9, డిసెంబర్ 2024, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (33) - భండారు శ్రీనివాసరావు

 


ఖమ్మం

అప్పటికి నేను చూసిన రైల్వే స్టేషన్లలో బెజవాడ చాలా పెద్దది. తరువాత ఖమ్మం. ఆ రోజుల్లో ఒకటే ప్లాట్ ఫారం.  దానికి రెండు చివర్లో , మధ్యలో రెండు చోట్లా సిమెంటుతో పోతపోసిన బోర్డులపై పసుపు రంగు మీద ఖమ్మా మెట్ అని నల్లటి అక్షరాలతో స్టేషన్ పేరు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు  మూడు భాషల్లో రాసివుండేది. తరువాత చాలాకాలానికి ఖమ్మం అని మార్చారు. ఊళ్ళో షాపులమీద కూడా ఖమ్మంమెట్టు అనే పేరే వుండేది. కాలక్రమంలో ఖమ్మం అయింది. ప్లాట్ ఫారం ఒకవైపు నుంచి రైలుకట్ట మీద నడుచుకుంటూ పొతే, రైల్వే గేటు, దాన్ని దాటి ముందుకు పొతే, కట్ట కింద కాలిబాట, మామిడి తోపు, దాన్ని దాటుకుని లోపలకు వెడితే మా ఇద్దరు బావగార్ల ఇళ్ళ నడుమ మట్టి రోడ్డు. దాన్ని మామిళ్ళ గూడెం అనే వాళ్ళు. బహుశా మామిడి తోపు కారణంగా ఆ పేరు వచ్చిందేమో.

అదే స్టేషన్ లోకి వెళ్లి బయటకు వస్తే రోడ్డు మార్గం. రిక్షాల మీద ఇళ్లకు వెళ్ళే వాళ్ళు ఆ దోవగుండా కంకర రాళ్లు తేలిన మార్గంలో మామిళ్ళ గూడెం వచ్చేవాళ్ళు. వల్లభి గ్రామ కాపురస్తులు అయిన   మా పెద్ద బావగారు రామారావు గారు, పిల్లల చదువులకోసం ఖమ్మంలో స్థలం కొని ఇల్లు కట్టారు. గృహ ప్రవేశం చూడడం నాకు అదే మొదటిసారి. పెంకుటిల్లు, గిలాబు చేయని డాబాలు తప్ప వేరే ఇంటి నిర్మాణాలు ఎరుగని చిన్నతనం. పెద్ద బావగారు కొన్న స్థలంలో  ముందూ వెనుకా జాగా వదిలి మేడ కట్టుకున్నారు. ముందు ఒక గది, దాన్ని ఆనుకుని వరండా, పక్కన మరో గది, లోపల విశాలమైన హాలు, రెండు పక్కలా రెండు గదులు, వంటహాలు, వెనుక మరో వంట ఇల్లు, ఆనుకుని బావి, పెరడు, లెట్రిన్ వగైరా, ఇంటి ముందు నుంచి పైకి మెట్లు, చుట్టూ ప్రహరీ. హంగామాగానే వుండేది. తలుపులకు రంగులు, కిటికీలకు అదో రకమైన రంగుల అద్దాలు. గమ్మత్తుగా వుండేది. ఇంటి ముందు జేగురు రంగులో వున్న సిమెంటు బెంచి. అప్పటికి కరెంటు సౌకర్యం వచ్చింది. పై కప్పు నుంచి వేలాడదీసిన కరెంటు వైరుకు డోములో అమర్చిన బల్బ్. ఇంటి మొత్తం మీద ఒక సీలింగు ఫ్యాను. అవసరమైన చోట పెట్టుకోవడానికి ఒక టేబుల్ ఫ్యాన్.   మెయిన్ గేటుకు రెండు పెద్ద తలుపులు. . దీన్ని పాటక్ అనేవారని గుర్తు. ప్రతిసారీ వాటిని తెరిచే తీసే అవసరం లేకుండా మనుషులు లోపలకు రావడానికి, వెళ్ళడానికి ఒక చిన్న తలుపుతో ఏర్పాటు. ప్రతి ఇంటికి ఈ ఏర్పాటు వుండేది.

ఆ ఇంటికి అనుకునే మా రెండో బావగారు కొలిపాక రామచంద్రరావుగారి ఇల్లు. వాళ్ళదీ ఇలాంటి మేడే. కాకపోతే ఇంటి ముందు జాగా తక్కువ. వెనుక వైపు పెరడు చాలా  పెద్దది. ఆ ఇంటి పక్కనే ఆయన తమ్ముడు ఆనందరావు బావ ఇల్లు. కొద్ది కాలం తరువాత , బ్రాహ్మణ బజారులో అద్దె ఇంట్లో ఉంటున్న మా  నాలుగో బావగారు, లాయరు కౌటూరి కృష్ణమూర్తిగారు, రామారావు బావ ఇంటి పక్కనే పెద్ద జాగా కొనుక్కుని విశాలమైన ఇల్లు కట్టుకున్నాడు. ఆయన పక్కన కొండపల్లి వాళ్ళ ఇల్లు. సినిమా దర్శకుడు దశరథ్ నాన్న కొండపల్లి రఘురాం రిక్కా బజార్ స్కూల్లో నా క్లాస్ మేట్. రాముడి కొడుకు దశరధుడు అని సరదాగా అంటుండేవారు.

