు రాజేష్, కోడలు నిషాతో
బీ ఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా నియమితులు అయిన సందర్భంలో హైదరాబాదులో మహా న్యూస్ ఎండీ వంశీ గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ కార్యక్రమంలో నేనూ, ప్రముఖ సంపాదకులు కె. రామచంద్ర మూర్తి గారు, తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి గారు.
(ఇంకావుంది)
All reactions:
Mandarapu Nageshwararao and 1 other
Like
Comment
Share
Facebook

12, మే 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (162) – భండారు శ్రీనివాసరావు

అగ్రరాజ్యపు పాము పగ

కొన్ని వింటున్నప్పుడు, మరి కొన్ని చూస్తున్నప్పుడు గతంలో జరిగిన ఇంకెన్నో సంగతులు గుర్తుకు రావడం సహజం.
ఆల్ ఖయిదా అగ్రనేత ఆల్ జవహరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, ఆఫ్ఘనిస్థాన్ లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని అమెరికా మట్టుబెట్టింది.
ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ పదకొండో తేదీన (9/11) నాటి ఆల్ ఖయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవహరి మరణం ఓ ముగింపు అని అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
9/11 గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్ ని వధించి పగ తీర్చుకుంది. అప్పుడు లాడెన్ కు కుడి భుజంగా వ్యవహరించిన జవహరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఆల్ జవహరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికి మరోమారు చాటి చెప్పింది.
ఒసామా బిన్ లాడెన్ – బరాక్ హుస్సేన్ ఒబామా

వీరిద్దరి మధ్యా నామసారూప్యత మాత్రమే కాదు, భావ సారూప్యత కూడా వుంది.
‘మతం కోసం ఎలాటి మారణహోమానికయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్ ఖయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ది.
‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అలనాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాది.
అయితే, ఆలోచన ఒక్కటే అయినా ఆచరణలో కొద్ది తేడా వుంది.
‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా పరవాలేదు అనే థియరీ’ ఒబామాది.
‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికిరాదనే భావజాలం’ ఒసామాది.
ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాలకోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు, అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని, తనకు తానుగా అమెరికా పెంచుకుంటూ వచ్చిన అహంభావాన్ని బిన్ లాడెన్ తనదయిన శైలిలో దెబ్బ తీసినప్పుడుకానీ, ‘పాము-పాలు’ కధ లోని అంతరార్ధం అమెరికాకు అవగతం కాలేదు. తనదాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా, 2001, సెప్టెంబర్ 11 దుర్ఘటన తరవాత గాని ఉగ్రవాదం వల్ల పొంచివున్న ముప్పు ఎలావుంటున్నన్నది ఆ అగ్ర దేశానికి అర్ధం కాలేదు.
ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు.
చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో, తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్ ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా అగ్రరాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదం అవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హై టెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలను జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్ లో కూర్చుని, పధకం అమలవుతున్న తీరుతెన్నులను ఎప్పటికప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలనుబట్టి, అన్ని దేశాలలోని టీవీ వీక్షకులు లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్ధం చేసుకోగలిగారు.
బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది, 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ ఖయిదా విసిరిన పంజా దెబ్బకు అమెరికా గడగడ లాడిన తరువాతనే జరగడం గమనార్హం. తమ పోరు ఉగ్రవాదం మీదనే కాని ఒక మతం మీద కాదన్న పద్ధతిలో అమెరికన్ ఓటర్లు తీర్పు ఇచ్చినట్టు అప్పట్లో పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. అధ్యక్ష ఎన్నికకు ముందూ, ఆ తరువాతా ‘నేను క్రైస్తవుడినే’ అని బరాక్ హుస్సేన్ ఒబామా బహిరంగంగా ప్రకటించుకున్నప్పటికీ, ముస్లింగా ధ్వనించే తన పేరును మాత్రం మార్చుకోలేదు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత చేసిన తొలి విదేశీ పర్యటనలో మసీదులోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో వివాదాస్పదమయింది కూడా. అయినా ఒబామా విశ్వ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఇక, అమెరికన్ల ప్రతీకారేచ్ఛకు బలయిన ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్ లో కడునిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదరపోషణార్ధం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టాడు. అక్కడినుంచి అతడు పట్టింది బంగారమయింది. సౌదీ రాజ్య కుటుంబీకులతో ఏర్పరచుకున్న సన్నిహిత సంబంధాలు అతడి స్తితి గతుల్ని పూర్తిగా మార్చివేశాయి. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తాడు.
సౌదీ అరేబియాలో దాదాపు ఎనభయ్ శాతం రహదారులను మహమ్మద్ కంపెనీయే నిర్మించింది. అతడికి అనేకమంది భార్యలు. పదో భార్య సిరియన్ దేశీయురాలు. ఆమెకు జన్మించినవాడే ఒసామా బిన్ లాడెన్. మహమ్మద్ సంతానం 52 మందిలో ఒసామా 17వ వాడు. ఆరడుగులు ఎత్తు. అయినా మనిషి బక్క పలచన. సంపన్న కుటుంబంలో పుట్టి విలాసాలకు అలవాటుపడాల్సిన ఒసామా మనసు మతం వైపు మళ్ళింది. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా తన భూభాగంలో అమెరికా మిలిటరీ స్తావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం అనుమతించడాన్ని ఒసామా జీర్ణించుకోలేక పోయాడు. ఆ సందర్భంలో అతడు చేసిన విమర్శలను ప్రభుత్వం తప్పుపట్టింది. ఒసామా పౌర సత్వాన్ని, పాస్ పోర్ట్ ను రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం ఒసామాను తమ నుంచి వెలి వేసింది. దరిమిలా అల్ ఖయిదాకు అనేక దేశాల్లో బలమయిన స్తావరాలు ఏర్పాటుచేసే కృషిని కొనసాగించిన ఒసామా మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద ఉగ్రవాదిగా గుర్తింపు పొందాడు. అల్ ఖయిదా పేరు చెబితే పాశ్చాత్య దేశాల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేసాడు.
ధనరాశుల నడుమ జన్మించి, సంపదలతో వచ్చే సుఖాలనన్నిటినీ కాలదన్నుకుని, కొండలు, గుట్టల్లో జీవనాన్ని ఎన్నుకుని, నిరంతర పోరాటాలతో కాలం గడిపిన ఆయన తీరు ఎంతోమందిని ఆయన వైపు నడిపించింది. చేస్తున్నది తప్పా వొప్పా అన్న విచక్షణ నుంచి వారిని దూరం చేసింది.
‘కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.
‘మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం.
మతాన్ని రక్షించడం అంటే పర మతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకుంటున్నా, మత ఛాందసులు పట్టించుకోలేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం.
పవిత్ర యుద్ధం పేరుతొ సంవత్సరాల తరబడి సాగించిన పోరాటంలో ఒసామా బిన్ లాడెన్ చివరకు తన ప్రాణాలనే తర్పణంగా విడవాల్సివచ్చింది. కళ్లుచెదిరే సంపద కలిగిన కలవారి కుటుంబంలో పుట్టి కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొండకోనల్లో దుర్భర జీవితం గడిపిన అనుభవం ఒసామాది. నిరుపేద కుటుంబంలో పుట్టి అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు కాగలిగిన అదృష్టం ఒబామాది. తరాలకు పూర్వం మత మూలాలు ఒక్కటే అయినా, వేర్వేరు మతాలకు ప్రతినిధులుగా వీరిద్దరూ పోరుబాటలో పయనించిన తీరు విధి వైపరీత్యానికి పరాకాష్ట.
ఒసామా తర్వాత ఆల్ ఖాయిదా పగ్గాలు చేపట్టిన ఆల్ జవహారీ కూడా తన నాయకుడు లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం.
ఉగ్రదాడిలో దాదాపు ఊడు వేలమంది అమెరికన్ పౌరుల మరణానికి కారణమైన వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగై పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.
2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని దానితో డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.
అత్తా పుట్టింది ఈజిప్టులో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి, 1968 సెప్టెంబర్ లోనే పుట్టిన అత్తాకు బహుశా తెలిసుండదు.
అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.
కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.
అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.
1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విదిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు కావడం గమనార్హం.
(ఇంకా వుంది)

