19, జనవరి 2022, బుధవారం

రచయితలు- సంపాదకులు (ఎవరి బాధలు వారివి)

రచయిత ఏం చేస్తాడు? మరీ చచ్చు ప్రశ్న. ఏంచేస్తాడు ? రాస్తాడు. రాసింది నలుగురు చదవాలని ఆశ పడుతూ రాస్తూ పోతుంటాడు. పత్రికలకి పంపిస్తాడు. వాళ్ళు వేస్తె వేస్తారు. లేకపోతే లేదు. వెయ్యకపోతే మరో పత్రిక్కి పంపిస్తాడు. వెనుకటి మాదిరిగా పోస్ట్ చేయడాలు, తిప్పి పంపడానికి తగినన్ని తపాలా బిళ్ళలు జతచేయడాలు వంటి బాదరబందీలు ఈనాడు లేవు. రాసేసి ఎంచక్కా ఒక్క క్లిక్కు నొక్కితే చాలు. కానీ ఇదొక్కటే చాలదు కదా! సంపాదకుడు చూడాలి, మెచ్చాలి. వెయ్యాలి. ఈలోపు సంపాదకులు మరో రిటర్న్ క్లిక్కు నొక్కి ‘వేస్తున్నాం వేయడం లేదు అని కాకపోయినా, మీ రచన అందింది’ అని కబురు ఏమన్నా చేస్తారా అంటే అదీ లేదు. మరి వారు సంపాదకులాయే. అంత త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వారికి కుదరక పోవచ్చు. వ్యవధి, తీరుబాటు లేకపోవచ్చు.

మరి రచయిత సంగతి. అతగాడికి  తన రచన ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ సామెత మాదిరి. అంచేత మరో పత్రిక్కి క్లిక్కు మనిపిస్తాడు. ఏదో జంధ్యాల సినిమాలో మూడును బట్టి మార్కులు వేసే ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేష్టారిలా ఆ రచన ఆ రెండో పత్రిక సంపాదకుడి మూడును బట్టి నచ్చి కూర్చుంటుంది. అయన వేసేస్తాడు. ఈలోగా మొదటి ఎడిటర్ గారి మూడు కూడా మారి ఆయనా తన పత్రికలో వేసేస్తాడు. రచయిత పని నక్కతోక తొక్కిన చందంగా మారుతుంది. ఒక్క క్లిక్కుకు రెండు పక్షులు. సరే. ఈ పత్రిక ఎడిటర్ ఆ పత్రిక చదవడు. చదివినా పైకి ఏమీ అనలేని పరిస్తితి. కాకపొతే ఇంకోసారి ఆ రచయిత రచనలు ఆ పత్రికలో వెలుగుచూడక పోవచ్చు.

సరఫరా, గిరాకీ సిద్దాంతం ప్రకారం ఇప్పటివరకు రచయితల మీద సంపాదకులదే పైచేయి. ఫేస్ బుక్ , బ్లాగర్ వంటి సాంఘిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వర్ధమాన రచయితలు చెలరేగిపోయి అద్భుతంగా రాస్తున్నారు. ఇప్పటిదాకా పత్రికలకే పరిమితమై ఇంతో అంతో పేరు తెచ్చుకున్న రచయితలు కూడా ఈ వైపే మళ్ళారు. అయితే ఈ మీడియంలో ఓ చిక్కు వుంది.  స్వపర బేధాలు లేవు. పోస్ట్ అయిన ప్రతి రచన మీద, అది ఎవరిదైనా, ఎవరికివారు సర్వస్వామ్యాలు తీసేసుకుంటున్నారు. ఒకరి రచనను మరొకరు కాపీ కొట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ‘కాపీ రైట్’ అంటే ‘కాపీ కొట్టే రైట్’ అనుకుంటున్నారు. పొద్దున్నే  ఇంత పురాణ కాలక్షేపం ఎందుకంటే:  పాత  సంగతులు  తిరగమోత పెడుతుంటే ఆరేళ్ల క్రితం 2016లో  జరిగిన ఓ సంగతి గుర్తుకు వచ్చి.

