24, డిసెంబర్ 2014, బుధవారం

'భారత రత్న' అటల్ బిహారీ వాజ్ పేయీ

మరవతగని మనిషి మరపున పడుతున్నారా!
(బీజేపీ అగ్రనాయకుడు శ్రీ వాజ్ పేయీ కి మోడీ ప్రభుత్వం 'భారత రత్న' పురస్కారం ప్రకటించిన సందర్భంలో గుర్తుకు వచ్చిన 15-4-2014 నాటి పాత వ్యాసం)
యాభయ్ ఐదేళ్ల  పైమాటే. అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు. ఆరోజుల్లో గాంధీనగరం మునిసిపల్ స్కూలు ఆవరణలో ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు. ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్తిర పాలన అందించిన ప్రధాని వాజ్ పాయ్.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సర్వేలు, రాజకీయ విశ్లేషకులు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపు తధ్యం అని కోడై కూస్తున్న సమయంలో ఒకనాడు అ పార్టీకి పెద్దదిక్కు అయిన వాజ్ పాయ్ ఇప్పుడు ఎక్కడ వున్నారు, యెలా వున్నారు అన్నది జనంలో చాలామందికి తెలియని విషయం.  తెలుసుకుంటే మరింత బాధ కలిగించే ఈ సంగతులను గత నెలలో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రచురించింది. ఆ కధనాన్ని సంక్షిప్తం చేస్తే:
ఢిల్లీ లోని అశోకా రోడ్డులో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం వుంది. ఎప్పుడూ నాయకులు, కార్యకర్తలతో సందడిగా వుండే ఆ ప్రదేశానికి అయిదే అయిదు నిమిషాల నడక దూరంలో కృష్ణ మీనన్ మార్గ్ లోని ఓ  బంగ్లా  ఎస్పీజీ కాపలాలో కానవస్తుంది. అందులోకి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. బయటకు వచ్చేవాళ్ళు అంతే. నీరవ నిశ్శబ్ధం తాండవించే ఆ భవనంలో చక్రాల కుర్చీలో కూర్చుని ఒక వృద్ధుడు టీవీలో వార్తలు చూస్తూ, పత్రికల్లో ప్రధాన శీర్షికలు చదువుతూ కానవస్తారు. తన వాగ్దాటితో ప్రత్యర్ధులను ఆకట్టుకున్న ఒకనాటి నేత వాజ్ పాయ్ ఆయనే అంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే.
ఆయన ఏదో కష్ట జీవితం గడుపుతున్నారని కాదు కానీ ఆయన  ప్రస్తుత జీవన శైలి గమనించినప్పుడు ఎవరికయినా మనసు కష్టపడుతుంది.

వాజ్ పాయ్ కవితలు రాస్తారు. వాటిని వినడానికి ఒకప్పుడు పార్టీ నాయకులు ఎగబడేవారు. ఇప్పుడు ఆ ఇంటి గడప తొక్కేవారే కరువయ్యారు. క్రమం తప్పకుండా వచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు వాజ్  పాయ్ కి అరవై ఏళ్ళుగా తెలిసిన ఎన్ ఎం గటాతే కాగా మరొకరు బీజేపీ మూలస్థంభాల్లో ఒకరయిన ఎల్ కే అద్వానీ.   పార్టీ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన బీ సీ ఖండూరీ కూడా అప్పుడప్పుడు వచ్చి వాజ్ పాయ్ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తెను అడిగి తెలుసుకుంటూ వుంటారు. పోతే, మాజీ ప్రధాని జన్మదినాన్ని గుర్తుపెట్టుకుని వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి వెళ్ళే వ్యక్తి మరొకరు వున్నారు. ఆయనే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.
వారానికి ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్ళే ఆయన స్నేహితుడు గటాతే  చెప్పేదాని  ప్రకారం ప్రస్తుతం వాజ్ పాయ్ రోజువారీ దినచర్యలో  ఎక్కువ సమయం ఫిజియో తెరపిష్టులతో గడిచిపోతుంది. మాట సరిగా రాకపోవడం వల్ల సంభాషణల్లో పాలుపంచుకోలేరు. పత్రికలు చదవరు కానీ హెడ్ లైన్స్ తిరగేస్తారు.
భాష అర్ధం కాని  వారిని సయితం  తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.

