9, డిసెంబర్ 2021, గురువారం

ఇలాంటివారు కూడా ఉంటారా! - భండారు శ్రీనివాసరావు

 

వార్త:

జర్మనీ చాన్సలర్ గా అలాఫ్ షోల్జ్ ని పార్లమెంటు ఎన్నుకుంది. దీనితో ఏంజెలా మర్కెల్ సుదీర్ఘ పదవీ కాలం ముగిసింది.

 

వ్యాఖ్య:

 

మీరు ఎప్పుడూ ఒకే సూటులో కనబడతారు? కారణం?”

నేను ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఉద్యోగిని. ఫ్యాషన్ మోడల్ ని కాదు”

మీరు పరిపాలనా బాధ్యతలతో తీరుబడి లేకుండా వుంటారు కదా! మరి ఇంటి పనులు ఎవరు చక్కబెడతారు?”

నేనూ నా భర్తా ఇంటి పనులు ఇద్దరం కలిసి చేసుకుంటాము. మా ఇంట్లో వేరే పనివాళ్లు, వంట మనుషులు లేరు”

 

విలేకరుల సమావేశాల్లో ఇలా జవాబులు ఇచ్చే ఈ సామాన్యురాలు ఎవరు అనుకుంటున్నారా? ఈవిడే అనామకురాలైన నాయకురాలు. ఏంజెలా మర్కెల్.

 

2005 లో ఎనిమిది కోట్ల మంది జర్మనీ ప్రజలు తమను ముందుండి నడిపించే నేతగా ఆమెను ఎన్నుకున్నారు. ఆ తరువాత కూడా వరసగా నాలుగు పర్యాయాలు ఆమెనే ఎన్నుకున్నారు.  ఇన్నేళ్ళలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. తన సంబంధీకులు ఎవరినీ ఆమె ప్రభుత్వ కొలువుల్లో, పదవుల్లో నియమించలేదు. లక్షల్లో జీతాలు, భత్యాలు తీసుకోలేదు. తనకు ముందు పాలించిన నేతలను పల్లెత్తు మాట అనలేదు. తన పరిపాలన అద్భుతం అనే కధనాలు మీడియాలో వచ్చేలా చూసుకోలేదు. తనను నమ్మి అధికార పగ్గాలు అప్పగించిన ప్రజలకు మరింత చక్కటి, భద్రమైన, సుఖప్రదమైన జీవితాలను ఇవ్వడం ఒక్కటే లక్ష్యంగా ఆమె ఇన్నేళ్ళు పనిచేశారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారాలు,  విలాసవంతమైన భవంతులు, ఖరీదైన  వాహనాలు, విహార నౌకలు, ప్రైవేటు విమానాలు వంటి విలాసాలపై మోజు పడకుండా అధికారంలో కొనసాగిన  కాలం యావత్తూ అత్యంత  నిరాడంబరంగా, నిబద్ధతతో, నిజాయితీతో  పాలించారు.

తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన బంధువులు, స్నేహితులు, పార్టీవారు ఎలాంటి ప్రయోజనాలు పొందకుండా చూశారు.

ఎలాంటి పటాటోపం ప్రదర్శించకుండా, ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు పోకుండా, పదవి అంటే అది కూడా జీతం తీసుకునే ఒక ప్రభుత్వ ఉద్యోగం అని మాత్రమే నమ్ముతూ, తనని నమ్మిన ప్రజలకు మౌనంగా సేవ చేస్తూ అంతే మౌనంగా అధ్యక్ష పదవిని, పార్టీ నాయకత్వ పదవినీ వదిలేశారు.

పదవీ విరమణ అనంతరం సొంత ఇంటికి వెళ్ళాల్సిన అగత్యం లేకుండా పోయింది. ఎందుకంటే జర్మనీ అధ్యక్షురాలు కాకపూర్వం  ఏ సామాన్యమైన ఇంట్లో ఉంటూ వచ్చారో,  పదవిలోకి వచ్చాక కూడా అదే ఇంట్లో కొనసాగుతూ వచ్చారు కనుక, అధికారిక భవనం ఖాళీ చేయాల్సిన అవసరం రాలేదు. ఏ దేశానికి అయితే సర్వం సహా అధ్యక్షురాలిగా వున్నారో అదే దేశంలో నివసిస్తున్న కోట్లాది మంది సామాన్య జర్మన్ పౌరుల్లో ఇప్పుడు ఆవిడా ఒకరు. అంతే!

09-12-2021

కలంపాళీ ఎటు తిరుగుతోంది?


