23, డిసెంబర్ 2015, బుధవారం

అనుచరుల తప్పులు – నాయకుల తలనొప్పులు

సూటిగా.....సుతిమెత్తగా......

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 24-12-2015, THURSDAY)

నాయకుడు అనే వాడు తన అనుచర గణానికి అనునిత్యం సరయిన దిశానిర్దేశనం చేస్తుండడమే కాదు, తానూ ఒక నిత్య విద్యార్ధి మాదిరిగా కొత్త పాఠాలు నేర్చుకుంటూ వుండాలి. ఈ క్రమంలో తప్పులు దిద్దుకుంటూ వుండడమే కాకుండా అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఈ పనిలో పడ్డట్టు కానవస్తోంది.
గత  సోమవారం నాడు రాష్ట్ర శాసన మండలి సమావేశంలో ఆయన  చేసిన ప్రసంగం, టీడీఎల్పీ సమావేశంలో తెలుగు దేశం అధినేత  మాట్లాడిన తీరు ఇందుకు అద్దం పడుతోంది.  
‘అవసరమయితే ఒకరిద్దరిని వదులుకోవడానికైనా సిద్ధమే. కానీ చట్టబద్ధ పరిపాలనలో ఎక్కడా రాజీ పడను’ అంటూ, కాల్ మనీ  వ్యవహారంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు.
అదే రోజు జరిగిన తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం సమావేశంలో ప్రసంగించిన అధినాయకుడు చంద్రబాబు,  ‘స్నేహాల విషయంలో జాగ్రత్తగా మెలగమ’ని పార్టీ శాసన సభ్యులకు హితవు పలికారు. ’అధికారులు తప్పు చేస్తే అది అధికార వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఒకరిద్దరు తప్పు చేసినా అది తనకు చెడ్డ పేరు తెస్తుంద’ని చంద్రబాబు నిర్మొహమాటంగానే వున్నమాట చెప్పారు.
చాణక్యుడి  రాజధర్మం చెప్పేది ఏమిటంటే, రాజు దగ్గర పనిచేసేవాళ్ళే కాదు, ఆయన ప్రజల్లో ఎవరు నేరాలు చేసినా అందులో రాజుకు కూడా బాధ్యత వుంటుంది. అసలు నేరాలు జరక్కుండా చూడడం  పాలకుల ప్రధాన కర్తవ్యం.
ప్రజాస్వామ్య యుగంలో ప్రజలే పాలకులు. కానీ, కాలక్రమంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే వాళ్ళుగా  మిగిలిపోయి,  ప్రజాప్రతినిధులే పరిపాలకులుగా మారిపోయారు. వారు ప్రజాప్రతినిధులే కాదు, ప్రభుత్వానికి కూడా ప్రతినిధులే. ఆ రకంగా వారు చేసే మంచి చెడులన్నీ ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపుతాయి. మంచి పనులు చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. వారిది చెడు నడత అయితే వారి ప్రభుత్వానికే  చెడ్డ పేరు వస్తుంది. ఆ మంచిచెడులన్నీ ఆఖరికి ప్రభుత్వాధినేత ఖాతాలో పడతాయి. ఈ వాస్తవం తెలుసు కనుకే చంద్రబాబునాయుడు తన పార్టీవారికి ఈ రకమైన హితబోధ చేసివుంటారనుకోవాలి.
 కాల్ మనీ ఉదంతం బయటపడిన అనంతరం  రెచ్చిపోతున్న ప్రధాన  ప్రతిపక్షాన్ని  శాసనసభలో ఇరుకున పెట్టే విధంగా ఆయన ఒక  ప్రకటన చేసినప్పటికీ, ఎక్కడో మనసు మారుమూలల్లో తన సొంత పార్టీ వారి ప్రమేయం కూడా ఇందులో వుందన్న అపరాధ భావన వుండబట్టే, మనసులోని మాటను   ఈ విధంగా బయటపెట్టి వుండవచ్చు కూడా.  దానికి తోడు, ఈ  మొత్తం వ్యవహారంలో ఆయనకూ, ఆయన కుమారుడికీ ప్రమేయం ఉందంటూ సభాసాక్షిగా  ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి చేసిన ఆరోపణలు చంద్రబాబును మరింత కలతపెట్టివుంటాయి. ఎవరో, ఎక్కడో  చేసిన పనికి తనని ముడిపెట్టి మాట్లాడడం  ఆయన్ని కలచివేసి వుంటుంది. బహుశా ఈ కారణమే,  వైసీపీ సభ్యురాలు రోజాను  అసెంబ్లీ నుంచి ఏకంగా ఏడాదిపాటు సభనుంచి బహిష్కరించాలనే నిర్ణయం దిశగా అడుగు వేయించి వుంటుంది.
నవజాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి దాదాపు పద్దెనిమిది మాసాలు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, ఎన్నికల అనంతరం చేసిన తాజా వాగ్దానాలు వెరసి ముప్పందుమై సర్కారు మీద మోయలేని భారాన్ని మోపాయి. రాజధానిలేని నగరం కూడా లేని కొత్త రాష్ట్రంలో పాలన కుదురుకునేలా చేయడానికే తెలుగుదేశం అధినేత సర్వశక్తులూ వొడ్డి పనిచేయాల్సిన స్థితి. ఓ పక్క ఆర్ధిక లోటు. మరో పక్క అంతా  బాగుందని పైకి  చెబుతూ,  కొత్త రాష్ట్రానికి  సరికొత్త పెట్టుబడులని ఆకర్షించే క్రమంలో  అనవసరపు ఆడంబరాలు ప్రదర్శిస్తూ,  డాంబికపు ప్రకటనలు చేస్తూ రావాల్సిన పరిస్తితి,   నూతన రాజధాని నిర్మాణంలో  విమర్శలకు గురవుతున్న ‘గుప్పెడు మూసి వ్యవహరించే విధానం’. కేంద్రంలోని మిత్ర పక్షం బీజేపీ నుంచి ‘ఆశించని’ సాయం  ఏదోఒక రూపంలో అందుతున్నప్పటికీ, ‘ఆశించిన’ సాయం విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి. మరోవైపు ఏకైక ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.సీ.పీ.  నుంచి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు.  వీటికి తోడు నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నగరం  రూపుదిద్దుకోకోకముందే బయట పడుతున్న వికృత వ్యాపార, వాణిజ్య  ధోరణులు, నివ్వెరపరుస్తున్న  నెయ్యి కల్తీ,  ఉసుర్లు  తీస్తున్న  మద్యం కల్తీ సంఘటనలు. ఇసుక మాఫియా సంగతి చెప్పాల్సిన పనిలేదు.
సామాన్యంగా ఇటువంటి తలనొప్పులు ఏ రాజకీయ నాయకుడికయినా తప్పని నొప్పులే. ఎంతటి కుదురున్న నాయకుడినయినా కుదేలుచేసే అంశాలే. అయితే, చంద్రబాబు నాయుడుకి వున్న ఏకైక యోగ్యత ఆయన సమర్ధత. ఆ ఒక్క లక్షణమే,  ఇన్ని సమస్యలు చుట్టుముట్టినా  ఆయన్ని ఆయన అభిమానులు పెంచుకున్న అభిమానం  దూరం చేయలేకపోయాయి. ఇన్ని ఇబ్బందులు చూస్తూ, ఇన్ని సమస్యలు గమనిస్తూ ఆయన్ని గురించి  ‘అయ్యో పాపం’ అనుకునేవాళ్ళే కానీ, మొత్తం పాపం ఆయనదే అనేవాళ్ళు తక్కువ. ప్రత్యేకించి సాంఘిక మాధ్యమాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువ.
ఈ నేపధ్యంలో, ఈ కాల్ మనీ రాకెట్ బయట పడింది.  ఉత్త అప్పులు, వడ్డీల  వ్యవహారం అయితే ఇంత ప్రాచుర్యం వచ్చేది కాదు. ఇందులో దాగున్న ఒక అమానుష కోణం  వెలుగు చూడడంతో ప్రతి ఒక్కరూ ఆక్షేపించక తప్పని పరిస్తితి. బాకీల వసూళ్ళ పేరుతొ భయపెట్టి, ప్రలోభపెట్టి మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే వార్తలు రావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణ లో పడిపోయింది. బాధిత స్త్రీలే స్వయంగా బయటకు వచ్చి తమకు జరుగుతున్న అన్యాయాలను బయటపెడుతూ వుండడం చంద్రబాబు వంటి నాయకుడికి హరాయించుకోలేని విషయంగా తయారయింది. ఈ దందా నడుపుతున్న ముఠాలతో సంబంధం వున్నట్టు  మొదట బయటపడిన  పేర్లలో అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు బడా నాయకులవి వుండడం  పాలక పక్షం అధినేతను మరింత ఇరుకున పెట్టింది. దీనికి తోడు, కేసు దర్యాప్తు చేస్తున్న  సంబంధిత పోలీసు అధికారి సెలవుపై వెడుతున్నారనీ, ఆయన స్థానంలో మరో అధికారి బాధ్యతలు స్వీకరించి  దర్యాప్తు కొనసాగిస్తారనీ వెలువడ్డ వార్తలు కొంతవరకు పాలకపక్షం నైతికతను  దెబ్బతీసాయి.  ఆ తరువాత అదే అధికారిని కొనసాగిస్తూ ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం కూడా ఈ మొత్తం వ్యవహారంలో పాలకపక్ష నాయకులకు సంబంధం వుందన్న అనుమానాలను నివృత్తి చేయలేకపోయింది. కాకపొతే, చంద్రబాబు తన అనుభవం మొత్తం రంగరించి శాసన సభలో విషయ ప్రస్తావన వచ్చే సమయానికల్లా,  ఈ కేసులో అరెస్టు అయిన వారిలో  ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.సి.పీ.తాలూకువాళ్ళే  అత్యధిక  సంఖ్యలో వున్నారని గణాంకాలతో సహా వివరించి  చెప్పి, చాకచక్యంగా  ‘బంతి’ ని అవతల కోర్టులోకి నెట్టేశారు.


రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ కీలక అంశంపై  శాసన సభలో సమగ్రమైన చర్చ జరిగేలోగానే ఇది మరో మలుపు తిరిగింది. కాల్ మనీ రాకెట్  లో అప్పులిచ్చిన పెద్దలు, అప్పులు  తీసుకున్న మహిళలను చట్ట విరుద్ధంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.  ఈ అంశం శాసన సభ గడప ఎక్కేసరికి,  ఒక మహిళా సభ్యురాలిని తోటి సభ్యురాలు అసభ్య పదజాలంతో దూషించిందని అధికార పక్షం తీసుకున్న నిర్ణయం కధను మరోమలుపు తిప్పింది. అలా ప్రవర్తించిన సభ్యురాలు రోజాను ఏడాది పాటు సభనుంచి సస్పెండ్ చేసేవరకు వెళ్ళింది. సభానాయకుడిని కూడా ఆ సభ్యురాలు వదిలిపెట్టలేదనీ, సభాగౌరవం కాపాడడం కోసం ఇంతటి కఠిన చర్య తీసుకోవాల్సి వచ్చిందనీ ప్రభుత్వం తరపున  వివరణ ఇచ్చారు. అయితే దాన్ని అంగీకరించకుండా  ఆగ్రహించిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ ఏకంగా  మిగిలిన సమావేశాలనే  బహిష్కరిస్తున్నట్టు  సంచలనాత్మక ప్రకటన చేసి కధను మరో మలుపు తిప్పారు. 
కధ ఇంతటితో కూడా ఆగలేదు సరికదా మరో మలుపు తిరిగింది. 
వైసీపీ సభ్యురాలు రోజాపై ఏడాది పాటు వేసిన బహిష్కరణ వేటు మంగళవారం నాటికల్లా అనర్హత వేటుగా మార్పుచేసే ప్రయత్నాలు జరిగాయి. దీనికి నాందిగా సభలో పలువురు టీడీపీ మహిళాసభ్యులు, మహిళా మంత్రులు, సీనియర్ సభ్యులు గత సమావేశాల్లో రోజా ప్రవర్తన గురించి ప్రస్తావించి, అప్పటికీ ఇప్పటికీ ఆమెతీరులో తేడా లేదనీ, అసభ్యకరంగా మాట్లాడడం ఆమెకు అలవాటని,  అంచేత ఆమెపై అనర్హత వేటు వేసి, తిరిగి సభలో ప్రవేశించకుండా చూడాలనీ, అప్పుడే సభలో హుందాగా మెలగాల్సిన అవసరం ఇతర సభ్యులకు  తెలిసివస్తుందనీ సూచన చేసారు. రోజా వ్యాఖ్యలు తనను మానసికంగా ఎంతో వేదనకు గురిచేశాయని  టీడీపీ సభ్యురాలు అనిత కంటతడి పెట్టుకున్నారు. ఇప్పటి రికార్డులను, పాత రికార్డులను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు హామీ ఇచ్చారు. ఇదే  జరిగితే, ఒక సభ్యుడు లేదా సభ్యురాలిపై అనర్హత వేటు పడడం అన్నది తెలుగు శాసనసభ చరిత్రలో మొట్టమొదటిసారి  అవుతుంది.  ఇంతవరకు ఇలాటి పరిణామం కనీవినీ ఎరుగని సంగతే.
రోజా సభలో ఎలాటి వ్యాఖ్యలు చేసారు అనేదానిపై ఇంతవరకు అధికారిక సమాచారం లేదు. కానీ పత్రికల్లో వచ్చిన దాన్నిబట్టి  చూస్తే  అవి చాలా  దారుణంగా వున్నాయని అనిపిస్తుంది. పత్రికల వారితో మాట్లాడినప్పుడు కూడా ఆమె తన వాదనను సమర్ధించుకుంటూ మాట్లాడారు కాని, పత్రికా వార్తల్ని ఖండించలేదు కనుక అవి నిజమే అయివుండాలి. అలాంటప్పుడు క్రమశిక్షణాచర్య ఎదుర్కోకతప్పదు. అయితే రోజా మరో ఆరోపణ చేసారు. తమ సభ్యులను, తమ నాయకుడిని ఉద్దేశించి కొందరు తెలుగు దేశం సభ్యులు, మంత్రులు  చేస్తున్న అవహేళనలు, హావభావాలు  మరింత  అసభ్యకరంగా వుంటున్నాయన్నది ఆమె  అభియోగం. అవి రికార్డులకి ఎక్కడం లేదని ఆరోపణ. ఇవన్నీ వింటుంటే అసెంబ్లీ కూడా ‘ర్యాగింగు’ వేదికగా మారిపోయిందేమో అనిపిస్తోంది. 
సభలో క్రమశిక్షణ నెలకొల్పడం గురించి ఎవరికీ విభిన్న  అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఒక మహిళా శాసన సభ్యురాలి కంటి తడికి కారణమైన మరో సభ్యురాలిపై తగు విచారణ జరిపి కఠిన చర్య తీసుకుంటే అభ్యంతర పెట్టేవాళ్ళు వుండరు. అయితే, ఇంత రగడకు కారణమైన కాల్ మనీ రాకెట్ వల్ల, దాన్ని ఆసరాగా తీసుకుని నిర్వాహకులు సాగించిన నీచ, నికృష్ట కామకలాపాల వల్ల పండంటి  సంసారాలు  ఛిద్రం చేసుకుని కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్న బాధిత మహిళల కన్నీటిని కూడా తుడవాల్సిన అవసరం ప్రభుత్వానికి వుంది. కంటి  తుడుపు చర్యలతో సరిపుచ్చితే మాత్రం తమ పార్టీ వారిని కాపాడుకోవడంలో చూపిన శ్రద్ధను,   బాధిత మహిళల పట్ల చూపడం లేదనే అపప్రధను తెలుగు దేశం పార్టీ మూటగట్టుకోక తప్పదు.
