19, నవంబర్ 2021, శుక్రవారం

రైతుల చుట్టు తెలంగాణ రాజకీయాలు

‘భార్యల్ని ప్రశంసించే రోజు’ – భండారు శ్రీనివాసరావు

 ఏడాదికి మూడువందల అరవై అయిదు రోజులు. వీటిల్లో మళ్ళీ ఒక్కో తేదీకి ఒకటో రెండో చొప్పున ప్రత్యేక దినాలు. యునెస్కో కొన్ని నిర్ణయిస్తే, మిగిలినవి ఎవరి పుణ్యమో తెలియదు. అలా వచ్చిందే ‘భార్యల్ని ప్రశంసించే రోజు’ (WIFE APPRECIATION DAY).

 

(అమెరికాలో జనవరి ఇరవై ఆరున జరుపుకుంటారు. మన దేశంలో నవంబరు  మూడో ఆదివారం అంటే ఎల్లుండి ఇరవై ఒకటో తేదీ  అన్నమాట. కాబట్టి నాలుగు మంచి మాటలు ముందే  సిద్ధం చేసి పెట్టుకోండి)

 

దీనికి సోషల్ మీడియాలో తెగ ప్రచారం వచ్చింది కూడా. ‘ఈ ఒక్క రోజూ కట్టుకున్న ఇల్లాలిని మాటల్తో పొగిడి, మిగిలిన మూడువందల అరవై నాలుగు రోజులూ షరా మామూలుగా అష్టోత్తరాలతో వేధిస్తే పోలా’ అనుకునేవాళ్లు కూడా ఉండవచ్చు. ‘ఆ మాత్రం దానికి ఈ ఒక్క రోజూ మొగుడితో పొగిడించుకుని, ఏడాది పొడుగునా అనరాని మాటలు పడుతూ వుండడం ఏమంత భాగ్యం’ అని ముక్కు చీత్తూ మధన పడే మగువలకూ తక్కువలేదు. ఇది ఇక్కడ ఒదిలి అసలు ఈ ‘కొత్త రోజు ‘కధాకమామిషూ’ ఏంటో చూద్దాం.

ఒక ఆంగ్ల దినపత్రిక ఈ ‘దినం’ అనగా ‘భార్యల్ని ప్రశంసించే దినం’ ప్రచార బాధ్యతని తన భుజాలకు ఎత్తుకుంది. మక్కికి మక్కి కాకుండా తెలుగులో సాగదీస్తే అది ఇలా సాగుతుంది.

హల్లో! ఎలా వున్నావు. మీ ఆవిడ ఎలా వుంది?’

మా ఆవిడా! ఓకేరా!’

ఏమిటీ జస్ట్ ఓకేనా! అంతేనా!’

‘..........’

చాలా ఆశ్చర్యంగా వుందే! ఆవిడ అంటే ఎవరనుకున్నావు. నీ అర్ధాంగి. మీ ఇంటి దీపం. ఉదయం అందరికంటే ఇంట్లో ముందు నిద్ర లేచేది ఆవిడే. ఇంట్లో అందరూ నిద్ర మంచం ఎక్కిన తరువాత అన్నీ సర్దుకుని చివరాఖరుకు నిద్రపోయే మనిషి కూడా ఆవిడే! నువ్వు తొడుక్కునే చొక్కా సైజు కూడా నీకు తెలవదు. ఆవిడ కొంటే తప్ప నీకు దిక్కులేదు. పిల్లలు ఏం తింటారో తెలవదు. వాళ్ళ పుట్టిన రోజులు కూడా నీకు జ్ఞాపకం వుండవు. అన్నీ కంప్యూటర్ లాగా ఆవిడ గుర్తు పెట్టుకోవాలి. ఇంట్లోకి ఏ సరుకులు కావాలన్నా ఆవిడే తేవాలి. పోపులడబ్బా ఎక్కడుందో కూడా నీకు తెలవదు. వంటింట్లో సరుకులు ఉన్నాయా నిండుకున్నాయా జవాబు చెప్పమంటే నీకు పడేవి నిండు సున్నా మార్కులే. ఈ విషయంలో ఆవిడని మించిన ఇన్వెంటరీ ఉంటుందా చెప్పు. చెప్పు అంటే జ్ఞాపకం వచ్చింది. ఆవిడ వెంట వుండి కొనిపెట్టకపొతే నీ చెప్పు సైజు కూడా నీకు తెలవదు. పిల్లల స్కూలెక్కడో, వాళ్ళేం చదువుతున్నారో, అసలు చదువుతున్నారో లేదో మీ ఆవిడ చెబితే కానీ తెలవదు. నీకీ సినిమా ఇష్టమో, నీకు ఏ కూర ఎలా చేస్తే యెంత ఇష్టమో ఆవిడకు తెలిసినంతగా నీకు బొత్తిగా తెలవదు. అల్లాంటి మనిషి ఎల్లా వుందంటే సింపుల్ గా ‘ఓకే’ అంటావా! అడిగేవాడు లేక. ఆయ్!!’

