16, డిసెంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (40) - భండారు శ్రీనివాసరావు

 

 ఇప్పటిమాట కాదు. అరవై ఏళ్ళ పైమాటే.

మద్రాసు జనరల్ ఆసుపత్రి బీటు చూసే ఒక విలేకరికి ఒక రోజు స్కూటర్ ప్రమాదంలో గాయపడి మరణించిన వ్యక్తి శవం కనిపించింది.

పక్కనే ఎవరికోసమో ఎదురుచూస్తున్న లక్ష్మి అనే అమ్మాయి (పేరు తరువాత తెలిసింది) అతడికి తారసపడింది. ఆమె ఒక నిర్మాణ కూలీ. స్కూటరు పై వెడుతున్న ఓ ఇద్దర్ని అటుగాపోయే వాహనం కొట్టేసి ఆగకుండా అందరూ చూస్తుండగానే వెళ్ళిపోయింది. కిందపడి గిలగిలాకొట్టుకుంటున్నవారిని అందరితోపాటు ఈమె కూడా చూసింది. అందరూ వింత చూసేవారే కాని ఒక్కరూ కలగచేసుకోలేదు. ఈమే పరిగెట్టుకు వెళ్లి వాళ్ళను లేవదీయాలని ప్రయత్నించింది. ఓటాక్సీని ఆపింది. అప్పటికే ముగ్గురునలుగురు ఆపకుండాపోయారు. మరి కిరాయి ఎవరిస్తారని మరో  టాక్సీవాడు అడిగాడు. డబ్బులేదు. ముక్కుపుడక చూపించింది. టాక్సీలో ఇద్దరినీ జనరల్ హాస్పటల్ కి తీసుకువెళ్ళింది. అయిన ఆలస్యంవల్ల ఆ ఇద్దరిలో ఒకడు అప్పటికే చనిపోయాడు. ఈ స్తితిలో విషయం తెలుసుకున్న విలేకరి హృదయం ద్రవించింది.

నిరక్షరాస్యురాలయిన ఓకూలీ వనిత తన రోజుకూలీ కూడా వొదులుకునిముక్కుపుడక టాక్సీవాడికి ఇచ్చి హాస్పటల్ కు చేర్చిన వైనాన్ని ఆ విలేకరి మరునాడు తన పేపర్లో రాసాడు. ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ ‘అనే శీర్షికతో రాసిన ఆ వార్త నగరంలో చర్చనీయాంశం అయింది. పోలీసు కమీషనర్,  లక్ష్మికి పాతికరూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆమె రోజుకూలీ రూపాయన్నరతో పోల్చుకుంటే ఆరోజుల్లో అది పెద్దమొత్తమే. పత్రికా పాఠకులనుంచి కూడా మంచిస్పందన వచ్చింది. అనేకమంది ఆమెకు కానుకలు పంపారు. మధురై నుంచి వెంకటేశ్వరన్ అనే వ్యక్తి ఒక పార్సెల్ పంపాడు.. గాయపడ్డవారి రక్తంతో తడిసిన ఆమె చీరెకు బదులుగా ఒక కొత్త చీరెను కానుకగా పంపించాడు. పాఠకులనుంచి దాదాపు వెయ్యిరూపాయల సాయం అందింది. వంద రూపాయలు మించి వస్తే ఒక ఇత్తడి గిన్నె కొనుక్కుంటానని ఆయువతి తరువాత అదే విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అది  చదివిన కంచికామకోటి పీఠాధిపతిపరమాచార్య ఒక ఇత్తడిగిన్నెను ఆమెకు కానుకగా పంపించారు.

ఇంతకీ అసలువిషయంఏమిటంటే -

ఆ వార్త వేసిన  పేపరు హిందూ. ఆ వార్త రాసింది అందులో కొత్తగా విలేకరిగా చేరిన ఆర్.జే. రాజేంద్రప్రసాద్.

ఈ కధా నాయకుడు, తదనంతర కాలంలో  హైదరాబాదులో హిందూ పత్రిక డిప్యూటీ ఎడిటర్ అయ్యారు. నేను  హైదరాబాదు రాకముందు నుంచి కూడా ఆయన నాకు తెలుసు. నేను విజయవాడలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ఆయన అక్కడే హిందూ పత్రికకు ROVING CORRESPONDENT గా వున్నారు. వార్తలకోసం చుట్టుపక్కల జిల్లాలు తిరుగుతుండేవారు. 

ఆ రోజుల్లో ఒకసారి మా వూరికి మా పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. ఆ సందర్భంలో రాజేంద్రప్రసాద్ గారు 'మీ ఊరు పోతున్నాను, మీరూ వస్తారా' అని అడిగారు. 'అది అంత సులభం కాదండీ, ప్రయాణంలో చాలా అవస్థలు పడాలి' అన్నాను. 'అవస్థలు పడితేనే కదా మనకి వార్తలు దొరుకుతాయ'ని ఆయన అన్నారు.

సరే అని ఇద్దరం బెజవాడ నుంచి రైల్లో బయలుదేరాము. ఉదయం నైజాం పాసింజరులో వెళ్లి రెండు గంటల తర్వాత మోటమర్రి (అంతకుముందు అల్లినగరం) స్టేషనులో దిగాము. వర్షాకాలం. దోవ అంతటా చిత్తడి చిత్తడిగా వుంది. అల్లినగరం మీదుగా జొన్నచేలమధ్య కాలిబాట పట్టుకుని,  నాలుగు మైళ్ళు నడిచి వెడితే మా వూరు కంభంపాడు. చెప్పులు చేతిలో పట్టుకుని నడక మొదలు పెట్టాము. బురద నేలల్లో మోకాళ్ళ దాకా కాళ్ళు కూరుకుపోతున్నాయి. పాపం ప్రసాద్ గారు  పట్టణం నుంచి వచ్చి ఎన్ని అవస్థలు పడుతున్నారో అనిపించింది. కానీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన మార్కు మందహాసంతో దారిపొడుగునా కబుర్లు చెబుతూనే వున్నారు. జొన్నచేలు దాటి, మా వూరు పొలిమేరల్లో వరిపొలాల గట్ల మీద నడుచుకుంటూ మొత్తం మీద మా వూరు చేరాము.

పల్లెటూరు కదా టిఫిన్ల మాట ఎత్తకుండా మా అమ్మగారు ఏకంగా భోజనాలకే లేపారు. మా బామ్మగారు ఎవర్రా వచ్చింది, తాసీల్ దారా అని అడుగుతోంది. భోజనాలు అయిన తర్వాత ప్రసాద్ గారు వూళ్ళో తిరిగి వద్దామన్నారు. వచ్చింది పేపరు మనిషి అని వూరి వాళ్ళకి తెలిసిపోయింది. ఆయనతో చెప్పుకుంటే పేపర్లో రాస్తారు, తమ కష్టాలు తీరిపోతాయని అందరూ ఆయన చుట్టూ మూగి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రసాద్ గారు పరమ ప్రశాంతంగా వాళ్ళు చెప్పిన ప్రతిదీ ఓపిగ్గా విన్నారు. కే.ఎల్. రావు గారు మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.

మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు, ఆకాశంలో  గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.

ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.

అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి నిష్క్రమించారు. వచ్చింది హిందూ కరస్పాండెంటు కాబట్టి, ప్రసాద్ గారితో కాసేపు విడిగా మాట్లాడారు.

మర్నాడు బయలుదేరి మేమిద్దరం బెజవాడ వచ్చేసాము. 

ఆ తర్వాత మూడో రోజనుకుంటాను హిందూలో ఓ బాక్స్ ఐటం వార్త వచ్చింది. సరైన రోడ్లు లేక దారి తప్పిన కేంద్రమంత్రి అంటూ. కేంద్ర మంత్రి తనతో మాట్లాడిన విషయాలను క్లుప్తంగా ప్రస్తావించి, వూరి వాళ్ళు తనతో చెప్పుకున్న కష్టాలను వివరంగా రాసారు. 