మా బావగార్ల ఇళ్లకు వెళ్ళే దారిలో అప్పటికి సరైన రోడ్డు లేదు. మధ్యలో చిన్న చిన్న రాతి గుట్టలు. రోడ్డుపక్కన దీప స్తంభాలు. ప్రతి రోజూ సాయంత్రం వేళల్లో మునిసిపల్ సిబ్బంది వచ్చి కిరోసిన్ దీపాలు వెలిగించేవాళ్లు. కొంతకాలానికి కరెంటు దీపాలు, రాతి గుట్టలని తొలగించి రోడ్డు వేశారు. కరెంటు రావడంతో  వీధి దీపాలు వచ్చాయి. ఒక ఫేజు సరఫరా కారణంగా గుడ్డిగా వెలిగేవి. ఇళ్ళల్లో బల్బుల పరిస్థితి కూడా అంతే. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి.

మా బావగార్ల ఇళ్ళు దాటగానే ఒక మోరీ, ఒకటి రెండు ఇళ్ళు ఉండేవి. తర్వాత ఊరే లేదు. కాలిబాటల్లో నడుచుకుంటూ వెడితే  బురాన్ పురం విసిరేసినట్టు వుండేది. మధ్యల్లో అక్కడక్కడా ఒకటి రెండు ఇళ్లు కనిపించేవి. రావులపాటి సత్యనారాయణ రావు గారు (మాజీ ఐజీ, రచయిత రావులపాటి సీతారామారావు గారి తండ్రి) రావులపాటి జానకి రామారావుగారు (పీయూసీలో నా క్లాస్ మేట్ డాక్టర్ రావులపాటి గోపాలకృష్ణ తండ్రి) అక్కడ వుండేవారు. వారివి కూడా చాలా విశాలమైన గృహాలే.

మా అన్నయ్య పర్వతాల రావు గారు ఒక బజారు ఇవతల మామిళ్ళగూడెంలోనే కేశవరావు గారి ఇంటిలో ఒక పోర్షన్ లో అద్దెకు వుండేవాడు. పక్కన మరో పోర్షన్ లో నా క్లాస్ మేట్ జమలాపురం రామచంద్రరావు తండ్రి వెంకటేశ్వర రావు గారు కాపురం వుండేవారు. ఆయన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ . చాలా హుందాగా, చూడగానే చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపించేలా వుండేవారు. ఇక రామచంద్రం చేతి వ్రాత ముత్య్ల్లాల కోవ. మళ్ళీ అంత చక్కటి చేతిరాతను నేను చూడాలేదు.  

మా అన్నయ్యది మూడుగదులు వరుసగా వుండే వాటా. మూడు గదులు పేరే కాని మొదటి గది ఇనుప తీగెల జాలీ ఉన్న గది. మధ్యది పడక గది. చివరిది వంటిల్లు. ముందు పక్కనా పెద్ద ఖాళీ జాగా. డీపీఆర్వో గా మా అన్నయ్యకు ప్రభుత్వ వాహనం, ఒక పెద్ద వ్యాను వుండేది. దాన్ని ఆ జాగాలో పార్క్ చేసేవారు. ఆ వ్యానులో ప్రొజెక్టరు, డాక్యుమెంటరీ రీలు డబ్బాలు, తెర ఉండేవి. నెలకోసారి ఒక్కో వూరికి వెళ్లి  సినిమాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు తెలిపే డాక్యుమెంటరీలు వేసేవాళ్ళు. మా అన్నయ్య వెంట రుద్రవరం వెంకటేశ్వర్లు గారని ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హమేషా వుండేవారు. ఆ రోజుల్లో ప్రజల్లో పొదుపు అలవాటుని ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాలో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజర్ అని ఒక అధికారి వుండేవారు. రుద్రవరం గారిది ఆ ఉద్యోగం. స్వయంగా కవి, రచయిత అయిన వెంకటేశ్వర్లు గారు మా అన్నయ్యకు చక్కని స్నేహం కుదిరింది. వారిద్దరూ కలిసి అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు చక్కని ప్రచార పత్రాలను తయారు చేసేవారు. వీరికి సింగ్ మాస్టారు అనే ఆర్టిస్ట్ జత కలిసారు. సింగ్ శారు మా ఇంటికి అయిదు ఇళ్ళ అవతల వుండేవారు. అన్నయ్య సూచనల మేరకు  వెంకటేశ్వర్లు గారు   రాయడం, సింగ్ సారు బొమ్మలు గీయడం. అంతా మాకు తమాషాగా, సరదాగా వుండేది. బెజవాడలో మా బావగారు మా చదువు పట్ల శ్రద్ధతో మాటూ కఠినంగా వుండేవారు. మా అన్నయ్యది ఉదారతత్వం. ఒకరు చెప్పకుండా ఆయన జీవితంలో పైకి వచ్చారు. అలానే నేను కూడా మా అంతట మేమే మా బాగోగులు చూసుకోవాలని భావించేవారు. జీవితంలో చదువుతో పాటు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయనేది మా అన్నయ్య అభిప్రాయం. ఈ వ్యవహార శైలిని నేను వేరే విధంగా అర్ధం చేసుకున్నాను. స్వేచ్ఛకు నా సొంత నిర్వచనం చెప్పుకుని గాడి తప్పాను. నేను ఖమ్మం రాగానే మా అన్నయ్య నా చేతికి పది రూపాయలు ఇచ్చి, స్టేషన్ బజారుకు వెళ్లి  చెప్పులు కొనుక్కోమని చెప్పాడు. అంతవరకూ కాళ్ళకు చెప్పులు ఉండేవి కాదు. సంతోషంగా ఎగురుకుంటూ వెళ్లి ఒక జత హవాయి చెప్పులు కొన్నాను. వాటి మీద నాకెంత మోజంటే, బెజవాడ అలంకార్ టాకీసు సెంటర్లో రెండు చెప్పుల షాపులు, బాటా, కరోనా వుండేవి. అద్దాల బీరువాలో అనేక హవాయి చెప్పులు కనబడుతుండేవి. మేము పిల్లలం అటు వెళ్ళినప్పుడల్లా ఆ షాపుల ముందు నిలుచుని అద్దాల అలమరాల్లోని చెప్పులని అదేపనిగా చూస్తుండే వాళ్ళం. ఆ రోజుల్లో కొత్తగా బాటా కంపెనీ వాళ్ళు బాటా శాండక్ (?) అనే  పేరుతొ హవాయి మోడల్ చెప్పులు మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఈ రోజుల్లో కొత్త మోడల్ ఐ ఫోన్ కి వున్న గిరాకీ అప్పుడు  ఆ బాటా చెప్పులకి వుండేది. విరగబడి కొనుక్కునేవారు.