కాబట్టి మొగుడు మిత్రాస్! (ఏవిటో నాకూ సోషల్ నెట్ వర్క్ భాష పట్టుబడుతోంది). ఒక్క రోజే కదా! మీరు మీరు కాదనుకుని, మీ ఆవిడ మీ ఆవిడే అనుకుని ఎంచక్కా నాలుగు మంచి మాటలు ఆవిడతో మాట్లాడండి. వచ్చే ఆదివారం వంట పని పెట్టుకోకుండా ఏదైనా హోటల్ కు తీసుకువెళ్ళి, ‘ఛా! ఈ కూరా ఒక కూరేనా, నువ్వు వండితే ఆ రుచే వేరు’ అంటూ కాకమ్మ కబుర్లు కమ్మగా చెప్పండి. ఆడవాళ్ళు నమ్ముతారని నమ్మకం నాకయితే లేదు కానీ, ఆడవాళ్ళ గురించి నాకో బలమైన నమ్మకం వుంది. వాళ్ళు అల్ప సంతోషులు. కనీసం



మిమ్మల్ని నమ్మించడం కోసమైనా వాళ్ళు మీ మాటలు నమ్మినట్టు కనిపిస్తారు.

ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు నాలుగు మాటలు తప్ప.

ఆఫ్ కోర్స్! నాకీ అదృష్టం ఎలాగూ లేదనుకోండి!

 

నాతో జాగ్రత్త! – భండారు శ్రీనివాసరావు

 టీవీ చర్చలకు ముప్పూటలా వెళ్ళే రోజుల్లో ఒక ఛానల్ యాంఖరమ్మాయి నా మొహాన ఓ కాంప్లిమెంటు పారేసింది.

'మీరిలా ప్రశాంతంగా ఎలా వుంటున్నారు. మా నాన్నగారు ఎప్పుడూ రుసరుసలాడుతూ ఉంటారు.'

పాపం ఆ అమ్మాయికి తెలియదు, నేనూ ఇంట్లో అంతకంటే ఎక్కువ భుగభుగల మనిషినని. దూర్వాసుడికి వారసుడిని అని.

ఆ అమ్మాయి పుణ్యమా అని నాకొక విషయం తెలిసొచ్చింది. ప్రతిమనిషిలో ఓ అపరిచితుడు దాగుంటాడని. అందరికీ మంచిమనిషిగా కనిపించే శాల్తీలు నిజానికి అంత నిఖార్సయిన మంచి సరుకు కాకపోవచ్చని. సకల సద్గుణ రాముడని బయటవారు కీర్తించే లక్షణాలు వారిలో ఆట్టే లేకపోవచ్చని.

ఈ రూలు నాకే కాదు మనం అందరం అభిమానించే సినీ తారలు, రాజకీయ నాయకులు, రచయితలు, జర్నలిష్టులకు సైతం వర్తిస్తుంది. వాళ్ళ అందచందాలు, మాటల గారడీలు, రచనలు ఇవన్నీ చూసీ, వినీ, చదివీ పరమవీర అభిమానులం అయిపోతుంటాం. అక్కడే బోల్తాపడిపోతుంటాం. నిజానికి, పైకి కనిపించేవాటికీ, వారికీ ఆమడ దూరం వుంటుందన్న వాస్తవం మరచిపోతుంటాం.