అరవై ఏళ్ళ క్రితం, మా వూళ్ళో సత్యనారాయణ సిద్ధాంతిగారనే ఏజెంటుకి మూడున్నర రూపాయలు చందా కడితే నెల రోజులపాటు ఆనాటి ఆంధ్రపత్రిక మా ఇంటికి వచ్చేది. కానీ, అది మా వూరు చేరేసరికి సాయంత్రం అయ్యేది. అయినా ఏ రోజు వార్తలు, ఆరోజే చదువుతున్న ఫీలింగ్‌ కలిగేది. (తర్వాత, 1987లో, రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళినప్పుడు హిందూ పేపర్ని ఇండియన్‌ ఎంబసీ నుంచి తెప్పించుకుని చదివేవాళ్ళం. కానీ అది బెంగుళూరు ఎడిషన్‌ కావడం వల్ల అందులో మన ప్రాంతం వార్తలు చాలా తక్కువ. హైదరాబాద్‌ నుంచి కీర్తి శేషులు హిందూ బ్యూరో చీఫ్‌ ఆర్‌. జె. రాజేంద్రప్రసాద్‌ రాస్తుండే రాష్ట్ర సమాచార లేఖ ఒక్కటే మాకు వూరట.
అప్పట్లో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ ఐ . వెంకటరావు, జర్నలిస్టుల ప్రతినిధి బృందంలో సభ్యుడిగా మాస్కో వచ్చారు. తెలుగు పత్రిక కోసం అక్కడి తెలుగు కుటుంబాలు పడుతున్న వెంపర్లాటని ఆయన గమనించారు. హైదరాబాద్‌ వెళ్ళీ వెళ్ళగానే ఆంధ్రజ్యోతి దిన పత్రికని ఇండియన్‌ ఎంబసీ ద్వారా ఉచితంగా పంపించడం ప్రారంభించారు. సొంత రాష్ట్రం తాలూకు సమాచారాన్ని వారం రోజుల తర్వాతనయినా తెలుసుకోగల వీలు దొరకడం అదో కథ. అదో మధుర స్మృతి).

ఇక వెనక్కి వెడితే

అప్పట్లో అంటే యాభయ్‌, అరవై సంవత్సరాలక్రితం దినపత్రికల ఖరీదు అందరికీ అందుబాటులో ఉండేది. అయితే కొని చదివే అలవాటు మాత్రం చాలా తక్కువ.

ఆ రోజుల్లో పత్రికలకి ప్రకటనల రూపంలో కానీ, ఇతరత్రా కానీ లభించే ఆదాయం అంతంత మాత్రమే. పత్రికలు నడిపేవారుకూడా , దాన్నే తమ ప్రధాన ఆదాయవనరుగా భావించేవారు కాదు. దినవారీ నిర్వహణ బాధ్యతని పూర్తిగా సంపాదకులకు వదిలిపెట్టేవారు. అందుకే ఒక కోటంరాజు రామారావు, ఒక నార్ల, ఒక గోరాశాస్త్రి , ఒక రాఘవాచారి, ఒక నీలంరాజు, ఒక పండితారాధ్యుల, ఒక నండూరి రామమోహనరావువంటి సంపాదకులు ఆంధ్రదేశానికి లభించారు. వీరిలో నాకు తెలిసినంతవరకూ ఒక నార్ల వారు మాత్రమే రాజ్యసభ సభ్యులు కాగలిగారు.
ఆరు దశాబ్దాల తర్వాత ఈ నాటి పరిస్థితులను పరిశీలిస్తే తెలుగు జర్నలిజం కార్పొరేట్‌ స్ధాయిని అందుకుంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అదనపు హంగులను, రంగులను సమకూర్చుకుంది. వార్తా సేకరణలో, ముద్రణలో, పంపిణీలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. కొని చదవాలన్న ఉత్కంఠని పాఠకుల్లో ప్రేరేపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ఆహ్వానించతగ్గవే. అందరూ కాకపోయినా కొందరు జర్నలిస్టు సోదరులు గతంలో కనీవినీ ఎరుగని ఆకర్షణీమయైన జీతభత్యాలను, సదుపాయాలను అందుకుంటున్నారు. తమ రచనలతో కూడగట్టుకున్న పాఠకాభిమానంతోపాటు, మీడియా చర్చల్లో పాల్గొంటూ , బుల్లితెరపై తరచుగా కనిపిస్తూ సెలబ్రిటీ స్టేటస్‌ని సయితం సంపాదించుకుంటున్నారు.
ఈ లక్షణాలని పుణికి పుచ్చుకున్న తర్వాత విలువలని కాపాడుకోవడం తలకి మించిన భారం కానూ కావచ్చు. చెప్పలేం!
నేను 70వ దశకంలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ప్రకటనల రీత్యా ఆదాయం లేదని అనలేను కానీ, దాని మీదనే పత్రిక నడిచేదని చెప్పడానికి కూడా వీలులేదు. అందుకే నార్లగారు, నండూరి వారు పత్రిక నడిపిన తీరుపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యేవి కావు. వారి సంపాదకీయ వ్యాఖ్యలకీ, వారి ఆధ్యర్యంలో ప్రచురితమయ్యే వార్తలకూ ఒక నిబద్ధత ఉండేది. ఆ తరువాతి తరంలో కూడా ఆ సాంప్రదాయం, ఆ పరంపర కొంతకాలం కొనసాగాయి.

