5, మే 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (158) – భండారు శ్రీనివాసరావు

 ప్రపంచం చేసిన ప్రపంచయుద్ధం

రెండో ప్రపంచయుద్ధం ముగియడానికి కేవలం ఇరవై ఆరు రోజుల ముందు నేను ఈ భూమి మీద పడ్డాను. ఆ యుద్ధం గురించి కళ్ళారా చూసిన వాళ్ళు కానీ,  చెవులారా విన్న వాళ్ళు కానీ ఇప్పుడు వుండి వుంటే వారి సంఖ్య చాలా తక్కువగా వుంటుంది.

ఇది ఇప్పుడు ఎందుకంటే వర్తమాన తరం యుద్ధం కాని మరో ప్రపంచయుద్ధాన్ని కనులారా వీక్షించింది. ఆ యుద్ధపు తాలూకు అనుభవాలు ఈ తరంవారి మనసులో ఇంకా పచ్చిగానే వున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం ముగిసి మూడు నాలుగేళ్లే అయింది. ఇది ఒక దేశం మరో దేశంపై సాగించిన యుద్ధం కాదు. ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై ఒక మహమ్మారిపై జరిపిన సంగ్రామం. ఈ యుద్ధంలో వాడిన ఆయుధాలు బాంబులు, తుపాకులు కాదు. అకుంఠిత దీక్షతో, నిర్విరామంగా  ప్రాణాలకు తెగించి అచిరకాలంలోనే కనుగొన్న కొన్ని వాక్సిన్‌లు,కనీవినీ ఎరుగని సంక్షోభ కాలంలో యావత్ మానవాళి ప్రదర్శించిన ఐక్యత. రేపు అనేది వుంటుందా వుండదా అని కంటి మీద కునుకు లేకుండా గడిపిన జనాలకు ఒక్క రేపేమిటి, యుద్ద్ధం ముగిసి మూడేళ్లు గడిచాయి.

ఆ సంక్లిష్ట సమయంలో సాంఘిక మాధ్యమాలలో కానవచ్చిన ఒక పోస్టు నాకు బాగా జ్ఞాపకం వుంది.

‘అతడు తన తెలివితేటలతో ఎంత సంపాదించాడు అంటే ఆ డబ్బుతో మొత్తం నగరాన్నే కొనగలనని మిత్రులతో చెప్పేవాడు. చివరకు కరోనా బారిన పడి, ఆక్సిజన్ కొనుక్కోలేక చనిపోయాడు   

అదేమిటో చిత్రం. కరోనా రక్కసి  కోరలకు చిక్కి రోజుల వ్యవధిలో చనిపోయిన వారు వున్నారు. ఆసుపత్రులలో రోజుల తరబడి క్వారంటైన్ లో బిక్కుబిక్కుమంటూ గడిపి బతికి బయట పడిన వారూ వున్నారు. ఖరీదైన హాస్పిటల్స్ లో  చేరి విగత జీవులు అయిన వారున్నారు. చేరడానికి జనం సంకోచించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతిలేక చేరి, బతికి బట్టకట్టిన వారున్నారు.  

కీడులో మేలులా,  కరోనా  కొంత మంచి కూడా చేసింది. మునుపు సర్కారు దవాఖానా అంటే జనంలో చిన్న చూపు. కరోనా బాధితులను ప్రైవేటు/ కార్పొరేటు ఆసుపత్రులు చేస్తున్న లూటీ గురించి తెలుసుకున్న ప్రజల దృష్టి ప్రభుత్వ హాస్పిటల్స్ మీద పడింది. ఈ విషయంలో విశేష సేవ చేసిన ఆసుపత్రులలో హైదరాబాదులోని  గాంధి ఆస్పత్రి ఒకటి.

నా కాలేజ్ మేట్ ఒకరు ఫోను చేశాడు. ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో చాలా పెద్ద పదవిలోనే, అడిషినల్ సెక్రెటరి హోదాలో రిటైర్ అయ్యాడు. కానీ వస్తుతః నిదానస్తుడునిగర్విపదవిని అడ్డం పెట్టుకుని అడ్డదారులు తొక్కని వాడు. పైగా ఆధ్యాత్మిక భావాలు, దైవ భక్తీపాపభీతి.  ఇలాంటి వాడికి కరోనా కష్టం వచ్చి పడింది. రెండో అబ్బాయి  రామచంద్రన్ (ఇతడు ఒకప్పటి మద్రాసులో పుట్టాడుదానితో స్కూలు రిజిస్టరులో పేరు అలా పడింది)కు కరోనా  పాజిటివ్ అనగానే మనవాడి గుండె జారిపోయింది. దానికి ప్రధాన కారణం కరోనా అయితే రెండో కారణం కొడుకు పుట్టుకతోనే బధిరుడు. ఇలాంటి వాడు ఆసుపత్రిలో ఒంటరిగా ఎలా ఉండగలుగుతారు అనేది నా స్నేహితుడి బెంగ. గాంధి ఆసుపత్రిలో చేర్చి నాకు ఫోను చేశాడు. కానీ నేనూ అతడి పడవలోనే ప్రయాణిస్తున్నాను. రిటైర్ అయి దశాబ్దాలు గడిచాయి. చేయగలిగింది ఒక్కటే మంత్రి  కేటీఆర్   గారికి,   గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి గారికి  వాట్సప్ లో అభ్యర్ధనలు పంపాను. పర్వాలేదు అన్నట్టుగా ఇద్దరి నుంచి  తిరుగు సందేశం వచ్చింది. పేషెంటుకు వినికిడి సమస్య వుంది కాబట్టి ప్రత్యేక గది కన్నా క్యూబికల్స్ లో వుంటే మంచిది అని డాక్టరు ప్రభాకరరెడ్డి గారు అన్నారు. అదే మంచిదయింది. ఆసుపత్రిలొ  వున్నన్ని రోజులు రోగిని కనిపెట్టి చూసుకున్నారు. ప్రతిరోజూ పరిశుభ్రమైన, పౌష్టిక  ఆహారం అందించేవారు. సిబ్బంది సైతం చాలా సేవాభావంతో పనిచేసేవారని ఆ అబ్బాయి ఫోనులో చెబుతుంటే, ఇంకా నయం వేరే కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్పించక పోవడం  మంచిదయిందని తండ్రి సంతోషపడ్డాడు.