మొదటిసారి జీవితంలో నా  చెప్పుల సరదా మా అన్నయ్య  పుణ్యమా అని ఆ రోజు  తీరింది. చెప్పులకు రెక్కలు వచ్చినట్టు గాలిలో తేలుతూ ఇంటికి చేరాను.

కింది ఫోటో :

ఖమ్మం రైల్వే స్టేషన్ (Courtesy Google)



(ఇంకా వుంది)

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (32) - భండారు శ్రీనివాసరావు

 


 

దాశరధి గారిని మొదటిసారి చూసినప్పుడు నాకు ఆయనే దాశరధి అని తెలవదు.

పట్నం కాబట్టి, మా బావగారు పెద్ద వకీలు కాబట్టి అనేక పనుల మీద అనేకమంది బెజవాడ  వచ్చి పోతుండేవాళ్ళు. హోటళ్ళలో విడిది చేసే అలవాట్లు అప్పటికి రాలేదు. తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లోనే మకాము, భోజనం కూడా. ఆ విధంగా, గవర్నర్ పేటలోని మా బావగారిల్లు ఒక సత్రం మాదిరిగా వుండేది.

ఒక రోజు పొద్దున్నే లేచి పక్కబట్టలు మడత పెడుతుంటే, వరండాలో గోడపక్కన పొడుగుబల్ల మీద పడుకుని ఒక పొట్టి మనిషి నిద్రపోతూ కనిపించాడు.  రాత్రి ఏదో రైలుకు వచ్చి పడుకున్నట్టున్నారు. తరువాత మా అక్కయ్య చెబితే తెలిసింది ఆయన దాశరధి అని. అప్పటికే మద్రాసులో సినిమాలకు పాటలు రాస్తున్నారట.

దాశరధి గారు పనులు చక్కబెట్టుకుని వెడుతూ వెడుతూ తను రాసిన కొన్ని పుస్తకాలు మా బావగారికి ఇచ్చి వెళ్ళారు. అప్పుడే ఆయన రచయిత అని కూడా తెలిసింది.  ఆ తరువాత ఎన్నో ఏళ్ల తరవాత నేను రేడియోలో చేరిన తర్వాత ఒక సందర్భంలో హైదర్ గూడాలో దాశరధి గారు నివాసం ఉంటున్న అపార్ట్ మెంటుకు వెళ్లాను. సినీ ప్రముఖుడు ఒకరు మరణిస్తే సంతాప సందేశం రికార్డు చేయడానికి వెళ్ళిన గుర్తు. ఆయన ఎంత సాదాసీదాగా వుంటారో, ఆయన ఇల్లు కూడా అంతే సాదాసీదాగా వుంది. ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా నేను వెళ్ళిన పని పూర్తి చేయించి పంపడం ఆయన సంస్కారం.

అలాగే సినీ నటుడు రామన్న పంతులు గారితో అలాగే పరిచయం. ఒకప్పుడు ఆయనగారు కూడా బెజవాడలో ప్లీడరే. తరువాత మద్రాసు వెళ్లి చాలా సినిమాల్లో నటించారు. వాటిల్లో ఎన్టీఆర్ గిరీశం గా నటించిన కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లుగా వేషం వేశారు. బాపూ తీసిన బంగారు పిచిక సినిమాలో రామన్న పంతులు గారు, భార్యా విధేయుడిగా  ప్రధాన పాత్ర పోషించారు. రామన్న పంతులు గారి మనుమడే జంధ్యాల దర్శకుడిగా తీసిన మొదటి చిత్రంలో హీరో. చిత్రమైన విషయం ఏమిటంటే రామన్న పంతులు గారి మనుమడు ప్రదీప్ కూడా భార్యా విధేయుడిగా ఇటీవల ఒక సినిమాలో ‘అంతేగా అంతేగా’  అంటూ ప్రేక్షకులని అలరించారు. జంధ్యాల మద్రాసు వెళ్లి స్క్రిప్ట్ రైటర్ గా మొట్టమొదట సినిమా కెరీర్ మొదలు పెట్టిన రోజుల్లో నేనొకసారి మద్రాసులో ప్రదీప్ గారిని చూశాను. అప్పటికి ఆయన సినిమాల్లో వేయడం మొదలు కాలేదు. తిరిగి వారిని కూడా హైదరాబాదు ఆలిండియా రేడియోలో చేరిన తరవాతనే ఒకటిరెండు సార్లు కలుసుకున్నాను. ప్రదీప్ భార్య  శ్రీమతి సరస్వతి గారు కూడా దూరదర్శన్ లో యాంకర్/ అనౌన్సర్ గా తాత్కాలికంగా కొన్నేళ్ళు పనిచేసి పేరు తెచ్చుకున్నారు.

తన తాతగారు రామన్న పంతులు గారి గురించి నటుడు ప్రదీప్ ఇలా చెప్పారు.

