20, జులై 2016, బుధవారం

గీత దాటుతున్న సోషల్ మీడియా

సూటిగా.....సుతిమెత్తగా......భండారు శ్రీనివాసరావు
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 21-07-2016,THURSDAY)

నిజం నోరు దాటే లోపలే  పుకారు ఊరు దాటుతుందంటారు. సోషల్ మీడియా ప్రవేశం తరువాత ఈ వదంతుల  వేగం మరింత పెరిగింది.
కొందరు రాజకీయ నాయకుల గురించి, లేదా సినీ, సామాజిక రంగాల్లో ప్రముఖుల గురించి  ఫోటో షాపో, మరో ప్రక్రియ ఏదో తెలియదు కానీ, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫోటోలు ఈ మీడియాలో విచ్చల విడిగా హల్ చల్ చేస్తున్నాయి. వారి గురించిన కాకమ్మ కబుర్లు వంతులవారీగా గిరికీలు కొడుతున్నాయి. వాటిల్లో నిజమెంతో వాటిని షేర్ చేసే వారికి తెలవదు. వాస్తవాన్ని నిర్దారించుకోకుండానే వాటిని షేర్ చేస్తూ పోతుండడంతో ఆ నీలివార్తలు ప్రచండ వేగంతో ప్రపంచాన్ని చుట్టబెడుతున్నాయి. విన్న వింత చదివినప్పుడు వాస్తవంగా అనిపిస్తుందన్న మాట ప్రకారం అవన్నీ నిజమేనేమో అన్న భ్రాంతికి కూడా కొందరు అమాయకులు  గురవుతున్నారు.  
మీడియా, అది ప్రింటు కావచ్చు విజువల్  కావచ్చు, ఏదైనా విషయాన్ని రచనల ద్వారా లేదా చిత్రాల ద్వారా ఇతరులతో పంచుకోవడానికి కొన్ని పద్దతులు వున్నాయి. ఈ విధానాలకు చట్ట స్వరూపం లేకపోవచ్చు, కానీ లక్ష్మణ రేఖ వంటి స్వయం నియంత్రణలు వున్నాయి.
సోషల్ మీడియాకు ఈ పరిమితులు, స్వయం నియంత్రణలు లేవు. వున్నట్టు నిబంధనలు చెబుతున్నా వాటిని పాటిస్తున్న దాఖలా లేదు. నూటికో, కోటికో ఎప్పుడో ఎవ్వరో పోలీసులకు పిర్యాదు చేస్తే కంటి తుడుపు చందంగా చర్యలు తీసుకున్న వార్తలు సకృత్తుగా  కానవస్తాయి. సోషల్ మీడియా   రంగ ప్రవేశం తరువాత  చోటుచేసుకుంటున్న రకరకాల వికృత పోకడల్లో నీలివార్తల వ్యాప్తి ప్రధానమైనది. ఈ మీడియాలో వేగం ముఖ్యమైన వెసులుబాటు కావడంతో ప్రచారకర్తల కన్ను కూడా ఈ మీడియాపై పడుతోంది. రాజకీయ నాయకులు సయితం  ప్రజలకు చేరువగా వుండడానికి ఈ ‘మీడియం’ పైనే దృష్టి పెడుతున్నారు. వెనుకటి రోజుల్లో పత్రికా ప్రకటనల మీద ఆధారపడే పరిస్తితి క్రమంగా తగ్గి పోతోంది. కేవలం ట్వీట్లతో అటు మీడియా దృష్టిని, ఇటు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నారు. విలేకరుల సమావేశంలో అయితే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన తలనొప్పి వుంటుంది. ఈ ట్వీటింగులో ఆ గొడవ లేదు. ట్వీట్ చేసి కూర్చుంటే చాలు, కాగల కార్యం మీడియానే చూసుకుంటుంది అనేది వారి ధీమా. 
ఇక అన్ని రాజకీయ పార్టీలు ఈ సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించి తమ ప్రచారాలకు ముఖ్య సాధనంగా మార్చుకుంటున్నాయి. తమ పార్టీ గురించి, తమ నేతల గురించీ సానుకూల సమాచారాన్ని మార్పిడి చేసుకుంటూ వుంటే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు. కానీ దానికి తోడు, అధికారికంగానో, అనధికారికంగానో కొన్ని గ్రూపుల ద్వారా ప్రత్యర్ధులపై దుష్ప్రచారానికి ఈ మీడియాను వాడుకునే ధోరణితో  అవి ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో వ్యక్తిగత నిందారోపణలు, వ్యక్తిత్వ హననాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. మార్ఫింగ్ చేసిన చిత్రాలతో ప్రత్యర్ధులపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక సందర్భాలలో శృతిమించి రాగాన పడుతున్న మాట కూడా వాస్తవం.