ఉపశ్రుతి: ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయిదు రోజులపాటు జరిగి మొన్న మంగళవారం సాయంత్రం నిరవధికంగా వాయిదా పడ్డాయి.  వాదప్రతివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో  వున్నపుణ్యకాలం  ఆవిరి అయిపోయింది. వైసీపీ శాసనసభాపక్షం విడిగా సమావేశమై స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. దీన్ని బట్టి సభలో ఉభయ పక్షాలు తమ తమ వైఖరికి కట్టుబడే వున్నాయని, ఒక అంగుళం కూడా వెనక్కి తగ్గే సర్దుబాటు తత్వంతో లేవనీ అర్ధం అవుతోంది.
ఈ నేపధ్యంలో, అసెంబ్లీ  సమావేశాలు  ఎలా జరిగాయని ఓ మిత్రుడు అడిగినప్పుడు  చాలా పాత విషయం ఒకటి గుర్తుకు వచ్చింది.
నలభయ్ ఏళ్ళ క్రితం హైదరాబాదు రేడియో కేంద్రంలో వార్తలు చదివేందుకు న్యూస్ రీడర్లను ఎంపిక చేసేనిమిత్తం  రాత పరీక్ష, ఇంటర్యూలు నిర్వహించారు.  పరీక్షలో నెగ్గిన అభ్యర్ధులను  స్టూడియోలో కూర్చోబెట్టి కొన్ని నమూనా వార్తలు ఇచ్చి రికార్డు చేయించారు. అభ్యర్ధులను  ఎంపిక చేయాల్సిన ఒక పెద్ద మనిషి, వచ్చిన వాళ్ళల్లో ఒక అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ టేపును భద్రపరచమని సూచించారు. ‘అంత బాగా  చదివిందా’ అని మేము ఆశ్చర్య పోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు.  ‘వార్తలు ఎలా చదవకూడదో  అన్నదాన్ని బోధపరచడానికి ముందు ముందు ఆ టేపు  పనికొస్తుంద’న్నది ఆయన టీకా  తాత్పర్యం. (23-12-2015)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Photo Courtesy Image Owner


20, డిసెంబర్ 2015, ఆదివారం

అసెంబ్లీ తీరుతెన్నులు – కొన్ని జ్ఞాపకాలు


ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో పాలకప్రతిపక్ష సభ్యుల తీరుతెన్నులు గమనించిన తరువాత  గుర్తుకొచ్చిన జ్ఞాపకాలు:
1958 - 59 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో
చర్చ జరుగుతోంది. అంటే దాదాపు యాభై అయిదేళ్ళ కిందటి ముచ్చట.
ఒక సభ్యుడు లేచి అన్నారు. పన్నులన్నీ తెలంగాణపై రుద్దుతున్నారుఅని.
ఆర్ధిక మంత్రి వెంటనే  స్పందించారు, 'గౌరవ సభ్యులు వాడిన 'రుద్దుతున్నారుఅనే పదం బయట పర్వాలేదు. కానీ సభలో 'కర్ణ కఠోరం'గా  వుంటుంది'
సభ్యుడు లేచి 'అలా అన్నందుకువిచారం వెలిబుచ్చారు.
ఆ ఆర్ధిక మంత్రి పేరు బెజవాడ గోపాల రెడ్డి.
ఆ పదం వాడితరువాత విచారం వ్యక్తం చేసిన  సభ్యుడు ఎవ్వరో కాదు,  తదనంతర కాలంలో యావత్ భారత దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన పీ.వీ. నరసింహారావు.
అవీ ఆ రోజులు.
అలనాటిఅంటే ఓ నలభయ్యాభయ్ ఏళ్ళక్రితం జరిగిన  శాసన సభ సమావేశాల్లో,  తీవ్రమైన చర్చల నడుమ వాతావరణాన్ని చల్లబరచడానికి కొన్ని  చలోక్తులు కూడా వినబడేవి.
తెలుగు పత్రికల్లో  ఈ ఛలోక్తులను  'బాక్స్కట్టి మరీ ప్రచురించేవారు. చదువుకోవడానికి తమాషాగానే కాకుండా ఆహ్లాదకరంగా  కూడా ఉండేవవి.
1958 లో కళా వెంకటరావు గారు రెవెన్యూ మంత్రి.  రాములు అనే సభ్యుడు (ఇంటి పేరు గుర్తు రావడం లేదు) మంత్రిని  తమాషా పట్టించాలని'మంత్రిగారు మాట్లాడుతున్నది కొండ నాలుకతోనా లేక కొన నాలుకతోనాఅని జోకబోయారు. అంటే మంత్రిగారు చెప్పేవన్నీ పై పై మాటలుఒక్కటీ కరెక్టు కాదు అనేది ఆ సభ్యుడి ఉద్దేశ్యం.
కళా వెంకటరావు గారు సామాన్యుడు కాదుకదా! వెంటనే తిప్పికొట్టారు.
'మనిషి అనేవాడు ఎవరయినా నాలుకతోనే మాట్లాడుతాడు. కొండ నాలుకతో ఎవ్వరూ మాట్లాడరు. మరి రాములు గారు కొండ నాలుకతో మాట్లాడుతారేమో నాకు తెలియదు'
ఆ దెబ్బతో రాములుగారు కిమ్మిన్నాస్తి. గమ్మున కూర్చుండిపోయారు.
