17, డిసెంబర్ 2018, సోమవారం

పెథాయి తుఫాను కంటే- Bhandaru SrinivasaRao About Pethai Cyclone | Chandra...

చెప్పాలని అనుకున్నది, చెప్పలేకపోయిందీ..... భండారు శ్రీనివాసరావు


సోమవారం పొద్దున్న “AP 24 X 7 Debate With Venkata Krishna” చర్చాకార్యక్రమం. ప్రసారం అమరావతి  స్టూడియో నుంచి. నేను పాల్గొన్నది హైదరాబాదు స్టూడియో నుంచి. అక్కడికీ ఇక్కడికీ కొన్ని సెకన్ల టైం తేడా వస్తుంది. ఇదొక సమస్య అయితే, కార్యక్రమం మొత్తం మీద మాట్లాడే అవకాశం తక్కువగా వుండడం మరో సమస్య.
ఈరోజు అలాగే జరిగింది.
“తుపాను ముప్పు ముంగిట్లో వుంటే చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకోసం వెళ్ళడం ఏమేరకు సబబు?”
సరే ఈ ప్రశ్నకు పార్టీల ప్రతినిధులు వాళ్ళ పార్టీల వైఖరులకు అనుగుణంగానే సమాధానాలు చెప్పారు.
నేను చెప్పాలని అనుకున్నదీ, పూర్తిగా చెప్పలేకపోయిందీ ఇదీ.
“ఒక ఇంటికి ఇద్దరు అల్లుళ్ళు. ఒకాయన పండక్కి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడి యావన్మందికీ యేవో కానుకలు పట్టుకు వెడతాడు. రెండో ఆయన చేతులు ఊపుకుంటూ వెడతాడు. పొరబాటున ఏ పండక్కి అయినా మొదటాయన బహుమతులు తీసుకు వెళ్ళడం మరచిపొతే ఆ యావన్మందీ మనసులో గొణుక్కుంటారు. ‘చూసారా ఏమీ తేలేదని’ సన్నాయి నొక్కులు నొక్కుతారు. రెండో ఆయన్ని పల్లెత్తు మాట అనరు.
చంద్రబాబు మొదటి అల్లుడి బాపతు. హుద్ హుద్ తుపాను సమయంలో బస్సులోనే మకాం వేసి, ‘సీఎం అంటే ఇలా వుండాల’ని జనం చేత అనిపించుకున్నాడు. మరి ఇప్పుడు అలా చేయకుండా వేరే పనుల మీద  వేరే రాష్ట్రాలకు వెడితే ‘చూసారా మొహం చాటేశాడు’ అదే జనం అంటారు. ఇది ఆయన చేసిన అలవాటే. చీమ చిటుక్కుమన్నా తక్షణం అక్కడ వాలిపోయి ‘పనిచేసే ముఖ్యమంత్రి’ అని పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నసమయంలో ఒరిస్సా తుపాను బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు  ప్రదర్శించిన చొరవను జనం మెచ్చుకున్నారు.  ఇప్పుడు ఆ పేరే ముందు కాళ్ళకు బంధం అయింది.
ఆయన ఎక్కడ వున్నా తుపాను పరిస్తితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారని టీడీపీ ప్రతినిధి సమర్ధించుకోవాల్సి వచ్చింది. ‘తిత్లీ తుపానప్పుడు జగన్ బాధితులను ఎందుకు పరామర్శించలేదు’ అని టీడీపీ నాయకులు అప్పుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ వాళ్ళు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు.  
వెంగళరావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు దివి సీమ తుపాను సంభవించింది. కృష్ణా జిల్లాకు చెందిన  మంత్రి మండలి వెంకట కృష్ణారావు, అప్పటి జిల్లా కలెక్టర్ ఏవీఎస్ రెడ్డి మొత్తం బాధ్యతను తమ భుజస్కందాలకు ఎత్తుకున్నారు. సీఎమ్  పర్యవేక్షణ హైదరాబాదుకే పరిమితం. అప్పుడున్న పరిస్తితుల కారణంగా ప్రాణ నష్టాన్ని పెద్దగా నివారించలేకపోయారు. కానీ తదనంతర పరిణామాలను కట్టుదిట్టంగా అదుపు చేయగలిగారు. అధికారులు గట్టిగా పనిచేసారు.  ఆ క్రెడిట్ మాత్రం ముఖ్యమంత్రి ఖాతాకే చేరింది.
నీళ్ళల్లో రోజుల తరబడి నానిపోయి చూడడానికే భయంకరంగా ఉన్న శవాలను ముట్టుకోవడానికి కూడా ఎవరూ ధైర్యం చేయని పరిస్తితుల్లో  ఆర్ ఎస్ ఎస్ బృందాలు రంగ ప్రవేశం చేసి వాటికి అంత్యక్రియలు చేయడం ఆరోజుల్లో ప్రజల ప్రశంసలు  పొందింది.
కాబట్టి, ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఇలాంటి సమయాల్లో పైనుంచి పర్యవేక్షణ చేయాలి కానీ స్వయంగా క్షేత్రస్థాయికి వెడితే ప్రచారం లభిస్తుందేమో కానీ ఆశించిన ఫలితాలు రావు.
ముఖ్యమంత్రి భోపాల్ వెళ్ళాడా లేక తుపాను ప్రాంతాలలో బస్సులో మకాం వేసారా అనేది అప్రస్తుతం. ఆ ప్రాంతాల ప్రజలను యెంత బాగా ఆదుకున్నారు అనేదే ముఖ్యం.
ప్రసారం జరుగుతున్నప్పుడు కూడా చంద్రబాబు ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. ఈ ప్రచారం ముఖ్యమంత్రికి మంచి పేరు తేవచ్చు కానీ, అధికారుల విధులకు అది  ఆటంకంగా మారుతుంది. ఈ విషయం చంద్రబాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

