6, మే 2021, గురువారం

నాకు తెలుసు నాకే తెలుసు

“నాకు అంతా తెలుసు అనుకోవడంలోనే తెలుస్తోంది అంతగా ఏమీ తెలియదని. I am sure.” అని నా పాత్రికేయ మిత్రుడు శ్రీ బుద్ధవరపు రామకృష్ణ నిన్న ఒక చిన్న పోస్టు పెట్టాడు. నేను దానికి “'నాకూ తెలుసు', 'నాకే తెలుసు' ఈ రెంటికి తేడా తెలిస్తే అంతా తెలిసినట్టే!” అని కామెంటు పెట్టాను. నిజానికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఓ పోస్టుకు, రాజకీయ రంగులు ఏమాత్రం లేని కామెంటు.

దురదృష్టం ఏమిటంటే కొందరికి అవే కనిపించాయి. తప్పు లేదు, సహజం కూడా. వాటికి జవాబుగా అనికాదు కానీ ఎందుకో ఈ పోస్టు పెట్టాలని అనిపించింది.
ఇప్పుడు యాభయ్యవ పడిలో ఉన్న టీడీపీ అభిమానులను ఆ పార్టీకి ఎవరు శ్రీరామరక్ష అని అడిగితే యన్టీ రామారావు, చంద్రబాబునాయుడు అని చెబుతారు. అదే ప్రశ్నను ముప్పయ్యేళ్ళ వయస్సులో ఉన్న ఆ పార్టీ అభిమానులను అడిగితే ప్రాధాన్యతలు మారి, చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ అని వరస మార్చి చెబుతారు. కాలగతిలో వచ్చే మార్పు ఇది.
నా యాభయ్ ఏళ్ళ పాత్రికేయ జీవితంలో అనేకమంది రాజకీయ నాయకులతో సన్నిహితంగా మెలగగలిగే అరుదైన అవకాశాన్ని నా వృత్తి నాకు అందించింది. ఇది నా గొప్ప కాదు, నేను చేసిన ఉద్యోగం మరెవరు చేసినా వారికీ ఈ అవకాశం లభించి వుండేది.
ఆ అవకాశం ఇచ్చిన అనుభవంతో చెప్పగలను, ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద ప్రజల్లో చర్చ జరిగేలా చూసుకుంటారు. వాటిపై పత్రికల్లో, మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకున్నట్టు చివరికి ప్రకటిస్తారు. నిజానికి ఇది ప్రజాస్వామ్య బద్ధమైన ప్రక్రియే. దానికి విరుద్ధం కాదు. కానీ ఆ నిర్ణయానికి ప్రజామోదం వున్నట్టు తెలిసేలా జాగ్రత్త పడతారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తివేయక తప్పని పరిస్తితులు ఏర్పడ్డప్పుడు కూడా ఆయన ఇదే విధానాన్ని పాటించారు. పత్రికల్లో ప్రచారం ద్వారా ప్రజలను మానసికంగా అందుకు సంసిద్ధులను చేసిన తర్వాతనే ఆయన తన నిర్ణయాన్ని అమలుపరిచారు. అందువల్లనే మద్యనిషేధం తొలగించినా ప్రజల్లో వ్యతిరేకత కానరాలేదు.
ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ మహానాడు జరిగితే చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజకీయ ప్రవేశం చేయాలని కోరుతూ పార్టీ అభిమానులు పెద్దపెద్ద బ్యానర్లు కట్టారు. వాటి గురించి పత్రికల్లో వచ్చిన తర్వాత చంద్రబాబు ఆ కటౌట్లు, బ్యానర్లు తొలగించాలని ఆగ్రహంతో ఆదేశించినట్టు కూడా మళ్ళీ పత్రికల్లో వచ్చింది. మధ్యాన్న భోజన సమయంలో కాబోలు నేను ఆయన్ని కలిసి సూటిగానే అడిగాను, ఇంత తంతు అవసరమా అని. ఆయన తనదైన శైలిలో నవ్వి ఊరుకున్నారు. అదే విలేకరుల సమావేశంలో ఇలా ఇబ్బంది పెట్టె ప్రశ్న వేస్తె ‘ఏం బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు అని గద్దించేవారు. విడిగా అడిగితే సౌమ్యంగా నవ్వి ఊరుకునేవారు. అది ఆయన స్వభావం.
ప్రతి దానికీ ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ఆయన కొత్తగా చేసుకున్న అలవాటు కాదు.
1978 లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఆయన చిత్తూరు జిల్లాలో పులిచర్ల సమితికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ ఎన్నికల్లో మొదటిసారి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. అందువల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే బెడద లేదు. జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ తరపున అభ్యర్ధులు వున్నారు. మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా ఏర్పడ్డ ఇందిరా కాంగ్రెస్ (కాంగ్రెస్ ఐ)కి అభ్యర్ధులే కరువయ్యారు. చంద్రబాబుకు ఆ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేయడం అదే మొదటిసారి. అందువల్ల ఛాన్స్ తీసుకోదలచుకోలేదు. అసలే కొత్త పార్టీ. ప్రత్యర్ధులు బలమైన వాళ్ళు. అంచేత ఆయన ముందు జాగ్రత్తగా ఆలోచించి తన విజయావకాశాలు ఎలా వుంటాయి అనే విషయం మీద ఒక అవగాహన కోసం చంద్రగిరి అసెంబ్లీలో ఒక సర్వే జరిపించారు. ఒకరకంగా అదే మొదటి పోల్ సర్వే అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత చంద్రబాబు ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం అన్నది ఆయన రాజకీయ భవిష్యత్తుకు గట్టి పునాది వేసింది.
(ఈ సర్వే సంగతి శ్రీ కే. లక్ష్మినారాయణ వల్ల వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆయన శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేసారు. సమర్దుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అనతికాలంలోనే చక్కటి పేరు రావడానికి శ్రీ లక్ష్మీనారాయణ వంటి అధికారుల పాత్ర చాలా వుంది. ప్రముఖ సంపాదకులు శ్రీ ఇనగంటి వెంకట్రావు చంద్రబాబును గురించి రాసిన “ఒక్కడు- The Leader” అనే పుస్తకంలో ఈసర్వే సంగతి ఉదహరించారు)
(06-05-2021)