 

వీళ్ళమ్మా శిఖతరగ, ప్రతి గాడిద కొడుకు తిండిపోతుల్లా నా యింట జేరి నన్ననేవాళ్ళే”. “తాంబూలం యిచ్చేసాను. యిహ తన్నుకు చావండి” లాంటి సంభాషణ తెలుగు వారు మరచిపోలేరు. గురజాడ గారు కన్యాశుల్కంలో ఆ మాట చెప్పిస్తారు. కన్యాశుల్కం నాటకం గానీ, సినిమా గానీ చూసిన వారికి ఆ మాట గుర్తుండిపోతుంది. అందుకు గల కారణం ఆ పాత్ర యొక్క అద్భుతమైన అభినయం. ఆ స్వరం, ఆ రౌద్రం ప్రత్యేకం. ఆ నటుడి పేరు విన్నకోట రామన్న పంతులు. నటులు శాశ్వతం కాదు. నటన అజరామరం.

రంగస్థలం, సినిమా రంగం, ఆకాశవాణి నటులు,  ప్రయోక్త, రూపశిల్పి, మార్గదర్శి, బహుముఖ ప్రజ్ఞాశాలి విన్నకోట రామన్న పంతులు గారు. తన 62 ఏళ్ళ జీవితంలో 40 సంవత్సరాలు నాటకరంగానికి, కళాకారులని తీర్చి దిద్దడానికి, మేకప్ వేయడానికి, నాటకంలో కర్టెన్లు కట్టడానికి వెచ్చించారు. తన ఇంటినే రిహార్సల్ గదిలా మార్చేశారు. విన్నకోట గారు  దర్శకత్వం వహించిన నాటకాలలో నటించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటులు ఎందరో ఉన్నారు. రామచంద్ర కాశ్యప, ఏ.ఆర్.కృష్ణ, నిర్మలమ్మ, మురళీ మోహన్, అన్నపూర్ణ, వీరభద్ర రావు, సుబ్బరాయ శర్మ, జంధ్యాల వంటి వారు ఈ జాబితాలోకే వస్తారు”

రామన్న పంతులు గారి కుమారుడు విన్నకోట విజయ్ రాం కూడా నటుడే. జంధ్యాల దర్సకత్వంలో కొన్ని సినిమాలలో హాస్య పాత్రలు పోషించారు. దురదృష్టం తన ప్రతిభను పూర్తిగా నిరూపించుకోవడానికి అవకాశం లేకుండా చిన్నవయసులోనే చనిపోయాడు.  

   

మా బావగారింటికి ఆదివారం నాడు కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడానికి చాలా మంది లాయర్ స్నేహితులు వస్తుండేవాళ్ళు. కీసర నరసింహారావుగారు, (వీరి పిల్లలు, ఒకడు  వేదాద్రి  తదనంతర కాలంలో పెనుగంచి ప్రోలులో స్థిరపడి అక్కడ అయ్యప్ప స్వామి పెద్దస్వామిగా ఒక వెలుగు వెలిగి అక్కడే కన్నుమూశాడు. మరో కుమారుడు మూర్తి సెంట్రల్ ఇంటలిజెన్స్ బ్యూరోలో అధికారిగా పదవీ విరమణ చేశాడు) మోగులూరు వెంకటేశ్వర రావు గారు,  కొన్నాళ్ళు మద్రాసులో వుండి, కొన్ని సినిమాల్లో వేసి తిరిగి బెజవాడ వచ్చిన రామన్న పంతులు గారు, రామచంద్ర కాశ్యప గారు, అడ్డంకి శ్రీరామ మూర్తి గారు, చింతలపాటి శివరామ కృష్ణ గారు,   బంగారప్పన్ను లాయరు గారు, మా క్లాస్ మేట్ దశరధరాం తండ్రి లక్కావజ్జల నారాయణ మూర్తిగారు ఇలా చాలామంది వచ్చేవాళ్ళు. మధ్య హాల్లో కుర్చీలు, బల్ల ఒక పక్కకు జరిపి, వాళ్ళు వచ్చే సమయానికి కింద జంపఖానా పరచి సిద్ధం చేసేవాళ్ళం. మా అక్కయ్య అడపాదడపా చిన్న స్టెయిన్ లెస్ స్టీల్ గ్లాసుల్లో టీలు పంపేది. మేము అందిస్తుండేవాళ్ళం.  వాళ్ళలో కొందరికి సిగరెట్లు అవసరం అయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి జైహింద్ టాకీసు కార్నర్లో ఉన్న రెడ్డి కిళ్ళీ షాపులో కొని తెచ్చి ఇచ్చేవాళ్ళం. కొందరు బర్కిలీ, కొందరు పాసింగ్ షో, కొందరు చార్మినార్. మాకు పాసింగ్ షో సిగరెట్టు పెట్టె నచ్చేది. దానిమీద ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్న మనిషి బొమ్మవుండేది. రెడ్ విల్స్ అప్పుడు వున్నట్టు లేదు. మార్కోపోలో వుండేది కానీ, అది తాగేవాళ్లు తక్కువ. చాలా ఖరీదు. అది తాగేవాళ్ళ పక్కన నిలుచుంటే కమ్మటి వాసన వచ్చేది, జర్దా కిళ్ళీ లాగా.

పెద్ద వాళ్ళ ఆటలు అయిపోగానే ఖాళీ అయిన సిగరెట్ పెట్టెల కోసం పోటీపడే వాళ్ళం. వాటితో బచ్చాలు ఆడుకోవచ్చని.

