28, జూన్ 2020, ఆదివారం
అచ్చమైన భారత రత్నం
26, జూన్ 2020, శుక్రవారం
కరోనా అంటే భయం ఎందుకు? – భండారు శ్రీనివాసరావు
“నేలతో నీడ అన్నది నను తాకరాదని,
పగటితో రేయి అన్నది నను తాకరాదని,
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది,
నేడు భర్తనే తాకరాదనీ... ఒక భార్య
అన్నది”
(మంచి రోజులు వచ్చాయి సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం)
కరోనా అంటే భయం ఎందుకు అంటే ఇందుకే. ఇది అన్ని రోగాలవంటిది కాదు. చావుకు దగ్గర చేసే జబ్బులు దీనికంటే అనేకం వున్నాయి. ఉదాహరణకు కేన్సర్. ఇది వచ్చిన వాళ్ళను శారీరకంగా, ఇంట్లో వారిని ఆర్ధికపరంగా చావగొడుతుంది.ఇల్లూవళ్ళూ గుల్ల చేస్తుంది. రోగి కోలుకునే అవకాశాలు తక్కువ. కుటుంబం చితికి పోవడం మాత్రం ఖాయం.
ఇంత భయంకరమైన రోగం అయినా కానీ కేన్సర్ వచ్చిందంటే సాటివాళ్ళు ఆ వ్యక్తి పట్ల సానుభూతి చూపుతారు. అయ్యో పాపం అనుకుంటారు. ఆసుపత్రిలో వుంటే వెళ్లి చూస్తారు. కర్మకాలి జరగరానిది ఏదైనా జరిగితే చుట్టపక్కాలు అందరూ అంతిమ సంస్కారాల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి చెబుతారు. స్వాంతన కలిగిస్తారు.
కానీ కరోనా అలా కాదే. శారీరకంగా అది పెట్టే బాధ అంత లెక్కలోనిది కాదు. కానీ మానసికంగా పెట్టే బాధకు లెక్కే లేదు. సొంత కుటుంబంలోని వాళ్ళే, బాగా దగ్గర వాళ్ళే దూరం అవుతారు. ‘ఎవరూ రారూ నీకోసం’ అంటూ ఏదో ఆసుపత్రిలో రేయింబవళ్ళూ ఒంటరిగా కుమిలిపోవాలి. చికిత్సకు లొంగి కరోనా అనే రోగం శరీరాన్ని వదిలినా దాని తాలూకు ‘అంటరానితనం’ అనే అవలక్షణం ఇంగువ కట్టిన గుడ్డలా అంత తేలిగ్గా వదలదు. అపార్ట్ మెంటు వాళ్ళు, కాలనీ వాళ్ళ చూపుల్లో తొంగిచూసే అనుమానం రోగిని సెల వేసినట్టు బాధ పడుతుంది. తానేమీ ఎయిడ్స్ రోగి కాదే! మరెందుకీ శిక్ష అనే బాధ మనసులో తొలుస్తుంటుంది. సొంత మనుషులు కూడా రోగం నయమై వచ్చిన రోగిని తాకడానికి సందేహిస్తున్నారు అనే కధనాలు వింటున్నప్పుడు ఈ బాధ ఎన్నాళ్ళో అనే బాధ ఎక్కువ అవుతుంది.
ఇక ఖర్మ కాలి కరోనాకు బలయితే ఇక ఆ కష్టాలు చెప్పతరం కాదు. అయినవాళ్ళు రాలేరు. చితికి నిప్పు పెట్టాల్సిన వాళ్ళు కూడా రాలేని పరిస్తితి. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు అనిపించే మరణం. దిక్కుమాలిన చావు అంటారే అది.
ప్రజల్ని మరింత భీతావహుల్ని చేసేందుకు ఇదంతా రాయడం లేదు. ఈ రోగం పట్ల సమాజంలో ఆవరించివున్న అనుమానాలను తొలగించకపోతే పరిస్తితి నిజంగా ఇలాగే తయారవుతుంది.
