23, జులై 2016, శనివారం

లయ తప్పుతోన్న ‘ప్రత్యేక’ రాగం

సూటిగా......సుతిమెత్తగా.......భండారు శ్రీనివాసరావు

ఎన్నాళ్ళో వేచిన శుక్రవారం రానూ వచ్చింది, పోనూ పోయింది. ఏమీ జరగకుండానే చక్కాపోయింది.
నడుమ మాత్రం శుక్రవారం ఏం జరుగుతుంది అనే విషయంలో మీడియాలో చర్చలు తీవ్రాతి తీవ్రంగా సాగాయి.
అందరి నోటా మాట వినబడ్డప్పుడు, గతంలో ఒకసారి శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక నేపధ్యంలో, డిసెంబరు 31 తరువాత ఏం జరుగుతుంది అని ఢిల్లీలో విలేకరులు అడిగిన ప్రశ్నకు గవర్నర్ నరసింహన్ జవాబిస్తూ, ‘ఏం జరుగుతుంది, జనవరి ఒకటి వస్తుంది అని చెప్పడం గుర్తుకు వచ్చింది.
అలాగే ఇప్పుడు జరిగింది. శుక్రవారం తరువాత శనివారం వస్తుంది. అంతే. అంతకంటే ఏమీ కాదు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో శుక్రవారం రాజ్యసభలో ఏదో ఒకటి తేలబోతోంది అని కొందరు పెట్టుకున్న భ్రమలు అలాగే తేలిపోయాయి. కొత్తగా ఏర్పడ్డ ఒక రాష్ట్రానికి ఆయువుపట్టు అని అన్ని పార్టీలు ఒప్పుకున్న ప్రత్యేక ప్రతిపత్తి అనే అంశంపై రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు ఒక ఆప్ సభ్యుడి నిర్వాకం అడ్డం తగిలి అతి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ వ్యవహారం అడుక్కి వెళ్లిపోయింది. ఏమీ తేల్చకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.
హరికధా భాగవతార్  హరికధతో పాటు శ్రోతల్ని ఆకట్టుకోవడానికి కొన్ని పిట్టకధలు కూడా చెబుతారు. కానీ అవి ప్రధాన కధను ఆటంక పరచకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
రాజ్యసభలో అలా జరగలేదు. ప్రైవేటు బిల్లులను శుక్రవారం నాడే చేపట్టడం చట్టసభల్లో ఆనవాయితీ. (చట్ట సభల్లో ప్రైవేటు బిల్లులు వీగిపోవడానికి అదొక కారణం అని గిట్టని వాళ్ళు చెబుతుంటారు. ఎందుకంటే వారాంతపు సెలవుల్లో, రైళ్ళూ విమానాలు పట్టుకుని   తమతమ నియోజక వర్గాలకు చేరుకునే ప్రయాణ సన్నాహాల్లో సభ్యులు వుండే  అవకాశం హెచ్చు కనుక ఆ రోజు సభల్లో హాజరు పలచగా వుంటుందని వారి అంచనా).
ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి కేవీపీ ప్రతిపాదించిన బిల్లు మొన్న  శుక్రవారం నాడు ఎజెండాలో వుంది. వాయిదాలు పడుతూ వచ్చిన సభ మధ్యాన్నం రెండున్నరకు సమావేశమైనప్పుడు  ఈ బిల్లును తక్షణమే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలు కోరాయి. అదే సమయంలో అధికార  బీజేపీ సభ్యులు ఆమ్ ఆద్మీ పార్టీ లోకసభ సభ్యుడు భగవంత  మాన్ అంశాన్ని ప్రస్తావించి సభాకార్యక్రమానికి అడ్డు తగిలాయి. ఈ మాన్ మహాశయుల వ్యవహారమే ప్రధాన కధలో పిట్టకధ. అయితే  ఈ పిట్టకధ అసలు కధకు మోసం తెచ్చింది. క్యుములో నింబస్ మేఘాల మాదిరిగా కమ్ముకుని కధ పతాకస్థాయికి చేరకమునుపే దాన్ని పదిలంగా కంచికి చేర్చింది.