Debate on RSS to Find an Alternative to Modi ...? | The Debate with Venk...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ  గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ), శ్రీ గౌతం రెడ్డి (వైసీపీ), శ్రీ రఘురాం (బీజేపీ)

Debate on YS Jagan Comments on AP CM over TRS Alliance | The Debate With...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ  గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ), శ్రీ గౌతం రెడ్డి (వైసీపీ), శ్రీ రఘురాం (బీజేపీ)

Debate on Govt Reaction on Pethai Cyclone | The Debate with Venkata Kris...



ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ  గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ), శ్రీ గౌతం రెడ్డి (వైసీపీ), శ్రీ రఘురాం (బీజేపీ)

16, డిసెంబర్ 2018, ఆదివారం

మేం సినిమాలు తీస్తూనే ఉంటాం.. వాళ్ళు చూస్తూనే ఉంటారు | Prakash Rao Comme...





ప్రతి ఆదివారం మాదిరిగానే  ఈ ఉదయం విజయ్ నారాయణ్   TV 5 News Scan  చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ ప్రకాష్ రెడ్డి (బీజేపీ), శ్రీ క్రిషాంక్ (కాంగ్రెస్), శ్రీ  తెలంగాణా ప్రకాష్ (టీఆర్ఎస్) 

లవ్ శాల్యూట్!



డిసెంబరు 16, 1971.
47 సంవత్సరాలు నాలాంటి మనిషితో కాపురం అంటే ఆవిడకి ఎంత ఓపిక వుండివుండాలి.  ఉండబట్టే భరించింది.
థాంక్స్ చెప్పకూడదు. చెబితే, ముళ్ళపూడి వారి భాషలో, వాడు  ‘మొగుడు ముండావాడు’ ఎలా అవుతాడు చెప్పండి.
మా కాపురానికి ఈ రోజుతో నలభయ్ ఏడేళ్ళు. మా ప్రేమ వివాహం కాలపరీక్షను తట్టుకుని నిలిచిందని కాలరు ఎగరేయొచ్చేమో.
సుఖంగా పెరిగి కష్టాలు పంచుకోవడం ఎంత కష్టమన్నది కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగిన వారికి ఓ పట్టాన అర్ధం కాదు. అందుకే నన్ను కట్టుకుని మా ఆవిడ పడ్డ కష్టాలు నాకెన్నడూ తెలవదు. తెలిసినా అది ఆమె బాధ్యత అనుకున్నాను, బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు ఉదాహరణ అయిన నేను.
నా కారణంగా కష్టాలు పడ్డా,  కన్నసంతానం మాత్రం మా ఆవిడను ఆరుపదులు దాటిన వయస్సులో సుఖపెడుతూనే వున్నారు. నా వల్ల ఆమెకు జరిగిన మేలు ఇదొక్కటేనేమో!.
“జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది.  అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం ఎంత కష్టమో తెలిసేది ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే”