28, ఆగస్టు 2024, బుధవారం

" ద్వితీయ పుత్ర.. సంతోష్ నామ..."

... అనాల్సివచ్చినప్పుడు గొంతు పూడుకు పోతుంది. మనస్సు మెలికలు తిరుగుతుంది. 
అమెరికా వచ్చి అప్పుడే నెల అవుతుందా. ఎవరో తోసుకువచ్చినట్టు వచ్చింది నా రెండో పిల్లవాడి ఏడో మాసికం.
ఉదయం మా పెద్దవాడు సందీప్ నన్నూ, కోడల్నీ, పిల్లల్నీ తీసుకుని  Bothell లోని హిందూ టెంపుల్ కి తీసుకువెళ్ళాడు. పూజారి హేమంత్ శర్మ వయసులో చాలా చిన్నవాడు. అమెరికా వచ్చి అయిదు నెలలే అయింది. అంతకు ముందు మారిషస్ హిందూ టెంపుల్ లో నాలుగేళ్లు పనిచేశాడు. ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతం వాడు. గుడికి వెళ్ళే ముందు మిల్ క్రీక్ ప్రాంతంలో వున్న ఆయన ఇంటికి వెళ్ళాము. ఆ కాలనీ చెట్ల గుంపుల నడుమ చాలా పొందికగా వుంది. ఆయన్ను కారులో ఎక్కించుకుని గుడికి వెళ్ళాము. డ్రైవింగ్ లైసెన్స్ రాగానే కారు కొనుక్కుంటానని దారిలో చెప్పారు.
కార్యక్రమాన్ని చాలా నిష్టగా జరిపించారు హేమంత్ శర్మ గారు. 
పదకొండేళ్ల క్రితం ఇదే దేవాలయంలో మా అమ్మగారి ఆబ్డీకం పెట్టిన విషయం జ్ఞాపకం చేసుకున్నాము. 
నెల రోజుల ముందే మా వాడు పూజారితో మాట్లాడి పెట్టడం, కోడలు భావన ఒకరోజు ముందే ఇండియన్ స్టోర్ నుంచి కావాల్సిన సంభారాలు తెచ్చి సిద్ధం చేయడం ఇవన్నీ, దేశం కాని దేశంలో ఇటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరపడానికి సాయపడ్డాయి.

26, ఆగస్టు 2024, సోమవారం

జన్మాష్టమి

' అమ్మా సృష్టి '
' టెల్ మి తాతా '
' కృష్ణుడి పుట్టిన రోజు '
' హు ఈజ్ కృష్ణ '
' మురళి వాయిస్తాడు. నెత్తి మీద నెమలి పింఛం వుంటుంది ' అని ఇంగ్లీషు లో చెప్పాను, కొంత వర్ణించి.
అంతే!
ఈ చిత్రం తయారు చేసింది.
నా అమెరికా యాత్ర ధన్యం అయింది అనిపించింది.
ధన్యోస్మి కృష్ణా!
Thanks Srishti

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భండారు శ్రీనివాస రావు


ఆరేళ్ల క్రితం వరకు నాది ఊరుకుల పరుగుల జీవితమే. కాలు ఒకచోట పెట్టి నిలబడింది లేదు.   ఇలా సాగిన జీవితంలో రేడియో ఉద్యోగం అనేది ఒక అరాచక పర్వం. నేను పనిచేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలో. కానీ ఏ ఒక్కరోజు నియమ నిబంధనలకు కట్టుబడి కానీ
, లోబడి కానీ పనిచేయలేదు. విలేకరి ఉద్యోగం కావడం వల్ల ఆఫీసు టైములూ  గట్రా లేవు. ఆఫీసులో మొహం చూపిస్తే ఆ రోజు వచ్చినట్టు. చూపక పోతే బయట ఎక్కడో ఆఫీసు పని మీద, వార్తా సేకరణలో వున్నట్టు. ఇలా అందరికీ సాధ్యం అవుతుందా. కాదు. అలా వీలుండదు కూడా. నూటికో కోటికో కూడా అసాధ్యం. మరి నా విషయంలో అలా ఎందుకు సాధ్యపడింది? అందుకే అరాచక పర్వం అన్నది. ఇలా మినహాయింపులు పొందడానికి నా తత్వం కూడా ఉపయోగపడింది.

