21, డిసెంబర్ 2014, ఆదివారం

రైలెక్కిన ప్రధాన మంత్రి


మూడేళ్ళ కిందటి ముచ్చట.
లండన్ నగరంలోని భూగర్భ మార్గంలో వెళ్ళే మెట్రో (ట్యూబు) రైల్లో ఇరవై ఏడేళ్ళ  భారతీయ యువతి ప్రయాణం చేస్తోంది. వెంట భర్త, వొళ్ళో మూడు నెలల పసి పిల్లాడు వున్నారు. అదే రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఆమెను చూసి పలకరింపుగా నవ్వాడు. తన వొడిలో వున్న పిల్లవాడిని చూస్తూ 'చాలా ముద్దొస్తున్నాడు మీ బాబు' అన్నాడు. ఆమె ఆయన్ని తేరిపార చూసింది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్న ఆ పెద్ద మనిషిని ఎక్కడ చూసింది చప్పున గుర్తురాలేదు. పక్కన వున్న భర్తను అడిగింది, ఆయన ఎవరని. అప్పటిదాకా ఆయన్ని గమనించని ఆవిడ భర్త ఒక్క క్షణం విభ్రమానికి గురయ్యాడు.  వెంటనే అన్నాడు, 'ఆయన ఎవ్వరా!  బ్రిటిష్   ప్రధాన మంత్రి డేవిడ్ కేమెరాన్!'
'చాల్లే నీ పరిహాసం. ప్రధాని రైల్లో ఎందుకు వస్తాడు. నన్ను వెర్రిదాన్ని చేయాలని చూడకు' అందామె మొగుడితో.
'అయితే నువ్వే వెళ్లి అడుగు' అనేశాడు సంభాషణ ముగిస్తూ.
ఆమె ముందుకు కదిలి వెళ్లి మొహమాట పడుతూనే అడిగింది, 'మీరు ప్రధాని డేవిడ్ కేమెరాన్ కదా!' అని.


'అవును' అన్నాడు ఆయన, నిలబడి చదువుతున్న పేపర్ ని మడుస్తూ.
'నేనో అర్జంటు మీటింగుకు వెళ్ళాలి. కారులో సమయం పట్టేట్టు వుంది. మెట్రోలో అయితే త్వరగా చేరుకోవచ్చనిపించి రైలెక్కాను' అన్నాడాయన చిరునవ్వుతో. ప్రధాని వెంట ఒక బాడీ గార్డు వుండడం గమనించింది ఆమె.
'ఇది తను పుట్టిన భారత దేశంలో సాధ్యమా?' అన్న ప్రశ్న ఆమె మెదడును తొలిచేసింది.
ఢిల్లీలో, ముంబై లో రైళ్ళలో తిరిగిన అనుభవం ఆమెకు వుంది. కానీ లండన్ రైల్లో ఇలాటి అరుదయిన అనుభవం ఎదురుకాగలదని తాను  ఎన్నడూ ఊహించలేదని చెప్పినట్టు ఆమెను ఉటంకిస్తూ డైలీ మిర్రర్ పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది.
చూసి నేర్చుకోవాలని అంటారు మరి.
చూస్తాం, చదువుతాం కాని, నేర్చుకోవడం అంత వీజీ ఏమీ కాదు.
Note: Courtesy Image Owner

20, డిసెంబర్ 2014, శనివారం

వెనక్కు తీసుకోలేనిది నోరు జారిన మాట ఒక్కటే!



