7, జూన్ 2015, ఆదివారం

సతీ నీలాంబరి


నీలాంబరితో ఏకాంబరం పెళ్లి పెళ్లున జరిగిపోయింది. మొదటి రాత్రే ఏకాంబరం భార్యతో చెప్పాడు.
'మనం ఇద్దరం ఒక అవగాహనకు వద్దాం. నా మీద నీకు కోపం వస్తే కేకలు వెయ్యి. కానీ అప్పుడు  మనిద్దరం తప్ప మూడో వ్యక్తి వుండకూడదు. నేనూ అలాగే.  మరొకరు వున్నప్పుడు నీ మీద నోరు పారేసుకోను. అండర్ స్టాండ్?'
'అండర్ స్టాండ్. అల్లాగే' అన్నది నీలాంబరం.
భార్య సహకారం చూసిన  ఏకాంబరానికి ఆమె మీద ప్రేమ పూనకంలా తన్నుకు వచ్చింది.  
'నువ్వుంటే నాకు ఈ లోకంతో పనిలేదు. ఎదురుగా  ఎందరు వున్నా నా కంటికి నువ్వొక్కదానివే...' అంటూ గారాలు పోయాడు.
మర్నాడు కాఫీ తాగేటప్పుడు ఏదో విషయం మీద మాటా మాటా  వచ్చి మొగుడ్ని అత్తామామల ముందే కడిగి పారేసింది నీలాంబరి.  ఏకాంబరం బిత్తరపోయాడు. బిక్కచచ్చిపోయాడు.
ఆ రాత్రి వొంటరిగా వున్నప్పుడు  అడిగాడు 'అందరిముందు ఎందుకు అలా వొంటి కాలి మీద లేచావు' అని.
నీలాంబరి గారాలు పోతూ చెప్పింది.
'ఎవరున్నారు అక్కడ? మీరే కదా అన్నారు, ఎదురుగా నేనుంటే ఇక  ఎవరూ  లేనట్టే అని'
ఏకాంబరం మరోసారి బిక్కచచ్చిపోయాడు. 



NOTE: Courtesy Image Owner

ఎన్నేళ్లయిందో ఈ జోకు చదివి

షేర్ చేసిన మిత్రులకు ధన్యవాదాలు




NOTE COURTESY CARTOONIST AND PUBLISHER OF THE JOKE

6, జూన్ 2015, శనివారం

మౌనమె నా భాష ....