ఆలిండియా రేడియో ఒక పెద్ద సామ్రాజ్యం అనుకుంటే అందులో మా న్యూస్ యూనిట్ (ప్రాంతీయ వార్తా విభాగం) సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన సామంత రాజ్యం. సామంత రాజ్యం అని ఎందుకు అన్నాను అంటే మేము చేసే పని లేదా చూసే పని రేడియో వార్తలు. సేకరించడం, వాటిని గుదిగుచ్చడం, బులెటిన్లు తయారు చేయడం, వాటి అనువాదం సరిగా వుందా లేదా చూసుకోవడం, సరిగ్గా వేళకు  వార్తా ప్రసారం జరిగేలా జాగ్రత్త పడడం ఇవీ క్లుప్తంగా మా విభాగం బాధ్యతలు. వీటిల్లో స్థానికంగా వుండే ఇతర రేడియో పెద్దలకు సంబంధం వుండదు.     మరి ఇందులో నా పాత్ర ఏమిటి? అధికారిక విధులను బట్టి చూస్తే నిజానికి ఏమీ లేదు, వార్తా సేకరణ తప్పిస్తే. ఢిల్లీలో వుండే కేంద్ర వార్తా విభాగానికి మాత్రమే జవాబుదారీ. శ్రీయుతులు  పన్నాల  రంగనాధ రావు గారు, నర్రావుల సుబ్బారావు గారు, మల్లాది రామారావు గారు, ఆర్ వీ వీ కృష్ణారావు గారు, ఆకిరి రామకృష్ణారావు గారు, ఆసయ్య  గారు ఇలా చాలామంది న్యూస్ ఎడిటర్లు మితిమించిన  వాత్సల్యం చూపి నా విశృంఖలతను పెంచి పోషించారు. 

అయితే, తత్వం అని చెప్పాను కదా! అదే ఇంత ఆరాచకానికి కారణం.

హైదరాబాదు కేంద్రం నుంచి రోజుకు ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం మూడు  న్యూస్ బులెటిన్లు ప్రసారం అవుతాయి. వాటిని ఎడిట్ చేయడం ఎడిటర్ల పని. ఒక్కోసారి ఆ బాధ్యత నాకు అప్పగించేవారు. క్రమంగా నా పని ఉమ్మడి కుటుంబంలో కాపురానికి వచ్చిన కొత్త కోడలు మాదిరిగా తయారయింది. వారానికి మూడు రోజులు ఉదయం రేడియో స్టేషన్ కు వెళ్ళి వార్తలు ఎడిట్ చేసేవాడిని. ఇంటి నుంచి రానూ పోనూ ఆఫీసు వాహన సౌకర్యం వుండేది. ఉదయం పూట రెగ్యులర్ న్యూస్ రీడర్లు  రాకపోతే క్యాజువల్ న్యూస్ రీడర్లను బుక్ చేసేవారు, సురమౌళి , గుడిపూడి శ్రీహరి, పీ ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి గార్లు అప్పటికే రేడియో వార్తల పఠనంలో ఉద్ధండులు. ఇక రెగ్యులర్ న్యూస్ రీడర్లు  తిరుమలశెట్టి  శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్న దేవి గార్లు సరేసరి. వాళ్ళు చదివే వార్తలు వింటూ పెరిగిన వాడిని. శ్రీనివాసరావు అన్నీ పనులు చేయగలడు  అని అనిపించుకునే నా తాపత్రయంతో  వాళ్ళలో కొందరు తమ బాధ్యతలను నాకు వదిలేసేవాళ్ళు. ఎడిట్ చేసే బాధ్యత క్రమంగా అనువాదం చేయడం వరకు పెరిగింది. ఆంధ్రజ్యోతిలో కాలాలకు కాలాలు అనువాదం చేసిన అనుభవం ఇలా అక్కరకు వచ్చింది. అదే క్రమంలో జీవన స్రవంతి, వార్తా వాహిని కార్యక్రమాల నిర్వహణ, వ్యాఖ్యానం, పఠనం అలా బాధ్యతలు భుజానికి ఎక్కి కూర్చున్నాయి.

ఇలా రోజుకు ముప్పూటలా ఆఫీసు పనులు చేసుకుంటూ కాలం దొర్లిస్తున్న  సమయంలో ..

ఒకానొక రోజు ఉదయం.