ఆ వార్త వచ్చిన కొద్ది రోజులకే, కే.ఎల్. రావు గారు శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి. 

కే.ఎల్. రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు.

అయితే దండలో దారం మాదిరిగా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన వార్త ప్రభావం ఈ అభివృద్ధిలో వుంది.

దానికి ప్రత్యక్ష సాక్షులలో నేనొకర్ని.

ఆ రోడ్డుకు ఎవరూ పనికట్టుకుని పేరు పెట్టలేదు. ఆ నలభయ్ గ్రామాల ప్రజలే ఈనాటికీ దాన్ని కె.ఎల్.రావు రోడ్డు అని పిలుచుకుంటున్నారు. కే.ఎల్.రావు గారి కుమార్తె, ఐ.ఏ.ఎస్. అధికారి సుజాతా రావు గారికి  ఈ విషయం చాలా సార్లు చెప్పాను. ఆవిడ కూడా వెళ్లి చూద్దాం అన్నారు. హైదరాబాదులో వున్నప్పుడు పని ఒత్తిళ్ళ కారణంగా వీలు పడలేదు. తరువాత ఢిల్లీ పోస్టింగు. అక్కడే రిటైర్ మెంటు. ఇక కుదురుతుందని నేనూ అనుకోవడం లేదు.

నీటి పారుదల నిర్వహణ, గ్రామీణ విద్యుదీకరణ రంగాల్లో కె.ఎల్.రావు ( కానూరి లక్ష్మణ రావు అసలు పేరు. కృష్ణా జిల్లా కంకిపాడు వాస్తవ్యులు) గారికి ఒక ఇంజినీరుగా దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వున్నాయి. ఒక అంతర్జాతీయ సదస్సులో కె.ఎల్.రావు గారు ఆశువుగా చేసిన సుదీర్ఘ ప్రసంగం ఆలకించిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ముగ్ధుడు అయ్యారు. ఆ నాటి ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు ఆయన్ని అధికార పార్టీ తరపున విజయవాడ పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేయించారు. అదే నియోజక వర్గం నుంచి రావు గారు ముమ్మారు లోకసభకి ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి,  ఇందిరాగాంధీ మంత్రి వర్గాల్లో ఆయన మంత్రిగా వున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత. వృత్తి రీత్యా రాజకీయ నాయకుడు కాకపోయినా,  నాగార్జున సాగర్ ఆనకట్ట రూపకల్పనలో, నిర్మాణంలో ఆయన పాత్ర అద్వితీయం. రాతితో, మట్టితో ఆనకట్ట నిర్మాణం ఏమిటని ఎద్దేవా చేసిన వాళ్ళు వున్నారు.

‘మనది పేద దేశం. నిరక్షరాస్యులైన పనివాళ్లు కోట్లలో వున్నారు. వారికి ఎంతోకొంత జీవన భృతి కల్పించాలి అంటే ఇలాంటి నిర్మాణాలే తగినవి అని ఆయన గట్టిగా వాదించి అలాగే సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. దేశంలో ఆ రోజుల్లో నిర్మితమైన అనేక సాగు నీటి ప్రాజెక్టులు, ఆనకట్టల వెనుక కె ఎల్ రావు గారి పాత్ర వుంది. నీటిపారుదల పితామహుడు అనే పేరు ఆయనకు వుంది.  సాగర్ ఎడమ కాలువ ద్వారా కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలకు సాగునీరు అందేలా చేశారు. వందల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. తమకు సేవచేసిన మనిషిని గుర్తు పెట్టుకుని మూడు సార్లు గెలిపించిన ఆ ఓటర్లే నాలుగో సారి ఓడించడం రాజకీయాల్లోని చమత్కారం.

కింది ఫోటోలు:


(హిందూ రాజేంద్ర ప్రసాద్)


(డాక్టర్  కే.ఎల్ .రావు)


(ఇంకా వుంది)





ఈరోజు అన్ని వ్యాపకాలకు స్వస్తి

  

ఏనాడు తనని గురించి తాను ఆలోచించుకోవడానికి సుతరామూ ఇష్టపడని ఓ వింతమనిషి, 1971 డిసెంబరు  16 న, నా జీవితంలో వెలుగులు విరజిమ్ముతూ ప్రవేశించింది. నలభయ్ ఎనిమిదేళ్లు ఆ సహజీవనం కొనసాగింది. ఉన్నట్టుండి ఓ అర్ధ రాత్రి నన్ను ఒంటరివాడిని చేసి మాయమై పోయింది. ఆ వెలుగుల క్రీనీడలో నా అయోమయపు ప్రయాణం సాగుతోంది. ప్రతి ఏడాది ఇదే రోజున రాత్రి పన్నెండు గంటలు కొట్టగానే ఆదమరచి నిద్రపోతున్న నన్ను లేపి, సుతారంగా నుదుట ముద్దు పెట్టి,  శుభాకాంక్షలు  చెప్పేది. అప్పటిదాకా ఆ రోజు మా పెళ్లి రోజని నాకు గుర్తు వచ్చేది కాదు. పిచ్చి పెళ్ళాం. పిచ్చిగా నన్ను ప్రేమించింది.  అందుకే  నన్ను పెద్దమనసుతో మన్నించేది.



Where ever you are,  Happy many returns of the day my dear wife Nirmala.  

16-12-2024

15, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (39) - భండారు శ్రీనివాసరావు

 


అలా వరసగా పరీక్షలు తప్పుతూ నాకు నేనుగా తెచ్చిపెట్టుకున్న సెలవులను మా స్వగ్రామం కంభంపాడులో కులాసాగా గడుపుతున్న రోజుల్లో ...కొన్ని పాత దస్త్రాలు నా కళ్ళపడ్డాయి. చదువు సరిగా అంటక పోయినా విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి నాకు చిన్నతనం నుంచే వుండేది. అదే తరువాతి కాలంలో నేను ఎంచుకున్న వృత్తిలో ఎదగడానికి లేదా కొనసాగడానికి  దోహదం చేసింది. ఎప్పటిదో బ్రిటిష్ జమానానాటి  ఆ దస్త్రాలను మా మూడో అన్నయ్య కుమారుడు భండారు రాఘవరావు పదిలపరచడం నిజంగా గొప్ప విషయం. వాటి ద్వారా మా ఊరి గురించిన కొన్ని వివరాలు తెలిశాయి.  

1341 ఫసలీ (ఫస్లీ అనే ఈ పారశీక పదం  ఉర్దూలోకి దిగుమతి అయి చాలా భారతీయ భాషల్లో స్థిరపడింది. ఫసలీ అని, ఫస్లీ అని కూడా  అంటారు) బ్రిటిష్ జమానాలో ఇది వ్యవసాయక (HARVEST) సంవత్సరం. ఇప్పుడు  ఏప్రిల్ నుంచి మార్చి వరకు పన్నెండు నెలలను ఆర్ధిక సంవత్సరం అంటున్నారు కదా! అలా అన్నమాట. దీనికి 590 కలిపితే గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం 1931 అవుతుంది. గ్రెగేరియన్ అంటే  ఇప్పుడు వాడుకలో వున్న కేలండర్. 1931 అంటే  ఇప్పటికి అక్షరాలా తొంభయ్ మూడు సంవత్సరాలు గడిచాయి.  అప్పటినుంచి ఇప్పటివరకు మా వంశంలో మూడు తరాలు గడిచి నాలుగోది మా పిల్లల తరం నడుస్తోంది. 

‘DETAILED LIST OF JOINTLY REGISTERED  HOLDERS IN THE VILLAGE OF KAMBHAMPADU NO.144, NANDIGAMA TALUK, KISTNA DISTRICT అని ఇంగ్లీష్ లోను, కృష్ణ జిల్లా, నందిగామ తాలూకా, నె. 144 రు. కంభంపాడు గ్రామం, జాయింటు పట్టాదారుల లిస్టు వివరం’ అని తెలుగులోనూ వుంది. గ్రామంలోని యావత్తు పట్టాదారుల పేర్లు, పట్టా నెంబర్లు అన్నీ చక్కగా టైప్ చేసి వున్నాయి.

