17, జూన్ 2021, గురువారం
గుడిలో ఏముంది? – భండారు శ్రీనివాసరావు
గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం ఒకటి గుడిలో దాగి వుంది.
16, జూన్ 2021, బుధవారం
భార్య (చెప్పిన) రహస్యం – భండారు శ్రీనివాసరావు
ప్రధమ కబళే మక్షికాపాతః
అంటే మొదటి
ముద్దలోనే ఈగ పడింది అని అర్ధం.
ఈ శీర్షికలో ముందు
బ్రాకెట్లో రాసిన పదం ‘చెప్పిన’ అని లేదు. రాసిన తరువాత చూసుకుంటే, చూడ్డం మంచిదయింది, లేకపోతే పుట్టి పూర్తిగా
మునిగేది. ఆ విధంగా కలిగిన జ్ఞానోదయంతో తెలివినపడిన
వాడినై, అర్జంటుగా ముందో బ్రాకెట్టు పెట్టి అందులో ‘చెప్పిన’ అనే పదాన్ని యమర్జెంటుగా కూరిపెట్టి,
‘భార్య రహస్యం’ ఏవిటి? అనే దిక్కుమాలిన
అనుమానాలు తలెత్తి సంసారపు పుట్టి నిండామునగకుండా నిండుదా జాగ్రత్త పడ్డాను.
ఇంతకీ అసలు విషయం
ఏవిటంటే, మా ఆవిడ బయట వర్షం పడొచ్చనే వాతావరణ హెచ్చరికలు
నమ్మినదై, బయట పెత్తనాలకు పోలేకా, లోపల కరెంటులేని కారణంగా టీవీ సీరియల్
చూసే అవకాశం బొత్తిగా లేకయున్నూ, ఇత్యాది బలమైన అనేక
కారణాల కారణంగా విధిలేని స్తితిలో ఇంటిపట్టునే వుండిపోయి, తప్పనిసరై నాతో మాటవరసకు మాటలు కలిపి
వాటి మధ్యలో ఒక తూటా పెట్టి పేల్చింది. ఆ మాట అన్నది మా ఆవిడ కాబట్టి, ఆ సమయంలో ఎవరు లేరు
కాబట్టి సరిపోయింది. అదేవిటో ఈ భార్యామణులు ఉన్నట్టుండి
తమ తమ మొగుళ్ళను ఎవరితోనో ఒకరితో పోల్చి తమ ఈగోను చల్లార్చుకుంటూ ఉంటారని
ఆడవాళ్ళంటే వోర్చుకోలేని ఒకాయన ఎప్పుడో చెప్పాడు. సాధారణంగా పక్కింటాయనతోనో, ఎదురింటాయనతోనో
(వాళ్ళ సంపాదనలతో సుమా) పోల్చి ‘మీరూ వున్నారు ఎందుకూ...’ అని సన్నాయినొక్కులు
నొక్కడం పరిపాటి. కానీ ఈసారి మా ఆవిడంబాళ్ళు నన్ను పోల్చి చెప్పింది
అట్లాంటిట్లాంటి అల్లాటప్పా వాళ్ళతో కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తోటి.
‘ఆయనకూ మీకూ తేడా ఏమీ కనబడడం లేదండీ’ అని ఉన్నట్టుండి
అనేసింది. ‘అమ్మ భడవఖానా. నన్నంటే ఏదో మొగుడుముండావాడ్ని
సరిపుచ్చుకుంటాను కాని నన్ను ప్రధాన మంత్రితో పోల్చడం, కాదు
కాదు సాక్షాత్తు ప్రధాన మంత్రిని నాతో పోల్చడం ఏవిటి
అసాధ్యం కూలా’ అనుకున్నాను.
ఏవిటో అనుకున్నాకాని ఆమె లాజిక్కు ఆమెకు వుంది.
“నరేంద్ర మోడీ గారి
లాగే నేను మొండివాడ్ని(ట). కాదు, నాలాగే ఆయన మొండివాడు. ఎవరి మాటా వినడు” ఆవిడ ఉవాచ. కాదంటే కుదరని మాట.
“ఎవరు ఏమైనా పరవాలేదు తన మాటే నెగ్గాలి అనే తరహా
ఆయన్ది, మీలానే” అని లా పాయింటు తీసింది.
“హౌరా!” అనుకున్నాను
నాలో నేనే.