నిజానికి కొత్తగా పార్లమెంటుకు ఎన్నికయిన ఆమ్ ఆద్మీ సభ్యుడు భగవంత  మాన్ చేసిన నిర్వాకం కూడా క్షంతవ్యం కాదు. ఆయన పార్లమెంటు భవనం గుట్టుమట్టుల్ని తన ఫోన్ కెమెరాలో బంధించి ఆ వీడియోని సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్  చేయడం పెను సంచలనం కలిగించింది. అప్పటివరకు  ఈయన ఎవరో దేశానికి తెలవదు. తరువాత దేశంలో ఈయనను  తెలియని వాళ్ళు లేరు. ఆస్థాయిలో మీడియా ప్రచారం లభించిన  ఈ వ్యవహారం, లోక్ సభ వాయిదా పడేవరకు ముదిరిపోయింది. దాని క్రీనీడలు సహజంగానే రాజ్యసభపై కూడా పడ్డాయి. ఆమ్ ఆద్మీ సభ్యుడిపై తక్షణం చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ సభ్యులు సభాధ్యక్షుడి స్థానాన్ని చుట్టూ ముట్టి నినాదాలు ప్రారంభించారు. పదిహేను నిమిషాల గందరగోళం తరువాత రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. పిట్టకధ ముందు అసలు హరి కధ వెనక్కి తప్పుకుంది.        
కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లు వ్యవహారం ఎలా జరగాలో అలా జరిగిందని చెప్పేవీలులేదు. కానీ ఎలా జరగాలని కోరుకున్నారో అలాగే జరిగింది. నిజానికి ఏమీ జరగలేదు కూడా. పదిహేను నిమిషాలు హడావిడి, గందరగోళం, సోమవారానికి వాయిదా పడడం, అంతే జరిగింది.
సభాప్రాంగణం తలుపులు మూయలేదు. ప్రత్యక్ష ప్రసారాలు నిలుపుచేయలేదు. కానీ సభ ఒక పద్దతిగా జరిగిందని మాత్రం చెప్పలేరు. ప్రజాస్వామ్య దేశంలో చట్ట సభలు ఎవరు అధికారంలో వున్నా అవి సాగే తీరులో మాత్రం మార్పు వుండదు.
కారణం రాజకీయం. రాజకీయుల రంగూ రుచీ మారుతుందేమో కానీ రాజకీయం రంగు మాత్రం ఎన్నటికీ వెలవదు.
మళ్ళీ బిల్లుకు మోక్షం ఎప్పుడంటే ఎవరూ చెప్పలేని పరిస్తితి. చిలక ప్రశ్న అడగాల్సిందే.
సందర్భం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సంగతి కొంత ముచ్చటించుకోవడం అప్రస్తుతమేమీ కాదు.
రామాయణంలో ప్రధాన పాత్రలు రాముడు, రావణుడు  అయినప్పటికీ  ఆ  పురాణ గాధకు మూల కారణం దశరధ మహారాజు  కదన రంగంలో విల్లంబులు చేబూని తనకు సాయపడిన భార్య కైకేయికి ఇచ్చిన రెండు వరాలు. అవి లేకపోతే రామాయణమే లేదు. ఇచ్చిన మాటకు రాజు కట్టుబడడం వల్లా, లేదా ఆయన మాట నిలబెట్టడానికి రాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళడం వల్లా రామాయణ గాధ నేటికీ మానవులకు ఉత్కృష్టమైన నీతిని బోధించే ఇతిహాసంగా వర్ధిల్లుతోంది.
ఈ నేపధ్యం గమనంలో పెట్టుకుంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన  బాధ్యత నేటి రాజకీయులది. ఆ మాట వల్ల ప్రయోజనాలు శూన్యం అనే నమ్మకం వాటికి వున్న పక్షంలో అసలా మాట ఇవ్వనే కూడదు. ఇచ్చేముందే అన్ని విషయాలు సాకల్యంగా ఆలోచించుకుని వుండాల్సింది. అసలు సిసలు రాజకీయ నాయకుల నుంచి ప్రజలు ఆశించేది ఇదే.
లేదా బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు మరో పని కూడా చేయవచ్చు. ప్రజల్ని విశ్వాసం లోకి తీసుకుని మారిన పరిస్తితుల్లో మార్చుకున్న నిర్ణయం ఏదైనా వుంటే దాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా ప్రజల ముందు పెట్టాలి. అందుకు చట్ట సభలని మించిన వేదిక మరొకటి వుండదు.
