5, జులై 2016, మంగళవారం

టీవీ ఛానళ్ళు – ఓ సలహా

  
ఈమధ్య వివిధ టీవీ ఛానళ్లలో వస్తున్న కార్యక్రమాలపై అనేక సోషల్ నెట్ వర్కుల్లో కానవస్తున్న వ్యాఖ్యానాలు గమనిస్తుంటే,  పూర్వం దూరదర్శన్  కూడా ఇంతటి తీవ్ర  స్థాయిలో విమర్శలు ఎదుర్కోలేదేమో అని  అనిపిస్తోంది. దూరదర్శన్ కార్యక్రమాలు గురించి జంధ్యాల మార్కు సినిమాల్లో చక్కటి హాస్య స్పోరక సన్నివేశాలు అనేకం  వచ్చాయి. కానీ,  ప్రస్తుతం విస్తృతంగా వ్యాపించివున్న ప్రైవేటు న్యూస్  ఛానళ్ళకు  మాత్రం  విమర్శకులు ఆమాత్రం మినహాయింపు (అంటే హాస్య ధోరణిలో ఎండగట్టడం)  కూడా ఇవ్వడం లేదుపైగా కడిగి గాలించేస్తున్నారు. వాటికి రాజకీయ రంగులను పులుముతున్నారు. ఛానల్ ఇలాగే చెబుతుందిలే అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. సుదీర్ఘ కాలం మీడియాలో పనిచేసిన మా బోంట్లకు ఇది మింగుడు పడడం లేదు. అయినా ఇది  కాదనలేని నిజం.
నేను ఖమ్మం కాలేజీలో చదివేటప్పుడు మాకు ఇంగ్లీష్ గ్రామర్ లెక్చరర్ ఒకరు వుండేవారు. ఆయన రాగానే గోలగోలగా వున్న క్లాసును అదుపుచేయడానికి డష్టర్ తో బల్ల మీద చప్పుడు చేస్తూ,  ‘లెస్ నాయిస్ చిల్డ్రన్ లెస్ నాయిస్అని పదేపదే అనేవారు. పిల్లలు ఎలాగూ గోల చెయ్యకమానరు,  కాబట్టి చేసేదేదో కాస్త తక్కువ చేయండన్నది దానికి టీకా తాత్పర్యం.
ఇప్పుడున్న పోటా పోటీ కాటా కుస్తీ  ప్రపంచంలో పూర్తిగా ‘మడి’ కట్టుకుని ఛానళ్ళు నిర్వహించడం సాధ్యం కాని మాట నిజమే. కాకపోతే  ‘రేటింగులను’ ఓపక్క కనిపెడుతూనే జనం నాడిని పట్టుకునే  కార్యక్రమాలకు రూపకల్పన చేయడానికి కూడా అనేక  వీలుసాళ్లు వున్నాయి. వాటిని గురించి  ఛానళ్ళ యజమానులు ఆలోచిస్తే బాగుంటుంది. అదిగో,   ఉద్దేశ్యంతోనే నా గొడవ

