16, మార్చి 2016, బుధవారం

నైతిక పరాజయమా! సాంకేతిక విజయమా!

సూటిగా.........సుతిమెత్తగా...........భండారు శ్రీనివాసరావు

(TO BE PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 17-03-2016, THURSDAY)
  
“ధర్మము ధర్మమటంచు వితండ వితర్కములాడదీవు, ఆ ధర్మము నేనెరుంగుదు.....” అంటాడు శ్రీరామాంజనేయ యుద్ధం నాటకంలో   శ్రీరామచంద్రుడు, తనకు ధర్మం గురించి చెప్పబోయిన  ఆంజనేయుడితో. యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు ధర్మాధర్మ విచక్షణకు తావుండదన్న ధర్మ సూక్ష్మం ఇందులో దాగుంది.
అంధ్రప్రదేశ్ శాసనసభలో పాలక ప్రతిపక్షాల నడుమ సాగుతున్న ‘నీదా నాదా పైచేయి’ క్రీడలో అడుగడుగునా ఇది ప్రతిఫలిస్తోంది.  ముందు ప్రభుత్వంపై, ఆపై అసెంబ్లీ స్పీకర్ పై వైఎస్ఆర్ సీపీ, ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరిగిన తీరు తెన్నులు ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. 


సరే! సభలో బలాబలాలను బట్టి ఈ తీర్మానాలు ఎటుతిరిగీ  నెగ్గవన్న సంగతి ముందే తెలుసు కనుక ఫలితంపై  ఎవ్వరికీ ఆసక్తి లేదు. పెట్టింది అవిశ్వాసమైనప్పటికీ,  కట్టు తప్పి గోడదూకిన తన సభ్యులపై అనర్హత వేటు వేయించడానికే ఇదంతా అన్న తన మనసులోని ఆలోచనను ప్రతిపక్షం  దాచుకోలేదు. అయితే,  చర్చదాకా వచ్చినప్పుడు ఆ అంశంపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడమే ప్రధానాస్త్రంగా ప్రయోగించాలని తలపెట్టడం ఆ పార్టీ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. పార్టీ మారిన సభ్యులపై అనర్హత వేటు వేయించాలని చేసిన ప్రయత్నం యావత్తు, తీర్మానంపై జరిగిన ఓటింగు సమయంలో డివిజన్ కు పట్టుపట్టకపోవడంతో నిరర్ధకమైంది. దాన్ని తనకు అనువుగా వాడుకుని పాలక పక్షం మూజువాణీ ఓటుతో తీర్మానాన్ని వీగిపోయేట్టు చేసి, వ్యూహాత్మకంగా పావులు కదపడంలో తనదే పైచేయి అని నిరూపించుకుంది.
పొతే చర్చ సందర్భంగా ఉభయ పక్షాల నడుమ సాగిన వాగ్యుద్ధంలో నైతిక విలువలు పూర్తిగా పక్కకు తప్పుకుని, సభామర్యాదలు సంపూర్తిగా  మంట కలిశాయి. ఈ విషయంలో పాలకపక్షం కొంత  సంయమనంతో వ్యవహరిస్తే బాగుండేదన్న అభిప్రాయం వీక్షకులకు కలిగింది. కాకపొతే, ముందే చెప్పినట్టు, కదనరంగంలో  ధర్మాధర్మాల ప్రసక్తికి  తావుండదు. అక్కడ  విజయమే ప్రధానం.  
ఈసారి ప్రతిపక్షనేత జగన్మోహన రెడ్డి పూర్తిగా సంసిద్ధమై వచ్చి తన వాదనను బలంగా వినిపించ గలిగిన పరిణతిని ప్రదర్శించారు. అయితే, ఈ పరిణతి,  ప్రసంగ సందర్భంగా వాడిన  పదజాలం కారణంగా పలచ పడిపోయింది.  ముఖ్యమంత్రిని, సభానాయకుడిని  ఏకవచనంలో సంబోధించడం సభామర్యాద కాదు, ఈ పద్దతిని ఆయన  సరిదిద్దుకుంటే బాగుండునన్న భావం టీవీ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నవారిలో  కలిగింది. అయితే, అదేసమయంలో, కొందరు పాలకపక్ష సభ్యులు, ఆయనపై  ఎదురుదాడికి దిగిన క్రమంలో దొర్లిన అసభ్య పదాలు విన్న తరువాత, సభా మర్యాదలను  గాలిలో కలపడంలో తామూ తక్కువ తినలేదని నిరూపించుకోవడంలో  కృతకృత్యులయ్యారు. మరి, ఇక్కడా విజయమే ప్రధానం కదా!
ఇక ప్రతిపక్ష  వైఎస్ఆర్ సీపీ సహజంగానే తనకు దొరికిన సమయాన్ని ప్రభుత్వంపై తాను ఇన్నాళ్ళుగా చేస్తూ వస్తున్న ఆరోపణలను పునశ్చరణ చేయడానికే ఉపయోగించుకుంది. వీటిలో నవ్యత్వం లేకపోయినా  అవే  ఆరోపణలను  అసెంబ్లీ వేదికగా చేసి రికార్డులకెక్కేలా చేయాలనే ఆ పార్టీ ధ్యేయం కొంతవరకు నెరవేరింది. పదేపదే చేస్తున్న ఈ ఆరోపణలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలత పెట్టి వుంటాయి. ఆరోపణలకు ఆధారాలు చూపించాలనీ, వాటిని  సభాముఖంగా నిరూపించిన తరువాతనే  ముందుకు పోవాలని ఆయన  ప్రతిపక్ష నేతకు సవాలు విసిరారు. చంద్రబాబు విసిరిన ఈ సవాలుతో కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు పార్టీల నడుమ సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వానికి తెర పడబోతున్నదేమో అనే చిరు ఆశ కలిగిన మాట నిజం.
అయితే అన్ని ఆరోపణలకు ఆధారాలు ఉండవచ్చు, వుండకపోవచ్చు. కానీ, వాటిని అసెంబ్లీలో నిరూపించగలగడం అసాధ్యమైన వ్యవహారం. అందుకే తెగుతుందనుకున్న ఈ వ్యవహారం, ప్రతిపక్షం సీబీఐ దర్యాప్తుకోసం పట్టుబట్టడంతో  ముడి విడలేదు సరికదా మరింత బిగుసుకుంది.    
చర్చ సందర్భంగా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. వాటిని సమర్ధవంతంగా సభ దృష్టికి తీసుకు రావడానికి ప్రతిపక్షానికి ఇదొక సదవకాశం. అలాగే వాటి గురించిన సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వానికి కూడా అసెంబ్లీని మించిన వేదిక మరోటి వుండదు. అయినా కానీ ఉభయపక్షాలు ఈ విషయంలో వైఫల్యం చెందాయనే చెప్పాలి. ఎందుకంటే ఇంత జరిగిన తరువాత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది.                     
ఈ అవిశ్వాస తీర్మానాలు ఒక విషయాన్ని స్పష్టం చేసాయి. వై ఎస్ ఆర్ సీపీ నాయకత్వం ఈసారి విషయాలను సాకల్యంగా అధ్యయనం చేసి సభకు వచ్చిన మాట వాస్తవమే అయినా అనుభవలేమి ఆ పార్టీకి అడ్డుగోడగా నిలిచింది. అనుభవం పుష్కలంగా వున్న టీడీపీ నాయకత్వం నిబంధనలను అడ్డుపెట్టుకుని, సాంకేతిక కారణాలను సాకుగా చూపి మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలిగింది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంలో ఇది మరింత తేటతెల్లం అయింది. తీర్మానం చర్చకు తీసుకోవడానికి పద్నాలుగు రోజుల వ్యవధి ఇవ్వాలనే నిబంధనను అప్పటికప్పుడే మూజువాణీ ఓటు ద్వారా సస్పెండు చేసి, ప్రతిపక్షానికి కాలూ నోరూ కూడదీసుకునే వ్యవధానం ఇవ్వకుండా ప్రభుత్వ పక్షం చర్చను చేపట్టిన తీరు ఇందుకు ఉదాహరణ.   నిజానికి ఈ అవిశ్వాస తీర్మానాలను లెక్క చేయాల్సిన పరిస్తితి పాలక పక్షం టీడీపీకి  లేదు. సంఖ్యాబలం పుష్కలంగా వున్నప్పుడు వాటిని ఖాతరు చేయాల్సిన అవసరమూ లేదు, అగత్యమూ లేదు. అయినా ఈ రెండు పార్టీలకి ఎందుకింత పట్టుదల అంటే ఒకటే కారణం. వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఆ ఎనిమిది మందిపై అనర్హత వేటు పడేలా చూడడం వైసీపీ ప్రధాన ధ్యేయం అయితే,  ఆ వేటు  పడకుండా వారిని కాపాడుకోవడం టీడీపీ లక్ష్యం. ఈ విషయంలో అధికార పార్టీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అనర్హత వేటు పడకుండా చూడగలిగితే తమ పార్టీలోకి మరిన్ని వలసలు పెరిగే అవకాశం వుంటుందన్న ఆశ కూడా ఇందుకు దోహదం చేసి వుండవచ్చు.
అవిశ్వాస తీర్మానం మళ్ళీ ఆరు మాసాల దాకా పెట్టేందుకు వీలులేదు. ఒకరకంగా వై ఎస్ ఆర్ సీపీకి ఇదొక  ఇబ్బందే.  అయినా సరే, రాజ్యాంగపరంగా  తనకున్న ఈ వెసులుబాటును ఆ పార్టీ ఇప్పుడే వాడేసుకుంది. కారణం, రాజకీయ అనివార్యత. కట్టు దప్పిన తన ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు పడేలా చూడకపోతే, పార్టీలో పడ్డ గండి మరింత పెద్దది అయ్యే ప్రమాదం పొంచి వుంది. దానికి అడ్డుకట్ట వేయడానికే ఇంత ప్రయాస, ఇంతటి లాయలాస.
ప్రజలు, ప్రజాసమస్యలు అనేవి రాజకీయులకు ఊతపదాలు. ఉపన్యాసాలవరకే అవి పరిమితం. వారికి, వారి పార్టీలకి రాజకీయ ప్రయోజనాలే ప్రధానం.
అయితే, ఈ మొత్తం వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ చివరిలో తనను గురించి చెప్పుకున్నసంగతులు  ఆయన జీవితంలో ఇంతవరకు నలుగురికీ తెలియని విషయాలను ఆవిష్కరించాయి. గత కాలంలో, అంటే ఆయన చిన్నతనంలోని దుర్భర పరిస్తితులు ఈనాటి తరానికి తెలియని విషయాలు. నడిచి వచ్చిన దారిలో అడ్డుపడిన ముళ్ళ కంపలు ఆయనకు  ఇప్పటికీ గుర్తున్నాయి. కలతపెట్టే సంగతులే అవి. అయితే,  చర్చ సందర్భంగా తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు మనస్తాపం కలిగించేవి కావచ్చు కానీ, ప్రజాజీవితంలో కొనసాగుతున్నప్పుడు అవి  గుర్తుంచుకోవాల్సిన విషయాలే.
   