మాధవరావుకు ఎదురుగా ఎవరన్నా కనిపిస్తే నమిలి మింగేయాలన్నంత కోపంగా వుంది. ఆస్పత్రి కారిడారులో అసహనంగా తిరుగుతున్న తీరే ఆయన మానసిక స్తితిని తెలుపుతోంది. మద్ధ్యమధ్యలో ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేస్తున్నాడు. డాక్టర్ ఇంకా రాలేదా అని అడుగుతున్నాడు. రోడ్డుప్రమాదంలో గాయపడ్డ తన కొడుకుని తీసుకుని ఆసుపత్రికి వస్తే డాక్టర్ అయిపు లేడు.  ‘కబురు చేశాం! వచ్చి చూస్తారు’ అన్న సిబ్బంది అరకొర జవాబులు పుండు మీద కారం చల్లిన చందంగా ఆయనకు మరింత ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. చుట్టుపక్కలే కాదు చుట్టుపక్కల వూళ్ళల్లో కూడా మరో ఆసుపత్రిలేదు. ఇటు కొడుకు పరిస్తితి ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. అటు డాక్టర్ లేకపోవడం ఆ ఆందోళనను ఆగ్రహంగా మారుస్తోంది.
కాసేపటికి ఎదురు చూస్తున్న డాక్టర్ వచ్చాడు. ఆయన మొహం నిర్వికారంగా వుంది. రాగానే గాయపడ్డ బాలుడి గురించి సిబ్బందిని అడిగి లోపలకు వెడుతుంటే మాధవరావుకు కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపం మాటల రూపంలో బయటకు వచ్చింది.
‘నువ్వేనా ఇక్కడ డాక్టరువి. ఇక్కడ పేషెంట్లు చావుబతుకుల్లో కొట్టుకు చస్తుంటే ఇప్పటిదాకా ఎక్కడ చక్కర్లు కొడుతున్నావు.’
సిబ్బంది మాధవరావుని వారించాలని చూసారు. కానీ ఆయన వినే పరిస్తితిలో వుంటే కదా. అతడి కళ్ళ ముందు గాయపడి రక్తంవోడుతున్న కొడుకు రూపమే కనబడుతోంది.
‘ఏం మాట్లాడవు. అవునులే ఏం  చెబుతావు. ఇదే నీ కన్న కొడుకు ఇలా ఆసుపత్రిలో పడివుంటే ఇలానే తాపీగా, నింపాదిగా  వస్తావా? అసలు  జనం ప్రాణాలంటే మీకు లెక్కలేకుండా పోతోంది’
మాధవరావు మాటల తీవ్రత పెరుగుతూనే  వుంది. డాక్టర్ మాత్రం  ఏమీ పట్టించుకోనట్టు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిపోవడం చూసి ఆయన అరికాలు మంట నెత్తికెక్కింది.
ఆపరేషన్ జరిగినంత సేపు మాధవరావు శాపనార్ధాలు సాగుతూనే వున్నాయి.
కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు.
‘భగవంతుడు దయామయుడు. నా మానవ ప్రయత్నానికి ఆయన పూర్తిగా సహకరించాడు. మీ అబ్బాయికి ఇక ఏం భయం లేదు, మా వాళ్ళు చూసుకుంటారు’  అంటూ ఎవరో తరుముతున్నట్టుగా వెళ్ళిపోయాడు.
మాధవరావుకు డాక్టర్ మాటలు యెంత ఉపశమనం కలిగించాయో, ఆయన అలా ఉరుకులు పరుగుల మీద బయటకు వెళ్లిపోవడం అంతే  ఆగ్రహాన్ని కలిగించింది.
‘ఛీ! ఏం డాక్టర్లు. బయట ఇంత ఆందోళనగా ఎదురు చూస్తున్న మమ్మల్ని  ఏమాత్రం పట్టించుకోకుండా, ఏదో మా ప్రయత్నం మేము చేసాము. దేవుడి దయవల్లే మీ వాడు బతికాడంటూ  పొడిపొడిగా చెప్పేసి అలా  వెళ్ళిపోతాడా? యెంత నిర్లక్ష్యం? యెంత పొగరు?’ అంటూ చిందులు వేసాడు.
నర్సు కళ్లనీరు పెట్టుకుంటూ చెప్పింది.
‘అయ్యా! మీ పిల్లవాడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మా డాక్టర్ గారిది అమృత హస్తం.  పోతే, మీరు వచ్చినప్పుడు ఆసుపత్రిలో డాక్టరు గారు లేని మాట నిజమే. ఆ సమయంలో ఆయన శ్మశానంలో వున్నారు. వొక్కగానొక్క కొడుకు రాత్రే రోడ్డు  ప్రమాదంలో అక్కడికక్కడే  చనిపోయాడు. కర్మకాండలో వున్నాకూడా,  మేము కబురు చేయగానే  అంత్య క్రియల కార్యక్రమం మధ్యలో వొదిలేసి వచ్చారు. మీ అబ్బాయికి ఆపరేషన్ చేసి మళ్ళీ మిగిలిన తంతు పూర్తిచేయడం కోసం అక్కడికే వెళ్లారు’

(ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం)


(NOTE:Courtesy Image Owner)



గాంధీభవన్ పంతులు గారు


"ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక  ఆయన జీవనం చాలా దుర్భరంగా గడిచేది. మద్రాసులో న్యాయవాదిగా సంపాదించిన అపార ధన రాశులు, అంతులేని ఆస్తిపాస్తులు స్వాతంత్రోద్యమ కాలంలో హారతి కర్పూరంలా కరిగిపోయాయి. రాజకీయాల్లో సమస్తం పొగొట్టుకున్న ఆంద్ర కేసరి చివరి రోజుల్లో కనాకష్టమైన జీవితం గడిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినెలా గౌరవ వేతనం కింద అందించే 750 రూపాయలను నేనే (గాంధీ భవన్ పంతులు గారు) స్వయంగా తీసుకెళ్ళి ఆయనకు అందించేవాడిని. సిరి  సంపదలతో తులతూగిన ప్రకాశం పంతులు గారిని ఆ స్తితిలో చూస్తుంటే కడుపు తరుక్కుపోయేది"
హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన  గాంధీభవన్ లో శేషజీవితం గడిపిన ఎస్వీ పంతులు గారు ఒకప్పుడు  గుర్తుచేసుకున్న విషయాలు ఇవి. ముఖ్యమంత్రులుగా పనిచేసిన శ్రీయుతులు  నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వై యస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, వీరందరికీ గాంధీ భవన్ లో  'తలలో నాలుక' పంతులు  గారే. 'నేనూ కోట్లు కొల్లగొట్టే వాడినయితే ఇంతమంది గొప్పవాళ్ళ స్నేహం నాకు దొరికేదా' అనుకునే అల్ప సంతోషి  పంతులు గారు మాత్రం సాయంత్రం  సిటీ బస్సెక్కి ఇంటికి పోయేవారు. వీరిలో రోశయ్యగారితో పంతులు గారి అనుబంధం సుదీర్ఘ కాలం సాగింది. ఉదయం నుంచీ రాత్రి పొద్దుపోయే వరకు రోశయ్య గారితోనే వుండి  ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరినన్నా  రెండు రూపాయలు అడిగి తీసుకుని సిటీ బస్సెక్కి పోయేవారు. 'మళ్ళీ రేపు రావాలి కదా ఈ పదీ వుంచండి' అని ఏ ధర్మాత్ముడన్నా అంటే 'టిక్కెట్టుకు రెండు రూపాయలు చాలు,  రేపటి సంగతి రేపే' అనేసి వెళ్ళిపోయేవారట. దటీజ్ పంతులు గారు. అలాటి పంతులు గారు ఈ మధ్యనే, ఎవర్నీ టిక్కెట్టుకు డబ్బులు అడక్కుండా  ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. నాకాయనతో నలభయ్ ఏళ్ళ అనుబంధం.