5, మే 2021, బుధవారం

ఒక రకంగా యుద్ధమే!

 పీఎం కేర్స్ (PMCARES) నిధులతో ఢిల్లీలోని AIMS, రాం మనోహర్ లోహియా ఆసుపత్రులలో రెండు భారీ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన మొదలయిందని, రేపటి నుంచి రోగులకు ఆక్సిజన్ సరఫరా మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది. సంతోషం.

భారత సైన్యంలో EME అనే ఒక విభాగం వుంది. దాని ప్రధాన కార్యాలయం సికిందరాబాదు. రేడియో విలేకరిగా కొన్ని డజన్ల సార్లు ఈ విభాగం చేసే కార్యకలాపాలు దగ్గర నుండి చూసే అవకాశం నాకు లభించింది. సైన్యంలో ముందు భాగాన వుండి పోరాడే సైనికులకు అవసరం అయ్యే సరఫరాలను ఈ విభాగం కంటికి రెప్పలా కనిపెట్టి అందిస్తుంది. ఆయుధాలు, యుద్ధ పరికరాలు, వాటి నమూనాలు, అభివృద్ధి సమస్తం ఈ విభాగం ఆధ్వర్యంలో జరుగుతుంది. యుద్ధ రంగాల్లో అగ్రభాగాన నిలబడి పోరాడే సైనికులకు ఇది వెనకనుండి మద్దతు ఇస్తుంది. యుద్ధ సమయాల్లో దీని ప్రాధాన్యత చాలా వుంటుంది.
ఇప్పుడు దేశం సాగిస్తున్న కరోనాపై యుద్ధంలో కూడా ముందుండి పోరాడే డాక్టర్లు, నర్సులు, ఇతర సాంకేతిక వైద్య సిబ్బంది, రోగులకు అవసరం అయ్యే సరఫరాలను సరిగా అందేటట్టు చూడడానికి ఇటువంటి ప్రత్యేక విభాగం ఆవశ్యకత చాలా వుందనిపిస్తోంది.
దేశంలో అనేక చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. వాక్సిన్ అందుతోంది. ఇతర వైద్య పరికరాలు, ఔషధాలు సరిపడా ప్రస్తుతం లేకున్నప్పటికీ ముందు ముందు పరిస్థితులు బాగుపడే అవకాశాలు వున్నాయి. అయితే దేశంలో వివిధ రాష్ట్రాలలో అన్నిచోట్లా పరిస్థితులు ఒకే రకంగా లేవు. అవసరాలు కూడా విభిన్నంగా వున్నాయి.
రోగుల్ని గుర్తించడం, రోగ స్థాయిని నిర్దారించడం, వారి వైద్య అవసరాలను అంచనావేయడం, కావాల్సిన మందులు, పరికరాల సంఖ్యను గణించడం, ఆవశ్యకతని బట్టి వాటిని కాలయాపన జరగకుండా గమ్యస్థానానికి చేర్చడం ఇవన్నీ కరోనాపై చేసే యుద్ధంలో ప్రాధాన్యత కలిగిన అంశాలు.