రేడియో వార్తల సమయం దగ్గర పడుతోంది. నా పనిలో నేనున్నాను.  న్యూస్ రీడర్ జాడలేదు. అప్పటికే బులెటిన్ మూడువంతులు సిద్ధం చేశాను. ఫోను మోగింది. అనివార్యకారణాల వల్ల రాలేకపోతున్నాను అని సంజాయిషీ. ఫోను పెట్టేసి బులెటిన్ కాగితాలు క్రమపద్దతిలో సర్దుకుని పూనకం పూనినట్టు  స్టూడియోకి బయలుదేరాను. ఆ రోజుల్లో మా వార్తా విభాగం మెయిన్ స్టూడియోకి దూరంగా రేడియో ఆవరణలో ఒక పక్కగా వుండేది. అప్పటికి ఇప్పుడు వున్న స్టూడియో కట్టలేదు.  ఎవరైనా అనౌన్సర్‌లు ఖాళీగా వున్నారేమో అని వాకబు చేశాను. ఎవ్వరూ దొరకలేదు. వార్తల టైము పది నిమిషాలు వాళ్ళకి ఖాళీ సమయం. నేను ఒక్కడినే స్టూడియోకి వెళ్ళడం చూసి డ్యూటీ ఆఫీసరు పరిగెత్తుకుని వచ్చారు. నేను లైవ్ ప్రోగ్రాములకి కొత్త అని ఆయనకు తెలుసు. జీవన స్రవంతి, వార్తా వాహిని లైవ్ కాదు. ముందుగా రికార్డు చేసి ప్రసారం చేస్తారు. వార్తలు ఒక్కటే మొత్తం రేడియో కార్యక్రమాల్లో లైవ్ గా ప్రసారం చేస్తారు. డ్యూటీ ఆఫీసరు నాకు చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పాడు. దగ్గు వస్తే ఫేడర్  కిందికి లాగాలని, మళ్ళీ పైకి జరుపుకుని వార్తలు చదవాలని చెప్పి వెళ్ళి పోయాడు.

నేను న్యూస్ రిపోర్టర్ ని. వార్తలు చదవడం నా డ్యూటీ కాదు. పైపెచ్చు వార్తలు చదివే వాళ్ళు ఆడిషన్  టెస్టులో పాసవ్వావాలి.  పై అధికారుల అనుమతులు కావాలి. చెప్పాకదా! నా తత్వం గురించి. ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు. సమయం మించకుండా వార్తా ప్రసారం మొదలు కావాలి. అంతే !

ఫేడర్ అంటారో ఇంకేమీ అంటారో నాకు తెలియదు. దాన్ని పైకి లాగి మొదలు పెట్టాను.

“ ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది  భండారు శ్రీనివాసరావు ..”

ఆ విధంగా మొదలయిన నా అరాచక పర్వం ఆకాశవాణిలో ఏళ్ల తరబడి సాగింది.

అరాచకం అంటూ మొదలవ్వాలి కానీ అది కొనసాగుతూనే వుంటుంది. ఆ విశేషాలు మరోసారి.

(25-08-2024)

23, ఆగస్టు 2024, శుక్రవారం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముగిసిన ప్రధాన ఘట్టం

నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నామినేషన్ ను చికాగోలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆ పార్టీ జాతీయ సదస్సులో ఈరోజు చివరి రోజున ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. కాకతాళీయం కావచ్చు, యాదృచ్చికం కావచ్చు ఇది కమలా హారిస్ పెళ్ళి రోజు కూడా. పార్టీ ఆమెకు ఇచ్చిన పెళ్ళి కానుక.
సరే! ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే ఈ దేశంలో కూడా ఎన్నికల ప్రసంగాలు కొంచెం డిగ్రీ తేడా కానీ మన దేశంలో మాదిరిగానే సాగాయి. అమెరికా మాజీ ప్రెసిడెంట్లు ఇద్దరు ఒబామా, బిల్ క్లింటన్ లు భార్యలతో సహా హాజరై కమలా హారిస్ కు మద్దతు పలికారు. కమ్లానా కమలానా అనే శంక తీరుస్తూ CNN channel ఆమె పేరు ను KAMALA HARRIS అని రాసింది. 
మన దగ్గర IAS, IPS అధికారులు, అధికార పార్టీలకు పరోక్షంగా మద్దతు ఇస్తుంటారు. ఇక్కడ ఏకంగా తమ యూనిఫారాల్లోనే వచ్చి కొందరు పోలీసు అధికారులు బహిరంగంగానే డెమొక్రాటిక్ పార్టీకి మద్దతు తెలుపుతూ వేదికపై ప్రసంగాలు చేసారు. ఇది ఇక్కడ ఆక్షేపణీయం కాదంటున్నారు. 
ముసుగు మనుషుల కంటే ఇదే బెటరేమో!
ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ను తమ ప్రెసిడెంటు అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఇద్దరి భవిష్యత్తు రెండు నెలల్లో తేలుతుంది.
ప్రసంగాలను బట్టి నాకు అర్థం అయింది ఏమిటంటే free and fair elections పట్ల రాజకీయ పార్టీలకి ఏదో సందేహం వున్నట్టు వుంది.