9, మే 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (161) – భండారు శ్రీనివాసరావు

నండూరి రామమోహనరావు గారు పెట్టిన మెత్తటి తొడపాశం

1971- 2025

 

1971 లో ఇండో పాక్ యుద్ధం జరిగినప్పుడు నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. చేసేది సబ్ ఎడిటర్ ఉద్యోగమే అయినా ఆ సమయంలో నేను చేయని పని అంటూ లేదు. అప్పటికి పెళ్లి కాలేదు కాబట్టి రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేయడానికి సిద్ధంగా వుండేవాడిని. పగలు వార్తలు అనువాదం చేయడం, సాయంకాలం, రాత్రి సమయాల్లో,  పీటీఐ, యుఎన్ఐ,  పీఐబి ద్వారా భారత సైన్యం జారీచేసే అధికారిక పత్రికా ప్రకటనల ఆధారంగా సైన్యం కదలికలను తెలిపే మ్యాపులను తయారుచేయడం వగైరా  చేసేవాడిని. ఆ రోజుల్లో ఇప్పటిలా ముద్రణా సౌకర్యాలు లేవు. ఏదైనా ఫోటో ముద్రించాలి అంటే ముందు దాన్ని, ఎక్కడో గాంధీ నగర్ లో వున్న బ్లాక్ మేకింగ్ కు పంపి బ్లాక్ తయారు చేయించి  తీసుకురావాలి. ఆంధ్రప్రభ ఎడిటర్ పండితారాధ్యుల నాగేశ్వర రావు గారి కుమారుడికి ఈ బ్లాక్ మేకింగ్ దుకాణం వుండేదని జ్ఞాపకం.

ముందు సరిహద్దులలో మొదలైన సాయుధ ఘర్షణలు, సంఘర్షణలు పూర్తి యుద్హస్వరూపం తీసుకోవడానికి చాలా వ్యవధానమే పట్టింది. అసలు యుద్ధం పదమూడు రోజులు సాగింది. అధికారికంగా డిసెంబరు మూడో తేదీన మొదలై, పాకీస్తానీ సైన్యాలు లొంగిపోవడంతో డిసెంబరు పదహారో తేదీన ముగిసింది. ఈ యుద్ధ పర్యవసానమే కొత్తగా తూర్పు పాకీస్తాన్ స్థానంలో బంగ్లా దేశ్ అనే కొత్త దేశం అవతరణ.

నా జర్నలిజం తొలి రోజుల్లోఅంటే 1970 ప్రాంతాల్లో  నండూరి రామమోహన రావు గారు నన్ను సాన పట్టారు. ఆయన రూటే సపరేటు. చెప్పాల్సింది సూటిగాసుతిమెత్తగా చెబుతారు. దాంతో ఆ పాఠం జీవితాంతం గుర్తుండి పోతుంది. ఆ పాఠాల్లో ఇదొకటి.

బంగ్లాదేశ్ అవతరణ సమయంలో నాటి బంగ్లా నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ పేరు పలుసార్లు వార్తల్లో చోటు చేసుకునేది.

