28, ఫిబ్రవరి 2022, సోమవారం

శివశంకర్ – ఓ జ్ఞాపకం

 


(ఫిబ్రవరి  27 వర్ధంతి)  

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియో మాస్కోలో పనిచేయడానికి నిర్ణయం జరిగింది కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు రావడంలో జాప్యం జరుగుతోంది.

విషయం తెలుసుకుందామని నేనూ, అప్పుడు రేడియో న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఆకిరి రామకృష్ణారావు గారు కలిసి ఢిల్లీ వెళ్లాం. ఏపీ భవన్ లో దిగి బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసుకుని ఆఫీసు పని వేళలకి ఇంకా కొంత సమయం ఉండడంతో అప్పుడు కేంద్ర మంత్రిగా వున్న శివశంకర్ ఇంటికి ఫోను చేసి వస్తున్నట్టు ఆకిరి చెప్పారు. ముందే కబురు చేయడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు వెంటనే లోపలకు పంపారు. ముందు గదిలో శివశంకర్ కూర్చుని వున్నారు. మమ్మల్ని సాదరంగా పలకరించి వచ్చిన పని ఏమిటని వాకబు చేసారు. ఆకిరి సంకోచించకుండా నా మాస్కో ఆర్డర్లు లేటవుతున్నాయని చెప్పారు.

ఆయన వెంటనే రాక్స్ ఫోనులో (మాట్లాడే విషయాలు ఇతరులకు తెలిసే అవకాశం లేని ఫోన్లు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమైన సీనియర్ అధికారుల ఇళ్ళల్లో మాత్రమే వుంటాయి) సమాచార శాఖ కార్యదర్శితో మాట్లాడి నా విషయం చెప్పారు. ఆయన పదిగంటలకు ఆఫీసుకు పంపించమని చెప్పారు.

ఢిల్లీ వచ్చిన పని అనుకోకుండా శివశంకర్ గారిని కలవడంతో పూర్తయింది. దాంతో ఆయనతో కాసేపు అవీఇవీ మాట్లాడి, ఆయన ఇచ్చిన కాఫీ తాగి బయట పడ్డాము. పది గంటలకల్లా శాస్త్రి భవన్ (సమాచార మంత్రిత్వశాఖ కార్యాలయం వుండే సదనం) చేరుకున్నాము. అక్కడ చాలా హడావిడిగా వుంది. హైదరాబాదు స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసి ఢిల్లీలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న జీ. రఘురాంని (మా పెద్దన్నయ్య పర్వతాలరావుకి మంచి స్నేహితులు) కలుసుకున్నాము. ఆయన మమ్మల్ని చూస్తూనే ‘రండి రండి మీకోసమే చూస్తున్నాను, మీ ఆర్డరు రెడీగా ఉందంటూ చేతికి అందించారు.

ఆ రోజుల్లో ఢిల్లీ అధికార కారిడార్లలో శివశంకర్ గారి హవా అలా వుండేది.



 

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

జగన్ అంటే మా ఆవిడకు పుత్ర వాత్సల్యం ఎందుకు?

 

దాదాపు నలభయ్ నిమిషాల నిడివి ఉన్న నా ఇంటర్వ్యూలో మా ఆవిడ ప్రసక్తి ఉన్న సుమారు  నలభయ్ సెకన్ల భాగాన్ని అమెరికానుంచి మా అన్నయ్య కుమారుడు  సాయి విడదీసి పంపించాడు. వాడికి నా కృతజ్ఞతలు  

Please CLICK on the below LINK


Bhandaru Srinivas Rao Exclusive Interview - About CM Jagan - YouTube

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర - పరిణామాలు

నా గురించి నా నోటితో (రెండో భాగం)

మర్యాదకు మంగళం – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha on 27-02-2022, SUNDAY)

సహిష్ణుత’ మన దేశ సంస్కృతిలో భాగమని చెబుతారు. సహనశీలత శతాబ్దాల తరబడి దండలో దారంలాగా ఉంటూ వచ్చిందని విదేశీయులు సయితం కితాబులు ఇచ్చారు. కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఈ దేశపు సహనశీలతకు కూడా తూట్లు పడుతున్నాయని ఇటీవలి పరిణామాలను గమనించినప్పుడు అనిపిస్తోంది. అందుకే, ‘ఇవ్వాళ దేశానికి బాగా అవసరమైనదేమిటి?’ అంటే, ‘కాసింత సహనం’ అని వాకృచ్చాడొక పెద్దమనిషి. సహన సంస్కృతికి పుట్టిల్లు అని చెప్పుకునే మన దేశానికి ప్రస్తుతం దాపురించిన దుస్తితి ఇది.

అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార యుద్ధంలో పేలుతున్న మాటల తూటాల నేపధ్యంలో, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు కనుచూపుమేరలో లేకపోయినప్పటికీ వివిధ రాజకీయ పక్షాల నడుమ చెలరేగుతున్న దిగజారుడు వ్యాఖ్యల క్రమంలో  ఈ విషయం ప్రస్తావించుకోవాల్సి వస్తోంది.

ప్రచార పర్వంలో పాల్గొంటున్న రాజకీయ పార్టీల నేతలు, అభివృద్ధికి తాము  ఏం చేయబోతున్నామో చెబితే ఎవరికీ అభ్యంతరం వుండదు. అల్లాగే గతంలో ఏం చేశారో ఆ ‘ప్రవర’ మరోమారు  వల్లె వేసినా అక్షేపించాల్సింది ఏమీ వుండదు. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నా ‘ఏదోలే! ఎన్నికల వేళ కదా! పోనీలే’ అని విని వూరుకోవచ్చు. ఎదుటి పక్షం వాళ్ళపై దారుణమైన ఆరోపణలు చేసినా అంతకంటే వాళ్ళు చేసేది ఏముందని, చెప్పేది ఏముందని సరిపెట్టుకోవచ్చు. కానీ, అనవసరమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రచారాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు.

మాటకు వున్న ‘పవర్’ ఏమిటో నేటి తరం రాజకీయ నాయకులకు బాగా తెలుసు. మాటను ఎలా తిప్పి వదిలితే అది మీడియా దృష్టిని ఆకట్టుకుంటుందో వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎలాటి మాటలు రువ్వితే అవి సంచలనాన్ని సృష్టిస్తాయో వారికి కరతలామలకం. ఆ సంచలనాలు కలిగించే పెను ముప్పులతో, పరిణామాలతో  వారికి నిమిత్తం లేదు. అవి ప్రజల్లో రేకెత్తించే భయసందేహాలతో వారికి సంబంధం లేదు. వారి వార్త మీడియాలో పేలాలి. పేలుడు ఫలితాలు వారికి అక్కరలేని విషయం.

జిహ్వాగ్రే మిత్ర బాంధవావః జిహ్వాగ్రే బంధన ప్రాప్తి: జిహ్వాగ్రే మరణం ధృవం’ అన్నారు. జిహ్వ అంటే నాలుక. ఇక్కడ నాలుక అంటే మాట. మాట వల్లనే స్నేహాలు, బాంధవ్యాలు. మాటను బట్టే మరణం కూడా. మాటకు వున్న అసలు శక్తి ఇది. సంచలనాలు సృష్టించడం కాదు. ‘వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనం’ అంటూ ‘చేయకూడని’ కార్యాల జాబితాలో కూడా ‘చెడు పలుకు’ను చేర్చింది అందుకే.

అలవాట్లు, నమ్మకాలు వ్యక్తిగతాలు. వాటిని ఎద్దేవా చేయడం సంస్కారం వున్నవాళ్ళు చేసేపని కాదు.

