1, ఆగస్టు 2016, సోమవారం

గుడిలో ఏముంది ?



గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం ఒకటి గుడిలో దాగి వుంది.
వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. ఏదో కషాయాలు, చూర్ణాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట.
కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు ‘కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు.
ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.
వూళ్ళల్లో వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం. ఈ రోజుల్లో ప్రభుత్వాలు అలాటి పేద వృద్ధులకు నెలకు ఇంత అని డబ్బు చెల్లించి తమ బాధ్యత దులుపుకుంటున్నాయి. నా అనేవాళ్ళు ఎవ్వరూ లేని, వంటావార్పూ సొంతంగా చేసుకోలేని ఆ అభాగ్యులకు డబ్బు ఇస్తే ఏం ప్రయోజనం. వండి వార్చేవాళ్ళు లేని నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో మించింది ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి. మరి ఇప్పుడో! ఓ పక్క పేదలకు ఉచితంగా పంచాల్సిన ప్రసాదాలను అమ్ముకుంటూ, మరో పక్క వీ.ఐ.పీ.ల సేవలో తరిస్తున్నాయి.
ఈరోజుల్లో చదువుకునే పిల్లలకు ప్రభుత్వాలు ఎంతో డబ్బు ఖర్చు చేసి మధ్యాహ్న భోజన పధకాలు అమలు చేస్తున్నాయి. పూర్వపు రోజుల్లో ప్రభుత్వాలపై భారం లేకుండా దేవాలయాలే ఈ పని చూసుకునేవి. నిలవవుండే పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన మధ్యాహ్న భోజనం ఏముంటుంది.
గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గుడిలో ఏముందీ అని వ్యంగ్యంగా పాటలు పాడుకునే అవసరం వుండదు.
అయితే, ప్రతిదీ రాజకీయమయమయిపోతున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా అంటే అనుమానమే.
ఇక్కడ గుడి అంటే దేవాలయం మాత్రమే కాదు, అది ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఒక గురుద్వారా కావచ్చు. ఏదయినా అవి నెరవేర్చే సామాజిక బాధ్యత మాత్రం ఒక్కటే.

జర సోచో


మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?
పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?
ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో
ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో
ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో
ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో
ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో
ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో
ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో
ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో
ఎక్కడైతే ... మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.
ఆలోచించండి.

(నెట్లో దొరికిన ఆణిముత్యం)

రేడియో భేరి - 10

లలిత సంగీతం
లలితసంగీతం విషయంలో హైదరాబాదు, విజయవాడ రేడియో కేంద్రాల నడుమ పోటీ వుండేది. ఈ రెండు కేంద్రాలు లలిత గీతాలతోపాటు సంగీత నాటకాలు, సంగీత రూపకాలు, యక్ష గానాలు ప్రసారం చేసేవి. 1955 నుంచి హైదరాబాదు కేంద్రం ప్రతి రోజూ ‘గీతావళి’ పేరిట లలిత గీతాలు ప్రసారం చేయసాగింది. దాశరధి, నారాయణరెడ్డి రాసిన పాటలను ఎన్నింటినో ప్రసారం చేసింది. 1957 లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి హైదరాబాదు రేడియోలో ప్రయోక్తగా చేరారు. ఎనిమిదేళ్ళపాటు ఆకాశవాణిలో ఉద్యోగం చేశారు. ‘రేడియోవాళ్ళు నాచేత రాయించకపోతే నేను రాసిన దాంట్లో చాలా భాగం రాసివుండే వాణ్ణి కాదు’ అని ఆయన చెప్పేవారు.
1960 లో రజని సంగీత సంవిదానంతో కృష్ణ శాస్త్రి రాసిన ‘క్షీర సాగర మధనం’, ‘విప్రనారాయణ’, ‘మాళవిక’ యక్ష గానాలను హైదరాబాదు కేంద్రం ప్రసారం చేసింది.