ఇదొక కొత్త జబ్బు. ఎవరికీ దీని గురించి పూర్తిగా తెలియదు. మిడిమిడిజ్ఞానంతో చెప్పే కబుర్లు పరిస్తితులను మరింత దిగజారుస్తాయి. ఈ విషయంలో సమాజాన్ని, ప్రజలను జాగృతం చేయాల్సిన మాధ్యమాలు రాజకీయాలు అనే కరోనాను మించిన రోగంతో కునారిల్లుతున్నాయి. నిన్ననే అనుకుంటా మురళీకృష్ణ గారు ఫోన్ చేశారు, మీడియా ద్వారా ఏమైనా చేయొచ్చా అని. దావానలంలా వ్యాపిస్తున్న కరోనా అని రాస్తే టీఆర్పీ రేటింగులు పెరుగుతాయేమో కాని, సామాజిక బాధ్యత తీసుకుని ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయగల తీరిక వున్నవాళ్ళు కలికానికి కూడా కానరావడం లేదంటే నిజంగా బాధపడాల్సిన, కాదు కాదు, సిగ్గుపడాల్సిన విషయమే.
ఈ జబ్బుకు ఈ స్థాయిలో సాంఘిక బహిష్కరణ అవసరమా కాదా అన్నది సరయిన వైద్య నిపుణుల ద్వారా సేకరించి ప్రజలను చైతన్యం చేయకపోతే ముందు ముందు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో!
కింది ఫోటో మిత్రుడు జగన్ మోహన్ పోస్ట్ చేసారు. ఒక కరోనా రోగికి ఓ స్టార్ హాస్పిటల్ లో వేసిన బిల్లు. అక్షరాలా మూడు లక్షల నలభయ్ వేల రూపాయలు. నిజానికి హోం క్వారంటైన్ లో ఈ చికిత్స తీసుకోవచ్చు. కానీ చిన్న చిన్న అపార్ట్ మెంట్లలో నివసించేవారి పరిస్తితి ఏమిటి? రోగం వచ్చిందని తెలియగానే ముందు ఇల్లు ఖాళీ చేయాలనే వొత్తిళ్ళు వస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ వైద్య శాలల్లో పెద్ద సంఖ్యలో రోగులకు వసతి కల్పించడం కూడా అసాధ్యమే. అందరూ స్టార్ ఆస్పత్రుల ఖర్చు భరించలేరు.
కిం కర్తవ్యమ్?
అయస్కాంతంగా మారిన రాజకీయం – భండారు శ్రీనివాసరావు
రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికార చక్రం తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయ నీటికి ఎగబడే చేపల మాదిరిగా రాజకీయ అరంగ్రేట్రం కోసం తహతహలాడేది అందుకే.
‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు కస్టడీలో ఉన్న మనిషికూడా బయటకు వస్తాడు. ఇక ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోను. అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ – ఓ ప్రముఖ సినీ నటుడి మన్ కీ బాత్.
‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు క్లియర్ అవుతాయి. కానీ ఏం లాభం. పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. అయినా మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేస్తాం. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసేబదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా కాలం గడుస్తున్నకొద్దీ సర్దుకుపోవడమే మేలనే పరిస్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో బాధ. ఇంతచదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మనం అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ – ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.