21, ఆగస్టు 2024, బుధవారం

ఆధ్యాత్మిక అధికారి

ఆధ్యాత్మిక అధికారి శ్రీ పీ.వీ.ఆర్.కే. – భండారు శ్రీనివాసరావు 
(ఆగస్టు 21 ఆయన వర్ధంతి)

ఒక ఉన్నతాధికారి, ఆయన ఓ జిల్లా కలెక్టర్ కావచ్చు, సచివాలయంలో ఉప కార్యదర్శి కావచ్చు, ఎక్సైజ్ కమీషనర్ కావచ్చు, టీటీడీ ఈవో కావచ్చు, విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కావచ్చు, ఏకంగా భారత ప్రధానమంత్రి సలహాదారు కావచ్చు, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ కావచ్చు, ధర్మ పరిరక్షణ సంస్థ గౌరవ అధ్యక్షులు కావచ్చు, అది ఏ ఉద్యోగం అయినా కానివ్వండి, ఏ హోదా వున్నదయినా కానివ్వండి, ఎంతటి బాధ్యత కలిగినదయినా కానివ్వండి దాన్ని ఒకే నిబద్ధతతో, ఒకే అంకితభావంతో, అంతే సమర్ధంగా నిర్వహించుకుని, నిభాయించుకుని సెహభాష్ అనిపించుకోగల అధికారులను వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. ఆ లెక్క తీసుకుంటే ఆ వరుసలో మొదట్లో కానవచ్చే వ్యక్తి, తన డెబ్బయి ఏడో ఏట స్వల్పఅస్వస్థత అనంతరం 2017, ఆగస్టు ఇరవై ఒకటో తేదీ తెల్లవారుఝామున కన్నుమూసిన పీ.వీ. ఆర్. కే. ప్రసాద్. (వారి పూర్తి పేరు పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్)
నలుగురికే కాదు, ప్రపంచం నలుమూలల తెలిసిన మనిషి ఆయన. శనివారం తెల్లవారుఝామున ఆస్పత్రిలో చేరారు. అస్వస్వతకు గురయిన సంగతి నలుగురికీ తెలిసేలోగానే, ఇరవైనాలుగు గంటలు గడిచీ గడవక ముందే, సోమవారం తెల్లవారుఝామున ఆయన ఈ ప్రపంచాన్ని వీడిపోయారనే కబురు నేల నాలుగు చెరగులా తెలిసిపోయింది. మరణం అలా ముంచుకురావడం పుణ్యాత్ముల విషయంలోనే జరుగుతుందంటారు. అలాగే జరిగింది కూడా. 
అంతకుముందు రాత్రి జ్వాలా, నేనూ కలిసి బంజారా కేర్ ఆసుపత్రికి వెళ్ళాము. ఐ.సి.యూ. లో ప్రసాద్ గారిని చూశాము. జీవితంలో ఎలాంటి బంధాలు లేకుండా బతికిన మనిషిని, ముక్కుకు, నోటికి బంధనాలతో చూస్తుంటే ఎంతో బాధ వేసింది. ఈ రాత్రి గడవడం కష్టం అనే భావన డాక్టర్ల అభిప్రాయంగా తోచింది. అయ్యో అనిపించింది. ఆ తెల్లవారుఝామున ఫోను మోగింది. పెద్దాయన దాటిపోయారు అని చెప్పారు. ప్రసాద్ గారి భార్య, కొడుకు, కుమార్తె అంతిమ ఘడియల్లో ఆయన చెంతనే వున్నారు. అదొక ఊరట.
అప్పటికి ఆయన వయస్సు డెబ్బయి ఏడు సంవత్సరాలు. ఆగస్టు ఇరవై రెండు ఆయన పుట్టిన రోజు. అదేమిటో ఆ రోజుకు ఒక్క రోజుముందే ఆగస్టు ఇరవై ఒకటో తేదీనే పీవీఆర్కే మరణించడం దైవలీల. 
ఒక్క రోజు గడిచి వుంటే డెబ్బయి ఎనిమిదిలో ప్రవేశించి వుండేవారు. ఈరోజులలో ఇదేమంత పెద్ద వయస్సేమీ కాదు. కానీ ఆయన నమ్ముకున్న తిరుపతి వెంకటేశ్వరుడికి ఆయన్ని తన దగ్గరకు పిలిపించుకోవాలనే కోరిక కలిగిందేమో. అందుకే ప్రసాద్ గారు ఎవరినీ కష్ట పెట్టకుండా, తను మరీ కష్టపడకుండా దాటిపోయారు. ఆధ్యాత్మిక అంశాలతో కూడిన చక్కటి రచనలను మనకు మిగిల్చిపోయారు.