వివరాల్లోకి వెడితే, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దేశం మొత్తంలో గ్రామాల వారీగా సమగ్ర భూ సర్వే చేయించి ఆ వివరాలను అన్నిటినీ ప్రకటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ప్రభుత్వం పనుపున ఎలాంటి భూ సర్వే జరగలేదని ఊరిలోని కొందరు పెద్దవారు చెప్పారు. ఇది అప్పటి మాట. (అయితే ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలలో సమగ్ర భూసర్వే సర్వే జరుగుతోందని,  అధునాతన సర్వే పరికరాలు, డ్రోన్ల సాయంతో ఈ సర్వే సాగుతోందని, రేపోమాపో మా ఊరిలో కూడా భూముల సర్వే పూర్తయి కొత్త సరిహద్దు రాళ్ళతో కూడిన పట్టాలు ఇస్తారని అంటున్నారు. దశల వారీగా జరుగుతున్న ఈ పని కొంత పూర్తి అయిందని, ఇది పూర్తయితే  భూములకు సంబంధించిన వివాదాలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని ఓ చిన్ని చిన్ని ఆశ) 

ఇదలా ఉంచితే, తొమ్మిది దశాబ్దాల క్రితం జరిగిన ఈ సర్వేలో మా గ్రామానికి సంబంధించిన అనేక విషయాలు తెలిశాయి. అప్పటికే మా ఊరి చెరువు కింద, మునేరు ఆనకట్ట కాలువ కింద భూములకు సేద్యపు నీరు అందేది. (ప్రస్తుతం నాగార్జున సాగర్ ఎడమ కాలువ, బ్రాంచ్ కెనాల్ ద్వారా కూడా మా ఊరికి సేద్యపు నీరు అందుతోంది) సాగుకు వీలైన భూమి మొత్తం 3591.41 ఎకరాలు వుండేది. ఇందులో  128 ఎకరాల్లో వరి, 1101 ఎకరాల్లో జొన్న పండించేవారు. ఇవికాక, సజ్జలు, రాగులు, మొక్కజొన్నలు, ప్రత్తి, పొగాకు మొదలైన పంటలు కూడా పండించేవారు.  సాగుకు పనికి రాని భూమి 3,440 ఎకరాలు, పోరంబోకు భూములు 365.14 ఎకరాలు కాగాగ్రామంలో భూమిశిస్తు మొత్తం  4720 రూపాయలు వసూలు అయ్యేది.   9.85 ఎకరాల్లో బందెలు దొడ్డి వుండేది. రికామీగా  తిరుగుతూ ఊళ్ళో వారి చేలపై పడి మేసే గొడ్లని పట్టుకుని  కట్టివేసే దొడ్డి అన్నమాట.  నిర్ణీత అపరాధ రుసుము చెల్లించి వాటి యజమానులు ఆ పశువులను విడిపించుకునేవారు. 

1929 వ సంవత్సరం జమాబందీ  లెక్కల ప్రకారం, ఊరి మొత్తంలో  1620 పశువులు (ఆవులు, ఎడ్లు, గేదెలు, దున్నపోతులు వగైరా)  675 గొర్రెలు, మేకలు వుండేవిట. 

అంత పాత కాలంలోనే ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా భూముల సర్వే గ్రామాల వారీగా జరిపి రికార్డులని భద్రపరిచారు అంటే అలనాటి రెవెన్యూ వ్యవస్థ ఎంత పకడ్బందీగా పనిచేసేదో అర్ధం చేసుకోవచ్చు.

ఒకప్పుడు, నాకు ఎరుక తెలిసేటప్పటికే  మా ఇంట్లోనే డజన్ల కొద్దీ పాడి పశువులు, ఎడ్లూ, కోడె దూడలు, ఎడ్ల బండ్లు, అరకలు   ఉండేవి. ఇప్పుడు ఆ పాడీ లేదు, పశువులూ లేవు. వెనుకటి రోజుల్లో పెరుగు, మజ్జిగ అమ్మడం నేను చూడలేదు. కొనుక్కోవడం అసలు ఎరగం. వూళ్ళో ఎవరింటికి అయినా చుట్టాలు వస్తే పాలూ, పెరుగూ ఇరుగింటి పొరుగింటి వారే పంపేవారు. వచ్చిన  బంధువులు పడుకోవడానికి నులక మంచాలు, నవారు మంచాలు  కూడా పంపేవారు. ఏదైనా సందర్భం వచ్చి ఊళ్ళో పదిమందికి భోజనాలు పెట్టాల్సి వస్తే, ఎవరి చెంబులు,  గ్లాసులు వాళ్ళే వెంట తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతం అనుకునే  మా ఊళ్లోనే వంట సామాన్లు, వడ్డన సామాన్లు, మీల్స్ టేబుల్స్, కుర్చీలు  అద్దెకు ఇచ్చే టెంటు హౌస్ లు రెండు మూడు వున్నాయి.   

వూరి నిండా కార్లూ, స్కూటర్లు, ట్రాక్టర్లు. వీటికి   మాత్రం కొదవలేదు. అందరి చేతిలో సెల్ ఫోన్లు. బస్తీలలో లాగే పల్లెల్లో కూడా ఓ  మాటా లేదు, ముచ్చటా లేదు. ఎవరి ప్రపంచం వారిదే.

కింది ఫోటో:


(Courtesy Cartoonist)







(ఇంకా వుంది)

14, డిసెంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (38) - భండారు శ్రీనివాసరావు

 

మాది 1962 హెచ్.ఎస్.సి. బ్యాచ్. ఈ ఒక్క సంగతి గుర్తు పెట్టుకుని వున్నట్టయితే, లేదా సమయానికి గుర్తు వచ్చి వున్నట్టయితే ఇవ్వాళ నా నెలవారీ  పెన్షన్ ఓ పాతిక వేలు పెరిగివుండే అవకాశం వుండేది. నాది మతిమరపు జాతకం కదా! కర్ణుడి లాగా సమయానికి గుర్తురాలేదు. బంగారం లాంటి అవకాశం చేజారి పోయింది. అందుకే కదా నన్ను నేను జీరో అనుకునేది. ఉత్తి జీరో కాదు, బిగ్ జీరో. ఆ కధేమిటో మరోసారి సమయం  వచ్చినప్పుడు చెబుతాను.

ఆ ఏడాది కారణం తెలియదు కాని, 1962 హెచ్.ఎస్.సి. యాన్యువల్ పరీక్ష రోల్ నెంబర్లు రాష్ట్రం మొత్తంలో ఖమ్మం, రిక్కబజార్ హై స్కూలు నుంచి మొదలు పెట్టారు. ఒకటి, రెండు, మూడు ఇలా అన్నమాట.  నా రోల్ నెంబరు ఏడు.  ఏడంటే ఏడే. ముందు వెనుక మరో అంకె లేదు. హాల్ టికెట్ మీద ఏడు నెంబరు చూడగానే, కాపురం చేసే  కళ కాళ్ళ మెట్టెలు చూస్తే తెలిసినట్టు, నా పరీక్ష ఫలితం పరీక్ష రాయక ముందే నాకు తెలిసిపోయింది. ఇది కాక మరో అదృష్ట సంఖ్య వచ్చినా ఫలితం మారదని కూడా నాకు  తెలుసు.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికి ఓట్ల లెక్కింపుకు ముందే ఫలితం పట్ల ఓ అంచనా ఉంటుందని అంటారు. అలాగే విద్యార్ధికి కూడా ఫలితం పట్ల ముందుగానే ఓ అంచనా వుంటుంది. కాకపోతే, రిజల్ట్స్ వచ్చేవరకు మేకపోతు గాంభీర్యం. మినిమం సెకండ్ క్లాస్. హయ్యర్ సెకండ్ వచ్చినా ఆశ్చర్యం లేదు అంటూ బూకరింపులు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. నాదీ అలాగే ముగిసింది. ఒకటి కాదు, రెండు సార్లు. ఒకటి ఒంటరి అంకె. నాకు నచ్చదు.  