నిజానికి వెనుకటి తరానికి తెలియని ఈ సోషల్ మీడియా, నేటి తరానికి, రానున్న తరానికి ఓ వరప్రసాదం. భావవ్యక్తీకరణకు సులభతరమైన మార్గం. వెనుకటి రోజుల్లో జనాలు తమ అభిప్రాయాలు తెలుపుకోవడానికి ఎటువంటి అవకాశమూ వుండేది కాదు, పత్రికల్లో ప్రచురించే పాఠకుల లేఖలు తప్ప. ఇప్పుడలా కాదు ఇలా మెదడులో ఆలోచన రావడం ఆలస్యం, చేతికి పనిచెప్పడం, చేతిలో వున్న మొబైల్ ద్వారా దాన్ని క్షణాల్లో ప్రపంచానికి తెలపడం. అది రాజకీయం కావచ్చు, సాహిత్య అంశం కావచ్చు, గృహసంబంధమైన విషయం కావచ్చు, కంటికి కనబడ్డ విషయం కావచ్చు, కెమేరాకు చిక్కిన దృశ్యం కావచ్చు, చెవిన పడ్డ సంగతి కావచ్చు అదీ ఇదీ అని లేదు, ఉచ్చమూ నీచమూ అన్నతేడా లేదు, ఎవరేమనుకుంటారో అనే సంకోచం లేదు అలా వున్నపళంగా ఆ ఆలోచనలను, ఆ భావాలను, ఆ స్పందనలను, ఆ విమర్శలను, ఆ మెచ్చుకోళ్ళను, ఆ వేళాకోళాలను అక్కడికక్కడే, అప్పటికప్పుడే వెళ్ళగక్కి మనసులో భారాన్ని తగ్గించుకోగల గొప్ప సాధనం ఇది. సరిగా వాడుకుంటే సత్ఫలితాలను ఇచ్చే ఓ మహత్తర సాంకేతిక ప్రక్రియ ఇప్పుడు అందరికీ ఓ కాలక్షేప సాధనంగా మారిపోయింది. సమాచార మార్పిడికి, ముక్కూమొహం తెలియని వ్యక్తుల నడుమ కూడా సాంఘిక సంబంధాలను ఏర్పరచడానికి ఎంతగానో వీలుకల్పిస్తున్న ఈ  సోషల్ మీడియా క్రమంగా నీలివార్తల ఉత్పత్తి, పంపిణీ కేంద్రంగా మారిపోతోంది. నిజంగా ఇదొక పెను విషాదం. 
ముందే చెప్పినట్టు, వెనుకటి తరానికి చెందిన వాళ్ళు మొదటిసారి ఈ కొత్త ప్రపంచంలో తొలి అడుగు పెట్టినప్పుడు వాయువేగ మనోవేగాలతో సాగుతున్న సమాచార మార్పిడిని చూసి మాన్ప్రడి పోతున్న మాట వాస్తవం. జరుగుతున్న సాంఘిక, రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ  యువతరం చురుగ్గా, భేషుగ్గా స్పందిస్తున్న తీరుని గమనిస్తూ మౌన ప్రశంసలు గుప్పించివుంటారనుకోవడంలో కూడా సందేహం లేదు. చిన్న చిన్న వాక్యాలతో, తేలికయిన పదాలతో నేటితరం వెల్లడిస్తున్న అభిప్రాయాలను చూసి ‘నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ, వాటిని చిన్నవయసు వారి నుండి కూడా నేర్చుకోవడానికి పెద్ద వయస్సు పెద్ద అడ్డంకి ఏమీ కాదనుకుని సమాధానపడుతున్నది కూడా వాస్తవ దూరం కాదు. పాత సంగతులు గురించి, వెనుకటి రోజుల్లోని సంప్రదాయాలు, ఆహార విహారాలు గురించీ నవతరం రాస్తున్న విధానాలు గమనిస్తూ, విస్తుపోతూ, మురిసిపోతున్న మాట కూడా అంతే నిజం.