ఎన్నెన్నో బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసినా ఎలాటి మచ్చ పడకుండా నెగ్గుకువచ్చారు. తన పైవారికి కానీ, కింది సిబ్బందికి కానీ మాట రాకుండా నిప్పులాంటి నిజాయితీతో విధులను నిర్వహించారు. ఎన్ని గిరులు గీసుకున్నా,మరెన్నో బరులు తన చుట్టూ బారులు తీరినా, ఏదైనా విషయం సమాజానికి మేలు చేసేది అని తను మనసారా నమ్మితే చాలు, అంతే! ఎలాంటి సంకోచాలు లేకుండా, ఎలాటి భేషజాలకు పోకుండా, అడ్డొచ్చే నిబంధనలను తోసిరాజనికూడా ప్రజాక్షేమానికి పెద్దపీట వేసే గుండెధైర్యం ఆయన సొంతం. ఇలాటి విషయాల్లో యువ ఐ.ఏ.ఎస్. అధికారులకు ఆయన చక్కని స్పూర్తి ప్రదాత. నిబంధనల పేరుతొ అధికారుల్లో వుండే చొరవను చిదిమేయవద్దని ప్రసాద్ గారు తరచుగా అంటుండేవారని ఆయన కింద పనిచేసిన ఓ అధికారి గుర్తు చేసుకున్నారు. యువ అధికారులు చొరవ తీసుకుని చక్కని ఫలితాలు రాబట్టే క్రమంలో కొన్ని కొన్ని పొరబాట్లు చేసినప్పుడు ఆయన పెద్ద మనసుతో సర్దిపుచ్చేవారు. నల్గొండ జిల్లాలో ఎస్.ఎఫ్.డి.ఏ. అధికారిగా పనిచేస్తున్నప్పుడు సన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించే ఒక పధకం అమల్లో ఆయన అలాంటి చొరవనే ప్రదర్శించారు. ఆ జిల్లాలో అయన వేసిన కొత్త బాటకు దేశవ్యాప్త ప్రచారం లభించింది. ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి స్వయంగా నల్గొండ ప్రయోగం గురించి ప్రస్తావించిన విషయాన్ని నాటి ముఖ్యమంత్రి శ్రీ పీ.వీ. నరసింహారావు గారు స్వయంగా పీవీఆర్కే చెవిన వేశారు. ఈ సంగతిని ఆయన తన అనుభవాల గ్రంధంలో రాసుకున్నారు కూడా.
“అకీర్తిం చాపి భూతాని కధయిష్యంతి తేవ్యయామ్
సంభావితస్యచా కీర్తిర్మరణా దతిరిచ్యతే” 
“ప్రజలెప్పుడూ నీ అపకీర్తి గురించే చెప్పుకుంటారు. ఆత్మగౌరవం కలిగిన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దుర్భరమైనది”
భగవద్గీతలో గీతాకారుడు చెప్పిన ఈ సూక్తిని శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ తన జీవిత పర్యంతం మనసా వాచా కర్మణా గుర్తుంచుకుని జీవనయానం సాగించారేమో అనిపిస్తుంది ఆయన జీవితాన్ని తరచి చూస్తే.
“నాహం కర్తా హరి:కర్తా”
(నేను కాదు కర్తని. చేసేది చేయించేది అంతా శ్రీహరే!) 
ఇదీ శ్రీ ప్రసాద్ గారి నమ్మకం. అందుకే కాబోలు తన తిరుపతి అనుభవాల గ్రంధానికి దీన్నే మకుటంగా పెట్టుకున్నారు.
పుణ్యజీవితం గడిపిన ధన్యజీవి శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్.