“అన్ని ధరలు
పెరిగాయి కాస్త నెల బడ్జెట్ పెంచవయ్యా మగడా అంటే కుదరదంటే కుదరదని మీలాగే నిక్కచ్చిగా తెగేసి చెప్పేరకం.” ఏమనడానికి ఏముంది? నిజమే కదా!
ఇంతవరకు బాగానే
వుంది అనుకుంటూ వుంటే ఆఖరి తూటా పేల్చింది.
“మీరు బయట టీవీల్లో
మాట్లాడ్డం తప్పిస్తే ఇంట్లో వాళ్ళతో ఓ మాటా వుండదు ఓ ముచ్చటా వుండదు. ఆయన్ని
గురించి వాళ్ళ పార్టీ వాళ్ళదీ అదే గోల”
“అందుకే మీకూ ఆయనకూ
తేడాలేదనేది” అనేసింది పేపరు మడిచి పక్కనపడేస్తూ.
ఇంకేం అనను? అనాల్సింది అంతా
తానేఅనేసిన తరువాత. (11-11-2015)
NOTE: "మీ ఆవిడ పోయి రెండేళ్లు
దాటింది కదా!" అనే సందేహాత్మకులు కింద రాసిన
తేదీని మరోసారి గమనించండి.
పిడికెడు బియ్యం – భండారు శ్రీనివాసరావు
ఓ అరవై ఏళ్ళ క్రితం బెజవాడ గవర్నర్ పేట రవిస్ కాలువ వంతెన దగ్గరలో అన్నదాన సమాజం అనే ఒక సంస్థ వుండేది. ఈ సమాజానికి సంబంధించిన కార్యకర్తలు కొందరు రోజూ భుజాన ఒక జోలిలాంటిది తగిలించుకుని ఇంటింటికీ తిరిగేవారు. అప్పుడు చిన్నపిల్లలుగా వున్న మేము, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసేవాళ్ళం. రాగానే మా చిన్ని చిన్ని గుప్పిళ్ళతో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళ జోలెలో వేసేవాళ్ళం. 'గుప్పెడు బియ్యం వెయ్యండి. ఆకలితో వున్నవాళ్ళకు పట్టెడు అన్నం పెట్టండి' అనేది అన్నదాన సమాజం వారి నినాదం. అలా సేకరించిన బియ్యంతో అనాధ పిల్లలకు, నా అన్నవాళ్లు లేని వృద్ధులకు అన్నం వొండిపెట్టేవారు. ఆ అన్నం తిన్న వాళ్ళు తప్ప అన్నదాన సమాజం వారిని తలచుకునే ఇతరులు ఉంటారంటే నమ్మడం కష్టమే. ఎందుకంటె చేసే పని మంచిదన్న ఒక్క ధ్యాస తప్ప, చేసే పనికి ప్రచారం చేసుకోవాలన్న యావ లేనివాళ్ళు కదా!
ఇప్పుడది లేదని
చెప్పడానికి అక్కడికి వెళ్లి చూడనక్కరలేదు. ప్రభుత్వాల దయాధర్మం వల్ల ఎదిగే
సంస్థలు అయితే నాలుగు కాలాలు వర్దిల్లేవి, ఏ మంచి పనీ
చేయకుండా, ఏదో చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ.
కానీ అన్నదాన
సమాజం ఆ బాపతు కాదు కదా!
కంచి పరమాచార్య
కూడా ఈ పిడికెడు బియ్యం గురించే చెప్పారు.
స్వామి
ఏమన్నారంటే:
"వంట చేయడానికి బియ్యం కడిగేటప్పుడు ఒక పిడికెడు
బియ్యం వేరే ఒక పాత్రలో రోజూ వేయండి. అందులో ఒక చిల్లర డబ్బు కూడా వుంచండి. మీ
పేటవాసులంతా ఒక సంఘంగా ఏర్పడి అల్లా పోగుపడే బియ్యాన్ని సేకరించండి. మీ పేటలోని ఏ
ఆలయంలోనైనా ఆ బియ్యంతో పేదలకు అన్నదానం చేయండి.
చిల్లరడబ్బులను వంట చెరకు, ఇతర అధరువులు
కొనడానికి ఉపయోగించవచ్చు. పిడికెడు బియ్యంతో ఆకలిగొన్న పేదవాడి కడుపు నింపవచ్చు.