జానపద సంగీతాన్నీ, జానపద కళారూపాలనూ పరిరక్షించడంలో హైదరాబాదు, విజయవాడ రేడియో కేంద్రాల కృషి ఎన్నదగ్గది. జానపద కళాకారులను రేడియో కేంద్రానికి పిలిపించి వారి పాటలను, సంగీతాన్ని స్టుడియోలో రికార్డ్ చేసి భద్రపరచడం ఒక ఎత్తయితే, ఆకాశవాణి బృందాలే మారుమూల గ్రామాల్లో వున్న కళాకారుల వద్దకు వెళ్ళి వారి సంగీతం రికార్డ్ చేసి ప్రసారం చేయడం మరో ఎత్తు. రేడియో ఆ రోజుల్లో ఈ కర్తవ్యాన్ని చాలా గొప్పగా నిర్వహించింది. ఆకాశవాణి పూనిక లేకుంటే, తెలుగు జానపద మౌఖిక కళారూపాలెన్నో మరుగున పడివుండేవి.
తెలుగువారికే ప్రత్యేకమైన పద్యాల ప్రసారం పట్ల కూడా ఆకాశవాణి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వుంటుంది. ‘సమస్యా పూరణం’ కార్యక్రమం సాహిత్య ప్రియులైన శ్రోతలకు ప్రియమైన రేడియో కార్యక్రమాల్లో ఒకటి. రంగస్థల పద్యాల పట్ల శ్రోతల్లో వుండే ఆసక్తిని గుర్తించి వాటినీ ప్రముఖ గళాల ద్వారా వినిపిస్తూ వుంటుంది.
ప్రసిద్ధ నాటకాలను పదిలపరిచే ప్రయత్నాలతో పాటు తన శబ్ద భాండాగారంలోని కొన్ని గొప్ప నాటకాలను కేసెట్లుగా, సీడీలుగా విడుదల చేసింది. ప్రముఖులు ఎందరో తాము ఆకాశవాణి కోసం చేసిన రచనలను పుస్తకాలుగా ప్రచురించిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
భాషా బోధనకోసం ఆకాశవాణి ప్రసారం చేసిన పాఠాలను, అలాగే సంస్కృత పాఠాలు చెప్పిన కేశవపంతుల నరసింహ శాస్త్రి, తెలుగులో రేడియో వార్తలకు వొరవడి దిద్దిన జగ్గయ్య, పన్యాల రంగనాధరావు వంటి వారిని మరచిపోవడం యెట్లా!
కార్యక్రమాల రూపకల్పనను ఉద్యోగ ధర్మం మాదిరిగా కాకుండా ఒక పవిత్రమైన కర్తవ్యంగా భావించిన వారెందరో ఆకాశవాణిలో పనిచేసి సంస్థకు మంచి గుర్తింపు తీసుకువచ్చారు. రేడియో ప్రయోక్తలుగా పనిచేసిన రోజుల్లో పింగళి లక్ష్మీకాంతం, నాయని సుబ్బారావు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, బందా కనక లింగేశ్వర రావు, ప్రసిద్ధ కవి గుర్రం జాషువా ప్రాతః స్మరణీయులు. ఆ కోవలోని వారే తదనంతర కాలంలో రేడియోలో పనిచేసిన డాక్టర్ రావూరి భరద్వాజ, తురగా జానకీరాణి, డాక్టర్. పీ. ఎస్. గోపాలకృష్ణ, ప్రయాగ వేదవతి మొదలైన వారు.
(ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

31, జులై 2016, ఆదివారం

ఊ అంటే వస్తుందా......