ఉపశృతి: ప్రభుత్వంపై ప్రతిపక్షం అవిశ్వాసం అంటారు.  ఎందుకో ఇది వినడానికే విడ్డూరంగా వుంటుంది. ప్రతిపక్షానికి పాలకపక్షంపై అవిశ్వాసం, అపనమ్మకం వుండక ప్రేమ ఎందుకు వుంటుంది. ఈ రెండూ ఒకదానిని మరొకటి విశ్వసించవు. విశ్వాసంలోకి తీసుకోవు.
నిజానికి, ప్రభుత్వంపై, పాలకులపై  విశ్వాసం వుండాల్సింది వారిని ఓటేసి అధికారం అప్పగించిన ప్రజలకు. ఆ విశ్వాసానికి తూట్లు పడకుండా జాగ్రత్త పడడం ప్రభుత్వాధినేతల ప్రధమ కర్తవ్యమ్. ప్రతిపక్షంపై కాదు, ఈ విషయంపై పాలకులు నిరంతరం  ఓ కన్నేసి ఉంచాలి.(16-03-2016)

రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595       

           

15, మార్చి 2016, మంగళవారం

రాజ్యసభలో ‘చిలుకపలుకులు’


“ఏపీ కి ఇచ్చిన హామీలకి కేంద్రం కట్టుబడి వుంది. ఏపీ పట్ల చిత్తశుద్ధితో వుంది”
ప్రత్యేక హోదా గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్ధిక మంత్రి జైట్లీ జవాబు.



శభాష్!

14, మార్చి 2016, సోమవారం

సాగర సాయంత్రం


బతికితే అలా బతకాలి అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు. నాకు మాత్రం అనిపిస్తోంది జర్నలిష్టు అనేవాడు చనిపోతే అరుణ్ సాగర్  లా చనిపోవాలని.



మరోటి కూడా అనిపించింది, సాగర్  చనిపోలేదేమో.....నిన్న ఆదివారం రాత్రి హైదరాబాదులో సాగర్ మిత్రులు ఏర్పాటు చేసిన ‘ఏ షామ్ ....సాగర్ కే నామ్’ ప్రోగ్రాం చూసిన తరువాత.  అంత మందిలో ఎక్కడో అక్కడ ముచ్చట్లు చెబుతూ, బాతాఖానీ వేస్తూ సరదాగా టైం పాస్ చేస్తున్నాడేమో.  


చిన్నతనంనుంచీ పెద్ద సంఖ్యలో  సంపాదించుకున్న స్నేహితులు అందరూ అక్కడికి వచ్చారు. వచ్చిన దెవరు అనేకంటే రానిదెవ్వరు చెప్పడం తేలిక.
సాగర్  ఇష్టపడే మనుషులు తాము ఇష్టపడే సాగర్ గురించిన కబుర్లు చెప్పుకుంటూ, సాగర్ కు ఇష్టమైన పాటలు వింటూ కాలక్షేపం చేసారు.  సాగర్ ఇష్టపడేవన్నీ అక్కడ  ఏర్పాటు చేశారు. అలా ఆ సాయంత్రం వచ్చిన అందరికీ సాగర్ నామస్మరణతో గడిచిపోయింది.

ఒక మనిషి జీవితానికి ఇంకేం ధన్యత కావాలి. అరుణ్ సాగర్ ఆ విధంగా ధన్యుడు. (14-03-2016)

12, మార్చి 2016, శనివారం

ఇదీ భారతం ........ఎక్కడికీ ప్రస్తానం ?


సూటిగా....సుతిమెత్తగా.....

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 13-03-2016, SUNDAY)

వెనుక ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసే రోజుల్లో  తమిళనాడు లోని కుంభకోణంలో సెటిలయిన, తెలుగు తెలిసిన ఒక పెద్దమనిషి నుంచి ఫోనువచ్చింది.
‘దేశంలో ఎక్కడ ఏ లాలూచీ జరిగినా, ఆర్ధికపరమైన గందరగోళాలు చోటుచేసుకున్నా  ‘కుంభకోణం’ అంటూ మా వూరు పేరు ఎందుకు చెబుతారు? ఈసారి వార్తల్లో అల్లా చెప్పారంటే కోర్టులో కేసు వేస్తాను సుమా!’ అని సున్నితంగానే కాకుండా సూటిగా కూడా హెచ్చరించాడు. నేను రేడియోలో పనిచేసిన రోజుల్లో మళ్ళీ ఆ పదం వాడలేదు. కేసు వేస్తాడన్న  భయం వల్ల కాదు, అతగాడికి తన ఊరిపై వున్న వల్లమాలిన మమకారంవల్ల పెల్లుబికిన గౌరవంతో.
కానీ, పత్రికలో రాసేటప్పుడు తప్పడం లేదు. పత్రికల్లో ఆ పదం చదవకా తప్పడం లేదు. ఎందుకంటే ఈ మొత్తం ఇతివృత్తం కుంభకోణాల మయం కనుక.
స్వతంత్ర భారత దేశంలో కూడా కుంభకోణాలకు కొదవేమీ లేదు. తాజాగా చెప్పుకుంటోంది లిక్కర్  కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్  లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యవహారం.
లక్షాధికారుల ఇంట్లో పుట్టి, కోట్లల్లో పెరిగి, అత్యంత సంపన్నులలోఒకడిగా ఎదిగి, ఆ క్రమంలో అందిన చోటల్లా అప్పులు చేసి ‘పక్షిలా ఎగిరిపోవాలి’ అని పాడుకుంటూ విదేశాలకు ఎంచక్కా ఎగిరిపోయిన విజయ్ మాల్యా గతంలోనూ, ఇప్పుడూ కూడా మీడియా వార్తలకు మంచి ముడి సరుకే.