అలాగే, ఒక చోట ఆక్సిజన్ అవసరం అవుతుంది. మరో చోట రెండెసివిర్ వంటి ఇంజెక్షన్లు అవసరం పడతాయి. ఇంకోచోట మరోటి అవసరం. ఈ అవసరాలు అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ఎక్కడా ఎవరికీ ఆలస్యం అన్నది జరగకుండా సరఫరాలు సాగాలి. ఎక్కడ ఎవరికీ ఏ పరిమాణంలో అవసరమో అక్కడికి అవి సత్వరం చేరేలా చూడాలి. దేశంలో ఎక్కడా, ఎవరూ తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామని బాధ పడే అవకాశం లేకుండా ఈ ఏర్పాట్లు పారదర్శకంగా వుండాలి. ఈ అవసరాలు అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. ఎక్కడా ఎవరికీ ఆలస్యం అన్నది జరగకుండా సరఫరాలు సాగాలి. ఇందుకోసం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
ఇలాంటి విషయాల్లో మానవ సామర్ధ్యానికి సాంకేతిక వనరులు తోడయితే సత్వర ఫలితాలు సాధ్యం అవుతాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సాంకేతిక దేశీయ దిగ్గజాలు తలచుకుంటే చిటికెలో పని.
యుద్ధ ప్రాతిపదికన అనే పద ప్రయోగానికి నిజమైన అర్ధం ఇదే!
ఇవన్నీ ఒక పక్కన చేస్తూ మరో పక్కన అవసరం అనుకుంటే కర్ఫ్యూలు, లాక్ డౌన్ వంటి ప్రత్యామ్నాయాలు గురించి కూడా ఆలోచన చేయవచ్చు.
ఇక్కడ కేంద్రం, రాష్ట్రాలు అనే విభజన అనవసరం. చేస్తున్నది కరోనాపై యుద్ధం. జాతి యావత్తూ ఒక్కటై సాగించాల్సిన సమరం. పైగా గెల్చి తీరాల్సిన పోరాటం. మరో ప్రత్యామ్నాయం లేదు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, తరువాత పరిపాలన మాత్రమే అని రాజకీయ పార్టీల నాయకులు తరచూ చెబుతుంటారు. ఇప్పుడు ఇక కొత్తగా పెట్టే ఎన్నికలు కూడా లేవు. రాజకీయ నాయకులు తమ మాటల్లోని చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం!
(05-05-2021)
కింది ఫోటో : ఢిల్లీలో నిర్మాణం పూర్తయిన ఆక్సిజన్ ప్లాంట్ ( కేంద్ర ఆరోగ్యశాఖ సౌజన్యం)



కాడి బరువు

 సంసారం నడపడానికి గృహస్తు ఎలా తంటాలు పడతాడో, ప్రభుత్వాలు కూడా అంతే! వాళ్లకి డబ్బులు ఆకాశం నుంచి రాలి పడవు. పన్నుల రూపంలో  ప్రజలనుంచే  వస్తాయి. ఆ సంగతి తెలుసు కాబట్టే  ఔరంగజీబు జిజియా పన్నుతో సరిపుచ్చితే, ఈనాటి ప్రజాప్రభుత్వాలు ఆయన్ని మించిపోయి ఆదాయ మార్గాలు కనుక్కుంటున్నాయి.  ఒడ్డున కూర్చొని నీతులు చెప్పే ప్రతిపక్ష రాజకీయ నాయకులు తాము అధికారంలోకి రాగానే ఇవే పనులు చేస్తారు. వాళ్ళకీ తెలుసు, మోసేవాడికి తెలుస్తుంది కాడి బరువు అని.