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో టీవీల్లో జరుగుతున్న చర్చల తీరుతెన్నులు చూస్తున్నప్పుడు విషయం గుర్తుకు వచ్చింది.
వెనుకటి రోజుల్లో ఇళ్ళల్లో నాయనమ్మలుఅమ్ముమ్మలు మునిమాపు వేళల్లో చిన్నపిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని కధలు చెప్పేవాళ్ళు. పిల్లలు 'కొడుతూకధలు వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్లు. అలాటి ఒక కధ ఇది.
'అనగనగా ఊళ్ళో ముసలామె వుండేదికధ మొదలు పెట్టేది బామ్మ.
'అనేవాళ్ళు పిల్లలు.
' ముసలావిడ రోజు బావి గట్టు మీద కూర్చుని బట్టలు కుడుతుంటే చేతిలో సూది జారి నూతిలో పడిపోయింది'
'అనేవాళ్ళు పిల్లలు ఇంకా చెప్పు అన్నట్టుగా.
' అంటే వస్తుందా?' అనేది బామ్మ.
'అనేవాళ్ళు పిల్లలు నోరు తెరిచి.
'అంటే వస్తుందాఅడిగేది బామ్మ.
బావిలో పడ్డ సూది సంగతేమో కాని,   కధ మాత్రం అలా  అనంతంగా సాగిపోయేది.
ఇక విషయానికి వస్తే-
ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రావాలి. అంటే ఏం చేయాలి?
'వై ఎస్ ఆర్ సీపీ వాళ్ళు బందులు చేస్తే  వస్తుందా?
'ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళి మహాజర్లు ఇచ్చి వస్తే వస్తుందా? అమరావతిలో  కూర్చుని  ప్రెస్  వాళ్ళతో  ఆగ్రహాలు, నిరసనలు వ్యక్తం చేస్తే వస్తుందా?కేంద్ర ప్రభుత్వానికి రాం రాం చెబితే వస్తుందా 
'రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తే వస్తుందా
'అసలు వస్తుందా రాదావస్తే ఎప్పుడు వస్తుంది?'
'ఎప్పుడాబావిలో పడ్డ సూది ముసలమ్మ చేతికి  దొరికినప్పుడు'
ఉపశృతి
ప్రమోషన్ రాగానే కంచి పట్టు చీరె కొనిపెడతామన్నారు. రెండేళ్ళయింది. అది ఒట్టి మాటేనా?”
భలేదానివే. దాని విషయమే కదా నేను ఇన్నాళ్ళు ఆలోచిస్తోంది. కాకపోతే ఒక సంగతి చెప్పాలి. చీరెదేముందిఈరోజు కడతావుకలరు మాసిపొతే  రేపు బయట పడేస్తావు. అదే నెక్లెసు కొన్నాననుకో. నాలుగు కాలాలపాటు వుంటుంది. నీకూ నలుగుర్లో గొప్పగా  వుంటుంది. ఏమంటావ్!” 



మార్పు

మంచివాడు చెడ్డవాడుగా మారడానికీ, మంచివాడు అనిపించుకోవడానికీ పెద్దగా కష్టపడనవసరం లేదు. కానీ చెడ్డవాడు మంచివాడుగా మారాలన్నా, మంచివాడు అనిపించుకోవాలన్నా చాలా కష్టపడాలి. ఎందుకంటే ఆ మార్పును గమనించేవారి చూపుల్లో అనుమానపు ఛాాయలే ఎక్కువ. వీటిని అడుగడుగునా ఎదుర్కుంటూ, మడమ తిప్పకుండా,మనసు మార్చుకోకుండా ముందుకు సాగాల్సివుంటుంది.

రేడియో భేరి - 9

విశ్వనాధ స్వరంతో ‘బద్దన్న సేనాని’