తినే తిండికీ, మతానికీ ముడిపెట్టి మాట్లాడడం యెంత తప్పో ప్రజల్ని పలానాదే తినండి, పలానాది తినకూడదు అనడం అంతే తప్పు. అసలా మాటకు వస్తే, ఆహారం అనేది మతం పుట్టకముందే వుంది. నాగరీక సమాజం ఆవిష్కృతం కాకమునుపే, మనుషులు అడవుల్లో జంతువుల్లా జీవిస్తున్న పాత రాతి యుగంలో కూడా మనుషులు తమకు నచ్చిందే తిని, తమకు నచ్చినట్టే జీవించారు. నాగరీకం ముదిరిన నేటి రోజుల్లో కూడా మనుషులు తమకు నచ్చిందే తింటున్నారు. అందుకే అన్నారు జిహ్వకో రుచి అని. శాకాహారం తినే వాళ్ళు కూడా అన్ని రకాల కాయగూరలు తినరు. ఒకరు కాకరకాయ తింటారు. కొందరికి సొరకాయ సయించదు. మరి కొందరికి నషాళానికి అంటే కారం నాలుక్కి తగిలితే కాని ముద్ద గొంతు దిగదు. అలాగే మాంసాహారుల్లో కూడా అనేక రుచిపచులు. గుడ్డు తినేవాళ్ళు అందరూ కోడిమాంసం తింటారనుకోను.

ఎనభయ్యవ దశకం చివర్లో నేను నా కుటుంబంతో కలిసి అయిదేళ్ళు మాస్కోలో వున్నాను. అక్కడివాళ్ళకి, మాంసాహారులు కాకుండా శాకాహారులు అనే ఒక తెగ మనుషుల్లో వుందని  తెలియదన్న విషయం అక్కడికి పోయిన తర్వాత తెలిసింది. ఆ రోజుల్లో ఇండో సోవియట్ సాంస్కృతిక సంఘం, ఇస్కస్ ఆధ్వర్యంలో అనేక మంది తెలుగువాళ్ళు ఏటా మాస్కో వస్తుండేవాళ్ళు. నాకు తెలిసిన జర్నలిష్టులు కూడా వారిలో వుండేవారు. వాళ్ళు మాంసాహారులే అయినా, అక్కడి మాంసపు వంటకాలు నచ్చేవి కావు. అధికార విందుల్లో ఏదో మర్యాదకు భోజనం అయిందనిపించుకుని, సాయంత్రం కల్లా మా ఇంటికి వచ్చి మా ఆవిడ వండిపెట్టిన కాయగూరల భోజనం ఆప్యాయంగా ఆరగించి, ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు.

కాబట్టి చెప్పేదేమిటంటే ఒకళ్ళ ఆహారపు అలవాట్లను ఎద్దేవా చేయడం కానీ, తమ అలవాట్లే గొప్పవి అని డప్పు కొట్టుకోవడం కానీ నాగరికం అనిపించుకోదని. సభ్య సమాజంలో జీవించేవారు ఇలాటి ‘ ప్రల్లధనపు’ పలుకులకు స్వస్తి చెప్పాలని మాత్రమే.

కానీ రాజకీయపు వేడిలో, అవసరాల అక్కరలో ఎవరికీ ఏమీ తెలియడం లేదు. ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మెరుగు పరచుకోవడం కోసం రాజకీయ నాయకులు తాత్కాలికంగా ఇలాటి రెచ్చగొట్టే ప్రకటనలు చేసేసి ఆ తరువాత మరిచిపోవచ్చు. కానీ వీటి తాలూకు ప్రభావం ప్రజల మనస్సులో పది కాలాలపాటు పేరుకుపోయే ప్రమాదం వుంటుంది. కానీ ఈ హెచ్చరికలు రాజకీయ నాయకుల చెవికెక్కవు. వారికి వారి రాజకీయ ప్రయోజనాలే ప్రధానం.

అన్ని మతాలలో జంతువుల్ని ప్రేమించే స్వభావం వుంది. కొన్నిజంతువుల్ని పవిత్రంగా భావించి ఆరాధించే ఆచారం వుంది. పరమత సహనం గురించి ప్రబోధించేవాళ్లు, పరాయి మతస్తుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించి తీరాలి. ప్రజలు ఎలా జీవించాలి, వారి జీవన విధానాలు ఎలా వుండాలి అని అన్ని మతాలూ బోధిస్తాయి. వాటిని తు.చ. తప్పకుండా పాటించేవాళ్ళు, ఇతర మతాలవాళ్లకు కూడా అలాటి వెసులుబాటు ఇవ్వాలి. తమ మతం, తమ ఆచారాలు ఎలా తమకి ప్రధానమో, ఇతరులకీ అలాగే అనే సహిష్ణుత అలవరచుకోవాలి. అన్నింటికీ ముందు రాజకీయాలు మతాల ముసుగు వేసుకోకుండా చూడాలి. హాయిగా జీవిస్తున్న ప్రజల నడుమ మతాల పేరుతొ చిచ్చు పెట్టకుండా చూడాలి. మతాన్ని రాజకీయంతో ముడిపెట్టి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకు ఇటువంటి మాటలు రుచించకపోవచ్చు. కానీ, విశాల జాతి హితం ముందు ఇవి అత్యల్ప స్వల్ప విషయాలు.