ఎన్ని చూడలేదు, ఎంతమందిని చూడలేదు?

అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామంటూ ఆర్భాటంగా హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు, గద్దె ఎక్కగానే ఆ వూసు ఎత్తవు. ఎందుకంటే, మద్యం వల్ల సంసారాలు చితికి పోయే మాట నిజమే కాని, నిషేధం విధిస్తే ప్రభుత్వాలు ఆర్ధికంగా దెబ్బ తింటాయనే నిజం వాళ్లకు తెలుసు కనుక. వాళ్ళు ఏ ఆట ఆడాలన్నా ముందు విత్తం వుంటేనే కద. ఖజానా నిండుగా వుంటేనే నడిచేది కధ.

ఏదైనా రాజకీయ పార్టీ అది అధికారంలో వున్నప్పుడు మద్యం అమ్మకాలకి తాము వ్యతిరేకం అంటే నమ్మే పరిస్థితి ఉందా! అసలు అలా అనగలవా, ఏదో ఎన్నికలు  దగ్గర పడితే తప్ప.

(ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్)అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే 1968 జూన్ 26 వ తేదీన వావిలాల వారు చేసిన ప్రసంగం దొరికింది. (ఆయన మద్యానికి సంపూర్ణ వ్యతిరేకి)

 

ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ఏరియా) మద్య నిషేధం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ వావిలాల గోపాలకృష్ణయ్య గారు చేసిన ఈ ప్రసంగం అచ్చులో దాదాపు రెండు పేజీల పైన వుంది. విషయవిస్తరణ భీతితో దాన్ని కుదించాల్సి వచ్చింది.

వావిలాల వారు ఏమన్నారంటే:

 

మన జీవితమంతా రెండు నాలుకలలో నడుస్తున్నది. నిన్న మొరార్జీ దేశాయి గారు ఇక్కడకు వచ్చి ప్రొహిబిషన్ రద్దు చేయడానికి వీలు లేదన్నారు. ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉన్న నిజలింగప్ప గారు ఇంకొక మాట చెబుతున్నారు. బెంగుళూరులో వారిని అడిగితె, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, సామాన్య ప్రజలు ఎంతవరకు శిరసావహిస్తారు అనే దృష్టితో చూడాలి. ఏమైనా ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొరార్జీ దేశాయి గారు ప్రొహిబిషన్ వల్ల కలిగే నష్టంలో సగం ఇస్తాం అంటున్నారు. అసలు డబ్బు ఎక్కడ వుంది?

“....కాంగ్రెస్ ఆదర్శాలతో వుండేవారు ఈనాడు బహిరంగంగా తాగడానికి పర్మిట్లు ఎందుకు ఇస్తున్నారు. తాగనిస్తారట. పర్మిషన్ లేకుండా తాగేవారిని జైల్లో పెడతారట. తెలంగాణలో ప్రొహిబిషన్ అక్కరలేదా. ఆంధ్రాకే కావాలా. ఇట్లా ఈ రెండు నాలుకల రాజ్యం ఎన్నాళ్ళు సాగుతుందో అర్ధం కావడం లేదు. నేను ప్రొహిబిషన్ కు అనుకూలుడను అనేది మాత్రం క్లియర్ గా చెబుతున్నాను. కానీ ఇప్పుడు ప్రొహిబిషన్ అమలు జరుగుతున్నది అంటే నన్ను నేను మోసగించుకోవడం, మిమ్ములను మోసగించడం తప్ప ప్రొహిబిషన్ ఎక్కడా లేదు. దీనివల్ల అధికారులు లంచగొండులవుతున్నారు. దాదాపు పన్నెండు దేశాలలో ప్రొహిబిషన్ అమలు చేసారు. ఆ దేశాలలో రాజ్యం ఎవరి చేతుల్లోకి పోయింది. బూటులిక్కర్స్ చేతికే పోయింది.

మోరల్స్ లేవు. బహిరంగంగా తాగుతూ వుంటే ఎదురుగా వుండి కూడ, కళ్ళు వుండికూడా మూసుకుని వ్యవహరిస్తున్నాము. అమలు చేయడానికి సమర్ధత లేకపోతె వదిలేయాలి. (ప్రొహిబిషన్) అమలు చేస్తారంటే సరిగా అమలుచేయాలి.

“... ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలి. అమలు చేయడానికి సమర్ధత లేదంటారా ఏడుస్తూ ఒప్పుకుంటాము”

ఆ కాలంలో మద్య నిషేధం గురించిన వావిలాలవారి మధనం అది.

 

ఇక ప్రస్తుతానికి వస్తే,

నిరుడు కేంద్రం కరోనా విషయంలో కొత్త మార్గదర్శికాలు ప్రకటించగానే లిక్కర్ షాపులు ఓపెన్ చేయడానికి పచ్చ జండా వూపిన రాష్ట్రాలు ఇవే.

1. ఆంధ్రప్రదేశ్

2. ఉత్తరప్రదేశ్

3. పశ్చిమ బెంగాల్

4. మహారాష్ట్ర

5. ఛత్తీస్ గర్

6. కర్ణాటక

7. అసోం

8. హిమాచల్ ప్రదేశ్.

ఈ రాష్ట్రాలు ఏ పార్టీల పాలన కింద వున్నాయో విడమరిచి చెప్పక్కర్లేదు.

ఈ రాష్ట్రాల్లో అన్ని పార్టీల వాళ్ళు అధికారంలో వున్నారు.

కాబట్టి అందరూ అందరే. చొక్కాలు చించుకోనక్కరలేదు.

ఒక్కముక్కలో చెప్పాలంటే:

"మద్య నిషేధం రాజకీయ పార్టీలకి విజయ నినాదం

మద్యం అమ్మకం ఆ పార్టీల ప్రభుత్వాలకు ప్రాణాధారం"

తోకటపా:

రెండేళ్ల క్రితం (2019) ఎన్నికల ఫలితాల సమయంలో టీవీ విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఎనిమిదింటికి మొదలైన చర్చ అర్ధరాత్రి దాకా సాగింది. ప్రోగ్రాం అయిన తర్వాత నాతో పాటు పాల్గొన్న మరో విశ్లేషకుడు అడిగారు, ఈ టైములో ఎక్కడైనా బార్లు తెరిచివుంటాయా అని. ఆ రాత్రి అలాంటి బారు పట్టుకున్నామా లేదా అనేది వేరే విషయం.

మళ్ళీ ఒక  రోజు ఆయన ఓ టీవీ చర్చలో కనపడ్డాడు, 'ప్రభుత్వం మద్యం షాపులు తెరవడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే' అని బల్ల గుద్ది వాదిస్తూ.

(2021)

 

 

 

 

3, మే 2021, సోమవారం

సీనియర్ జర్నలిస్టు ఆజాద్ చిస్తీ

 మరణవార్తలు రాయడానికి మనసు శరీరము సహకరించడం లేదు. సీనియర్ జర్నలిస్టు ఆజాద్ చిస్తీ చనిపోయినట్టు ఇప్పుడే తెలిసింది. సచివాలయం బీట్ చూసేవారందరికీ చిరపరిచితుడు.



నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాదు జర్నలిస్టులు ఎవరితో ఆయనకు పరిచయం లేదు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడల్లా ఆజాద్ చిస్తీ, సోఫాలో ఆయన పక్కనే కూర్చొనేవాడు. ఆ రోజుల్లో విలేకరులు సరదాగా చెప్పుకునేవారు. హైదరాబాదు జర్నలిస్టుల్లో ఎన్టీఆర్ ముఖం చూసి గుర్తు పట్టేది ఇద్దరినే అని. ఒకరు ఆజాద్ చిస్తీ. మరొకరు హిందూ రెసిడెంట్ ఎడిటర్, ప్రముఖ పాత్రికేయులు, కీర్తిశేషులు శ్రీ హెచ్. జే, రాజేంద్ర ప్రసాద్.
శ్రీ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వున్నప్పుడు ఒకసారి హైదరాబాదు వచ్చారు. ఆ సందర్భంలో ఏదో కార్యక్రమానికి వెడుతూ ట్రాఫిక్ లో చిక్కుకు పోయారు. సాధారణంగా అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆ రోజు ఓ గేదెల గుంపు హఠాత్తుగా రోడ్డు పైకి రావడంతో ముందుగా ఊహించని పోలీసులు బిత్తర పోయారు. అప్పుడు ఈ సంఘటనని మొట్టమొదట రిపోర్ట్ చేసింది ఆజాద్ చిస్తీ.
(03-05-2021)