   
హైదరాబాదు బషీర్ బాగ్ లోని పాత ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో నిన్న  పంతులు గారి సంస్మరణ కార్యక్రమం జరిగింది. గాంధీ భవన్ ఈ సందర్భానికి వేదిక కాకపోవడం వచ్చిన వారిని కలత పరిచింది. పట్టుమని పాతిక మంది కూడా కానరాలేదు. అయితే ఏమిటట? వచ్చిన వారందరూ పంతులు గారికి ఆత్మీయులు. ఎన్నో పనులున్నా పంతులు గారి కార్యక్రమానికి రావడమే ఒక పనిగా పెట్టుకుని వచ్చినవారు.  శాసన మండలి సమావేశాలు ఓ పక్క జరుగుతున్నప్పటికీ, మండలి చైర్మన్ శ్రీ చక్రపాణి గారు పంతులుగారి మీద వున్న వాత్సల్యంతో వచ్చి చాలాసేపు గడిపి, పంతులు గారిని గురించి చాలామందికి తెలియని చాలా మంచి సంగతులను  అందరితో పంచుకున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వర రావు గారు ప్రత్యేకంగా ఇందుకోసం విజయవాడ నుంచి బయలుదేరి వచ్చారు. పంతులు గారితో తమకున్న అనుబంధాన్ని సజల నయనాలతో నెమరు వేసుకున్నారు. అధ్యక్షత వహించిన రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యలమంచిలి  శివాజీ చరిత్రపుటల్లో మరుగుపడిపోయిన ఎన్నో సంగతులను పంతులుగారి జీవితంతో ముడిపెట్టి వివరంగా తెలియచేసారు. మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ శ్రీ పుల్లయ్య, గాంధీ భవన్ మరో  మూల స్థంభం, గతంలో మద్యనిషేధ కమిటీ చైర్మన్ గా  పనిచేసిన శ్రీ  ఉప్పులూరి మల్లిఖార్జున శర్మ,  గిరిజన సంక్షేమ సంఘం మాజీ చైర్మన్ శ్రీ సూర్య నాయక్, ఆంద్ర మేధావుల ఫోరం కన్వీనర్ శ్రీ చలసాని శ్రీనివాస్, ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్,  తెలంగాణా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి శ్రీ  అద్దంకి దయాకర్ తమ ప్రసంగాలలో    ఎస్వీ పంతులు గారి  గుణగణాలను ప్రస్తుతించారు.  పంతులు గారి కుటుంబ సభ్యులు జ్యోతిశ్రీ, సీతాపతి, రాజేష్, సుబ్రమణ్య శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంతులు గారి జ్ఞాపకాలతో ఒక పుస్తకం ప్రచురించాలని సమావేశంలో నిర్ణయించారు.  
పీ ఎస్: ప్రకాశం పంతులు గారి చివరి రోజులు ఎలా గడిచాయో కళ్ళారా చూసిన సంకా వియ్యన్న పంతులు గారి  చివరి అధ్యాయం కూడా అలాగే ముగియడం విధి విచిత్రం. (20-12-2014)

19, డిసెంబర్ 2014, శుక్రవారం

శాస్త్రి గారింట్లో పెళ్లి


రాత్రే మా వాడికి చెప్పాను ఉదయమే శాస్త్రి గారింట్లో పెళ్లి,  డ్రైవర్ కు చెప్పమని. పొద్దున్నే లేచి ఛానల్లో ఉదయ సంకీర్తన ముగించుకుని ఇంటికి వచ్చేసరికి డ్రైవర్ రెడీగా వున్నాడు. అల్పాహారం ముగించుకుని కారెక్కాను. మాదాపూర్ నుంచి మల్లాపూర్ వెళ్ళాలి. చాలా దూరం. అందుకే ముందుగా బయలుదేరాను. కార్లో చదువుదామని సిటీ ఎడిషన్ పేపర్లు పెట్టుకున్నాను. మెయిన్  ఎడిషన్ టీవీ ఛానల్లోనే అయిపోతుంది. చాలా దూరం వెళ్ళిన తరువాత 'ఫోటో వార్త' కనిపించింది.




"నాచారంలోని నామా ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ఆంద్ర భూమి ఎడిటర్ ఎంవీఆర్ శాస్త్రి కుమార్తె తన్మయి, దిలీప్ కుమార్ వివాహానికి హాజరయిన ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకరరావు"
మళ్ళీ చదివినా అదే వార్త. పైగా ఫోటో. మరి నేను బయలుదేరింది, ముందుగా ఏర్పాట్లు చేసుకున్నది అప్పటికే అయిపోయిందన్న మాట.
తిరుగు టపాలో ఇంటికి చేరిన నన్ను చూసి మా ఆవిడ ఒకే నవ్వు.
నేనూ నవ్వు కలిపాను ఏడవలేక.