శ్యాం రావు గారు అనే ప్రముఖ జర్నలిష్టు కన్ను మూశారు. ఆయనతో సన్నిహిత పరిచయం వున్న మరో జర్నలిష్టు మిత్రుడు (ఆయన ఇంగ్లీష్ పేపర్లో పనిచేసే తెలుగు జర్నలిష్టు) శ్యాం రావుగారి గురించి చక్కటి ఆంగ్ల కధనం ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. మరునాడో, ఆ మరునాడో తెలియదు కాని , అదే కధనానికి మక్కికి మక్కి తెలుగు అనువాదం రెండు ప్రధాన దినపత్రికల్లో ఒకే రోజున వచ్చింది. ఆ వ్యాస రచయిత కూడా సామాన్యుడు కాదు. విదేశాల్లో చాలా పేరొందిన సీనియర్ జర్నలిష్టు. ఫేస్ బుక్ లో రాసిన ఇంగ్లీష్ పేపరు జర్నలిష్టు తల్లి గారికి తెలుగు పత్రికలు చదవడం అలవాటు. ఆవిడ చదివి కొడుకుతో చెప్పింది. ఆయన పత్రికల వారిని సంప్రదిస్తే ఒక పత్రిక మాత్రం,  ‘ఆ వ్యాస రచయితను నేను!’ అనే శీర్షిక పెట్టి సవరణ కాని సవరణ రూపంలో ఒక వివరణ ఇచ్చింది. కింద ఫోటో అదే. రచయితలు – సంపాదకులు అని రాసి పక్కన బ్రాకెట్లో ‘ఎవరి బాధలు వారివి’ అని ఎందుకు రాసానో అర్ధం అయిందనుకుంటాను.



18, జనవరి 2022, మంగళవారం

మాస్కోలో మా ఆవిడ విగ్రహం వేయాలనేది నటాషా

కొన్ని వింటున్నప్పుడు, మరి కొన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడో విన్న, ఎన్నడో కన్న సంగతులు, విన్న వింతలు గుర్తుకు వస్తుంటాయి, మూగమనసులు సినిమాలాగా.

1964 లో అనుకుంటాను బెజవాడ లీలామహల్లో చూశాను క్లియోపాట్రా సినిమా. ఒక్కసారి కాదు అనేకసార్లు చూసాను అనేకమంది మాదిరిగానే. అప్పుడే విన్నాను ఆ రెండు పేర్లు, ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్. ఆ సినిమా సెట్లపై వారిరువురి నడుమ పుష్పించిన ప్రేమ పెళ్ళికి దారితీసిందని పత్రికలు రాసాయి. (ఆ సినిమాలో ఆ ఇద్దరి నడుమా ఒక ముద్దు సీను వుంది. పెదవులు కలుపుకుని గట్టిగా ముద్దు పెట్టుకునే ఆ దృశ్యంలో ఇద్దరూ ఎంతగా ఒళ్ళు మరిచిపోయారంటే, దర్శకుడు కల్పించుకుని ‘కట్ కట్’ అని అంతకంటే గట్టిగా అరవాల్సి వచ్చిందట) అప్పట్లో అదో సంచలనం. కారణం ఆ ఇద్దరికీ అది మొదటి పెళ్లి కాకపోవడం. అప్పటికే పెళ్లి చేసుకుని సంసారాలు చేస్తున్న ఆ ఇరువురూ విడాకులు తీసుకుని తమ జీవిత సహచరులతో విడిపోయి మళ్ళీ పెళ్ళాడారు. హాలీవుడ్ లో అదో కొత్త విషయం కాదు కాని ఇండియాలో ఇలాంటి కబుర్లు వింతగానే చెప్పుకుంటారు. అలాగే చెప్పుకున్నారు కూడా. ఒక పదేళ్ళు వారి సంసారం బాగానే సాగింది. పాతొక రోత సామెత మాదిరిగా ఇద్దరికీ సరిపడక విడాకులు తీసేసుకుని మళ్ళీ తమకు నచ్చిన పెళ్ళిళ్ళు ఎంచక్కా చేసుకున్నారు. కధ అంతటితో ఆగలేదు. అలా విడిపోయిన వీరిరువురూ ఏదో సందర్భంలో మళ్ళీ కలుసుకున్నారు. పాత ప్రేమ మళ్ళీ మారాకు తొడిగింది. అంతే! ఏడాది తిరక్కుండానే పాత మొగుడికి టేలరు, పాత భార్యకు బర్టను టాటా చెప్పేసి మళ్ళీ మరోసారి పెళ్లి చేసుకుని కొత్తగా భార్యాభర్తలు అయ్యారు. కానీ పెళ్ళాడి కొన్ని వారాలు గడిచాయో లేదో కధ మళ్ళీ మొదటికి వచ్చింది. కాపురం చివరికి వచ్చింది. మళ్ళీ విడిపోవడమే వారికి మిగిలింది.