అయితే, దురదృష్టం, ఈ సోషల్ మీడియాలో కొందరి నిర్వాకం వీరి  ఆశలపై నీళ్ళు చల్లుతోంది. కొందరు వాడే పద ప్రయోగాలు వెగటు పుట్టిస్తున్నాయి. వీధి రౌడీల భాషను మరిపిస్తున్నాయి.  రాజకీయ, సినీ రంగాల్లోని అభిమాన,దురభిమానాల క్రీ నీడలు మరింత ముదిరిపోయి ఈ మీడియాలో ఊడలు దించాయి. వెనుకటి రోజుల్లో సినీ అభిమానులు తమ అభిమాన నటుడి ప్రత్యర్హుల సినిమా పోస్టర్లపై  పేడ కొడుతుండేవారు. అదే ఇప్పుడు తీరు మార్చుకుని సోషల్ మీడియా గోడలపై బురద చల్లే రూపం సంతరించుకుంది.    వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యల స్థాయిని మించి,  విమర్శలు, ప్రతి విమర్శల హద్దును  అధిగమించి, ఆరోపణలు, ప్రత్యారోపణల  చెలియలికట్ట దాటి ఈ సోషల్ మీడియా మూల స్వరూపాన్నే ఈ విష సంస్కృతి  మార్చివేస్తోంది.
ఈ మాట ఎవరి మనసుకయినా నొప్పి కలుగుతుందేమో, ఈ వ్యాఖ్య ఎవరినయినా మానసికంగా గాయపరుస్తుందేమో అన్న విచక్షణ చాలామందిలో కానరావడం లేదు. ‘ నా ఇష్టం, నేను ఇలానే రాస్తాను,మీకిష్టమైనది మీరు రాసుకోండి’ అనే తెంపరితనం కట్లు తెచ్చు కుంటోంది.
ఈ సందర్భంలో తిక్కన  భారతంలో రాసిన ‘ఒరులేయవి ఒనరించిన...అనే పద్యం గుర్తుకువస్తోంది.  ‘ఇతరులు ఏది చేస్తే మీకు ఇష్టం వుండదో, అదే పని మీరు ఇతరుల విషయంలో చేయకండి’ అని బోధించే ఈ పద్యం అరణ్య పర్వంలో వస్తుంది. ఈ నాటి సోషల్  మీడియాకు నూటికి నూరుపాళ్ళు వర్తించే నీతి ఇది. నిప్పుతో వంట చేసుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు. అలాంటి నిప్పులాంటిది ఈ సోషల్ మీడియా. అంతా వాడుకోవడంలోనే వుంది.
వేళాకోళానికి వ్యంగ్యానికీ తేడా వుంది. వ్యంగానికీ సునిశిత హాస్యానికీ బేధం వుంది.  అవి తెలుసుకోకుండా వాడితే జోకు మేకవుతుంది.
వయస్సులో వున్నప్పుడు నాకూ ఇటువంటి అనుభవం వుంది. ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠమే ఇన్నేళ్ళుగా, ఇన్నాళ్ళుగా నన్ను జీవితంలో నడిపిస్తోంది.
అదే ఈ ఉపశృతి: 
“బ్రహ్మ లోకంలో విధాత తన పద్మాసనంపై బాసింపట్టు వేసుక్కూర్చుని సృష్టికర్తగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన సతీమణిహాటకగర్భురాణి అయిన చదువులతల్లి  పక్కనే వుండి ఓరకంట తన భర్త చేతివేళ్లల్లో రూపుదిద్దుకుంటున్న జీవరాశుల్ని తదేకంగా గమనిస్తోంది.
సృష్టికార్యంలో నిమగ్నుడయివున్న బ్రహ్మదేవుడు పక్కన భార్య వున్న సంగతి సయితం మరచిపోయిఒక లావణ్యవతి రూపాన్ని రూపొందించి దానికి స్త్రీమూర్తి అని పేరుపెట్టాడు. బొమ్మకు బ్రహ్మ గారు  ప్రాణం పోసి భూమిమీదకు పంపే సమయంలో సరస్వతమ్మకు ‘కరణేషు మంత్రి’ అనే సతీధర్మం తటాలున గుర్తుకువచ్చి ‘ఆగండాగండి! తొందరపడి యావత్ సృష్టినే గందరగోళంలోకి నెట్టకండి’ అని వేడుకుంది. వేడుకుంటూనే మరోపక్క మాటల్లో వేడిని కాస్త పెంచింది.
ఇన్ని తలలున్నాయని పేరే కానీ చేస్తున్నదేమిటోదాని పరిణామాలేమిటో ఒక్క మారయినాకనీసం ఒక్క తలకాయతోనయినా ఆలోచించారా ?’ అని వాగ్దేవి తన వాగ్ధాటితో మొగుడ్ని అడ్డుకుంది.
ప్రతిక్షణం లక్షల కోట్ల జీవరాసులను ఒకదానితో మరొకటి పోలిక లేకుండా సృష్టించగల అపార శక్తియుక్తులున్న బ్రహ్మదేవుడు కూడాఎంతవారలయినా కాంతదాసులే అన్నట్టు పెళ్ళాం మాటకు బద్ధుడే కదా!  అవటాన -
రెండోమాట లేకుండా సతీమణి సలహాకు అంగీకార సూచకంగా నాలుగు తలలు ఒకేమారు వూపుతూ కాసేపు చేస్తున్న పనికి విరామం ఇచ్చాడు.