ఉపశృతి: వెనకో మునీశ్వరుడికి కాలజ్ఞానం వుండేది. జరగబోయేది ముందుగానే తెలుసుకోగలిగిన శక్తి ఆయనకు వుండేది. ఇక మరణం తప్పదు అనుకున్నప్పుడు ఆయనకు ఓ తీరని మనోవేదన పట్టుకుంది. ఈ జన్మలో తాను సర్వసంగ పరిత్యాగి అయిన ముని. వచ్చే జన్మలో అదే ఆశ్రమంలో ఒక ఎలుకగా పుట్టబోతున్నట్టు ముందుగా తెలియడం వల్లనే ఆ ఆవేదన. శిష్యుడిని పిలిచి చెబుతాడు. తాను చనిపోయి అదే చోట ఎలుకగా పుట్టబోతున్నానని. ఇంతటి ఔన్నత్యం కలిగిన బతుకు బతికి కలుగులో ఎలుకలా బతకడం తనకు ఇష్టం లేదని, ఎలుక రూపంలో వున్న తనను వెంటనే చంపేసి ఆ జన్మకు పరిసమాప్తి కలిగించాల్సిందని. ఎలుక రూపంలో ఉన్న తనను గుర్తు పట్టడానికి తన నుదుటిపై ఒక తెల్లటి మచ్చ ఉంటుందని చెప్పి తనువు చాలిస్తాడు. ఎలుకగా పుట్టిన గురువును ఆ శిష్యుడు గుర్తుపట్టి, గురువుగారు పూర్వజన్మలో  ఇచ్చిన ఆదేశం మేరకు ఆ ఎలుకను చంపబోతే గురువు వద్దని వారించి ఇలా అంటాడు.

 మనిషిగా వున్నప్పుడు అదే ఉత్కృష్ట జన్మ అనుకుని, ఎలుకను చిన్నచూపు చూసి ఎద్దేవా చేశాను. అయితే, ఇప్పుడు ఎలుకగా జన్మించిన తరువాత అది ఎంతటి గొప్ప జన్మో నాకు అర్ధం అయింది’.

ఇందులోని నీతి ఏమిటంటే, ఎవరినీ చిన్నచూపు చూడరాదు. చిన్న చూపుకు గురైన వారు ప్రతీకారేచ్చకు పూనుకోరాదు. ఒకరిని ఒకరు మన్నించుకోవడం ద్వారా మాత్రమే తామూ మనుషులమే అని అనిపించుకోగలుగుతారు.