కొసరాఖరు:

నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేస్తున్న రోజుల్లో తెలుగు విభాగంలో నా రష్యన్ సహచరులు లిదా స్పిర్నోవాతో పాటు, విక్టర్, గీర్మన్ లు పనిచేసేవారు. ఈ ముగ్గురికీ తెలుగు వచ్చు. మరో ఇద్దరు నటాషా, సెర్గీలకు రష్యన్ తప్ప మరో భాష తెలియదు. వాళ్ళతో నా మాటామంతీ సైగలతోనే సాగేది. సజావుగా పని చేసుకోవడానికి మా మధ్య భాష ఎంతమాత్రం అడ్డంకి కాలేదు. వీళ్ళల్లో నటాషా మరీ చిన్న పిల్ల. ఇరవై నిండకుండానే ఇద్దరికి విడాకులు ఇచ్చి మూడో మొగుడితో కాపురం చేస్తోంది. రష్యన్లకు ఇవన్నీ చాలా మామూలు. మా ఆవిడ శిలావిగ్రహం మాస్కో పుర వీధుల్లో వేయించాలని సరదాగా జోక్ చేస్తుండేది. ఎందుకంటే, పెళ్ళయి పదహారేళ్ళు (అప్పటికి) అవుతున్నా ఇంకా అదే మొగుడితో కాపురం చేస్తున్నందుకట.



(కీర్తిశేషులు మా ఆవిడ నిర్మల)


ఎన్నాళ్ళు ఇలా ఈ కలకలాలు

 

గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం  ఆరుగురు డాక్టర్లకు పాజిటివ్

అంతరిక్ష కేంద్రం సిబ్బందిలో తొంభయ్ రెండు మందికి కరోనా

విదేశాల నుంచి వచ్చిన ఒక విమానంలో నూట పాతిక మందికి కరోనా

వరంగల్ ఎం.జి ఎం ఆసుపత్రిలో అరవై తొమ్మిది మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

ఆ మంత్రికి పాజిటివ్   ఈ కేంద్రమంత్రికి పాజిటివ్

వారికి కరోనా  వీరికి కరోనా

అక్కడ కరోనా ఇక్కడ కరోనా

గత చాలా రోజులుగా ఇలాంటి వార్తలే. కరోనా పాజిటివ్ అయినా పది రోజుల్లోపే  నెగిటివ్ అవుతుంది ఏవో కొన్ని అరుదయిన సందర్భాలలో తప్పిస్తే

అలా నెగిటివే అయిన సమాచారం కూడా ఇలాగే ప్రముఖంగా ఇస్తే జనంలో ఆందోళన, కంగారు తగ్గించినవాళ్ళు అవుతారు కదా!

కొంచెం ఆలోచించండి!