మొత్తం మీద నెగెటివ్ అనిపించుకుని అతడు డిశ్చార్జ్ అయ్యాడు. ప్రభుత్వ ఆసుపత్రులపై తనకు మంచి అభిప్రాయం లేదనీకానీ ఇప్పుడా దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయిందనీ ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో చెప్పాడు.

 

అదే ఆసుపత్రిలో నా మేనత్త మనుమడు మురళి  చేరాడు. అతడి దురదృష్టం కరోనా అతడిని కబళించింది. అలాగే నా ముద్దుల మేనల్లుడు కొలనరావు. కరోనా బారిన పడకూడదని వాడు తీసుకోని జాగ్రత్తలు లేవు. అయినా అది వాడిని వదిలిపెట్టలేదు.  బతికించుకోవడానికి చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. మా మొత్తం కుటుంబాన్ని కలచివేసిన మరణాలు ఇవి.

కొన్ని కుటుంబాలు మొత్తం కరోనా చేతికి చిక్కుకున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో ఆసుపత్రిలో. అక్కడ చోటు దొరకని వాళ్ళు ఇళ్ళల్లో ఒంటరిగా. హాస్పిటల్ లో వాళ్ళు ఇళ్లకు రాలేరు. ఇళ్ళల్లో వాళ్ళు అక్కడికి పోలేరు. ఎక్కడివాళ్లు అక్కడే ఒంటరిగా భయంతో బాధతో. మాట్లాడడానికి తోడు వుండరు. హాస్పిటల్ వార్డుల్లో వారికి మొబైల్స్ వుండవు. ఎవరు ఎలా వున్నారో కనుక్కునే వీలు లేదు. జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని భయంకరమైన వాతావరణం.  ఆసుపత్రిలో చనిపోతే అటునుంచి అటే మునిసిపాలిటీ ఏర్పాటు చేసిన వాహనంలో కాటికి తరలించేవాళ్లు. అంత్యక్రియలకు నలుగురినే అనుమతించేవారు. అది కూడా పీపీయీ  కిట్లు ధరించి వస్తేనే. శాస్త్రీయంగా అంత్యక్రియలు జరిపించే వీలే లేదు.

  మురళి చనిపోయినప్పుడు వాడి కుమారుడు  తేజ శ్రీనివాస్ తండ్రి మరణానికి చింతిస్తూ ఇలా రాశాడు. అప్పటి పరిస్థితికి ఇది అడ్డం పడుతుంది.

“పరిగెడుతున్నాం,

ఇంట్లో వున్ననలుగురం చేతిలో చెయ్యేసి పరిగెడుతున్నాం..

అదేమీ పందెమూ కాదు

మాకేమి లక్ష్యమూ లేదు

కానీ పరిగెడుతున్నాం, పరిగెడుతూనే వున్నాం.

ఇంతలో కంటికి కనపడని ఏదో తాడు

మా నలుగురి కాళ్ళకి తట్టుకుంది.

మేం ముగ్గురం పడి లేచాం,

కానీ నాన్నే బోర్లాపడి దొర్లుతున్నాడు..

కాళ్లల్లో శక్తి లేదేమో, మాలా లేవలేకపోయాడు!

తిప్పలు పడ్డాడు,

శాయశక్తుల ప్రయత్నించాడు,

అతని ప్రాణం పెట్టి ప్రయత్నించాడు,

కుదర్లేదు!

ఒక్కసారిగా కూలపడిపోయాడు..

నా చేతిలోనే  కాలిపోయాడు..!      

"మళ్ళి వెనక్కి రావాలంటూ" ఒట్టు వేయించుకొని,

అంబులెన్స్ ఎక్కించిందే నాన్న తాలూకు ఆఖరి జ్ఞాపకం!

“పండగకో, పరామర్శకో తిరిగి రాడానికి,

నాన్న అత్తగారింటికి వెళ్లలేదే,

అదేదో నిండు శూన్యానికి వెళ్ళాడు!

అమ్మ పలకరింపుకి కూడా అందని

దూరానికి చేరాడు!”