ఇంతకీ సలహాలు సూచనలు ఏవిటంటే:
వారేరీఎక్కడ ఇప్పుడు?’ అనే పేరుతొ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. రాజకీయ రంగంలోసినిమారంగంలో కొన్నేళ్ళ పాటు ఒక వెలుగు వెలిగిఇప్పుడు కనుమరుగయి  అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లు అనేకమంది వున్నారు. అలాటి వాళ్ళను వెతికిపట్టుకుని ‘అప్పుడు – ఇప్పుడు’ వారి పరిస్తితి యెలా వుండేది  ఎలావుంది అన్న విషయాలను చూపగలిగితే వీక్షకులు ఆసక్తిగా చూసే అవకాశం వుంటుంది. ‘వీళ్ళ వారసులు ఎవరు  ఎక్కడ వున్నారు  ఏం చేస్తున్నారు’  అనే సంగతులు నిజానికి  చాలా ఆసక్తిని రగిలించే అంశాలు.
కొన్ని ఉదాహరణలు కూడా వున్నాయి.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారి వారసులు ఏం చేస్తున్నారు. అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు  గారి వారసులు ఎవరు, వారు ఇప్పుడేం చేస్తున్నారు?
వరసలోనే తెలుగు సినిమా రంగాన్ని కూడా ఒక పట్టు పట్టవచ్చు. ఒకనాడు తమ  కంటి చూపుతో సినిమా రంగాన్ని శాసిస్తూ అంతులేని ఐశ్వర్యాలను, రాజభోగాలను అనుభవించి,   చివరకు అన్నీ పోగొట్టుకుని నేలకు రాలిన తారలవారసుల పరిస్తితి ఏమిటి? ఇప్పుడెలావున్నారు?  
వీరిలో కొందరి గురించి లోగడ పత్రికల్లో కొన్ని వ్యాసాలు వచ్చిన మాట నిజమే అయినా టీవీ  ఛానళ్ళ ద్వారా అయితే మరింత విస్తృతంగా ఆసక్తిని రేకెత్తించే అవకాశం వుంటుంది.
అలాగే, భర్తలు మరణించిన కారణంగా అనుకోకుండా  రాజకీయ వారసత్వం దక్కించుకున్న కొందరు మహిళలు వున్నారు. అయితే అలా దొరికిన అవకాశాన్ని సమర్ధంగా వాడుకుని పదవులను హోదాలను  పదిలం చేసుకున్నవారు బహు కొద్దిమందే.  అయాచితంగా లభించిన అవకాశాలను చేజేతులా జారవిడుచుకున్నఅలాటి  వారి  కధనాలు కూడా వీక్షకుల్లో  ఆసక్తి కలిగించేవే. (ఉదాహరణలు: బాలయోగి భార్య, కరణం రామచంద్రరావు సతీమణి)             
ఇప్పుడు ఎన్ని చెప్పినా,  ఏవి చెప్పినా అవన్నీ రాజకీయం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. కాబట్టి రాజకీయాలనే ఒక అంశంగా తీసుకుని కొన్ని ఆసక్తి కరమైన కార్యక్రమాలను రూపొందించడానికి వీలుంది.
ఉదాహరణకు ఇప్పుడు తెలుగు  రాష్ట్రాలలో నెలకొనివున్న రాజకీయ పరిస్తితి. చాలా ఛానళ్ళలో  -  వున్న పరిస్తితికి మరింత ఆజ్యం పోసి  మరింత  దిగజార్చే కార్యక్రమాలే ఎక్కువగా  వుంటున్నాయి. వీక్షకుల్లో చాలా మంది వీటిని విధిలేక చూస్తున్నారు కాని హృదయపూర్వకంగా ఆస్వాదించలేకపోతున్నారు. పైకి అందరూ అంగీకరించలేకపోయినా లోలోపల అంతా వొప్పుకునే వాస్తవం ఇది.
గతంలో  ఉమ్మడి  రాష్ట్రంగా వున్నప్పటి సంగతి గుర్తు  చేసుకుంటే, కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. ఉమ్మడి  రాష్ట్రం  చివరాఖరి  రోజుల్లో ఒక్క మంత్రి కూడా, ప్రాంతాల గొడవ పక్కనపెట్టండి, కనీసం  తన సొంత  జిల్లాను దాటి (పెళ్ళిళ్ళూ మొదలైన వాటిని మినహాయిస్తే) వేరే జిల్లాలకు ఒక్కటంటే ఒక్కసారి అధికార కార్యక్రమాలపై  వెళ్ళిన దాఖలాలు  లేవు. ఇందులో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి పెద్దగా  కష్టపడాల్సిన పని కూడా లేదు. మంత్రుల కార్యాలయాల్లో టూరు వివరాలు గురించి వారి వ్యక్తిగత సిబ్బందిని వాకబు చేస్తే సరిపోయే విషయం ఇది. దీనికి ఓ ఉదాహరణగా ఓ సంగతి చెప్పుకోవచ్చు.  ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు (ఇప్పుడు లేరు, కీర్తిశేషులయ్యారు) మాత్రం తన పొరుగున వున్న తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లివచ్చారు. అదీ ఎందుకటా! ఆయన గారికి పందెపుటెడ్లు అంటే మక్కువ ఎక్కువ. వాటి కొనుగోలు కోసం,  జిల్లాలు ఏమిటి మొత్తం దేశంలో ఎక్కడికయినా వెళ్ళి వస్తారు.  తూర్పు గోదావరి జిల్లాలో మంచి లక్షణాలు వున్న కపిల గోవుకు పుట్టిన ఆవుదూడను కొనుక్కురావడానికి మాత్రమే ఆయన మొట్టమొదటిసారి జిల్లాలో అడుగుపెట్టారట. ఒక మంత్రి అన్నవాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు బాధ్యత వహించాల్సినవాడు. మరి దీన్ని  ఏవిధంగా అర్ధం చేసుకోవాలి?  ఆ రోజుల్లో  ఆరోగ్యశాఖకు సంబంధించి సీమాంధ్రకు చెందిన క్యాబినెట్ మంత్రి ఒకరు వున్నారు.  ఆదిలాబాదు జిల్లాలో అంటువ్యాధులు ప్రబలడం గురించి పత్రికల్లో అనేక వార్తలు వచ్చాయి. కానీ అధికారులు తప్ప సంబంధిత  మంత్రి ఒక్కనాడు  కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు. అలాగేతెలంగాణా ప్రాంతానికి చెందిన మంత్రులు. తమ శాఖలకు చెందిన అనేక సమస్యలు సీమాంధ్ర ప్రాంతంలో తలెత్తినా కిక్కురుమనలేదు. అటు వైపు తొంగి చూడలేదు.  
ఇప్పుడు  కూడా  ఈ  రకమైన విషయాలకు  కొదవ  లేదు. ఈ అంశాలను తీసుకుని కార్యక్రమాలను రూపొందిస్తే వాటికి రాజకీయ పరమైన రంగూ రుచీ వాసనా వున్నప్పటికీ ప్రజోపయోగంగా కూడా వుంటాయి. మీడియా తన సామాజిక బాధ్యతను కూడా నిర్వహించినట్టు అవుతుంది.
ఏమంటారు?