సీబీఐ ఓ పక్క డేగకన్నుతో కనిపెట్టి చూస్తుంటే, విజయ్ మాల్యా ఒక మహిళతో కలిసి, విమానంలో అదీ  ఫస్ట్ క్లాస్ లో దర్జాగా  ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. నమ్మశక్యం కాకున్నా నమ్మక తప్పని పరిస్తితి. పైగా ‘నేను పారిపోలేదు,  విదేశీ ప్రయాణాలు తనకు కొట్టిన పిండే’ అంటూ ట్విట్టర్లో  ట్వీట్ చేస్తూ విలాసంగా అక్కడ  కాలక్షేపం చేస్తున్నాడు. పైపెచ్చు, తన మీద మీడియా కక్ష కట్టి విద్వేషపూరిత ప్రచారం చేస్తోందని  ఆవేదన వెలిబుచ్చాడు. గతంలో తన నుంచి మీడియా బాసులు పొందిన సేవలను, సత్కారాలను, కల్పించిన వసతులను వారు మరిచిపోయినా తనకన్నీ గుర్తున్నాయనే రీతిలో నిప్పులు చెరిగాడు. బ్యాంకులకు అక్షరాలా తొమ్మిది వేల కోట్లు ఎగనామం పెట్టినట్టు అభియోగాలను ఎదుర్కుంటున్న ఈ చిద్విలాస పురుషుడు విజయ్ మాల్యాకు ఈ నెల పద్దెనిమిది నాటికి తమ ఎదుట హాజరు కావాలని  ఈడీ పంపిన సమన్లను అతడేమాత్రం ఖాతరు చేస్తాడో వేచి చూడాలి.
ముందే చెప్పినట్టు మన దేశంలో కుంభకోణాలు కొత్తవేమీ కాదు. స్వతంత్రంతో పాటే ఇవి కూడా దేశంలోకి కుడి కాలు పెట్టాయి.           
1947 లో దేశానికి స్వాతంత్రం రావడం తరువాయి, ఏకంగా మొదటి అడుగు పడింది జీపుల కుంభకోణంలో.  భారత – పాకిస్తాన్ దేశాల నడుమ సంఘర్షణలకు కేంద్రం అయిన కాశ్మీర్  రాష్ట్రంలో సైనికదళాల కదలికలకు అక్కడి ఎగుడు దిగుడు మార్గాలు ప్రతిబంధకంగా ఉండేవి. దానితో  అందుకు తగ్గ  జీపులు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం పడింది. అప్పట్లో  ప్రధాని  నెహ్రూకు బాగా సన్నిహితుడయిన వీకే. కృష్ణమీనన్, బ్రిటన్ లో మన దేశం తరపున హై కమీషనర్ గా పనిచేస్తుండేవారు. ఎక్కడ, ఏ మీట ఎవరు నొక్కారో తెలియదు, చాలా తక్కువ నాణ్యత కలిగిన, నాసిరకం  జీపులు దేశంలోకి దిగబడ్డాయి. అదృష్టం ఏమిటంటే అప్పటికే సరిహద్దు సంఘర్షణలు ముగింపుకు వచ్చాయి. ఆ  జీపుల కుంభకోణాన్ని ఆరాతీయడానికి అనంత శయనం అయ్యంగార్ నేతృత్వంలో ఒక దర్యాప్తు సంఘం ఏర్పాటయింది. ఇప్పట్లా కాదు కనుక ఆయన త్వరత్వరగా దర్యాప్తు పూర్తిచేసి  వెంటనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అది ఇంతవరకు వెలుగు చూసిన దాఖలా లేదు. కాకపోతే  ఈ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన పేరు కృష్ణమీనన్. ఆయన  దరిమిలా మొత్తం దేశానికే రక్షణ మంత్రి అయ్యారు. అదీ కొసమెరుపు.
1949 లోఉత్తరాది రాష్ట్రానికి పరిశ్రమల మంత్రిగా వున్న రావు శివ బహదూర్ సింగ్ కేవలం పాతిక వేలు లంచం తీసుకుని  ఒక వజ్రాల గని లీజుని తనకు తెలిసిన  వ్యాపారికి కట్టబెట్టారు. పాతిక వేలు ఎటుపోయాయో తెలియదు కాని చట్టానికి దొరికిపోయిన మంత్రిగారు మాత్రం మూడేళ్ళు జైలు ఊచలు లెక్కబెట్టాడు. పాలక పక్షం  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు జైలు పాలు కావడం అదే మొదలు.
1951 లో ఎస్ ఏ వెంకట్రామన్ అనే మంత్రి  కేంద్రంలో పరిశ్రమల శాఖ నిర్వహించేవారు. ఆ రోజుల్లో సైకిల్ విడి భాగాలను విదేశాలనుంచి దిగుమతి చేసుకునేవారు. అలాటి ఒక  లైసెన్సును మంత్రి మహోదయులు తనకు తెలిసిన కంపెనీకి గుండు గుత్తగా  అప్పగించారు. ఫలితం, ఆరోపణలు, దర్యాప్తులు. చివరకు అసలు  వ్యవహారం బయట పడి ఆయన మూడేళ్ళు జైల్లో గడిపారు.
1956 లో దాల్మియా అనే వ్యాపార వేత్తకు అనేక వ్యాపారాలు, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉండేవి. దాల్మియా – జైన్ ఎయిర్ వేస్ కు ఆయన చైర్మన్. భారత  బీమా సంస్థ అనే ప్రైవేటు బీమా సంస్థకు  యజమాని. ఏదో డబ్బు అవసరం పడి ఆ సంస్థలో రెండు కోట్ల రూపాయల నిధులు ఆరగించారు. విషయం బయటకు పొక్కడం, విచారణ జరగడం, దాల్మియాను రెండేళ్ళు జైలుకు పంపడం చక చకా జరిగిపోయాయి. ఆ దెబ్బతో దేశంలో బీమా వ్యాపారాన్ని ప్రభుత్వం జాతీయం చేసి చేతులు దులుపుకుంది.
చేతులు దులుపుకుంది అని వూరికే అనలేదు, 1957 లో కాన్పూరులో హరిదాస్ ముంద్రా అనే వ్యాపారి వుండేవారు. వ్యాపారం అన్నాక డబ్బుల అవసరం తప్పదు. అందులో కేంద్రంలో ఆర్ధిక మంత్రిగా వున్న టీ.టీ. కృష్ణమాచారి గారికీ, ఈ ముంద్రా గారికీ మంచి స్నేహం. మంత్రిగారు తలచుకుంటే ఎల్.ఐ.సి. (జీవిత బీమా సంస్థ) నుంచి ఋణం ఇప్పించడం ఏమంత కష్టం? అందులోను అది ప్రభుత్వ రంగ సంస్థ.  టీటీకే కార్యాలయం నుంచి ఫోను వెళ్ళగానే చిటికెలో ముంద్రా గారికి కావాల్సిన కోటి  రూపాయల ఋణం మంజూరు అయిపోయింది. కానీ కధ అయిపోలేదు.పైగా కొత్తగా కేసు  మొదలయింది.  ఫలితం షరా మామూలే. ముంద్రా ఇరవై రెండు నెలలు జైల్లో వున్నాడు. సిఫారసు చేసిన పాపానికి టీటీ  కృష్ణమాచారికి కృష్ణజన్మస్థానానికి వెళ్ళే ప్రమాదం రాలేదు కానీ,  మంత్రి ఉద్యోగానికి నీళ్ళు ఒదులుకోవాల్సివచ్చింది. 
1962 లో మరో కుంభకోణం వెలుగు చూసింది. ఆర్ధికపరమయిన నేరాల్లో ఇరుక్కుంటే చక్కటి జీవితాలు కూడా ఎలాటి భయంకరమయిన మలుపులు తిరుగుతాయో అనడానికి ఇది చక్కని ఉదాహరణ. పేరు చూస్తే ఉత్తర భారతం అనిపిస్తుంది కాని జయంతి ధర్మతేజ అనే ఈ పెద్దమనిషి పదహారణాల తెలుగు వాడు. తన సొంత తెలివితేటలతో ఒక సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. ఇప్పుడుప్రభుత్వ రంగంలో వున్న భారత షిప్పింగ్  కార్పోరేషన్ ఆవిర్భావానికి పూర్వం, దేశ నౌకానిర్మాణ రంగం ధర్మతేజ గారి ఆధిపత్యంలోనే వుండేది. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను  ధర్మతేజ తెలివితేటలు బాగా ఆకట్టుకున్నాయి. కేవలం రెండు వందల రూపాయల పెట్టుబడితో ఆయన సంస్థ ప్రారంభం అయిందని చెబుతారు. నెహ్రూ పుణ్యమా అని ఇరవై రెండు కోట్ల అప్పు పుట్టింది. ఇకనేం, ఆయన వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా విలసిల్లింది. కాలక్రమంలో ధర్మతేజ వ్యాపారంలో అనేక అధర్మ కోణాలు వెలుగు చూసాయి. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ని లండన్ లో అరెస్టు చేసి ఆరేళ్ళు జైల్లో ఉంచారు. ఆ పిదప ఆయన్ని గురించి చెప్పుకోవడానికి ఏమీ మిగల లేదు. ఒకప్పుడు ఒక  వెలుగు వెలిగిన జయంతి ధర్మతేజ మసకబారి  కాలగర్భంలో కలిసిపోయాడు.       
