16, జనవరి 2022, ఆదివారం

గివ్ అప్ సబ్సిడీ

 "వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అలా  పోగుపడే బియ్యాన్ని సేకరించండి. మీ పేటలోని ఏ ఆలయంలోనైనా  ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి. చిల్లరడబ్బులను వంట చెరకుఇతర  అధరువులు కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు. నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది " కీర్తిశేషులు కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఒకనాటి అనుగ్రహభాషణ.

మనకు ఉన్న దాంట్లో, అవసరం వున్న వాళ్లను  కొంచెం ఎక్కువ కనిపెట్టి చూడడం అనేది మహాభారత కాలం నుంచి వుంది.

కౌరవులు కుట్రచేసి పాండవులను లక్కఇంట్లో కాల్చి చంపాలని చేసిన ప్రయత్నంలో, సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్న పాండవులు, కుంతీ సమేతంగా  కొంతకాలం అరణ్యవాసం చేసి, తర్వాత ఏకచక్రపురం చేరుకొని  బ్రాహ్మణ వేషాలతో  తిరుగుతూ యాచన ద్వారా సమకూరిన భోజన పదార్ధాలను తల్లి కుంతీదేవికి తెచ్చి ఇస్తుంటారు. తల్లి మనసుకు భీముడి తిండిపుష్టి తెలుసు కనుక, తెచ్చిన వాటిని రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని భీమసేనుడికి, మిగిలిన సగభాగాన్ని తనకు, నలుగురు అన్నదమ్ములకు పంచి ఇచ్చేదని  పౌరాణికులు చెబుతూ వుంటారు. సరే ఇది పక్కన పెడితే.      

మీరు సంపన్నులు. ప్రభుత్వం వంటగ్యాసు సిలిండర్ పై ఇచ్చే సబ్సిడీ మీకు అవసరంలేదు. దేశంలో అందరూ మీలా సంపన్నులు కారు. కట్టెలపొయ్యి ముందు కూర్చుని, పొగచూరిన కళ్ళతో ఇంటిల్లిపాదికీ వంట చేసిపెట్టే పేద తల్లులకు ఈ దేశంలో కొదవ లేదు. వారి కష్టాలు తీర్చాలంటే మీరు కొంత త్యాగం చేయాలి. చేయాలి అంటే  గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓ పేద కుటుంబానికి వంటగ్యాసు సదుపాయం లభిస్తుంది. దయచేసి ఈ పుణ్యం కట్టుకోండి

నరేంద్రమోడీ ప్రధాన మంత్రి పదవిని స్వీకరించిన కొత్తల్లో  దేశంలోని సంపన్న వర్గాలకు చేసిన విజ్ఞప్తి ఇది.

ఎప్పుడో దశాబ్దాల క్రితం పరమాచార్యుల వారు, ఏడేళ్ల క్రితం నరేంద్ర మోడీ చేసిన ఈ వినతులకు సంపన్నవర్గాల నుంచి  లభించిన స్పందన అంతంత మాత్రమే కావడం విచిత్రం.

దీనికి ప్రధాన కారణం మానవ మనస్తత్వం, ముఖ్యంగా మధ్య తరగతివారి ఆలోచనా ధోరణి. ఈ మధ్య తరగతి వారిలో ఎగువ, దిగువ అని మరో రెండు రకాలు ఉన్నప్పటికీ, మనస్తత్వం మాత్రం ఒక్కటే.

పేరుకు సబ్సిడీ అయినా వంట గ్యాస్ ధరపై ఈ సబ్సిడీ రూపంలో వినియోగదారుడికి చెల్లు పడుతోంది చాలా చాలా తక్కువ మొత్తం. ఇళ్ళల్లోవాడే గ్యాస్ సిలిండర్ తాజా ధర 908 రూపాయలు కాగా , సబ్సిడీ కింద బ్యాంకు ఖాతాలో తనకు జమ చేసింది కేవలం   3.95 రూపాయలు మాత్రమే అనే పోస్టు సాంఘిక మాధ్యమాల్లో చూశాను.  సిలిండర్ మోసుకుని ఇంటికి తెచ్చిన వాడికి ఇచ్చే బక్షీసు ఇరవై వుంటుంది. ఒక్క  నాలుగు రూపాయల కోసం సబ్సిడీని వదులుకోలేని మనస్తత్వం ప్రజలది. ఇందుకు ఈ రచయిత కూడా మినహాయింపు కాదు. దేన్నీ తేలిగ్గా వదులుకోలేని తత్వం ఇందుకు కారణం. పైగా సబ్సిడీ వదులుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగనక్కరలేదు. చేతిలో వున్న మొబైల్ లో గివ్ ఇట్ అప్ అనే ఒక బటన్ నొక్కితే చాలు. సబ్సిడీకి మంగళం పాడవచ్చు.  