మంచి పత్రిక ఎప్పుడూ మంచి పాఠకులను తయారు చేస్తుంది. వారిని తమ అభిమానులుగా మార్చుకుంటుంది. అందుకే కొందరు పాఠకులు కొన్ని పత్రికలని ప్రగాఢంగా అభిమానిస్తుంటారు. వాటిని చదవడానికే అలవాటు పడుతుంటారు. వాటిల్లో ప్రచురితమయ్యే వార్తలని, వ్యాఖ్యలని విశ్వసిస్తుంటారు. నిజమని నమ్ముతుంటారు. పాఠకుల భావజాలాన్నీ, ఆలోచనా రీతులను ప్రభావితం చేసే ఒక రకమైన సమ్మోహన శక్తి పత్రికలకు ఉంటుంది. అందుకే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులకు సంఘంలో అంత మర్యాదా, మన్ననా.

కానీ వర్తమానానికి వస్తే,

పత్రిక నిర్వహణ, ఆ మాటకి వస్తే, మీడియా నిర్వహణ ఒక పరిశ్రమ మాదిరిగా తయారయింది. ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు లాభనష్టాలు బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దానితోబాటు వార్తలకూ, వ్యాఖ్యలకూ నడుమ ఉండాల్సిన సన్నటి విభజన రేఖ అదృశ్యమవుతోంది. వెనకడుగు వేస్తే వెనకబడిపోతామనే విశృంఖల పోటీ యుగం ప్రారంభమయింది. భుజకీర్తులు తగిలించుకునే భజన పరుల సంఖ్యా, రాజకీయ పార్టీలకూ, బడా పారిశ్రామిక సంస్థలకూ కొమ్ముకాసేవారి సంఖ్యా, మీడియాలో పెరుగుతోందన్నది కాదనలేని సత్యం. ప్రజా శ్రేయస్సు దిశగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే పవిత్రమైన బాధ్యత కలిగిన పత్రికల్లో, తమ అభిప్రాయాలను ప్రజల మీద రుద్దే దుష్ట సంస్కృతి రూపు దిద్దుకుంటోంది.

పత్రికలకు ప్రాణం స్వేచ్ఛ. అంతే కాదు, పత్రికాస్వేచ్ఛ జర్నలిస్టుల జన్మహక్కు. ఈ స్వేచ్ఛపై ఎవరు దాడి చేసినా, నిందలు వేసినా అది ప్రజా స్వామ్యానికి కీడుచేస్తుంది. అందుకే బాధ్యత కలిగిన పౌరులెవ్వరూ, ఈ రకమైన దాడులని, నిందలని హర్షించరు. అయితే అదే సమయంలో నిష్ఠురమైన నిజాన్ని కూడా మీడియా అర్ధం చేసుకోవాలి.
స్వేచ్ఛ అనే జన్మ హక్కు సయితం, పవిత్రమైన బాధ్యత నుంచి తప్పించలేదు.
నిబద్ధత వున్న చోటే నిజం నిలుస్తుంది. విశ్వసనీయతే హక్కుల్ని కాపాడుతుంది. అది వున్నంత కాలం దాడులకు, నిందలకు వెరవనక్కరలేదు. పాఠకులే పెట్టని కోటగా నిలబడి పత్రికలని కాపాడుకుంటారు.
కానీ ఆ పరిస్థితిలో, అలాంటి ఉన్నత స్థానంలో నేటి పత్రికలు, మీడియా వ్యవహార శైలి ఉంటోందా!
ఉంటే ఇటువంటి గీత బోధనలు చేయాల్సిన అవసరం ఏముంటుంది?