1964 ప్రాంతంలో అవిభజిత పంజాబు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ప్రతాప్ సింగ్ ఖైరాన్ అనే కాంగ్రెస్ నాయకుడు ఏకచత్రాధిపత్యంగా పాలిస్తుండేవాడు. ఎదురులేని పాలన అయినా ఎదురు దెబ్బలు మాత్రం తప్పలేదు. అధికారంతో పాటే సంక్రమించిన అవినీతి తెగులు దేశం మొత్తంలో ఒక చర్చనీయాంశం అయింది. దాస్ కమీషన్ ఆయనపై అభియోగాలను నిర్ధారించడంతో  ఖైరాన్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
1971 లో నగర్ వాలా కేసు ఒక విచిత్రం. ఢిల్లీ లోని ఒక స్టేట్ బ్యాంక్ శాఖలో పనిచేస్తున్న చీఫ్ క్యాషియర్ కి  ఫోన్ వచ్చింది. ‘నేను ప్రధాని ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను’ అని అవతల నుంచి వినిపించింది. ఇవతల అధికారి భయంతో బిక్కచచ్చి పోయాడు కానీ, ప్రధాని తనకు ఫోన్ చేయడం ఏమిటని క్షణం కూడా సందేహించలేదు. “నగర్ వాలా అని నా తరపున ఒకతను వస్తాడు. అతడికి వెంటనే అరవై లక్షలు ఇచ్చి పంపేయండి’ చెప్పేసి అవతల ఫోన్ కట్టయింది. చెప్పినట్టే రుస్తుం సోరబ్ నగర్ వాలా గారు విచ్చేశారు. ఆయన ఒక మాజీ సైనికాధికారి. బ్యాంకు అధికారి అరవై లక్షలు లెక్కబెట్టి అతడి చేతిలో పెట్టాడు. అతగాడు లెక్కబెట్టుకోకుండానే డబ్బు జేబులో పెట్టుకుని దర్జాగా  వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో ఇదొక పెద్ద దుమారంగా, సంచలనంగా  మారింది. ప్రధాని పేరు వినరావడంతో  దర్యాప్తులు, విచారణలు ముమ్మరంగా సాగాయి. అయితే,  కధ మరీ సాగిపోకుండా ఆగిపోయింది, నగర్ వాలా ఒక రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో.    
1974 లో పుదుచ్చేరికి చెందిన కొందరు వ్యాపారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర వాణిజ్య మంత్రిని కలిసి తమకు దిగుమతి లైసెన్సు ఇవ్వాలని కోరుతూ ఒక మహజరు అందచేసారు. దాన్ని గట్టిగా సిఫారసు చేస్తూ ఇరవై ఒక్కమంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేసారు. తీరా లైసెన్సులు జారీ చేసిన తరువాత తెలిసినదేమిటంటే ఆ సంతకాలన్నీ ఫోర్జరీవని.
మహారాష్ట్రలో అబ్దుల్ రహమాన్ అంతులే అనే కాంగ్రెస్ నాయకుడికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంటే అంతులేని అభిమానం. అంచేత ఇందిరా ప్రతిభా ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థను పెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఒత్తిడి తెచ్చి అంతులేని విరాళాలు సేకరించి పెట్టారని ఆయనపై అభియోగాలు వెల్లువెత్తాయి. ఫలితం ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్వాసన.  
రాజకీయ కుంభకోణాల్లో తలమానికం వంటిది బోఫార్స్ శతగ్నుల కొనుగోలు వ్యవహారం. ఇందిరా గాంధి హత్యానంతరం అత్యధిక మెజారిటీతో ప్రధాని పదవికి రాజీవ్ గాంధీని ఎన్నుకున్న ప్రజలే, ఈ కుంభకోణంతో మసకబారిన రాజీవ్ ని 1989 ఎన్నికల్లో ఓడించి  అధికారానికి దూరంగా పెట్టారు.
ఆర్ధిక కుంభకోణాల్లో జనం ఇప్పటికీ మరిచిపోలేనిది హర్షద్ మెహతా షేర్ల భాగోతం. సరళీకరణ ఆర్ధిక విధానాలు ఆరంభ దశలో ఉన్నకాలంలో అవకాశాలను అంది పుచ్చుకుని పైకి ఎదిగిన ఈ షేర్ సింగ్ అనతికాలంలోనే అడ్డదార్లలో పదివేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెర తీశాడు. ఇతడి దెబ్బకు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చిగురుటాకులా అల్లల్లాడిపోయింది. దాన్ని ఒడ్డున పడెయ్యడానికి ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన ధనాన్ని 4,800 కోట్ల మేరకు వాడాల్సివచ్చింది.  
ఇలా చెప్పుకుంటూ పొతే  ఈ జాబితా చేంతాడు అంత అవుతుంది. నకిలీ స్టాంపుల తెల్గీలు,కృష్ణ యాదవ్ లు,  పశువుల దానా లాలూ యాదవ్ లు, షేర్ మార్కెట్లతో గోలీ ఆటలు ఆడుకున్న చేతన్ పరేఖ్ లు.......ఒకటా, రెండా..... ఎన్నెన్నో కుంభకోణాలు, ఒకళ్ళా, ఇద్దరా.... ఎందరెందరో మహానుభావులు,   తమ వికృత చేష్టలతో చరిత్రను సృష్టించి చరిత్రలో కలిసిపోయారు.
అయినా నేటి చరిత్ర చూస్తుంటే గత కాలము మేలు  అనే అనిపిస్తోంది కదూ.
ఉపశృతి : మాకు తెలిసిన బంధువుల కుర్రవాడు, ఎన్నో ఏళ్ళుగా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ, గ్రీన్ కార్డు హోదా సంపాదించుకుని, అక్కడే ఇల్లు కొనుక్కుని ఉంటూ మొన్నీమధ్య తల్లికి ఒంట్లో బాగాలేదని తెలిసి హడావిడిగా హైదరాబాదు వచ్చాడు. తల్లికి స్వస్తత చేకూరిన పిదప తిరిగి వెడుతుంటే పాత  పాస్ పోర్ట్ చెల్లదని అధికారులు అభ్యంతర పెట్టారు. వారికి నిబంధనలు ముఖ్యం కదా! తప్పదు. అతగాడు ప్రయాణం మానుకుని   తత్కాల్ పద్దతిలో పాస్ పోర్ట్ రెన్యూ చేయించుకుని తిరిగి వెళ్ళడానికి పడరాని పాట్లు పడ్డాడు. మరి చట్టం అందరికీ సమానమే అని చెప్పే కబుర్లు నేతిబీరకాయ చందమేనా? నేతాశ్రీలే చెప్పాలి. (12-03-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595  


