8, ఫిబ్రవరి 2021, సోమవారం
“Mister! Happy Birthday!”
పునర్జన్మ కోసం ఉన్న జన్మ నాశనం చేసుకుంటారా?
7, ఫిబ్రవరి 2021, ఆదివారం
6, ఫిబ్రవరి 2021, శనివారం
మౌనమే మీ భాష .... భండారు శ్రీనివాసరావు
ఒకప్పుడు (ఇప్పుడు కాదు) కమ్యూనిస్ట్ పార్టీలు గురించి చెప్పుకునేవారు, అంతర్గత సమావేశాల్లో విధాన నిర్ణయాలు గురించి పొట్టు పొట్టయినా, బయటకి మాత్రం అందరూ ఒకే మాట మీద ఉంటారని. ఇప్పుడు అన్ని పార్టీలది ఇదే వరస. పై వాళ్ళు ఏది చెబితే అట్టడుగు కార్యకర్త వరకు అందరిదీ అదే మాట. ఒకే మాట. అంతేకాదు, టీవీ చర్చల్లో పాల్గొనే పార్టీల అధికార ప్రతినిధులు, ఆఖరికి సోషల్ మీడియా కార్యకర్తల వరకు అందరూ పొల్లుపోకుండా ఒకటే మాట మీద వుండడం ఈ ప్రజాస్వామ్య దేశంలో విచిత్రమే అనిపిస్తుంది. ఒకప్పుడు నెహ్రూ మంత్రివర్గంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రధాని మాటకు ఎదురు చెప్పేవాడని, పటేల్ ధైర్య సాహసాలకి అది నిదర్శనం అని గొప్పగా చెప్పుకుంటూ వుంటాం.
ఈనాడు అలా అధిష్టానం మాటకు ఎదురు చెప్పగల పటేల్ వంటి నాయకులు ఎవరూ కానరావడం లేదు. అంతా
ఒకే మాట మీద నిలబడి వున్నందుకు సంతోషపడాలో, లేక మరోమాట చెప్పే స్వతంత్రం లేని రాజకీయ వ్యవస్థలో
వున్నందుకు ఖేదపడాలో అర్ధం కాని పరిస్థితి.
గృహస్తు ఇంటి పెద్ద కావచ్చు. కానీ ఆయన తీసుకునే
నిర్ణయాలన్నీ సబబే అని చెప్పలేం. అలానే ప్రభుత్వాలు, పార్టీలని ఆజమాయిషీ చేసే నాయకులు కూడా అన్నీ
మంచి నిర్ణయాలే తీసుకుంటారని అనుకోలేం.
ప్రజాస్వామ్య
వ్యవస్థలో అది పార్టీ కావచ్చు,
ప్రభుత్వం కావచ్చు చర్చ జరిగేంతవరకు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకసారి నిర్ణయం అయ్యాక
ఇక చర్చలు అనవసరం. (06-02-2021)
ఇంగువ కట్టిన గుడ్డ – భండారు శ్రీనివాసరావు
ఇంగువ కట్టిన గుడ్డకు ఎన్ని రోజులైనా ఆ వాసన దాన్ని అంటిపెట్టుకుని ఉంటుందంటారు. అది అనుభవంలోకి వచ్చింది.
హైదరాబాదులో
రోడ్డు దాటటడం అంటే వైతరణి దాటినట్టే. ఉదయం బ్లడ్ టెస్ట్ కి వెళ్లి తిరిగివస్తూ,
రోడ్డు దాటడం ఎల్లా అనే సమస్యతో అటూ ఇటూ చూస్తుంటే ఒకాయన నా చేయిపట్టి దాటించాడు.
థాంక్స్ చెప్పబోతుంటే ఆయనే కల్పించుకుని ‘ఈ మధ్య మీరు టీవీ చర్చల్లో రావడం లేదేమిట’ని
అడిగాడు. దాదాపు ఏడాది పైమాటే, 2019 ఆగస్టులో మా ఆవిడ మరణం తదాదిగా నేను టీవీ చర్చలకు వెళ్ళడం పూర్తిగా తగ్గించాను. ఆ
సంగతి ఈయన గారు ఎలా గమనించారబ్బా అనుకుంటుంటే ఆయనే చెప్పారు.
ఆయన పేరు
విశ్వనాధ రెడ్డి. ఊరు చిత్తూరు జిల్లా పీలేరు. అమ్మాయి అల్లుడు హైదరాబాదులో
కాపురం. వారిని చూడడానికి వచ్చారట.
‘రోజూ
అన్ని టీవీ చర్చలు చూస్తూ వుంటాను. అందరూ అరుస్తూ మాట్లాడుతుంటుంటే మీరు మాత్రం
అలా మౌనంగా వుండిపోతారు. అడిగితె కాని జవాబు చెప్పరు. మొదట్లో ఎలాగో అనిపించేది.