(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)


23, డిసెంబర్ 2014, మంగళవారం

బీజేపీలో విజయోత్సాహం ఎటు దారి తీస్తుంది ?

PUBLISHED BY'SURYA'TELUGU DAILY IN ITS EDIT PAGE ON 25-12-14,THURSDAY  
 (Revised Copy after poll results)
జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు, దేశ వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ముఖ్యంగా  రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలకు 'వేక్ అప్ కాల్స్' (అలారం గంటలు, లేదా వార్నింగ్ బెల్స్  అని అర్ధం చెప్పుకోవచ్చు) వంటివి. జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని, కాశ్మీర్లో ఎవరూ ఊహించలేని విధంగా రెండో పెద్ద పార్టీగా అవతరించగలదని  ఎక్జిట్ పోల్ సర్వేలు ముందస్తుగానే వెల్లడించాయి. కొంచెం అటూ ఇటూగా అసలు ఫలితాలు కూడా ఆ ఊహాగానాలకు దగ్గరగానే వున్నాయి. కాశ్మీర్ లోని 'దాల్ సరస్సులో కమలాలు పూయించాలని' బీజేపీ  పెద్ద ప్రయత్నమే చేసింది. అనేక దఫాలుగా జరిగిన ఈ ఎన్నికల సమయంలోనే కాదు, ప్రధాని పదవిని స్వీకరించిన తరువాత మోడీ ఎన్నిసార్లు కాశ్మీర్ లోయని సందర్శించింది అందరికీ తెలుసు. ప్రయత్నాలు పూర్తిగా ఫలించకపోయినా, కాశ్మీర్ లో కమల దళాలు విభ్రమం కలిగించే రీతిలోనే  విచ్చుకున్నాయని వొప్పుకోక తప్పదు. పీడీపీ అతిపెద్ద పార్టీగా, తరువాతి స్థానంలో రెండో అతిపెద్ద పార్టీగా  బీజేపీ అవతరించాయి కాబట్టి  సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సివస్తే  ఈ రెంటి మధ్యనే పొత్తు కుదరాలి. ఎందుకంటె కాంగ్రెస్ ఎట్లాగు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు, అల్లాగే, నేషనల్ కాంగ్రెస్ పీడీపీకి  కొమ్ముకాయదు.
ఫలితాలు ఓ పక్క వెలువడుతూ ఉండగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,  ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తుందని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల కనీస సంఖ్యాబలం వుంది కాని కాశ్మీర్ లో ఏపార్టీకి సొంతంగా సర్కారు ఏర్పాటుచేసే బలం సమకూరలేదు. పేరుకు బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిది కాని గెలుచుకున్న పాతిక సీట్లు అందుకు ఏమాత్రం సరిపోవు. అయినా ప్రభుత్వం ఏర్పాటుపై స్వయానా బీజేపీ అధ్యక్షుడే ప్రకటన చేయడం సంకీర్ణం పట్ల ఆశలు పెంచింది. పీడీపీ ఇరవై ఎనిమిది స్థానాలతో మొదటి స్థానంలో వుంది  కాని మేజిక్ సంఖ్య నలభై నాలుగుకు అది చాలా తక్కువ. కేంద్రంలో అధికారంలో వుంది కాబట్టి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన పొత్తుల విషయంలో బీజీపీదే సహజంగా పై చేయి అయ్యే అవకాశం ఎలాగూ వుంటుంది.
జమ్మూ కాశ్మీర్ లో వోట్ల శాతం తో పాటు సీట్ల సంఖ్య  కూడా పెరగడం భారతీయ జనతా పార్టీకి ఊరట కలిగించే విషయమే. 'ఏకే ఫార్టీ సెవెన్లు కాదు ప్రతి కాశ్మీరీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు చూడాలని ఉందంటూ' మోడీ చేసిన ప్రసంగాలు కొన్ని దశాబ్దాలుగా కాల్పులు, ప్రతి కాల్పులతో అట్టుడుకి పోతున్న అక్కడి ప్రజల్లో కొంత ఆలోచన కలిగించాయని అనుకోవచ్చు. పాతిక సీట్లు ఏపాటి అని ఇతర రాజకీయ పార్టీలు అనుకోవచ్చు కాని కాశ్మీర్ వంటి రాష్ట్రంలో మాత్రం బీజేపీకి అది పెద్ద విజయమే. కాశ్మీర్ అసెంబ్లీ లో  కాలుమోపడం అనేది అంత విస్తృత స్థాయిలో జరగడం నిజంగా గొప్ప విషయమే.       
 ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీలను అధికార అందలం ఎక్కించిన  నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావుల నడుమ సాపత్యం గురించి కూడా  ఇంకో  ఆసక్తికరమైన వ్యాఖ్యానం వినబడుతోంది.. దక్కిన అధికారం కలకాలం  నిలుపుకోవాలని కోరిక ఉండడంలో ఆశ్చర్య పడాల్సింది లేదు కాని, వీరు మువ్వురు అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి వేరే ధ్యాస లేకుండా అయిదేళ్ళ  తరువాత 2019 లో   జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీలను తిరిగి గెలిపించుకోవడం  ఎల్లాగా  అన్న ఒకే ఒక్క లక్ష్యం మీదనే  దృష్టి పెట్టారన్నది బహిరంగ రహస్యం. ఇందుకోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదు.  కిందటి ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఆయా  పార్టీలు అనుసరించిన విధానాలే  అయిదేళ్ళ తరువాతి ఎన్నికల్లో పునరావృతం కాకపోవచ్చని, రాజకీయ సమీకరణాలు పూర్తిగా  మారిపోవచ్చు కూడా. ఈ మాటలు చెప్పడానికి కొమ్ములు తిరిగిన  రాజకీయ విశ్లేషకులే అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయం గురించి కనీస అవగాహన  కలిగిన ఎవ్వరయినా ఇదే సంగతి తడబాటు లేకుండా  చెప్పగలుగుతారు. విశేషం ఏమిటంటే ఈ మూడు పార్టీల నాయకులకీ ఈ విషయం బాగా తెలుసు. కానీ గుంభనగా ఉండిపోతున్నారు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం.
బీజేపీ ముందు దృష్టి పెట్టేది అసలే బలహీన పడిన ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీని మరింత బలహీన పరచడం. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలను, లేదా బలమైన ప్రాంతీయ నాయకులను దగ్గరకు తీసి తానూ క్రమేపీ బలాన్ని పెంచుకోవడం. ప్రస్తుత రాజకీయాల్లో ఇది పెద్ద తప్పూ కాదు, తప్పు పట్టాల్సిందీ లేదు.   
ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కని రీతిలో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన విజయంతో సరిపెట్టుకోవాలని బీజేపీ అనుకుంటున్నట్టు లేదు. ఈ అపూర్వ విజయాన్ని మరింత పదిలం చేసుకుని ఉత్తరోత్తరా జరిగే ఎన్నికల్లో ఇదేవిధమైన విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలని మోడీ-అమిత్  షా  ద్వయం వువ్విళ్ళూరుతున్నట్టుగా వారి వ్యూహాలు చెప్పకనే చెబుతున్నాయి. తమ పార్టీ కొంత బలహీనంగా వున్న దక్షిణాది రాష్ట్రాలలో కూడా పాగా వేయాలనే ఉద్దేశ్యంతో వారు పావులు కదుపుతున్నారన్నది బహిరంగ రహస్యం. 2019  లో జరిగే  సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిమీదా ఆధారపడకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో కమల వికాసం పూర్తిస్థాయిలో జరగాలని ఆ పార్టీ అగ్రనేతల అభిప్రాయంగా కానవస్తోంది. ఇలాటి లక్ష్యాలను ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నా అందులో ఆక్షేపించే అంశం ఏమీ వుండదు. కాకపోతే ఈ లక్ష్య సాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.  