7, డిసెంబర్ 2021, మంగళవారం

శ్రీ రోశయ్య నిష్క్రమణతో శాశ్వతంగా సెలవు తీసుకున్న ఒక రాజకీయ తరం

మోడీ ప్రభుత్వంపై ఒమైక్రాన్ ప్రభావం

Senior Journalist Bhandaru Srinivasa Rao Analysis on Jr NTR Political Entry

ఎంత కష్టం! ఎంత కష్టం! - భండారు శ్రీనివాసరావు

 ఈ కధనానికి ఓ నేపధ్యం వుంది. తర్వాత చెబుతాను.

కొన్నేళ్ళ క్రితం మేము అద్దెకువుంటున్న మా అపార్ట్ మెంటుకు ఐ మూలగా ఓ ఖాళీ స్థలం వుండేది. కొద్ది రోజుల్లోనే అక్కడ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. హైదరాబాదు లాంటి నగరంలో ఇది కొత్త విషయం ఏమీ కాదు. కానీ కొత్తగా ప్రస్తావించుకోవడానికి కొత్త నేపధ్యం ఒకటి కలిసి వచ్చింది. కరెంటు లేకపోవడం వల్ల ఎండ గాలో వడ గాలో ఏదో ఓ గాలి వస్తే చాలనుకుని పడక గది కిటికీ తెరిచాను. ఆర్నెల్ల కిందట ఆకారం కూడా లేని ఆ నిర్మాణం చిత్రంగా రెండంతస్తులు లేచింది. మూడో దానిమీద పిల్లర్లు వేస్తున్నారు. ఓ యాభయ్ అరవై మంది కూలీలు ఆడా మగా సుశిక్షితులయిన సైనికుల వారి మాదిరిగా నిర్విరామంగా ఆ ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. కొందరు కంకర ఎత్తి పోస్తుంటే మరికొందరు ఇసుక, సిమెంటు కొలిచి గుండ్రంగా తిరుగుతున్న ఓ మిక్సింగ్ యంత్రంలో పోస్తున్నారు. అలా తయారయిన కాంక్రీటును ఓ చిన్న లిఫ్ట్ లాంటి యంత్రం మూడో అంతస్తుకు చేరుస్తోంది. అక్కడ దాన్ని దించుకున్న కూలీలు బొచ్చెల్లో తీసుకు వెళ్ళి పిల్లర్లను నింపుతున్న కూలీలకు అందిస్తున్నారు. అంతా ఒక క్రమపధ్ధతి ప్రకారం జరిగిపోతోంది. బోలెడు కష్టపడిపోతున్న ఫీలింగు కూడా వారిలో వున్నట్టు దూరం నుంచి గమనిస్తున్న నా దృష్టికి ఆనలేదు. సరిగ్గా వొంటి గంట కాగానే గంట కొట్టినట్టు పనులు ఆగిపోయాయి. ఎవరికి వారు అక్కడ డ్రమ్ముల్లో వున్న నీళ్ళతో మొహం కాళ్ళూ చేతులూ కడుక్కుని, ఇళ్లనుంచి  క్యారేజీల్లో తెచ్చుకున్న భోజనాలు చేశారు.

ఈ లోగా ఇంట్లో కరెంటు వచ్చింది. ప్యాను తిరిగింది. వొళ్ళు చల్లబడింది. కానీ ఎర్రటి ఎండలో కూలీల చుట్టూ తిరిగొచ్చిన మనసు మాత్రం ఇంకా వేడిగానే వుంది. ఆవిర్లు కక్కుతూనే వుంది.

అసలు విషయం ఇప్పుడు విప్పుతాను. మొదట్లో నేపధ్యం ఒకటుంది అని చెప్పాను గుర్తుంది కదా! అదే ఇది.