“I get intoxication while talking” అన్నాట్ట వెనుకటికి నాలాటి వాడు. మద్యం సేవించినప్పటికంటే కంటే కూడా మాట్లాడుతుంటే నాకు బాగా కిక్కువస్తుందన్నది మా ఆవిడ వువాచ. అదికూడా తోడయితే పట్టేవాళ్ళు వుండరన్నది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం.   అదేవిటో నా వదరుబోతుతనం ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిందన్నది అచ్చంగా  నా సొంత అభిప్రాయం. మాట్లాడడానికి తగ్గ వాతావరణం వుండాలని అప్పుడే మాట బాగా పెగులుతుందని వసకారుడుఏనాడో చెప్పాడు.
చదువుకునే రోజులనుంచి నాకీ మాటల పిచ్చి వుందనీ అందుకే చదువు చెట్టెక్కిందనీ మా పెద్దవాళ్ళు అంటుండగా అనేకసార్లు వినే అదృష్టం నాకు కలిగింది. అయినా వేరే ఆటలకన్నా నాకు మాటల ఆటలుఅంటే వున్న వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు. బహుశా రేడియోలో ఉద్యోగం ఇవ్వడానికి నాకు వున్న అనర్హతలను ఈ అదనపు అర్హత కప్పిపెట్టిందేమో అని అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎస్సారార్ కాలేజీలో నాకంటే వయస్సులోనూ, చదువులోనూ పెద్దవాళ్లయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వుండేవాళ్ళు. కాస్త వీలు దొరికితే చాలు వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు మొదలు పెట్టేవాడిని. శ్రద్ధ, సుధ అనే పేర్లు కలిగిన వాళ్ళిద్దరూ వాళ్ల నోట్సులు రాసిపెట్టేవరకు నా మాటలు విని ఆ తరువాత ఎంచక్కా మంచిది వెళ్ళి రండిఅనేసేవాళ్ళు. అలా అని మాటల వల్ల అసలు ఏమాత్రం ఉపయోగం లేదనే  గొప్ప  అభిప్రాయానికి వెంటనే  రానక్కర లేదు. వెనుకటికి నేను రైళ్ళలో రిజర్వేషన్ లేకుండానే ఈ మాటల మంత్రంతో తేలిగ్గా ప్రయాణాలు చేసేవాడిని. నిలుచుని కాసేపు కూర్చున్న వాళ్ళతో మాటలు కలిపేవాడిని. ఆ తరువాత వాళ్లు మాటల మైకంలో పడిపోయి  అదేమిటి మాస్టారు అలా నిలబడేవున్నారు వచ్చి ఇలా కూర్చోండిఅని జాగా ఇచ్చేవాళ్ళు. కొండొకచో మరికొందరు శ్రోతలు మరీ మొహమాట పడిపోయి నా మాటలు వింటూ వాళ్లు లేచి నిలబడి నాకు కూర్చునే జాగా ఇచ్చేవాళ్ళు. రేడియో ఉద్యోగంలో చెప్పక్కర లేదు. ఆఫీసుకి  పోవడమే గగనం కాని వెళ్ళానంటే చాలు న్యూస్ యూనిట్ చిన్న సభా ప్రాంగణంగా మారిపోయేది.  
అలాటి ఘన చరిత్ర కలిగిన  నేను ఈ నడుమ యెందుకు మాటలాటలు  తగ్గించానని మా ఆవిడ సయితం అనుమానిస్తోంది. వున్నట్టుండి ఈ వయస్సులో అంటే అరవై  ఎనిమిది దాటిన  తరువాత మా  ఆయనకు కాసింత పెద్దమనిషితనం కానీ  రాలేదు కదాఅని బోలెడు బోలెడు సంతోషం కూడా  పడిపోతోందష. తెలుగు  సీరియళ్ల ప్రోత్సాహాక ఉద్యమంలో మునిగిపోయి టీవీల్లో రాజకీయ చర్చలు పట్టించుకోకపోవడంవల్ల ఆవిడకు ఈ జ్ఞానోదయం ఆలశ్యం అయిందని నా అనుమానం.
నిజమే. టీవీ చర్చావేదికల్లో ఒకరిని మించి మరొకరు  దూషణలతో కూడిన తిరస్కారాలవల్ల కలిగిన మాత్సర్యసహిత ప్రేలాపనలు పక్కన కూర్చుని వినీ వినీ   నాకు మాట పడిపోతోందని ఆవిడకు తెలవదు.

అందుకే అన్నారు - 

అంతయు మన మేలునకే.
NOTE: Courtesy Image Owner  

అమావాస్య చంద్రులు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 07-06-2015, SUNDAY)  