18, డిసెంబర్ 2014, గురువారం

ఉగ్రవాదుల చేతుల్లో మోగుతున్న మరణ మృదంగాలు

(Published by 'SURYA' telugu Daily in its Edit Page on 21-12-2014, SUNDAY)

డిసెంబర్ పదహారు. పాకిస్తాన్ లోని పెషావర్ నగరంలో ఉగ్రవాదుల తూటాలకు అభం శుభం తెలియని 132మంది స్కూలు పిల్లలు బలయిన చీకటి రోజు. కనికరం ఇసుమంతయినా చూపని సాయుధ ఉగ్రవాదులు మొత్తం 148 మంది నిరాయుధులయిన అమాయకుల ప్రాణాలు హరించారు. పుస్తకాల సంచీతో ఆ రోజే మొదటిసారి  బడిలో అడుగుపెట్టిన అయిదేళ్ళ చిన్నారి నుంచి పద్దెనిమిదేళ్ళ వయసున్న, ఎంతో చక్కని భవిష్యత్తువున్న పిల్లలు అనేకమందికి తాము చదువుతున్న పాఠశాలే స్మశాన వాటిక అయింది.    
రాక్షసం, కిరాతకం, పాశవికం, దారుణం, అమానుషం, అతి హేయం ఈ పదాలన్నీ కలిపినా కూడా పెషావర్ మారణహోమాన్ని వర్ణించడానికీ, ఖండించడానికి  సరి తూగవు, సరిపోలవు. పెషావర్ ఊచకోత మొత్తం మానవేతిహాసానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. వందలాది తలితండ్రుల కడుపుకోతకు కారణమయింది. యావత్ ప్రపంచ ప్రజల్ని దిగ్భ్రమ పరచింది. మనం నివసిస్తున్నది నాగరికలోకంలోనా లేక జంతు ప్రపంచంలోనా అన్న సందేహాలకు తావిస్తోంది.   
సరిగ్గా పదేళ్ళ క్రితం రష్యన్ సమాఖ్యలోని బెస్లాన్ నగరంలో ఇదేవిధమైన ఉగ్రవాదుల దుశ్చర్యకు 385 మంది చనిపోయారు. సాయుధులయిన ఇస్లామిక్ ఉగ్రవాదులు కొందరు బెస్లాన్ లోని ఒక పాఠశాలలో ప్రవేశించి దాన్ని మూడు రోజులపాటు తమ అధీనంలో పెట్టుకున్నారు. 777 మంది విద్యార్ధులతో సహా మొత్తం 1,100 మందిని తమ బందీలుగా పట్టుకున్నారు. రష్యన్ సమాఖ్య నుంచి చెచన్యాకు స్వాతంత్ర్యం కోరుతూ జరుగుతున్న సాయుధ పోరాటంలో భాగంగా ఈ ముట్టడి మూడు రోజులపాటు సాగింది. మూడో రోజున రష్యన్ సైనిక దళాలు యుద్ధ ట్యాంకులతో స్కూలు భవనంలోకి  చొచ్చుకుపోయాయి. 186 మంది విద్యార్ధులతో సహా 385 బందీలు ఈ ఘటనలో అసువులుబాసారు. అనేకమంది గాయపడ్డారు. ఎంతమంది ఉగ్రవాదులు ఇందులో పాల్గొన్నారు, వారేమయ్యారు అన్న ప్రశ్నలకు ఇంతవరకు సంతృ ప్తికరమయిన  జవాబు లేదు.
దశాబ్దం క్రితం ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు  ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఈ పదేళ్ళ కాలంలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది.
బెస్లాన్ పాశవిక ఉదంతాన్ని తలదన్నే రీతిలో పెషావర్ మారణ కాండ సాగింది. 'జరిగిన దారుణాన్ని జీర్ణించుకోవడానికి మనసు మొరాయిస్తోంది' అని పాకేస్తాన్ లో బహుళ పాఠకాదరణ కలిగిన 'డాన్' పత్రిక తన సంపాదకీయంలో పేర్కొన్నది.