18-01-2022

 

 

చిక్కుల్లో ‘చింతామణి’ – భండారు శ్రీనివాసరావు

 చింతామణి నాటకం చిక్కుల్లో పడడం కొత్తేమీ కాదు. దాదాపు పుష్కర కాలం క్రితమే కొన్ని కుల సంఘాల వారు ఈ నాటకాన్ని నిషేధించాలని ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

కాళ్ళకూరు  నారాయణ రావు గారు రెండు నాటకాలు రాసారు వొకటి ‘చింతామణి’  రెండోది ‘వర విక్రయం’. ఇవి రాసి    తొంభయ్ ఏళ్ళు అయిందేమో.  ఇంకా వందేళ్ళు పూర్తి కాలేదు.  ఆ రోజుల్లో జటిలంగా వుండే రెండు సామాజిక సమస్యలను తీసుకుని ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు  వీటిని రాసారు.  గురజాడ అప్పారావుగారి కాలంలో ‘కన్యాశుల్కం’ వుంటే కాళ్ళకూరి వారి సమయంలో వరకట్నం సమస్య బాగా ప్రబలివుంది.  ‘వర విక్రయం’ ఎందుకో కాని, స్టేజి మీద పాపులర్ కాలేదు. బెజవాడ  రేడియోలో నండూరి సుబ్బారావు,  శ్రీరంగం గోపాలరత్నం, చిరంజీవిరావు వాళ్ళు వేసారు.  చాలాసార్లు  ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వర విక్రయం నాటకం ప్రసారం చేశారు.  సింగరాజు లింగరాజు మరిచిపోలేని లోభి క్యారెక్టర్ వేసేవారు. పొతే, రెండో నాటకం ‘చింతామణి’ బాగా పాపులర్ అయింది.  కురుక్షేత్రం’, ‘రామాంజనేయ యుద్ధం’ వంటి నాటకాలు పోయినా, అడపా తడపా ఇంకా  ఆడుతున్న నాటకం ‘చింతామణి’. 

కథా వస్తువు చిన్నదే.  చింతామణి    సంస్కారమున్న వేశ్య.   చదువుకున్నది. విద్యా వంతులంటే వల్లమాలిన అభిమానం. ఆ ఊళ్లోనే భవానీ శంకరుడనే జల్సా రాయుడు వుంటాడు. అతను తనకున్నదంతా చింతామణికి సమర్పించుకొని జులాయిగా తిరుగుతూ ఉంటాడు.  చింతామణి అమ్మ శ్రీహరి.  వాళ్ళ ఇంటికి వచ్చే విటులందరికి శ్రీహరి అంటే భయం. ఏ రోజు ఎకౌంటు ఆ రోజే తేల్చివేసే రకం. మర్నాడు మళ్ళీ డబ్బు దశకం తెస్తేనే ఇంట్లోకి  అడుగు పెట్టనిచ్చేది.  కొన్నాళ్ళకు భవాని శంకరుడి దగ్గర మొత్తం సొమ్ము  అయిపోవడంతో వెళ్ళగొడుతుంది.  ఇతనికో మిత్రుడు వున్నాడు బిల్వమంగళుడు. అందమైన వాడు. విద్యావంతుడు. ఆస్తి పరుడు. అన్నిటికి మించి మంచి ప్రవర్తన వున్నవాడు. భవానీ  శంకరుడు ఓసారి చింతామణి దగ్గర బిల్వమంగళుడి ప్రసక్తి తీసుకు రావడం, అతన్ని ఎలాగయినా ఓ మాటు  ఇంటికి తీసుకురమ్మని ఆమె కోరడం, చింతామణి ప్రాపకం కోసం భవానీ శంకరుడు ఒక రోజు  బిల్వ మంగళుడిని చింతామణి ఇంటికి తీసుకురావడం, క్రమేపీ  వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం, చివరికి చింతామణి పశ్చాత్తాప పడడం ఇలా  నాటకం నడుస్తుంది. పెద్ద పాత్రలు ఏమీ లేవు  కూడా.  చింతామణి, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, చింతామణి తల్లి శ్రీహరి, చెల్లెలు చిత్ర, బిల్వమంగళుడి భార్య రాధ, అతడి  స్నేహితుడు దామోదరుడు. ఇంతవరకు బానే వుంది సుబ్బిశెట్టి అనే మరో పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది. అదే ఇప్పుడు చింతామణి నాటకాన్ని వివాదాస్పదం చేస్తోంది. చింతామణి మీద మోజుతో వున్నదంతా పోగొట్టుకున్న  సుబ్బిశెట్టి చివర్లో  తిరగేసిన జల్లెడలో పెసర పునుకులు, మసాలా వడలు పెట్టుకుని బజార్లవెంట తిరుగుతూ అమ్ముకునే దుస్తితికి  దిగజారిపోతాడు. భవాని శంకరుడు బ్రాహ్మణుడు కాబట్టి, నీళ్ళకావిళ్ళు మోస్తూ ‘తాతలనాటి క్షేత్రములు తెగనమ్మి దోసిళ్ళతో తెచ్చి ధారపోసినాను, అత్తవారిచ్చిన అంటుమామిడితోట నీవు కోరగనే  రాసి ఇచ్చినాను’ అంటూ గతాన్ని తలచుకుంటూ పద్యాలు పాడుకుంటూ వుంటాడు. ఇంతవరకు బానే వుంది సుబ్బిశెట్టి అనే పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది అని చెప్పుకున్నాము కదా!  అదే ఇప్పుడు చింతామణి నాటకాన్ని వివాదాస్పదం చేస్తోంది. చేసింది కూడా.