ఇంతవరకు సిద్దాంతాలకు, విధానాలకు కట్టుబడి వ్యవహరించే అతి కొద్ది పార్టీలలో బీజేపీ ఒకటి. ఆ  పార్టీ సిద్దాంతాలను వ్యతిరేకించే రాజకీయ  ప్రత్యర్ధులు సయితం, సిద్దాంతాలు, సూత్రాలపట్ల బీజేపీకి  వున్న నిబద్దతను  అంగీకరిస్తారు. మరి  అద్యతన భావిలో  విజయం, విస్తరణ అనే రెండింటినే ప్రధానంగా పెట్టుకుని ఆ పార్టీ తన సాంప్రదాయ మార్గం నుంచి కొంత వైదొలుగుతుందా అన్నదే ఈ నాటికి జవాబు దొరకని  ప్రశ్న. ఒక వేళ మోడీ- అమిత్ షా  ద్వయం ఆ మార్గాన్నే ఎంచుకుంటే రెండు తెలుగు  రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలనాటికి  ప్రస్తుతం వున్న రాజకీయ సమీకరణలు పూర్తిగా తారుమారయ్యే అవకాశాలే ఎక్కువ.
అందుకే చెప్పింది రెండు తెలుగు  ప్రాంతీయ  పార్టీలకి ఇవి  ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
అయితే వాటికి సమయం ఇంకా మించి పోలేదు. ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ళ వ్యవధానం వుంది. కాలు కూడదీసుకోవడానికి సమయం వుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలవరం మంచి తురుపు ముక్క. రాజధాని నిర్మాణం అంతగా కలిసొస్తుందో తెలియని మరో  ట్రంప్ కార్డు. ఏదో ఒకటి చేసి,సర్వశక్తులు ధారపోసి ఎన్నికల ఘడియ దగ్గర పడేలోగా పోలవరం ప్రాజెక్టుకు ఒక స్వరూపం  ఇవ్వగలిగితే ఆయనకు రాజకీయంగా చాలా కలిసివస్తుంది. కానీ అదేం దురదృష్టమో తెలియదు కాని   ఆ ప్రాజెక్టు నత్త నడక నడుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా సముద్రంలోకి వృధాగా పోతున్న అపర గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్ళిస్తామని చంద్రబాబు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసారు. అన్నింటికంటే ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగలిగితే అక్కడి రైతాంగం మెప్పుకోళ్ళు ఆయన ఖాతాలో జమపడతాయి.
అల్లాగే తెలంగాణాలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికల సమయంలో ఒక అద్భుతమైన వాగ్దానం చేసారు. మామూలుగా బలహీన వర్గాలకు కట్టించే ఇళ్ళు కూడా అంతే బలహీనంగా వుంటాయి.
'ఒకే ఒక్క గది కడితేపెళ్ళీడుకొచ్చిన పిల్లలు ఎక్కడ పడుకుంటారుమేకలూ బర్రెలూ ఇంట్లోనే కట్టేసుకోవాలిఈ ఖర్మ ఇక ముందు వుండదు. చక్కగా రెండు గదుల ఇల్లువంటిల్లుమరుగుదొడ్డి,  ఇలా అన్ని సదుపాయాలతో ఇళ్ళు కట్టిస్తామని ఎన్నికల సమయంలో జనంలో ఎన్నో  ఆశలు రేకెత్తించారు.
'సేద్యానికి పనికి రాని బంజరు భూములు ఇవ్వడం ఏం గొప్పమంచి అనువయిన మూడెకరాల భూమిని ప్రభుత్వమే కొని ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తుందని భరోసాగా చెప్పారు. ఇటువంటి హామీలను వూరికి ఒకటి చొప్పున అన్నారానున్న కాలంలో  నెరవేరుస్తూ పొతేఎన్నికల నాటికి 'తెలంగాణా సెంటిమెంటుకు తోడుగా టీ.ఆర్.యస్. కు గ్రామీణ ప్రాంతాలలో గట్టి వోటు బ్యాంకు తయారవుతుంది. జాతీయ పార్టీలను దీటుగా ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలకు ఇలాటి బలమయిన అస్త్ర శస్త్రాలు వుండి తీరాలి. ఆకాశ హర్మ్యాలుసింగపూరులు ఎన్నికల్లో అక్కరకు వచ్చే బాణాలు కావు. రెండు రాష్ట్రాలలోని  ప్రాంతీయ పార్టీల అధినేతలిద్దరు యెంత త్వరగా ఈ వాస్తవాన్ని గుర్తిస్తే అంత మంచిది.
అందుకే చెప్పిందికాశ్మీర్జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు  ప్రాంతీయ  పార్టీలకి  ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
(23-12-2014)            