అదే అనువుగా తీసుకునిహితవచన రూపంలో ఆయన అర్ధాంగి వాణి తనదయిన బాణీలో విధాతకు భగవద్గీత బోధించడం ప్రారంభించింది.
మీరు సృష్టించిన స్త్రీమూర్తి అందాన్ని చూసి ఆడదాన్నయిన నాకే మతిపోతున్నది. ఇక భూలోకవాసుల సంగతి వేరే చెప్పాలా! ఏమయినా సరే ఇటువంటి  అతిలోకసుందరిని భూలోకానికి పంపడానికి సుతరామూ వీల్లేదు. సత్యలోకంలో కూడా వుంచడానికి  ఒప్పుకోను.  నా కాపురం నాకు ముఖ్యం. ఇటువంటి  సుందరాంగుల  పొడ నాకు గిట్టదు గాక గిట్టదు.’ అని గట్టిగా తెగేసి చెప్పింది.
భగవతి మాటలతో విధాత  తలలు పట్టుకున్నాడు. సత్యలోకం నిబంధనల ప్రకారం ఒకసారి తన చేతులతో సృష్టించిన జీవిని భూలోకానికి పంపకుండా వుండేందుకు వీలులేదు. సంగతే అర్ధాంగికి అవగతమయ్యేలా చెప్పి తరుణోపాయం కూడా చెప్పి పుణ్యం కట్టుకోమని కోరాడు.
ఎంతకట్టుకున్నవాడయినాఎంత తన కట్టుబాట్లలో వున్న మొగుడయినా బ్రహ్మ సామాన్యుడేమీ కాదు. సాక్షాత్తు త్రిమూర్తుల్లో ఒకడు. ఎరుక ఎరిగినది కనుక సరస్వతి కొంత మెత్తబడింది.
అలా మెత్తబడ్డ వీణావాణి మనసులో కొత్త ఆలోచన పురుడు పోసుకుంది.
మొగుడు ముచ్చటపడి సృష్టించిన స్త్రీమూర్తి  ఎంతో అద్భుత సౌందర్య రాశి. అంతే కాదు. పరమాద్భుతమయిన తెలివితేటలూ ఆమె సొంతం. ఇంతటి ప్రతిభాశాలినీఅసాధారణ ప్రజ్ఞాధురీణనీ  అదుపులో వుంచడం మానవమాత్రులకు అసాధ్యం. దాన్ని సాధ్యం చేయాలంటే పడతి తన ప్రతిభాపాటవాలను మరచిపోయేలాఅవి మరుగున పడిపోయేలా ఆమె దృష్టిని మళ్లించి లలన మనసును ఆకట్టుకోగల మరికొన్నింటిని సృష్టించాలి. చదువులలో సారం తెలిసిన చదువుల తల్లికి ఆనుపానులేవిటో వెంటనే తెలిసిపోయాయి.
ఫలితం.   అందాల సుందరితో పాటే బ్రహ్మ దేవుడుఇల్లాలి సలహాపై మరో రెండింటిని సృష్టించి భూలోకానికి పంపాడు. అవే పట్టు చీరెలుస్టీలు గిన్నెలు”
డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి వారం ప్రసారం అయ్యే ‘జీవన స్రవంతి’ అనే కార్యక్రమానికి నేను కర్తాకర్మా క్రియగా పనిచేస్తున్న రోజుల్లో వారం కార్యక్రమంలో భాగంగా పైన పేర్కొన్న స్వకపోల కల్పిత పిట్ట కధ చదివాను. అంతే! ఆనాడు నేను ఆఫీసుకు వెళ్ళగానే రేడియో కార్యక్రమాలలో దిట్టలుగా పేరుగాంచిన నలుగురు మహిళా మూర్తులునా సీనియర్లు, తురగా జానకీ రాణిమాడపాటి సత్యవతివింజమూరి సీతాదేవిసునందిని ఐప్, నాకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నన్ను చూసిందే తడవుగా ఒక్కుమ్మడిగా నా మీద మాటల దాడికి దిగారు. ‘స్త్రీజాతిని కించబరిచే విధంగా ఇలాటి కాకమ్మ కధలు ప్రసారం చేయడానికి ఎంత ధైర్యం!’ అవటాని కేకలు వేసారు. వయస్సులోఅనుభవంలో వారందరికంటే నేను చాలా చిన్నవాడిని. అంచేత పెద్దల అక్షింతలను ఆశీస్సులుగా తీసుకున్నాను. హాస్యానికి కూడా ఎవరినీ నొప్పించడం తగదన్న నీతి నాకానాడే బోధపడింది. అందుకే అప్పటినుంచి నా కార్యక్రమంలో నేను ఏనాడు ఎవరినీ కించబరిచే వ్యాఖ్యలు చేయలేదు.
తోకవాక్యం : కాకపోతేఆనాటి జీవనస్రవంతిని మెచ్చుకుంటూ శ్రోతలు అనేకమంది ఉత్తరాలు రాసారు. అది వేరే సంగతి.
(20-07-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595
                          