‘దేశ విదేశాల్లో వ్యాపారాలు వున్నాయి. నెలకు కోటి రూపాయలు కాంపెన్సేషన్ తీసుకునే సీయీఓలు డజను మంది తన చేతికింద పనిచేస్తున్నారు. క్రమం తప్పకుండా పనులు చక్కబెట్టుకునేందుకు సొంత విమానాలు వున్నాయి. రాజప్రసాదాలను తలదన్నే భవంతులు ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల్లో వున్నాయి. తనని కలవాలంటే నెల ముందు అపాయింటు తీసుకోవాలి. మరి ఇంత ఐశ్వర్యం కూడా ప్రభుత్వాలతో పనిపడినప్పుడు ఎందుకూ కొరకాకుండా పోతోంది. కోట్ల లాభం కళ్ళచూడడానికి అవకాశం ఉన్న ఫైలును ఓ చిన్ని గుమాస్తా మోకాలు అడ్డు వేసి అపగలుగుతున్నాడు. అతడి ఏడాది సంపాదన మొత్తం కలిపినా తను తాగే సిగార్ల ఖర్చుకు సరిరాదు.అదే ఓ ఎమ్మెల్యే ఫోను చేస్తే అదే ఫైలు పరుగులు కాదు ఎగిరి గంతులు వేసుకుంటూ చేరాల్సిన చోటికి, చేరాల్సిన టైముకు చేరుతుంది. లాభం లేదు, ఎంత ఖర్చయినా సరే ఈసారి ఒక రాజ్యసభ సభ్యత్వం సంపాదించి తీరాలి. లేకపోతే ఇంత సంపాదనా శుద్ధ దండగ’ – ఓ పారిశ్రామికవేత్త మనోవేదన
‘తనను చూస్తే పసిపిల్లలు నిద్రపోరు. తన మాట వినబడితే బడా వ్యాపారాలు చేసేవాళ్ళు కిమ్మనరు. తన చేతుల్లో లక్షలు మారుతున్నా పన్ను కట్టే పనే లేదు. తన మోచేతి నీళ్ళు తాగుతూ డజన్ల కొద్దీ గూండాలు పొట్టపోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్ళగానే మాట్లాడి అడిగిన పని చేసి పంపిస్తారు. కానీ ఓ పోలీసువాడు వచ్చి ఇంటితలుపు తడితే బిక్కుబిక్కుమనాల్సివస్తోంది. అదే రాజకీయ నాయకుడు ఎవరైనా కబురు చేస్తే చాలు ఠానాలో అందరూ సరే సార్ అంటారు. ఎన్నాళ్ళీ ముష్టి బతుకు. ఎవరి చేతికిందో పనిచేసి వాళ్ళని నాయకులుగా చేసేబదులు నేనే ఒక నాయకుడిని అయితే....’ – ఓ వీధి రౌడీ అంతరంగం.
ఇదిగో ఇలా వివిధ రంగాల వాళ్ళు రాజకీయాలవైపు పరుగులు తీస్తూ వుండడం వల్లనే ఈ పరిస్తితులు దాపురించాయి.
ఆప్తవాక్యం: రాజకీయాల్లో ఉన్నవారిని వారి రాజకీయాలు వారిని చేసుకోనివ్వండి. నిజానికి రాజకీయులు జనాలు అనుకున్నంత స్వార్ధ పరులేమీ కాదు. సమాజం ద్వారా సకల సంపదలు సంపాదించుకున్న వాళ్ళు వాటిని పరిరక్షించుకోవడం కోసం లేదా వాటిని మరింత పెంచుకోవడం కోసం ప్రజాసేవ పేరుతొ రాజకీయాల్లోకి చేరుతూ వుండడం వల్లనే ఆ రంగం సహజంగానే కలుషితం అవుతూ వచ్చింది. సేవ చేయడానికి రాజకీయాలు అక్కరలేదు. ఒక మనిషిగా మీరున్న పరిధిలోనే మీకు చేతనైన సేవ చేయవచ్చు.
(26-06-2020)
24, జూన్ 2020, బుధవారం
గోపీ చెప్పిన తీర్పు
‘హోటల్ భేటీ మీద మీ అభిప్రాయం ఏమిటి?’