పూర్వం ఆంద్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవ రెడ్డి గారు ఒకసారి సభలో ప్రసంగిస్తూ భారతం లోని ఒక ఘట్టాన్ని ఉదాహరించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. 1959 ఆగస్టు ఒకటో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానం చెబుతున్నారు. ఆరోజుల్లోనే  కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో ఏర్పడ్డ మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన  విధించింది. దీనికి నిరసనగా ఆంద్ర ప్రదేశ్ శాసనసభలోని కమ్యూనిస్టులు సభ నుంచి వాకౌట్ చేసారు. అది సంజీవరెడ్డి గారికి నచ్చలేదు. అదే విషయం తన ప్రసంగంలో ప్రస్తావించారు. 'కేరళలో కమ్యూనిస్టులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆ పార్టీ ప్రజల  మన్నన పొందగలిగితే  తిరిగి అధికారంలోకి రావచ్చు. కర్నూలులో వుండగా ప్రకాశం గారి ప్రభుత్వం పోయింది. ఆ తరువాత కాంగ్రెస్ కి నాలుగు సీట్లు కూడా రావనుకున్నాము. కానీమళ్ళీ అధికారంలోకి వచ్చాము. ఒకసారి ఒక పార్టీ మరొక సారి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. ఇది వేదకాలం  నుంచీ ఎరిగిన  ధర్మం. యుద్ధంలో కూడా ఏదో ఒక పక్షమే గెలుస్తుంది. తిక్కన  భారతం  ఉత్తర గోగ్రహణంలో భీష్ముడు దుర్యోధనుడితో చెబుతాడు.'........పెనంగిన బలంబులు రెండును గెలవ నేర్తునేఅని. ఈ నీతి ఈనాడు కూడా వర్తిస్తుందిఅని చెప్పారు సంజీవరెడ్డి గారు.
1976 లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో దాదాపు నలభయ్ యాభయ్ మంది సభ్యులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినంత సేపు ముఖ్యమంత్రి సభలో తన స్థానం నుంచి కదల లేదు. మౌనంగా సీట్లో కూర్చుని సభ్యులు ప్రస్తావించిన వివిధ అంశాలపై నోట్స్ రాసుకుంటూ పోయారు. తరువాత తన సమయం రాగానే లేచి సుమారు గంటన్నరపాటు అన్ని అంశాలను స్పృశిస్తూ సమాధానం చెప్పారు. సభలోని యావన్మందీ వెంగళరావు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఏ పద్యం అయినా రాగయుక్తంగా కాకపోయినా ఎలాటి స్ఖాలిత్యాలు దొర్లకుండా పండిత ప్రకాండులు  మెచ్చే  విధంగా పాడగలరనేది జగమెరిగిన సత్యం. భారత భాగవతాల్లోని అనేక పద్యాలు కేసీఆర్ కి కంఠోపాఠం. దాశరధినారాయణ రెడ్డి వంటి కవుల గేయాలు ఆయన ప్రసంగంలో ఆశువుగా దొర్లుతుంటాయి. ఒకసారి రవీంద్ర భారతి లో జరిగిన ఒక కార్యక్రమంలో సినారె పక్కన ఉండగానే కేసీఆర్నారాయణరెడ్డి గారు రాసిన తొలి సినిమా పాటను యధాతధంగా వినిపించి శ్రోతలను అలరించారు.  గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య గారు బహిరంగ సభల్లో కూడా పద్యం ఎత్తుకునేవారు. ఆయన ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షులుగా వున్నప్పుడు ఢిల్లీలో  సంజీవయ్య గారు వుండే బంగళా సాహిత్య గోష్టులకు వేదికగా ఉండేదని 'కలం కూలీజీ. కృష్ణగారు తన అనుభవాల్లో రాసారు. సరే!  ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన   డాక్టర్ రాజశేఖర రెడ్డికి సయితం పద్యాలు వచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు ఏకంగా ఒక పద్యం మొత్తం సభలో చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలనిభారతంలో  తిక్కన విరచిత పద్యం - 'సారపు ధర్మమున విమల సత్యము ....అని మొదలెట్టి ఒక పద్యం చదివి వినిపించారు.
"ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు దక్షత కలిగిన భీష్మద్రోణుల వంటి వారు కూడా మౌనంగా వుండిపోయారు. అలా ఉపేక్షిస్తే అది వారికే చేటవుతుంది. కానీ ఏదో ఒకరోజున భగవంతుడే కల్పించుకుని సత్యాన్నిధర్మాన్ని నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడే కాపాడాలి"  అని ప్రసంగం  ముగించారు రాజశేఖర రెడ్డి.             
మరోసారి 2003 ఫిబ్రవరిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూదేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన గేయభాగాన్ని వై.యస్.ఆర్. చదివి వినిపించారు.
'ఒక్క నిరుపేద ఉన్నంతవరకుఒక్క మలినాశ్రువు బిందువు ఒరిగినంతవరకుఒక్క శుష్క స్థన్య సన్నిధిని క్షుదార్తి ఏడ్చు పసిబాలిక ఉన్నంతవరకునాకు శాంతి కలుగదింక నేస్తం ..... ఈ ఆర్తి ఏ  సౌధాంతరాలకు  పయనించగలదుఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదుఅంటూ 'పేదవాడి ఆర్తిని వినే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రిగారుచేయండి ముఖ్యమంత్రిగారుఅని తనదైన శైలిలో ప్రసంగం ముగించారు.   