19, జులై 2016, మంగళవారం

భ్రమణ కాంక్ష – డాక్టర్ ఎం. ఆదినారాయణ (1)


“లోక సంచారి ఒంటరిగా తిరుగుతాడు. ప్రపంచాన్ని ప్రేమిస్తాడు.  ఒక ఏడాదిలో ఆదినారాయణ గారు చేసిన మూడు యాత్రల్లోని నాలుగు వేల కిలోమీటర్ల కాలి నడక అనుభవాల పూమొగ్గలు ఈ భ్రమణ కాంక్షలో పుష్పించాయి’ అని ప్రచురణ కర్తలు పేర్కొన్నారు.

అనేక సార్లు ఆయన పాద యాత్రలు చేసారు. అందులో నాలుగు, అయిదు యాత్రలు ప్రధానమైనవి. 1992 లో విశాఖపట్నం నుండి సముద్ర తీరాన పరదీప్  పోర్ట్  వరకు 500 కిలోమీటర్లు, అల్లూరి  కొత్తపట్నం నుండి కన్యాకుమారి వరకు సముద్ర తీరంలో 1200 కిలోమీటర్లు, 1993 లో విశాఖ  నుంచి డార్జిలింగ్  వరకు 1800 కిలోమీటర్లు, 1994 లో చవట పాలెం నుంచి న్యూఢిల్లీ వరకు 2300 కిలోమీటర్లు, 1997 లో కాశీ నుండి తిరువైయ్యారు వరకు 2600  కిలోమీటర్లు  ఇలా ఆయన పాదయాత్రలు అలుపు ఎరగకుండా సాగాయి. ఇవికాక చేసిన అనేక పాదయాత్రలతో కలిపి చూసుకుంటే మొత్తం 10856, అక్షరాలా పదివేల ఎనిమిది వందల యాభయ్ ఆరు కిలోమీటర్ల పొడవున కాలి నడకన తిరిగారు. ఆ యాత్రా విశేషాలను ఎక్కడా డైరీలో కూడా రాయకుండా కేవలం తన ధారణ శక్తితో తిరిగి వచ్చిన తరువాత తేదీలు, ఊళ్ళ పేర్లతో సహా  గ్రంధస్తం చేశారు. పైగా స్వయంగా తను కంటితో చూసిన ప్రదేశాలను, వింతలను చిత్రాలుగా గీసి తన రచనకు ఒక విశిష్టతను చేకూర్చారు.  మూడు వందల పేజీలకు పైగా వున్న ఈ పుస్తకంలోని కొన్ని భాగాలను స్పృశించే  ప్రయత్నం మాత్రమే ఇది. (కోట్స్ లో వున్నవి రచయిత ఆదినారాయణ గారివి)