‘శ్రీ సుజనా చౌదరి, శ్రీ కామినేని శ్రీనివాస్ ఇద్దరూ ఒకే పార్టీ వాళ్ళు. వారిద్దరూ ఎక్కడ కలుసుకున్నా, ఎప్పుడు కలుసుకున్నా ఎవరికీ ఎలాంటి అభ్యంతరం వుండనక్కరలేదు. ఇక శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయానికి వస్తే, ఆయన అక్కడికి వెళ్ళడం ఔచిత్యమా కాదా అన్నది ఆయన ప్రస్తుత హోదా మీద ఆధారపడిఉంది. ఇంతవరకు అంటే ఈకలయిక జరగడానికి ముందు వరకు వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనల ప్రకారం నిమ్మగడ్డ ఆ పదవీ బాధ్యతలు స్వీకరించనట్టే లెక్క. అంటే ఆయన ప్రస్తుతం ఒక స్వేచ్చాజీవి. కాబట్టి హోటల్లో కలవడంలో తప్పులేదు. కానీ ఆయనే తన ముందరి కాళ్ళకు బంధాలు వేసుకున్నారు. ఆయన తొలగింపుపై రగడ నడుస్తున్నప్పుడు ఆయన స్వయంగాను, ఆయన లాయరు కూడా సుప్రీం మధ్యంతర ఆదేశాలు వచ్చిన మరుక్షణం నుంచీ నిమ్మగడ్డే ఎస్.ఈ.సి. అని పలుమార్లు పలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో స్పష్టం చేశారు. అదే నిజమని అనుకున్నప్పుడు అలా రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తి వేరేవారిని అదీ రాజకీయ నాయకులను అలా హోటలుకు వెళ్లి కలవడం నైతికంగా పొరబాటే అవుతుంది.
ఈ నెల పదమూడో తేదీ నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏపీ ప్రభుత్వంలో ఎస్.ఈ.సి. అవునా కాదా (రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్నారా లేదా) అన్నదానిబట్టి ఈ కలయికలోని మంచిచెడ్డలను విశ్లేషించుకోవాల్సివుంటుంది. వైసీపీ తరపున వాదించేవాళ్ళు, నిమ్మగడ్డ తరపున వాదించేవాళ్ళు ఈ విషయాన్ని ముందు నిర్దారించుకోవాల్సివుంటుంది’.
అంటే ఏమిటన్నమాట! నిమ్మగడ్డ ఆ పదవిలో కొనసాగుతున్నారని వైసీపీ వారయినా ఒప్పుకోవాలి. లేదా ఆయన ఆ పదవిలో లేరని నిమ్మగడ్డ మద్దతుదారులు అయినా అంగీకరించాలి’ (24-06-2020)
ఇందిరాగాంధీకి తన మరణం గురించి ముందుగా తెలుసా!
హిందూ రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన సీనియర్ పాత్రికేయుడు దాసు కేశవరావుగారు రాత్రి ఫోను చేసారు. ఆయన గుర్తు చేసిన దాకా నాకు జూన్ 23 సంజయ్ గాంధి విమాన ప్రమాదంలో మరణించిన రోజని జ్ఞాపకం రాలేదు. నిజానికి దాన్ని ప్రమాదం అనడం కంటే స్వయంకృతాపరాధం అనడం సరి ఏమో! ఎందుకంటే విమానాలు నడపడంలో సంజయ్ కి ఆసక్తి ఉన్న మాట నిజమే కానీ ప్రావీణ్యం లేదు. ఇందుకు సాక్ష్యం ఆయన భార్య మనేకా గాంధి. ఆ దుర్ఘటన జరగడానికి ఒక్క రోజు ముందు సంజయ్ ఆమెను వెంట తీసుకుని ఆ చిన్ని విమానంలో చక్కర్లు కొట్టారు. సంజయ్ విమానం నడుపుతున్న తీరు గమనించిన మనేకా గాంధి ఆ క్షణంలో భయంతో తల్లడిల్లిపోయారు. ఇంటికి రాగానే ఆమె ఇందిరాగాందీతో ఆ విషయం చెప్పారు. ‘దయచేసి మీ అబ్బాయికి చెప్పండి, విమానాలు నడపొద్దని. ఒకవేళ నడిపినా నన్ను తీసుకువెళ్ళిన ఆ చిన్న విమానాన్ని అసలు నడపొద్దని”.