 

కింది ఫోటోలు:

కోవిడ్ టీకా వేయించుకుంటున్న నా మేనల్లుడు కొలనరావు, మరో మేనల్లుడు పర్చా మురళి










(ఇంకా వుంది)  

4, మే 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (157) – భండారు శ్రీనివాసరావు

 కరోనాకు వాక్సిన్ కనుగొనేంత వరకూ అన్నీ అనుమానాలే. ఎవరూ తీర్చలేని సందేహాలే. తాగే నీటిద్వారా, పీల్చే గాలి ద్వారా, మనిషి  నుంచి మరో మనిషికి ఈ వ్యాధి సోకుతుందని వదంతులు. వీటిని ఖండించేవారు లేరు, ద్రువపరిచేవారు లేకపోవడంతో ఎవరికివారే సొంత భాష్యాలు, సొంత వైద్యాలు ప్రచారంలోకి తెచ్చారు. మా చిన్నప్పుడు ఇంట్లో మడి దడి పెద్దవాళ్లు పాటించేవాళ్లు. అంటూ సొంటూ పిల్లల్ని దగ్గరకి రానిచ్చేవాళ్ళు కాదు. కాళ్ళూ చేతులూ కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశం వుండేది కాదు.  ఇదెక్కడి చాదస్తంరా బాబూ అనుకునేవాళ్లం.

కరోనా కాలంలో అందరిదీ ఇదే వరస. ఒక ఇంట్లో వుండే మనుషులే ఎడం ఎడం.  మూతికి  గుడ్డలు, వీటిల్లో మామూలు మనుషుల కోసం మామూలు మాస్కులు, . ఖరీదైన మనుషులకోసం ఖరీదైనవి. చావు ముంగిట్లో కూడా తేడాలు.  చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లు.  లిఫ్టుల ముందు శానిటైజర్ స్టాండ్స్. ఏది తినాలన్నా, తాగాలన్నా ముందు చేతులు కడుక్కోవడం,  క్యూ లైన్లలో మనిషికి మనిషికి నడుమ ఎడం వుండేట్టు చూసుకోవడం,  రోదసీ యాత్రీకల మాదిరిగా పెద్ద పెద్ద మాస్కులు తగిలించుకుని విమాన ప్రయాణాలు, మధ్యలో ఒక సీటు ఖాళీ.  క్షవర శాలలు మూతపడడంతో మగవాళ్లు తలనీలాల మొక్కు వున్నవారిలా  దుబ్బు జుట్లతో, మాసిన గడ్డాలతో  కనబడేవారు.   ట్రాఫిక్ పోలీసు కనబడగానే స్కూటరుకు తగిలించిన హెల్మెట్ తీసి పెట్టుకున్నట్టు, ఎవరైనా  ఫొటో తీస్తున్నారనే ఎరుక కలగగానే, మొహం సరిగా కనబడదని పెట్టుకున్న మాస్కులు కాసేపు తీసేయడం, ఓహో ఎన్నెన్ని వేషాలు వేయించింది కరోనా. ఇప్పుడు గుర్తు చేసుకుంటే, నవ్వు వస్తుంది. కరోనా కాలంలో తప్పనిసరై చేసుకున్న కొన్ని మంచి అలవాట్లు, తదనంతర కాలంలో కొనసాగించి వుంటే,  కొన్ని అంటూ రోగాలు మటుమాయం అయ్యేవని అనిపిస్తుంది.    

శాస్త్రవేత్తలు అంతటి లాక్ డౌన్ కాలంలోను కిట్లు, మాస్కులు  ధరించి నిర్విరామ కృషితో వాక్సిన్ కనుగొన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ధృవీకరణతో ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.   

2021 మార్చి ఇరవై ఎనిమిదిన ఒకేరోజుఒకే హాస్పటల్ లో పదహారు వేలమందికి కోవిడ్ వాక్సిన్ (ఫైజర్) ఇచ్చారని అమెరికాలో సియాటిల్ లో ఉంటున్న మా పెద్దకోడలు భావన ఫోన్ చేసి  చెప్పింది. చదివింది బీ టెక్ అయినా తన అభిరుచి కొద్దీ టీచింగ్ లైన్ ఎంచుకుంది. అది కోవిడ్ సమయంలో కలిసి వచ్చింది. నర్సులుటీచర్లు వాక్సినేషన్ విషయంలో ప్రాధాన్యతా క్రమంలోకి వస్తారు. అంచేత వాక్సిన్ రాగానే మొదటి డోసు ఇచ్చారు. ఇది రెండోది. మా వాడు  మాత్రం  ఇంకా వెయిటింగ్ లిస్టులోనే వున్నాడు. వాళ్ళ వరుస వచ్చేసరికి కొన్ని నెలలు పట్టేట్టు ఉందిట.

సియాటిల్  లోని ఒక పెద్ద హాస్పటల్ లో ఈ కోవిడ్ వాక్సినేషన్ కి భారీ ఏర్పాట్లు చేశారట. ముందే టైం స్లాట్లు నిర్ణయించి ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, స్లాట్ ప్రకారం టైముకు వచ్చిన వారికి వచ్చినట్టు వాక్సిన్ డోసు ఇచ్చారట.. ఉదయం ఆరు గంటల నుంచి మొదలై సాయంత్రం వరకు ఇది కొనసాగిందట.