ఇలా రోజులు గడుస్తున్న రోజుల్లో మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారికి  ఖమ్మంలో జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఉద్యోగం వచ్చింది. అప్పటికే నా భారం మోస్తున్న బావగారి భారాన్ని తగ్గించడానికి నన్ను ఖమ్మం స్కూల్లో చేర్చడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా సీవీఆర్ హైస్కూలు నుంచి టీసీ సర్టిఫికేట్. ఖమ్మం రిక్కా బజార్ గవర్నమెంట్  స్కూల్లో తొమ్మిదో తరగతిలో అడ్మిషన్.

ఆంధ్రా ప్రాంతంలో ఎస్.ఎస్.ఎల్.సి. తెలంగాణాలో హెచ్ ఎస్ సీ.  ఆంద్రాలో ఇంటర్ మీడియెట్, తెలంగాణా ప్రాంతంలో పీయూసీ (ప్రీ యూనివర్సిటీ)

ఈ గోలలు ఏవీ అర్ధం కాని నేను హాయిగా ఖమ్మం వచ్చేశాను.

నా చదువు మరో రూపం సంతరించుకుంటుందని నాకప్పుడు తెలియదు.   

 

కింది ఫోటోలు:


(ఒకనాటి  ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ గవర్నర్  కుముద్ బెన్ జోషీతో దాశరధి కృష్ణమాచార్య, మా బావగార్లు అయితరాజు రామారావు, కొలిపాక రామచంద్ర రావు 



కన్యాశుల్కం లో అగ్నిహోత్రావధానిగా విన్నకోట రామన్న పంతులు గారు 



ముద్దమందారం హీరో ప్రదీప్ 



 




 

(ఇంకా వుంది)          

8, డిసెంబర్ 2024, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (31) - భండారు శ్రీనివాసరావు

 


బెజవాడ సీవీఆర్ హైస్కూల్లో నా సహాధ్యాయులందరూ మెరికలే. బహుశా పల్లెటూరి నేపధ్యం కారణంగా నేను వారి కంటే చదువులో కొంచెం వెనుకబడ్డానేమో తెలియదు. అలా అని వెనుక బెంచి బాపతు కాదు. ముందు బెంచీలోనే కూర్చొనే వాడిని.  ప్రతి క్లాసు పాసవుతూ వచ్చాను కానీ మంచి మార్కులతో మాత్రం కాదు. ప్రస్తుతం టచ్ లో ఉన్న స్కూలుమేట్స్ ఇద్దరు ముగ్గురే వున్నారు. నా మేనల్లుడు సాంబశివరావు (శాయిబాబు) ఇప్పుడు  లేడు. వుంటే నాకు రెడీ రికనర్) . దేనికీ తడుముకోవాల్సిన పని వుండేది కాదు.  ఇక వేమవరపు భీమేశ్వరరావు  హైదరాబాదులోనే వున్నాడు. అతడికి జ్ఞాపకశక్తి ఎక్కువ. పొతే, మరొక మిత్రుడు దేవరకొండ ప్రసాద్, దేశాల మధ్య, నగరాల మధ్య గాలిలో తిరుగుతుంటాడు. ధారణలో అతడూ  దిట్టే. మొన్నీమధ్య ఫోన్ చేసి  డిసెంబరు రెండో వారంలో ఒక పెళ్ళికోసం హైదరాబాదు వస్తున్నాను, తప్పకుండా కలవాలి అన్నాడు. నిజానికి అది నా అవసరం. ‘తప్పకుండా. భీమేశ్వరరావుని కూడా కలుద్దాం అన్నాను. వీళ్ళని కలిస్తే నా స్కూలు జీవితానికి సంబంధించిన విశేషాలు పోగుచేసుకోవచ్చు. అదీ నా తాపత్రయం. మతిమరపులో నాది  మొదటి ర్యాంకు కదా! అందుకు.  

దాదాపు నలభయ్ ఏళ్ల విరామం తర్వాత బీమేశ్వరరావుని పదిహేనేళ్ల క్రితం కలిసాను.

2009 డిసెంబరులో ఒకరోజు  ఉదయాన్నే ఫోను మోగింది. కాఫీ తాగుతూ పేపరు చదువుతున్ననేను ‘ఇంత పొద్దున్నే ఎవరబ్బా’ అనుకుంటూనే ఫోను తీశాను. లాండ్ లైన్ రోజులు. ‘శ్రీనివాసరావా!’ అంటూ అవతలనుంచి కాస్త వయసుమీద పడినట్టున్న గొంతు పలకరించింది. ‘అవును. మీరు....’ అన్నాను కొంచెం సందిగ్ధంగా . ‘గుర్తు పట్టు చూద్దాం’ అంది అవతలి గొంతు కవ్వింపుగా. ‘భీమేశ్వరరావు కదూ..’ అంటూ నలభయ్ ఏళ్ళ తరువాత విన్న ఆ స్వరాన్ని గుర్తుపట్టాను. మరో బాల్య మిత్రుడు సాంబశివరావుని కూడా పిలిచి మా ఇంట్లో కలవాలని అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాం. అలాగే కలిశాం. నలభయ్ ఏళ్ళ తరవాత కలయిక. ముచ్చట్లకు లోటేమిటి?

స్కూలు చదువులు, పై చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు,  రిటైర్ మెంట్లు ఇలా అన్నీ పూర్తయ్యాక జరిగిన సంగమం ఇది. 