పరీక్షలు రాయడం పూర్తయింది. తప్పడం తప్పదు అనే విషయం కూడా మనసుకు రూడి అయింది. కాబట్టి కంభంపాడు వెళ్లి అక్కడ పిల్లలతో ఆడుకుంటూ కాలక్షేపం చేయడం మంచిదని అక్కడికి బిస్తరు కట్టాను. మా పెద్దన్నయ్య ఎప్పుడూ ప్రయాణాలకి సూట్ కేసులు వాడే వాడు కాదు. ఆ రోజుల్లో చాలామంది హోల్దాల్ వాడేవాళ్ళు. దానికా పేరు ఎందుకో నాకయితే తెలియదు. బహుశా హోల్డ్ ఆల్ అయివుంటుంది.  దానికి రెండు వైపులా బట్టలు పెట్టుకునే జాగా వుంటుంది, దాన్ని రెండుపక్కలా మధ్యకు మడిచి బెల్ట్ తో బిగించేవాళ్లు. ప్రయాణాలకు చాలా అనువుగా వుండేది. కొంతమంది దాన్ని బిస్తరు అనేవాళ్ళు.

మొత్తం మీద మా ఊరు చేరాను. ఊరు చేరగానే నాకు వంటికి కొత్త రక్తం పట్టినంత హుషారు. బారెడు పొద్దెక్కి లేచినా అడిగేవాళ్ళు వుండరు. పనివాళ్లు లేపడానికి చూసినా మా బామ్మ వాళ్ళని కసిరేది, పిల్లాడు ఒళ్ళు మరచి నిద్రపోతుంటే చూడలేరా అని వాళ్ళ మీద గయ్యిమనేది. సాయంత్రం అయ్యేసరికి తుమ్మల బీడు పక్కన పారే వాగు ఇసుకలో చెడుగుడు (కబడ్డీ)  ఆడేవాళ్ళం. కూత ఎంత పెడితే అంత ఘనం. మా ఊరి స్కూలుకు బయట నుంచి మాస్టర్లను వేయడం మొదలయింది. మల్లయ్య గారనే కొత్త టీచరు వచ్చారు. ఆయన తన వెంట షటిల్ ఆటను పట్టుకొచ్చారు. బ్యాట్లు,బంతులు కొని ఆట ఆడేవాళ్ళం. ఆయనే అది ఎలాఆడాలో చెప్పాలి. స్కోరు గమ్మత్తుగా వుండేది. ఇరుపక్షాలు  సమానం అయితే లవ్ ఆల్ అనేవారు. ఆటలో ఈ లవ్వు ఏమిటని నవ్వుకునేవాళ్ళం. పాటలు బాగా పాడేవాడు. ఘంటసాల లాగా పాడుతాను అని ఆయనకో నమ్మకం. మహేశా పాపవినాశా కైలాస వాసా ఈశా అనే పాట ఎక్కువగా పాడేవాడు. ఊళ్ళో చిన్నపిల్లలను దగ్గరకు తీసి చిన్న చిన్న నాటికలు వేయించేవాడు. మా ఇంట్లోనే వాటి రిహార్సల్స్ నడిచేవి.  

వరి కళ్లాల సమయంలో మా బామ్మగారు వెళ్లి రాత్రి పూట అక్కడే పడుకునేది. ఒక్కోసారి ఆమెను ఇంట్లోనే వుండమని నేను వెళ్ళే వాడిని. పగటి పూట బాగానే వుండేది. ఎడ్ల చేత తొక్కించడం, చేటలతో ధాన్యం చెరిగి రాశిగా పోయడం, కుండలతో అంటే మట్టివి కావు, ధాన్యం కొలతకు వాడే ఇత్తడి గుండిగలతో కొలిచి బస్తాలు నింపడం, సరదాగా గడిచేది. కట్టె మిఠాయి తట్టలలో పెట్టుకుని కళ్లాల దగ్గరికి తీసుకువచ్చి అమ్మేవారు. మానెడు వడ్లు కొలవడం, హాయిగా తినడం. రాత్రి పూట బాగా చలి వేసేది. రెండు దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగేది కాదు. అందుకని వరి గూడులో నేను కాళ్ళు ముడుచుకుని పడుకోవడానికి వీలుగా, ధృవ ప్రాంతాలలో నివసించే  ఎస్కిమోలు మంచుతో ఇండ్లు నిర్మించుకున్నట్టు చిన్న గూడు చేసి నేను అందులో పడుకోగానే మళ్ళీ వరిగడ్డితో మూసేసే వారు. అందులో వెచ్చగా పడుకుని నిద్రపోయేవాడిని. కాపలా కోసం పంపిస్తే నిద్రపోతావా అని మా బామ్మ నన్ను ఆ డ్యూటీ నుంచి తప్పించింది.

మా  బామ్మ రుక్మిణమ్మ గారికి ముగ్గురు కుమార్తెలు. ఆమె పెద్ద కుమార్తె అంటే మా పెద్ద మేనత్త రంగనాయకి భర్త, ఖమ్మం జిల్లాకు చెందిన కొలిపాక లక్ష్మీ నరసింహారావు గారు. నరసింహారావుగారి అన్నగారు కొలిపాక శ్రీరాం రావు గారు వరంగల్లులో పెద్ద వకీలు. ఈ అన్నదమ్ములకు ఇద్దరికీ ఖమ్మం, వరంగల్ జిల్లాలలో వందల ఎకరాల భూమి.  మా పెద్ద మేనత్త మొగుడు పెద్ద లాయరు కూడా. పిత్రార్జితంతో పాటు వకీలుగా మంచి పేరు, గట్టి ఆస్తులు సంపాదించారు. లక్ష్మీ నరసింహారావు గారి పెద్ద కుమారుడు రామచంద్ర రావు గారికి మా రెండో అక్కయ్య శారదను మేనరికం ఇచ్చారు.

రెండో మేనత్త కమలా బాయి  భర్త  ఖమ్మంలో పెద్ద వకీలు, అంతకంటే పెద్ద భూస్వామి అయిన పర్చా శ్రీనివాసరావు గారు. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఆయనకు పెద్ద బంగ్లా వుండేది. అది పాత తెలుగు సినిమాల్లో జమీందారుల భవనంలా కనిపించేది. ఎత్తయిన మెట్లెక్కి పైకి వెళ్ళగానే ఎదురుగా ఒక పెద్దహాలు, దానికి ఇరువైపులా వరండాలు, మళ్ళీ వెనకవైపు మరో హాలు, ఇరువైపులా గదులు ఇలా చాలా విశాలంగా వుండేది. ఆయన ఆఫీసు గదిలో ఒక సీలింగు ఫ్యాను వుండేది. సీలింగు ఎత్తుగా వుండడం వలన అవసరం అయినప్పుడు ఫ్యానును కిందికి దించుకునే ఏర్పాటు వుండేది. మా మేనత్త మొగుడు కూర్చునే వకీలు కుర్చీ, దానికి ఎదురుగా పెద్ద మేజా బల్ల, అటూ ఇటూ క్లయింట్లు కూచోవడానికి కుర్చీలు చాలా అట్టహాసంగా ఉండేవి. ఆయన ప్రాక్టీసు కూడా అలానే వుండేది. ఇది కాక ఖమ్మం జిల్లాలో వాళ్ళ స్వగ్రామం మండవలో  భారీ ఆస్తులు ఉండేవి. దానికి ఆనుకుని ఉన్న కృష్ణా జిల్లాలోని గ్రామాల్లో కూడా భూములు ఉండేవి. వాటిమీద వచ్చే అయివేజు కూడా భారీగానే వుండేది. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. పీవీ నరసింహా రావు గారితో ఆయనకు మంచి సాన్నిహిత్యం వుండేది. ప్రధాని అయిన తరువాత కూడా పీవీని పేరుతొ సంబోధించే చనువు ఉన్న మనిషి శ్రీనివాసరావు గారు. ఆడపిల్లలకు విద్య ఆవశ్యకతను గుర్తించి ఆయన ఖమ్మంలో  బాలికల పాఠశాల ఏర్పాటుకు దోహదపడ్డారు.