అప్పటికి ఇంకా తెలుగు పత్రికల్లో పేరుకు ముందు  శ్రీ అనే గౌరవ వాచకం వాడుతుండేవారు. (ఇప్పటి నాయకులు అలాంటి గౌరవానికి తగరని అనుకున్నారేమో, మరేదైనా సాంకేతిక కారణమో   తెలియదు, శ్రీ,  గారు, మిస్టర్ అనే పదాలకు ఇప్పుడు స్వస్తి చెప్పారు)

ఈ నేపధ్యంలో, అదే యుద్ధ సమయంలో  నేను ఒకసారి  వార్తను తర్జూమా చేసే పనిలో ఓ తప్పు తొక్కాను. “శ్రీ షేక్ ముజిబుర్ ” అని రాశాను. ఆ అనువాదం నండూరి వారి దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే ఒక చీటీ పంపారు. ఆ రోజుల్లో నండూరి వారి నుంచి చీటీ వచ్చింది అంటే ఓ మెమోతో సమానం. అందులో ఇలా వుంది

Sheikh itself is honorific.  Do not use sri before it.” - NR

 

మళ్ళీ ఇప్పుడు  2025 లో రెండు దేశాల నడుమ సాయుధ సంఘర్షణలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో  ఇరవై ఆరుమంది అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బలికొనడం వీటికి ప్రధాన కారణం. పాక్ జరిపిన ఈ రెచ్చగొట్టే అమానుష చర్యతో ఉభయ దేశాల సరిహద్దులో  1971 నాటి యుద్ధ వాతావరణం కానవస్తోంది.  

యుద్ధ సమయంలో సమాచార వ్యాప్తి విషయంలో 1971 నాటికి ఇప్పటికీ వున్న పెద్ద ప్లస్ పాయింటు మీడియా/ సోషల్ మీడియా. దురదృష్టం ఏమిటంటే అంతకంటే పెద్ద మైనస్ పాయింట్ ఇవే కావడం! ఒక ఆయుధం చేయలేని మారణహోమం ఒక నిరాధార,  కల్పిత వదంతి చేయగలగడమే  ఇందుకు కారణం.  

1971 యుద్ధం తుది దశలో అంటే డిసెంబరు పద్నాలుగున నేను బయలు దేరి మద్రాసు వెళ్లాను. నా కాబోయే భార్యను తీసుకుని మర్నాడు ఉదయం తిరుమల వెళ్లి, అక్కడ పెళ్లి తంతు ముగించుకుని అదే రోజు రాత్రి రైల్లో బయలుదేరి డిసెంబరు పదహారో తేదీ ఉదయానికి బెజవాడ చేరాను కొత్త కాపురం పెట్టడానికి. అక్కడ తూర్పు పాకీస్తాన్ విమోచన, బంగ్లాదేశ్ అవతరణ.   ఇక్కడ, ఎంతో కాలంగా అంతూపంతూ లేకుండా సాగుతున్న నా ప్రేమ పురాణానికి పెళ్లితో శుభం కార్డు.

బంగ్లా యుద్ధంతో నాకున్న బాదరాయణ సంబంధం ఇది.

 

కొద్ది సంవత్సరాల క్రితం,  భారత స్వాతంత్రోత్సవ అమృత ఘడియల్లో రేడియో శ్రోతలకు 1971 యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికాధికారిని  పరిచయం చేసే మహత్తర అవకాశం నాకు దక్కింది.  ఇంటర్వ్యూ లాంటి ఈ పరిచయ కార్యక్రమంలో  నాకు బాగా పరిచయం వున్న వ్యక్తినే పరిచయం చేశాను. ఆయనే బ్రిగేడియర్ ఎస్, శ్రీరాములు. ఆయన ఎవరో  కాదు, బెజవాడ ఎస్సారార్  కాలేజీలో  నా సహాధ్యాయి.

బ్రిగేడియర్ శ్రీరాములు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో జన్మించారు. విజయవాడ ఎస్సారార్ కాలేజీలో చదివారు. గ్రాడ్యుయేషన్ తరువాత సైన్యంలో అధికారిగా చేరారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన 1971 ఇండో పాక్ యుద్ధంలో భారత సైన్యం తరపున పాల్గొన్నారు. మౌంటెన్ ఆర్టిలరీ బ్రిగేడ్ కు నాయకత్వం వహిస్తూ, 2003లో పదవీ విరమణ చేశారు.

నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులు సంక్షిప్తంగా.

“మా కుటుంబంలోనే కాదు,  మా ఊరి నుంచి కూడా ఎవరూ ఆర్మీ లో చేరాలని ఆలోచించే వారు కాదు. ఐతే 1962 లో చైనా యుద్ధం జరిగే సమయానికి నేను ఉంగుటూరులో స్కూల్లో చదువుకుంటున్నాను. రక్షణనిధి చందా పోగు చేయడం కోసం స్కూలు పిల్లలని వరి పొలాల్లో కోతలకు పంపారు. మేమందరం చాల ఉత్సాహంగా కోతలు కోస్తుంటే ఓ రైతు నన్ను చూసి, 'అంత సరదాగా పని చేస్తున్నావు,  ఆర్మీలో చేరి యుద్ధం చేస్తావా ?' అని సరదాగానే అడిగారు. నా మనసులో ఆ మాట నాటుకు పోయింది. ఆ తరవాత 1965 లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగే సమాయానికి నేను విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ లో చదువుతున్నాను. ఆ సమయంలో రోజూ రేడియోలో యుద్ధం వార్తలు వింటూ ఉండేవాళ్ళం. అప్పుడు నా మనసులో ఆర్మీలో చేరాలనే ఆలోచన మరింత బలపడింది. అదే లక్ష్యంగా పెట్టుకుని డిగ్రీ చదువుతూనే ఆర్మీ సెలెక్షన్స్ కి ప్రిపేర్ అయ్యాను. 'యద్భావం తద్భవతి' అన్నట్లు డిగ్రీ అవగానే ఆర్మీ ఇంటర్వ్యూ కి వెళ్లడం, సెలెక్ట్ అవడం జరిగిపోయాయి. ఆలా లక్ష్యం, శ్రమ, అదృష్టం అన్నీ కలిసొచ్చాయి.

“అమృత మథనం కథ మనందరికీ తెలిసిందే. దేవతలూ రాక్షసులూ మేరు పర్వతాన్ని వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి సుదీర్ఘ కాలం క్షీర సాగర మథనం చేసారు. ఒకదాని తరవాత ఒకటిగా మంచి వస్తువులు, చెడ్డ వస్తువులు ఉద్భవించాయి. హాలాహలాన్ని నిర్మూలించడానికి దేవతలు శివుని సహాయం కూడా తీసుకోవలసి వచ్చింది.