కాళ్ళకూరి వారు రాసిన ఉద్దేశ్యం మంచిదే అయివుండవచ్చు కానీ, కాలక్రమంలో ప్రేక్షక జనాలను ఆకట్టుకోవడం కోసం సుబ్బిశెట్టి, చిత్ర, శ్రీహరి పాత్రల నడుమ మోటు సరసం,  ముతక హాస్యం ప్రవేశపెడుతూ వచ్చారు. ఓ దశలో అది సభ్యత హద్దులు దాటిపోయి కుటుంబపరంగా చూడడం సాధ్యం కాకుండా పోయింది. కాళిదాసు కోటేశ్వరరావు అనే ఆయన సుబ్బిశెట్టి వేషం వేసేవారు.  సూరవరపు వెంకటేశ్వర్లు శ్రీహరి వేషం కట్టేవారు. నాటకాల తొలి రోజుల్లో ఆడ పాత్రలు  నటీమణులు దొరక్క  మొగవాళ్ళే ఆడవేషాలు వేయాల్సివచ్చేది.  సూరవరపువారు  హరిశ్చంద్ర’ లో కాలకౌసికుడి  భార్య కలహకంటిగా, ‘సక్కుబాయి’లో అత్తగా పెద్ద పేరు సంపాదించుకొన్నారు. కాళిదాసు, సూరవరపు కాంబినేషన్ ఎప్పుడు హద్దులు దాటలేదు.

శ్రీ రామనవమికి బెజవాడ బీసెంటు రోడ్డులో ఏటా ‘చింతామణి’ నాటకం వేసేవారు. ఆ రోడ్డులో నిజానికి ఎక్కువమంది వ్యాపారుల దుకాణాలు ఆర్య వైశ్యులవే. అరవపల్లి సుబ్బారావు అనే ఆయన సుబ్బిశెట్టి వేషం వేసేవారు. కాకపొతే, కారణాలు ఏమయినా  ఈ నాటకంలో పోనుపోను అశ్లీల సంభాషణలు, సినిమా డైలాగులు, పాటలు పెట్టి నాటకం స్తాయిని దిగజార్చారు.  ఇప్పుడు ఆర్య వైశ్య మహా సభ అభ్యంతరం చెప్పిందంటే నిజమే మరి. నాటకాన్ని నిషేధించాలా లేక  ఇటువంటి ద్వందార్ధ సంభాషణలు లేకుండా చూస్తామని, ఆపేస్తామని నాటక సమాజాలు, నటులు హామీ ఇస్తారా చూడాలి. అంత వరకు కాళ్ళకూరి వారికి క్షమాపణలు చెప్పి ‘చింతామణి’కి కొన్నాళ్ళు రెస్ట్ ఇవ్వడం మంచిదేమో!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధించిందని వార్తలు వస్తున్నాయి.

