మూడేళ్ల క్రితం ఇదే రోజున తిరుమలమ్మ మా ఇంటికి వచ్చింది. పోల్చుకోవడానికి కొంత సమయం పట్టిన మాట నిజం.
20, అక్టోబర్ 2021, బుధవారం
మంచితనానికి దైవానుగ్రహం తోడయితే..... భండారు శ్రీనివాసరావు
19, అక్టోబర్ 2021, మంగళవారం
రేడియో ప్రాంగణంలో సమాధి చేయాలి – రావూరి భరధ్వాజ కడపటి కోరిక
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారి రెండో వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాల్ని మననం చేసుకుంటూ రాసిన దానికి ఇది జోడింపు." భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో వచ్చింది. మనసు ఆర్ద్రం అయ్యే ఒక జవాబు చెప్పారు అందులో భరద్వాజ గారు. నేను రేడియో మనిషిని కనుక దాన్ని అందరితో పంచుకోవాలని సహజంగా అనిపించింది. అదే ఇది.
"ఆకాశవాణిలో
ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది? రెంటాల గారి
ప్రశ్న. భరద్వాజ గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన సమాధానం :
"కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో
ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన
సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే
చాలా ఎక్కువ. హైదరాబాద్ ఆకాశవాణిలో నాకు ఉద్యోగం రావడానికి కారణమైన రచయిత
త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం
ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ
జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క
కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ
శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ
దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో
ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" (రెంటాల గారికి కృతజ్ఞతలు)
18, అక్టోబర్ 2021, సోమవారం
పెరుగుట పెరుగుట కొరకే
రావూరి భరద్వాజ అసలు పేరు - భండారు శ్రీనివాసరావు
(జ్ఞానపీఠ అవార్డు పొందిన రావూరి భరద్వాజ వర్ధంతి ఈరోజు)
17, అక్టోబర్ 2021, ఆదివారం
శుభకార్యాల్లో చావుల సంగతి ప్రస్తావించవచ్చా - భండారు శ్రీనివాసరావు
రాజమండ్రి వద్ద గోదావరిపై నిర్మించిన మొట్టమొదటి రైలు రోడ్డు వంతెన ప్రారంభోత్సవానికి రేడియోలో ప్రత్యక్ష వ్యాఖ్యానం బాధ్యత ఉషశ్రీ గారికి అప్పగించారు. ఆ రోజుల్లో మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు బెజవాడలో సమాచార శాఖ అధికారిగా పనిచేస్తూ వుండేవారు. ఆయనా ఉషశ్రీ గారు మంచి స్నేహితులు. ఆ వంతెన ప్రారంభోత్సవానికి వస్తున్నది సాక్షాత్తూ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ కావడంతో అధికారులు ఏర్పాట్లపై మరింత శ్రద్ధ పెట్టారు. వీవీఐపీ ప్రోగ్రాం కాబట్టి ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం నిమిత్తం పనిచేసేవాళ్ళు, ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిలో భాగంగానే ఉషశ్రీ గారు, మా అన్నయ్యను కలిసి వంతెన తాలూకు వివరాలు సేకరించారు. అప్పుడు మా అన్నయ్య చెప్పిన సలహా నాకు బాగా జ్ఞాపకం వుంది.
‘రేడియోలో ప్రత్యక్ష
వ్యాఖ్యానం కాబట్టి మధ్యలో విరామాలు ఇవ్వడానికి వీలుండదు. మీరు ఏదో ఒక సంగతి
శ్రోతలకు నిరంతరం చెబుతూనే వుండాలి.
ఎక్కడా బ్రేక్ రాకూడదు. వంతెన వివరాలు ఎలాగూ మీకు ఇస్తాము. కానీ మధ్యమధ్యలో
ఎక్కడయినా వీలుచూసుకుని ఈ వంతెన నిర్మాణంలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ
ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని స్మరించుకుంటే బాగుంటుంది’
ఈ సలహా ఆయనకు నచ్చింది. కానీ, ఎందరెందరివో ధర్మసందేహాలు తీర్చగలిగిన ప్రతిభాశాలి ఆయనకే ఒక అనుమానం పొడసూపింది. శుభమా అంటూ కార్యక్రమం జరుగుతుంటే చనిపోయిన సంఘటనలు
గుర్తు చేయడం బాగుంటుందా అని.
దీనికి సమాధానం ఆరోజు ప్రధాని
ప్రసంగంలోనే లభించింది.