నిష్కామంగా మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది "
14, జూన్ 2021, సోమవారం
పెద్ద పాము నోట్లో… పడుతుంది అనుకుంటే – భండారు శ్రీనివాసరావు
రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చు కదా! – భండారు శ్రీనివాసరావు
బాధలు, ఇబ్బందులు రెలెటివ్ (సాపేక్షం) అని తీర్మానించాడు ఒకాయన.
నేను 1975 లో రేడియోలో
చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. చేసే ఉద్యోగం
రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం సచివాలయానికో మరో చోటికో.
అసలానౌకరీయే తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు
వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు.
తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని జీతం పెరిగి నా
ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోల వల్ల, ఆటోవాలాల వల్ల
ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా పెద్దగా కనబడడం
మొదలయింది. ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం ఝామ్మని తిరగడం మొదలయింది కానీ, జీవితంలో
ఇబ్బందులను స్కూటరు వాలా కోణం నుంచే గమనించడం కూడా మొదలయింది. ఇలా బోలెడు జీవితం
సినిమా రీలులా తిరిగి, కారూ, డ్రైవరు వైభోగం పిల్లల ద్వారా సంక్రమించిన తరువాత ఇబ్బందుల రంగూ, రుచీ, వాసనా మరో రూపం
సంతరించుకున్నాయి. సిటీ బస్సు, ఆటో, స్కూటరు రోజుల
ఇబ్బందులు మూగమనసులు సినిమాలోలా లీలగా గుర్తున్నాయి.
ఏతావాతా చెప్పేది
ఏమిటంటే ఇబ్బందులు, కష్టాలు రెలెటివ్. మేం అనుకునే ఇబ్బందులు
వేరు, మా పనివాళ్ళ ఇబ్బందులు వేరు. మనం ఏ ఇబ్బందీ లేకుండా వుంటున్నామంటే అందరూ
అలా వుంటున్నారని కాదు. ఎవరి ఇబ్బందులు వారివి. మనకు చిన్నవే కావచ్చు వారికి
పెద్దవి కావచ్చు. అలాటివారిని చిన్నబుచ్చడం పెద్దరికం అనిపించుకోదు.
తినడానికి రొట్టె
లేక ఆకలితో ఓ అమ్మాయి ఏడుస్తుంటే ‘ రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే రాజకుమారి జోకులు పుట్టింది ఇందుకే!
అమరావతి శివలింగం – భండారు శ్రీనివాసరావు
999999
ఈ సంఖ్యకు ఒకటి
చేరితే... 100000 అక్షరాలా పది లక్షలు.
కానీ అక్కడ వున్నవి ఆరు
గళ్ళే మరి.
ఇదంతా దేనికంటే ,,,,,
ఈ అంకెలు నా బ్లాగులో
వీక్షకుల సంఖ్యలు. ఈరోజు వరకు ఈ సంఖ్య 999 555 కి చేరుకుంది. మరో 444తో లక్ష వత్తుల నోములు పది పూర్తవుతాయి. Total
Viewers అనే దానికింద వున్నవి తొమ్మిది గళ్ళు (బాక్సులు) మాత్రమే. ఇక లక్ష అయితే ఈ తొమ్మిది గళ్ళు ఎలా సరిపోతాయి. మరో గడి వచ్చి
చేరుతుందా! లేని పక్షంలో ఏమి జరుగుతుంది? (Like Y2K Problem) నా బ్లాగు అనికాదు కానీ ఈ ప్రశ్న నాకు ఆసక్తిని
రేకెత్తిస్తోంది.
అమరావతిలోని
అమరలింగేశ్వర స్వామివారి దేవాలయంలో గర్భగుడిలోని శివలింగం ప్రతి రోజూ పెరిగి పోతుంటే, లింగం మీద
ఒక మేకు కొట్టారని, దానితో లింగం పెరుగుదల ఆగిపోయిందని, లింగం మీద ఎర్రటి రక్తపు
చారికలు ఇప్పటికీ వున్నాయని ఓ కధ
చిన్నప్పుడు విన్నాను.
ఇక్కడ కూడా అలాగే
జరిగి 999999 దగ్గరే ఆగిపోతుందా!
ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాళ రేపట్లో తేలిపోతుంది.
(14-06-2021)