దాదాపు  తొంభై ఏళ్ళ వయస్సులో కూడా మా బామగారి అమ్మగారు చెల్లమ్మగారుమా బామ్మగారు పచ్చి మంచి నీళ్ళు సైతం ముట్టకుండా నిష్టగా ఉపవాసాలు చేసేవాళ్ళు.  మా బామ్మ గారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తరదక్షిణ యాత్రలు అన్నీ చేసింది. చెల్లమ్మ గారు మాకు బుద్ధి తెలిసిన తరువాత ఎటూ వెళ్ళేది కాదు. ఎప్పుడూ కంభంపాడులోనే తావళం తిప్పుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూపిల్లలకు భారతభాగవతాల్లోని పద్యాలుకధలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేది. పొద్దుగూకేవేళకు  పిల్లలందరూ  ఆమె మంచం చుట్టూ మూగేవాళ్ళు. ఈ రోజు భండారు వంశంలో చాలామందికి పురాణాల మీద పట్టు చిక్కడానికిసంస్కృతీ సంప్రదాయాలపట్ల అవగాహన కలగడానికి చెల్లమ్మగారి  ప్రవచనాలే కారణం. మా వూళ్ళో అప్పుడు పాతికముప్పయిదాకా బ్రాహ్మణ గడప వుండేది. మూడు పంచాంగాలు మా వూరినుంచి వెలువడేవి.

తోకటపా:

మా  భండారు వంశ వృక్షానికి చెందిన ఒక కొమ్మ తాలూకు కొన్ని  రెమ్మలు, మా రెండో అక్కయ్య కొలిపాక శారద కుటుంబ సభ్యులు అన్నమాట,  ఈరోజు అంటే 2024 డిసెంబరు 14 శనివారం నాడు  హైదరాబాదులోని ఒక పెద్ద హోటల్లో కలిసారు. ఎవరి కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా, మేనమామలుగా నన్నూ, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారిని పిలవడం ఆనవాయితీ.  వెళ్లాం. దాదాపు ఎనభయ్ మంది దాకా  వచ్చారు. గ్రూపు ఫోటో తీసుకోవడానికి వీలు లేకపోయింది. సందర్భం మా పెద్ద మేనత్త రంగనాయకి గారి చిన్న కూతురు శ్రీలక్ష్మి (ఖమ్మం నుంచి మొదటి లేడీ గ్రాడ్యుయేట్) కుమారుడు గోపి షష్టి పూర్తి. గోపి నాన్నగారు సింగరాజు ప్రభు గారు కేంద్ర ప్రభుత్వంలో అనేక విభాగాల్లో ఉన్నతోద్యోగాలు  చేసి రిటైర్ అయి హైదరాబాదులో సెటిల్ అయ్యారు. వారి వయసు కేవలం తొంభయ్ సంవత్సరాలు.

(కింది ఫోటోలో ఫుల్ స్లీవ్స్ తెల్ల షర్ట్ టక్ చేసుకున్న వ్యక్తి. ఎక్కడికైనా సరే స్వయంగా కారు నడుపుకుంటూ వెడతారు. ఇక నా పక్కన ఉన్న శ్రీలక్ష్మి (పాపాయి వదిన) ఎనభయ్ ఏళ్ల వయసులో కూడా వంట చేస్తుంది. మాలాంటి వాళ్ళం పొతే వండి పెడుతుంది. అమ్మతరపు చుట్టాలమని మా అన్నదమ్ముల పట్ల ఆపేక్ష. ఫోటోలో కుడి పక్కన మా అన్నయ్య రామచంద్రరావు గారు. 80, 90, 78, 80 వరుసగా వయసులు అన్నమాట)



ఈ నలుగురిలో నేనే చిన్నవాడిని.    

(ఇంకా వుంది)

13, డిసెంబర్ 2024, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (37) - భండారు శ్రీనివాసరావు

 


ఖమ్మంలో నా విద్యార్థి జీవితం ఒక ఆటవిడుపుగా గడిచింది.

బెజవాడలో మొదలు పెట్టిన బాపూజీ బాల సమాజ్ ని మళ్ళీ మామిళ్ళ గూడెంలో ప్రారంభించాము.  ఏదో ఫంక్షన్ చేయడం కోసం విరాళాలు సేకరించాలనే ప్రయత్నం చేశాము. పెద్దవాళ్లకు తెలియకుండా ఊళ్ళో వాళ్ళని అడగాలని జూపూడి ప్రసాద్ ఇంటికి దగ్గరలో వున్న నాగులవంచ దొరవారి బంగాళాకు వెళ్ళాము. (ఆయన అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి గారి బావమరది)

ఎంత కావాలి అని అడిగారు మా చేతిలో చందా పుస్తకం చూడగానే.  మాలో మేము మొహాలు చూసుకుని, పది అన్నాము. ‘పేరూ గీరూ ఏం రాయనక్కరలేదు, ఇదిగో ఈ యాభయ్ తీసుకు వెళ్ళండి’ అంటూ ఒక నోటు చేతిలో పెట్టారు. అంత డబ్బు ఊహించని మేము, విరాళాల సేకరణ అంతటితో  ఆపేసాము. ఎందుకంటే కావాల్సిన డబ్బు కంటే ఎక్కువ మొత్తం ఒక్క చోటనే మాకు దొరికింది.  

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం మా పెద్దన్నయ్య ఉద్యోగంలో ఓ భాగం. గ్రామాలకు వెళ్లి న్యూస్ రీల్స్ చూపించడానికి ఆయన వ్యానులో ఒక ప్రొజెక్టర్, స్క్రీన్ స్టాండ్, ప్రొజెక్టర్ నడిపే ఉద్యోగి సిద్ధంగా వుండేవారు. ప్రభుత్వ డాక్యుమెంటరీలు మాత్రమే వేస్తె జనానికి ఆసక్తి వుండదని మామూలు బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమాలు కూడా చూపించేవాళ్ళు. ఖమ్మం గాంధీ పార్కులో ‘రసధుని’ పేరుతొ స్థానిక రేడియో నిర్వహించారు. సినిమా పాటల నడుమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కేసెట్ లో రికార్డు చేసి మైకులో సాయంత్రం ఓ గంటసేపు వినిపించేవారు. రేడియోని అనుకరిస్తూ ఖమ్మం రసధుని కేంద్రం, ఇప్పుడు కొన్ని పాటలు వింటారు అని ఆ కేసెట్ ప్లే చేసేవారు. పార్కుకు వచ్చిన జనానికి కొత్తగా అనిపించి ఆసక్తిగా వినేవారు. ఇది కాక మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు ఎడిటరుగా ‘నెలవంక అనే గోడ పత్రిక నడపాలని సింగ్ సారుతో ఒక బోర్డు రాయించారు. బోర్డు అయితే రాయించారు కానీ ఆ పత్రిక వెలుగు చూడలేదు. ఎవరైనా నెలవంక సంగతి ఏమిటి అని అడిగితే, మా పెద్దన్నయ్య నేలవంక చూస్తోందని నవ్వుతూ చెప్పేవారు. రుద్రవరం వెంకటేశ్వర్లు గారిది పొదుపు ఉద్యమ సంస్థలో ఉద్యోగం కాబట్టి పిల్లలను ప్రోత్సహించడానికి  నినాదాలు రాయించేవారు. ‘ఖర్చు చేస్తే దండగ పొదుపు చేస్తే పండగ’ అని మా రెండో అన్నయ్య రాసిన నినాదానికి పదో ఇరవయ్యో విలువ చేసే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ను జిల్లా కలెక్టర్ చేత బహుమతిగా ఇప్పించారు. కాకపోతే దాన్ని డబ్బుల్లోకి మార్చుకోవాలి అంటే అయిదేళ్లు ఆగాలి. కొలిపాక మధుసూదన రావు, హీరాలాల్ మోరియా, ఇట్క్యాల నీలకంఠరావు వంటి చాలామంది  ఖమ్మం కవుల చేత రాయించి, పొదుపు పాటలు అనే పేరుతొ  ఒక పుస్తకంగా వేశారు. వై.ఎన్. ప్రెస్ లో ముద్రించారు. నేను కూడా ఒక గేయం రాశాను.  నా పేరు అచ్చులో చూసుకోవడం అదే మొదటిసారి. ‘పైస పైస కూడబెట్టి పరికింపుమురా! అది ఇంతింతై ఎంతెంతో అయి వింతగొలుపురా!’ ఇలా వుండేవి  రాతలు. ప్రాస వుంటే చాలు అదో అద్భుత కవిత్వం అనుకునే రోజులు.