‘ఆసియాలోనే అతి పొడవైన రైలు రోడ్డు వంతెనను ప్రారంభోత్సవం చేయడం నాకు ఎంతో
ఆనందాన్ని కలిగిస్తోంది. అత్యంత క్లిష్టమైన ఈ ఇంజినీరింగ్ ప్రక్రియను జయప్రదంగా
పూర్తిచేయడంలో అవిరళ కృషి చేసిన ఇంజనీర్లను, కార్మికులను అభినందిస్తున్నాను. అయితే ఇదే
సమయంలో ఈ బృహత్తర కార్యక్రమ నిర్వహణలో అసువులు
బాసిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’
63 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ వంతెన నిర్మాణం 1972 లో పూర్తయింది. రాజమండ్రి, కొవ్వూరులను కలుపుతూ నిర్మించిన ఈ
వంతెన అప్పట్లో ఆసియా ఖండంలోనే అతి పొడవైనదిగా చెప్పుకునే వారు. ఈ వంతెనకు
అధికారికంగా ఏం పేరు పెట్టారో తెలవదు కానీ స్థానికులు మాత్రం కొవ్వూరు బ్రిడ్జ్ అనే పిలుచుకునే వారట.
NOTE: రాజమండ్రి దగ్గర ఎన్ని కొత్త వంతెనలు వచ్చాయో నాకు తెలియదు. నా పోస్టు ఉద్దేశ్యం జాతికి పనికి వచ్చే ఇలాంటి ప్రాజెక్టులు ఎవరి హయాంలో కట్టారు అని కాదు వాటికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అనేది
వివరించడానికి మాత్రమే.
16, అక్టోబర్ 2021, శనివారం
ఎక్కువైనా తక్కువైనా కొట్లాటే
ఓ ఇరవై ఏళ్ళ క్రితం నాకు తెలిసిన కుటుంబం నగరంలో ఒక కాలనీలో రెండంతస్తులతో ఇల్లు కట్టుకున్నారు. మేము గృహ ప్రవేశానికి కూడా వెళ్ళాము. ఇంటి ఎదురుగా పెద్ద చెరువు. కాకపోతే నీళ్ళు ఆట్టే లేవు. వీళ్ళ ఇల్లు నిజానికి ఆ చెరువుకు నీళ్ళు పారే ప్రదేశంలో వుంది. చెరువుకు నిండా నీళ్ళు వస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పాలనిపించింది. కానీ సందర్భం కాదేమో అని ఊరుకున్నాను.
అంత చక్కటి ప్రదేశంలో మంచి ఇల్లు కట్టుకున్నందుకు వచ్చిన వాళ్ళు అందరూ గృహస్తును అభినందించారు. అప్పటికే ఆ కాలనీలో చాలా సుందర భవంతులు వెలిశాయి. చూడగానే సంపన్నుల కాలనీ అనిపించేదిగా వుంది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రికి నగర సుందరీకరణ మీద మక్కువ ఎక్కువ కావడంవల్ల ఆ చెరువు కట్టను అందమైన మినీ టాంక్ బండుగా తీర్చిదిద్దారు. దానితో ఆ కట్టకు దిగువన దీనిని తలదన్నే మరో కాలనీ వెలిసింది. సరే కొంత కాలం ఆ కాలనీ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు సఖ్యంగానే వున్నారు.
ఆ సమయంలో ఇప్పటిలాగే కనీవినీ ఎరుగని వర్షాలు కురిసి చాలా కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి. చెరువు నిండి ఆ ప్రవాహం వెనక్కి రావడంతో ఎగువ కాలనీలోని ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి. మునిగిపోతాయన్న భయంతో వాళ్ళు ఆ చెరువు కట్టకు గండి కొట్టే ప్రయత్నం చేయబోయారు. అంతే! దిగువన వున్న కాలనీవాళ్ళు గండి కొడితే తమ కాలనీ మునిగిపోతుందని భయపడి ఎగువ కాలనీ వాళ్లకు ఎదురు తిరిగారు. అప్పటిదాకా సఖ్యతగా ఉన్న రెండు కాలనీల వాళ్ళు ఒకరికొకరు పరమ శత్రువులు అయిపోయారు.
ఈ లోగా వరుణుడు శాంతించడం, వరద తగ్గు ముఖం పట్టడంతో పెద్ద సంఘర్షణకు అవకాశం లేకుండా పోయింది. ప్రకృతి ప్రజలకు ఉచితంగా ప్రసాదించే
నీరు తక్కువైనా కష్టాలే, ఎక్కువైనా కష్టాలే! అయితే ఈ కష్టాలకు
తామే కారణం అని ప్రజలకూ తెలుసు. కానీ తెలియనట్టుగా ఉండిపోతారు.
15, అక్టోబర్ 2021, శుక్రవారం
ఆర్కే ఓ జ్ఞాపకం – భండారు శ్రీనివాసరావు
ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.