ఇప్పటికయినా పాలకపక్షాలు ఈ విషయంలో తమ విధానాలను నిజాయితీగా స్పష్టం చేయాలి. రాజకీయ ప్రత్యర్ధులతో ఆడే క్రీడల్ని, ఎత్తులు పైఎత్తుల్ని, వ్యూహ ప్రతివ్యూహాలను  ఏదో విధంగా సరిపెట్టుకోవచ్చు, కానీ తమని నమ్మి గద్దె ఎక్కించిన ప్రజలతో దాగుడు మూతలు మాత్రం  క్షంతవ్యం కాదు. అసలు సిసలు రాజనీతిజ్ఞులు నడుచుకోవాల్సిన తీరు ఇదే.
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి అంశంలో కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు, టీడీపీ, వై. ఎస్.ఆర్.సి.పీ. వంటి ప్రాంతీయ పార్టీలకి ప్రధాన బాధ్యత వుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, వాటిని ఒక జాబితా రూపంలో ఇస్తే ఆ వరుస క్రమంలో మొదటి రెండు స్థానాల్లో వుండాల్సినవి ప్రస్తుతం పాలక పక్షాలు అయిన బీజేపీ, టీడీపీ. ఎవరయినా ఆ తరువాతే. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోగల వెసులుబాటు వీటికి ఉన్నట్టుగా వేరే రాజకీయ పార్టీలకి లేదు.
2014 ఏప్రిల్ 20, (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం జరిగిన తీరు)  2016 జులై  22. (ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి కోసం ప్రైవేటు బిల్లుకు పట్టిన గతి) ఈ రెంటినీ, ఆయా తేదీల్లో రాజ్యసభలో ఏం జరిగింది అనేదాన్ని ఆసాంతం  ఆంధ్ర ప్రజానీకం ఇళ్ళల్లో కూర్చుని టీవీల్లో చూశారు. వాళ్ళు ఒక అభిప్రాయానికి రావడానికి అవి చాలు.
శుక్రవారం రాజ్యసభలో కేవీపీ బిల్లు ఏదో సాధిస్తుందని రాజకీయాల పట్ల కనీస అవగాహన వున్నవారెవ్వరూ ఆశ పెట్టుకోలేదు. అయితే ఒక్కటి మాత్రం ఖాయం. ఫలితం రాకపోయినా, లేకపోయినా ఆయన బిల్లు రగిలించిన వేడి ఇంతా అంతా కాదు.  
కురుపాండవ యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు సంధికోసం కౌరవుల వద్దకు వెడతాడు. సంధి పొసిగే సంగతి కాదని కృష్ణుడికి ముందే తెలుసు. అంతేకాదు, యుద్ధం జరగాలని కోరుకున్నదీ ఆయనే, జరిగి తీరుతుందనీ తెలిసిందీ ఆయనకే. ఫలితం వుండదని తెలిసి చేసిన ప్రయత్నం అది. ఫలితం ఎలా వుంటుందో తెలిసి చేసిన యత్నం కూడా అది. సంధి పట్ల, యుద్ధం పట్ల సంబంధం వున్న అన్ని పక్షాల లేదా వ్యక్తుల వైఖరులు, అభిప్రాయాలు బయట పెట్టడానికి చేసిన రాజకీయం అనుకోవాలి.
ఫలితం రాకపోయినా, ఫలితం లేకపోయినా ప్రయత్నం మాత్రం వృధా కాదు. ఎవరు ఏమిటనేది అనేది, ఎవరి మనసులో ఏముందనేది జనాలకు తెలిసొచ్చేలా చేయగలిగితే ఆ ప్రయత్నం ఓ మేరకు విజయవంతం అయినట్టే. ఆ రకంగాచూస్తే ఈ బిల్లు పోషించింది నాటి భారతంలో కృష్ణుడి పాత్ర. Top of Form
ఉపశృతి:      
ఆకలి వేసిన బిడ్డ అమ్మా!అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి గారి ఉవాచ.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో అన్ని పార్టీల రాగం ఒకటే అయినా ఎవరి శృతి వారిది. ఎవరి నాదం వారిది. అందుకే లయ తప్పుతోంది.
(రచయిత జంధ్యాలకు, సంగీతాభిమానులకు క్షమాపణలతో)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595