'ఈ పాశవిక దాడిలో అనేక పసి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం మొత్తం దేశాన్ని మానసికంగా కుదిపివేసింది. దీన్ని నుంచి కోలుకోవడం అంత సులభమేమీ కాదు' అని ఆ పత్రిక రాసింది.
ఒకే ఒక లక్ష్యాన్ని ఉగ్రవాదులు ఎన్నుకున్నారు. నిస్సహాయులు, నిరాయుధులు, తేలికగా దొరికిపోయే స్కూలు పిల్లలను తమ పగ, ప్రతీకారాలకు బలి పశువులుగా ఎంచుకున్నారు.  వారి సిద్దాంతాలు నమ్మకాలు ఎలా వున్నా, వారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎన్నుకున్న మార్గం మాత్రం దారుణం. తమపై సైనిక దాడులు జరపరాదంటూ, రాజ్యాంగేతర విధానాలతో తమను ప్రభుత్వాలు మట్టుబెట్టాలని చూస్తున్నాయని, వాటికి నిరసనగా ఈ మరణ కాండకు పూనుకున్నామని ఉగ్రవాదులు ప్రకటించడం మరీ ఆక్షేపనీయం. ప్రభుత్వాలపై పెంచుకున్న ప్రతీకారాన్ని పసిపిల్లల ప్రాణాలు హరించడం ద్వారా తీర్చుకోవాలని అనుకోవడం నీతి బాహ్యం.
ఇటువంటి సంఘటనలు జరగగానే 'ఉగ్రవాదాన్ని ఉక్కు పాదాలతో అణచివేస్తాం' అనే ప్రకటనలు కోకొల్లలుగా వెలువడతాయి. వీటివల్ల జరిగేది ఏమీ వుండదు, వొరిగేది ఏమీ వుండదు. ఇవన్నీ కంటి తుడుపు మాటలు. వీటిని నమ్మడం జనం ఎప్పుడో మానేశారు.
ఉగ్రవాదుల ఈ చర్యలను ఏదో ఒక మతానికి ముడిపెట్టడం కూడా సబబు కాదు. ఎందుకంటె ఏ మతమూ  ఏ రూపంలోనూ  హింసను  ప్రోత్సహించదు. కానీ ఒక మతం పేరుతొ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులు మాత్రం ఈ  వాస్తవాన్ని మరచిపోతున్నారు.
పెషావర్ సంఘటనకు సంబంధించి అందుతున్న ఓ సమాచారం దీన్ని రుజువు చేస్తోంది. మారణాయుధాలు ధరించి మిలిటరీ పాఠశాలలో ప్రవేశించిన ఉగ్రవాదులు, తుపాకులతో విద్యార్ధులను బెదరిస్తూ వారిని 'కలిమా' (ఇస్లాం ప్రార్ధన) చదవాల్సిందని ఆదేశించారుట. ఆ తరువాత విచక్షణారహితంగా వారిపై కాల్పులు జరిపారట. అంటే ముస్లిముల పవిత్ర గ్రంధం ఖుర్ ఆన్ లో ప్రవచించిన దానికి  విరుద్ధంగా ఉగ్రవాదులు ప్రవర్తించారన్న మాట. 'అల్లాను విశ్వసించిన వారిని ఎవరయినా కావాలని చంపినట్టయితే, అటువంటి వారికి నరకమే శిక్ష' అని ఖుర్ ఆన్ స్పష్టంగా చెబుతోంది. దీని ప్రకారం చూస్తె ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు కాని వారికి  ఇస్లాంతో కానీ, ఆ మత బోధనలతో కానీ  ఎలాటి సంబంధం లేదని పెషావర్ సంఘటన తెలుపుతోంది.
ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతో సరిపుచ్చుకోరు.
కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడుఅన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ప్రపంచంలో ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.