మరునాడే సంజయ్ అదే విమానం నడిపి, అది కూలిపోవడంతో మరణించారు.
ఈ విషయాన్ని మనేకా గాంధి, సంజయ్ అకాల మరణం తర్వాత టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.
శ్రీమతి
ఇందిరాగాంధీ ఆంతరంగికుడు పోతేదార్ రాసిన ఆత్మకధలో మరో విషయం వెల్లడించారు.
“భారత దేశపు తొలి మహిళా ప్రధాని శ్రీమతి
గాంధి, 1984, అక్టోబర్
31వ తేదీన ఢిల్లీలో తన అధికార నివాసం
ప్రాంగణంలోనే అంగరక్షకుల తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి కొద్ది
రోజులముందుగానే తన తుది ఘడియలు దగ్గర పడుతున్నాయని ఆవిడకు తెలిసి వచ్చింది. దీనికి
కారణం ఆవిడకు ఒక గుళ్ళో కనబడిన ఓ అపశకునం. హత్య జరిగిన అక్టోబర్ మాసంలోనే శ్రీమతి
ఇందిరాగాంధీ చాలా మనసుపడి కాశ్మీర్ పర్యటన పెట్టుకున్నారు. కాశ్మీర్ ప్రకృతి
సౌందర్యం అంటే ఆవిడ తెగ ముచ్చట పడేవారు. అంతేకాదు, కాశ్మీర్ లోయలోని ఒక హిందూ దేవాలయాన్ని, అలాగే ముస్లింల ప్రార్ధనా మందిరం అయిన
ఒక ప్రముఖ మసీదును సందర్శించాలన్న కోరికతో కూడా ఆమె ఆ పర్యటనకు బయలుదేరివెళ్ళారు.
ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక అపశకునం కనబడింది. అది చూడగానే తన రోజులు
దగ్గర పడ్డాయని ఆమెకు తోచింది. ఆ సమయంలోనే
ప్రియాంకా గాంధి తన రాజకీయ వారసురాలయితే బాగుంటుంది అని కూడా ఆమెకు అనిపించింది.
కాకతాళీయం కావచ్చు కానీ, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆవిడ
హఠాత్ మరణానికి గురయ్యారు. ప్రియాంక రాజకీయ వారసత్వం గురించి శ్రీమతి గాంధీ
మనసులోని ఈ మాటను తదనంతర కాలంలో సోనియా గాంధి చెవిలో వేసినా, ఆవిడ దానికి ఇష్టపడలేదు.” (శ్రీమతి ఇందిరాగాంధీ మరణించే నాటికి
ప్రియాంక గాంధి వయస్సు కేవలం పన్నెండేళ్ళే. మరి రాజకీయ వారసత్వం గురించిన ఆలోచన
ఎలా వచ్చిందో!)
22, జూన్ 2020, సోమవారం
పీవీ గారి రెండో కోరిక – భండారు శ్రీనివాసరావు
(శ్రీ పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని)
‘ఏమయ్యా! కృష్ణారావ్! నా కేసెట్ల సంగతేమిటి” అని అడిగారు పీవీ నరసింహారావు గారు మాజీ ప్రధాని హోదాలో అని చెప్పుకున్నాం కదా! ఆ కధే ఇది.
పీవీ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది.
అసలే గతకాలపు ముచ్చట. ఈ ముచ్చట చెప్పుకునే ముందు అంతకు ముందు గతం కొంత చెప్పుకోవాలి. అంటే గతంలోని గతం అన్నమాట, మూగమనసులు సినిమాకి మల్లె.