నగరంలో అక్రమ నిర్మాణాల పేరుతొ పెద్ద పెద్ద భవనాలను కూల్చివేస్తున్న వార్తలు వింటుంటాము. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలను అనుమతించకూడదని నమ్మే వారిలో నేనూ వున్నాను. అక్రమ కట్టడాలను తొలగిస్తున్న ఫోటోలను పత్రికల్లో చూసినప్పుడు, ఇదిగో ఇప్పుడు చెప్పానే మా ఇంటి దగ్గర నిర్మాణంలో వున్న ఇంటికంటే అవి చాలా పెద్దవిగా అనిపించాయి. ఆరునెలల నుంచి కడుతున్నా ఇది ఇంకా పూర్తి కాలేదు. అలాటిది ఆ కూల్చేసిన ఇళ్లు కట్టడానికి కనీసం ఏడాది పట్టి వుంటుంది. అన్నాళ్ళు అధికారులు, అనుమతులు లేకుండా జరుగుతున్న ఆ నిర్మాణాలను గమనించలేదా! లేదా కళ్ళుండి కూడా నేను గమనించనట్టు వాళ్ళూ చూడలేదా! ఒక్క ఇల్లు కట్టడానికే ఇంతమంది ఇంతటి ఎండాకాలంలో తమ రక్త మాంసాలను ఫణంగా పెట్టి ఎంతో శ్రమ పడుతున్నారు. ఇసుక సిమెంట్ కంకరతో పాటు వారి స్వేదం కూడా ఆ నిర్మాణం అణువణువులో వుంది. ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లను ఏమాత్రం కష్టపడకుండా యంత్రాల సాయంతో కూల్చివేయడం ఏం న్యాయం? ఎలాటి న్యాయం అనిపించుకుంటుంది. అంత డబ్బుకు, అది ఎవరిదయినా కావచ్చు పూర్తిగా నీళ్లు వొదులుకున్నట్టే కదా! ఇన్నాళ్ళు అనుమతి లేని నిర్మాణాలను కాసులకు కక్కుర్తిపడి అనుమతిస్తూ వచ్చిన అధికారులను, సిబ్బందిని వారు ఎవరయినా సరే, వారి వెనుక ఎవరు వున్నా సరే, కనీసం ఓ యాభయ్ మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి ఉన్నపెట్టున శాశ్వితంగా తొలగిస్తే మళ్ళీ ఇలాటి నిర్మాణాలు జరుగుతాయా!

ఎప్పుడో జరిగిన ఈ విషయాలు ఇప్పుడు గుర్తుకు రావడానికి కారణం ఈరోజు పత్రికల్లో వచ్చిన అలాంటి వార్తే.

హైదరాబాదు పొలిమేరల్లో మల్లంపేట చెరువులో అక్రమనిర్మాణాలు. ఏకంగా 260 ఖరీదైన విల్లాలు. రాత్రి రాత్రి సాధ్యం అయ్యే నిర్మాణ వ్యవహారం కాదు. విషయం బయటకి పొక్కడంతో వాటిల్లో 120 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. వాటిని ఏం చేస్తారు. కూల్చేస్తారా! అదే పరిష్కారమా!

ఇంతకాలం కళ్ళు మూసుకున్న వారిపై చర్యలు ఉండవా!

ఉంటాయో ఉండవో తెలియదు కానీ ఈ ప్రశ్నలకు జవాబులు మాత్రం వుండవు.



(07-12-2021)

 

మారని వ్యవస్థ

 తప్పతాగిన స్తితిలో అతి వేగంగా ఓ యువవిద్యార్ధి కారు నడిపిన ఫలితంగా సంభవించిన ప్రమాదంలో రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక కుటుంబం మొత్తం చితికి పోయింది. ఉద్యోగం నిమిత్తం అమెరికా వెడుతున్న ఒక యువకుడి కలలన్నీ అతడి కనురెప్పల కిందే కరిగిపోయాయి. అప్పటివరకు చదువుతున్న స్కూలును ఒదిలి మరో స్కూల్లో చేరి బంగారు భవిష్యత్తు దిశగా తొలి అడుగు వేసిన పదేళ్ళ బాలిక రమ్య ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్లాడుతూ వారం రోజుల తరువాత మృత్యు దేవత ఒడిలో ఒదిగి పోయింది. హైదరాబాదు పంజాగుట్ట ఫ్లై ఓవర్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో చిన్నారి రమ్య, ఆమె బాబాయి రాజేష్ చనిపోవడం, ఆ కారులో వున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో మొత్తం నాలుగు కుటుంబాలు భరించలేని దుఃఖంలో మునిగిపోయాయి. సహచర విద్యార్ధులతో కలిసి పగటి పూటే పూటుగా మద్యం సేవించిన ఒక ఇంజినీరింగ్ విద్యార్ధి నడుపుతున్న కారు, అదుపు తప్పి బోల్తా కొట్టి, మరో వాహనంపై పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఇది జరిగి ఏండ్లు గడిచిపోయాయి.
పరిస్థితి ఏమైనా మారిందా?
లేదు అని హైదరాబాదులో తాజాగా జరిగిన సంఘటనలు తెలుపుతున్నాయి.