చంద్రుడు ఎంతో కాంతివంతం అయితేనే కాని అమావాస్యనాడు కనిపించడు. ఇప్పుడు రెండు కొత్త తెలుగు రాష్ట్రాలను ఇద్దరు చంద్రులు పాలిస్తున్నారు. కేవలం అనుభవం, సమర్ధత కారణంగానే ప్రజలు వారిద్దర్నీ ఈ గద్దెలు ఎక్కించారు. అనుభవంలో కాని, రాజకీయ చాణక్యంలో కాని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఒకరికొకరు ఏమాత్రం  తీసిపోరు. వీరికి వున్న ఈ సానుకూల లక్షణాలు అన్నీ జనరంజకమైన పాలనకు దోహదం చేసి తీరాలి. మరి ఏడాది కాలం గడచిపోయింది కానీ జనాలు కోరుకున్నది ఏమన్నా జరిగిందా?
నిజానికి వీరిద్దరూ తమ తమ పరిధుల్లో, తమ ఆలోచనలకు తగ్గట్టు సుపరిపాలనకు పధకాలు రచిస్తూ పోయిన మాట నిజమే. ఎన్నికలకు ముందు చేసిన సవాలక్ష వాగ్దానాల బెడద లేకపోతే మరిన్ని మంచి ఫలితాలను ఇప్పటికే రాబట్టి వుండేవారేమో కూడా. అయితే ఆ హామీల్లో  కొన్ని ముందరి కాళ్ళకు బంధాలై కూర్చున్నాయి. ఉదాహరణకు  రైతుల రుణ మాఫీ. హామీ నెరవేర్చాము అని చెప్పుకోవడానికే కిందెత్తు, మీదెత్తు అయ్యారు. తీరా చేసారా అంటే ఏదో అరకొర అని అందరూ మెటికలు విరిచేవాళ్ళే  కాని, చెప్పింది మొత్తం చేసి చూపెట్టారు అనుకోవడానికి ఏమీ  లేదు. షరతులు వర్తిస్తాయి అనే వాణిజ్య ప్రకటనల మాదిరి మొత్తం మీద ఏదో పని పూర్తి చేశాం అని చేతులు దులుపుకోవాల్సిన  స్తితి.
హామీల అమలు నూటికి నూరు శాతం పూర్తిగా పూర్తి చేయలేకపోవడానికి కూడా వారి కారణాలు వారికి వున్నాయి. కొత్త రాష్ట్రాల్లో వూహించని  కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. కొన్ని స్వయంకృతాలు. మరికొన్ని  ప్రకృతి ప్రసాదాలు.
రెండో అంశం వారి చేతిలోనే కాదు, ఎవరి చేతిలోను లేదు. ఇక మొదటిది స్వయంకృతం. ఎవరినీ నిందించి ప్రయోజనం లేదు. ఈ రెండింటి మధ్యా వారిద్దరూ కొన్ని పనులు చేసుకుంటూ పోయారు. ఏడాది గడిచిన తరువాత కూడా, ఇద్దరు ముఖ్యమంత్రుల పాలనపై ప్రతిపక్షాలను మినహాయిస్తే, ప్రజల్లో అంతగా వ్యతిరేకత కానరాక  పోవడానికి బహుశా అడపా దడపా చేస్తూ వచ్చిన కొన్ని మంచి పనులే కారణం కావచ్చు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అద్భుతం చేసి చూపెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణా ప్రాంతం విద్యుచ్చక్తి కొరతతో చీకటి మాయం అయిపోతుందని ఆరోజుల్లో భయపెట్టిన వాళ్లు వున్నారు. భయపడిన వాళ్ళూ వున్నారు. అయితే మండించిన వేసవిలో కూడా ఈసారి విచిత్రంగా కరెంటు సరఫరా జరిగిన తీరు చూసి ప్రత్యర్దులే చాటుగా నోటి మీద వేలు వేసుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కొత్త రాజదానికోసం వేలాది ఎకరాలను ప్రజలనుంచి సమీకరించగలిగారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కాని భూమి పూజ క్రతువు కూడా పూర్తిచేసి అనుకున్నది చేసి, కొత్త రాజధానిని  అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి తీరుతాననే కొత్త ఆశలను చిగురింప చేశారు. అది జరిగితే అదొక పరమాద్భుతం అవుతుంది.
ఇద్దరు ముఖ్యమంత్రులు సాధించిన విజయాలు మరికొన్ని లేకపోలేదు. పత్రికా ప్రకటనల్లో కనిపించిన జాబితాలు కొంత అతిశయోక్తిగా వున్నప్పటికీ పరవాలేదు అడుగులు సరిగానే, సరైన దిశలోనే పడుతున్నాయన్న ఆశలు కలుగుతున్నాయి.

పోతే, మరికొన్ని అంశాలు వారి అనుభవానికి, విజ్ఞతకు అనువుగా లేని మాట వాస్తవం. రాష్ట్రాలు ఏర్పడి, నూతన ముఖ్యమంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచీ, ఆ ముహూర్త బలం ఎలాటిదో కాని, ఇరువురి నడుమ పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్తితి. ఏవిషయం తీసుకున్నా, వివాదం కానిది లేదు. ఏ సమస్య తీసుకున్నా సానుకూలంగా పరిష్కారం అయ్యింది లేదు. ఈ వివాదాలకు ఎవరు ముందు తెర తీసారు అనేది పక్కనబెడితే, వాటికి తెరదించడం యెట్లా అనే విషయంలో ఎవరు ముందు చొరవ చూపుతారు అనే ప్రశ్న జవాబు లేకుండానే మిగిలిపోయింది.  ఏరోజు పేపరు తిరగేసినా చిటపటలే! ఏ టీవీ పెట్టి చూసినా పటపటలే! పిల్లలు ఆసక్తిగా చూసే టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఫిలిం మాదిరిగా అనుక్షణం ఒకరిపై మరొకరు పై చేయి అనిపించుకోవాలనే తాపత్రయమే కానవస్తోంది. ఆ కార్టూన్ చిత్రాల్లో వినోదం వుంది. కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల 'పొడగిట్టని' పోరాటవైఖరి అనేకమందికి మనస్తాపాన్ని కలిగిస్తోంది. ఈ అనేకమందిలో వారిద్దరి సమర్ధత పట్ల అచంచల విశ్వాసం కలిగిన వారి వీరాభిమానులు కూడా వున్నారన్నది వాస్తవం.
ముందు పేర్కొన్నట్టు ఏడాదిలో ఏమి ఆలోచించారో, ఏమేమి పధకాలకు రూపకల్పన చేశారో అవన్నీ ఒక తీరుకు వచ్చి అమలుకు నోచుకునే తరుణంలో, రెండు రాష్ట్రాల అవతరణ దినోత్సవం, లేదా దీక్షా దినం ఏ పేరు పెట్టినా ఏడాది పుణ్యకాలం పూర్తయి రెండో ఏట అడుగు పెట్టే సమయంలో చోటుచేసుకున్న కొన్ని ఉదంతాలు వారికే కాదు మొత్తం రాజకీయ వ్యవస్థకు సయితం మేలు చేసేవి కాదు. ఈ సంఘటనలతో ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రత్యక్ష ప్రమేయం వుండకపోవచ్చు. కానీ తమ హయాములో జరిగిన ఇటువంటి పరిణామాల విషయంలో వారు ఎంతో కొంత బాధ్యత తీసుకోవాలి. జరిగిన దానిని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని చూడడం ఈనాటి రాజకీయ విలువల ప్రకారం గర్హ్యనీయం కాకపోవచ్చు. అయినా కాని, కొన్ని సందర్భాలలో రాజకీయాన్ని పక్కనబెట్టి చూసే సుగుణం నాయకులకి వుండితీరాలి. అలా కాక మొండిగా వ్యవహరించడం వల్ల వారి పేరు ప్రతిష్టలు పలచపడే ప్రమాదం వుంటుంది.                   

కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ గ్రామరు చెప్పడానికి ఒక లెక్చరర్ వుండేవాడు. పిల్లలు ఆయన క్లాసులో తెగ అల్లరి చేసేవాళ్ళు. ఆయన ఒకటే అనేవాడు.'పిల్లలూ. మీరు ఎలాగు గోలచేయకుండా వుండలేరు. కనీసం కాస్త తగ్గించి అల్లరి చేయండి'అని.
ఆయన అన్నట్టు ఈనాటి రాజకీయాల్లో కూడా  విలువల్ని అతిగా ఆశించలేము. విలువలతో రాజకీయం చేయడం ఇప్పుడెక్కవ్వరికీ సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే, చెప్పేది ఒక్కటే, కనీస విలువల్ని కాస్త కాపాడండి, అమావాస్యనాడు కూడా కనబడే చంద్రుడి మాదిరిగా మీ ప్రతిభను ప్రదర్శించండి అని మాత్రమే. (06-06-2015)

రచయిత ఈ మెయిల్:  bhandarusr@gmail.com మొబైల్:  98491 30595                

5, జూన్ 2015, శుక్రవారం

కొన్ని ముదురు ఇంగ్లీష్ జోకులు



"వెల్డింగ్ (అతుకు వేసేటప్పుడు) చేసేటప్పుడు ముందు రవ్వలు వస్తాయి. తరువాత అతుకు పెట్టిన రెండూ గట్టిగా అటుక్కుపోతాయి. అదే వెడ్డింగ్ లో ముందు ఇద్దరు వ్యక్తుల నడుమ బంధం ఏర్పడుతుంది. తరువాత ఆగకుండా రవ్వలు వస్తాయి"
"చుట్టూ చీకట్లు కమ్ముకుంటే తొలగించమని ముందు దేవుడ్ని ప్రార్ధించండి. ఫలితం లేనిపక్షంలో వెంటనే వెళ్ళి కరెంటు బిల్లు కట్టి రండి"
"ఎవడయినా భార్యకు కారు డోరు తెరిచిపట్టుకున్నాడు అంటే అతగాడికి కారు అన్నా కొత్తది కావాలి. భార్య అయినా కొత్తది అయుండాలి"   
"మనసు ఉద్రిక్తం కావడం, ఆందోళన కలగడం,  భయం వేయడం ఇవన్నీ  వేర్వేరు సందర్భాలలో అనుభవానికి వస్తాయి. భార్య కడుపుతో వున్నదని కబురు వింటే మనసు  సంతోషంతో ఉద్రిక్తం అవుతుంది. స్నేహితురాలు నెల తప్పిందని తెలిస్తే గాభరా, ఆందోళన తప్పవు. ఇద్దరూ గర్భం ధరించారన్న వార్త ఒకేసారి తెలిసింది అనుకోండి. ఇకచెప్పేది ఏముంది, గాభరా ఆందోళనా, భయం ఇత్యాదివన్నీ ఒకేసారి ఆవహిస్తాయి"
"గ్రామరు పీరియడ్ లో టీచరు పాఠం చెబుతూ చింటూని అడిగింది.
'ఈ పీరియడ్ కు వున్న ప్రాధాన్యత తెలుసా' అని.
చింటూ చెప్పాడు.
'సరిగ్గా తెలియదు కానీ మేడం, ఒకసారి ఇంట్లో ఈ మాట విన్నాను. మా చెల్లెలు అమ్మతో ఈనెల పీరియడ్ రాలేదని చెబుతోంది. అది విని మా అమ్మ స్పృహ తప్పింది. నాన్నకు గుండెపోటు వచ్చింది. మా డ్రైవర్ పత్తా లేకుండా పోయాడు'
చింటూ తండ్రిని అడిగాడు, నమ్మకానికి రహస్యానికి అర్ధం ఏమిటని. తండ్రి బదులు చెప్పాడు.