7, మార్చి 2016, సోమవారం

ఇలా జరిగింది ఈవేళ.......

 

మొక్కితే సాయి, తొక్కితే రాయి, అంతా నమ్మకం.
నలభయ్ ఏళ్ళక్రితం మొదటిసారి అక్కడికి వెళ్లాను. మధ్య మధ్య వెడుతూనే వున్నాను.
ఈరోజూ అలానే వెళ్లాను.
సాయంత్రం జ్వాలా ఫోను చేశాడు, వెడదామా అని. ఏటా వెడుతున్నాం కదా! పద! పోదాం అన్నాడు.
నిజానికి ఒంట్లో నిస్సత్తువుగా వుంది. ఏదో కారణం చెప్పి తప్పుకుందాం అనుకునేలోపునే మా ఆవిడ పోదాం పదండి అంది.  ఏడాదికి ఒక్కరోజు. అడిగిన వెంటనే ఔనంటే పోలా! పైగా రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా.
ఆవిధంగా సతీ సమేతంగా జ్వాలా  ఇంటికి వెళ్లి అటునుంచి ఆటే వెళ్ళాము. జ్వాలా భార్య, మా మేనకోడలు అయిన విజయలక్ష్మి, ఆవిడ పెద్దమ్మాయి బుంటీ అనబడే ప్రేమమాలిని ఆఫ్ టీవీ – 5 ఫేం. మరో కారులో మా అన్నయ్య భండారు రామచంద్రరావు, ఒదినె విమలాదేవి, కొడుకు జవహర్, కోడలు రేణు, వాళ్ళ ముద్దుల పట్టి మాధుర్య. మొత్తానికి యెట్లా అయితేనేం మూడు కుటుంబాల వాళ్ళం కలిసి వెళ్లాం.
పోయేసరికి చాలామంది జనం. ఎవరి మోహంలో చూసినా తన్మయత్వం. కావాలని మనసుపడి చేరిన వాళ్లతో కలిసి వెళ్లి భగవాన్ సాయిబాబా దర్శనం చేసుకున్నాం. దాదాపు రెండు మూడు ఏళ్ళు అయివుంటుంది వెళ్లి. అయినా చివరిసారి చూసినప్పుడు ఎలా వుందో అలాగే వుంది, మందిరం మధ్యన పెట్టిన సత్య సాయిబాబా ఫోటో సైజు మాత్రం పెద్దదిగా అనిపించింది. జనంలో అదే భక్తీ. అదే తన్మయత్వం. అదే నిశ్శబ్ద వాతావరణం. ‘సాయి రాం’ అంటూ సాయి సేవకుల పలకరింపు. సత్య సాయి ఈ లోకం నుంచి నిష్క్రమించిన తరువాత కూడా ఏ మార్పూ కానరాలేదు. నమ్మకంలో వున్న దృఢత్వం అలాంటిది మరి.
నమస్కారం చేసుకుని వస్తూ వుంటే ఒక సాయి సేవకుడు జ్వాలాను పక్కకు పిలిచి ఏదో చెబుతున్నాడు. ఆయన ఎవరో జ్వాలాకు పరిచయం ఉన్నట్టుగా అనిపించలేదు. కానీ అతడు ఒదిలిపెట్టలేదు. మమ్మల్ని అందర్నీ మళ్ళీ మందిరం లోపలకి వెంటబెట్టుకువెళ్ళాడు. బాబా ఫోటో వెనకగా వున్న మెట్లమీదుగా పైకి తీసుకువెళ్ళాడు. మా మొహాల్లో ఆశ్చర్యం.
పైకి వెడితే ముందు ఒక డ్రాయింగు రూము. బాబా అంతరంగికంగా భక్తులకు దర్సనం ఇచ్చే చోటు. ఆయన కూర్చునే ఆసనం, పరిసరాలు అన్నీ కూడా స్వామి అక్కడే మకాం చేస్తున్నారా అనేంత పరిశుభ్రంగా వున్నాయి. ఆ పక్కన ఓ గది. పక్కగా ఓ మంచం. దాని మీద పరుపు, తలగడ. ఉతికి శుభ్రం చేసిన ఒక రుమాలు చక్కగా మడత పెట్టి వుంది. వెనుక మరో చిన్న అంతరంగిక మందిరం.
సాయి సేవకుడు చాలా మర్యాదగా అందరికీ విబూది పొట్లాలు ఇచ్చాడు. అలాగే మా అందరికీ, ఇదిగో కింద ఫోటోలో కనబడుతుంది చూశారు, “90 years of transforming humanity – you will never walk alone అని రాసి వున్న బాబాగారి పెద్ద ఫోటో ఫ్రేములను కానుకగా ఇచ్చాడు.


అక్కడికి వచ్చిన అందరికీ  ఇలా జరిగిందా అంటే లేదు. పోనీ మేము తెలుసా అంటే అదీ లేదు. ఎవరో అనుకుని మాకు ఈ మర్యాదలు చేస్తున్నాడా అంటే అదీ కాదు. అతడి నుంచి ఒకటే జవాబు, స్వామి అనుగ్రహం. అంతే.
మందిరం బయట వున్న విబూది బొట్టు నొసటన పెట్టుకోకపోయినా,  బొట్టు పెట్టినట్టు  మర్యాదలు జరిగాయి.  వెంట వచ్చిన ఆడవాళ్ళు మాత్రం మహాశివరాత్రి మహిమ అనుకుంటూ  మురిసిపోయారు. వాళ్ళ సంతోషం బయటకి కనిపించింది. మాది కాదు, అంతే తేడా!
స్వామి హైదరాబాదు రాక దశాబ్దాల కాలం గడిచింది. నల్లకుంటలోని ‘శివం’ లో ఆయన బస చేసిన గుర్తు కూడాలేదు. అయినా ఆయన అక్కడే ఉన్నట్టుగా వున్నాయి అక్కడ ఏర్పాట్లు. వాటిని చూడగలగడం మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అది నిజం. (07-03-2016)   
           

పార్టీలు - పత్రికలు

 సూటిగా......సుతిమెత్తగా......

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 10-03-2016, THURSDAY)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబునాయుడికి ‘మీడియా మిత్రుడు’ అనే పేరు వుండేది. ఆ  రోజుల్లో తన పరిపాలనకు సంబంధించి ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడ, ఏమూల,  ఏవిధమైన ప్రతికూల వార్త వచ్చినా సరే, ఆయన తక్షణం స్పందించడం ఆ రోజుల్లో  పనిచేసిన నా బోటి విలేకరులకు బాగా తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక వార్తలు ప్రచురించే పెద్ద పత్రికల ‘పిల్ల పత్రికలను’ ఏరోజుకారోజు తన వద్దకు తెప్పించుకుని, అదే రోజు దిద్దుబాటు చర్యలకోసం జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అనేది నిత్యకృత్యంగా వుండేది. అంతేకాదు ఆయా ప్రతికూల వార్తలపై   ముఖ్యమంత్రి స్పందన కూడా ప్రజలకు తెలిసేలా ఆ విషయం పత్రికల్లో వచ్చేట్టు చూసే  ప్రత్యేక వ్యవస్థ ఒకటి  ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేది. ‘అత్యంత సమర్దుడయిన ముఖ్యమంత్రి’ అనే మంచి పేరు చాలా త్వరగా  రావడానికి ఇది ఎంతో ఉపకరించింది కూడా. పత్రికల యాజమాన్యాలతోనే కాకుండా నిత్యం వృత్తిరీత్యా తనను కలిసే సామాన్య విలేకరులతో కూడా మర్యాదగా వ్యవహరించే చంద్రబాబు  మనస్తత్వం, ఇంటా బయటా ఆయనకు  ‘మీడియా సావీ సీఎం’  అనే మంచి  బిరుదును  కట్టబెట్టింది.