క్లిష్టతతోకూడిన విషయం కనుక కొన్ని గణాంకాలు ఉదహరించక తప్పడం లేదు.

దేశం మొత్తంలో సబ్సిడీ వంట గ్యాస్ ఉపయోగించే వినియోగదారులు సుమారు ఇరవై ఎనిమిది కోట్ల మంది వున్నారు. వీరిలో కోటిన్నరమంది వార్షిక ఆదాయం పది లక్షల రూపాయలు ఉన్నందున వారికి సబ్సిడీ వర్తించదు. పొతే, మిగిలిన ఇరవై ఆరుకోట్ల పైచిలుకు వినియోగదారులు సబ్సిడీకి అర్హులు. మళ్ళీ వీరిలో మరో పద్దెనిమిది కోట్ల మందికి ఎలాంటి సబ్సిడీ అందడం లేదు. సబ్సిడీ సిలిండర్ ధరకు, మార్కెట్ ధరకు మార్కెట్లో పెద్ద వ్యత్యాసం లేకుండా పోవడం ఇందుకు కారణం అంటున్నారు. దీన్నిబట్టి చూస్తే భవిష్యత్తులో ఇక గ్యాస్ సబ్సిడీలు ఉండకపోవచ్చు. మనకు తెలియకుండానే అవి దూరం కావచ్చు.

అయితే ఇలా ఆదా అయిన మొత్తాన్ని(ఇరవై వేల కోట్ల రూపాయలు అని అంచనా) కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పధకాలకు మళ్లిస్తోంది. అక్షరాలా తొమ్మిది వేల ఏడువందల కోట్ల రూపాయల పై చిలుకు మొత్తాలను దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది పేద వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం కూడా జరిగిపోయింది. కోవిడ్ సంక్షోభంలో దెబ్బ తిన్న పేదలకు మూడు ఉచిత వంట  గ్యాస్ సిలిండర్లు ఇచ్చే నిమిత్తం ఈ మొత్తాన్ని వినియోగించారు.      

 

నిజమే. అభివృద్ధి చెందుతున్న  దేశాల్లో సబ్సిడీలు తప్పనిసరి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ సబ్సిడీ విధానం అమల్లో వుంది. ఎందుకంటె పెరిగే సంపద సక్రమంగా అన్ని చోట్లా సమానంగా పెరగదు. సంపన్నత పెరిగే కొద్దీ సమాజంలో అసమానతలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తాయి. వృద్ధాప్యంఅనారోగ్యం మొదలయిన అంశాలు వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపుతాయి. అంచేతే సిరి సంపదలు పుష్కలంగా వున్న దేశాల్లో కూడా ఆహార సబ్సిడీలుఆరోగ్య సబ్సిడీలు  ఘనంగానే ఉంటున్నాయి. కాకపోతే సబ్సిడీల విషయంలో ఆయా  దేశాల ప్రజలు స్వచ్చందంగా  పాటించే కొన్ని నియమ నిబద్ధతల కారణంగా అవి దుర్వినియోగం కావడం లేదు. సంపన్నులయినవాళ్ళు సబ్సిడీలకోసం ఆరాటపడని మంచి  సమాజాలను వారు సృష్టించుకున్నారు. సంక్షేమ పధకాలకోసం ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు సంపన్నులకోసం కాకుండా ఆపన్నులకోసం ఖర్చు చేయాలని ఆశించేవారు ఆదేశాల్లో అధికంగా వుండడం దీనికి కారణం. మన దేశంలో పరిస్తితి దీనికి పూర్తిగా భిన్నం. సబ్సిడీ బియ్యం నుంచి  ఆరోగ్యశ్రీ కార్డు వరకు ఇదే తంతు. అన్ని రకాల సబ్సిడీలు ఆదాయాలతో నిమిత్తం లేకుండా తమ ఒళ్ళో వచ్చి పడాలని కక్కుర్తిపడేవారే ఎక్కువ.

