(Published in Andhra Prabha on 02—1-2022, SUNDAY)
2, జనవరి 2022, ఆదివారం
గుర్తింపుకో గుర్తింపు కార్డు – భండారు శ్రీనివాసరావు
1, జనవరి 2022, శనివారం
అలవాటులేని ఔపోసనం – భండారు శ్రీనివాసరావు
మాది, అంటే
నాది మా ఆవిడది (కలిపి) గుళ్ళో పెళ్లి.
1971 డిసెంబరు 16 వ తేదీన తిరుపతిలో ‘Simple than the word simple’ గా జరిగింది. మరి ఆ పెళ్లి సంగతి నలుగురికీ తెలియడం ఎల్లా? ఈ ఆలోచనే నన్ను మొదటి సారి ‘గ్రీటింగ్ కార్డు’ ఐడియా దిక్కుగా అడుగు వేయించింది. గ్రీటింగ్ కార్డుల పేరుతొ డబ్బులు
తగలేయడం వృధా అని అప్పటివరకు అనుకుంటూ ఉండేవాడిని.
తిరుపతి నుంచి రాగానే ముందు బెజవాడ గవర్నర్ పేట లోని వాణీ ప్రెస్ కి
వెళ్లి, నా పేరూ, మా
ఆవిడా పేరూ కలిపి ఓ వంద గ్రీటింగు కార్డులు ప్రింటు
చేయించాను. చుట్టపక్కాలకి వాటిని పోస్ట్ చేస్తున్నప్పుడు మరో బ్రిలియంట్ ఐడియా
మనసులో మెదిలింది. ముందూ వెనుకా చూడకుండా దాన్ని
వెంటనే ఆచరణలో పెట్టేసాను. పనిలో పనిగా ఆఫీసులో నా తోటి సిబ్బందికి కూడా ఆ
చేత్తోనే గ్రీటింగు కార్డులు పోస్ట్ చేసాను.
జనవరి ఒకటో తేదీ రానే వచ్చింది. నేను
పనిచేసే లబ్బీపేట ఆంధ్రజ్యోతి ఆఫీసుకి వెళ్లాను. మొదటి
అంతస్తులో గుర్రపు నాడా ఆకారంలోని బల్ల చుట్టూ సబ్ ఎడిటర్లం అందరం కూర్చునే వాళ్ళం. మధ్యలో న్యూస్ ఎడిటర్ వీరభద్రరావు గారు, ఆ దాపునే అసిస్టెంట్ ఎడిటర్ తుర్లపాటి కుటుంబ రావు గారు, ఆ పక్కనే ఇంచార్జ్ ఎడిటర్
నండూరి రామ్మోహన రావు గారు, సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబు గారు ఇలా అందరం కూర్చుని వున్న సమయంలో అటెండర్ నాగేశ్వరరావు నా
దగ్గరకు వచ్చి పలకరించాడు.
‘ఇన్నేళ్ళుగా ఈ ఆఫీసులో పనిచేస్తున్నాను. ఒక్కరంటే ఒక్కరు కొత్త ఏడాది
శుభాకాంక్షలు చెప్పిన పాపాన పోలేదు. మీరు నిజంగా గ్రేట్. ఏకంగా గ్రీటింగు కార్డే నా పేరు మీద పోస్ట్ చేసారు. చాలా చాలా థాంక్స్ అండీ’ అన్నాడు, అందరూ వింటుండగా. అందరూ నా వైపు గుర్రుగా చూసినట్టు అనిపించింది. ఇంతమంది వుంటే అందర్నీ కాదని ఆఫీసులో పని చేసే అటెండర్ కి గ్రీటింగ్ కార్డా అన్నట్టు చూసారు. మర్నాడు పరిస్తితి పెనం మీద నుంచి
పొయ్యిలో పడ్డట్టు అయింది. పోస్టల్ వాళ్ళ పుణ్యమా అని, నేను పోస్ట్ చేసిన కార్డులన్నీ లెక్క
పెట్టినట్టు రోజుకొక్కటి చొప్పున ఒక్కొక్కరికి, అదీ అడ్డదిడ్డంగా రావడం, రానివాళ్ళు
నా వైపు మరోసారి అదోలా చూడడం ఇదంతా ఇబ్బందిగా మారింది. కార్డు వచ్చిన వాళ్ళు కూడా, విషయం తెలిసి, మళ్ళీ పోస్ట్ చేసి వుంటాడు కానీ మన మీద అతగాడికి అంత కారిపోయే ప్రేమ లేదని పరోక్షంలో గొణుక్కున్నారేమో తెలవదు. కానీ ఆ ఫీలింగు మాత్రం నన్ను పట్టుకుంది. వారం
పది రోజులు ఇలా ఇదో సీరియల్ లాగా సాగింది. ‘చక్కటి కవిత్వం రాసాడు’ అని
మెచ్చుకుంటారని అనుకుంటే సీను కాస్తా రివర్స్ అయింది.