అయితే, ఈనాటి పరిస్తితుల ప్రాబల్యం కావచ్చు, మంత్రివర్గ సహచరుల కారణంగా  వచ్చి పడుతున్న సమస్యల వల్ల కావచ్చు, తెచ్చిపెట్టుకున్న ఇబ్బందుల వల్ల కావచ్చు,  అన్నింటికీ మించి రాజకీయ అనివార్యతల వల్ల కావచ్చు – గతంలో ఎన్నడూ లేని విధంగా, మీడియాలో వస్తున్న  కొన్ని వార్తలు ఆయన్ని  అసహనానికి, కలవరపాటుకు  గురిచేస్తున్న  విషయం మాత్రం యదార్ధం అనిపిస్తోంది. యాక్టివ్ జర్నలిజంలో లేనందువల్ల దగ్గరనుంచి పరిశీలించే అవకాశం నాకిప్పుడు లేదు.  కానీ,  టీవీ లలో ప్రసారం అవుతున్న మీడియా సమావేశాల్లో  కానవస్తున్న ఆయన ముఖ కవళికలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. గతంలో నాకు తెలిసిన చంద్రబాబు ఈయనేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అయితే, ఈ విషయంలో ఆయన్ని పూర్తిగా తప్పుపట్టడానికి కూడా వీల్లేదు. అప్పటికీ, ఇప్పటికీ  రాజకీయాల తీరూ తెన్నూ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాటా  నిజమే. రాష్ట్రంలో తనకు  ప్రధాన ప్రతిపక్షంగా వున్న వై.ఎస్.ఆర్.సీ.పీ., ఒక పత్రికను, ఒక టీవీ ఛానల్  ను అడ్డుపెట్టుకుని రాజకీయంగా తనను సాధిస్తోందని ఆయన ఆరోపణ. మునుపు పత్రికల్లో ఏదయినా ప్రభుత్వ వ్యతిరేక వార్త వచ్చినా సరే తక్షణం స్పందించి చర్యలకు ఆదేశించిన చంద్రబాబు, ఇప్పుడు ఒక మీడియా పనికట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక వార్తలను వండివారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పైపెచ్చు అటువంటి వార్తలు రాసే పత్రికపై  న్యాయపరమయిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా. చంద్రబాబునాయుడు అన్నట్టు ఆ పత్రికా, ఆ ఛానల్ రెండూ కూడా ప్రతిపక్షనేత ఆధ్వర్యంలో పనిచేసేవి కావచ్చు. ఆ మాటకు వస్తే, ప్రతిపక్షానికే కాదు, ఈ రోజు రాష్ట్రంలో ప్రతి (రాజకీయ) ‘పక్షానికీ’,  సానుకూల వార్తలు రాసే, చూపించే, మీడియా దన్ను వున్న మాట కూడా వాస్తవమే. పొరుగున వున్న తమిళ నాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్తితి కాస్త మెరుగేమో. నిజం చెప్పాలంటే పత్రికలు, ఛానల్స్  మాత్రమే కాదు, వాటిని చదివే, చూసే  పాఠకులు, వీక్షకులు కూడా పార్టీల వారిగా విడిపోయినట్టు  అనిపిస్తోంది. ఇలా మారిన పరిస్తితుల్లో చంద్రబాబునాయుడు కూడా పత్రికల పట్ల తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందేమో తెలవదు. ‘కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధి కోసం  ఆయన అహరహం కష్టపడి పనిచేస్తుంటే,  సహకరించాల్సింది పోయి,  ఈ సన్నాయి నొక్కుళ్ళు  ఏమిట’న్నది తెలుగు తమ్ముళ్ళ ఆవేదన.  చేయి చాచుకునే స్వేచ్చ ప్రతివాడికీ వుంటుంది, కాకపొతే ఆ చేయి కొన పక్కవాడి ముక్కుకు తాకనంతవరకే అనే ఒక ఆంగ్ల సూక్తిని వారు ఉదహరిస్తున్నారు. స్వేచ్చకు కూడా సరిహద్దులు ఉండాలనేది దాని టీకా తాత్పర్యం. అయినా కానీ, పత్రికా స్వేచ్చ పట్ల చంద్రబాబు వెలిబుచ్చే అభిప్రాయాలు గతంతో పోల్చిచూసుకున్నప్ప్పుడు కొంత విడ్డూరంగా అనిపిస్తున్న మాట కూడా వాస్తవం.
వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకుల వాదన సహజంగా ఇందుకు  భిన్నంగా వుంటుంది. గతంలో తమ నాయకుడి గురించిన ఆరోపణలు  కొన్ని పత్రికల్లో  సీరియల్ గా వస్తున్న  రోజుల్లో నోరు మెదపని తెలుగుదేశం అధినేత, ఇప్పుడిలా నోరు చేసుకోవడం ఏం  భావ్యమని ఆ పార్టీ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.   సరే! ఇది, నిప్పూ ఉప్పూ వంటి రెండు రాజకీయ పార్టీల నడుమ వ్యవహారం. అవి సమాధానపడే అవకాశమే లేదు. కాకపోతే ఈ మొత్తం వ్యవహారం మరోసారి పత్రికల పాత్రను గురించి, మీడియా బాధ్యతను గురించి, వాటి స్వేచ్చను గురించి కొన్ని  కీలకమైన ప్రశ్నలను చర్చకు తెచ్చింది.
పత్రికా స్వేచ్చ గురించి ఎవరెన్ని కబుర్లు చెప్పినా అది నేతిబీరకాయ చందం అనేవారూ వున్నారు. స్వేచ్చ యజమానులదే కాని,  పత్రికల్లో పనిచేసే సిబ్బందిది కాదనే వారూ లేకపోలేదు.
‘కలం కూలీ’ గా తనను తాను అభివర్ణించుకుంటూ జీవితం చాలించిన ప్రసిద్ధ జర్నలిష్టు జీ. కృష్ణ గారు చెబుతారు  ‘అప్పుడు- ఇప్పుడు’ అని రాసిన తన అనుభవాల సమాహారంలో. ‘యజమానులే రాజకీయ పార్టీలకు అంకితం కావడం వల్ల, పత్రికారచయితలకు  కూడా రాజకీయాలు తప్పనిసరి అవుతున్నాయ’ని. దీనికి తోడు జర్నలిష్టులకు సొంత రాజకీయం తగలడితే ఇక చెప్పేదేమి వుంటుంది. ‘అసలే కోతి, నిప్పులు తొక్కింది అనే సామెత చందం’ అంటారాయన.
జీ.కృష్ణ గారు పాతతరం పత్రికారచయిత. ఆయన సూత్రాలు, సిద్ధాంతాలు ఈనాటి కాలానికి వర్తించవేమో!
‘స్వాతంత్రం వచ్చిన తరువాత మన రాజకీయ నాయకులు నేర్చుకున్నదేమిటి? ఈ ప్రశ్నకు  కృష్ణగారి జవాబును సుప్రసిద్ధ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర రావు గారు ఆ పుస్తకానికి ముందు మాటలో రాసారిలా. ‘వాళ్ళు నేర్చినవి రెండే రెండు విద్యలు. ఒకటి గుడ్డిగా పొగడడం. లేదా గుడ్డిగా వ్యతిరేకించడం”
దీన్ని కాస్త మారిస్తే ప్రస్తుతానికి అన్వయించుకోవచ్చేమో! ‘పత్రికలకు తెలిసింది గుడ్డిగా పొగడడం లేదా అంతే గుడ్డిగా వ్యతిరేకించడం’. కాస్త పరుషంగా అనిపించవచ్చేమో, మన్నించాలి. 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ  ఆవిర్భావానికి చాలా పూర్వం, కాంగ్రెస్ పార్టీ  ఏకచత్రాధిపత్యంగా పాలిస్తున్న రోజుల్లో పాలకపక్షంలోని రెండు వర్గాలకు తెలుగు పత్రికలు చెరో వైపూ కొమ్ము కాసేవన్న సంగతి బహిరంగ రహస్యమే. నాటి మేటి తెనుగు పత్రికల్లో ఒకటి నీలం సంజీవరెడ్డిని సమర్ధిస్తే, రెండోది ఎన్జీ రంగాకు అండదండగా నిలబడేవని సీనియర్ జర్నలిష్టులు చెబుతారు. ప్రతి రోజూ ఆ రెండు పత్రికలు ఇలా తమ ఈ విధానానికి తగ్గట్టు వార్తలు సేకరించి రాసేవట. అప్పుడే అలా వుంటే, ఇప్పుడు పార్టీలు పెరిగాయి. పత్రికలు పెరిగాయి. తగ్గట్టే వండి వార్చే వార్తలూ పెరిగాయి. కాబట్టి చింతించి వగచిన ఏమి ఫలము?