“స్వతంత్ర భారతదేశ చరిత్ర కూడా అమృత మథనం లాగే సాగుతోంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాసుకి మాదిరిగా తాడులాగా పని చేసి, మథనం ఆగకుండా చూస్తూ, మంచి ఫలితాలు వస్తూనే ఉండేలా, చెడ్డ వస్తువులొస్తే వాటిని నిర్మూలించడానికి పనిచేసే ప్రమథగణాల వలె పని చేస్తున్నాయి. ఈ బ్రహ్మయజ్ఞంలో, తాడులో ఒక చిన్న పోగులా నా జీవితం సాగిపోయింది.

“అయితే, ఏ యజ్ఞానికైనా రక్షణ అవసరం. విశ్వామిత్రుడంతటి మహర్షి తన యజ్ఞానికి శ్రీ రాముల వారి సహాయం తీసుకున్నారు. అలాగే స్వతంత్ర భారత అమృత మధన యజ్ఞానికి ఇండియన్ ఆర్మీ ఎల్లకాలం రక్షణ కల్పించింది, కల్పిస్తుంది కూడా.

“విరోధి దేశాలే కాదు, దేశంలోపల కూడా చాలా దేశ విరోధ శక్తులు పని చేస్తున్నాయని అందరికీ తెలుసు. విరోధి దేశాలతో యుధ్ధాలే కాకుండా, అంతర్విరోధ శక్తులతో కూడా సైన్యం ఎన్నోసార్లు తలపడే అవసరాలొచ్చాయి.

“ఆర్మీలో చేరడం ఎలా జరిగిందో మీకు చెప్పాను. చేరిన తరువాత ట్రైనింగ్ లో కొంత వరకు ధైర్యం, స్థైర్యం, యుద్ధ విద్యలు నేర్చుకుంటాం. నా అదృష్టమేమంటే చేరిన కొన్ని నెలలలోనే యుద్ధంలో పని చేసే అవకాశం దొరికింది. పాకిస్తాన్ విమానాలు జారవిడిచే బాంబులు, గన్స్ నుంచి వెలువడే తూటాలు, అన్నీ అనుభవించాను . మొదట్లో కొంచెం భయం వేసిన మాట నిజమే. కానీ త్వరలోనే అలవాటై పోయింది. 'నా పేరు రాసి ఉన్న బులెట్ వచ్చే వరకు నాకేం కాదు' అన్న ధైర్యం ఈ రోజు వరకు నన్ను నిర్భయంగా ఉంచుతోంది.

“సైన్యంలో మాకు సపోర్ట్ ఉండేది కానీ సోల్జర్ ఫామిలీస్ కి, ముఖ్యం గా భర్తలు బోర్డర్ లో ఉన్నప్పుడు ఒంటరి గా ఉండే మహిళలకి ఏ రకమైన సపోర్ట్ ఉండేది కాదు. పైగా మా రోజుల్లో ఇళ్లల్లో టెలీఫోన్స్ లేవు, మొబైల్ ఫోన్ అప్పటికి రాలేదు. ఒక చిన్న అనుభవం చెపుతాను.

1988 లో నేను కాశ్మీర్ లో, భార్యా పిల్లలూ హైద్రాబాద్ లో ఉన్నాం. మా అబ్బాయి కి ఏడేళ్లు, అమ్మాయికి ఐదేళ్లు. ఒక రోజున మా అమ్మాయి లాల్ బజార్ దగ్గర స్కూటర్ కింద పడింది. బాగా దెబ్బలు తగిలాయి. నాకు ఈ ఆక్సిడెంట్ గురించి తెలిపే సౌకర్యం లేదు. ఇన్లాండ్ లెటర్ రాస్తే అది మా యూనిట్ చేరడానికి 20 రోజులు పట్టింది. నేను యూనిట్ నుంచి 200 కి మీ దూరంలో ఒక పర్వతం పైన డ్యూటీలో ఉన్న్నాను. సో, నాకు ఆ ఉత్తరం చేరడానికి ఇంకో 15 రోజులు పట్టింది. ఆ తరవాత లీవ్ దొరకలేదు. పాపని చూడడానికి 4 నెలల వరకు రాలేక పోయాను. ఈ రోజుకి కూడా అది గుర్తొస్తే బాధగా ఉంటుంది కానీ ఏం చేస్తాం?

“ఇలాంటి అనుభవాలు ప్రతి సైనికుడికి తప్పవు. అయితే 32 సంవత్సరాలు సేవ, సాధించిన విజయాలు, చేసిన సేవా కార్యాలు తలుచుకుంటే నాకే కాదు, నా భార్య, పిల్లలు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. సర్వీస్ లో దాదాపు 13 సంవత్సరాలు టెర్రరిస్టులని వేటాడుతూ గడిపాను. రిటైర్ అయిన రోజు గూడా ఒక టెర్రరిస్ట్ నా మీదికి ఫైర్ చేసాడు. ఆ బులెట్ మీద నా పేరు లేదు గనక నేను మీ ముందున్నాను. ఇంత సేవచేసే అవకాశం దొరకటం అదృష్టం కాదా?

“ఇది నా అమృత మంథన యాత్ర. నా ముందు, నా తరవాత భారత సైన్యం సేవ నిరంతరం సాగుతుంది, అమృతం ఉద్భవిస్తూనే ఉంటుంది”

ఆ రోజు బ్రిగేడియర్ శ్రీరాములు చెప్పినట్టే,  భారత  సైన్యం దేశం పట్ల తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే వుంది. ఈ నాడు కూడా మనందరం చూస్తూనే వున్నాం.

అలాంటి వీరులకు సాల్యూట్ చేయడం, వారు చేస్తున్న త్యాగాలకు కృతజ్ఞులుగా వుండడం ఒక్కటే మనం చేయగలిగింది.



1971 యుద్ధ విరమణ, బంగ్లాదేశ్ అవతరణకు సంబంధించిన ఒప్పంద పత్రంపై ఇండియన్ లెఫ్ట్ నెంట్ జనరల్ జగ్ జిత్ సింగ్ అరోరా, పాకీస్తాన్ ఆర్మీ తరపున ఏ.ఏ.కే. నియాజీ సంతకాలు చేశారు.