వెంకటేశ్వర్లు గారు పిల్లలకోసం మా చేత ‘సంచయిక’ అనే ఒక బ్యాంకు మొదలు పెట్టించారు.

(దశాబ్దాల తరువాత ఈ బ్యాంకుని మా పెద్దన్నయ్య కుమారుడు భండారు రాఘవ రావు తాను చదువుకునే రోజుల్లో హైదరాబాదులో కొన్నేళ్ళు నిర్వహించాడు. ఇది ప్రభుత్వ పధకమే.  పిల్లలకోసం పెట్టింది. డిబ్బీలో దాచుకున్న చిల్లర డబ్బులని ఈ బ్యాంకులో దాచుకుంటే అవి మరో ప్రభుత్వ బ్యాంకులో డిపాజిట్ చేసి, సంచయిక బ్యాంకు పేరుతో ఖాతా పుస్తకాలు పిల్లలకు ఇచ్చేవాళ్ళు. అలా దాచుకున్న డబ్బుపై వడ్డీ కూడా చెల్లించే వాళ్ళు. ఈ పధకం ఈనాడు వుందో లేదో తెలియదు. ఇప్పటి ప్రభుత్వాలకి ప్రజలు పొదుపు చేయడం ఇష్టం లేదు, ప్రజలకి అసలే అవసరం లేదు)

 

దసరా ఆడపిల్లల పండగ. కానీ మగపిల్లలకు కూడా ఎంతో ఉత్సాహం. ఆడపిల్లలు అందంగా పేర్చే బతుకమ్మలకు కావాల్సిన తంగేడు పూలు, చెరువుల్లో దొరికే తామర పూలు వగైరా సేకరించడం మా పని. ఒకసారి పండక్కి బెజవాడ నుంచి శాయిబాబు కూడా ఖమ్మం వచ్చాడు. మనోహర్,  పెద్దబాబు, రాజన్న, శాయిబాబు నేనూ అందరం  కలిసి తంగేడు పూలకోసం చాలా దూరం బురాన్ పురం వరకు వెళ్లాం. ఒకచోట తేనెటీగెల గుంపు మా వెంట పడింది. చేతుల మీద మొహం మీద తెగ కుట్టాయి. అందరం లబోదిబో మంటూ ఇళ్లకు చేరాము. మా ఏడుపులు చూసి భయపడి, ఇంటికి పక్కనే వున్న రాముల (డాక్టరు) మామయ్య ఇంటికి తీసుకు వెళ్ళారు. ఊరందరికీ ఆయన డాక్టర్ జమలాపురం రామారావు గారు.  మా అందరికి మాత్రం రాముల మామయ్య. ఆయన లక్ష్మారెడ్డి గారి బంగళాలో అద్దెకు వుండేవాడు. చాలా పరిశుభ్రత పాటించే డాక్టరు.   మనిషి చాలా నిదానం. ఇంట్లో ఉన్నంత సేపు కాళ్ళకు పావు కోళ్ళు ధరించి తిరుగుతుండేవాడు.  చుట్టపక్కాల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయినప్పుడు, డాక్టరు మామయ్య ఇంటికి వెళ్లి, పెళ్లికొడుకుకోసం పావుకోళ్లు తీసుకురమ్మనే వారు. అంచేత ఒకటికి రెండు జతల పావు కోళ్ళు అదనంగా చేయించి పెట్టుకునేవారు.  ఆయన క్లినిక్ లో అనేక సీసాల్లో రంగురంగుల నీళ్ళు వుండేవి. నిజానికి అవి  మిక్సర్  (Combination Drugs)  అనే ఔషధాలు. ప్రభుత్వ దవాఖానాలో కూడా రోగులకు ఇవే  ఇచ్చేవాళ్ళు. పైగా రోగులు ఎవరి సీసాలు వాళ్ళే తెచ్చుకోవాలి.  రంగునీళ్ళ వైద్యం చేస్తారు ఆ దవాఖానాకు పొతే అని వెక్కిరింతగా అనేవాళ్ళు.

తేనెటీగెలు కుట్టిన బాధతో గొల్లుమంటున్న మమ్మల్ని చూసి, డాక్టరు మామయ్య ఏమాత్రం కంగారు పడకుండా, నిదానంగా కాటన్ తో  టింఛరు రాస్తే, ఆ మంటకి, తేనెటీగెలు కుట్టిన బాధ నయం అనిపించింది. తర్వాత మా వంటి మీద ఏదో ఆయింటుమెంటు రాసి ఉపశమనం కలిగించాడు.

ఆ వాడ మొత్తానికి ఆయనే డాక్టరు. డాక్టరు బాబాయ్, డాక్టర్ మామయ్య అని పిలిచేవారు. రాములు మామయ్య కుమార్తె జయశ్రీ కుమారుడు అమెరికాలో డాక్టరు. తాత వారసత్వాన్ని అంది పుచ్చుకున్నాడు. అల్లుడు సత్యనారాయణ శర్మ గారు ఎస్ బి హెచ్ (ఇప్పుడు ఎస్ బి ఐ ) లో మేనేజర్ గా రిటైర్ అయి ఖమ్మం ఎస్ ఎన్ మూర్తి తోటలో సొంత ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు.

రాముల మామయ్య కొడుకు రాధాకృష్ణ  నాకు తర్వాత ఖమ్మం కాలేజీలో క్లాస్ మేట్. అదే నా అకడమిక్ కెరీర్ లో విశేషం. క్లాస్ మేట్స్ సీనియర్లు అయ్యేవాళ్ళు. జూనియర్లు క్లాస్ మేట్స్ అయ్యేవాళ్ళు. క్లాస్ మేట్స్ అయిన జూనియర్లు మరుసటి ఏడాది సీనియర్లు అయ్యేవాళ్ళు.

కారణం, నా చదువుల ప్రయాణం సాగింది ఎం.ఎస్.ఎం. (మార్చి- సెప్టెంబరు- మార్చి) బండిలో.

కింది ఫోటో:


డాక్టర్ మామయ్య అనే డాక్టర్ జమలాపురం రామారావు గారు



(Photo Courtesy: Sreemathi  Jayasree G)

 

(ఇంకా వుంది)

12, డిసెంబర్ 2024, గురువారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (36) - భండారు శ్రీనివాసరావు

 


‘మీ ఆఫీసు నుంచి వీటిని దొంగిలిస్తున్నాను, మీకేమైనా అభ్యంతరమా’ అని అడిగేవాడిని. ‘నిక్షేపంగా తీసుకువెళ్ళండి’ అనేవాళ్ళు, అప్పటివరకు ఉదయం వార్తావ్యాఖ్య చర్చను నిర్వహించిన  టీవీ 5 ఎడిటర్లు విజయ్ నారాయణ, సాంబశివరావుగార్లు. ప్రతి ఆదివారం ఉదయం మా సంభాషణ ఈ విధంగానే వుండేది, దాదాపు దశాబ్ద కాలానికి పైగా.