సబ్బం హరి ఇక లేరు

 నేను ఆలిండియా రేడియోలో పనిచేసేటప్పుడు విశాఖపట్నంలో మా రేడియో ప్రతినిధి, నా సీనియర్ కొలీగ్ బి.ఎన్ రావు (నారాయణరావు) ద్వారా  శ్రీ సబ్బం హరితో  పరిచయం. వైజాగ్ లో వుండే విలేకరులకే కాకుండా మొత్తం ఉత్తరాంధ్రాలోని జర్నలిస్టులు అందరికీ ఆయన ఇష్టుడు. పార్లమెంట్ సభ్యుడు కావడం వల్ల హైదరాబాదులో వుండే మా బోంట్లకు వ్యక్తిగత పరిచయం కాస్త తక్కువే. కాకపొతే, ఫోన్ చేస్తే  ఎక్కడ వున్నా వెంటనే  స్పందించి  ఓపికగా అడిగిన వాటికి జవాబు చెప్పేవారు. నేను రిటైర్ అయిన తర్వాత అనేక టీవీ డిబేట్లలో వారితో కలిసి పాల్గొనే అవకాశం నాకు లభించింది. విషయాన్ని విపులీకరించే తీరు అందర్నీ ఆకట్టుకునేది. విషయ పరిజ్ఞానం కలిగిన రాజకీయ నాయకుడు కావడం వల్ల టీవీ చర్చల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఆయన హఠాన్మరణ వార్త కలచి వేసింది. పెద్ద వయసు కాదు. రాజకీయాల నుంచి కొంత పక్కకు తప్పుకుని రాజకీయ విశ్లేషణలకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నారు.

సబ్బం హరి గారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.  

(03-05-2021)

ధన్యజీవి జ్వాలా

 కంచి కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ఆసేతు హిమాచలం అంతటా పరమ పూజ్యనీయులు. అలాంటి మహనీయుడి నోటి నుంచి ఒక రచయిత పేరు, ఇంటి పేరుతో సహా పలుమార్లు  ప్రస్తావనకు రావడం అంటే, అంతకు మించిన అదృష్టం వుండదు. అలాంటి సుకృతం నా మిత్రుడు,  నా మేనకోడలు విజయలక్ష్మి భర్త అయిన  వనం  జ్వాలా నరసింహారావుకు లభించడం మా కుటుంబం మొత్తానికి గర్వకారణం.     

జ్వాలా ఐహిక పరమైన గృహస్తుబాధ్యతలు ఓ పక్క నిర్వర్తిస్తూనే, మరోపక్క ఆముష్మిక మార్గంలో గత రెండు దశాబ్దాలుగా అనేక ఆధ్యాత్మిక గ్రంధ రచనలు  చేస్తూ వస్తున్నాడు. తాజాగా ‘ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాధలు అనే పుస్తకాన్ని రాయడం, దర్శనం శర్మగా ప్రసిద్ధి చెందిన శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ ప్రచురించడం ఈ కరోనా కట్టడి సమయంలో కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగడం నిజంగా ఒక అద్భుతమే. పరమేశ్వరుడి కృప ఉంటేనే సాధ్యం.



అంతకు మించిన భాగ్యం ఈ ఇరువురికీ దక్కింది ఎలా అంటే కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు స్వయంగా తమ అమృత హస్తాలతో నిన్న ఆదివారం సాయంత్రం  ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి అనుగ్రహ భాషణ చేయడం. కంచి పీఠం నుంచి స్వామి కరకమలాలతో చేసిన ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదారాబాదులోను, ఇతర ప్రదేశాలలోనూ ఉన్న భక్త జనం, దర్శనం ఆధ్యాత్మిక మాస పత్రిక వారు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వీక్షించగలిగారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ శ్రీ చరణులు ఇలా అన్నారు.

“రామాయణం  గొప్ప ఇతిహాసం. శ్రీరామచంద్రుడు  భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి, సాంప్రదాయ పరంపరకు ప్రతీక. మనిషి అనేవాడు ఎలా వుండాలి అనేది రామాయణం చెబుతుంది.  రామనామం మధురాతి మధురం. అందుకే ఉత్తర భారతాన ప్రతి ఒక్క సామాజిక వర్గంలోనూ రామ రామ అనే పేరుకలవాళ్ళు  అనేకమంది వుంటారు.

