'డెబ్బయ్ అయిదేళ్లు వచ్చాయి. సొంత ఇల్లంటూ వున్నట్టు లేదు. ఇలా ఎన్నాళ్ళు' అని శ్రేయోభిలాషులు తరచూ అడిగే ప్రశ్న.
22, మార్చి 2021, సోమవారం
ఇల్లెందుకే నీకు చిలకా! – భండారు శ్రీనివాసరావు
మరపురాని గతం
చిన్నప్పుడు సెలవుల్లో కంభంపాడు వెళ్లి అమ్మ దగ్గర కొన్నాళ్ళు వుండి మళ్ళీ బెజవాడ బయలుదేరే వాడిని. ఆ రోజు అమ్మ ఎందుకో చాలా దిగులుగా వుండేది. మాటిమాటికీ మళ్ళీ ఎప్పుడు వస్తావురా అని అడుగుతుండేది. నాకూ అమ్మను వదిలి వెళ్ళాలి అంటే బెంగగానే వుండేది. కానీ స్కూలు, చదువులు గుర్తొచ్చి బట్టలు సదురుకునేవాడిని ప్రయాణం కోసం.
దొడ్లో చింతచెట్టు పక్క నుంచి పెనుగంచి ప్రోలు వెళ్ళడానికి ఓ రాళ్ళ దారి వుండేది. వెనక్కి వెనక్కి చూస్తూ ముందుకు నడిచేవాడిని. ముందు వంటింటి గుమ్మంలో నిలబడ్డ అమ్మ మొహం కనిపించేది. కాసేపటి తర్వాత ఆ గుమ్మం మెట్లు దిగివచ్చి చింతచెట్టు కింద నిలబడి వుండేది. వెనక్కి చూసినప్పుడు అమ్మ నా వంకే చూస్తూ కనపడేది. మళ్ళీ ఎప్పుడు చూస్తానురా నిన్ను అన్నట్టు ఉండేవి ఆ చూపులు. తిరిగి వచ్చేదాకా నా మొహాన్ని తన కనురెప్పల నడుమ దాచి వుంచుకోవాలి అన్నట్టు దీక్షగా నా వైపు చూస్తున్నట్టు అనిపించేది.
ఎంతైనా అమ్మ అమ్మే.
(21-03-21)
20, మార్చి 2021, శనివారం
ఇరవై ఏడు రౌండ్లు
ఇదేమీ సాయంత్రం రౌండ్ల లెక్క కాదు.
మళ్ళీ
నలభయ్ ఏళ్ళ నాటి ముచ్చటే
ఆ
రోజుల్లో ఇలాగే పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరిగింది.(అప్పుడు ఒకటే సీటు అని
గుర్తు)
పోలింగు
పూర్తయింది. ఓట్ల లెక్కింపు మొదలయింది.
ఒకటో
రౌండ్, రెండో రౌండ్
(అంటే లెక్కింపులు) ఇలా అక్షరాలా ఇరవై ఏడు
రౌండ్లు పూర్తయిన తరువాత కానీ తుది ఫలితం రాలేదు. నాటి విజేత చివరికి గెలిచింది
అక్షరాలా ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో.
శాసనసభలో పద్యం పాడిన వై.ఎస్.ఆర్. - భండారు శ్రీనివాసరావు
ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు శాసనసభలో ఏకంగా ఒక పద్యం మొత్తం చదివి వినిపించారు.
చంద్రబాబుకి కితాబు ఇచ్చిన కుల్ దీప్ నాయర్ – భండారు శ్రీనివాసరావు
చంద్రబాబు నాయుడు
గారిది విలక్షణమైన తరహా. శాసన సభలో ఆయన చేసే
ప్రసంగాలలో పద్యాలు, గేయాలు వుండవు. కానీ ఆర్ధిక అభ్యున్నతి గురించి, సంస్కరణలు గురించి
కొందరు ప్రముఖులు ఆయా సందర్భాలలో చేసిన కొటేషన్లు బాగా చోటుచేసుకుంటాయి.
ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను చేపట్టిన వివిధ అభివృద్ధి పధకాలు గురించి
ప్రతిపక్ష నాయకుడిగా చేసే ఉపన్యాసాలలో వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగే, ముఖ్యమంత్రిగా
సభలో మాట్లాడేటప్పుడు కూడా ఈ పధకాల వివరాలు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడతారు.
1999 నవంబరు 16 వ తేదీన గవర్నర్
ప్రసంగంపై చర్చకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంలో కొన్ని భాగాలు ఇలా సాగాయి.
"నేను రాష్ట్రం
అభివృద్ధిని కోరుకుంటున్నాను. నా పట్ల ప్రజలకున్న అభిమానాన్నే నమ్ముకున్నాను.
అందువల్లే ఎన్నికల్లో మీ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజల ఆశీర్వాదం నాకుంటుంది అని
మొదటినుంచీ చెబుతున్నాను. అదే ఈనాడు నిజమైంది. కుల్ దీప్ నాయర్ మాట్లాడుతూ, 'నేను ఆంద్ర
ప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించడం లేదు, ఆంద్ర ప్రదేశ్
ఓటర్లని అభినందిస్తున్నాను. ఒక విజ్ డమ్ ని వాళ్ళు వ్యక్తం చేసారు. చాలా
మెచ్యూరిటీ ప్రదర్శించారు. కర్నాటక, మహారాష్ట్ర
కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆంద్ర ప్రదేశ్ మాకు ఆదర్శం అంటున్నారు. ఇండియన్ ప్రైమ్
మినిస్టర్ ఇంకా గట్టిగా చెప్పారు. 'దేనికయినా ఆంద్ర
ప్రదేశ్ కొలమానం' అని. 'అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని
అనుసరించాలి' అని. ఇంటర్నేషనల్ మీడియా కూడా అదే చెబుతోంది. దేశంలో బెస్ట్ విజన్ వున్న
వ్యక్తి ఎవరంటే ఆంద్రప్రదేశ్ సీ.ఎం. అని విద్యార్ధులు కూడా చెప్పే పరిస్తితి
వుంది.