శిలాక్షరం - భండారు శ్రీనివాసరావు



ఆయనకిప్పుడు కొంచెం అటూఇటూగా ఎనభై ఏళ్ళు. నలభై ఏళ్ళ కిందట క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. అనేక ముఖ్యమైన శాఖలు నిర్వహించారు. రెండు మూడేళ్ళ క్రితం కలిసినప్పుడు జరిగిన మాటామంతిలో ఒక విషయం చెప్పారు.  ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా వున్నప్పుడు ఓ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మించి ఆయన చేతులమీదుగా ప్రారంభోత్సవం చేశారట. మాజీ మంత్రి అవతారంలో మళ్ళీ అదే వూరికి సొంత పని మీద వెళుతూ తెలిసిన ఎమ్మెల్యేతో చెప్పించుకుని అదే గెస్ట్ హౌస్ లో గది బుక్ చేసుకున్నారు. తీరా వెడితే గదులు ఖాళీ లేవంటూ, మీరెవరని ప్రశ్నించారట. అడిగినవాడిని కాలరు పుచ్చుకుని లాక్కెళ్ళి గెస్ట్ హౌస్ బయట శిలాఫలకంపై వున్న తన పేరు చూపించాలన్నంత కోపం వచ్చిందట. కానీ తమాయించుకుని అక్కడ నుంచి బయటపడి ఏదో హోటల్లో ఆ రాత్రి బస చేసి వచ్చేశారట.
చివరకు ఆయన చెప్పిందేమిటంటే శిలాఫలకాలమీద పేరు వేశారని సంతోషపడడమే కానీ ప్రజలకు అదేమీ పట్టదు.

20, ఆగస్టు 2024, మంగళవారం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం


అమెరికాలో నవంబర్ లో  జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల హోరు క్రమంగా ఊపందుకుంటోంది.
ఈరోజు చికాగోలో డెమొక్రాటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ మొదలయింది. 
ప్రెసిడెంట్ పదవికి ఆ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమ్లా హారిస్ (ప్రసంగించిన వక్తలలో చాలా మంది ఆమె పేరుని ఇలాగే ఉచ్చరించారు) తో పాటు, గత నాలుగేళ్లుగా అమెరికాను పాలించిన ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా హాజరై ప్రసంగించారు. 
ఒకరకంగా ఇది ఆయనకు వీడ్కోలు కార్యక్రమం అనిపించింది. ఆయన మైకు పట్టుకోగానే హాలు లోని వేలాది మంది వుయ్ లవ్ బైడెన్ అనే ప్లే కార్డు పట్టుకుని లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. 
ప్రస్తుత వైస్ ప్రెసిడెంటు కమ్లా హారిస్ కూడా హాజరయ్యారు. కాకపోతే ఆమె ప్రసంగం ఈ రాత్రి వుండక పోవచ్చు.
రెండు ప్రధాన పార్టీలు ఇలాగే సభలు సమావేశాలు నిర్వహిస్తాయి కానీ బహిరంగంగా కాదు. ఏదో ఒక నగరంలో, అదీ ఒక సమావేశ మందిరంలో.
దేశ ప్రెసిడెంటు పాల్గొంటున్న సభను  టీవీలో వీక్షిస్తున్న నా కంటికి ఎక్కడా సెక్యూరిటీ సిబ్బంది కనపడలేదు. సీక్రెట్ సర్వీసు వాళ్ళు వుంటే వుండవచ్చు. కానీ ఆ వ్యవహారం అంతా సీక్రెట్.
ఇలాంటి పద్ధతులు మన దేశంలో కూడా రావాలని ఆశించడం అత్యాశ కాదు కదా!