ఆర్వీవీ కృష్ణారావు గారు. రాయసం వీర వెంకట కృష్ణారావు గారు. పేరులో రాయసమే కానీ మనిషిలో ఆ రాజసం కనపడదు. సాదాసీదా మనిషి. ఇక వీర అనే పేరులోని మాట పేరులోనే దాగిపోయేలా ఇంటి పేరు ఆర్వీవీ అని రాసుకునేవారు. ఆయనా నేనూ ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తావిభాగంలో బహుకాలం కలిసి పనిచేసాము. మాకు కృష్ణార్జునులు అని పేరు. నేనొకసారి అమెరికా వెళ్ళినప్పుడు అప్పటి ప్రసార భారతి సీఈఓ కంభంపాటి సుబ్రమణ్య శర్మగారు ఆర్వీవీని పట్టుబట్టి హైదరాబాదు దూరదర్శన్ న్యూస్ ఎడిటర్ గా బదిలీ చేశారు. ఆరు మాసాల అనంతరం అమెరికా నుంచి రాగానే నన్నూ అక్కడికే వేశారు. పుట్టిపెరిగిన రేడియో విడిచి రానని నేను పట్టుబట్టాను. ‘ఈ పోస్టుకోసం ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకుంటారు. నువ్వేమిటి అయాచితంగా వేసినా పోనంటావ’ని హితులు, స్నేహితులు పోరుపెట్టారు. వున్న ఊళ్లోనే ఉన్న డీడీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ మూడు నెలలు చేతిలో పెట్టుకుని సంక్షేపించిన నేను చివరికి దూరదర్శన్ లో చేరిపోయాను. అయితే ఇంటికి ఆఫీసుకి చాలా దూరం. ఆఫీసు వాహన సౌలభ్యం ఉన్న కారణంగా అదో ఇబ్బంది అనిపించక, అప్పటి రాష్ట్ర (చంద్రబాబు) ప్రభుత్వం కేటాయించిన ఎర్ర మంజిల్ క్వార్టర్స్ లోనే వుండిపోయాను. ఆఫీసు దూరం అనే మాటలు చెవిన పడ్డాయేమో తెలియదు శర్మ గారు ఆలిండియా రేడియో ఆవరణలోనే ఒక చిన్న ఆఫీసు ఏర్పాటు చేశారు. ఉదయం డీడీ వార్తలు తయారు చేయడం, తర్వాత నుంచి నగరంలో వార్తలు సేకరించడం, ఇందుకోసం రేడియో ఆఫీసులో ఒక కెమెరా యూనిట్, ఈ వైభోగం బాగానే వుందనిపించింది.
ఇక సొంత గోల పక్కనబెట్టి అసలు విషయానికి వస్తాను. ఆర్వీవీకి దూరదర్శన్ ఆవరణలోనే ఒక పెద్ద క్వార్టర్ కేటాయించారు. ఆయనకు ఒక పాత అంబాసిడర్ కారు బెజవాడ రోజుల నుంచి వుండేది. ఆ కారు పెట్టుకోవడానికి
చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఆ క్వార్టర్ లో ఒక కారు షెడ్డు కూడా వుంది. అందులో ఏదో పాత సామాను వేసి తాళం వేశారు. తీసి చూస్తే ఎన్నో అపూర్వమైన కేసెట్లు. మంచి సంగీత కచ్చేరీల రికార్డులు. అవన్నీ అలా పాత సామాను మాదిరిగా పారేయడం చూసి సంగీతం పట్ల మక్కువ ఉన్న కృష్ణారావు గారు చాలా బాధ పడ్డారు. తీరా విచారిస్తే తేలిందేమిటంటే అవన్నీ పాత కాలపు డెక్కులు. అవి ఈరోజుల్లో పనికిరావు. పైగా ఆ పాత రికార్డులను డిజిటలైజ్ చేసి భద్రపరచినట్టు సమాచారం.
ఈ నేపధ్యంలో పీవీ గారు ‘ఏవయ్యా నా కేసెట్లు’
అని అడిగారు. దూరదర్శన్లో, రేడియోలో గాలించారు. అవి దొరికాయా, పీవీ గారికి
అందచేసారా అనే వివరాలు తెలవ్వు. ఎందుకంటే తర్వాత కొన్నాళ్ళకే ముందు నేను, తర్వాత
ఆర్వీవీ రిటైర్ అయ్యాము.