'నువ్వు నా కొడుకువి. ఆవిషయం నమ్మకంగా చెప్పగలను. అదిగో ఆ పక్కింట్లో నీ స్నేహితుడు వున్నాడు చూడు. వాడూ నా కొడుకే. కాని అది రహస్యం. పైకి చెప్పుకోలేను'  
NOTE: Image courtesy: Instant humour.com 

3, జూన్ 2015, బుధవారం

Aditya the great

Full story published in FORBES about Aditya Krishna Roy Vanam, only son of my friend Vanam Jwala Narasimha Rao and my niece Smt Vijaya Lakshmi - "Square is looking to grow if a recent hire is any indication.


(VANAM ADITYA KRISHNA ROY)


On Monday night, former Google GOOGL +0.92% executive Aditya Roy announced on his LinkedIn profile that he had joined the payments company to head up recruiting, human resources and diversity initiatives as its “Head of People.” Roy had been previously been working as Google’s director of people operations in the Asia Pacific region out of Singapore.

With more than 1,000 people in places including San Francisco, Tokyo and Melbourne, Square has gone from a startup that focused mainly on payment processing to a company offering a variety of small businesses services including loans, marketing and restaurant delivery. While the company came under heavy scrutiny last year after reports said that it was performing poorly had lost $100 million in 2013, the hiring of Roy suggests a different narrative as Square looks to expand and bolster its workforce.

“Adi bring to Square more than 15 years of people experience and a deep understanding of what it takes to build a strong, global organization,” said a Square spokesperson in an email.

Before joining Square, which raised $150 million in October at a $6 billion valuation, Roy spent almost 10 years at Google. He started there as a human resources manager in his native India after previously working at Dell and Career Launcher, an education startup. Roy officially started his new job on Monday, according to LinkedIn, and is based out of Square’s San Francisco headquarters.

The Square spokesperson did not comment on the company’s current financial performance, though CEO Jack Dorsey said in a recent interview with Buzzfeed that previous rumors of the company’s downward spiral were wrong. “The most negative press—the loss, the acquisition, the IPO—was just not based on reality,” he said. “We invested our money to grow the company, which every single company out there does. We chose not to focus on profit in order to focus on growth.”


“I think the biggest thing that the year of bad press put upon us and focused us on was how important it is to make sure that we have not just an internal cohesion but an external cohesion, and that there are visible connections between everything that we’re doing,” he added."

NOTE COURTESY FORBES.COM)

వెలుగు నీడల నడుమ చంద్రబాబు ఏడాది పాలన

(Published in 'SURYA' telugu daily,  on 03-06-2015, Thursday)   

దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. చేజారిన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం  గత ఏడాదిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం  లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి. కాకపొతే,  దిక్కూ దివాణం లేకుండా ఏర్పడ్డ లేదా వేరుపడ్డ ఆంధ్రప్రదేశ్ అనే కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అనే ఓ కొత్త రికార్డు  మాత్రం చంద్రబాబు ఖాతాలో చేరింది. ఇది మినహాయిస్తే ఆయన   సమస్యల అమావాస్యల్లో కూరుకుపోయిన చంద్రుడిగానే వుండిపోయారు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయన్ని  చుట్టుముడుతూనే వస్తోంది. ఒకదాని చిక్కుముడి విప్పేలోగా మరోటి సిద్ధం. పూర్వం అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్ళ పైచిలుకు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో,  'తన హయాములోనే ఇంతగా అభివృద్ధి చేసాను, తీర్చిదిద్దాను' అని అయన పదేపదే  చెప్పుకునే 'ఇల్లు' తనది కాకుండా పోయింది. సొంత ఇంట్లోనే కిరాయికి వుంటూ కొత్త యింటిని చక్కదిద్దుకోవాల్సిన దుస్తితి. అధికారంలోకి వచ్చిన కొత్త రోజులన్నీ పాత వాగ్దానాలను నెరవేర్చడం యెట్లా అన్న అంతర్మధనంలోనే గడిచిపోయాయి. ముఖ్యంగా రైతుల రుణ మాఫీ అంశం ఆయన సమర్ధతతకు సవాలుగా మారింది. ఈ మాట నిలబెట్టుకోవడం అంత సులువయిన పనేమీ కాదు. ఎందుకంటే పరిష్కారం ఆయన ఒక్కరి చేతుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు, రుణాలు ఇచ్చిన స్థానిక బ్యాంకులు సహకరిస్తేనే కాని కుదరని సమస్య ఇది. నిజానికి రైతులు చంద్రబాబుకు వోటు వేయడానికి ఈ వాగ్దానం ఓ మేరకు దోహదం చేసివుండవచ్చు కానీ టీడీపీ  అధికారంలోకి రావడానికి మార్గాన్ని  సుగమం చేసింది  రాష్ట్ర విభజన అంశం ఒక్కటే.  అందుకే నిరుటి ఎన్నికలకు కొన్ని వారల ముందు వరకు  దాదాపు అన్ని సర్వేల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కూడా  అసలు ఎన్నికలు వచ్చేసరికి సీను మొత్తం మారిపోయింది. విభజన నిర్ణయం అనంతరం  ఎన్నికలు జరిగాయి. జీర్ణించుకోలేని విధంగా ఆ విభజన జరిగిందన్న ఆక్రోశంలో వున్న సీమాంధ్ర ప్రజలు, సంక్షేమ కోణాన్ని పక్కనబెట్టి 'సమర్ధత' అన్న ఒక్క అంశాన్నే పరిగణన లోకి తీసుకుని చంద్రబాబుకు పట్టం కట్టారు. తీడీపీ అధికారంలోకి వచ్చింది.