“వనం – దర్శనం (రాసింది వనం జ్వాలా నరసింహారావు, ప్రచురించింది దర్శనం శర్మ). శ్రీరాముల వారు కూడా వనం దర్శనం చేశాడు. దండకారణ్యంలో ప్రవేశించాడు.

“వనం జ్వాలా నరసింహారావు లోగడ అనేలా ఆధ్యాత్మిక రచనలు చేశారు. ఇప్పుడు ఈ రామాయణం గురించి రాసారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం అవుతోంది. ఈనెలలోనే శ్రీరామ నవమి జరుపుకున్నాము. అదే సమయంలో రామాయణ రసరమ్య గాధలు పుస్తకం కూడా.

“విశాల దృక్పథం, అందర్నీ కలుపుకుని పోయే తత్వం (Coexistence), ధైర్యం ధన ప్రధానమైన జీవితం కాకుండా  గుణ  ప్రధానమైన జీవనం ఇవన్నీ భారతీయ సంస్కృతిలో భాగాలు. స్థిరప్రజ్ఞత, స్థితప్రజ్ఞతలతో భారతీయ ఇతిహాస పరంపర పరిపక్వత చెందింది.

“రానున్న తరాలలో ఈ పరంపర కొనసాగించడానికి వనం జ్వాలా నరసింహారావు రాసిన సంశోధనాత్మక  సాహిత్యం అవసరం.

“విభూతి అంటే ఏమిటి? గోమయం విశిష్టత ఏమిటి? తిలక ధారణ ఏమిటి అనే విషయాలను విపులీకరిస్తూ తమిళంలో ఒక పుస్తకం వేశారు. అలాంటివి తెలుగులో కూడా రావాలి. E-learning ద్వారా దేశ విదేశాల్లోని బాలబాలికలకు భారతీయ ఆధ్యాత్మిక విలువలను బోధించాలి”

గ్రంధ రచయిత శ్రీ వనం జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ  ఆధ్యాత్మిక గ్రంధ రచనకు తనను ప్రోద్బలం చేసిన కారణాలను వివరించి, పుస్తకావిష్కరణ చేసిన కంచి స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ఆసాంతం  పాల్గొనడం ఓ విశేషం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వీ. సుబ్రహ్మణ్యం, కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ శ్రీ మాడభూషి శ్రీధర్, ఎస్.బి.ఐ. మాజీ సీ.జీ.ఎం. శ్రీ భండారు రామచంద్రరావు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వి.జే.ఎం. దివాకర్, బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ, శ్రీ దర్శనం శర్మ ప్రభ్రుతులు పాల్గొన్నారు.   

(03-05-2021)

             

  

1, మే 2021, శనివారం

దీన్ని దోపిడీ అని కాకుండా వేరే విధంగా అనొచ్చా!


మా వాచ్ మన్ భార్య చెప్పింది. వాళ్లకు తెలిసిన వాళ్లకు ఒంట్లో నలతగా వుంటే ఓ డాక్టరు దగ్గరికి వెళ్ళారుట. కన్సల్టేషన్ వంద రూపాయలే తీసుకుంటాడు కనుక మంచి డాక్టరు అని వాళ్ళ నమ్మకం.

తీరా వెడితే, వీళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా ఓ కాగితం మీద సీటీ స్కాన్ అని రాసి, అది ఎక్కడ తీసుకోవాలో అది కూడా చెప్పి, ఆ రిపోర్టుతో రమ్మని తన ఫీజు నూర్రూపాయలు తీసుకుని పంపించేశాడుట.

సీటీ స్కాన్ అంటే వేలతో వ్యవహారం. ఇలా ప్రతి చిన్న విషయానికి అంత పెద్ద టెస్టులు రాయాల్సిన అవసరం ఉంటుందా!
క్లినిక్కుల వాళ్ళే ఇలా చేస్తుంటే, కార్పొరేట్ వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోరు కదా!

“చిన చేపను పెద చేప. చిన మాయను పెను మాయ. అది స్వాహా. ఇది స్వాహా’
(01-05-2021)