 

అజ్ఞానం, అవగాహన లేమి అని అనుకున్నా పర్వాలేదు కాని, వాక్సిన్ కనుగొనేంత వరకు,  కరోనాను కట్టడి చేయడానికిఅప్పటికి  అందుబాటులో ఉన్న ఆచరణ సాధ్యమైన మార్గం, మనుషుల నడుమ కొంత దూరం ఉండేలా చూసుకోవడం ఒక్కటే. ఇందుకోసం లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం. ఒకరకంగా ఇది ప్రధమ చికిత్స లాంటిది.

సామాజిక దూరమో, భౌతిక దూరమో ఏ పేరుతో పిలిచినా,  దాన్ని ఖచ్చితంగా పాటించడం ఒక్కటే ఆ నాటికి శరణ్యం. ముందు వ్యాధి వ్యాప్తిని అరికట్టడం ప్రాధమిక బాధ్యత. ప్రభుత్వాలు ఈ దిశగానే అడుగులు వేసాయి. కొన్ని ఫలితాలు కూడా వచ్చాయి.

ఉదాహరణకు అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలోని సియాటిల్ లోనే ముందు ఈ వ్యాధి పొడసూపింది. పాజిటివ్ కేసులు వెలుగు చూసింది, కరోనా మరణాలు సంభవించింది కూడా ఈ నగరంలోనే. ఒకరకంగా అమెరికాలో కరానా వ్యాధికి ఈ నగరాన్ని ఎపిసెంటర్ గా మొదటి రోజుల్లో అనుకున్నారు. దేశంలో లాక్ డౌన్ పెట్టాలా అక్కరలేదా అని ఫెడరల్ ప్రభుత్వం మీన మేషాలు లెక్క పెడుతున్నప్పుడే,  వాషింగ్టన్ స్టేట్ గవర్నర్ తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. రోజులు గడిచిన తర్వాత దాని సత్ఫలితాలు క్రమంగా అనుభవంలోకి రావడం మొదలెట్టాయి. పాజిటివ్ కేసులు తగ్గలేదు కాని వాటి సంఖ్య పెరగకుండా ఆపగలిగారు.

ఒక చిన్న నిప్పు రవ్వ గాలికిలేచి దూరంగా వున్న గడ్డి వాములపై పడి అవి భస్మీపటలం అయిన సందర్భాలు అందరి అనుభవం లోనివే. కాబట్టి ఈ కరోనా నిప్పురవ్వ యావత్ సమాజాన్ని దహించకుండా వుండాలంటే బహుముఖ చర్యలు అవసరం. అవన్నీ ఆచరణలోకి వచ్చేలోగా లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గం అని  శాస్త్రవేత్తలు భావించారు. అభివృద్ధికి ఆటంకం అని తెలిసి కూడా చాలా దేశాల ప్రభుత్వాలు తలవూపక తప్పలేదు. 

ఈ క్రమంలో ప్రజలకు సాధ్యమైనంత తక్కువ అసౌకర్యం కలగకుండా చూసుకోవడం ఒక్కటే ప్రభుత్వాల బాధ్యత. చిన్న చిన్న ఇబ్బందులను పెద్ద మనసు చేసుకుని భరిస్తూ అనవసరమైన ఆరోపణలు, విమర్శలు చేయకుండా ప్రభుత్వాలకు సహకరించడం ప్రజలు అలవాటు చేసుకోవాలి. కొన్నాళ్ళు ఇది తప్పదు అనే నిర్ణయానికి అందరూ వచ్చారు.

కరోనా గురించి వేగంగా విస్తరించిన వదంతులు అన్నీ అర్ధ సత్యాలే. వాతావరణంలో వేడి వుంటే ఈ వైరస్ నశిస్తుందని కొందరు అన్నారు. కానీ ఈ వ్యాధి బాగా విస్తరించిన దేశాల్లో చలి వాతావరణం ఉన్న దేశాలతో పాటు ఉష్ణ దేశాలు కూడా వున్నాయి. ఏదీ నిర్ధారణ కానీ నేపధ్యంలో ఈ ఊహాగానాలు ప్రజల్లో భయ సందేహాలను మరింత పెంచడానికి మాత్రమే పనికివచ్చాయి. చదువుకున్నవాళ్లు సయితం  తమకు తెలిసిన అరకొర జ్ఞానాన్ని నలుగురికీ పంచాలనే అతి ఉత్సాహాన్ని తగ్గించుకోకపోవడం వదంతుల విస్తృతికి దోహదం చేసింది.

ఆ రోజుల్లో,  తెలియని కొరానా గురించి తెలిసీ తెలియని మాటలు చెప్పేవారిని చూస్తుంటే, చిన్నప్పుడు చదువుకున్న  నలుగురు దృష్టి లేనివాళ్ళు, ఏనుగు కధ గుర్తుకు వచ్చేది.

 

పెద్దగీత ముందు చిన్న గీత

కరోనా రాకకు ముందు వరకు కేన్సర్ పేరు చెబితే జనం హడిలిపోయేవారు. కేన్సర్ నిర్ధారణకు చేసే పరీక్ష పేరు చెబితేనే కేన్సర్ వచ్చినట్టుగా భావించి ఇంటిల్లిపాదీ భయపడిపోయేవారు. ఎందుకంటే వర్తమాన ప్రపంచంలో సామాన్యులు, అసామాన్యులు కూడా కేన్సర్ అంటే ఇక కేన్సిల్ అని ఆశలు వదులుకునే పరిస్తితుల్లో జీవిస్తున్నారు. రోగి బతకడు అని తెలిసి కూడా, అలవి కాని  చికిత్స చేయించక తప్పని పరిస్తితి. అదీ లక్షల్లో ఖరీదు చేసే వైద్యం.  