చంద్రబాబు నాయుడు గారిది అదో తరహా. శాసన సభలో ఆయన చేసే ప్రసంగాలలో పద్యాలుగేయాలు వుండవు. కానీ ఆర్ధిక అభ్యున్నతి గురించి,సంస్కరణలు గురించి కొందరు ప్రముఖులు ఆయా సందర్భాలలో చేసిన  కొటేషన్లు బాగా చోటుచేసుకుంటాయి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను  చేపట్టిన వివిధ అభివృద్ధి పధకాలు గురించి ప్రతిపక్ష నాయకుడిగా చేసే ఉపన్యాసాలలో వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగే,ముఖ్యమంత్రిగా సభలో మాట్లాడేటప్పుడు కూడా ఈ పధకాల వివరాలు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడతారు.  
1999  నవంబరు 16 వ తేదీన గవర్నర్ ప్రసంగంపై చర్చకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సమాధానంలో కొన్ని భాగాలు ఇలా వున్నాయి.
"నేను రాష్ట్రం అభివృద్ధిని కోరుకుంటున్నాను. నా పట్ల ప్రజలకున్న  అభిమానాన్నే  నమ్ముకున్నాను. అందువల్లే ఎన్నికల్లో మీ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజల ఆశీర్వాదం నాకుంటుంది అని మొదటినుంచీ చెబుతున్నాను. అదే ఈనాడు నిజమైంది. కుల్  దీప్ నాయర్  మాట్లాడుతూ, 'నేను ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించడం లేదుఆంద్ర ప్రదేశ్ ఓటర్లని అభినందిస్తున్నాను. ఒక విజ్ డమ్ ని వాళ్ళు వ్యక్తం చేసారు. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించారు. కర్నాటకమహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆంద్ర ప్రదేశ్ మాకు ఆదర్శం అంటున్నారు. ఇండియన్  ప్రైమ్ మినిస్టర్ ఇంకా గట్టిగా చెప్పారు. 'దేనికయినా ఆంద్ర ప్రదేశ్ కొలమానంఅని. 'అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసరించాలిఅని. ఇంటర్నేషనల్ మీడియా కూడా అదే  చెబుతోంది. దేశంలో బెస్ట్ విజన్ వున్న వ్యక్తి  ఎవరంటే ఆంద్రప్రదేశ్ సీ.ఎం. అని విద్యార్ధులు కూడా చెప్పే పరిస్తితి వుంది.’ ఇలా సాగింది ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం.
'ఈ నడుమ ఒక ఎకానమిస్టు చెప్పాడు. ఆంద్ర ప్రదేశ్ లో నాయుడు కోరుకుంటున్న విప్లవం ఊహల్లో ఊహించుకునేది కాదుచేసి చూపించగలిగేదిఅని. ఇప్పుడు దేశానికి కావాల్సిన సరయిన నాయకుడు చంద్రబాబే అని కూడా ఆ ఎకానమిష్టే చెప్పారన్నారు చంద్రబాబు.
'మహాత్మా గాంధీ అన్నారు. ఒకరికి ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి అని. అప్పుడే ఒకళ్ళకు చెప్పినా వాళ్ళు వినే పరిస్తితి వుంటుంది. 'ప్రతిపక్ష నాయకులు (వై.యస్.ఆర్.) చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తప్పకుండా సహకరిస్తామని. వారిని మనః స్పూర్తిగా  అభినందిస్తున్నాను. వాళ్ళు సభలో వన్ తర్డ్ వున్నారు. అందుకే అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని అనుకుంటున్నాను.' అన్న అభిలాష వ్యక్తం చేసారు.
ఆనాడు చెప్పిన ఈ మాటను చంద్రబాబునాయుడు ఈనాడు నిలబెట్టుకోగలుగుతున్నారా అంటే అనుమానమే.
(18-12-2015’)

19, డిసెంబర్ 2015, శనివారం

‘నిర్భయ’ కు మూడేళ్ళు

సూటిగా.........సుతిమెత్తగా......
(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 20-12-2015, SUNDAY)

మనుషులు నరరూప రాక్షసులుగా ఎలా మారతారో, ఆ మారిన స్ధితిలో వాళ్ళు ఎంతటి ఘోరాలకు పాల్పడుతారో సకల దేశవాసులకు తెలిసివచ్చి కూడా మూడేళ్ళు గడిచాయి.  2012 డిసెంబరు 16 తేదీ రాత్రి భారత  రాజధాని ఢిల్లీ లో జరిగిన పాశవిక కాండ మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది సంఘటనలో మానాన్నీ, ప్రాణాన్నీ పోగొట్టుకున్న యువతికి ఏమి న్యాయం జరిగిందో తెలియదు కానీ దేశంలోని ఆడపడుచులందరికీ ఊరట కలిగించే ఒక శాసనం  ఊపిరి పోసుకుందినాకు తెలిసి స్వతంత్ర భారతంలో ప్రజల ఒత్తిడి ఫలితంగా ఒక చట్టం రూపొందిన సందర్భం కూడా అదే. చట్టమే నిర్భయ.