 

భీమేశ్వరరావు కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి హైదరాబాదు వచ్చాడు. వచ్చినప్పటి నుంచి కూడా తనతో కలిసి చదువుకున్న మా జాడకోసం తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నిస్తూనే వున్నాడు. తన దగ్గరకు హోమియో వైద్యం కోసం వచ్చిన ఒక మీడియా మిత్రుని ద్వారా నా  ఫోను నెంబరు పట్టుకున్నాడు. అదీ ఫోన్ కాల్ వెనుక కధ.  అప్పటికే ముగ్గురం మా వృత్తిపరమైన కొలువుల నుంచి రిటైర్ మెంటు పేరుతొ బయటపడ్డాము. భీమేశ్వర రావు తనకు తండ్రి గారి నుంచి సంక్రమించిన హోమియో వైద్యాన్ని అవసరమైన వారికి అందిస్తూ తృప్తిగా జీవనం గడుపుతున్నాడు. అతడో చెయ్యి తిరిగిన రచయిత అని ఫేస్ బుక్ ద్వారానే తెలిసింది. అతడు రాసిన తన జీవిత చరిత్ర అపూర్వం. అతడికి వున్న అసాధారణ ధారణ శక్తి ఆ పుస్తకం రాయడానికి బాగా ఉపకరించింది. రాసే రంగంలో వుండి  కూడా నేను అతగాడిలా అంత విస్తృతంగా, అంత బాగా రాయలేకపోయాను.  

మా జ్ఞాపకాలను, చిన్ననాటి అనుభూతులను నెమరు వేసుకోవడానికి అదృష్టవశాత్తు మా రిటైర్ మెంటు పనికి వచ్చింది.  ముందే కలిసివుంటే హోదాల గోదాలు అడ్డు వచ్చి వుండేవేమో. నేను ఆరోజుల్లో అలా  ఇలా అని చెప్పుకోవడానికే సమయం సరిపోయేదేమో మరి.

ముందు నుంచీ కూడా  భీమేశ్వరరావు చాలా క్రమశిక్షణతో వుండేవాడు. వాళ్ళ నాన్నగారి నుంచి అబ్బిన మంచి లక్షణం. మితభాషి కూడా. ఇప్పుడు ఇంతలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా వుంది. ఇన్నాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో వున్నాడు కదా! బహుశా అంచేత మాటకారిగా మారివుంటాడు’ అన్నాడు శాయిబాబు అనే  సాంబశివరావు, అన్నాడు ఆనాటి కలయికలో.

కానీ మేమిద్దరం అలా కాదు. కొంచెం ఆకతాయిలం. అప్పట్లో వాలీబాల్ లాంటి ఆటలను గంట ఆడుకోవడానికి రెండుగంటలు ప్రాక్టీసు చేసేవాళ్ళం. సెకండ్ షో సినిమాలు, నాటకాలు అబ్బో ..చాలా వేషాలు వేశాం” అని తుర్లపాటి చెబుతుంటే, “అవును. మా స్కూల్లో మాకు చక్కని వినోదాన్ని పంచేవాడు శ్రీనివాసరావు. పాటలు, పద్యాలు, కవితలు. అతడికి రాని కళలు లేవంటే నమ్మండి. మాయాబజార్ లో పాటలూ, పద్యాలు అన్నీ కంఠస్థ౦. నేనెప్పుడు మాయాబజార్ పాటలు విన్నా నాకు శ్రీనివాసరావు చాలా గుర్తుకు వచ్చేవాడు. అల్లరికి అల్లరి, చదువుకు చదువు అన్నీ చేసేవాళ్ళం’ అని మాటలు మొదలు పెట్టాడు, భీమేశ్వరరావు.

లోపల కాఫీ కలుపుతున్న మా ఆవిడ వింటున్నదన్న భావనలో కాస్త చాతీ పెంచుకుని నేనూ సంభాషణలో పాలుపంచుకున్నాను.

అంతేనా ఏ మాస్టారు తగిలినా ఆ మాస్టారు మీద కవిత్వం రాసేవాళ్ళం. అయితే వీళ్ళిద్దరూ చదువులో ఫాస్ట్. నేనేమో లాస్ట్ నుంచి ఫస్ట్. అయినా మా మీద ఇప్పటి పిల్లల మాదిరిగా ఒత్తిళ్ళు, లక్ష్యాలు లేవు. హాయిగా తిరిగాం, తిరుగుతూ పెరిగాం. బాల్యాన్ని చక్కగా ఆస్వాదించాం” అనేది నా మాట.

మొత్తానికి ఇన్నాళ్ళ తరువాత కలుసుకోవడం ఉద్విగ్నంగానే కాదు ఎంతో ఎమోషనల్ గా అనిపిస్తోంది.  చదువు పూర్తయిన తరువాత హైదరాబాదులోనే ఉద్యోగం సంపాదించుకుని అక్కడే స్థిరపడాలనే కోరిక నాకుండేది. అయితే దురదృష్టవశాత్తు నాకిక్కడ ఉద్యోగంచేసే అవకాశం రాలేదు. కానీ ఇక్కడ స్థిరపడే అదృష్టం మాత్రం దక్కింది. అయితే ఇప్పటి హైదరాబాదు అప్పటిలా లేదు. చాలా మారింది. అప్పట్లో విజయవాడ నుంచి హైదరాబాదు రావాలంటే ఎంతో సంబరపడేవాళ్ళం. మళ్ళీ ఇక్కడనుంచి బెజవాడ వెళ్ళాలంటే ఏడుపొచ్చేది” అని భీమేశ్వరరావు చెబుతుంటే, “అవును! ఇప్పుడున్న రామోజీ సిటీ ప్రాంతంలో రోడ్డుకు రెండు వైపులా ద్రాక్షతోటలు ఉండేవి. ఆ పొలిమేరల్లోకి బస్సు రాగానే వాతావరణం పూర్తిగా మారిపోయేది. బస్సు కిటికీ ఇనుప రాడు చల్లగా ఐసు కడ్డీలా అయిపోయేది. అలా రాడ్లు చల్లబడ్డాయంటే హైదరాబాదు వచ్చినట్టు లెక్కన్న మాట. అసలా హైదరాబాదుకు ఇప్పటి హైదరాబాదుకు పోలికే లేదు”  నా అనుభవం నాది.