అసలే తరుగు బడ్జెట్లో పురుడు పోసుకున్న కొత్త రాష్ట్రానికి రైతుల  రుణ మాఫీ వంటి పెనుభారం మోసే పరిస్తితిలేదు. కానీ చంద్రబాబు దేన్నీ లెక్కచేయకుండా తన యావత్ శక్తియుక్తులను ఈ హామీ అమలుకే ఖర్చుచేశారు. నిజానికి వున్న వాస్తవాల్ని విడమరిచి చెబుతే ప్రజలు అర్ధం చేసుకునే పరిస్తితి మొదట్లో వుంది కూడా. అయినా ఆయన, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న రాజకీయ నాయకుడి తరహాలోనే ముందుకు పోయారుకానీ, రాజనీతిజ్ఞుడి మాదిరిగా వ్యవహరించలేదని అనిపిస్తోంది. అలవికాకపోయినా మొత్తం మీద పని అయిందనిపించారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కని చందం అయింది. ప్రభుత్వం ఎన్ని చెప్పినా ఈ వాగ్దానం అమలు అరకొర చందమే అనే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్తితే ఇంకా వుంది. అధికారంలో వున్నవాళ్ళు హరా యించుకోలేని వాస్తవం ఇది. అసలు వాస్తవాలను ప్రజలకు సరిగ్గా వివరించి వుంటే విభజన తీరుతో మానసికంగా గాయపడివున్న ప్రజలు ఖచ్చితంగా సహకరించి వుండేవారు అనే ఒక వాదన కూడా వుంది.
హుద్ హుద్ తుపాను ఉత్తరాంధ్రను ఒణికించి వెళ్ళింది కానీ, చంద్రబాబు పాలనాసమర్ధతకు కొలమానంగా నిలిచింది. ఆ తుపాను సృష్టించిన భీభత్సం నుంచి త్వరత్వరగా బాధిత ప్రాంతాలను బయటపడేసిన తీరు, పునరావాస, పునర్నిర్మాణ విషయాల్లో సత్వరం స్పందించి తీసుకున్న చర్యలు  చంద్రబాబుకు ప్రజల్లో మంచి  పేరు కట్టబెట్టాయి. వృద్ధ వికలాంగులకు పెన్షన్లు,  ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు, ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు ఇటువంటి వాటిని సంత్రుప్త స్థాయిలో పెంచుతూ తీసుకున్న  నిర్ణయాలు టీడీపీ ప్రభుత్వ ప్రతిష్టను కూడా ఇతోధికంగా పెంచాయి.
రాజధాని అంశం చంద్రబాబుకు కలిసి వచ్చిన మరో విషయం.
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ రాని అపూర్వ అవకాశం చంద్రబాబు నాయుడుకి కొత్త రాజధాని విషయంలో లభించింది. కొంత వివాదాస్పదం అవుతున్నప్పటికీ ఈ విషయంలో కూడా చంద్రబాబు తన పంధాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం కనుక ఆయన ప్రయత్నాలకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కానరాని మాట నిజమే. కాకపోతే కొత్త రాష్ట్రానికి వుండే ఇబ్బందులను ప్రజలు అర్ధం చేసుకుని సహకరిస్తున్నారు కానీ  ఇష్టపూర్తిగా కాదన్న వాస్తవాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం రాష్ట్ర ప్రజలకు అవసరమైన రాజధాని వంటి అతి ముఖ్యమైన విషయంలో ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకుని వుంటే మరింత హుందాగా వుండేది.
ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి తొలిరోజుల్లో అన్నీ మంచి శకునాలే. అన్నీ కలిసివచ్చిన అంశాలే. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, టీడీపీకి మిత్రపక్షం. ఇక్కడా, అక్కడా ప్రభుత్వంలో భాగస్వామి. ఢిల్లీ లో ఇతర పక్షాల కంటే టీడీపీ మాటే ఎక్కువగా చెల్లుబడి అవుతుంది. అందుకే ఏ అవకాశాన్ని ఒదులుకోకుండా పార్టీకి, రాష్ట్రానికి పనికి వచ్చే ప్రతి పనీ చేయడానికే చంద్రబాబు ఆయన అహరహం కష్టపడుతుంటారు. కష్టపడుతున్నట్టు కానవస్తారు. 'పని చేయడంతో సరిపోదు పనిచేసినట్టు కనబడాలి కూడా' అనే ఈ కాలపు రాజకీయానికి నిజానికి ఆయనే ఆద్యులు.
ఎన్ని చేస్తున్నా, ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్నా ఇంకా కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే వున్నాయి.రాజ్యం వుంది రాజధాని లేదు. ఖజానా వుంది. నిధులు లేవు. కేంద్రంలో మిత్ర ప్రభుత్వం వుంది. అయినా ఆశించిన విధంగా అక్కరకు రావడం లేదు. పాలించే ప్రజలు పొరుగు రాష్ట్రంలో. పాలించే ప్రభుత్వం ఇరుగు పొడగిట్టని పొరుగు రాష్ట్రంలో. ఇదొక విచిత్రమైన పరిస్తితి. గతంలో ఏ ప్రభుత్వానికీ ఎదురుకాని దుస్తితి.  ప్రభుత్వం మీద, పాలకుల పని తీరు మీద ప్రజల్లో విరక్తి మొదలు కావడానికి ఇవి చాలు. అయితే, ఎదురయిన ప్రతి సమస్యను తనకు అనుకూలంగా మార్చుకునే చాణక్యచాకచక్యానికి చంద్రబాబు పెట్టింది పేరు. అదేమిటో  ఈ తడవ సమస్యలే ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. నిజానికి,  ఏ సమర్ధత కారణంగా ఆంధ్ర ప్రాంతపు ప్రజలు ఆయనకు పట్టం కట్టారో ఆ సమర్ధత సమస్యల పరిష్కారానికి పనికి రావడం లేదు. అయినా కానీ,  'ఇన్ని ప్రతికూలతల నడుమ ఎవరు మాత్రం ఇంతకంటే ఎక్కువేమి చేయగలరు? కాళ్ళూ చేతులూ బంధించి పరిగెట్టమంటే సాధ్యమా?'  అనే  సానుభూతి మాత్రం ప్రజల నుంచి లభిస్తోంది. ఈ ఒక్క విషయంలో చంద్రబాబు అదృష్టవంతుడు అని చెప్పాలి.   