పీవీ - ఓ జ్ఞాపకం :


(డిసెంబరు 23- పీవీ నరసింహారావు గారి వర్ధంతి)  
పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులుఅనధికారులుమందీ మార్బలాలు, వందిమాగధులు ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమాఅన్నట్టు వుండేది.



మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు – నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు  - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం  వెళ్లి -  పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని  పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అడిగాము. అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండిఅన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.

పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా!అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ  పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది – కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత – కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి  ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఆయనా లేరు. కానీ ఈ చక్కని, అరిదయినా  జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.  (23-12-2014)
NOTE - Image Courtesy Owner  


22, డిసెంబర్ 2014, సోమవారం

ప్రాంతీయ పార్టీలకు అలారం గంటలు


జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికలపై వెలువడిన ఎక్జిట్ పోల్ ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలకు 'వేక్ అప్ కాల్స్' (అలారం గంటలు, లేదా వార్నింగ్ బెల్స్  అని అర్ధం చెప్పుకోవచ్చు) వంటివని  ఢిల్లీ నుంచి వచ్చిన  ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయ పడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని, కాశ్మీర్లో ఎవరూ ఊహించలేని విధంగా రెండో పెద్ద పార్టీగా అవతరించగలదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకి, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలకు ఈ ఫలితాలు ఓ ప్రమాద హెచ్చరిక అనేది ఆయన మనసులోని మాట. బీజేపీ నుంచి ఆ పార్టీలు గట్టి సవాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది మరో తాత్పర్యం.


ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీలను అధికార అందలం ఎక్కించిన  నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావుల నడుమ సాపత్యం గురించి కూడా ఆయన ఇంకో  ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేసారు. దక్కిన అధికారం కలకాలం  నిలుపుకోవాలని కోరిక ఉండడంలో ఆశ్చర్య పడాల్సింది లేదు కాని, వీరు మువ్వురు అధికార పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచి వేరే ధ్యాస లేకుండా అయిదేళ్ళ  తరువాత 2019 లో   జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీలను తిరిగి గెలిపించుకోవడం  ఎల్లాగా  అన్న ఒకే ఒక్క లక్ష్యం మీదనే  దృష్టి పెట్టారన్నది ఆ విశ్లేషకుడి అభిప్రాయం. ఇందుకోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ ఉండదని అయన ముక్తాయింపు. కిందటి ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాట్ల విషయంలో ఆయా  పార్టీలు అనుసరించిన విధానాలే  అయిదేళ్ళ తరువాతి ఎన్నికల్లో పునరావృతం కాకపోవచ్చని, రాజకీయ సమీకరణాలు పూర్తిగా  మారిపోతాయని ఆ విశ్లేషణ సారాంశం. ఈ మాటలు చెప్పడానికి కొమ్ములు తిరిగిన ఢిల్లీ రాజకీయ విశ్లేషకులే అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయం గురించి కనీస అవగాహన  కలిగిన ఎవ్వరయినా ఇదే సంగతి తడబాటు లేకుండా  చెప్పగలుగుతారు. విశేషం ఏమిటంటే ఈ మూడు పార్టీల నాయకులకీ ఈ విషయం బాగా తెలుసు. కానీ గుంభనగా ఉండిపోతున్నారు. అది వారి రాజకీయ జాణతనంలో ఒక భాగం.
ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కని రీతిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన విజయంతో సరిపెట్టుకోవాలని బీజేపీ అనుకుంటున్నట్టు లేదు. ఈ అపూర్వ విజయాన్ని మరింత పదిలం చేసుకుని ఉత్తరోత్తరా జరిగే ఎన్నికల్లో ఇదేవిధమైన విజయాలను తమ ఖాతాలో వేసుకోవాలని మోడీ-అమిత్  షా  ద్వయం వువ్విళ్ళూరుతున్నట్టుగా వారి వ్యూహాలు చెప్పకనే చెబుతున్నాయి. తమ పార్టీ కొంత బలహీనంగా వున్న దక్షిణాది రాష్ట్రాలలో కూడా పాగా వేయాలనే ఉద్దేశ్యంతో వారు పావులు కదుపుతున్నారన్నది బహిరంగ రహస్యం. 2019  లో జరిగే  సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిమీదా ఆధారపడకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో కమల వికాసం పూర్తిస్థాయిలో జరగాలని ఆ పార్టీ అగ్రనేతల అభిప్రాయంగా కానవస్తోంది. ఇలాటి లక్ష్యాలను ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నా అందులో ఆక్షేపించే అంశం ఏమీ వుండదు. కాకపోతే ఈ లక్ష్య సాధన దిశలో వేసే అడుగులు ఎలాటివన్నదే చర్చనీయాంశం. విధానాల ద్వారా విజయం సాధించాలని అనుకోవడం ఒక పద్దతి. విజయం ఒక్కటే పరమావధిగా విధానాలను మార్చుకోవడం మరో పద్దతి.  ఇంతవరకు సిద్దాంతాలకు, విధానాలకు కట్టుబడి వ్యవహరించే అతి కొద్ది పార్టీలలో బీజేపీ ఒకటి. ఆ  పార్టీ సిద్దాంతాలను వ్యతిరేకించే రాజకీయ  ప్రత్యర్ధులు సయితం, సిద్దాంతాలు, సూత్రాలపట్ల బీజేపీకి  వున్న నిబద్దతను  అంగీకరిస్తారు. మరి  అద్యతన భావిలో  విజయం, విస్తరణ అనే రెండింటినే ప్రధానంగా పెట్టుకుని ఆ పార్టీ తన సాంప్రదాయ మార్గం నుంచి కొంత వైదొలుగుతుందా అన్నదే ఈ నాటికి జవాబు దొరకని  ప్రశ్న. ఒక వేళ మోడీ- అమిత్ షా  ద్వయం ఆ మార్గాన్నే ఎంచుకుంటే రెండు తెలుగు  రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలనాటికి  ప్రస్తుతం వున్న రాజకీయ సమీకరణలు పూర్తిగా తారుమారయ్యే అవకాశాలే ఎక్కువ.
రెండు ప్రాంతీయ  పార్టీలకి ఇవి  ఒకరకంగా వేక్ అప్ కాల్స్. అలారం గంటలు. అందులో అనుమానం లేదు.
(22-12-2014)

NOTE: Courtesy Image Owner 

మారుతున్న సూక్తులు



లవ్ ఎఫైర్ - 'ఎంతగా ప్రేమిస్తున్నానంటే కొరుక్కుతినేంతగా'


బుక్ ఫెయిర్ - 'పుస్తకాల్ని ఎంతగా ఇష్టపడతానంటే వాటిని కొనుక్కుని చదివేంతగా'