తెలుగు ప్రసారాలకు సంబంధించి – హైదరాబాదు, విజయవాడ కేంద్రాలు చాలా ఎక్కువ కృషి చేసాయి. అన్ని తరగతుల శ్రోతలను ఆకర్షించడానికి ఈ రెండు కేంద్రాలు ఎన్నో కార్యక్రమాలు రూపొందించాయి. సాహిత్య విభాగం తీసుకుంటే ప్రసిద్ధుల ప్రసంగాలు, గోష్టులు, సంచికా కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు. సమస్యా పూరణాలు ఇలా ఎన్నో ప్రసారమయ్యాయి. అవుతున్నాయి కూడా. భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణం, శ్రీశైలంలో జరిగే శివరాత్రి ఉత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలయిన సందర్భాలలో ప్రత్యక్ష వ్యాఖ్యానాలతో కూడిన కార్యక్రమాలు వినిపిస్తూ రేడియో కొత్తదారులు తొక్కింది.
కధలు, నవలలు మొదలైనవాటిని ప్రసారం చేయడం లోను ఆకాశవాణి తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తోంది. ఏ కొందరో తప్ప ఆధునిక కదారచయితల కధలను ఆ రచయితల సొంత గొంతుతోనే వినిపించడంలో ఆకాశవాణి విజయవంతం అయింది. కాకపొతే కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు ప్రముఖుల కధలను నిలయ కళాకారుల ద్వారా చదివించడం జరుగుతుంటుంది.
విశ్వనాధ సత్యనారాయణ తమ ‘బద్దన్న సేనాని’ నవలను విజయవాడ కేంద్రం నుంచి ఆయనే స్వయంగా వినిపించడం రేడియో చరిత్రలో ఒక అపూర్వ విషయం. 1979 తరువాత హైదరాబాదు కేంద్రం ‘నవలాస్రవంతి’ పేరిట నవలల ప్రసారం ప్రారంభించింది. తద్వారా ప్రసిద్ధికెక్కిన ఎన్నో తెలుగు నవలలు రేడియో ద్వారా శ్రోతలు వినగలిగారు. తక్కిన కేంద్రాలనుంచి కూడా కొన్ని నవలలు ప్రసారం అయ్యాయి.
1956 జనవరి 25 నాడు మొట్టమొదటి జాతీయ కవి సమ్మేళనం ప్రసారమయింది. ప్రతి ఏడాది జనవరి 25 నాడు ప్రసారం అయ్యే ఈ జాతీయ కవి సమ్మేళనంలో చోటుచేసుకునే తెలుగు కవితలను తక్కిన భారతీయ భాషల్లోకి అనువదించి ప్రసారం చేయడం అలాగే తక్కిన భాషల కవితలను తెలుగులోకి అనువదించి ప్రసారం చేయడం జరుగుతోంది. ప్రముఖ కవుల కవితల్ని వాళ్ల నోట పలికించి పదిలపరచడంలోను ఆకాశవాణి ముందంజ వేసింది. ఉదాహరణకు హైదరాబాదు కేంద్రం సి. నారాయణ రెడ్డి గానం చేసిన ‘విశ్వంభర’ను ఆవిధంగానే పదిలపరచింది.
అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ‘గళాల’ను పదిలపరిచే కృషిలో ఆకాశవాణి నిమగ్నమై వుంది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఎందరితోనో చేసిన సంభాషణలను ఆకాశవాణి భద్రపరచింది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా రేడియోకోసం ప్రముఖుల జీవితఘట్టాలను వారితో సంభాషణల రూపంలో నిక్షిప్తం చేస్తూ వస్తోంది. అటువంటి కొన్ని సంభాషణలు ప్రసారం చేసే ప్రయత్నం కూడా మొదలయింది.
శాస్త్రీయ సంగీత సంప్రదాయ పరిరక్షణ ఆకాశవాణి కర్తవ్యాలలో ఒకటి. అన్నమాచార్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, ఆధ్యాత్మ రామాయణ కృతులు, భక్తి తత్వాలు, భక్తి గీతాలు – ఆకాశవాణి ద్వారా బహుళ ప్రచారం పొందాయి. ప్రముఖ వాగ్గేయకారుల రచనలను పదిలపరిచే ఉద్దేశ్యంతో శ్రీ త్యాగరాజస్వామి వారి ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు మొదలైన వాటిని బాలమురళీకృష్ణ వంటి ప్రముఖ విద్వాంసుల ద్వారా పాడించింది ఆకాశవాణి. అరుదైన రచనలను సంగీత శిక్షణ కార్యక్రమాల ద్వారా ఔత్సాహికులకు నేర్పించడం విజయవాడ రేడియో కేంద్రం పెట్టిన ఓ కొత్త వొరవడి. వోలేటి వెంకటేశ్వర్లు నేర్పిన తెలుగు కృతులను దక్షిణ భారత దేశంలోని ఎందరో నేర్చుకోవడానికి ఆకాశవాణి చేసిన ఈ ప్రయత్నం ఎంతగానో దోహదపడింది. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)