పూర్వపు రోజుల్లో వేరే పత్రిక  గురించి మరో పత్రికలో  రాయాల్సి వచ్చినప్పుడు, ‘ఒక పత్రిక’ అనో, లేదా ‘తమ  పత్రిక కాద’నో, మొత్తం మీద   ఆ పత్రిక పేరు పెట్టకుండా రాసేవారు. ఇప్పుడలాంటి మర్యాదలు ఎవ్వరూ పాటిస్తున్నట్టు లేదు.
పార్టీలు, పత్రికలూ అని కదా మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంలో ఒక మహానుభావుడ్ని తప్పనిసరిగా గుర్తుచేసుకోవాలి.   
ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఇప్పటిది కాదు, గతంలో ఎమర్జెన్సీ కాలంలోనే  కాంగ్రెస్  అధినేత్రి ఇందిరాగాంధీ పై కాలుదువ్వి, కయ్యం పెట్టుకున్న ఘన చరిత్ర కలిగిన ఆంగ్ల పత్రిక. దాని అధిపతి  రామనాద్ గోయెంకా, తన సంపాదక బృందంతో  ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారట, ‘తనకొక  పూచిక పుల్ల దొరికినా దాంతో ఇందిరాగాంధీని ఎదుర్కుంటాన’ని. ఇక అంతటి పెద్ద పత్రిక చేతిలో వుంటే చెప్పేదేముంటుంది?
పరిశోధనాత్మక జర్నలిజం అనే మాట తరచుగా వినబడుతోంది. కూపీలాగి సమాచారం సేకరించడం అని దీనికి  అర్ధం చెప్పుకోవచ్చు. ఈ మాదిరి కూపీ జర్నలిజానికి  ఒక ఆద్యుడు వున్నాడు. ఆయన పేరు గాజుల లక్ష్మీనరసు చెట్టి. బ్రిటిష్ పాలనలోని భారతదేశంలో స్వదేశీ ఉద్యమాలు ఊపిరి పోసుకుంటున్నప్పటి కాలంనాటి వాడు. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటికి లాగి ‘కార్లీలియన్’ అనే పత్రికలో ప్రచురించేవాడు. కూపీలాగి సమాచారం సేకరించేందుకోసం ఆ పత్రిక కొందరు విలేకరులను ప్రత్యేకంగా నియోగించేది. ఈ కారణంగా ప్రభుత్వ ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది కూడా.
స్వేచ్చగా వ్యక్తపరిచే భావాల సంఘర్షణ నుంచే సత్య నిరూపణ జరుగుతుందని జాన్ లాక్ అంటాడు.  ఈనాటి పత్రికలకు ఈ స్వేచ్చ వున్నమాట నిజమే కాని పత్రికల్లో తాము రాసే ప్రతి విషయం ఎవరి అదుపు ఆజ్ఞా  లేకుండా ప్రచురితం అవుతున్నాయని ఏ జర్నలిష్టూ చెప్పుకోలేని పరిస్తితిని కూడా  నేడు చూస్తున్నాము.
‘ప్రజాభిప్రాయం యుద్ధం కంటే శక్తివంతమైనద’ని టాల్  స్టాయ్ అభిప్రాయం. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి రామారావును పదవి నుంచి దించి వేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన ప్రజాందోళనను ప్రజాభిప్రాయంగా మలచడంలో పత్రికల పాత్ర ఇంతా అంతా కాదు.  ఆ మొత్తం వ్యవహారానికి కర్తా, కర్మా, క్రియగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు కంటే ఈ విషయం బాగా తెలిసిన వాళ్ళు మరొకరు వుంటారని నేననుకోను.
అధికారంలో వున్నప్పుడు ఒక మాదిరిగా, లేనప్పుడు మరో విధంగా పత్రికలపట్ల వైఖరులను మార్చుకోవడం గురించి చెప్పుకునేటప్పుడు తటాలున గుర్తుకు వచ్చే మనిషి అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. “పత్రికలులేని ప్రభుత్వం కావాలా? ప్రభుత్వం లేని పత్రికలు  కావాలా? ఏదో  ఒకటి  కోరుకోమంటే మారుమాట లేకుండా ప్రభుత్వం లేని పత్రికలనే కోరుకుంటానని’ జెఫర్సన్ మహాశయుల ఉవాచ. అయితే అప్పటికి ఆయన అమెరికా అధ్యక్షులు కాలేదు. అయిన తరువాత అయన స్నేహితుడికి రాసిన ఉత్తరంలో పత్రికలు  గురించి తద్విరుద్ధమైన వ్యాఖ్య చేస్తాడు. “ఇప్పుడు పత్రికల్లో వచ్చేది ఏదీ నమ్మడానికి వీల్లేకుండా వుంది” ఇదీ అయన మనసులోని మాట సారాంశం. 
గతంలో పత్రికావిలువలు యెంత సమున్నతంగా వుండేవో  తెలుసుకోవాలంటే ప్రసిద్ధ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు రాసిన ‘నాటి పత్రికల మేటి విలువలు’ చదవాలి. ప్రచురణకు ముందు పొత్తూరివారి ఈ ప్రసంగవ్యాస పరంపర విజయవాడ, ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారం అయింది.
‘ఈవేల్టి న్యూస్ పేపర్ రేపటి వేస్ట్ పేపర్’ అని పత్రికల్లో ఏమి వచ్చినా దులిపేసుకుపోయే రాజకీయ నాయకులూ వున్నారు. ఎలా రాసినా భలేగా  రాశారే అని సంతృప్తి పడే అల్పసంతోషులు సయితం వున్నారు.             
జర్నలిష్టులకు బ్రిటిష్ పత్రికాధిపతి లార్డ్ బీవర్ బ్రూక్ (1879-1964) ఇచ్చిన సలహా నేటికీ వర్తించేదిగా వుంది. ఆయన తన సిబ్బందితో  అంటాడు ఇలా.  ‘వెళ్ళండి! నోరులేనివాళ్ళ పక్షాన, నిండా మునిగిన వాళ్ళ పక్షాన మాట్లాడండి!”
సరే!  లార్డ్  బ్రూక్ మహాశయులు చెప్పారుకదా అని నిజాలను పచ్చి నిజాలుగా రాసేస్తే అవి నేటి రాజకీయ నాయకులకు రుచించకపోవచ్చు. కెమెరాలు ఎదురుగా వున్నప్పుడు వారిలో కొందరి హావభావాలు, అనే మాటలు, చేసే వ్యాఖ్యానాలు చెలియలి కట్ట దాటి పోతున్నాయి.    
రాజకీయ నాయకులు ఒకరు చెబితే వినే పరిస్తితి వుండదు. వారి వారి అనివార్యతల కారణంగా మాట్లాడే విధానాలు మార్చుకోవడం కష్టం కూడా. అటువంటప్పుడు ఈ సమస్యకు పరిష్కారం మీడియానే చూపాలి.
ఎలక్ట్రానికి మీడియా రంగప్రవేశం చేసిన రోజుల్లో ఎక్కడయినా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు  ఛిద్రమైన బాధితుల శరీర భాగాలను యధాతధంగా చూపేవారు. మనసులను కలచివేసే ఇటువంటి దృశ్యాలను చూపడం సరికాదనుకుని వారే కాలక్రమంలో పద్దతులు మార్చుకున్నారు. వాటిని కనీ కనిపించకుండా  మసక మసకగా చేసి  చూపిస్తున్నారు. ఒకరకంగా మంచి పరిణామం. ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ఆయా నాయకులు చేసే అసభ్యవ్యాఖ్యలను ప్రత్యక్ష ప్రసారాల్లో ఒకసారి చూపించడం సాంకేతిక రీత్యా తప్పకపోవచ్చు. అయితే వాటిని పునః ప్రసారం చేసేటప్పుడు ఎడిట్ చేసి చూపిస్తే బాగుంటుందేమో మీడియా యాజమాన్యాలు ఆలోచించుకోవాలి. అసభ్య వ్యాఖ్యలు అని అంటున్నప్పుడు వాటిని అదేపనిగా యధాతధంగా ప్రసారం చేయడంలో ఔచిత్యం ఏమి వుంటుంది?   
ఉపశృతి:
అవి ఎమర్జెన్సీ రోజులు.
హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.
పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజం ను వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేసే నాకు వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. ‘నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు ఉదయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్చవుందని ఒప్పుకుంటాను.’