ఆలిండియా రేడియో హైదరాబాదు కేంద్రంలో బ్రిగేడియర్ ఎస్. శ్రీరాములు, నేను

ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరి రామమోహన రావు గారు నాకు మెత్తగా పెట్టిన తొడపాశం







 

(ఇంకా వుంది) 

8, మే 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (160) – భండారు శ్రీనివాసరావు

 హమే తుమ్సే ప్యార్ కిత్ నా......

“ఇంకా ఏమన్నా మనసులో వుంటే చెప్పండి. భగవంతుడు దయ వల్ల మాకు ఏ లోటు లేదు” అన్నారు శ్రీ వాస్తవ్ గారు మా ఆవిడా నేనూ అడగడానికి మొహమాటపడుతూ మొహాలు చూసుకుంటూ వుంటే.

“ఏం లేదండీ! పెళ్లి వీలైనంత సింపుల్ గా జరపాలని మా వారి కోరిక. లాంఛనాలు ఏవీ వద్దు.  మాది గుళ్ళో పెళ్లి. అంచేత పిల్లల పెళ్ళిళ్ళకు ఆర్భాటాలు ఎందుకు అని ఆయన ఆలోచన. మీకీ విషయం చెప్పమని నాతో చెప్పారు’ అంది మా ఆవిడ.

‘ఆ ఒక్కటీ తప్ప అన్నట్టు ఆయన మొహం చూడగానే అర్ధం అయింది.

‘నాకు ఒక్కతే అమ్మాయి, ఒక్కడే అబ్బాయి. వీలైనంత ఘనంగా చేయాలని కోరిక. పోనీ ఒక పని చేద్దాం. ముహూర్తాలు చూసుకుని ఇక్కడే, హైదరాబాదులో  ఒక మంచి కళ్యాణ మంటపంలో పెళ్లి చేద్దాం. కావాలంటే నేను రిసెప్షన్ రాంచీలో పెట్టుకుంటాను. మంచి మంటపం చూద్దాం పదండి’ అన్నారాయన.

మా అత్తామామలకు కూడా మా ఆవిడ ఒక్కతే అమ్మాయి. పైగా మగపిల్లలు కూడా లేరు. పాతికేళ్ళ క్రితం నేను మా మామగారితో చేసిన మాటల యుద్ధం గుర్తుకు వచ్చింది. పెళ్లి వద్దు, పెళ్ళాం కావాలి అంటూ నేను పెళ్ళిళ్ళ మీద చేసిన పోరాటం జ్ఞాపకం వచ్చింది. దానివల్ల సాధించింది ఏమిటే అందరి కళ్ళల్లో కన్నీళ్లు తప్ప.  అంచేత, ఆయన మాటలకు నేను ఏమీ జవాబు చెప్పకుండా క్లుప్తంగా సరే అన్నాను.   

ఆ రోజుల్లో ఇన్నిరకాల  పెళ్లి మంటపాలు, పెళ్లి రిసార్టులు  లేవు. శ్రీధర్ ఫంక్షన్ ప్యాలెస్ లో చేస్తే గొప్ప అనుకునే రోజులు. అలా అయిదారు ఫంక్షన్ హాల్స్ చూశాము. ఆయనకు ఏదీ నచ్చినట్టు లేదు. తిరిగి వస్తూ సత్యసాయి కళ్యాణ మంటపం (నిగమాగమం) లోకి వెళ్ళాము. ఆ హాలూ అదీ చూడగానే ఆయనకు తెగ నచ్చేసింది. ఎంతగా నచ్చింది అంటే,  అందులో ఖాళీ వున్న రోజునే ముహూర్తం పెట్టుకుందాం అనేంతగా.

శ్రీ వాస్తవ్ గారిది ప్రతిదీ ఒక స్థాయిలో వుండాలి అనే మనస్తత్వం. చాలా ఏళ్ళు జర్మనీలో వుండివచ్చారు. సూటూ బూటూ టై లేకుండా ఆయన్ని చూసినవారు తక్కువ. ఐ డోంట్ వాంట్ నెంబర్ వన్. ఐ వాంట్ ఏ వన్ అనే వారు.

1999 నవంబరు 29 అర్ధరాత్రి సందీప్ పెళ్లి. సత్యసాయి కళ్యాణ మండపంలో. ఆ రోజుల్లో హైదరాబాదులో ఆ మండపం కాసింత ఖరీదు వ్యవహారమైనా, శ్రీ వాస్తవ్ దాన్ని ముచ్చటపడి ఎంపిక చేసుకున్నారు.  పెళ్ళికి ఒక రోజు ముందే శ్రీ వాస్తవ్ గారు, ఆయన భార్య ఇందూ శ్రీ వాస్తవ్ వారి సమీప బంధువులు చాలామంది  రాంచీ నుంచి తరలి వచ్చారు. కొందరికి హోటళ్ళలో బస ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యులైన ఆడపెళ్ళివారికి మా మేనకోడలు విజయ భర్త జీవీఆర్ రవిగారు, శ్రీనగర్ కాలనీలో, నిగమాగమానికి నడక దూరంలో కొద్ది రోజుల క్రితమే  కొనుక్కుని, గృహప్రవేశం కూడా చేయని కొత్త ఫ్లాటును విడిదిగా ఇచ్చారు.

ఈ పెళ్ళికోసం , మా ఆవిడకు ఆప్త మిత్రురాలు,  మా పొరుగింటి అరుణ, ఆవిడ భర్త  శేఖర రెడ్డి దంపతులు ( ఇప్పుడు నేషనల్ స్టార్ గా వెలిగిపోతున్న పుష్ప ఫేం, అల్లు అర్జున్  వీరి అల్లుడే) మూడు రోజులపాటు తమ ఖరీదైన కారును డ్రైవర్ తో సహా  మా అధీనంలో ఉంచారు. మా తరపున అయ్యే ఖర్చులకోసం ఆఫీసులో పీ ఎఫ్ లోన్  లోన్ తీసుకున్నాను. ఆ రోజుల్లో ఆఫీసులో నా హవా అలా వుండేది. కరెంటు బిల్లు కట్టడం కోసం పీ ఎఫ్ లోన్ కు అప్లయి  చేసినా కూడా మారుమాట్లాడకుండా శాంక్షన్ చేసేవాళ్ళు.