NOTE: Courtesy Image Owner 

21, డిసెంబర్ 2014, ఆదివారం

రైలెక్కిన ప్రధాన మంత్రి


మూడేళ్ళ కిందటి ముచ్చట.
లండన్ నగరంలోని భూగర్భ మార్గంలో వెళ్ళే మెట్రో (ట్యూబు) రైల్లో ఇరవై ఏడేళ్ళ  భారతీయ యువతి ప్రయాణం చేస్తోంది. వెంట భర్త, వొళ్ళో మూడు నెలల పసి పిల్లాడు వున్నారు. అదే రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆమెను చూసి పలకరింపుగా నవ్వాడు. తన వొడిలో వున్న పిల్లవాడిని చూస్తూ 'చాలా ముద్దొస్తున్నాడు మీ బాబు' అన్నాడు. ఆమె ఆయన్ని తేరిపార చూసింది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్న ఆ పెద్ద మనిషిని ఎక్కడ చూసింది చప్పున గుర్తురాలేదు. పక్కన వున్న భర్తను అడిగింది, ఆయన ఎవరని. అప్పటిదాకా ఆయన్ని గమనించని ఆవిడ భర్త ఒక్క క్షణం విభ్రమానికి గురయ్యాడు.  వెంటనే అన్నాడు, 'ఆయన ఎవ్వరా!  బ్రిటిష్   ప్రధాన మంత్రి డేవిడ్ కేమెరాన్!'
'చాల్లే నీ పరిహాసం. ప్రధాని రైల్లో ఎందుకు వస్తాడు. నన్ను వెర్రిదాన్ని చేయాలని చూడకు' అందామె మొగుడితో.
'అయితే నువ్వే వెళ్లి అడుగు' అనేశాడు సంభాషణ ముగిస్తూ.
ఆమె ముందుకు కదిలి వెళ్లి మొహమాట పడుతూనే అడిగింది, 'మీరు ప్రధాని డేవిడ్ కేమెరాన్ కదా!' అని.


'అవును' అన్నాడు ఆయన, నిలబడి చదువుతున్న పేపర్ ని మడుస్తూ.
'నేనో అర్జంటు మీటింగుకు వెళ్ళాలి. కారులో సమయం పట్టేట్టు వుంది. మెట్రోలో అయితే త్వరగా చేరుకోవచ్చనిపించి రైలెక్కాను' అన్నాడాయన చిరునవ్వుతో. ప్రధాని వెంట ఒక బాడీ గార్డు వుండడం గమనించింది ఆమె.
'ఇది తను పుట్టిన భారత దేశంలో సాధ్యమా?' అన్న ప్రశ్న ఆమె మెదడును తొలిచేసింది.
ఢిల్లీలో, ముంబై లో రైళ్ళలో తిరిగిన అనుభవం ఆమెకు వుంది. కానీ లండన్ రైల్లో ఇలాటి అరుదయిన అనుభవం ఎదురుకాగలదని తాను  ఎన్నడూ ఊహించలేదని చెప్పినట్టు ఆమెను ఉటంకిస్తూ డైలీ మిర్రర్ పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది.
చూసి నేర్చుకోవాలని అంటారు మరి.
చూస్తాం, చదువుతాం కాని, నేర్చుకోవడం అంత వీజీ ఏమీ కాదు.
Note: Courtesy Image Owner

20, డిసెంబర్ 2014, శనివారం

వెనక్కు తీసుకోలేనిది నోరు జారిన మాట ఒక్కటే!