ఆరుగురు కామాంధుల చేతికి చిక్కిన ఒక యువతి ఎటువంటి దుర్భర, దుస్సహ, శారీరక, మానసిక వేదనలకు గురైందన్న విషయం లోకానికి తెలిసివచ్చిన పదమూడు రోజుల తరువాత ఆ అనామిక (మూడు నాలుగు రోజుల క్రితమే ఆ యువతి తల్లి ఆశాదేవి, చనిపోయిన తన కుమార్తె పేరు ‘జ్యోతి సింగ్’ అని మొదటిసారి బహిర్గత పరిచారు) సింగపూరులో చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన  పట్ల సభ్య సమాజం స్పందించిన తీరు జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితిని సైతం కదిలించింది. ఫలితంగా నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జే. ఎస్. వర్మ నేత్ర్యత్వంలో త్రిసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. తన పరిశీలనకు వచ్చిన ఎనభయ్ వేలకు పైగా సలహాలు, సూచనలను పరిశీలించి నెల రోజుల లోపునే సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.   మహిళల పట్ల లైంగిక పరమైన నేరాలు పెరిగిపోవడానికి మూల కారణం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థల వైఫల్యంగా వారు అభిప్రాయపడ్డారుకమిటీ నివేదికలో సుమారు తొంభయ్  శాతం సిఫారసులను గుదిగుచ్చి రూపొందించిన ఆర్దినెన్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, తదుపరి అది శాసనంగా చట్టసభల ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆర్డినెన్స్ బిల్లు రూపం ధరించి, 2013 మార్చి 19 తేదీన   లోకసభ ఆమోదం పొందేనాటికే అందులో పొందుపరచిన అనేక అంశాలు పలు మార్పులకు గురయ్యాయి. నిర్భయ చట్టంతో ఇటువంటి హేయమైన సంఘటనలు పునరావృతం కావని ఆశించడం  వృధా అని ఈ మూడేళ్ళ కాలంలో చోటుచేసుకుంటున్న అదే విధమైన పలు సంఘటనలు నిరూపించాయి. ఒక్క ఢిల్లీ కేసులో మినహా మరే సందర్భంలో కూడా కఠిన శిక్షలు పడిన  దాఖలా లేదు. అలా అని ఈ శాసనం వల్ల ఎలాటి ఉపయోగం లేదని కాదు. లైంగిక అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులు చట్టాలను లెక్కపెట్టే స్థితిలో వుండకపోవచ్చు కానీ, అత్యాచార బాధితులకు మాత్రం ఈ చట్టం కొంత ఊరట కలిగిస్తోంది. తమ మీద లైంగిక దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడుతుందన్న ఒకింత ఉపశమనాన్ని ఇస్తోంది. అన్నింటికీ మించి ప్రజల ఆకాంక్షల మేరకు ఒక శాసనం రూపొందడం అనేది ప్రజాస్వామ్యం సాధించిన  ఒక విజయం. అంతే కాకుండా, లైంగిక అత్యాచార బాధితులు సమాజం  దృష్టిలో మరిన్ని అవహేళనలకు గురికాకుండా అటువంటి వారిని అసలు పేర్లతో కాకుండా ‘నిర్భయ’ గా పిలవాలనే ఒక సంప్రదాయం అమల్లోకి వచ్చింది.
మూడేళ్ళ క్రితం జరిగిన ఈ కేసును ఈనాడు మరోమారు గుర్తు చేసుకోవడానికి ఒక సందర్భం వచ్చింది. ఢిల్లీ ‘నిర్భయ’ కేసులో ఆరుగురు ముద్దాయిల్లో నలుగురికి (ఒక ముద్దాయి విచారణ జరుగుతూ వున్న  సమయంలోనే  జైల్లో  ఉరివేసుకుని చనిపోయాడు) ప్రత్యేక  న్యాయస్థానం మరణశిక్ష  విధించింది. చివరకు సుప్రీం కోర్టు దాన్ని  యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.  ఆరో  ముద్దాయి ‘మైనర్’ (అల్ప వయస్కుడు) అన్న కారణంతో అతడ్ని మూడేళ్ళు జువనైల్ హోం లో ఉంచారు. ఈ శిక్షాకాలం పూర్తయి అతడు ఈరోజో రేపో విడుదల విడుదల కాబోతున్నాడు. నేరం జరిగిన సమయంలో మైనర్ అనే ఒకే ఒక కారణంతో నేరశిక్షాస్మృతి ప్రకారం అతడికి మిగిలిన నేరస్తులతో పాటు శిక్ష వేయకుండా మూడేళ్ళ శిక్షతో సరిపుచ్చాల్సి వచ్చింది. అయితే ఇటువంటి నేర మనస్త్వత్వం కలిగిన వారిని చట్టంలో వున్న లొసుగులను అడ్డం పెట్టుకుని విడుదల చేస్తే మరింత ప్రమాదకర పరిణామాలు అన్నీ సంభవించే అవకాశం వుందని కొందరు సందేహాలు  వ్యక్తం చేస్తున్నారు. విచారణా కాలంలో జైల్లో ఒక విదేశీ వార్తా సంస్థకు ముద్దాయిల్లో ఒకరు ఇచ్చిన ఇంటర్వ్యూ  ని బట్టి ఆ సందేహాలు నిజమయ్యే ప్రమాదం ఉందనిపిస్తోంది. ‘ఆ యువతి బలాత్కారానికి సహకరించి వుంటే ఇంతటి విషమ పరిస్తితి ఆమెకు ఎదురయ్యేది కాదని’ అతడు చెప్పిన తీరు కరడు గట్టిన నేర ప్రవృత్తికి నిలువెత్తు సాక్ష్యం.
మూడేళ్ళ అనంతరం ‘అల్పవయస్కుడి’   విడుదలను అడ్డుకుంటూ సుబ్రమణ్య స్వామి కోర్టుకు ఎక్కారు, కానీ న్యాయస్థానం ఆ అభ్యర్ధనను తిరస్కరించింది.