మరో విచిత్రం అయిన విషయం ఏమిటంటేఉత్పత్తి ఖర్చుకంటే అనేక వందల రెట్లు అమ్మకం ధర వుండే వస్తుసామాగ్రి కొనడానికి పరుగులు తీసే వారే సబ్సిడీ ధరలకు ప్రభుత్వం అన్నీ సరఫరా చేయాలని పట్టుబడుతుంటారు. సబ్సిడీ తగ్గించినప్పుడల్లా నానా  కాకి గోల  చేస్తుంటారు.

ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రభుత్వాలు  కొన్ని  కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పుకాదు. అయితే అటువంటి నిర్ణయాల అమలు ప్రభుత్వాధినేతల నుంచే మొదలు కావాలి. పొదుపు చేయండని పిలుపు ఇచ్చేవాళ్ళు దాన్ని ఆడంబరంగా చేయకూడదు. వాటి ప్రచారానికి అట్టహాసంగా ఖర్చు చేయకూడదు. ‘సబ్సిడీ వదులుకోవాలని  పిలుపు బడా నాయకుల ఇళ్ళల్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వాడడం లేదుఅనే విషయం  తెలుసుకోగోరే వారుంటే, అలాటి వారిని అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా అలాటి సందేహాలను నివృత్తి చేయగలిగితే మరింత బాగుంటుంది కూడా.

గతంలో లాల్ బహదూర్ శాస్త్రి  ప్రధాన మంత్రిగా వున్నప్పుడు దేశంలో ఏర్పడ్డ తిండిగింజల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ప్రతి సోమవారం ఒక పొద్దు మాత్రమే భోజనం చేయాలని ఇచ్చిన పిలుపుకు అపూర్వ స్పందన లభించింది. ఎందుకంటె ఆయన ఆ నియమాన్ని అయన  బతికున్నంతవరకు పాటించారు.

తమ భవిష్యత్తు గురించి ఆలోచించే  రాజకీయ నాయకులు దేశంలో  పుష్కలంగా వున్నారు. రేపటి గురించి, జాతి భవిష్యత్తు గురించి  ఆలోచించే రాజనీతిజ్ఞులే క్రమంగా కనుమరుగయిపోతున్నారు.

ఇదొక విషాదం.

తోకటపా: ఇది రాస్తున్నప్పుడు మా అపార్ట్ మెంటు గ్రూపు మెసేజ్ వచ్చింది. ఇరవై లీటర్ల మంచి నీళ్ళ కోసం ఆధార్ ఇవ్వాలని, వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చారని. అందరూ బిలబిలమని వెళ్ళారు. దేశం సర్వనాశనం కావడానికి ఫ్రీ బీస్ ప్రధాన కారణమని వీళ్ళే మళ్ళీ పోస్టులు పెడుతుంటారు.

రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న లేదా ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు అన్నీ అర్హులకు అందినంతవరకు అంత అనుచితమైనవి ఏవీ కావు. ఇందుకోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీ వాడుకుంటే  నిధులు పక్కదారి మళ్ళడం అంటూ వుండదు.

 

 

15, జనవరి 2022, శనివారం

నన్ను కోటీశ్వరుడిని చేసిన జెమినీ టీవీ - (పాత జ్ఞాపకం) - భండారు శ్రీనివాసరావు

 

ఈ రంగుల బెడదతో  నేనూ ఓసారి ఇబ్బంది పడ్డాను. జెమినీ టీవీలో జర్నలిస్టు శాయి ఎడిటర్ గా వున్నప్పుడు ప్రతి వారం ఒక రోజు వెళ్ళేవాడిని. జెమినీ వాళ్ళు ఆ ఒక్కరోజు నన్ను కోటీశ్వరుడిని చేశారు.