4, జులై 2016, సోమవారం

మందు ఎక్కడ దొరుకుతుంది ?


“డాట్టరు గారూ! మీ  ఫీజు సరే కానీ  మీరు  రాసిన ఈ మందులు ఎక్కడ దొరుకుతాయండీ?”
“అదే మరి కాలేది. అవతల అంత మంది పేషెంట్లు వుంటే  ఏవిటీ చచ్చు, చొప్పదంటు ప్రశ్న?”
“అలా కోపం చేసుకోకండి. మీరు పెద్దమనసుతో వింటానంటే చెబుతా!”
“అదేదో తొందరగా చెప్పి ఏడవ్వయ్యా మగడా!”

“మొన్నీమధ్య మా బామ్మర్ది ఆడి బామ్మర్ధికి ఒంట్లో నలతగా వుంటే మీ దగ్గరికే పంపించాకదండీ. మీరేమో మంచిగా చూసి మాత్తర్లు అవీ రాసిచ్చారు కదండీ. వాడేమో ఆ చీటీ పట్టుకుని వూళ్ళో సగం మందుల షాపులు చుట్టేశాడండీ! కానేమోనండీ ఒక్క చోట దొరికితే ఒట్టండీ. ఒకడేమో అదే మందు గోలీలు వేరే కంపెనీవి వున్నాయంటాడు. మీరు  కోప్పడతారనుకుని వేరే షాపుకు వెళ్ళాడండీ. ఆడేమో వందా నూటయాభయ్యా అని అడిగాడుటండీ. వందలూ, ఏలూ మాత్తర్లు నాకెందుకయ్యా  నీలాగా దుకాణం వుందనుకున్నావా అన్నాట్ట మా వోడు. దుకాణపోడు పెద్దగా నవ్వి, అదికాదయ్యా బాబూ పవరు, మాత్తర్ల పవరు యెంత నూరా నూట యాభయ్ ఎంజీలా అని అడిగాట్ట. ఆ పవర్లు మీ డాట్టారు రాయలేదు ముందు పోయి కనుక్కో. తర్వాత వచ్చి మందు కొనుక్కో అన్నాట్టండీ. ఫీజు వంద అంటే ఇచ్చాము కానీ ఈ మాత్తర్లకు కూడా ఇంత ఇసయం వుందా అని మా ఓడు తెగ మనాది పడిపోయి ఆ మాత్తర్ల కోసం తిరిగి తిరిగి చివరికి కొననేలేదు. వాడనేలేదు. కానండీ మీ చేయి వాసి  మహా గొప్పది కదండీ, అంచేత వాడికి జబ్బు చేత్తో తీసేసినట్టు తగ్గిపోయిందండీ!”         