కరోనా సమయంలోనే మాకు తెలిసిన వాళ్ళలో ఒకరికి అత్యంత భయంకరమైన ఈ  కేన్సర్  వ్యాధి సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. భయపడిపోయి  పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పదహారు లక్షల ప్యాకేజీతో పలానా రోజున ఆపరేషన్ చేస్తామని చెప్పి అందుకు అవసరమైన కొన్ని పరీక్షలు చేశారు. ఆ రోగికి కరోనా పాజిటివ్ అనే సంగతి ఆ పరీక్షల్లో బయటపడింది. అంతే! డాక్టర్లు కేన్సర్ ఆపరేషన్ పక్కన పెట్టి ఆ రోగిని ఐసొలేషన్ లో పెట్టారు. పొద్దున్నే ఒక నర్సు వచ్చి బెల్లు కొట్టి తలుపు దగ్గర రెండిడ్లీలు ఉన్న ప్లేటు పెట్టి  వెళ్లిపోయేదట. వేళకు కొన్ని మందులు, భోజనం అలాగే. రోగికి ఎవరూ కనబడరు. ఇంటి మనుషుల్ని రానివ్వరు. అసలే కేన్సర్ భయంతో బిక్కచచ్చి ఉన్న రోగికి ఈ పరిస్తితి మరింత భయానకంగా మారింది. బిల్లు చూస్తే   రోజుకు లక్ష.  కట్టగలిగిన స్థోమత వున్నవాళ్ళు కూడా వైద్యం ఎలా జరుగుతోందని ఆలోచిస్తారు. కానీ అక్కడ రోగికి జరుగుతున్న చికిత్స అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. కరోనా నెగెటివ్ వచ్చిన దాకా కేన్సర్ గురించి ఆలోచించరు. పెద్ద గీత ముందు చిన్న గీత మాదిరిగా అంత పెద్ద కేన్సర్ కూడా ఇంత చిన్న కరోనాముందు  చిన్నదయిపోయింది.

కుటుంబ సభ్యుల  ఆందోళన అంతా కరోనా గురించి. కేన్సర్ విషయం మరిచిపోయారు.

(ఇంకా వుంది)

3, మే 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (156) – భండారు శ్రీనివాసరావు

 

దేశాన్ని కరోనా పట్టి  పీడిస్తున్న రోజులు.  జనమంతా ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియక తమని గురించే తామే మధన పడుతున్న రోజులు. రోజు ఎలా గడుస్తుందో అని రోజులు  లెక్క పెట్టుకుంటున్న రోజులు.

2020 మే నెల నాలుగో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫోను రింగయింది.

భండారు శ్రీనివాసరావు గారా! లైన్లో వుండండి వైస్ ప్రెసిడెంటు గారు మాట్లాడుతారు”

వెంకయ్య నాయుడు గారు దేశంలో చాలామందికి ఇలా ఫోను చేసి మాట్లాడుతున్నారని తెలుసుకానీ ఆ ఫోను నాకు వస్తుందని ఊహించలేక పోయాను. ఇంతలోనే నాయుడు గారు లైన్లోకి వచ్చారు.

శ్రీనివాసరావు గారు ఎలా వున్నారునేను వెంకయ్య నాయుడిని”

నమస్కారం సార్! నేను బాగున్నానండీ! మీరెలా వున్నారు?”

నేను బాగానే వున్నాను. మీ ఆవిడ చనిపోయిన తర్వాత ఫోను చేసి మాట్లాడలేకపోయానువెరీ సారీ”

“..........”

హైదరాబాదులో మన మిత్రులందరూ కులాసేనే కదా!”

అందరూ బాగున్నారండీ. నాకు అర్ధం కాని విషయం అండీ. పేపర్లో చదివాను. మీరు ఈ కరోనా సమయంలో ఇలా అందరితో ఫోను చేసి మాట్లాడుతున్నారని. ఇంత తీరిక ఎలా దొరికింది”

ఇలాంటి సమయాల్లోనే కదా మాట్లాడి యోగక్షేమాలు కనుక్కోవాల్సింది”

“....................”

ఇక్కడ నేను నా భార్య ఇద్దరమే. పిల్లలు దగ్గర లేరు. బహుశా పెళ్ళయిన తర్వాత ఇలా ఇద్దరం ఒక్కచోట ఇన్నాళ్ళు కలిసివుంది ఇప్పుడేనేమో”

చాలా సంతోషంగా వుందండీ మీతో మాట్లాడడం”

నాకూ అలానే వుంది. అందరం పెద్ద వయసులో పడ్డాం. ఆరోగ్యం జాగ్రత్త! వుంటాను శ్రీనివాసరావు గారు”

తర్వాత సిగ్గనిపించింది. ఈ కరోనా సమయంలో నేనూ ఖాళీనే. కానీ ఎంతమంది స్నేహితులను పలకరించగలిగాను?

2020  సంవత్సరం మే నెల  12 వ తేదీ.  

నా పేరు రజనీష్ శర్మ, సిమ్లా రాజ్ భవన్ నుంచి మాట్లాడుతున్నాను. గవర్నర్ సాబ్ మీతో మాట్లాడుతారు లైన్లో వుండండి” అన్నాడో వ్యక్తి  స్వచ్చమైన హిందూస్థానీలో.