దాదాపు నలభయ్ ఏళ్ళయింది కోటు వేసుకుని. అదీ మాస్కో చలికోసం.

మళ్ళీ ఇన్నాల్టికి ఓ టీవీ పుణ్యమా అని కోటు వేసుకోవాల్సిన పని పడింది. బ్లూ మాట్ నేపధ్యంలో బ్లూ కలర్ అక్కడ నిషిద్దం. మామూలుగా షూట్ చేసే స్టూడియో కాకుండా వేరే స్టూడియోలో చర్చ పెట్టడం వల్ల నేను వేసుకున్న బ్లూ కలర్ బుష్ షర్ట్ అక్కడి కెమెరా కంటికి బొత్తిగా నచ్చలేదు. అంచేత అప్పటికప్పుడు వాళ్ళ వాడ్రోబ్ నుంచి ఒక కోటు తెచ్చి నాకు కప్పారు. చలికాలం బాగానే వుంది కానీ మాట్లాడింది రైతుల ఆత్మహత్యల మీద. ఆ చర్చాంశానికి ఈ కోటు అవతారం బొత్తిగా పొసగదని నాకనిపించింది. కానీ ఏం చేస్తాం విధికి తలవంచక తప్పలేదు.

అదృష్టం ఏమిటంటే మా ఆవిడ ఇటువంటి చర్చలు బొత్తిగా చూడదు. లేకపోతే ఈ చొక్కా మార్పిడి వ్యవహారం మా ఇంట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యేది. మనలో మాట. ఆవిడ ఈ ఫేస్ బుక్ వైపు కూడా కన్నెత్తి చూడదు. (చూసేది కాదు) అదన్నమాట.



(15-01-2022)

రంగులో ఏముంది? – భండారు శ్రీనివాసరావు

 ప్రముఖ నటుడు చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోఃన రెడ్డిని కలుసుకున్నప్పుడు ముఖ్యమంత్రి చిరంజీవికి  మర్యాదపూర్వకంగా కప్పిన శాలువ రంగుపై కొంత చర్చ నడిచింది. ఆ శాలువా రంగు పసుపు రంగు కావడం ఈ చర్చకు కారణం. అలాగే ఫేస్ బుక్ లో చంద్రబాబుకు అనుకూలంగా రాసే ఓ రచయిత/విశ్లేషకుడు సంక్రాంతి పండుగ సందర్భంగా ధరించిన దుస్తుల రంగు నీలి వర్ణం అని మరో మిత్రుడు చెప్పారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీని ఓడించి  కాంగ్రెస్ నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చారు. తొలిరోజుల్లో  దూరదర్సన్ ద్వారా ఇవ్వాల్సిన ఒక  సందేశం ప్రతిని ప్లాస్టిక్ ఫోల్డర్ లో  తీసుకువెళ్లి సీఎం పేషీ అధికారికి ఇచ్చాను. ఆయన ఎగాదిగా చూసి,  ‘శ్రీనివాసరావు గారూ! ప్రభుత్వం మారిన సంగతి మీరింకా గుర్తించినట్టు లేదు అన్నారు. ఎందుకు ఇలా అన్నారని పరకాయించి చూస్తే ఆ ప్లాస్టిక్ ఫోల్డర్ రంగు పసుపు రంగు.

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకి నీలి రంగు వేయడం మీద చెలరేగిన  వివాదం ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలుసు.

నిజానికి పసుపు రంగు అనేది తెలుగు దేశం ఆవిర్భావానికి ముందు నుంచి వుంది. అలాగే నీలి రంగు వైసీపీ పుటకకు ముందు నుంచీ వుంది. మరి ఎందుకీ వర్ణ వివక్ష!

మనం పెట్టుకున్న కళ్ళజోడు రంగుబట్టి  మనకు కనబడే రంగు వుంటుంది.