పాదయాత్రాఫల సిద్దిరస్తు


ఈ కింది ఫోటోలో వున్న  మనిషిని చూస్తే పాత హాలీవుడ్  సినిమాలో సీను గుర్తొస్తోందా?


అలా  కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ఎం. ఆదినారాయణ గారు.  రెండు కాళ్ళతో లోకం చుట్టిరావాలనే ‘భ్రమణ కాంక్ష’ కలిగిన వాడు. పదహారణాల తెలుగు వాడు. ఎం. అనే ఇంటి పేరు ఏమిటో తెలవదు.  అయినా, కాలు ఒక ఊళ్ళో నిలవని ఈ పెద్దమనిషికి ఇంటి పేరుతొ, ఊళ్ళ పేరుతొ నిమిత్తం ఏమిటి, నా పిచ్చికాని.  
వీరికీ నాకూ ఒక అవినాభావ సంబంధం వుంది. నాకు ఎప్పుడూ అలవాటులేని పని, అదే ఒక పుస్తకం దొంగిలించాలనే చెడు తలంపు కలగడానికి ఈ ఆదినారాయణ గారే పరోక్షంగా కారకులు.
చాలా ఏళ్ళ క్రితం, బహుశా 2004 లో కావచ్చు దూరదర్సన్ విలేకరిగా భద్రాచలం వెళ్లి అక్కడ టూరిజం సంస్థ హోటల్లో బస చేశాను. పగలు వచ్చిన పని చక్కబెట్టుకుని రాత్రి హోటల్ గదికి వచ్చాను. ఆ  గదిలో ఇదిగో ఈ పుస్తకం కనిపించింది. నాకు ముందు దిగిన వాళ్ళు మరచిపోయారేమో అని వాకబు చేస్తే టూరిజం శాఖ వాళ్ళు ప్రతి గదిలో ఆ పుస్తకం కాపీలు ఉంచారని తెలిసింది. ఆసక్తి అనిపించి తిరగేశాను. అది ఎంతగా పెరిగిపోయిందంటే ఆ పుస్తకాన్ని దొంగిలించి తీసుకుపోవాలని కూడా అనిపించింది.  హోటల్ వారిని  అడిగాను అది తీసుకుని పోవచ్చా అని. మామూలుగా కుదరదు కానీ, మీరు ఆసక్తిగా వున్నారు కనుక తీసుకు వెళ్ళండి అన్నారు. ఆ విధంగా నాకు దక్కిన ఈ పుస్తకాన్ని  ఇన్నేళ్ళలో ఎన్ని సార్లు చదివానో నాకే తెలియదు. ఎప్పుడూ దీన్ని గురించి రాద్దామని అనుకుంటాను. బాగా రాయాలనే రంధిలో రాయడం మానుకుంటూ వస్తున్నాను. రాత్రి మళ్ళీ మరో సారి కొన్ని పేజీలు  తిరగేశాను. బాగా రాయడం  సరే, అసలు ఏదో కొంత రాసితీరాలి అనిపించింది. అందుకే ఈ  ఆరంభం.  