పిన్న వయస్కుడు అనే కారణంతో శిక్ష తప్పించుకుని దర్జాగా సమాజంలోకి తిరిగి అడుగుపెట్టబోతున్న అతగాడు చేసిన నేరం చిన్నదేమీ కాదు. ఆనాటి   సామూహిక మానభంగ పర్వంలో అతడూ ఒక భాగస్వామి. పైపెచ్చు,  నిస్సహాయ స్తితిలో వున్న ఆ  అభాగ్యురాలిని ఒక ఇనుప రాడ్  తో అతి క్రూరంగా, అత్యంత రాక్షసంగా హింసించిన పాపం అతడి ఖాతాలో వుంది. అయినా,  ‘అల్పవయస్కుడు’ అనే కారణంతో చేసిన నేరానికి శిక్ష పడకుండా బయటపడగలుగుతున్నాడు.
కోర్టు నిర్ణయం జ్యోతి సింగ్ తలితండ్రులను నిరాశ పరచింది. ‘నేరం జయించిందని, తామే పరాజితులమని’ ఆమె తల్లి ఆశాదేవి ఆవేదన వెలిబుచ్చారు. ఆమె బాధ సమంజసం  అనిపిస్తోంది. రేపో మాపో విడుదలయ్యే ఆ బాల హంతకుడికి  జువనైల్ హోం నుంచి బయటపడగానే కొత్త జీవితం ప్రసాదించే పేరుతొ,  టైలరింగ్ షాపు పెట్టుకోవడానికి ఆర్ధిక సాయం చేస్తారు. ఆ షాపుకు  అవసరం అయ్యే  స్థలాన్ని కూడా అధికారులే సమకూరుస్తారు. అతడి పాత పేరును మార్చి కొత్త పేరు తగిలిస్తారు. అప్పటినుంచి అతడు సమాజంలో నూతన నామధేయంతో చెలామణీ అవుతాడు. ఇదంతా వినడానికి బాగానే వుంది. పేర్లు మార్చినట్టు నేరస్తులను పూర్తిగా సంస్కరించగలిగితే అంతకంటే కోరుకునేది ఏమీ వుండదు. మనిషి వేష భాషలను మార్చినంత సులభంగా అతడి మనస్త్వత్వాన్ని మార్చడం అంత తేలికా అన్నదే ప్రశ్న. జైలు  ఇంటర్వ్యూలో ఒక ముద్దాయి చెప్పిన అభిప్రాయమే దీనికి సరయిన సమాధానం. ధర్మం ప్రకారం ఆ ‘అల్ప వయస్కుడు’ కూడా మిగిలిన వారితో పాటు శిక్షార్హుడే. కానీ చట్టం చెప్పే న్యాయం వేరుగా వుంటుంది.    
కోర్టుల్లో న్యాయం  చట్టాన్ని బట్టి వుంటుంది. చట్టం మారితే దానికి తగ్గట్టుగా న్యాయం, దానికి తగ్గట్టుగా శిక్షలు  మారిపోతూ వుంటాయి. ధర్మం అనేది మారుతున్న కాలంతో ప్రమేయం లేకుండా స్థిరంగా మార్పు లేకుండా వుంటుంది.
అల్ప వయస్కులు నేర పూరిత మనస్త్వత్వం కలిగివుండరన్న అభిప్రాయం ఒకప్పుడు సరికావచ్చు. కానీ వారి మనస్సులను కలుషితం చేసే అనేక అవకాశాలు  చిన్న వయస్సునుంచే ప్రస్తుతం  అందుబాటులో ఉంటున్నాయి. గుప్పెట మూసివుంచాల్సిన అనేక సెక్స్ పరమైన సంగతులు, వారి గుప్పెట్లో ఉంటున్న సెల్ ఫోన్ల పుణ్యమా అని చిన్నతనం నుంచే వారికి కరతలామలకం. ఈ వెసులుబాట్లతో వారు పెడమార్గం పడుతున్నారన్న వాస్తవాలను మరిచిపోరాదు. అల్పవయస్కులు అయినంత మాత్రాన వారు ఇటువంటి హీనమైన లైంగిక కార్యకలాపాలకు పనికిరారు అని నిర్ధారణకు రావడానికి వీల్లేదు  అనడానికి  ఈ కేసులో శిక్ష తప్పించుకుంటున్న ఈ బాల నేరస్తుడే సాక్షి. 
తక్కువ వయస్సు కారణంగా శిక్షలు తప్పించుకునే పరిస్తితి ముందు ముందు కూడా కొనసాగితే అందువల్ల మరికొన్ని విషమ పరిణామాలు కూడా చోటుచేసుకునే ప్రమాదం పొంచి వుంటుంది. పిల్లల్ని చేరదీసి,  చిన్నతనం నుంచే ఉగ్రవాద శిక్షణ ఇచ్చే విదేశీ  సంస్థలు,  తప్పుడు సర్టిఫికేట్లతో వయస్సు తక్కువగా చూపించి, వారిచేత ఉగ్రవాద చర్యలు జరిపించే అవకాశాన్ని కూడా కొట్టివేయలేము. అటువంటి వారు ఒకవేళ పట్టు పడినా, ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని, అనతి కాలంలోనే బయటపడి తమ కార్యకలాపాలను తిరిగి కొనసాగించే వీలుంటుంది.
వీటన్నిటినీ  దృష్టిలో  ఉంచుకుని ఆలోచిస్తే,   ప్రస్తుతం వున్న చట్టాలను తగువిధంగా సవరించుకోవాల్సిన అవసరాన్ని ‘ఈ అల్పవయస్కుడి’ విడుదల వ్యవహారం  గుర్తు చేస్తోంది. (19-12-2015)
రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595