22, జులై 2016, శుక్రవారం

చిలక ప్రశ్న

శుక్రవారం ఏం జరుగుతుంది?
అందరి నోటా  ఈ మాట వినబడ్డప్పుడు, గతంలో ఒకసారి శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక నేపధ్యంలో, డిసెంబరు 31  తరువాత ఏం జరుగుతుంది అని ఢిల్లీలో విలేకరులు అడిగిన ప్రశ్నకు గవర్నర్ నరసింహన్  జవాబిస్తూ, ‘ఏం జరుగుతుంది, జనవరి ఒకటి వస్తుంది’ అని  చెప్పడం గుర్తుకు వచ్చింది.
అలాగే ఇప్పుడు జరిగింది.
ఆంధ్రప్రదేశ్  ప్రత్యేక ప్రతిపత్తి  విషయంలో ఏదో ఒకటి తేలుస్తుందని భ్రమపడ్డ  రాజ్యసభ ఉదయం ఓసారి   వాయిదా పడి తిరిగి  మధ్యాన్నం రెండున్నరకు సమావేశం అయింది. కొత్తగా ఏర్పడ్డ ఒక రాష్ట్రానికి  ఆయువుపట్టు అని అన్ని పార్టీలు ఒప్పుకున్న ప్రైవేటు బిల్లుకు ఒక  ఆప్ సభ్యుడి వ్యవహారం  అడ్డం తగిలి అతి ముఖ్యమైన  ఆంధ్రప్రదేశ్ వ్యవహారం అడుక్కి వెళ్లిపోయింది.  చివరికి సభ సోమవారానికి వాయిదా పడింది.

ఈ  బిల్లుకు మళ్ళీ మోక్షం ఎప్పుడన్న ప్రశ్నకు జవాబుకోసం చిలక ప్రశ్న అడగాల్సిందే.  

‘ప్రత్యేక’ రాగం


“ఆకలి వేసిన బిడ్డ అమ్మా!అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మాఅని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది.” – శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి గారి ఉవాచ.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి  విషయంలో అన్ని పార్టీల రాగం ఒకటే అయినా ఎవరి శృతి వారిది. ఎవరి నాదం వారిది.

(రచయిత జంధ్యాలకు, సంగీతాభిమానులకు క్షమాపణలతో)

అన్ని ప్రయత్నాల్లో ఫలితం ప్రధానం కాదు


కురుపాండవ యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు సంధికోసం కౌరవుల వద్దకు వెడతాడు. సంధి పొసిగే సంగతి కాదని కృష్ణుడికి ముందే తెలుసు. అంతేకాదు, యుద్ధం జరగాలని కోరుకున్నదీ ఆయనే, జరిగి తీరుతుందనీ తెలిసిందీ ఆయనకే. ఫలితం వుండదని తెలిసి చేసిన ప్రయత్నం అది. ఫలితం ఎలా వుంటుందో తెలిసి చేసిన యత్నం అది. సంధి పట్ల, యుద్ధం పట్ల సంబంధం వున్న అన్ని పక్షాల లేదా వ్యక్తుల వైఖరులు, అభిప్రాయాలు బయట పెట్టడానికి చేసిన  రాజకీయం అనుకోవాలి.

ఫలితం రాకపోయినా, ఫలితం లేకపోయినా ప్రయత్నం మాత్రం వృధా కాదు.  ఎవరు ఏమిటనేది అనేది, ఎవరి మనసులో ఏముందనేది జనాలకు తెలిసొచ్చేలా చేయగలిగితే  ఆ ప్రయత్నం ఓ మేరకు  విజయవంతం అయినట్టే. 

రాజ్యసభలో ఏం జరుగుతుంది?


ఈ అంశంపై తెలుగు టీవీ ఛానళ్లలో తీవ్రాతితీవ్రంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. కొన్ని ఛానళ్ళు  ఏకంగా  ఈ చర్చావేదికను ఢిల్లీకి మార్చి, నేపధ్యంలో   పార్లమెంటు భవన దృశ్యాల సాక్షిగా ప్రసారం చేసాయి. వీటిల్లో పాల్గొన్న ఆయా పార్టీల ప్రతినిధులు తమ పార్టీల వైఖరులనే మరో మారు వల్లెవేశారు. సమస్య తీవ్రత కంటే ఒకరినొకరు వేళాకోళం చేసుకుంటూ, దెప్పుకునే ధోరణే విస్పష్టంగా కానవచ్చింది.