ఏదైనా వర్గపు మనోభావాలు గాయపడేలా ప్రదర్శనలు వుంటే ఇలాగే జరుగుతుంది.

నిషేధం వంటి తీవ్ర చర్య కాకుండా ద్వంద్వార్ధ సంభాషణలు లేకుండా చూస్తే బాగుండేది.



18-01-2022

 

17, జనవరి 2022, సోమవారం

తెలుగు రాజకీయ కథానాయకుడు – భండారు శ్రీనివాసరావు

 

(జనవరి  పద్దెనిమిది  ఎన్టీఆర్ వర్ధంతి)

ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.

ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.

ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు కూడా వచ్చారు.

లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి, ఖమ్మం సీపీఎం ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా. ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి కబురు వచ్చినట్టు వుంది.

ఆయన మాతో చెప్పారు.

రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్ రావు గారు, మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని కాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?”




NOTE" Courtesy Image Owner 

 

ఎవరీ స్థానికులు? – భండారు శ్రీనివాసరావు

 ఇది లోకల్ నాన్ లోకల్ వ్యవహారం కాదు. వేరే విషయం.

రోజూ టీవీ తెరలపై పాకుతూ పోతుంటాయి ఇలాంటి వాక్యాలు.
“సముద్రంలో ఈతకు వెళ్లి అయిదుగురు విద్యార్ధుల గల్లంతు. ముగ్గురిని కాపాడిన స్థానికులు”
“ఆగివున్న లారీని వెనుకనుంచి వేగంగా వచ్చి డీకొట్టిన కారు. అందులో ఇరుక్కుపోయిన ఆరుగురు ప్రయాణీకులు. అద్దాలు బద్దలు కొట్టి వారిని కాపాడిన స్థానికులు”
“ఊరి పొలిమేరల్లో చిరుత పులి సంచారం. పులి అడుగుల జాడ కనిపెట్టి అధికారులకు సమాచారం అందించిన స్థానికులు”
ఇదిగో ఇలాంటి వాళ్ళే, ఊరూ పేరూ తెలియని ఈ స్థానికులే నిజమైన త్యాగరాజులు అంటే. నిష్కామకర్ములు. ప్రచారం కోరని, ఎరుగని ధర్మప్రభువులు.
వీరెవరో ఎవరికీ తెలియదు. వారి ఫోటోలు సరే, కనీసం పేర్లు కూడా పేపర్లలో రావు. టీవీల్లో చూపించరు.
స్థానికులు. అంతే! అదే వారి పేరూ ఊరూ.
17-01-2022

16, జనవరి 2022, ఆదివారం

కవిసామ్రాట్ ఇచ్చిన కానుక – భండారు శ్రీనివాసరావు


సుమారు యాభయ్ ఏళ్ళ క్రితం ఇద్దరు కాలేజి కుర్రాళ్ళకు వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో నెగ్గినందుకు గాను  నూట యాభయ్ రూపాయలు పారితోషికంగా వచ్చాయి. అంత డబ్బుతో ఏం కొనుక్కోవాలి అనేది పెద్ద సమస్యగా మారింది. చివరికి వారిలో ఒకడన్నాడు, పుస్తకాలు కొనుక్కుందాం అని. పుస్తకాలు అంటే క్లాసు పుస్తకాలు కాదు, పెద్ద రచయితలు రాసిన గొప్ప పుస్తకాలు.