30, జులై 2016, శనివారం

రేడియో భేరి - 8

నూరవ ఆకాశవాణి కేంద్రం వరంగల్

రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో మద్రాసు నగరం నుంచి షార్ట్ వేవ్ ట్రాన్స్ మిటర్  ను ఢిల్లీ తరలించారు. 1942 నుంచి 1945 దాకా తెలుగు, తమిళ కార్యక్రమాలు ఢిల్లీ నుంచి కూడా ప్రసారం అయ్యాయి. మద్రాసు నుంచి కొంత బలహీనపడిన ప్రసార వ్యవస్థ ద్వారా తెలుగు, తమిళ ప్రసారాలు కొనసాగినా, శ్రోతలు ఢిల్లీ నుంచి వెలువడే కార్యక్రమాలపట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేవారు.
1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి - ఆలిండియా రేడియో వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నోతిరుచిరాప్పళ్లి రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది. 1956 నుంచి ఆలిండియా రేడియో సంస్థను ‘ఆకాశవాణి’గా పేర్కొంటున్నారు.
1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
డెక్కన్ రేడియో (హైదరాబాదు, ఔరంగాబాదు) రేడియో కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1950 ఏప్రిల్ ఒకటో తేదీన హైదరాబాదు రేడియో కేంద్రం ‘ఆలిండియా రేడియో’ వ్యవస్థలో భాగంగా పనిచేయడం ప్రారంభించింది. 1955 నవంబర్ రెండో తేదీన మొదలయిన బెంగలూరు రేడియో కేంద్రం, 1963 జూన్ లో మొదలయిన పోర్ట్ బ్లేయర్ కేంద్రం కూడా తెలుగులో ప్రసారాలు చేస్తున్నాయి. 1957 అక్టోబర్ మూడో తేదీన మొదలయిన ‘వివిధ భారతి’ ప్రసారాలలో తెలుగు పాటలు రోజూ అరగంట సేపు వేసేవారు. 1969 సెప్టెంబర్ లో ఢిల్లీ, పాట్నా, రాంచీ, సిమ్లా రేడియో కేంద్రాల నుంచి తెలుగు నేర్పే పాఠాలు ప్రారంభించారు. 1991 మార్చి రెండో తేదీన హైదరాబాదు, విజయవాడలలో వాణిజ్య ప్రసారాలు మొదలుపెట్టారు.
కాలక్రమేణా కడపలోను, విశాఖపట్నంలోను ఆకాశవాణి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. స్థానికంగా అంటే జిల్లా స్థాయిలో రేడియో సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిన తొలి స్థానిక రేడియో కేంద్రాలలో ఆదిలాబాదు కేంద్రం ఒకటి. వరంగల్లులో 1990 ఫిబ్రవరి 17 వ తేదీనాడు ప్రారంభమైన ఆకాశవాణి కేంద్రం – ఆకాశవాణి వ్యవస్థలో ఏర్పడ్డ నూరవ కేంద్రంగా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఆకాశవాణి వ్యవస్థలో మన రాష్ట్రంలో హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఆదిలాబాదు, కొత్తగూడెం, వరంగల్లు, నిజామాబాదు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, మార్కాపురం మొదలైన చోట్ల తెలుగులో కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. మాచెర్ల, కరీంనగర్, సూర్యాపేట మొదలయిన చోట్ల ప్రసార వ్యవస్థలు వున్నాయి. వంద వాట్ల సామర్ధ్యం కలిగిన ట్రాన్స్ మిటర్లను ఒంగోలు, నెల్లూరు, కామారెడ్డి, బాన్స్ వాడ, నంద్యాల, ఆదోని, కాకినాడ మొదలయిన చోట్ల ఏర్పాటు చేశారు. (ఇంకా వుంది)
(డాక్టర్ పీ.ఎస్.గోపాలకృష్ణ సౌజన్యంతో)