అమీర్ పేటలోని శైలి అపార్ట్ మెంటు నుంచి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వరకు పెళ్లి బారాత్ సాగింది. అదీ మాకు కొత్తే. ఇలాంటి పోకడలకు అలవాటుపడిన ప్రాణాలు కావు.  సందీప్ స్నేహితులు పవన్, సుధీర్, సుధాకర్, రాజశేఖర్, కృష్ణ, శేషిరెడ్డి, కోటిరెడ్డి, మా చిన్న వాడు సంతోష్  దారిపొడుగునా నృత్యాలు చేస్తూ మంచి ఉత్సాహం కలిగించారు. శ్రీ వాస్తవ్ గారి కోరిక మేరకు సికిందరాబాదు నుంచి మిలిటరీ బ్యాండు ఏర్పాటు చేశాను. చేతిలో డబ్బులు వుండేవి కాదు కానీ, బాగా డబ్బులు వున్నవాళ్ళు కూడా చేయలేని పనులు సునాయాసంగా నోటిమాటతో  చేయగలిగిన రోజులవి.

ఆ రోజు ఉదయం కళ్యాణ మండపంలోనే ఉపనయనం. ఆ ఏసీ హాల్లో హోమం చేయడానికి నిబంధనలు అడ్డం వచ్చి, బయట కారిడార్లోనే ఆ కార్యక్రమం పూర్తిచేసాము. అదే ఇబ్బంది పెళ్ళికి కూడా ఎదురయింది. (ఇప్పుడు ఆ నిబంధనలను సడలించినట్టున్నారు)  సాంప్రదాయ బద్ధంగా కన్యాదానం చేయాలనుకున్న శ్రీవాస్తవ్ దంపతులు లోపల రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకుని బయట ఆవరణలో అప్పటికప్పుడు షామియానాలు వేయించి, కుర్చీలు తెప్పించి మరో పెళ్లి ఖర్చు మీద వేసుకున్నారు.

బెజవాడ నుంచి ఈ పెళ్ళికి వచ్చిన మా హనుమంతరావు బావ గారు  పెళ్లి జరిగే వేదికకు దగ్గరలో కుర్చీ వేయించుకుని,  ఇటు దక్షిణాది పద్దతిలో, అటు ఉత్తరాది విధానంలో ఏకకాలంలో తెల్లవారుఝాము దాకా కొనసాగిన వివాహ క్రతువును ఆ సాంతం శ్రద్ధగా చూసారు. రాంచీ నుంచి వచ్చిన మహిళా పురోహితురాలు తాను చదువుతున్న ప్రతి మంత్రానికి అర్ధ తాత్పర్యాలను వివరించి చెప్పడం హనుమంతరావు బావగారిని ఆకర్షించింది. పెళ్లిని ఒక తంతులాగా ముగించడం కాకుండా ఆ క్రతువును నిష్టతో నిర్వహించడం చూసి ఆయన ఆ మహిళా పురోహితురాలిని మెచ్చుకున్నారు కూడా.

నా హిందీ అంతంత మాత్రం. హిందీ సినిమాలకు వెళ్ళినప్పుడు హాల్లో అందరూ పాప్ కార్న్ తింటుంటే నేను మాత్రం మా ఆవిడ మెదడు కొరుక్కుని తింటుండేవాడిని, ఆ హీరో ఏమన్నాడు? ఆ హీరోయిన్ ఎందుకలా ఏడుస్తోంది? అని అడ్డమైన ప్రశ్నలు వేస్తూ.

ఇప్పుడు హఠాత్తుగా ఈ హిందీ ప్రస్తావన దేనికంటే...

అంతకుముందు రోజు అంటే నవంబరు 28 న రవి గారి అపార్ట్ మెంటు ‘డోఎన్’ లో మెహందీ కార్యక్రమం. అప్పటిదాకా ఇలాంటి తంతులు ఎరగని వాళ్ళం కనుక మెహందీలో చిన్నాపెద్దా అందరూ సరదాగా పాటలు పాడడం చూసి ఎంతో సంబరపడ్డాము.

అదిగో అప్పుడు పెళ్లి కుమారుడు సందీప్ గోడనానుకుని నిలబడి, క్రీగంట పెళ్లి కుమార్తె భావనను చూస్తూ పాడిన పాటే ఇది. “హమే తుమ్సే ప్యార్ కిత్ నా......”

అర్ధం నాకంతగా బోధపడలేదు కాని, రాంచీ నుంచి వచ్చిన పెళ్లి వారందరూ తెగ మెచ్చుకున్నారు. ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మర్నాడు కాక ఆ మర్నాడు (డిసెంబరు ఒకటిన ) బేగంపేటలోని ఎయిర్ పోర్టు దగ్గరలోని ఒక హోటల్లో జరిగిన మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి కుమారుడు రాజేష్, ప్రియల పెళ్ళికి కూడా హాజరయి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళడం భండారు కుటుంబానికి ఒక మరపురాని తీయటి జ్ఞాపకం.

 

పైన పేర్కొన్న ఆ హిందీ పాటకి గూగులమ్మ లింకు:

https://www.youtube.com/watch?v=iJllh7l-D3g

 

కింది ఫోటోలు  



పెళ్ళికి హాజరై నూతన దంపతులను అభినందించి, ఆశీర్వదించిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు


ఇప్పుడు అంతటి వ్యవధానం ఉండకపోవచ్చు కానీ, ఇరవై ఆరేళ్ల క్రితం జరిగిన ఈ పెళ్ళికోసం రాంచీ నుంచి వచ్చిన ఆడపెళ్లివారితో తీరికగా  ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.