ప్రభుత్వానికి ప్రజలు కొమ్ము కాస్తున్నట్టు కనబడడానికి వేరే కారణాలు వున్నాయి. విభజన  జరిగిన తీరు పట్ల సీమాంధ్ర ప్రజానీకం లోలోపల ఉడికిపోతోంది. అన్యాయం జరిగిపోయిందని మధన  పడుతోంది. ఒకరకంగా చెప్పాలంటే విభజనకు పూర్వం తెలంగాణా ప్రాంతంలో మెజారిటీ ప్రజలు ఇలాగే బాధపడుతూ వచ్చారు. అదే టీ. ఆర్.యస్. పార్టీకి, దాని నాయకుడు కేసీఆర్ కు వరప్రసాదంగా మారింది. భావోద్రేకంతో కూడిన ఆ అంశం ముందు మిగిలిన అంశాలన్నీ వెలతెలా పోయాయి. ప్రస్తుతం సీమాంధ్రలో దాదాపు అదే పరిస్తితి. తమ ఈ స్తితికి వేరెవరో కారణం అని వారు రగిలిపోతున్నారు. ప్రజల నాడిని ఒడపోసిపట్టుకునే చంద్రబాబుకు ఈ విషయం బాగా అర్ధం అయింది. అందుకే ఆయన ఏం చేసినా ఏం చేయకున్నా ఈ ఒక్క భావోద్రేకం చల్లారకుండా చూసుకుంటే చాలు. తెలంగాణాలో సరిగ్గా కేసీఆర్ ఇదే చేసి చూపించారు. ఇంకా చూపిస్తున్నారు కూడా.
అయితే ఒక విషయం పాలకులు గుర్తు పెట్టుకోవాలి. ప్రాంతీయ వైమనస్యాలు  రాజకీయంగా ఉపయోగపడవచ్చు. కానీ ఆ ప్రయోజనం తాత్కాలికం. దీర్ఘ కాలికంగా  ఉపయోగపడే రాజకీయ ఎత్తుగడ అనిపించుకోదు. పైగా రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మరింత అఘాధాన్ని. అనుమానాలను  పెంచే ప్రమాదం కూడా వుంటుంది.    
ప్రజలు, రాజ్యాంగం ఇచ్చిన అయిదేళ్ళ గడువులో ఏడాది కాలం చూస్తుండగానే కనుమరుగు అవుతోంది. సర్కారు లెక్కల ప్రకారం చేసినవి చాలా వుండవచ్చు. కానీ ప్రజల లెక్కలు వేరే వుంటాయి. ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు వున్న పరిస్తితిలో అక్కడి ప్రజలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే అవకాశం ఇచ్చి చూస్తున్నారు. కొంత కాలం పరవాలేదు. కానీ ఎల్లకాలం వాళ్ల తీరు ఇలాగే వుండక పోవచ్చు. తీరుతెన్నులు మారిపోవడానికి  హఠాత్తుగా వూడిపడే అనేక అంశాలు దోహదపడతాయి. తాడనుకున్నది పాము కావచ్చు. తాడుని చూసి పామని భ్రమిస్తే కొంత జాగ్రత్త పడవచ్చు. పాముని తాడనుకుని నిర్లక్ష్యం చేస్తేనే ప్రమాదం.
ఉదాహరణకు తెలంగాణాలో శాసనమండలి సభ్యుల ఎన్నిక వ్యవహారం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేరారంటూ ఇటు టీడీపీ, అటు టీ.ఆర్.యస్. పరస్పరం నిందారోపణలు చేసుకున్నాయి. 'చాలా దారుణం' అని ఇరుపక్షాలు అంటున్నాయి. సభలో వున్న సంఖ్యాబలానికి మించి అభ్యర్ధులను పోటీకి దింపడం అనైతికం అని టీడీపీ అంటుంటే, ఇలా కోట్లు పోసి ఒక్క ఓటు కొనే ప్రయత్నం చేయడం నీతిబాహ్యమని టీ.ఆర్.యస్. అంటోంది. అయితే ఇక్కడ ఒక విషయం  గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఎవరయినా గెలుపు కోసం ఓట్లు కొనుగోలు చేస్తారు. కానీ ఇక్కడ సీను రివర్స్ అయింది. టీ.ఆర్.యస్. ఐదో అభ్యర్ధి గెలవకుండా చూడ్డానికి బేరసారాలు జరిగాయి. టీవీల్లో కానవచ్చిన దృశ్యాల్లో, వినవచ్చిన సంభాషణల్లో ఈ విషయం ధృవపడింది.  ఈ కారణం చేతే ఈ సంఘటన జరగడానికి పూర్వం వరకు టీడీపీ  మీద వున్న సానుభూతి  ఆ తరువాత గాలికి కొట్టుకు పోయింది. టీడీపీ అంటున్నట్టు  ఇది రాజకీయ కుట్రే. కాదనలేము.  కాని ఆ కుట్రలో తనకు తానుగా  యెందుకు చిక్కుకు పోయిందని అడిగితె దానికి  టీడీపీ వద్ద సరయిన సమాధానం లేకుండా పోతోంది. అంచేతే అది నలుగురి దృష్టిలో  ముద్దాయిగా నిలబడాల్సివస్తోంది. ఎంతో రాజకీయ అనుభవం వున్న టీడీపీ అధినాయకత్వానికి ఇది స్వయంకృతమే. నవ నిర్మాణ దీక్షకు ముందు చేజేతులా అంటించుకున్న ఈ మురికిని సాధ్యమైనంత త్వరగా  ఒదుల్చుకోవాలి, అంతే కాని ప్రతిష్టకు పోయి మరింత అప్రతిష్ట మూటగట్టుకోకూడదు.  (03-06-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595