కాసేపటి తర్వాత బండారు దత్తాత్రేయ గారు లైన్లోకి వచ్చారు.

“ఏం శ్రీనివాస్ ఎలా వున్నారు” అని పలకరించారు సాదరంగా. కానీ గొంతు చాలా మార్దవంగా, సన్నగా వినబడింది.

“మీ ఆరోగ్యం ఎలా వుంది” నా పరామర్శ.

“బాగానే వున్నాను. కాకపోతే తెలిసిన వాళ్ళు అందరికీ దూరంగా ఇలా’

అప్పుడు ఆర్ధం అయింది ఆయన ఎందుకు అంత నీరసంగా అనిపించారో.

అంజయ్య గారికి, దత్తాత్రేయ గారికి చుట్టూ జనం వుండాలి. అదీ సాధారణ జనం. గొప్పగొప్ప వాళ్ళు కాదు.  మామూలు జనం మధ్యలో వుంటే అదే ఆయనకు ఆక్సిజన్. వాళ్ళతో మాట్లాడుతూ వుంటే అదే ఆయనకు టానిక్కు.

లాక్ డౌన్ పరామర్శలు పూర్తయిన తర్వాత ఆయన పాత రేడియో రోజులను గుర్తు చేసుకున్నారు.

“నన్ను చాలామంది అడిగేవారు, ఆ రేడియో శ్రీనివాసరావు (భండారు) మీకేమైనా చుట్టమా అని. నేను చెప్పేవాడిని, ఆయన నా కుటుంబ సభ్యుడు అని. ఆ రోజులు నిజంగా వేరు. విలేకరులు అందరూ నన్ను ప్రేమించేవారు. అభిమానించేవారు, నిజంగా వారికి నేను చేసింది ఏమీ లేదు, అప్పుడప్పుడూ రైలు టిక్కెట్లు కన్ఫర్మ్ చేయించడం తప్ప” దత్తాత్రేయ గారు చెప్పుకుపోయారు.

నిజమే. ఆయన రైల్వే మంత్రిగా వున్నప్పుడు మాలో ఎవరం రైల్వే రిజర్వేషన్ల కోసం ఇబ్బంది పడలేదు. నిజానికి ఆయన్ని మేమే చాలా ఇబ్బంది పెట్టి ఉంటాము. ఆయన వ్యక్తిగత సహాయకుడు నగేష్ కి ఫోను చేసేవాళ్ళం. అంతే! కాసేపట్లో బోగీ నెంబరు, బర్త్ నెంబరు వచ్చేసేవి. బండారు దత్తాత్రేయ గారికి నగేష్ నమ్మిన బంటు. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కాగానే హైదరాబాదు నుంచి సిమ్లాకు వెంటబెట్టుకుని వెళ్ళింది నగేష్ నే. దత్తాత్రేయ గారి లాగే నగేష్ కు కూడా ప్రజాసంబంధాలు ఎక్కువే. అందరికీ చేతనయినంత సాయం చేయాలనే మనస్తత్వం.

కాసేపు మాట్లాడిన తర్వాత దత్తాత్రేయ గారు చెప్పారు, హైదరాబాదులో మన మిత్రులను అందరినీ అడిగినట్టు చెప్పమని. మర్యాదకు అలా అన్నారు కానీ నాకు తెలుసు ఆయనే ఫోను చేసి వాళ్ళని పలకరిస్తారని. నేను అనుకున్నట్టు ఆయనే చెప్పారు.

“మన కృష్ణారావు (ఆర్వీవీ కృష్ణారావు, ఆలిండియా రేడియో న్యూస్ ఎడిటర్)తో కూడా మాట్లాడాను. నేనూ ఆయనా రాం నగర్ లో వుండేవాళ్ళం. ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డులో మార్నింగ్ వాక్ లో కలుస్తుండేవాళ్ళం”

బండారు దత్తాత్రేయ గారు ఒకసారి సికిందరాబాదు నుంచి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఢిల్లీ ఆకాశవాణి వాళ్ళు ఆయన వాయిస్ అడిగారు. నగేష్ ని రిక్వెస్ట్ చేస్తే కాదనకుండా రాత్రి పదకొండు దాటిన  తర్వాత  ఆయన్ని వెంటబెట్టుకుని రేడియో  స్టేషన్ కు తీసుకువచ్చాడు. ఎన్నికల ఫలితాలు కదా, మాకు ఇరవై నాలుగు గంటల వార్తాప్రసారాలు నడుస్తున్నాయి. ఇళ్ళకు పోకుండా ఆఫీసులోనే పనిచేస్తున్నాము. ఆయన ఢిల్లీ ఇంటర్వ్యూ వెంటనే అయిపోయింది. లైవ్ కాబట్టి ఆయన కూడా విన్నారు. మేము మా పనిలో పడ్డాము. పొద్దుటి నుంచి బాగా అలసిపోయినట్టున్నారు. న్యూస్ రూమ్ కుర్చీలోనే కాసేపు అలా పడుకుండి పోయారు. కొద్ది సేపటి తర్వాత లేచి వెళ్ళిపోయారు. అంత సాదాసీదా మనిషి.          

“ఇదిగో ఈ లాక్ డౌన్ అవగానే హైదరాబాదు వస్తాను, అప్పుడు కలుద్దాం” అన్నారు దత్తాత్రేయ గారు ఆప్యాయంగా.

“లేదా మీరే సిమ్లా వద్దురు కానీ” అనేసారు వెంటనే.

 

నిజంగా నూటికి నూరుపాళ్ళు ఆయన జనం మనిషి. 

అనడానికి దత్తాత్రేయ గారి గురించి మరో జ్ఞాపకం

 

కొంత గ్యాసు నూనె కావాలె. మరేమీ అక్కరలేదు” అన్నారు బండారు దత్తాత్రేయ గారుమీకింకా ఏమి కావాలి’ అని అడిగిన ఆనాటి మంత్రి మండలి వెంకటకృష్ణా రావు గారితో.

ఇది 1977 నాటి మాట. ఆ ఏడాది నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి విరుచుకు పడిన ఉప్పెన ధాటికి దివి సీమలో ఊళ్లకు ఊళ్ళే తుడిచి పెట్టుకు పోయాయి. కాళరాత్రిగా మారిన ఆనాటి రాత్రి అకస్మాత్తుగా ముంచెత్తిన సముద్రపు అలల తాకిడికి దివి సీమ శవాల దిబ్బగా మారింది. రోజుల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రామాలతో పాటే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు కూడా కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి అన్ని దారులు మూసుకు పోయాయి. పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, విలేకరులు అతి కష్టం మీద కొన్ని రోజుల తర్వాత కానీ అక్కడికి చేరలేకపోయారు. వరద తీసిన తర్వాత పేరుకుపోయిన మట్టి మేటల్లో వందలాది మనుషుల శవాలు, పశువుల కళేబరాలు కూరుకు పోయాయి. నష్టం జరిగింది కానీ ఏమేరకు అని అంచనా వేయడానికి అడుగడుగునా అన్నీ ప్రతిబంధకాలే. ఇప్పటి మాదిరిగా కమ్యూనికేషన్ సదుపాయాలు ఆనాడు లేవు.

ఈ నేపధ్యంలో దత్తాత్రేయ గారు అన్నమాట అది, ‘మాకేమీ అక్కరలేదు, గ్యాసు నూనె చాలు’ అని.

బండారు దత్తాత్రేయ ఏమిటి గ్యాసు నూనె కావాలని అడగడం ఏమిటి?  ఈ రెంటికి అసలు ఎక్కడ సంబంధం అనుకోవచ్చు. ఒక ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా అనేకమంది తోటి సహచరులతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దత్తాత్రేయ గారు దివి సీమకు వెళ్ళారు. వరద నీటిలో తేలుతూ ఉబ్బిపోయిన మనుషుల శవాలను ఒక్క చోటకు చేర్చి వాటికి అనాథ శవ సంస్కారం చేసే ఉత్కృష్టమైన బాధ్యతను ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు స్వచ్చందంగా నెత్తికి ఎత్తుకున్నారు. ఈ పని చేయడానికి వారికి కిరోసిన్ అవసరం. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నది స్వయానా నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు. ఆయన కూడా రాత్రి పగలు, దారి డొంకా అని లేకుండా కాలి నడకన కలయ తిరుగుతూ ప్రాణాలతో బయట పడిన దివి సీమ వాసులకు ప్రభుత్వ పక్షాన ధైర్యం చెబుతూ, అధికారులతో మాట్లాడుతూ, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తూ, కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తూ వుండడం చూసి హైదరాబాదు నుంచి వెళ్ళిన కొందరు వ్లిలేకరులకు ఆశ్చర్యం వేసింది. తెల్లటి ఖద్దరు దుస్తుల్లో హైదరాబాదులో చూసిన మనిషి, మట్టి కొట్టుకుపోయిన దుస్తుల్లో ఊరూ వాడా అనకుండా తిరుగుతూ వుండడం వారికి మరింత ఆశ్చర్యం కలిగించింది.

స్థానికంగా అన్నీ తానే అయి చూస్తున్న మండలి కృష్ణారావు గారిని దత్తాత్రేయ బృందం కలిసింది. ముందు దత్తాత్రేయ వేష భాషలు చూసి నాగపూర్ నుంచి వచ్చి ఉంటారని మంత్రి అనుకున్నారు.  హైదరాబాదు నుంచి ఆంధ్రజ్యోతి తరపున పరాంకుశం దామోదర స్వామి, ఈనాడు తరపున పాశం యాదగిరి ప్రభ్రుతులకు కూడా దత్తాత్రేయ గారిని ఆనాడు చప్పున గుర్తు పట్టలేని పరిస్థితి.

గ్యాసు నూనె అంటున్నారు ఈయన గారిది హైదరాబాదు అయి వుంటుంది అనే అనుమానం కలిగింది.

పాశం యాదగిరిని చిన్నప్పటి నుంచి పండిత్ పొట్టా (బాల మేధావి) అనే వారు. చాలా విషయాలు గుర్తుంచుకునే ధారణ శక్తి పుష్కలం.

బండారు దత్తాత్రేయ ఎవరన్నది యాదగిరికి చప్పున జ్ఞాపకం వచ్చింది.