3, జులై 2016, ఆదివారం

మా ఊరి ‘శ్రీమంతుడు’


మా ఊరు కంభంపాడు  జ్ఞాపకాలు ఇక పాస్ పోర్టులో ప్లేస్ ఆఫ్ బర్త్ కు పరిమితమయిపోతాయేమో అని ఒక్కోసారి భయం వేస్తుంటుంది. ఒకప్పుడు అమ్మా నాన్నల అబ్దీకాలకోసం ఏడాదికి రెండు సార్లు అయినా సొంతూరుకు వెళ్లి వచ్చేవాళ్ళం. మా  మూడో అన్నయ్య పోయిన తరువాత తద్దినాలు  కూడా హైదరాబాదుకే పరిమితం అయిపోతున్నాయి.
ఈ నేపధ్యంలో ఇంగ్లండులో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు సత్యసాయి హైదరాబాదు ఆఫీసు పనిమీద వచ్చి వారాంతంలో పనికట్టుకుని రెండు రోజులు మా ఊళ్ళో గడిపి వచ్చాడు. వాడి ద్వారా తెలిసిన విశేషాల్లో ఇదిగో ఈ ‘శ్రీమంతుడు’ విషయం తెలిసి వచ్చింది.
వీరి పేరు చావా నరసింహారావు. మా చిన్నప్పుడు ఈ పేరుతోనే నాకో క్లాస్ మేట్ ఉండేవాడు. కనుక్కుంటే అతడూ, ఈయనా ఒకరు కారని తేలింది. పిల్లలు ఖమ్మంలో ఏదో వ్యాపారంలో బాగానే స్థిరపడ్డారు. ఈ నరసింహారావు మాత్రం ఊళ్లోనే వుండిపోయి వ్యవసాయం చేసుకుంటున్నాడు. కష్టపడే తత్వం, నిరాడంబర  జీవనం వల్ల నాలుగు రాళ్ళు వెనకేసుకోగలిగారు. అయినా ఊరికి ఏదైనా చేయాలని తపన. శివాలయాన్ని లక్షలు ఖర్చు పెట్టి బాగుచేశారు. మేము చదువుకున్న బడి ఇప్పుడు హైస్కూలు  అయింది. వేరే ప్రాధమిక పాఠశాల  మంజూరు అయితే దానికి ఒక  చక్కటి భవనం కట్టి పెట్టారు. ఈ మధ్య వానలకు మా అన్నయ్య ఎప్పుడో కట్టించిన గ్రామ కచ్చేరీ  దెబ్బతింటే, దానిని సొంత డబ్బులతో పునరుద్ధరించే కార్యక్రమం నెత్తికి ఎత్తుకున్నారు. ఊళ్ళో టెలి మెడిసిన్ సెంటర్ పెట్టాలని  ఓ  స్వచ్చంద  సంస్థ ముందుకు  వస్తే  వారికి  కావలసినవన్నీ అమర్చి పెట్టడానికి  సిద్ధం  అంటూ ఈయన ముందే  సిద్ధం అయిపోయారు. ఇవన్నీ బాగా డబ్బులు వుండి చేస్తున్న పనులు కావు. సొంత ఖర్చులు తగ్గించుకుని చేస్తున్న వితరణలు.

నిజమైన ‘శ్రీమంతుడు’ చావా  నరసింహారావు. సందేహం లేదు.