ఈ రోజు రాజ్యసభలో ఏం జరగబోతోందన్నది వీటిని చూస్తేనే తెలిసిపోతోంది. అన్నం ఉడికిందీ లేనిదీ  తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు కదా!    

21, జులై 2016, గురువారం

భ్రమణ కాంక్ష – డాక్టర్ ఎం. ఆదినారాయణ - 3

భ్రమణ కాంక్ష   డాక్టర్  ఎం. ఆదినారాయణ - 3
(విశాఖ నుండి డార్జిలింగ్  వరకు పాదయాత్ర)
“నరసన్నపేట చేరేసరికి సాయంత్రం అయింది....
“పెద్ద పెద్ద బండల చాటున కూర్చుని చుట్ట తాగుతున్న కోనార్లు కనిపించారు. ఆ నీడలో కూడా వారు తాటి   గొడుగుల్ని ఒదలలేదు. వీరు ‘తప్పెటగుళ్ళు’ అనే జానపద నృత్యం అద్భుతంగా  ప్రదర్శిస్తారు. వీటితో పాటు, గొల్ల చదువులు, బైఠో భజనలు, కర్రసాము, దొమ్మరి గంతులు వీరి వినోదాల్లోని విశేషాలు.
“సంత నుండి వచ్చే స్త్రీలు  ఎదురయ్యారు. కాసుల పేరు, మెడపట్టి, కడియాలు, చెవులకి కొనకొమ్ములు, లోలకులు, జుంకాలు, బుట్టలు. వీరు మోస్తున్న అలంకరణ వీళ్ళు తెస్తున్న సామగ్రి బరువుకు సమానమేమో.
“వాతావరణం మారి మేఘాలు కమ్ముకున్నాయి. వర్షంలోనే మమ్మల్ని ఓ పేద రైతు తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఇల్లంతా బస్తాలతో, గడ్డి మోపులతో, మంచాలతో కిక్కిరిసి వుంది. గాలికి రెపరెపా కొట్టుకుంటున్న దీపం వెలుగులో రైతుగారి తల్లి మమ్మల్ని పరీక్షగా చూసింది. పేద రైతుల ఆతిధ్యం స్వీకరించడానికి అదృష్టం వుండాలి. తమకు వున్న దానిలోనే ఇంటికి వచ్చిన వారి ఆకలి తీరుస్తారు....
“పాకివలస గ్రామం చేరేసరికి తెల్లారింది. అక్కడ పాతర్లలో ధాన్యం నిలవ చేసుకునే సంప్రదాయం వున్నట్టు లేదు. ప్రతి ఇంటి ముందు (ధాన్యం) కొట్టు వుంది. మట్టి గోడలు. పై కప్పు గడ్డి.
“సాగిపల్లి కొత్తూరులో ఆవుల మందలు కానవచ్చాయి. వాటి పేడ కోసం తల్లులు, పిల్లలు తట్టాబుట్టా పట్టుకుని వాటి వెంట పడ్డారు. ఈ పశువులు కాసేవారిని మందల వాళ్ళు అని పిలుస్తారు. నెలకి, ఆవుకి నాలుగు రూపాయలు జీతం. ...
“టెక్కలి జంక్షన్ పాత వూరిలో జగన్నాధ ఆలయం చాలా అందంగా వుంది. మండపంలో రైతులు పండు మిరప కాయలు ఆరబోశారు.
“ఊరు దాటగానే కొండలు. ఇక్కడి కోనార్లకి ఎలుగుబంట్ల భయం జాస్తి.
“వాలుగాలికి మా నడక పరుగులోకి మారింది. ఎంతో ఎత్తులో పక్షులు శూన్యంలో తేలిపోతున్నాయి. బెండి కొండ రైల్వే గేటు దాటగానే ఉరుములు, మెరుపులు. ఈ రాత్రికి కాశీబుగ్గ చేరగలమా అన్న అనుమానం. ...
“బెండి కొండ మొగలో తోటల గుండా పనస పళ్ళు నింపుకున్న ఎడ్లబళ్ళు  బారులు తీరి ఒంటెల బిడారు మాదిరిగా సాగుతున్నాయి.......కాశీబుగ్గ చేరాం ఎలాగోలా తడిసి ముద్దై...... 