'ఈ నడుమ ఒక
ఎకానమిస్టు చెప్పాడు. ఆంద్రప్రదేశ్ లో నాయుడు కోరుకుంటున్న విప్లవం ఊహల్లో
ఊహించుకునేది కాదు, చేసి చూపించగలిగేది, అని. ఇప్పుడు దేశానికి కావాల్సిన సరయిన నాయకుడు చంద్రబాబే అని కూడా ఆయనే
చెప్పారు.
'ఆంద్ర ప్రదేశ్ ని
స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాము. స్మార్ట్ స్టేట్ అంటే
అర్ధం దక్షతతో కూడిన నైపుణ్యం ఆ స్టేట్ కి దిశానిర్దేశం చేస్తుంది. పరిజ్ఞానం దానికి
ఇంధనం మాదిరిగా ఉపయోగపడుతుంది. ఇక విజ్ డమ్ దాన్ని ముందుకు నడిపిస్తుంది. అదీ మా
ధ్యేయం.
'మహాత్మా గాంధీ
అన్నారు. ఒకరికి ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి అని. అప్పుడే
ఒకళ్ళకు చెప్పినా వాళ్ళు వినే పరిస్తితి వుంటుంది. మా ప్రభుత్వం ఆ దరిద్రాన్ని
రూపుమాపడానికి కంకణం కట్టుకుంది'
'ప్రతిపక్ష నాయకులు (వై.యస్.ఆర్.) చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం మంచి
పనులు చేస్తే తప్పకుండా సహకరిస్తామని. వారిని మనః స్పూర్తిగా అభినందిస్తున్నాను.
వాళ్ళు సభలో వన్ తర్డ్ వున్నారు. అందుకే అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని
అనుకుంటున్నాను.'
19, మార్చి 2021, శుక్రవారం
డాక్టర్ ఊట్ల బాలాజీ
దూరదర్సన్ లో రిటైర్ అయిన తర్వాత హెచ్.ఎం.ఆర్.ఐ. (104) అనే ఒక Not for Profit Organization తో కలిసి పనిచేశాను. దానికి సీఈఓ ఈ బాలాజీ. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా, సత్యం వంటి సంస్థల్లో సీనియర్ మేనేజ్ మెంట్ పదవుల్లో పనిచేసిన డాక్టర్ బాలాజీ, కేవలం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతారని అనుకునేవాడిని. కానీ ఆయనకు ఆంగ్లంలో ఎంత పట్టు వుందో తెలుగులో అంతకంటే చక్కటి ప్రావీణ్యం వుంది. అంతేకాదు, సందర్భానికి తగ్గట్టు ఆశువుగా అనేక సంస్కృత శ్లోకాలను అనర్ఘలంగా ఉటంకిస్తూ వుండేవారు.
వారితో నాకు మరో రెండు బాదరాయణ సంబంధాలు
వున్నాయి. ఒకటి వారి నాన్నగారు. నాకంటే చాలా చాలా ముందు రేడియోలో పనిచేశారు. మరోటి
మా ఆవిడ బాలాజీ గారి భార్యకు అభిమాని. లోగడ జెమినీలో అనేక సీరియళ్లు వచ్చేవి.
ఇప్పుడూ వస్తున్నాయి కానీ మా ఇంట్లో వాటిని చూసే మనిషి లేదు. నాకు పేర్లు సరిగా
తెలియదు కానీ చక్రవాకం, మొగలిరేకులు మొదలైన
సీరియళ్ళకు బాలాజీగారి భార్య శ్రీమతి
బిందు నాయుడు కధ, మాటలు
రాసేవారు. ఆ విధంగా బిందు నాయుడు గారు, మా ఆవిడ నడుమ మంచి అన్యోన్యం ఏర్పడింది.
సరే! ఓ పదేళ్లపాటు నిత్య సాయంకాల సమావేశాల తరువాత
ఈ మధ్య కోవిడ్ పుణ్యమా అని పరస్పరం కలుసుకోవడం తగ్గింది. ఈరోజు ఉదయం ఫోన్ చేసి ‘ఈ
సాయంత్రం మీ ఇంటికి వస్తున్నాము, మా అమ్మాయి పెళ్లి కుదిరింది’ అంటూ ఓ శుభవార్త
చెప్పారు. పెళ్లి బెంగళూరులో. ఎల్లుండే
ప్రయాణం. అంత హడావిడిలోనూ వచ్చారు. కాసేపు కూర్చుని వెళ్ళారు.
వెళ్ళే సమయంలో నిలబడి బూట్లు వేసుకుంటూ వుంటే ఆ
సోఫా మీద కూర్చుని వేసుకోండి అన్నాను.
వెంటనే ఆయన తనదైన శైలిలో ఓ డాక్టరు గారన్న మాట
గుర్తు చేశారు. ఆ డాక్టరు గారు చాలా పెద్ద సర్జన్.
‘ఎప్పుడైతే నేను ఒంటి కాలు మీద నిలబడి షూస్
వేసుకోలేనో ఆనాటి నుంచి నేను సర్జరీలు చేయడం మానేస్తాను’
అనేవారుట ఆ డాక్టరు గారు.
నిజమే అనిపించింది.
(19-03-2021)
మార్పు మంచిదే కాదు, అవసరం కూడా – భండారు శ్రీనివాసరావు