ఒకానొక రోజుల్లో రోజుకు మూడాటలు, ఆదివారం నాలుగు ఆటలు అన్న చందాన హైదరాబాదులోని అన్ని టీవీ ఛానళ్ళ చర్చలకు ఉదయం, సాయంత్రం అవసరమైతే మధ్యాన్నం, (ఎన్నికల ఫలితాల సమయం అయితే ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు)  వెడుతున్న బంగారుకాలంలో (బంగారు కాలం అని ఎందుకు అంటున్నాను అంటే ఆ రోజుల్లో ఏ ఛానల్ అనే నిమిత్తం లేకుండా విశ్లేషకులుగా వెళ్ళే జర్నలిస్టులు తమకు ఇష్టం వచ్చిన పద్దతిలో అభిప్రాయాలు చెప్పగలిగే వెసులుబాటు ఉన్న కాలం కాబట్టి) ప్రతి ఆదివారం ఉదయం నాకు టీవీ 5 లో ఉభయం. వచ్చిన అతిధులకు రానూ పోనూ వాహన సౌకర్యంతో పాటు, చక్కటి బ్రేక్ ఫాస్ట్  ఏర్పాటు చేసేవారు.

శనివారం ఉదయం పదిన్నరకు ఫోను మోగిందంటే అది ఖచ్చితంగా టీవీ 5  న్యూస్ కో ఆర్డినేటర్ నిస్సార్ నుంచే.

'రేపు ఆదివారం ఉదయం మాకు టైం ఇవ్వాలి'

ప్రతి ఆదివారం మీకే కదా నా వారం, మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు అక్కర్లేదు నిస్సార్ అన్నా వినడు. ఇదే మాట ప్రతిసారీ, ప్రతివారం చెప్పేవాడు. కల్మషం లేని నమ్రత అతడి మాటల్లో నాకు కనబడేది.

ఎన్నో ఏళ్ళుగా ప్రతి శనివారం తప్పనిసరిగా నిస్సార్ నుంచి వచ్చే ఫోను ఇక నుంచి నాకు రాదని, ఫోన్ కాదు ఎప్పుడూ నవ్వుతూ వుండే అతడి మొహాన్ని కూడా  జీవితంలో ఇక చూడలేమని, ఓ రోజు పొద్దున్న మహా టీవీకి వెడుతుంటే టీవీ 5 విజయ్ నారాయణ్ ఫోను చేసి చెప్పారు. నిస్సార్ కి  అంతకు ముందు రాత్రి మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి కన్ను మూసాడని,  సొంతూరు కర్నూలు జిల్లా కొడుమూరుకు తీసికెళ్ళారని విజయ్ సమాచారం.

మూడు పదులు దాటిన నిస్సార్ కి అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి. ఎంత కష్టమో అతడి కుటుంబానికి.

స్టుడియోలో చర్చ ముగించుకుని అతిధుల విశ్రాంతి గదికి వచ్చేలోగా నిస్సార్ ఉపాహారం ఏర్పాట్లు అన్నీ చేసి వుంచేవాడు.  

తినడానికి కాకపోయినా వినడానికి ఆ సమయం నాకు బాగా ఉపయోగపడేది. ఎందుకంటే అంతకు ముందు  కెమెరా ఎదుట పొట్టు పొట్టయిన ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్నీ మరచిపోయి, అరమరికలు లేకుండా ఆఫ్ ది రికార్డు సంగతులు చాలా చెప్పేవాళ్ళు. అవి చాలా ఆసక్తికరంగా వుండేవి. అలాంటివి దాదాపు వంద ఎపిసోడ్లు  ‘వెలుగు చూడని వార్తలు’  పేరుతొ నా కంప్యూటర్ లో నిక్షిప్తం చేసి వుంచాను. వాటిని బయట పెట్టడం అంటే వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినట్టే అవుతుందని వాటిని అలాగే వుంచేశాను.

సరే ! ఇంతకీ నేను దొంగిలించి ఇంటికి తెచ్చేవి ఏమిటి అంటే, ప్రతి తెలుగు పత్రిక ప్రతి ఆదివారం నాడు, తల్లి పత్రికతో వచ్చే పిల్ల పత్రికలని.  మా ఇంటికి మూడు పత్రికలు వస్తాయి. మరో మూడు తెలుగు పత్రికల పిల్ల పత్రికలను నేను టీవీ 5  నుంచి ఇంటికి పట్టుకుని వెళ్ళే వాడిని. ప్రతి ఆదివారం నాడు అక్కడికి వెడతాను కనుక ఆ వీలు చిక్కేది. ఇక ఆదివారం మధ్యాన్నం వరకు ఆ పత్రికల్లో వచ్చే గళ్ళ నుడికట్టు లను పూరిస్తూ కాలక్షేపం చేయడం. తద్వారా మెదడుకు మేత, మతిమరపుకు చికిత్స సాధ్యం అవుతుందేమో అనేది నా ఆలోచన. లోగడ ఈ పని మా ఆవిడ చేస్తుండేది. నేను టీవీ చర్చల నుంచి వచ్చేలోగా మొత్తం వాటిని పూర్తిచేసేది.  రచన సాయి గారు తన పత్రికలో ప్రతి నెలా ప్రచురించే  గళ్ళ నుడి కట్టు ఈ  విషయంలో నెంబరు వన్. దానికోసం కొన్నేళ్ళు నేను సికిందరాబాదు రైల్వే స్టేషన్ కు వెళ్లి,  హిగ్గిం బాదమ్స్ పుస్తకాల షాపులో రచన మేగజైన్  కొనేవాడిని.  నా ఈ ఆసక్తి విషయం నా రేడియో సహోద్యోగి డి వెంకట్రామయ్య గారి ద్వారా తెలుసుకున్న సాయి గారు రచన మాస పత్రికను చందా కట్టకుండానే నెలనెలా నాకు పోస్టులో పంపించడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ హిగ్గిం బాదమ్స్ వున్నట్టు లేదు. రచన పత్రిక కూడా అచ్చులో రావడం మానేసింది. ఆన్ లైన్ లో వస్తోందని ఎవరో అన్నారు కానీ,  గళ్ళ నుడికట్టు పూరించాలి అంటే కుదరని పని.  దాంతో అలాంటి మరో పత్రిక కోసం నా అన్వేషణ మొదలయింది. దర్శనం అనే మాస పత్రికలో వెలువడే పద సంపద నుడికట్టు నన్ను ఆకర్షించింది. ఎడిటర్ పబ్లిషర్ దర్శనం శర్మ నాకు దగ్గరివాడే. నేను రేడియోలో,   తర్వాత దూరదర్సన్ లో ఎడిటర్ గా పనిచేసినప్పుడు, మరుమాముల వెంకట రమణ  శర్మ మాకు  రంగారెడ్డి జిల్లా పార్ట్ టైం  రిపోర్టర్ . చాలా సిన్సియర్ గా రిపోర్టులు పంపేవాడు. ఒకసారి ఫోన్ చేసి చెబితే, ఎన్ని పనుల ఒత్తిడి వున్నా ఆ సాయంత్రం అతడు పంపే వార్త ప్రసారం చేసేవాళ్ళం.  రిటైర్ అయిన తర్వాత, అతడు పంపే దర్శనం పత్రికలో ప్రచురించే క్రాస్ వర్డ్ పజిల్ తో   ప్రతి నెలా నాకు, మా ఆవిడకు కొంత అదనపు కాలక్షేపం. అంటే అందులో వచ్చే ఆధ్యాత్మిక వ్యాసాలతో కాదు, కేవలం ఆ గళ్ళ నుడికట్టుతో మాత్రమే. ఇంత జీవితం గడిచిన తర్వాత మనకు తెలియని ఆముష్మిక విషయాలు ఏముంటాయి కనక. నేనే ఎన్నో ఆధ్యాత్మిక వ్యాసాలు రాసాను ఫేస్ బుక్ లో. దర్శనం పత్రికకి కూడా.  ఒక  మాస పత్రికను ఇరవై ఏళ్ల పాటు నడపడం అనేది కష్ట సాధ్యమైన వ్యవహారమే. ఈ పనినే కాకుండా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భారీ ఎత్తున దర్శనం శర్మ ఒంటి చేత్తో నిర్వహించిన తీరు చూస్తే ఎవరైనా సరే శహభాష్ అనాల్సిందే. జ్వాలాతో కలిసి రెండు మూడు సందర్భాలలో ఆ కార్యక్రమాలను ప్రత్యక్షంగా  చూసినప్పుడు  నాకు చాలా ఆశ్చర్యం వేసేది. ఇన్నిన్ని కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నాడు అని అనిపించేది.  ఇందుకు శర్మని మెచ్చుకుని తీరాలి. వెనకాల ఏ బలం లేని శర్మకు,  వీటిని ఇంత పకడ్బందీగా నిర్వహించే బలం ఎలా సమకూరింది? ఆ దైవ బలం లేకుండా  ఇది అసాధ్యం. అది అతడికి పుష్కలంగా వుంది.