మతాన్ని మీరు రక్షిస్తే మతం మిమ్మల్ని రక్షిస్తుందిఅనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం.

(18-12-2014)

NOTE: Courtesy Image Owner 

సతీ నీలాంబరి


నీలాంబరితో ఏకాంబరం పెళ్లి పెళ్లున జరిగిపోయింది. మొదటి రాత్రే ఏకాంబరం భార్యతో చెప్పాడు.
'మనం ఇద్దరం ఒక అవగాహనకు వద్దాం. నా మీద నీకు కోపం వస్తే కేకలు వెయ్యి. కానీ అప్పుడు  మనిద్దరం తప్ప మూడో వ్యక్తి వుండకూడదు. నేనూ అలాగే.  మరొకరు వున్నప్పుడు నీ మీద నోరు పారేసుకోను. అండర్ స్టాండ్?'
'అండర్ స్టాండ్. అల్లాగే' అన్నది నీలాంబరం.
భార్య సహకారం చూసిన  ఏకాంబరానికి ఆమె మీద ప్రేమ పూనకంలా తన్నుకు వచ్చింది.  
'నువ్వుంటే నాకు ఈ లోకంతో పనిలేదు. ఎదురుగా  ఎందరు వున్నా నా కంటికి నువ్వొక్కదానివే...' అంటూ గారాలు పోయాడు.
మర్నాడు కాఫీ తాగేటప్పుడు ఏదో విషయం మీద మాటా మాటా  వచ్చి మొగుడ్ని అత్తామామల ముందే కడిగి పారేసింది నీలాంబరి.  ఏకాంబరం బిత్తరపోయాడు. బిక్కచచ్చిపోయాడు.
ఆ రాత్రి వొంటరిగా వున్నప్పుడు  అడిగాడు 'అందరిముందు ఎందుకు అలా వొంటి కాలి మీద లేచావు' అని.
నీలాంబరి గారాలు పోతూ చెప్పింది.
'ఎవరున్నారు అక్కడ? మీరే కదా ఎదురుగా నేనుంటే ఇక  ఎవరూ  లేనట్టే అని'
ఏకాంబరం మరోసారి బిక్కచచ్చిపోయాడు.  

  

NOTE: Courtesy Image Owner 

17, డిసెంబర్ 2014, బుధవారం

ఇలా చేసి మాడండి !


"ఇలా చేసి చూడండి అని కిందటి వారం ప్రసారం చేసిన కార్యక్రమంపై శ్రోతల స్పందన ఇప్పుడు తెలుసుకుందాం.
"ముందుగా మంగళవారప్పేట నుంచి మంగళగౌరీదేవి గారు రాసిన ఉత్తరం చూద్దాం.
"మీరు చెప్పినట్టే స్టవ్ మీద బాణలి పెట్టాను. నూనె పోసాను. పోపు గింజలు మీరు చెప్పినట్టే కొలిచి మరీ పోసాను. ఆ తరువాత మీరు చెప్పిన దానిని అక్షరం పొల్లుపోకుండా చెప్పింది చెప్పినట్టే చేసాను. రవ్వ ఉప్మా కాదు కదా రవ్వ జావ  కూడా తయారుకాలేదు,  అని మంగళగౌరీదేవి గారు రాశారు.
"చాలా సంతోషం మంగళగౌరీదేవిగారు,  మీరు మా కార్యక్రమాన్ని శ్రద్ధగా వినడం  మాత్రమే కాకుండా ఆచరించి చూస్తున్నందుకు. కాకపొతే ఓ సందేహం. అదేమిటంటే,  మీరు స్టౌ వెలిగించడం మరచిపోయారని. యెంత రేడియో విని వంటచేసేవారికయినా ఈ కనీస  ప్రాధమిక సూత్రం తెలిసే వుంటుందన్న ఉద్దేశ్యంతో స్టౌ వెలిగించడం గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. నిజంగా అది మా పొరపాటే!"




(కార్టూనిష్ట్ 'లేపాక్షి' గారి సౌజన్యంతో)