ఈయనేమి విశ్లేషకుడని. కానీ తర్వాత తర్వాత అర్ధం అయింది. అలా కల్పించుకోకపోవడమే మీ
ప్రత్యేకత అని”
చర్చల్లోనే
కాదు ఇక్కడ కూడా నాకు మౌనమే శరణ్యం. ఏం చెప్పను?
“ఆ
విధంగా మీకు అభిమానిని అయ్యాను” అన్నారాయన.
పొద్దున్నే దొరికిన పెద్ద కాంప్లిమెంట్ అనుకోవాలి.
వాదనకు, వాదులాటకు తేడా తెలిసిన వాడే నిజమైన విశ్లేషకుడు అని
ఎప్పుడో రాసుకున్న వాక్యం గుర్తుకు వచ్చింది.
4, ఫిబ్రవరి 2021, గురువారం
గల్లీ వార్తలు – భండారు శ్రీనివాసరావు
ఏదో పాత సినిమాలో డైలాగు- ‘Long long ago, so long ago, nobody can say how long ago’ మాదిరిగా ఇది కూడా చాలా చాలా పాత జ్ఞాపకం. సుమారు మూడున్నర దశాబ్దాల కిందటి సంగతి.
విలేకరులందరికీ బాగా తెలిసిన ఓ మంత్రి గారు
వుండేవారు. తెలుగుదేశం అధికారానికి రావడంతో ఆయన మాజీ అయ్యారు. కానీ రాష్ట్రంలో ఏ ఊరు వెళ్ళినా పేరు పెట్టి పలకరించేటంత చనువు
కలిగిన పత్రికా మితృలు అనేకమంది ఆయనకి వుండేవారు.
రేడియోకి అన్నిచోట్లా విలేకరులు వుండరు. అంచేత ఆ
మాజీ మంత్రిగారు ఏ ఊరు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టినా, అది పూర్తి కాగానే హైదరాబాదులో
రేడియోకి ఫోను చేసి స్వయంగా వార్త చెప్పేవారు.
‘నిన్న గుడివాడలో ఇదే పాయింటు చెప్పారు, మళ్ళీ
గూడెంలో మాట్లాడుతూ అదే పాయింటు వార్తల్లో చెబితే బాగుండదు, కాస్త
మార్చి వేరే పాయింటు చెప్పండి’ అనేవాడిని ఆయనతో వున్న చనువుతో.
‘వూరి ఊరుకీ పాయింటు ఏం మారుతుంది శ్రీనివాసరావ్.
అసలీ పాయింటు చెప్పడానికే కదా ఇలా ఊరూరూ తిరుగుతోంది. ఈ పేపర్లతో పెద్ద చిక్కు
వచ్చి పడింది. గల్లీ గల్లీకి ఓ ఎడిషన్ అంటారు. ఒక ఊళ్లోనే ఒక పేటలో వార్త మరో
వాడలో కనబడదు. అందుకే ఇలా ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ అదే పాయింటు అన్ని చోట్లా
చెబుతున్నాను. అసలే మాజీలం. వేస్తారో వేయరో కూడా తెలియదు’ అంటూ
ఆయన తన గోడు చెప్పుకున్నారు.
1, ఫిబ్రవరి 2021, సోమవారం
ఎవరు ముందు ? ఎవరు వెనుక? –ప్రొటోకాల్ పేచీలు
ఈ ఇంగ్లీషు వాడున్నాడే ఎంతయినా గొప్పవాడు. పంతాలు, పట్టింపులు, అహంభావం, నేనే గొప్ప అనే రకరకాల భావనలను అన్నీ కలిపి ఎంచక్కా ఈగో అనే ఒక్క చిన్న మూడక్షరాల పదంలో గుదిగుచ్చాడు.
ఈ మధ్య ఏ పేపరు తిరగేసినా
అధికారులు, అనధికారులు, నాయకులు మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరాఖరికి రాజ్యాంగ పదవుల్లో వున్నవాళ్ళు అందరూ ఈ ఈగో అనే
విషవలయంలో చిక్కుకుని సంచలన వార్తలకు కేంద్ర బిందువులు అవుతున్నారు.
నిజానికి ఇవన్నీ కొత్తవేమీ
కాదు. కాకపోతే గతంలో కంటే మీడియా విస్తృతి ఈనాడు ఎక్కువ కనుక వీటికి మరింత ఎక్కువ
ప్రాచుర్యం లభిస్తోంది.
మచ్చుకు ఓ ఉదాహరణ చెప్పుకుందాం.