పత్రికా స్వేచ్చపట్ల అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్చ గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు. (09-03-2016)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:98491 30595 

5, మార్చి 2016, శనివారం

ఎన్నికల నామ సంవత్సరం


సూటిగా......సుతిమెత్తగా.......

రెండేళ్ళ క్రితం దేశ ఎన్నికల చరిత్రను తిరగరాస్తూ,  చారిత్రాత్మక విజయంతో కొత్త చరిత్ర సృష్టించిన నరేంద్ర  మోడీ ఘన చరిత్రకు, రెన్నెళ్ళ పాటు సుదీర్ఘంగా జరగబోతున్న  అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పెద్ద పరీక్షగా మారబోతున్నాయి.
అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికల షెడ్యూల్  ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియ మరుసటి నెల మూడో వారంకల్లా  ముగుస్తుంది. మే 19 వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో ఆయా పార్టీల భవితవ్యం బయట పడుతుంది.మొత్తం అయిదు రాష్ట్రాల్లోనూ కలిపి పదిహేడు కోట్లమంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వుంది.
పోటీ చేసే అభ్యర్ధులలో ఒక్కరూ సరయినవారు కారు అనే నిర్ధారణకు వచ్చిన ఓటర్లకోసం గతంలోనే కల్పించిన ‘నోటా’ వెసులుబాటును ఈసారి మరింత మెరుగుపరిచారు. మిగిలిన అభ్యర్ధులతో పాటు ‘నోటా’కు కూడా విడిగా ఒక ప్రత్యేక గుర్తును  కేటాయిస్తున్నారు. ‘క్రాస్’ రూపంలో వుండే ఈ గుర్తుపై ఓటు ముద్ర వేయడం ద్వారా బరిలో వున్న అభ్యర్ధులు ఎవ్వరూ తమకు ఆమోదం కాదన్న అభిప్రాయ వ్యక్తీకరణకు ఈ  విధానం ఉపయోగపడుతుంది.  అలాగే, ఓటు వేసిన వెంటనే తాను కోరుకున్న అభ్యర్ధికే ఓటు పడిందా లేదా అనే అనుమానం ఓటర్లో తలెత్తకుండా చూసేందుకు ఈసారి ఎన్నికల్లో అందుకు తగిన ప్రత్యేక యంత్రాలను ఈవీఎం లకు అనుసంధానం చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి కొన్ని ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజక వర్గాల్లో మాత్రమే ఈ యంత్రాలు ఉపయోగిస్తారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఈ సారి, తొలిసారిగా ఈవీఎం లలోని బ్యాలట్ పేపర్లపై అభ్యర్ధి పేరుతొ పాటు అతడి ఫోటోను కూడా ముద్రించబోతున్నారు. ఒకే పేరు కలిగిన అభ్యర్ధులు పలువురు పోటీలో వున్నప్పుడు ఓటర్లలో అయోమయం ఏర్పడకుండా ఈ ఏర్పాటు.
ఈ మినీ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాల్లో కొత్తగా  ప్రజాప్రతినిధులు ఆయా రాష్ట్రాల శాసన సభల్లో ప్రవేశిస్తారు. అంటే పరోక్షంగా ఈ ఎన్నికల ఫలితాలు, రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలాల్ని ప్రభావితం చేసే అవకాశం వుంది. కాబట్టి పెద్దల సభలో సంఖ్యాబలాన్ని పెంచుకోవడం రాజకీయ అవసరంగా మారిన మోడీ సర్కారుకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే అని చెప్పవచ్చు. అయిదేళ్ళ క్రితం ఏర్పడ్డ ఈ అయిదు రాష్ట్రాలలోని పాలక పక్షాలకు కూడా ఈ ఎన్నికలు పెద్ద పరీక్షే. ఎందుకంటె, అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాల స్వరూపస్వభావాల్లో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
జాతీయ రాజకీయ చిత్రపఠంలోకి  నరేంద్ర మోడీ కాలు మోపిన తరువాత దేశ రాజకీయాలు ఆయన చుట్టూ పరిభ్రమించే పరిస్తితి ఏర్పడింది. దేశ విదేశాల్లో ఆయన ప్రతిష్ట ఆకాశాన్ని అంటుతోంది అని ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు సయితం ఆందోళన చెందేవిధంగా  పరిణామాలు సంభవించిన మాట కూడా యదార్ధం. అయితే ఆ వెలుగు జిలుగులు  శాస్వితం కాదని, అవి మసకబారే అవకాశం వుందని, దరిమిలా  ఢిల్లీ, బీహారు శాసన సభలకు జరిగిన ఎన్నికలు నిరూపించాయి. అయినా  కానీ, భారతీయ జనతాపార్టీకి మోడీకి మించిన నాయకత్వ  ప్రత్యామ్నాయం కలికం వేసినా కానరాని సంగతి కూడా కాదనలేని వాస్తవం.
కాకపోతే, మోడీ నాయకత్వంలోని బీజేపికి మింగుడు పడని కొన్ని అంశాలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ప్రాబల్యం కంటే ప్రాంతీయ పార్టీలకు ప్రజల్లో ఆదరణ ఎక్కువ. కాంగ్రెస్, బీజేపీ ఈ రెండూ కూడా ఈ రాష్ట్రాల్లో సొంత బలం మీద గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగితే అదో అద్భుతమే అవుతుంది.
పశ్చిమ బెంగాల్ లో రాజ్యమేలుతున్న త్రుణామూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విజయావకాశాలు అయిదేళ్ళ క్రితం మాదిరిగా అలాగే చెక్కుచెదరకుండా ఉన్నాయా అంటే అవునని చెప్పడం కష్టమే. ముప్పయినాలుగేళ్ళ వామపక్ష పరిపాలనకు స్వస్తి వాక్యం పలికించి ఒక రికార్డు సొంతం చేసుకున్న ఈ బెంగాల్ దీదీ, మళ్ళీ అదే విజయాన్ని అదే స్థాయిలో నమోదు చేసుకోవడం అసాధ్యం అయినప్పటికీ, మళ్ళీ అధికారపగ్గాలు చేజిక్కించుకోవడం ఆమెకు అంత కష్టమేమీ కాకపోవచ్చు. బహుశా ఈ ధైర్యం పుష్కలంగా వుండబట్టే కావచ్చు, ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మమతా బెనర్జీ మొత్తం అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్ధుల పేర్లు ప్రకటించి, ఎన్నికల సమరంలో తన ముందస్తు సంసిద్ధతను చాటిచెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన  ఈ బెంగాల్ ఆడ పులి, ఈసారి సొంతంగానే పోటీకి దిగడం గమనిస్తే పూర్తి ఆత్మ విశ్వాసంతో వున్నట్టు కానవస్తోంది. ఇప్పుడు చేసేది ఏమీ లేక జాతీయ పార్టీ కాంగ్రెస్, ఒకనాటి తన కమ్యూనిష్టు మిత్రులతో పాత చెలిమిని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తోంది. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్ధులు. ఈసారి ఎన్నికల పొత్తు పెట్టుకుంటున్న రాజకీయ మిత్రులు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని మరోమారు నిరూపితమవుతోంది. పొతే, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి, పశ్చిమ బెంగాల్ లో  విజయం పట్ల వారికే నమ్మకం లేదు. గత  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 289 స్థానాలకు పోటీ చేసి దాదాపు అన్నింటిలో ధరావత్తులు పోగొట్టుకున్న చరిత్ర కళ్ళ ఎదుట కనబడుతోంది. అయితే, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ నమోదు చేసుకున్న విజయాలు అంధకారంలో ఆశాదీపాలు. ఆ రాష్ట్రంలో బీజేపీ కాస్త కాలు కూడదీసుకున్నా ఆ ఘనత కేవలం మోడీ ఖాతాలోనే పడుతుంది.
మరో ముఖ్యమైన రాష్ట్రం తమిళనాడు. జాతీయ పార్టీల  ప్రాభవాన్ని పూర్తిగా నిలువరించిన ప్రాంతీయ పార్టీల కంచుకోట. అయితే ఈ పార్టీ, కాకపోతే ఆ పార్టీ అనే రీతిలో గత చాలాకాలంగా రెండే రెండు ప్రాంతీయ పార్టీలు, డీఎంకే, అన్నా డీఎంకే ఆ రాష్ట్రంలో అధికారాన్ని వంతులవారీగా పంచుకుంటున్నాయి. పార్టీలు అనేకంటే ఈ పోరు, జయలలిత, కరుణానిధి అనే  ఇద్దరు వ్యక్తుల నడుమ అంటే సముచితంగా వుంటుంది. పేరుకు ఎన్ని పార్టీలు పోటీ చేసినా చివరికి అసలు పోరు వీరిద్దరి నడుమనే అనేది కరడుగట్టిన నిజం.
రాజకీయాల్లో ప్రజాదరణ అనేది ఎంతటి కీలకమో తెలుసుకోవాలంటే పుదుచ్చేరి వైపు చూడాలి. ముప్పయి అసెంబ్లీ సీట్లు మాత్రమే వున్న ఆ చిన్ని రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను కాదని కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయన పేరు ఎన్. రంగస్వామి. ఆయన పార్టీ అధికారానికి దగ్గర అయినా ప్రజలకు మాత్రమే దగ్గరగా వుండాలనేది రంగస్వామి సిద్ధాంతం.  పార్టీ కంటే వ్యక్తులు గొప్పకాదు అనేది  కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. పొసగని పరిస్తితుల్లో అయన గత అసెంబ్లీ  ఎన్నికలకు ముందే కాంగ్రెస్  పార్టీకి గుడ్  బై చెప్పేసి సొంత పార్టీ పెట్టేసుకున్నారు. అయినా విజయలక్ష్మి ఆయన్నే వరించింది. సగం సీట్లను రంగస్వామి పెట్టిన కొత్త పార్టీ గెలుచుకోవడంతో పుదుచ్చేరికి ఆయనే ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయనకున్న ప్రజాదరణ ఈ అయిదేళ్ళలో చెక్కు చెదిరిన దాఖలా లేదు. మరి చూడాలి ఈసారి ఓటర్లు ఎలాటి తీర్పు ఇస్తారో.
ఎన్నికలు జరగనున్న రెండు రాష్ట్రాల్లో, అసోం, కేరళలో   ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ  అధికారంలో వుంది. వరసగా రెండో మారు అధికార పక్షాన్ని గెలిపించే ఆనవాయితీ  కేరళలో లేదు. విపక్ష వామపక్ష కూటమికే అవకాశాలు మెండుగా వుంటాయని ఎన్నికల షెడ్యూలు వెలువడడానికి ఎంతో ముందు నుంచే రాజకీయ  పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓట్లు వేసేది వాళ్ళు కాదు కనుక చివరికి ఫలితాలు ఎలా వుంటాయన్నది నిజానికి పరిశీలకుల చేతుల్లో వుండదు. కాకపోతే, పాలించిన రోజుల్లో కావాల్సినంత ప్రజావ్యతిరేకతను మూటగట్టుకోవడంలో కాంగ్రెస్ వారిది అందె వేసిన చేయి కనుక చూడాలి కేరళలో హస్తవాసి ఎలా వుంటుందో.
ఇక అసోం విషయం ప్రత్యేకం. అక్కడి ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ వరసగా మూడు విజయాలు కొంగున మూటగట్టుకుని హ్యాట్రిక్ కొట్టేసి మంచి జోరు మీద వున్నారు. అయితే ఆ విజయ పరంపరకు అడ్డుకట్టవేయడం లక్ష్యంగా భారతీయ జనతా  పార్టీ ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోంది. ఏదైనా చేయగలిగితే బీజేపీకి  కాసింత అవకాశం వున్న రాష్ట్రం ఇదే.                                   

శ్రీ మన్మధ నామ సంవత్సరం ముగియడానికి నాలుగు రోజులముందు మొదలై, శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మొదట్లో ముగిసే ఈ ఎన్నికల క్రతువులో ఎవరికి యాగఫలం సిద్ధిస్తుందో, ఎవరు బలి పశువులు అవుతారో అన్నది మే పందొమ్మిదో తేదీకి కాని తెలియదు.  (05-03-2016)
రచయిత ఈ  మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595