మాధవరావుకు ఎదురుగా ఎవరన్నా కనిపిస్తే నమిలి మింగేయాలన్నంత కోపంగా వుంది. ఆస్పత్రి కారిడారులో అసహనంగా తిరుగుతున్న తీరే ఆయన మానసిక స్తితిని తెలుపుతోంది. మద్ధ్యమధ్యలో ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేస్తున్నాడు. డాక్టర్ ఇంకా రాలేదా అని అడుగుతున్నాడు. రోడ్డుప్రమాదంలో గాయపడ్డ తన కొడుకుని తీసుకుని ఆసుపత్రికి వస్తే డాక్టర్ అయిపు లేడు.  ‘కబురు చేశాం! వచ్చి చూస్తారు’ అన్న సిబ్బంది అరకొర జవాబులు పుండు మీద కారం చల్లిన చందంగా ఆయనకు మరింత ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. చుట్టుపక్కలే కాదు చుట్టుపక్కల వూళ్ళల్లో కూడా మరో ఆసుపత్రిలేదు. ఇటు కొడుకు పరిస్తితి ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. అటు డాక్టర్ లేకపోవడం ఆ ఆందోళనను ఆగ్రహంగా మారుస్తోంది.
కాసేపటికి ఎదురు చూస్తున్న డాక్టర్ వచ్చాడు. ఆయన మొహం నిర్వికారంగా వుంది. రాగానే గాయపడ్డ బాలుడి గురించి సిబ్బందిని అడిగి లోపలకు వెడుతుంటే మాధవరావుకు కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపం మాటల రూపంలో బయటకు వచ్చింది.
‘నువ్వేనా ఇక్కడ డాక్టరువి. ఇక్కడ పేషెంట్లు చావుబతుకుల్లో కొట్టుకు చస్తుంటే ఇప్పటిదాకా ఎక్కడ చక్కర్లు కొడుతున్నావు.’
సిబ్బంది మాధవరావుని వారించాలని చూసారు. కానీ ఆయన వినే పరిస్తితిలో వుంటే కదా. అతడి కళ్ళ ముందు గాయపడి రక్తంవోడుతున్న కొడుకు రూపమే కనబడుతోంది.
‘ఏం మాట్లాడవు. అవునులే ఏం  చెబుతావు. ఇదే నీ కన్న కొడుకు ఇలా ఆసుపత్రిలో పడివుంటే ఇలానే తాపీగా, నింపాదిగా  వస్తావా? అసలు  జనం ప్రాణాలంటే మీకు లెక్కలేకుండా పోతోంది’
మాధవరావు మాటల తీవ్రత పెరుగుతూనే  వుంది. డాక్టర్ మాత్రం  ఏమీ పట్టించుకోనట్టు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిపోవడం చూసి ఆయన అరికాలు మంట నెత్తికెక్కింది.
ఆపరేషన్ జరిగినంత సేపు మాధవరావు శాపనార్ధాలు సాగుతూనే వున్నాయి.
కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు.
‘భగవంతుడు దయామయుడు. నా మానవ ప్రయత్నానికి ఆయన పూర్తిగా సహకరించాడు. మీ అబ్బాయికి ఇక ఏం భయం లేదు, మా వాళ్ళు చూసుకుంటారు’  అంటూ ఎవరో తరుముతున్నట్టుగా వెళ్ళిపోయాడు.
మాధవరావుకు డాక్టర్ మాటలు యెంత ఉపశమనం కలిగించాయో, ఆయన అలా ఉరుకులు పరుగుల మీద బయటకు వెళ్లిపోవడం అంతే  ఆగ్రహాన్ని కలిగించింది.
‘ఛీ! ఏం డాక్టర్లు. బయట ఇంత ఆందోళనగా ఎదురు చూస్తున్న మమ్మల్ని  ఏమాత్రం పట్టించుకోకుండా, ఏదో మా ప్రయత్నం మేము చేసాము. దేవుడి దయవల్లే మీ వాడు బతికాడంటూ  పొడిపొడిగా చెప్పేసి అలా  వెళ్ళిపోతాడా? యెంత నిర్లక్ష్యం? యెంత పొగరు?’ అంటూ చిందులు వేసాడు.
నర్సు కళ్లనీరు పెట్టుకుంటూ చెప్పింది.
‘అయ్యా! మీ పిల్లవాడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మా డాక్టర్ గారిది అమృత హస్తం.  పోతే, మీరు వచ్చినప్పుడు ఆసుపత్రిలో డాక్టరు గారు లేని మాట నిజమే. ఆ సమయంలో ఆయన శ్మశానంలో వున్నారు. వొక్కగానొక్క కొడుకు రాత్రే రోడ్డు  ప్రమాదంలో అక్కడికక్కడే  చనిపోయాడు. కర్మకాండలో వున్నాకూడా,  మేము కబురు చేయగానే  అంత్య క్రియల కార్యక్రమం మధ్యలో వొదిలేసి వచ్చారు. మీ అబ్బాయికి ఆపరేషన్ చేసి మళ్ళీ మిగిలిన తంతు పూర్తిచేయడం కోసం అక్కడికే వెళ్లారు’

(ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం)


(NOTE:Courtesy Image Owner)