అప్పుడు వై.ఎస్. రాజశేఖర
రెడ్డి ముఖ్యమంత్రి. మోహన్ కందా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. స్వర్ణజిత్ సేన్
పోలీసు డైరెక్టర్ జనరల్. దినేష్ రెడ్డి హైదరాబాదు నగర పోలీసు కమిషనర్.
ఆరోజుల్లో ఒకసారి
రాష్ట్రపతి ఏ.పీ.జే. అబ్దుల్ కలాం హైదరాబాదు వచ్చారు. బేగం పేట విమానాశ్రయంలో స్వాగతం. ఏర్పాట్లు అన్నీ జరిగాయి. రాష్ట్రపతికి
స్వాగతం చెప్పడానికి అందరూ వరసగా నిలబడ్డారు. పోలీసు కమిషనర్ దినేష్ రెడ్డి ప్రోటోకాల్
ప్రకారం కొంత వెనుక నిలబడాల్సి వచ్చింది. అది ఆయనకి నచ్చలేదు. వరుస తప్పించి ముందుకు వెళ్లి డీజీపీ
పక్కన నిలబడ్డారు.
సరే ఆ కార్యక్రమం
ముగిసింది. కానీ దినేష్ రెడ్డి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రోటోకాల్ విషయంలో తనకు జరిగిన లోపాన్ని ఎత్తి చూపుతూ
చీఫ్ సెక్రెటరీకి ఓ ఉత్తరం రాశారు.
“సీనియారిటీ రీత్యా నాకంటే
జూనియర్ అయిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి (సీ.ఆర్. బిస్వాల్, ప్రిన్సిపాల్ సెక్రెటరి
పొలిటికల్) వెనక నేను నిలబడడం కుదరదు. నగర పోలీసు కమిషనర్ గా నేను ఆయనకంటే ముందు
వుండాలి” అంటూ ఆయన తన మనసులో మాట బయట పెట్టారు.
దీనికి జవాబుగా ఆయనకు చీఫ్
సెక్రెటరి నుంచి మెమో వచ్చింది. “రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో మీరు ప్రిన్సిపల్ సెక్రెటరి పొలిటికల్ ని దాటుకుని
వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుంది’ అనేది
ఆ మెమో తాత్పర్యం.
ఈ మెమో ముఖ్యమంత్రి ఆదేశం
ప్రకారం ఇచ్చింది అని తెలియక దినేష్ రెడ్డి చీఫ్ సెక్రెటరీకి మరో ఘాటయిన లేఖ
రాశారు, “నాకు మెమో ఇవ్వడానికి మీకెంత ధైర్యం? హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ గా నా
స్థాయి (హోదా) చీఫ్ సెక్రెటరీకి సమానం’ అంటూ.
ఇది చిలికి చిలికి గాలివాన
అయింది. స్టేట్ ఐ.పి.ఎస్. అధికారుల సంఘం కార్యవర్గం అత్యవసర సమావేశం జరిపి
ప్రోటోకాల్ విషయంలో తమను కూడా ఐ.ఏ.ఎస్. అధికారులతో సమానంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని
కోరుతూ తీర్మానం చేసింది. ఈ సంఘానికి దినేష్ రెడ్డి కార్యదర్శి కావడం కాకతాళీయం
కావచ్చు.
తాను 1977 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారినని, ప్రోటోకాల్ వ్యవహారాలు చూసే అధికారి 1981 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. కాబట్టి
అతడు తనకు జూనియర్ అవుతాడు అనే ధోరణితో దినేష్ రెడ్డి ఉత్తరం రాసారు.
నివురుగప్పిన నిప్పు
మాదిరిగా ఈ వివాదం కొనసాగుతోంది కానీ ప్రభుత్వం పెదవి విప్పలేదు. కారణం నగరంలో
గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాల్సి వుంది. ఆ కార్యక్రమం సజావుగా అలా
పూర్తయిందో లేదో నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అప్పటికి ఆయన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి పది నెలలు కూడా కాలేదు. నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తున్న సమాచారం డీజీపీకి
కూడా తెలియదని వార్తలు గుప్పుమన్నాయి.
ఏదో కక్ష కట్టినట్టు బదిలీ
చేసినట్టు కాకుండా అదే రోజు మరో ఆరుగురు ఉన్నత పోలీసు అధికారులకు కూడా స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అప్పుడు అలా అర్ధాంతరంగా
కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాల్సివచ్చిన దినేష్ రెడ్డి, ఆద్యతన కాలంలో పోలీసు
డైరెక్టర్ జనరల్ అయ్యారు. సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా ఆయన ఒకే ఒక్క రోజున
రాష్ట్ర వ్యాప్తంగా యాభయ్ మంది డీ.ఎస్.పి. లను బదిలీ చేయడం ఓ కొసమెరుపు.