ఒకప్పుడు మా పొరుగింటి ఆవిడ, ఇప్పుడు హీరో అల్లు అర్జున్ అత్తగారు, మా ఆవిడ ప్రాణ స్నేహితురాలు అరుణ గారితో  మా ఆవిడ నిర్మల


నిబంధనల మేరకు అప్పటికప్పుడు సత్యసాయి నిగమాగమం ఆరుబయట  పెళ్లి మంటపం వేయించి,  అందులో కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్న శ్రీ వాస్తవ్ దంపతులు 







(ఇంకావుంది)

 

6, మే 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (159) – భండారు శ్రీనివాసరావు

 భాష అవసరం బాధల్లో వున్నప్పుడే


నాలాగే మా పిల్లలది కూడా ప్రేమ వివాహాలే. కాకపోతే నాలాగా కాకుండా వాళ్లది నిఖార్సయిన ప్రేమ. భార్యాపిల్లలను వాళ్ళు చూసుకున్నంత ప్రేమగా నేను ఏనాడూ చూసుకోలేదు.  

భావన పట్టుపట్టడంతో వాళ్ళ నాన్న గారు శ్రీ వాస్తవ్ గారు భార్యను ఇందు శ్రీవాస్తవ్ ని వెంటబెట్టుకుని రాంచీ నుంచి విమానంలో హైదరాబాదు వచ్చి,  ఏదో స్టార్ హోటల్లో దిగి, మర్నాడు ఉదయం చెప్పాపెట్టకుండా సరాసరి మా ఇంటికి వచ్చేశారు, మా పెద్దవాడు సందీప్ కు పిల్లను ఇస్తామని చెప్పడానికి. రెండు గదుల ప్లాటు. రెండో బెడ్ రూమ్ లేదు. రాంచీలో వాళ్లది లంకంత కొంప (పెళ్ళయిన తర్వాత తెలిసింది). రాజ్ భవన్ మాదిరిగా  ఇంటి ముందూ వెనుకా లాన్స్.  తూగుటుయ్యాలు. ఇంటి గేటు వద్ద ఘూర్ఖా. ఇద్దరు డ్రైవర్లు. ఇంట్లో ప్రతి పనికి ఒక పని మనిషి. అంతా రాజవైభోగం. పెళ్లి అయ్యేవరకు  మా వాడికి కూడా ఈ విషయాలు తెలవవు. 

శ్రీ వాస్తవ్ గారు మా ఇంట్లోకి వస్తూనే తేరిపార చూసారు. మా స్థితిగతులు ఇట్టే తెలిసిపోయినట్టున్నాయి. అయినా ఒక పక్క కూతురు పట్టుదల. దాంతో నోరు తెరిచి చెప్పారు,  సంబంధం కోసం వచ్చామని. 

నేను తటాలున  అన్నాను,  మీ అమ్మాయిని వద్దనడానికి నాకు ఒకే ఒక అభ్యంతరం వుందని.  నా నోట ఆ మాట విని  భార్యాభర్తలు ఇద్దరూ నివ్వెర పోయారు. నేను నా భార్యని పిలిచి చెప్పాను. నేను చెప్పే ప్రతిమాటా వాళ్లకు బాగా అర్ధం అయ్యేలా చెప్పు. ఏ మాత్రం తభావతు వచ్చినా వాళ్ళు వేరే విధంగా అర్ధం చేసుకుంటారు అని.

మా ఆవిడకు కొంచెం కొంచెం  హిందీ వచ్చు.

నేనిలా చెప్పాను.

“ మీ అమ్మాయికి తెలుగు రాదు. భాష అనేది అందరం  సంతోషంగా వున్నప్పుడు ఎలా మాట్లాడుకున్నా సరిపోతుంది. కానీ ముందు ముందు ఎప్పుడో  మా వల్లనో, మావాడి వల్లనో కారణం ఏదైతేనేం , మీ అమ్మాయి మనసుకు కష్టం కలిగితే,  అది మాతో చెప్పుకుని స్వాంతన పొందడానికి మా భాష తనకు తెలియాలి. మేము ఆమెని  ఊరడించగలగాలి. అందుకోసమే భాష.  ఏదో విధంగా తెలుగు నేర్చుకుంటాను అంటే ఇక నుంచి భావన మీ అమ్మాయి కాదు, ఈ క్షణం నుంచి మా అమ్మాయి”

నా ఈ మాటలతో రాంచీ దంపతులకు నోట మాట రాకపోగా,  కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. 

నా చేతులు పట్టుకుని చెప్పారు, ఈ క్షణం నుంచి భావన మీ అమ్మాయే అని.

ఆ విధంగా మా ఇంట్లోకి పెద్ద కోడలుగా భావన కుడి కాలు పెట్టింది. 

పెళ్ళి నాటికి తెలుగు ఒక్క ముక్క రాదు. ఇంట్లో అందరూ గలగలా తెలుగులో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బిక్క మొగం వేసుకునేది. 

ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఈ సంగతి గుర్తు చేసుకుంటూ  భావన చెప్పింది నాతో .  "అప్పుడు అత్తయ్యే నాకు తోడు నిలిచింది. ప్రతివారం ఒక తెలుగు సినిమాకు తీసుకువెళ్ళే వారు. తను నాకు హిందీలో చెబుతూ నాకు అర్థమైంది తెలుగులో చెప్పమనే వారు. ఆ విధంగా నాకు కొద్దికొద్దిగా తెలుగు నేర్పించారు. అలాగే ఇంట్లో పనిచేసే అమ్మాయి  కళ నాకు మరో తెలుగు టీచరు. ఇక సంతోష్ మరిది అయినా చాలా చనువుగా బహురాణి అంటూ తెలుగు విషయంలో చాలా సాయం చేసేవాడు. నేను సఖిని కడుపుతో ఉన్నప్పుడు వేవిళ్ళు. ఆ రోజుల్లో అత్తయ్య నన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు. "మామయ్య కోసం కానీ , ఇంకా ఎవరికోసం కానీ వెయిట్ చేయవద్దు. వేళకు అన్నం తిను. వాళ్ళకు వీలైనప్పుడు వాళ్ళు తింటారు" అంటూ నాకు అన్నం పెట్టేవారు. సంతోష్ అయితే, కాళ్ళు పీకుతున్నాయి అని మనసులో అనుకుంటే చాలు, ఎలా కనుక్కునేవాడూ, ఏమాత్రం సంకోచించకుండా నా కాళ్ళు పట్టేవాడు. బంగారం లాంటి మరిది. వాడు పోయాడు అంటే నాకు ఈ నాటికీ నమ్మకం కుదరడం లేదు. దేవత లాంటి అత్తయ్య పోయింది. వజ్రం లాంటి సంతోష్ పోయాడు "

అని భావన కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.