గ్రీటింగు కార్డు ‘గ్రివింగ్ కార్డు
అవడం అంటే ఏమిటో తెలిసివచ్చింది.
అంతే! నేను మరుసటి ఏడు నుంచి మళ్ళీ నా
పాత పద్ధతికి మళ్ళిపోయాను.
గ్రీటింగులు అందుకోవడమే కానీ పంపే
పద్ధతికి స్వస్తి చెప్పాను.
పాపీ చిరాయు – భండారు శ్రీనివాసరావు
‘మీ పుట్టిన రోజున ఏ పనీ పెట్టుకోకండి. ఆ రోజున పనికట్టుకుని వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. అదొక్కటే నేనిచ్చే సలహా’
ఓ పాతికేళ్ళక్రితం డాక్టర్ ప్రసాద్ గారు చెప్పిన మాట.
ఆ మాట ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసిన మాట కూడా
నిజం.
మళ్ళీ ఇన్నాల్టికి, ఈరోజు అంటే సాలు ఆఖరు రోజున ఆ మాట గుర్తుకు
వచ్చింది. డెబ్బయి అయిదేళ్ళ వయస్సులో వింటే పోలా అని ఆ వయసే చెప్పింది.
వెంటనే ఈరోజు పొద్దున్నే లేచి మా ఇంటికి ఆటోకు
దూరం,
నడక్కి దగ్గరగా వుండే విజయ డయాగ్నస్టిక్ సెంటర్ కి వెళ్లాను.
మా ఆవిడ వున్నప్పుడు అక్కడకి తరచూ వెడుతుండే
వాడిని. అందరూ తెలిసిన వాళ్ళే. ఒక్కరే వచ్చారేం అన్నప్పుడు మనసు కలుక్కుమంది.
ఎలాగూ ఫాస్టింగ్ టెస్ట్ కు వచ్చాను కదా అని అన్ని
రకాల టెస్టులు చేయించి ఇంటికి వచ్చాను.
సాయంత్రానికి రిపోర్టులు నెట్లో వచ్చాయి. మా డాక్టర్ కామేశ్వర రావుకి
పంపితే ఎక్సలెంట్ అని మెసేజ్ పెట్టాడు.
షుగర్ ఫాస్టు, పోస్టు, బీపీ.
క్రియాటి నైన్, సీయుయి,
పొటాషియం,
సోడియం, లివర్ ఫంక్షన్ బ్లడ్ యూరియా ఇలా
ఎన్నో నోరు తిరగని టెస్టులు అన్నీ నార్మల్.
బెడ్ రూమ్ టు బాత్ రూమ్ వాకింగ్. అలవాట్లా సరే!
చెప్పేదే లేదు.
మరి ఇది ఎలా!
(31-12-2021)
31, డిసెంబర్ 2021, శుక్రవారం
సాలు ఆఖర్లో మందు బాటిల్ స్వగతం
30, డిసెంబర్ 2021, గురువారం
నిలబెట్టుకోలేని మాట - భండారుశ్రీనివాసరావు
ఈ మాట అనగానే రాజకీయుల వాగ్దానాలు గుర్తొస్తే చేసేదేమీ లేదు.
కానీ, నేను
చెప్పబోయే 'ఈ మాట' ఎవరికి
వారు ఇచ్చుకునేమాట. కొత్త ఏడాదిలో 'ఇది
చేస్తాం అది మానేస్తాం' అంటూ మనకు మనమే ఇచ్చుకునే మాట అన్నమాట.
ఈ మాట్లాట మానేసి అసలు విషయానికి
వద్దాం.
న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పేరుతో ఎన్నో
చేయాలని అనుకుంటాం. అదేం పాపమో ఏడాది మొదట్లోనే వాటికి పురిటి సంధి కొడుతుంది.