(15-01-2022)  

పల్లెకు పోదాం చలో చలో


(రెండు రోజుల సంక్రాంతి సంబరాలన్నీ మూడు నిమిషాల వీడియోలో)



14, జనవరి 2022, శుక్రవారం

ఆధ్యాత్మిక ప్రవచనాలకు మారుపేరు మల్లాదివారు – భండారు శ్రీనివాసరావు

 ‘నా మొదటి ప్రవచన కార్యక్రమానికి హాజరై విన్నది ఇద్దరు అంటే ఇద్దరే

ఈరోజు శుక్రవారం నాడు హైదరాబాదులో తన తొంభయ్ ఆరో ఏట  మరణించిన  ప్రసిద్ధ ప్రవచనకారులు, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఒక కార్యక్రమంలో  స్వయంగా వెల్లడించిన విషయం.

మల్లాది వారి ప్రవచనం వుందని తెలిస్తే వేలాదిమంది విరగబడి హాజరయ్యే స్థితికి చేరుకున్న తర్వాత అత్యంత వినయంతో శాస్త్రి గారు ఈ మాట చెప్పారని నా రేడియో సహోద్యోగి  ఆర్వీవీ కృష్ణారావు గారు నాతొ  కొద్దిసేపటి క్రితం ఫోన్లో మాట్లాడుతూ  గుర్తుచేసుకున్నారు.

భగవంతుడి ఆదేశమో ఏమో తెలియదు రామాయణ, భారతాలను గురించి ప్రవచనాల ద్వారా ప్రజాబాహుళ్యానికి తెలపాలని ఆయన చిన్న వయసులోనే ఆసక్తి పెంచుకున్నారు.

ఒకానొక సందర్భంలో శాస్త్రిగారు ఆ విషయాలను గురించి ఇలా ప్రస్తావించారు.

‘ రేకు పెట్టెలో ఓ జత పంచెలు, కండవలు పెట్టుకుని బస్ స్టాండ్ కి వెళ్ళేవాడిని. దొరికిన బస్సు, అది ఎటు పోతుందో కూడా చూడకుండా ఎక్కేసి, అది ఆగిన చోట దిగిపోయేవాడిని. ఆ వూర్లో గుడి ఎక్కడ వుందో వాకబు చేసుకుని వెళ్ళేవాడిని. అక్కడే అరుగుమీద కూర్చుని సాయంత్రాలు ప్రవచనాలు మొదలు పెట్టేవాడిని. జనాలకు బుర్రకదల మీద, నాటకాల మీదా వుండే అనురక్తి ప్రవచనాలపై ఉంటుందని అనుకోలేము. అయినా అలా పట్టు వదలకుండా ఊళ్ళు తిరుగుతూ ప్రవచనాలు చెబుతూ ఉండేవాడిని. క్రమంగా ప్రజలకు వీటిపట్ల అనురక్తి పెరగడం మొదలయింది. అలా జీవితం చాలించేవరకూ  ప్రవచనాలు చెబుతూ ఉండాలనేది నా కోరిక. ఆ భగవంతుడి అభీష్టం ఎలా వుంటుందో తెలవదు

మల్లాది వారికి బాచంపల్లి సంతోష్ శాస్త్రి గారు ప్రియ శిష్యులు. వారు ఎక్కడ ప్రవచనాలు చెప్పినా  గురుచరణులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శిష్యుడనని మొదట్లోనే చెప్పి ప్రారంభించేవారు అని కృష్ణారావు గారు చెప్పారు. ఒకసారి రవీంద్ర భారతిలో ఉగాది పంచాంగ శ్రవణం. అందులో పాల్గొంటూ, ఒకనాడు నా గురుదేవులు మల్లాది వారు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించడం అంటే నా జీవితం ధన్యమే’ అన్నారు సంతోష్ కుమార్ శాస్త్రి గారు.

‘సంతోష్ నా శిష్యుడే. గురువు శిష్యుడిని  ఎలా చూడాలని కోరుకుంటాడో సంతోష్ కుమార్ శాస్త్రి అలానే తయారయ్యాడు అని శాస్త్రిగారు కూడా  సగర్వంగా చెప్పుకునేవారు.

ఆధ్యాత్మిక ప్రవచనాల ప్రభావమో ఏమో కాని మల్లాది వారికి ఎటువంటి ఆరోగ్యసమస్యలు ఎదురుకాలేదు. ఒకసారి ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు గారు ఓ సందర్భంలో శాస్త్రిగారి ధాతుపుష్టి గురించి చెప్పారట.