పీవీ గారి రెండు కోర్కెలు – భండారు శ్రీనివాసరావు
(శ్రీ పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని)
పీవీ గారు మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది. వారికి ఔషధ మూలికలపై ఆసక్తి మెండు. నిజానికి ఆయన పట్టుదల కారణంగానే ఆ అంశానికి సంబంధించి ఆ జాతీయ సదస్సు ఏర్పాటయింది.
మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేకరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు గారు నేనూ కాస్త వెనగ్గా నిలబడివున్నాం.
చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.
‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?”
కృష్ణారావు గారు ఏదో చెప్పారు. (ఈ టేపుల విషయం మరోసారి విడిగా)
ఆయన నా వైపు తిరిగారు.
‘మీ అన్నయ్య (కీర్తిశేషులు పర్వతాలరావు గారు) పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?”
‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు’
‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు’
నమస్కారం పెట్టి మేము వచ్చేశాము.
పీవీ గారి సందేహానికి మా అన్నయ్య ఆ పుస్తకంలో చాలా పెద్ద వివరణే ఇచ్చారు.
ఓపిక ఉన్న వారు చదువుకోవడానికి పూర్తి పాఠం ఇస్తున్నాను.
“హిరణ్యకశిపుడు స్వతహాగా మహాబలుడు. దానికి తోడు తపశ్శక్తితో పొందిన వరాలు. అతడిని చంపేందుకు వెళ్ళే విష్ణువు నర సింహ మిశ్రమ రూపం ధరించాల్సి వుంటుంది. అలాంటప్పుడు రెంటిలోనూ గల బలమైన అంశాలనే స్వీకరించాల్సి వుంటుంది. నరుని మేధ సింహపు మేధ కన్నా చురుకు. సింహపు శరీరం నరుడి దేహం కన్నా బలమైనది. కనుక నరుని తల, సింహపు శరీరం కలిస్తే రెండు బలమైన అంశాలను స్వీకరించినట్టు అయ్యేది. కాని విష్ణువు ఈ అవతారానికి సింహపు తల, మనిషి శరీరం ఎన్నుకున్నాడు. రెండు బలహీనమైన అంశాల మిశ్రమం అది. మరి విష్ణువు అలా ఎందుకు చేశాడు? కొందరు కరాటే ఉదాహరణ చెప్పారు. కరాటేలో చేయి బలహీనంగా వుండడంకన్నా ఆ చేయిని ప్రయోగించడంలో చూపే వేగం, గురి, ఏకాగ్రత ప్రధానం. కనుక బలహీనమైన శరీరాన్ని ఎన్నుకున్నా ఇబ్బంది లేదని వారి అభిప్రాయం. అలా అనుకున్నా అట్టి ఏకాగ్రత నరుని మేధ సాధించినట్టు సింహపు మెదడు సాధించగలదా! మానసిక పటుత్వాన్ని సాధించడం నరునికే సాధ్యం కాని సింహానికి కాదు. జంతువు కావాలంటే సింహమే ఎందుకు? జిత్తులమారి నక్క తల అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనకారిగా వుండేదేమో! మరి స్వామి సింహపు తలనే ఎందుకు ఎన్నుకున్నట్టు!
హిరణ్యకశిపుడు యావత్ ప్రకృతిని తన కనుసన్నలలోకి తెచ్చుకున్నాడు. అసలు హిరణ్యకశిపుడు అంటే అర్ధం ఏమిటి? కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శర్మగారీ విషయాన్ని తమ ‘అంతరార్ద భాగవతం’ లో చెప్పారు. హిరణ్యం అంటే ప్రకృతి (బంగారం కూడా). కశిపుడు అంటే హింసించేవాడు. ప్రకృతిని తన దోవన పోనీయకుండా, తాను చెప్పిన దోవనే అది నడవాలని కట్టడి చేసినవాడు. ప్రకృతిని అలా నిర్బందించడమే హింస. ఆ రాక్షసుడి కట్టడిలో ప్రకృతి విలవిలలాడిపోయింది.