చాలామంది మగ పురుషులు ప్రతిఏడాది
తమకుతాము ఇచ్చుకునే వాగ్దానం కామన్ గా ఒకటుంది. అదేమిటంటే మందు కొట్టడం మానేస్తాం, సిగరెట్లు తాగడం ఆపేస్తాం అని. కానీ, కామన్
గా జరిగేది ఏమిటంటే మర్నాడు సీను షరా మామూలే. హాల్లో పీఠం వేసుకుని, విలాసంగా సిగరెట్టు వెలిగించి, మందహాసంతో మందు గ్లాసు పట్టుకున్న తరువాత కూడా ఎందుకో ఏమిటో ఈ
మాట అస్సలు గుర్తురాదు. ఆవిళ్ళు (ఆవిడలు అనగా
భార్యలు) పనిగట్టుకుని గుర్తుచేయబోయినా 'ఆ మాట
నిరుడు కదా చెప్పాను' అనేస్తారు అదేదో పూర్వ జన్మ వృత్తాంతం
అన్నట్టు. కావున, కావుకావుమని
చెప్పేదేమిటంటే, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు
అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదెందుకని రాజకీయ నాయకులను నిలదీసే హక్కు మనకు బొత్తిగా లేదని.
మనం మాట తప్పడానికి కూడా ఓ కారణం వుంది. ఈ కొత్త ఏడాది పాతపడి గిర్రున ఏడాది తిరిగి మరో కొత్త
ఏడాది మళ్ళీ వస్తుందని.
వాళ్ళు మాట తప్పడానికి కూడా దాదాపు అదే
కారణం.
అయిదేళ్ళ తరువాత మళ్ళీ ఎన్నికలు
వచ్చినప్పుడు అప్పుడు మరో మాట ఇస్తే పోలా అని.
కావున, అల్లా
ఆలోచించి ఎన్నికల్లో ఇచ్చిన పాత మాటలన్నీ (వోట్ల వొట్లు అన్నమాట) మూటగట్టి మన
గట్టునే పెట్టి వెడుతున్నారు.
31-12-2021
29, డిసెంబర్ 2021, బుధవారం
ఎవడబ్బసొమ్మనీ కులుకుతూ తిరిగేవు
28, డిసెంబర్ 2021, మంగళవారం
“శ్రీ ఆంజనేయం....”
‘............”
‘శ్రీ
ఆంజనేయం ప్రసన్నాంజనేయం.. చెప్పండి అత్తయ్యా! మిమ్మల్నే’
‘............’
‘మీరు దండకం
చెప్పకపోతే నేను మీ తమ్ముడి గారెతో ఫోన్ చేసి మాట్లాడించను. మరి చెప్పండి! శ్రీ
ఆంజనేయం! ప్రసన్నాంజనేయం!..’
‘....ప్రభాదివ్య
కాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్య మిత్రం భజే రుద్రతేజం
భజే బ్రహ్మ తేజం బటంచున్ ....’
అందుకున్న
ఆమె గొంతునుంచి ఆంజనేయ దండకం తుదివరకు సాగిపోయింది.
ఆ
స్వరం పీలగా, సన్నగా, ఎక్కడో నూతిలోంచి
వస్తున్నట్టు వున్నా ఉచ్ఛారణ లోపం లేకుండా, ఎనిమిది పదుల ఆ వృద్ధురాలు ఎక్కడా
తడబడకుండా ఏ పదం మరచిపోకుండా ఆలపిస్తుంటే
చూడడానికి ఆ దృశ్యం కమనీయంగాను వుంది. దయనీయంగాను వుంది.
వృద్ధాప్యం
పైనపడి ఎక్కడ మతిమరపుకు లోనవుతారో అని ఉదయం సాయంత్రం ఆమె కోడలు దగ్గర వుండి
చేయిస్తున్న అసాధారణ ధారణ కసరత్తు ఇది.
ఒకప్పుడు
ఒంటి చేత్తో పదిమందివున్న సంసారాన్ని సరిదిద్దిన ఆ ఇల్లాలు తుర్లపాటి భారతి. ఒక
పక్కన కార్పొరేట్ ఉద్యోగాన్ని వర్క్ ఫ్రం
హోం చేస్తూనే, మరో పక్క వృద్ధురాలు, ఆశక్తురాలు అయిన అత్తగారిని లాలించి,
అవసరమయితే బెదిరించి దండకాలు, లలితా
సహస్రనామాలు వల్లె వేయిస్తున్న మహిళ ఆవిడ కోడలు స్వర్ణ.
దండకం
చెప్పకపోతే మీ తమ్ముడితో ఫోనులో మాట్లాడించేదిలేదంటూ ఆ కోడలు బెదిరించిన ఆ
తమ్ముడిని నేను.
ఈ
సాయంత్రం నా కొడుకూ, కోడలు
నన్ను వెంటబెట్టుకుని సికింద్రాబాదులోని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కానవచ్చిన ఈ
దృశ్యం కమనీయంగా ఉన్నట్టా! దయనీయంగా ఉన్నట్టా!
హాట్సాఫ్ స్వర్ణా!
(28-12-2021)