అశోక్ నగర్ లోని వారి ఇంటికి సాయంత్రాలు ఎవరు వెళ్ళినా ఓ పెద్ద వెండి పళ్ళెం నిండా అరటికాయ బజ్జీలు తెచ్చి పెట్టేవారట. తాను తింటూ వచ్చిన వారిని కూడా తినమని అంటుండేవారట. అప్పటికే వారి వయసు ఎనభయ్ దాటింది.

శాస్త్రి గారికి సద్గతులు కలగాలని కోరుకోనక్కర లేదు. ఎందుకంటే ధారావాహికంగా వేలాది ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏళ్ళ తరబడి చెబుతూ వచ్చిన మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారికోసం ఆ సద్గతులే ఎదురు చూస్తుంటాయి. ఇది తద్యం.



ఈరోజు (15-01-2022) సాక్షి దినపత్రికలో ప్రచురితం)




(14-01-2022)        

 

 

వివాహత్పూర్వం

 నలుగురిలో వున్నప్పుడు ఉన్న రెండు చెవుల్లో ఓ చెవి అటు పడేస్తే కొత్త విషయాలు తెలుస్తాయి.

దేవరకొండ నరసింహశాస్త్రి గారు అనే పౌరోహితుడు  మా బంధువుల ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టడానికి వచ్చి ఓ శ్లోకం చదివారు.

“కన్యా వరయతే రూపం

మాతా విత్తం, పితా శ్రుతం

బాంధవాః కులమిచ్చంతి

మృష్టాన్న హితవే జనాః”

శాస్త్రిగారి మాటల్లో దీని భావం ఏమిటంటే పెళ్లి కావాల్సిన వధువు, కాబోయే  వరుడిలో అందచందాలను, అతడి రూపలావణ్యాలను చూస్తుంది. వధువు తల్లి విత్తం అంటే వరుడి కుటుంబం తాలూకు ఆర్ధిక స్థితిగతులను, ఆ ఇంట్లో తన కూతురు సుఖపడగలుగుతుందా అనే విషయాలను  పరిశీలిస్తుంది. వరుడి తండ్రి శ్రుతం అంటే వరుడి చదువు సంధ్యలు, విద్యార్హతలు, ఉద్యోగం మంచి చెడులు గురించి ఊళ్ళో నలుగురు ఏమనుకుంటున్నారు అనే విషయాలను జాగ్రత్తగా గమనిస్తాడు. వధువు తరపు బంధువులు ఈ సంబంధం గురించి చెప్పగానే కులం (అంటే ఇక్కడ సాంప్రదాయం అని అర్ధం, కులం కాదు) ఆచారవ్యవహారాలు (స్వశాఖీయం, పరశాఖీయం) మొదలైనవి చూస్తారు. పొతే, ఇక ఇరుగుపొరుగు  జనాలు మాత్రం  ఆ పెళ్ళిలో భోజనం ఏర్పాట్లు ఎలా వున్నాయి, పదార్ధాలు ఎలా వున్నాయి  అనే అంశం గురించి మాట్లాడుకుంటారు.

శాస్త్రి గారు చెప్పేది ఏమిటంటే చివరివి రెండూ అంత ప్రధానమైనవి కావు కాబట్టి  ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలని.

నాదీ, మా పిల్లలవీ పెళ్లి చూపులు, పెళ్లి మాటలు లేని పెళ్ళిళ్ళు కనుక నాకీ విషయాలు కొత్తగానే అనిపించాయి.


NOTE: COURTESY IMAGE OWNER


 

సంక్రాంతికి సొంతూరుకు – ఓ జ్ఞాపకం

 పండక్కి సొంత ఊరుకు వెళ్లాలని ఎంతగా వున్నా కాచుకుని ఉన్న కరోనా భూతం ముందరి కాళ్ళకు బంధాలు వేసింది. అందుకే ఎప్పటి అనుభవాలనూ నెమరు వేసుకుంటూ తృప్తి పడడమే మిగిలింది.