దురదృష్టం ఏమిటంటే, అనేక సంవత్సరాల పాటు, ఒకరకంగా చెప్పాలి అంటే, ఆ పత్రిక స్థాపించిన దగ్గర నుంచి మా ఇంటికి క్రమం తప్పకుండా వచ్చిన పత్రిక,  వున్నట్టుండి  రావడం ఆగిపోయింది. చిరునామా సమస్య అనుకుంటే నేను ఇల్లు మారింది కూడా లేదు. ఎక్కడ కనపడ్డా దర్శనం శర్మని అడిగే ప్రశ్న ఒక్కటే, దర్శనం పత్రిక దర్శనం ఎప్పుడని. ‘వెంటనే’ అనే  జవాబు ఠంచనుగా వచ్చేది ఆయన నోట. ఒకటి రెండు సార్లు జ్వాలా ఇంట్లో కలిసినప్ప్దుడు కూడా గుర్తు చేశాను. చందా ఎంతో చెప్పండి, జీ పే చేస్తాను అని మెసేజ్ లు కూడా పెట్టాను. బదులుగా పత్రిక నెట్ లింక్ పంపేవాడు. ఈ వయసులో ఆన్ లైన్ లో చదివే దృష్టి పాటవం నాకు లేదు అని జవాబు ఇచ్చేవాడిని. కానీ దానికి జవాబు లేదు.

దశాబ్దాల క్రితం శర్మ నాకు పరిచయం అయినప్పుడు నాకు వంద పనులు. ఆయనకు ఒక్కటే పని. దర్శనం ప్రత్యేక సంచిక విడుదలకు ముఖ్యమంత్రి సమయం తీసుకునేటప్పుడు మాత్రం ఆయనకు నన్ను కలవడానికి సమయం చిక్కేది.  ఇప్పుడు ఆయనకు వెయ్యి పనులు. నాకు ఒక్క పని కూడా లేదు. ఈ నిజాలు సరైన సమయంలో గుర్తు పెట్టుకోకపోకోవడం కూడా నేనో పెద్ద జీరో కావడానికి కారణం.

ఇలా ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఆ పత్రిక జాడలేదు. పైగా వాళ్ళు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల ఆహ్వాన పత్రికలు మాత్రం   పోస్టులో వచ్చేవి. అంటే చిరునామా సమస్య కాదు.  దాంతో ఇక విసుగుపుట్టి అడగడం మానేశాను.

ఈ పిడకల వేట దేనికంటారా!

గళ్ళనుడికట్టు వైద్యం కంటే కూడా, ఇప్పుడు మొదలు పెట్టిన ఈ  ‘అయాం ఎ బిగ్ జీరో’ రచనా వ్యాసంగం కొంత నాకు ఉపయోగపడుతోంది. ముందుగానే చెప్పినట్టు చిన్నప్పటి విషయాలు చెప్పడానికి ఇప్పుడు, అప్పటి  పెద్దవాళ్లు  ఎవరూ లేరు. గుర్తు చేసే మా ఆవిడా లేదు. ప్రతి చిన్న విషయం నాకు నేనుగా గుర్తు చేసుకోవాలి. కాళ్ళకు చేతులకు కసరత్తులు వున్నట్టే, నేనిప్పుడు ప్రతి రోజూ కొన్ని గంటల పాటు నా మెదడుతో కసరత్తు చేస్తున్నాను. బుర్ర పొరల్లో నిక్షిప్తం అయిన సంగతులను వెలికి తీయడానికి మెదడును చిలుకుతున్నాను. ఫోటోల కోసం అన్వేషణలో,  సాంకేతిక ప్రజ్ఞా పాటవం లేక పోయినా, నాకు తెలిసిన పద్దతిలో నేను గంటలు గంటలు వెచ్చిస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది తప్ప మరో పని లేనట్టు అస్తమానం ఈ రచన కోసమే మొత్తం సమయం వెచ్చిస్తున్నాను. అవసరమా అంటే నాకు అవసరమే అనిపిస్తోంది. ఎందుకంటే  నిజంగా ఈ మతిమరపు ముదిరి నయం కాని పెద్ద వ్యాధికి దారితీస్తే బాధ పడేది నేనే కదా! పిల్లల్ని  బాధ పెట్టేది కూడా నేనే అవుతాను.

అన్ని విషయాలు ఓ పక్క రాస్తూనే మధ్యమధ్యలో ఈ మతిమరపు గోల ఏమిటంటారా ! నాకు ఇద్దరు పిల్లలు, సందీప్ సంతోష్. సందీప్ ఫోన్ చేస్తే ఏరా సంతోష్ ఏమిటి సంగతులు అంటాను. సంతోష్ ఫోన్ చేస్తే సందీప్ చెప్పు ఏమిటి విశేషం అనేవాడిని. పిల్లల పేర్లు కూడా తండ్రికి గుర్తు వుండకపొతే దానిని మతిమరపు అనక ఏమంటారు చెప్పండి? ఇక వాళ్ళ పుట్టిన రోజులు, పెళ్లి రోజుల సంగతి చెప్పక్కర లేదు.

అందుకే ఇది కాలక్షేపం కాదు, నాకు నేనుగా నా మనసుతో చేస్తున్న, చేయిస్తున్న  కసరత్తు. ఈ 78 ఏళ్ల వయసులో ఇది నా అవసరం. అంతే! ఏదో పేరు కోసం కాదు, ప్రఖ్యాతి కోసం కాదు. ఈ వయసులో అవసరం లేనివి ఆ రెండే!

 

కింది ఫోటో:

పూర్తి అయిన జీవిత పదబంధం.

 ఆదివారం వచ్చిందంటే మా ఆవిడ నిర్మలకి నాలుగాటలు సినిమా చూసిన సంబరం. పదబంధాలుగళ్ళనుడికట్లు వాటితోనే పొద్దంతా గడిచిపోతుందిఆదివారంనాడు  డైలీ సీరియళ్ళు టీవీల్లో రావనే బెంగ లేకుండా.

2019 జులై  29 తీసిన ఫోటో ఇది. పక్కన మరో కుర్చీలో కూర్చుని కంప్యూటర్ పై పనిచేసుకుంటున్న నేను ఎందుకో లేచివచ్చి ఈ ఫోటో తీశాను.

అదే ఆమె ఆఖరి ఫోటో అవుతుందని ఆ ఉదయం ఆమెకూ తెలియదునాకూ తెలియదు.

ఆ కుర్చీ ఆ టేబుల్ అలాగే వున్నాయిఆమె లేదు.

మూడు వారాల్లో మనుషుల్ని మాయం చేసే శక్తి ఆ పరమాత్ముడికే వుంది.









(ఇంకా వుంది)