నా కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడో ఇంకి పోయాయి. 

నా పెళ్లి నాటికి నా అత్తామామలను చూడలేదు. పెళ్ళికి ఒకరోజు ముందు మద్రాసులో వాళ్ళని చూశాను. మర్నాడే తిరుపతిలో పెళ్లి. 

ఈ విషయంలో నా కోడళ్ళు కొంత మెరుగు. పెళ్ళికి ముందే వాళ్ళు, నన్ను కాకపోయినా మా ఆవిడను చూసారు, మాట్లాడారు. బహుశా తర్వాతే వాళ్ళు తమకు కాబోయే వాళ్లకు ఓకే చెప్పారని అనుకుంటున్నాను. అదే ముందు నన్ను చూసి మాట్లాడి వుంటే ఎలా వుండేదో. 

ఎక్కడో నాగపూర్ దగ్గర రాం టెక్ లో ఇంజినీరింగ్ చదువుకుంటున్న కొడుకు, ఓ తెల్లవారుఝామున ఇద్దరు ఆడపిల్లలను వెంటబెట్టుకుని ఆటోలో ఇంటికి వస్తే, ఆ తల్లి మనసు ఎలా వుంటుంది. ఇదిగో ఇలా. 

అప్పటికి తెలుగు బొత్తిగా తెలియని ఆ ఇద్దరు ఆడపిల్లల్లో ఒకమ్మాయి భావన మాటల్లో:

అత్తయ్య గురించి నా మొదటి జ్ఞాపకం: 

హైదరాబాదులో జీ ఆర్ ఈ పరీక్ష రాయడం కోసం ఒకరోజు నా స్నేహితురాలు స్వాతితో కలిసి నాగపూర్ నుంచి రైల్లో హైదరాబాదు చేరాను. అదే రైల్లో సందీప్ కూడా వస్తున్నాడు అని నాకు తెలియదు. కాలేజీ మేట్ గా తప్పించి అప్పటికి సందీప్ గురించి నాకేమీ తెలియదు. మేమిద్దరం హైదరాబాదుకు కూడా కొత్త. ఇంకా తెలవారలేదు.  అప్పుడు ఊబెర్, ఓలాలు కూడా లేవు. దాంతో  సందీప్ ని అడిగాము, నువ్వు వెళ్ళే దోవలో మమ్మల్ని దింపి వెడతావా అని. వెడుతుంటే తెలిసింది మేము వెళ్ళాల్సిన చోటుకు, అతడు  వుండే ఇల్లు దగ్గరే అని. దాంతో అతడ్ని ముందు దింపేసి మేము వెడదామని అనుకున్నాం. 

నాకు బాగా గుర్తుంది. ఇంటి బయట అంతా చీకటిగా వుంది.  ఉదయం అయిదున్నర అయివుంటుంది.  దుర్గానగర్ లో ఒక ఇంటి ముందు ఆటో ఆగింది. సందీప్ దిగి గేటు తెరిచాడు. గేటు చప్పుడు వినగానే ఎవరో తలుపు తెరిచారు. ద్వారం దగ్గర చిరునవ్వుతో ఒకామె కనిపించింది. చూడగానే ఆ మొహంలో ఆప్యాయత కనిపించింది. సందీప్ అమ్మా అంటూ ఆమెను పలకరించాడు. తలుపు తీయడానికి సిద్ధంగా వున్నారు అంటే ఆవిడకి సందీప్ వస్తున్న సంగతి తెలిసి వుండాలి. అప్పుడావిడ ఆటోలో వున్న మా ఇద్దర్నీ చూసారు. సందీప్ నన్నూ స్వాతినీ పరిచయం చేశాడు. 

చిన్న చిన్న విషయాలే కానీ అప్పుడు ఆమె చక్కటి ఆకుపచ్చ చీరెలో వున్నారు. చాలా ప్రేమతో మా ఇద్దర్నీ లోపలకు రమ్మన్నారు. మీరు ఫ్రెష్ అయ్యేలోగా టిఫిన్ చేస్తాను, తిని వెడుదురు కానీ అని బలవంత పెట్టి తీసుకు వెళ్ళారు. ఆమె పిలుపులో ఎంతో ఆప్యాయత, ఆదరణ. కొడుకు వెంట తెల్లవారుఝామున ఇంటికి వచ్చిన ముక్కూ మొగం తెలియని ఇద్దరు ఆడపిల్లల్ని ఆదరంగా లోపలకు పిలిచి, టిఫిన్ చేసి వెళ్ళండి అనే తల్లిని నేను అంతవరకూ చూడలేదు. 

ఎందుకో ఏమిటో తెలియదు ఆమెను మళ్ళీ చూడాలనే కోరిక నాలో కలిగింది. మళ్ళీ చూస్తాను అనే నమ్మకం కూడా నాలో పొడసూపింది. 

ఆ క్షణంలో మాకు ఎవ్వరికీ తెలియదు. దేవుడి ఆలోచన గురించి. మరో ఇరవై ఏళ్ళ పైచిలుకు ఆ దేవత ఆదరణలో నా జీవితం గడుస్తుందని, కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టి, నా అత్తగారిగా ఆమె ఆపేక్ష చూరగొంటానని.

భౌతికంగా లేకపోయినా స్వర్గం నుంచి ఆమె దీవెనలు మాకు సదా అందుతూనే వుంటాయని నా నమ్మకం” – భావన  

కింది ఫోటో:

అత్తకోడళ్ళ అనుబంధం 





(ఇంకావుంది)