నాలుగేళ్ల క్రితం సంక్రాంతికి సొంతూరుకు వెళ్ళాలనే అభిలాషతో హైదరాబాదులో ఉంటున్న మా కుటుంబ సభ్యులం  అందరం నాలుగు కార్లలో ఉదయమే బయలుదేరి మా వూరు కంభంపాడుకు బయలుదేరాము. టోల్ గేట్ల వద్ద కూడా ఎక్కువ ఆలస్యం కాకుండానే బయటపడ్డాము. మేమే కాకుండా ఖమ్మం, రెబ్బారం, పెనుగంచిప్రోలు నుంచి కూడా చిన్నా పెద్దా యాభయ్, అరవై మందిమి మా వూరికి సంక్రాంతి అతిధులం.

ఆ రాత్రి అక్కడ నిద్ర చేసాం. అర్ధరాత్రి వరకు ఆడవాళ్ళు అందరూ రంగవల్లులు దిద్దుతూనే వున్నారు. ఎంత ఓపికో వారికి.

తెలతెలవారవస్తోంది. పక్కన శివాలయం మైకులోంచి బాలసుబ్రమణ్యం శివస్తుతి బిగ్గరగా వినవస్తోంది. ఇల్లు ఇల్లంతా నిద్ర పోతున్నవారితో నిండిపోయివుంది. ఊరేలా మారిందో కళ్ళారా చూడాలనే కోరిక చలిని జయించింది. నిద్ర మంచం మీద నుంచి లేచి వీధిలో కాలుపెట్టాను. వూళ్ళో వున్నవే మూడు వీధులు. అవన్నీ ముగ్గుల దుప్పట్లు కప్పుకుని కానవచ్చాయి.

చిన్నప్పుడు తిరిగిన వీధుల్లో నడుచుకుంటూ చెరువు గట్టుకు చేరాను. మంచినీళ్ళ బావికి వున్న ఇనుప గిలకలు పూర్వపు ఔన్నత్యానికి గుర్తుగా మిగిలివున్నాయి. మోటారు పెట్టి నీళ్ళు తోడి ఊరి నడుమ నిర్మించిన మంచినీళ్ళ  ట్యాంకును నింపుతూ వుండడం వల్ల  ఆ గిలకల ఉపయోగం లేకుండా పోయింది. చెరువు గట్టు మీద జేసీబీలు, ట్రాక్టర్లు ఇంకా భారీ యంత్రాలు కానవచ్చాయి. గట్టును వెడల్పు చేసి గట్టి పరచడం కోసం ఒక వైపున ఇరవై అడుగుల రిటైనింగ్ వాల్ నిర్మాణంలో వుంది. లింగాల నుంచి కంభంపాడు వరకు నిర్మాణం పూర్తయిన అరవై అడుగుల వెడల్పు రహదారిలో ఇదొక భాగం. వాటిని చూస్తూ గట్టు చివరివరకు పోయి తిరిగి వస్తుంటే చలి కోటు కప్పుకున్న ఒక మనిషి ఎదురు పడ్డాడు. తెల్లటి తొలివెలుగులో నల్లటి రూపం కనిపించింది. తాగుతున్న బీడీ విసిరివేసి నా మొహంలోకి తేరిపారచూసాడు. ‘మీరు కరణంగారి తమ్ముడు కదూ’ అన్నాడు. ఇన్నేళ్ళ తరవాత కూడా వూళ్ళో నన్ను గుర్తు పట్టేవాళ్ళు వున్నారని సంతోషించాను. ‘నాకు తెలిసిపోయింది, మీరు భండారు శ్రీనివాసరావు గారు’ అనేశాడు ఇంటిపేరులో ఉన్న ‘భ’ ని ఒత్తిపలుకుతూ.

మిమ్మల్ని సాక్షి టీవీలో చూస్తుంటాను’ అన్నాడు మరే టీవీలో కనబడనట్టు. ‘మీకు గుర్తుందో లేదో నేను, యేసు రత్నాన్ని. మీ అన్నయ్య గారితో కలిసి చదువుకున్నాను, మీ ఇంటికి వచ్చేవాడిని, అయినా మీరు వూళ్ళో ఎప్పుడు వున్నారు కనుక’ అని కూడా ముక్తాయించాడు.

నేనిక్కడ వాచ్ మన్ని. ఇవిగో వీటన్నిటినీ నేను కనిబెడుతుండాలి’ చెప్పాడు గట్టు మీది యంత్రాలను గర్వంగా చూపెడుతూ.