(PHOTO COURTESY WRITER DR.M.ADINARAYANA)
     





భ్రమణ కాంక్ష - డాక్టర్ ఎం. ఆదినారాయణ - 2


ఆదినారాయణ గారు సంచారి మాత్రమే కాదు చక్కటి రచయిత కూడా అనిపిస్తుంది ‘భ్రమణ కాంక్ష’ పుస్తకం చదివిన తరువాత.
ఆయన రాసిన వాక్యాలు, చేసిన వర్ణనలు కూడా చిత్తగించండి. స్థానిక పరిస్తితులు కళ్ళకు కట్టినట్టు చూపారు.
(విశాఖ- డార్జిలింగ్ దోవలో)
“తొట్లకొండ’ బౌద్ద స్థూపాల నుంచి మా యాత్ర మొదలయింది. క్రీస్తు పూర్వం వంద సంవత్సరాలనాటి ఈ కట్టడాలు విశాఖపట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరం అంచునేవున్నాయి. ...
“చుట్టుపక్కల అన్నీ పొలాలే. తాటిచెట్ల మీద ఉడతలు మమ్మల్ని చూసి గోలపెట్టడం ఆపేశాయి.
“ఆనందపురం దాటాక దారి పక్కన మర్రి చెట్టుకి కబోది పక్షులు వేలాడుతున్నాయి, యేవో కాయలలాగా.  మఠం అరుగుల మీద బైరాగులు బీడీ దమ్ము కొడుతున్నారు...
“దారిపొడవునా గ్రామ దేవతల గుళ్ళు. సాయంకాలానికి తగరపు వలస పక్కన గోస్తనీ ఒడ్డుకి చేరాం...తాటి కల్లు అమ్మే స్త్రీలు మమ్మల్ని చూసి ‘పానీ, పానీ అచ్చా హై’ అంటూ నురగలు కట్టిన కల్లు కుండల్ని చూపిస్తున్నారు. పొలాల్లోని బావుల్లో నీరు నేలమట్టానికి వున్నాయి. ...
“చంపావతీ నది దగ్గర పడగానే కాస్త చల్లపడింది.
“ఒక ఊళ్ళో ఓ ముసలావిడ మాకో సలహా ఇచ్చింది. ”నాయనా! గ్రామాల్లో ఎలాగూ హోటళ్ళు వుండవు. పెళ్ళిళ్ళు జరిగే చోట మొహమాట పడకుండా పెళ్లి భోజనాలు చేయడమే మంచిది’.  ఆవిడ ఇచ్చిన ఉచిత భోజన సలహా కొన్ని చోట్ల పాటించక తప్పలేదు....
“సూర్యుడి చివరి కిరణాలు మా మీద పడేసరికి చిలకల పాలెం చేరాం” (పొద్దుగూకిందని కవి హృదయం)
“నాగావళి వంతెన వద్దకి చేరేసరికి తెల్లవారింది. ముసుగు పెట్టి నిద్రిస్తున్నట్టుగా ఇసుక దిబ్బలు. కొడెలకి అరక దున్నడం నేర్పిస్తూ రైతులు నాగలి లాగిన గుర్తులు గుండ్రంగా, పొడవుగా ముగ్గుల మాదిరిగా వున్నాయి...
“శ్రీకాకుళానికి కూరగాయలు తీసుకువెళ్ళే స్త్రీలు మాతో కలిశారు. చక్కగా తలదువ్వుకుని, పూలు పెట్టుకుని కనిపించారు. యెంత వేకువ ఝామున లేచి ఉంటారో అనిపించింది. వీరిలో ఎక్కువమంది చుట్టలు కాల్చకుండా  ఉండలేరు.”
(నాకే కాదు నారాయణ గారి ఈ రచన చదివిన అనేకమందికి  కనిపించిన వైశిష్ట్యం ఇదే. సమకాలీన సామాజిక గ్రామీణ వాతావరణాన్ని వీలున్నప్పుడల్లా అందులో  అందంగా పొదిగారు. జీవిత చరిత్రలు, అనుభవాలు రాసేవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన పాఠం ఇది)  

(ఇంకా వుంది)