ఖాఖీ నిక్కరు వేసుకుని, లాఠీ చేత పట్టుకుని, క్యా ఆలీఘడ్ క్యా గౌహ్వాటీ, అప్ నా దేశ్, అప్నా మాటీ” అంటూ గౌలీగూడాలో తమ ఇంటి మీదుగా వెళ్ళే ఆర్.ఎస్.ఎస్.  ప్రభాత్ భేరీ బృందం యాదగిరి స్మృతిపధంలో లీలగా మెదిలింది. అందుకే అతడు యాదగిరి కాదు, యాద్ గిరి అని పిలుస్తాను నేను.

ఇక ఇద్దరికీ తాము ఎవరన్నది తెలిసిపోయింది.

నువ్వు పాశం గోపయ్య బిడ్డవు కదా!” అన్నారు దత్తాత్రేయ.

యాదగిరి, దామోదరస్వామి దత్తాత్రేయ బృందంతో కలిసి దివిసీమపై పగబట్టిన ప్రకృతి ఆగ్రహంతో చేసిన విలయ తాండవం తాలూకు ఘోర దృశ్యాలను కళ్ళారా చూసారు. వరద పూర్తిగా తీసిన తర్వాత కొన్ని కొబ్బరి చెట్ల మట్టలలో చిక్కుకుని వున్న మానవ కళేబరాలను చూసినప్పుడు, నవంబరు పందొమ్మిది అర్ధరాత్రి సంభవించిన ఉప్పెనతో దివి సీమకు వాటిల్లిన ముప్పు తీవ్రత ఎంతటిదో వారికి అర్ధం అయింది. అంటే ఆ ఎత్తులో సముద్రపు కెరటాలు విరుచుకు పడ్డాయి అన్నమాట.

ఇంకేమీ అక్కరలేదు గ్యాసు నూనె చాలు’ అని నలభయ్ అయిదేళ్ళ నాడే అనాథ శవాల అంత్యక్రియలు చిత్తశుద్ధితో చేసిన బండారు దత్తాత్రేయ గారు  కొన్నేళ్ళకి గవర్నర్ కాగలిగారు.

పదవులు ఊరికే రావు

కింది ఫోటోలు:

ఉప రాష్ట్రపతిగా వున్నప్పుడు శ్రీ వెంకయ్య నాయుడుతో, హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీ బండారు దత్తాత్రేయతో  



(ఇంకా వుంది)





 

(ఇంకా వుంది)

సామాన్య పౌరులు ఆశించేది కూడా ఇదే! – భండారు శ్రీనివాసరావు

 నా రెండో కోడలు ఉద్యోగ బాధ్యతల మీద వచ్చే జూన్ లో ఓ వారం రోజులు అమెరికా వెళ్లి రావాలి. ఇది ఆమెకు అలవాటే. ఇదివరకే, చైనాతో సహా  ఇరవై దేశాలు తిరిగి వచ్చింది. వేలిడ్  పాస్ పోర్ట్ వుంది, వేలిడ్ వీసా వుంది. కాకపోతే, పాస్ పోర్ట్ వాలిడిటీ,  ప్రయాణం నాటికి కనీసం ఆరు నెలలు వుండాలి.  అంచేత కొత్త పాస్ పోర్ట్ కు అప్లయ్ చేయాలి. ప్రయత్నిస్తే, మే రెండో తేదీ, నిన్న  మధ్యాన్నం మూడు గంటలకు స్లాట్ దొరికింది. అమీర్ పేట లోని పాస్ పోర్ట్ సేవాకేంద్రానికి వెళ్ళింది. ఈ కేంద్రం TCS వాళ్ళ నిర్వహణలో వుంది. చాలా చక్కగా పనులు జరుగుతున్నాయి. మా కోడలి  మొదటి పాస్ పోర్ట్ ఒడిస్సా రాష్ట్రం, కటక్ లో జారీ చేశారు కాబట్టి పోలీసు వెరిఫికేషన్ అవసరం అయినట్టుంది.  సేవాకేంద్రం  నుంచి ఇంటికి రాకమునుపే మొబైల్ కు మెసేజ్ వచ్చింది.

TGPVC: Dear Sir/Madam, Your passport application is allotted to CILVER SAI KUMAR , Enquiry Officer (PS S R NAGAR). Please keep the documents ready. In case the Enquiry Officer does not contact you within a week, please contact Passport Verification Cell on Ph.No. 8712667600.Hyderabad City Police

మామూలుగా మామూలు మనుషులకు వచ్చే అనుమానమే వచ్చింది. ఇదంతా ఎప్పటికి తెమిలేను?

అయితే ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే, ఈ రోజు, మూడో తేదీ  ఉదయం పది గంటలకల్లా, నరసింహ అనే ఉద్యోగి మా ఇంటికి వచ్చి  పాస్ పోర్ట్ ఎంక్వైరీకి వచ్చానని చెప్పాడు. కావాల్సిన డాక్యుమెంట్లు చూసాడు. ఇరుగుపొరుగుతో మాట్లాడాడు. పదే పది నిమిషాల్లో పని పూర్తి చేసుకుని కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయాడు.

వారం రోజుల దాకా వేచి వుండే అవసరం లేకుండా పోయింది.

ప్రతి పనికీ అధికారుల మీదా, సిఫారసుల మీదా ఆధారపడే అవసరం లేని పరిపాలననే సామాన్యుడు కోరుకుంటాడు. సుపరిపాలన అంటే నాకు తెలిసిన అర్ధం ఇదే!