(తరువాయి తదుపరి)      

మతి మరపు

ఏకాంబరానికి ఆఫీసు పనితో మతిపోతోంది. ఎప్పుడూ ఏవేవో కాల్స్. వాటిని అటెండ్ అవడంతోనే బుర్ర తిరిగిపోతోంది. ఈ లోపల ఇంటి నుంచి ఫోను.
‘సాయంత్రం వచ్చేటప్పుడు స్కూలుకు వెళ్లి పిల్లాడ్ని తీసుకురండం’టూ ఇల్లాలి నుంచి అభ్యర్ధన వంటి ఆదేశం. తప్పేది ఏముంది. ఫోన్లు అటెండ్ అవుతూనే స్కూలుకు వెళ్లి పిల్లవాడిని తీసుకుని ఫోన్లు మాట్లాడుతూనే ఇంటికి వచ్చి ఇల్లాలి మీద ఇంతెత్తున యెగిరి పడ్డాడు.
“వీడికేమయింది? ఇంటికి వచ్చేవరకు ఊరికే పెడబొబ్బలు పెడుతూ ఏడుస్తున్నాడు. ఏమయిందో కనుక్కో ముందు”
“ఏమవడమేమిటి నా బొంద. వీడు మన పిల్లాడు కాదు, ఆ ఫోన్ల గొడవలో వేరే పిల్లాడ్ని ఎక్కించుకుని వచ్చారు, పైగా ఆ విషయమే వాడు చెబుతుంటే, వినిపించుకోకుండా పెడబొబ్బలు పెడుతున్నాడంటూ నసుగుడు ఒకటి”

(నెట్లో కనబడ్డ ఇంగ్లీష్ జోక్ – షరామామూలుగా స్వేచ్చానువాదం)

అంతా భ్రాంతియేనా!




ఓ ఇరవై ఏళ్ళు అయిందేమో. ఇంకా ఎక్కువో.
ఆరోజుల్లో ఒక టీవీలో దాంపత్యాల మీద వారానికో సారి శీర్షిక నడిపేవారు. ఇప్పట్లోలా కాకుండా ముందుగా రికార్డు చేసి వేసేవాళ్ళు. రికార్దింగుకీ, ప్రసారానికీ నడుమ బాగా వ్యవధానం వుండేది. ఒకసారి ఆ కార్యక్రమంలో పాల్గొన్న సెలెబ్రిటీ దంపతులు చెలరేగిపోయి ఒకరిపైఒకరు ప్రేమాభిమానాలు ఒలకబోసుకున్నారు. ఒకరినివిడిచి మరొకరు బతకలేమని ఇంటర్యూ లో బల్లగుద్ది మరీ చెప్పుకున్నారు. మరో జన్మ అంటూ వుంటే మళ్ళీ భార్యాభర్తలు కావాలన్నదే తమ కోరిక అని ఉద్ఘాటించారు. చూసిన వాళ్ళు నోళ్ళు తెరుచుకుని ఆహా ఏమి అన్యోన్య దాంపత్యం అంటూ మురిసిపోయారు.
కొసమెరుపు ఏమిటంటే, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ఆ ఇంటర్యూ ప్రసారం అయిన రోజునే పత్రికల్లో వచ్చింది.


NOTE: Courtesy Image Owner

గురుద్దేవో నమః


చిన్నప్పుడు నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు.
తెలిసినదల్లా మాష్టారంటే శివరాజు అప్పయ్య పంతులు గారు.


ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడిలో రోగం రొష్టు బారినపడకుండా అనాయాస మరణానికి నోచుకున్నారు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  మాకు ఇంత అక్షర బిక్ష పెట్టిన మహానుభావుడు దాటిపోయాడు. నిజంగా మహానుభావులకు మాత్రమే లభించే సునాయాస మరణం ఆయనకు దక్కింది.
అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్ కూడా.
మాచిన్నప్పుడు గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంద్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. వినే మా బోంట్లకు అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.

గురు పూర్ణిమ సందర్భంగా  మా చిన్ననాటి  గురువుకు మనః ప్రణామాలు.
NOTE: Photo Courtesy: Satya Sai Bhandaru 

18, జులై 2016, సోమవారం

అపార్ధాలు సాగేనా? ఆగేనా?