26, ఫిబ్రవరి 2022, శనివారం

ఇద్దరు అధికారులు, ఒకే పాఠం – భండారు శ్రీనివాసరావు



ఎంత అల్పులమో తెలుసుకోవడానికి అనుదినం ఎదురయ్యే సంఘటనలను కొంత నిశితంగా పరిశీలిస్తే చాలని కొన్నేళ్ళ కిందటి నా ఈ అనుభవమే నాకు మరోసారి తెలియపరిచింది.
దూరదర్శన్ సప్తగిరి ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో ‘స్వర సమరం’ అనే సంగీత పోటీ జరిగింది. గవర్నర్ శ్రీ నరసింహన్ ముఖ్య అతిధి. సతీసమేతంగా హాజరయి శాస్త్రీయ సంగీతం పట్ల తమ మక్కువను చూపారు. ఆద్యంతం తెలుగులో ప్రసంగిస్తూ ఇలాటి అద్భుత కార్యక్రమాలను నిర్వహించే శక్తి కేవలం దూరదర్శన్ కు మాత్రమే వుందని ఉద్ఘాటిస్తూ, ఆ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించడం ద్వారా శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహించాలని ఉద్బోధించారు. సరే అసలు విషయం ఇది కాదు.
మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్.ప్రభాకర రావు, వారి శ్రీమతి వేదవతి సంగీతం మీద వున్న ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీ ప్రభాకర రావు పోలీసు శాఖలో అనేక ఉన్నత పదవులను నిర్వహించి సమర్ధుడైన అధికారిగా నిరూపించుకున్నారు. ఆయన్ని గుర్తుపట్టిన దూరదర్శన్ సిబ్బందిలో కొందరు వారిని మొదటి వరుసలో కూర్చోవాల్సిందిగా అభ్యర్ధించారు. అయినా సున్నితంగా తిరస్కరించి సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే వారిద్దరూ వెనుక వరుసలోనే కూర్చుని కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించారు.
గవర్నర్ పాల్గొంటున్న దృష్ట్యా రవీంద్రభారతి ఆవరణలో కట్టుదిట్టమయిన పోలీసు బందోబస్తు చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత రంగస్థలం మీద కళాకారులను అభినందిస్తూ నరసింహన్ దంపతులు కొద్దిసేపు అక్కడే వుండిపోయారు. ప్రభాకరరావు దంపతులు ఈలోగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా ద్వారం వద్దవున్న పోలీసు అధికారులు అడ్డగించారు. కొత్తగా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న ఆ సిబ్బందికి తాము అభ్యంతరం చెబుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తమ శాఖకు అత్యున్నత అధికారిగా పనిచేశారన్న విషయం తెలిసివుండక పోవచ్చు. మధ్యలో ఎవరో కల్పించుకుని ఆయన ఎవరో ఏమిటో చెప్పబోతుంటే శ్రీ ప్రభాకర రావు వద్దని సైగచేసారు. ‘వారి డ్యూటీ వారిని చేయనీయండి’ అంటూ మళ్ళీ వెనక్కు వచ్చి హాలులో కూర్చుండిపోయారు.
రోజు తిరగకుండా మరో సారి మళ్ళీ ఇదేమాదిరి సంఘటన అనుభవంలోకి వచ్చింది. మర్నాడు ఆదివారం గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టినరోజు. రాజభవన్ లో అనేకమంది వారిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేసారు. శ్రీ నరసింహన్ పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసినందువల్లనేమో లోగడ పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అనేకమంది గవర్నర్ ను అభినందించడానికి రాజ్ భవన్ కు వచ్చారు. గతంలో రేడియోలో పనిచేసి నప్పుడు సన్నిహితంగా మెలిగిన అనేకమంది అధికారులను చాలా సంవత్సరాల తరువాత అక్కడ కలుసుకోవడం జరిగింది. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. ఆయన హైదరాబాదు పోలీసు కమీషనర్ గా పనిచేశారు. నిబంధనల ప్రకారం తన సెల్ ఫోనును కారులో బయటే వుంచేసి లోపలకు రావడం చూసి ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే ‘పోలీసుశాఖలో ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే యెట్లా’ అన్నట్టు చిరునవ్వే సమాధానం.
‘ఎదిగినకొద్దీ వొదగమ’ని ఓ సినీ కవి చక్కని పాట రాశారు. విన్నప్పుడల్లా యెంత చక్కని పాట అని ఎన్నోసార్లు అనుకుంటాం. కాని సందర్భం వచ్చినప్పుడు మాత్రం గుర్తురాదు. ఉద్యోగం ద్వారా సమకూడిన హోదా ఒక్కటే గుర్తుంటుంది.
ఒక రోజు తేడాతో చూసిన ఈ రెండు సంఘటనలు మనసుపై మంచి ముద్రవేశాయి. అలా వుండగలిగితే యెంత బాగుండు ఒక్క క్షణం అనిపిస్తుంది. కాని మనసు కోతి లాటిది. దానికి తోడు, పాడు అహం, ఆ ఆలోచనను అనుక్షణం చంపేస్తూనే వుంటుంది. ఏం చేస్తాం!