ఇవన్నీ ఎలా గుర్తున్నాయి అంటారా. కారణం సరస్వతి రమ అనే జర్నలిస్టు. మా ముగ్గురి కలయిక గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో ‘నలభయ్ ఏళ్ల తర్వాత కలిసిన ముగ్గురు మితృలు’ అంటూ సంగమం  అనే  శీర్షిక కింద ఒక వ్యాసం రాసారు. అదీ కధ.

నాకు మొదటినుంచి మాటకారి అనే పేరు వుండేది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాట పడి పోయింది, కానీ నేను నా జీవితాన్ని మాటలతోనే నెట్టుకు వచ్చాను. శ్రీనివాసరావు ఎక్కడ వుంటే అక్కడ సందడే సందడి అనేవాళ్ళు. వ్చ్! అంతా ఇప్పుడు అందమైన గతం. ఓ కల. ఇప్పుడు గంటకో మాట మాట్లాడితే గొప్ప.

 

మాటల్లో మరచిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను. ఏం చెబుతున్నాను? నాకు మాట్లాడం అంటే వ్యసనం అని. మాటలు అంటే పోచికోలు కబుర్లు చెప్పడం అన్నమాట. రైల్లో రిజర్వేషన్ లేకుండా ఎక్కినా, నా మాటల మత్తులో పడి ‘ఎంతసేపు అలా నిలుచుంటారు మాస్టారు,  ఇదిగో ఇలా వచ్చి ఇక్కడ కూచోండి, నేను పడుకుని చాలాసేపు అయింది, మీరు కాళ్ళు చాపి పడుకోండి, నేనెలాగో అలా  సర్దుకు కూచుంటాను’ అని రిజర్వేషన్ వున్నవాళ్ళు పక్కకు తప్పుకుని ఒదిగి కూచున్న ఘట్టాలు నా జీవితంలో చాలా వున్నాయి. ఇవన్నీ చూసి నేనో మాటల పోటుగాడిని అని భ్రమించి ఎస్సారార్ కాలేజీ వాళ్ళు జగ్గయ్యపేటలో జరిగే అంతర్ కళాశాలల వక్తృత్వ పోటీలకు పంపారు. అణు బాంబులు ప్రపంచానికి అవసరమా అనేది టాపిక్. నన్ను పిలిస్తే వెళ్లి ప్రసంగం మొదలు పెట్టాను. అణ్వస్త్రాలు కావాలా ? అన్నవస్త్రాలు కావాలా?  అంటూ ప్రారంభించాను. సభలో చప్పట్లు. ఆ చప్పట్లకు చిన్న మెదడులో చిన్న కుదుపు వచ్చి తరవాత ఏం మాట్లాడాలో మరచిపోయాను. రెండు మూడు నిమిషాలు మైకు బాగు చేసేవాడిలా ఏమీ మాట్లాడకుండా నిలబడి పోయేసరికి మళ్ళీ చప్పట్లు. అయితే ఈసారి దిగిపొమ్మని. నేనేమో మాటల మనిషిని. సభలో ప్రసంగించమంటే ఎలా! అది కుదరని పని. పైగా మతిమరపు ఒకటి.

నా మతిమరపు గురించి ఇలాంటి కధలు చాలా వున్నాయి. చాలావరకు మరచిపోయాను. భీమేశ్వరరావు, ప్రసాద్ గుర్తుచేస్తారేమో చూడాలి.

కింది ఫోటో:





2009 లో జర్నలిస్టు సరస్వతి రమ ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం క్లిప్పింగ్

(ఇంకా వుంది)

7, డిసెంబర్ 2024, శనివారం

అయాం ఎ బిగ్ జీరో అను నడిచి వచ్చిన దారి (30) - భండారు శ్రీనివాసరావు

 

ముందు మాటలో ముందే చెప్పాను, ఇది నా ఒక్కడి కధ కాదని. నా చుట్టూ అల్లుకున్న చారిత్రిక, సామాజిక రాజకీయ అంశాల సమాహారం అని. రాజకీయ అంశాల ప్రస్తావనకు ఇప్పటికి, అంటే ఈ వ్యాస పరంపరలో  నేనింకా చిన్నపిల్లవాడినే, జర్నలిజం వృత్తిలోకి  ప్రవేశించడానికి ఇంకా బోలెడు వ్యవధానం వుంది. సమయం వచ్చినప్పుడు ఆ చిట్టా విప్పుతాను.

కృష్ణ నీళ్ళ ప్రభావం ఏమో తెలియదు కానీ, బెజవాడ వాసులకు బెజవాడ అంటే ప్రాణం. ఈ సరికి మీకూ విషయం అర్ధం అయివుండాలి. నా చిన్నతనం గడిచిన ఊరు ప్రస్తావన వచ్చినప్పుడు బెజవాడ అంటున్నాను. పెరిగి పెద్దయిన తర్వాత విజయవాడ అని పేర్కొంటున్నాను. రెండూ వేరు కాదు కానీ, నా దృష్టిలో రెండూ వేరే. అప్పుడు నేనున్నది బెజవాడ. ఇప్పుడు అది విజయవాడ.    