‘అస్మదీయంబగు నాదేశమున గాని
మిక్కిలి రవి మింట మెరయ వెరచు’
అని ప్రగల్భాలు పలికిన వాడు ఆ రాక్షస రాజు.
అలాగే ఇంద్రుడు, యముడు, అగ్ని, వాయువు అంతా గడగడలాడారు.
పృధు చక్రవర్తి కాలంలో కూడా ప్రకృతి అన్నివిధాల ఆయనకు అనుకూలంగా నడిచింది. దున్నకుండానే పంటలు పండేవి. పృధువు పట్ల భక్తీ గౌరవం వల్లనే కాని చండశాసనుడు అనే భయంతో కాదు. రెంటికీ ఎంత తేడా! నియంతృత్వానికి, ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఉన్నంత తేడా.
అలా ప్రకృతిని తన కనుసన్నల్లో పెట్టుకోవడం ఎందుకు? ఇంద్రియ సుఖాలను అనుభవించడానికే. ప్రకృతి అందరికీ అవసరమైన మేరకు ఇస్తుంది. కానీ ఆశ పడ్డంత కాదని గాంధీజీ చెప్పారు.
నరసింహావతారంలో విష్ణువుకి మనిషి తల పనికి రాకపోవడానికి ఈ ఆబే (అత్యాశే) కారణం. మనిషికి ‘ఆశాపాశము తా కడున్ నిడుపులేదంతంబు’. అట్టి ఆశలమారి మేధ ఆబను, కక్కుర్తిని మరింత పెంచుతుంది. తృప్తి చెందదు. సింహం అలా కాదు. అది మృగరాజు. దానికి లేకితనం, పేరాశ లేవు. ఏ పూటకు ఎంత అవసరమో ఆ పూటకు అంతే వేటాడి సంపాదించుకుంటుంది. ఆ పైన దాచుకోవడం ఎరగదు. రేపుమాపు అన్న చింత దానికి లేదు. అన్ని జంతువులూ అలా కాదు. పులీ, చిరుతపులి కూడా వేటాడిన జంతువును దాచుకుని తింటాయి. సింహానికి అది పనికిరాదు. తన కడుపు నిండితే పక్క నుంచి పోయే జంతువులను కూడా అది పట్టించుకోదు. రేపుతో లంకె పెట్టుకొని తత్వం. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అంతకన్నా నిస్సంగత్వం లేదు. ఇలాంటి తత్వం సమాజానికి ఎంతో అవసరం. అట్టి సంస్కృతి వుంటే ప్రస్తుత పర్యావరణం ఇంత దెబ్బతినేది కాదు. అనేక పక్షి, జంతుజాలాలు అంతరించిపోయేవి కావు. మనిషిలో ఆబ పెరగడం వల్లనే ఈ వినాశనమంతా.
అట్టి ఆబ (GREED) లేని సింహం తలను స్వామి ఎంచుకోవడం హిరణ్యకశిపుని ఆబ (GREED) కు వ్యతిరేకంగా వుండే సమాజాన్ని ఆవిష్కరించడం కోసమే. మనిషి శరీరాన్ని ఎంచుకున్నా దాని బలహీనత వల్ల స్వామికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్వామిది సంకల్పబలం. నిజానికి తాను ఎలాంటి చావు చావాలో హిరణ్యకశిపుడే కోరుకున్నట్లయింది. అతడు కోరిన కోర్కెలే, అతడు పెట్టిన నిబంధనలే అతడిని సంహరించే వ్యక్తి ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎక్కడ ఎలా అతడిని చంపాలో నిర్దేశించాయి”
(ఓం నమో శ్రీ నారసింహాయ, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య చరిత్ర, ప్రధమ సంపుటం, రచన: కీర్తిశేషులు భండారు పర్వతాలరావు, సమర్పణ: శ్రీ వేదభారతి, హైదరాబాదు)
(22-06-2020)