ఇన్ని ఏళ్ళ తరువాత గుర్తు పట్టిన ఆ పెద్దమనిషిని గుర్తు పెట్టుకునే ఫోటో తీసుకోవాలని అనిపించింది. తీసే వాడు ఎవరా అని ఆలోచిస్తుంటే ఒక ట్రాక్టరు కింద నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు.

రాం సింగ్. వీళ్ళది జార్ఖండ్. జేసీబీ పనిచేస్తాడు.’ అని పరిచయం చేసాడు యేసు రత్నం. ఆ జార్ఖండ్ కుర్రాడు మా ఇద్దర్నీ ఫోటోలు తీశాడు. వాళ్లకి థాంక్స్, సంక్రాంతి శుభాకాంక్షలు జమిలిగా చెప్పేసి మళ్ళీ ఊళ్ళోకి వచ్చాను. దగ్గరలోనే మునసబు మల్లయ్య గారిల్లు. ఇప్పుడు లేరు. ఆయన కొడుకు ప్రతాప్ ఆ ఇంట్లో ఉంటున్నాడు. చాలా ఏళ్ళ క్రితమే, వూళ్ళో ఉన్న ఇతర ఖామందుల ఇళ్ళకు భిన్నంగా రెండతస్తుల భవంతి కట్టించాడు. ఇప్పుడు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ లో కనబడే పెద్ద పెద్ద అధునాతన భవనాలవంటివి నా గ్రామ సందర్శనలో రెండు మూడు కనిపించాయి.

వాసిరెడ్డి జమీందారు కట్టించిన గుడికి మా వంశస్తులు ధర్మకర్తలు. భక్తి ఉన్న చోట సంపద వర్ధిల్లుతుందో, ధనధాన్యాలు సమృద్ధిగా వుంటే భక్తిప్రపత్తులు పెరుగుతాయో తెలియదు కానీ చాలాకాలం నిత్య ధూపం కూడా గగనం అనుకున్న ఆ గుడి పరిస్తితి ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది. దానికి దాపుల్లోనే మరో దేవాలయం రూపుదిద్దుకుంది. మరో రెండు నెలల్లో విగ్రహ ప్రతిష్ట అంటున్నారు. ముందు ముందు మా గ్రామానికి ఒక చక్కటి ఆకర్షణ కాగల ఈ రామాలయాన్ని చావా నరసింహారావనే పెద్దమనిషి నిర్మిస్తున్నారు. ఇప్పటిదాకా యాభయ్ లక్షలు అయ్యాయట.

ఇక మా ఇంట్లో సందడే సందడి. నగరాల్లో పుట్టి పెరిగిన కోడలు పిల్లలు కొంగులు దోపుకుని అర్దరాత్రివరకు మేలుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చి దిద్దారు. మర్నాడు అందరం కలిసి వెళ్లి ఎస్సీ కాలనీలోని మా రెండో అన్నయ్య ధర్మకర్తగా ఉన్న పూర్వీకుల శివాలయాన్ని, మా తోటలో మామూడో అన్నయ్య వెంకటేశ్వరరావుగారు నిర్మించిన మా ‘అమ్మా నాన్నల గుడి’ని దర్శించాము. ఆ పక్కనే మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు, మూడో అన్నయ్య వెంకటేశ్వరరావు గార్ల స్మారక స్తూపాలు వున్నాయి. చుట్టూ పచ్చటి చేలు. పిల్లల హడావిడి చెప్పతరం కాదు. పెద్దవాళ్ళు కూడా వయసు మరిచి పోయి మొక్కజొన్న చేలో కలయతిరుగుతూ ఫోటోలు దిగారు. రేగుపళ్ళు ఏరుకుని తిన్నారు.

వూళ్ళో ఉన్న రెండు రోజులు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని, కొత్త జ్ఞాపకాలను మూటగట్టుకుని మళ్ళీ అందరం కార్లెక్కి హైదరాబాదు రోడ్డెక్కాము.

మొత్తానికి పెద్దలకూ, పిల్లలకూ మంచి ఎనర్జీ టూర్!



(2018)