అన్నింటికీ మినహాయింపు వున్నట్టే సూత్రం నుంచి వేరు చేసి చూడాల్సిన మహానుభావులు లేకపోలేదు.

వారు పుణ్య పురుషులు. మిగిలినవారు కాపురుషులు.



 

18, నవంబర్ 2021, గురువారం

నడిచివచ్చిన దారిలో (నేనెవరో తెలియనివారికోసం)

క్లియర్ కట్







10 టీవీ ఈశ్వర్ ది కంచు కంఠం. విషయం ఎంత సంక్లిష్టం అయినదైనా ఆయన చెబుతుంటే స్క్రిప్ట్ చదువుతున్నట్టు వుండదు. అప్పటికప్పుడు మనతో మాట్లాడుతున్నట్టు మాటలు పిడుగుల్లా దొర్లిపోతుంటాయి. ఈశ్వర్ మాట్లాడిన తర్వాత మనం ఏదైనా చెప్పబోతే అది సూర్యుడి ముందు దివిటీలా వెలవెలపోతుంది. రాత్రి నాకు అదే జరిగిందన్నది క్లియర్ కట్!

కంగ్రాట్స్ ఈశ్వర్ గారూ

ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం IDream Interview with Swapna

17, నవంబర్ 2021, బుధవారం

మారాల్సింది నేను, లోకం కాదు - భండారు శ్రీనివాసరావు


“ ఆ రోజులే వేరు. వొంట్లో యువరక్తం సలసలా మరుగుతుండేది. మొత్తం ప్రపంచాన్ని ఒక్కమారుగా మార్చేసి నాకు నచ్చిన లోకాన్ని సృష్టించాలని తహతహలాడుతుండేవాడిని. కానీ ఏమయింది. ప్రపంచాన్ని మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది. పోనీ, ప్రపంచం సంగతి అక్కడితో వొదిలేసి, నా దేశాన్ని సంస్కరించుకుంటే సరిపోలా అని అనుకున్నాను.
“ఆ ప్రయత్నం కూడా వృధా అని త్వరలోనే తెలిసిపోయింది. దాంతో దేశం గొడవ పక్కనబెట్టి మా వూరిని బాగుచేద్దామని పూనుకున్నాను.
“అయితే వూరును బాగుచేయడం అన్నది నా ఒక్కడివల్లా అయ్యే పని కాదని తెలిసి రావడానికి కూడా ఎక్కువ కాలం పట్టలేదు.
“ఇక అప్పుడు కానీ నాకు, నా కుటుంబం గుర్తుకు రాలేదు. ముందు కుటుంబం బాగోగులు చూడాలనిపించింది. కానీ అప్పటికే వయసు మీద పడింది. వెనుకటి సత్తువా లేదు. మునుపటి ఓపికా లేదు.
“బోధివృక్షం లేకుండానే నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ముందు నన్ను నేను మార్చుకుంటే యెలా వుంటుంది అన్న ఆలోచన మొదలయింది. మొదటే ఈ పని చేసివుంటే ఎంత బాగుండేదో కదా!
“క్రమంగా నా ఆలోచనలు కొత్త రూపం తీసుకున్నాయి.
“మార్పు అనేది ముందు నాతో మొదలయివుంటే ఆ ప్రభావం నా కుటుంబం పైన పడేది. నేనూ నా కుటుంబం కలిసి మా వూరిని మార్చేవాళ్ళం. మా వూరు బాగుపడితే దానివల్ల నా దేశం బాగుపడివుండేది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చిన్నతనంనుంచి కంటున్న నా కల ఆ క్రమంలో ఫలించి వుండేది. కానీ ఏంలాభం? శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన తరవాత కానీ తత్వం బోధపడలేదు.
“ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడంలో నేను చేసిన ఈ పొరబాటు మరెవ్వరూ చేయకూడదని చెప్పడానికే ఈ నాలుగు ముక్కలు.”

(పదకొండో శతాబ్దానికి చెందిన ఓ సన్యాసి చెప్పిన నీతి కధ ఆధారంగా)