ఒకానొక రోజుల్లో బెజవాడ అంటే రెండు రోడ్ల నడుమ వెలిసిన ఒక పెద్ద బస్తీ. ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు వీటి మధ్య అడ్డం నిలువులు గీతల మాదిరిగా చిన్న చిన్న వీధులు ఒకమోస్తరు అడ్డ రోడ్లు. ఎటు వెళ్ళినా నడిచి తిరగొచ్చు. కొంచెం దూరం అయితే రిక్షాలు. మరీ దూరం అయితే సిటీ బస్సులు. గొల్లపూడి – గుణదల, గొల్లపూడి – పోరంకి, గుణదల- రైల్వే స్టేషన్, పోరంకి రైల్వే స్టేషన్. ఇలా వెళ్ళ మీద లెక్కపెట్టే సిటీ బస్సులు, అవీ ప్రైవేటు బస్సులు రయ్యిరయ్యిమని తిరుగుతుండేవి. పొట్టు బస్తాలో పొట్టు కూరినట్టు ప్రయాణీకులని బస్సులో కుక్కి కానీ బస్సు బయలుదేరతీసే వాళ్ళు కాదు. అప్పటిదాకా ఉక్కబోతతో జనం అల్లాడి పోయేవారు. ప్రతి బస్సుకి ముగ్గురు సిబ్బంది. డ్రైవరు, కండక్టరు, క్లీనరు. బస్సు మెట్టు మీద నిలబడి, క్లీనర్ కుర్రాడు గట్టిగా బస్సు మీద చరుస్తూ  రైట్ రైట్ అంటే బస్సు కదిలేది. అలాగే హోల్డాన్ అంటే ఆగేది. ఇక కండక్టర్ ప్రయాణీకుల మధ్య నుంచి అభిమన్యుడిలా దూసుకుపోతూ టిక్కెట్ టిక్కెట్ అంటూ టిక్కెట్లు కొట్టేవాడు. రోడ్డు మీద రిక్షాలు, లారీల రద్దీ ఎంతవున్నా కూడా డ్రైవర్ మాత్రం బీడీ తాగుతూ వేగం తగ్గించకుండా, చేతిలో స్టీరింగ్ విరిగి ఊడివస్తుందేమో అన్నట్టుగా భయంకరంగా అటూ ఇటూ తిప్పుతూ నడిపేవాడు. ఈలోగా టిక్కెట్టు, అర టిక్కెట్టు విషయంలో పేచీలు. కండక్టర్ వెంటనే హోల్డాన్ అంటూ కేకపెట్టి బస్సు ఆపించేవాడు. ఆ లడాయి తెగేదాకా బస్సు రోడ్డు మీదనే నిలిచేపోయేది. మిగిలిన ప్రయాణీకులు తమ తొందరలో కండక్టర్ పక్షాన నిలబడి బస్సు కదలడానికి తమ వంతు నోటి సాయం చేసేవారు.  మా చిన్నతనంలో  బస్సులకు  మూతులు ఉండేవి. అంటే ఇంజిన్ ముందు వుండేది, తరువాత మూతి కనబడని బస్సులు వచ్చాయి. మా పెద్దల కాలంలో బొగ్గు ఇంజిన్ల బస్సులు వుండేవిట. నైజాం నుంచి బెజవాడ పని మీద వచ్చిన వాళ్ళు ఇదెక్కడి గోల అనుకునే వాళ్ళు. ఎందుకంటే తెలంగాణా ప్రాంతంలో బస్సులు నిజాం సర్కారు ఆధ్వర్యంలో చిరకాలంగా నడుస్తూ వచ్చాయి. నైజాం సర్కారుకు ప్రత్యేకంగా రైళ్లు కూడా వుండేవి.  నైజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయిన తర్వాత  ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ  ఆధ్వర్యంలో బస్సులు  నడిచేవి. వాటిని ఎర్ర బస్సులు అనేవారు.    

ఆంధ్ర ప్రాంతంలో ప్రైవేటు రంగంలో వున్న బస్సు రూట్లను జాతీయం చేయాలనే డిమాండ్ జనంలో బాగా పెరిగిపోవడానికి ఆ బస్సు రూట్ల యజమానులు  వాళ్ళు అనుసరించిన  అమిత లాభాపేక్ష విధానాలే కారణం.  బెజవాడ వంటి పట్టణంలో ఒక్కో రూటును గుత్తకు తీసుకున్నవాళ్లు  కోటీశ్వరులయ్యారు అనే అభిప్రాయం కూడా ప్రజల్లో ప్రబలింది. ఒక్క రూటు మీదనే ఇంత ఆదాయం వున్నప్పుడు, మొత్తం రూట్ల మీద పెత్తనాన్ని ప్రభుత్వమే తీసుకుంటే ఖజానాకు లభించే లాభాలను గురించి ప్రజల్లో చర్చ మొదలయింది. ఈ అంశం తీవ్రంగా మారి ఏస్థాయికి చేరిందంటే,  ఆ నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాజీనామా చేయాల్సిన పరిణామానికి పరోక్షంగా దారి తీసింది. కర్నూలు జిల్లాలో బస్సు రూట్ల జాతీయకరణకు సంబంధించిన ఒక కేసులో ( వివరాలకు : శ్రీ గుళ్ళపల్లి నాగేశ్వర రావు వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, https://www.advocatekhoj.com/library/judgments/index.php?go=1959/august/5.php)  ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ విషయంలో సుప్రీం కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలకు స్పందిస్తూ, నైతిక బాధ్యతగా సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయాల్లో విలువల ప్రాధాన్యతను నిరూపించింది.

సరే! కొన్నేళ్ళ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కూడా బస్సు రూట్లను జాతీయం చేయడం, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అనే పేరుతొ ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు కలిపి ఒకే కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం జరిగాయి. ఆ విధంగా ఆర్టీసీ వారి ఎర్ర బస్సులు తమ ఊరికి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రాంతం ప్రజలు పండగ చేసుకున్నారు.

అప్పటికి నేను విజయవాడ వదిలేశాను.






(ఇంకా వుంది)