అర్ధం చేసుకోకపోవడం కంటే అపార్ధం చేసుకోవడం మేలు అంటారు. ఎందుకంటే కనీసం పద్దెనిమిదో రీలులో అయినా అపార్ధాలు దూదిపింజల్లా తొలగిపోయి గ్రూప్ ఫోటోతో శుభం కార్డు పడడం పాత బ్లాక్  అండ్ వైట్ సినిమాల్లో అనేకసార్లు అందరం చూసి వుంటాం.
అయితే చిక్కల్లా కలిగిన అపార్ధాలు తొలగిపోవాలంటే అంత ఈజీ ఏమీ కాదు.
మొన్నీమధ్య ఫేస్ బుక్ లో ఓ మిత్రుడు పోలవరం మీద ఒక పోస్ట్ పెట్టాడు. అదేమిటో పూర్తిగా చూడకుండా పోలవరం గురించిన నా పరిజ్ఞానం మొత్తం రంగరించి, కామెంటుగా రాసేసి  ఇక ఆ విషయమే మరిచిపోయాను . కానీ అసలు కధ రెండో రోజుల తరువాత మొదలయింది. ఇంకో మిత్రుడు ఫోను చేసి మరీ నిలదీశాడు. ఆ మొదటి మిత్రుడు రాసిన పోస్ట్ లో అన్యాప దేశంగా ఈ  రెండో మిత్రుడి గురించి కొన్ని అభ్యంతర వాఖ్యలు వున్నాయట. అటువంటి వాటిని ఖండించాల్సింది పోయి లైక్ కొడతారా లైక్  అంటూ పట్టుకున్నాడు. నాకు ఈ లైక్ ల గొడవ అసలే అర్ధం కాలేదు. కామెంటు పెట్టినా అది లైక్ కిందికి వస్తుందేమో తెలియని  కంప్యూటర్  పరిజ్ఞానం నాది. దాంతో ఆ మొదటి మిత్రుడికి క్షమాపణలు చెప్పుకుని పోలవరం చరిత్ర యావత్తూ తొలగించేశాను. ఆ విధంగా రెండో మిత్రుడి అపార్ధాన్ని ఓ మేరకు తొలగించగలిగానని అనుకున్నాను. అలా ఆ  కధ సుఖాంతం అయిందని సంతోషించేలోగా నేను పోస్ట్ చేసిన మరో చిన్న పేరా కధనంపై సీరియస్ గా వాదోపవాదాలు మొదలయ్యాయని కాస్త ఆలస్యంగా  తెలిసింది. నేను రాసిన దాని మీద కాకుండా వాళ్ళ వ్యాఖ్యల మీద ఒకరికొకరు చాలా భీషణంగా మాటల యుద్ధం సాగించారు. ఆ విషయంలో కూడా నా అజ్ఞానమే మరోసారి అపార్ధాలు తెచ్చి పెట్టింది.  బ్లాగులో రాసి ఊరుకోవడమే తప్ప ఆ దరిమిలా వ్యాఖ్యలను గురించి కూడా కాస్త కన్నేసి వుండాలని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇదీ  లేటుగా తెలిసింది.
నేను రాసిన దానిపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, వాడకూడని పదాలు వాడినా వాటిని తొలగించడం అనేది నాకు ఇష్టం వుండదు. నావి చదివిన వారు, వాటిని కూడా చదివితే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడ కూడా పైన చెప్పిన ఉదంతమే పునరావృతం అయింది. ‘ఇదేమిటండీ, మీ బ్లాగులో  కూడా  ఇలాంటి రచ్చను అనుమతిస్తారా? తప్పుకదా’ అని ఓ శ్రేయోభిలాషి మెత్తగా చీవాట్లు పెట్టారు కానీ, వ్యాఖ్యల్ని తొలగించరాదు అనే నియమం మళ్ళీ అడ్డొచ్చి మరోసారి అపార్ధాల సీను మొదలయింది.
ఈ రెండింటిలో నాకు అర్ధం అయింది ఏమిటంటే, రచ్చ సాగింది నేను రాసిన దానిమీద కాదు. అదే కొంత ఊరట.
అపార్ధాల విషయంలో నా మునుపటి అభిప్రాయం సరయినదేనా కాదా అనే గుంజాటన మాత్రం  నాలో ఇప్పుడు  మొదలయింది.  



NOTE: Courtesy image owner