విశ్వనాధవారి వేయి పడగలయితే అన్నాడు ఇద్దరిలో ఒకడు. ఈ డబ్బుకు రెండు పుస్తకాలు వస్తాయంటావా అన్నాడు ఆ ఇద్దరిలో మరొకడు.

ఇద్దరూ కలిసి బెజవాడ మాచవరంలో ఉంటున్న కవిసామ్రాట్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి ముందు విశాలమైన ఆవరణ. వరండాలో ఓ కుర్చీలో పై పంచ లేకుండా దోవతీలో ఒకాయన, ఆయనకు దగ్గరగా  తెల్లటి వస్త్రాల్లో మరొకాయన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరిలో విశ్వనాధ ఎవరై వుంటారు?

తెల్ల ఉడుపుల పెద్దమనిషి మా ఇద్దరినీ గుర్తు పట్టాడు. పట్టి, పై ఆచ్ఛాదన లేని వ్యక్తికి పరిచయం చేశారు.

‘ఇదిగో ఈ పొడుగబ్బాయి, సన్నగా వున్నాడే వీడు ప్లీడరు తుర్లపాటి హనుమంతరావు పంతులు గారి పెద్దబ్బాయి సాంబశివరావు. ఇంట్లో శాయిబాబు అంటారు. ఈ రెండోవాడు శ్రీనివాసరావు. మా అక్కయ్య కోడలి తమ్ముడు. హనుమంతరావు పంతులుగారికి కూడా స్వయానా బావమరది’

అప్పుడు ఇద్దరిలో సన్నవాడికి లైటు వెలిగింది. ఓహో వీరు పేరాల భరత శర్మ గారు, విశ్వనాధవారి శిష్యులు అని రెండోవాడి చెవిలో ఊదాడు.

ఏం పని మీద వచ్చారు అని అడగకుండానే చెప్పాము, పోటీల్లో బహుమతి కింద ఇద్దరికీ కలిపి నూట యాభయ్ వచ్చాయని, ఆ డబ్బుతో మీ వేయి పడగలు పుస్తకం కొనుక్కుందామనే  కోరిక కలిగిందని.

‘నా పుస్తకాలు మీకు అర్ధం అవుతాయా అనేది విశ్వనాధ వారి మొదటి ప్రశ్న.

‘ఏమోనండీ అర్ధం కాకపోవచ్చు. కానీ అర్ధం చేసుకోవడానికే చదవాలని అనుకుంటున్నాం మా జవాబు.

విశ్వనాధవారి మోహంలో కనీకనపడని నవ్వు.

‘అదిగో ఆ మూల వున్నాయి. పోయి చెరి రెండూ తెచ్చుకోండి అన్నారు.

పోయి చూస్తే విశ్వనాధ వారు రాసిన ప్యాకెట్లుగా కట్టి వున్నాయి.

ఆయన చెప్పినట్టే చేసి చెప్పాము.

‘ఇందులో చాలా పుస్తకాలు ఉన్నట్టున్నాయి. మా దగ్గర నూట యాభయ్ మాత్రమే వున్నాయి అన్నాడు సాంబశివరావు అనే నా సహాధ్యాయి కూడా  మేనల్లుడు.

అప్పుడు విశ్వనాధవారు పెద్దగా నవ్వారు.

‘అర్ధం చేసుకుంటాం అన్నారు కదా! పోయి చదవండి. చదివేవారికి పుస్తకం చేరాలి. మిగిలిన పుస్తకాల డబ్బు మీ ఇద్దరికీ నా గిఫ్ట్ అనేశారు.

మహదానందంతో రెక్కలు కట్టుకుని ఇంటికి వచ్చి ప్యాకెట్ విప్పితే :

‘వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, దిండు కింద పోకచెక్క, స్వర్గానికి నిచ్చెనలు, చెలియలి కట్ట, ఏకవీర, తెఱచిరాజు, మాబాబు, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, చిట్లీచిట్లని గాజులు....’

కవిసామ్రాట్ అయ్యే. ఎంత పెద్ద చేయి అయివుండాలి మరి.   



(16-01-2022)