10, ఏప్రిల్ 2014, గురువారం

వలసపక్షులు

"ఇప్పుడే అందిన వార్త: రాజకీయ వలసలు గమనించిన మీదట తాము రావడం ఇక అనవసరమనుకుని ఈ ఏడాది కొల్లేటి సరస్సుకు వలస పక్షులు రావడం వాయిదా వేసుకున్నాయి"

బొమ్మను చేసీ ప్రాణము పోసీ.......


బ్రహ్మగారు సత్యలోకంలో బాసింపట్టు వేసుకుని,  రేడియో వింటూ చేసే వంట లాగా, అర్ధాంగి వీణావాణి చెబుతున్నవిదంగా సృష్టి కార్యం పూర్తి చేస్తున్నారు.
'అందం అరవై పాళ్ళు' అన్నది సరస్వతి.
అక్షరాలా అరవై పాళ్ళు అందం కొలిచి పోశాడు విధాత.
'సౌకుమార్యం పాతిక పాళ్ళు' అన్నది సరస్వతమ్మ.
'తధాస్తు' అన్నాడు విధాత.
'అమ్మతనం అరవై ఆరుపాళ్ళు,  ఆత్మబలం ఆరుపాళ్ళు, అహంకారం మరో ఆరుపాళ్ళు. వినయం అయిదుపాళ్ళు, అణకువ ఆరుపాళ్ళు, మేధస్సు ముప్పై పాళ్ళు, మానసిక బలహీనతలు నలభై పాళ్ళు, శారీరకబలం లవణం మాదిరిగా తగినంత.' చెప్పుకుంటూ పోతోంది చదువుల తల్లి. విధాత వింటూనే ఆ బొమ్మకు మెరుగులు దిద్దుతున్నాడు.
బొమ్మ పూర్తయింది. దాని అందం చందం చూసి హాటక గర్భురాణికే మతి పోయింది. ఇంత సౌందర్యం,  ఇన్ని తెలివితేటలు, అమ్మో ఇంకేమైనా వుందా అని గాభరా పడిపోయింది.


బ్రహ్మ భార్య కంగారు చూసి మూడు బోసి నోళ్ళతో ముసి ముసి నవ్వులు  నవ్వాడు. నవ్వి చెప్పాడు.

"నువ్వు పాళ్ళు చెబుతున్నప్పుడే అనుమానం వచ్చింది. కొన్ని శృతిమించుతున్నాయేమో అనికూడా అనిపించింది. అదీ మంచిదేలే,  సరే పోనీలే అనుకున్నాను. ఎందుకంటావా? శారీరక బలం వంటలో లవణం మాదిరిగా తగినంత అన్నావు. దానికి ఇన్ని పాళ్ళు అనిచెప్పలేదు. ఉజ్జాయింపుగా కొలిచివేసేటప్పుడు కొంత తభావతు తధ్యం. ఇక మానసిక బలహీనతలు ఏకంగా ఎక్కువే పెట్టావు. పాళ్ళు ఎక్కువైనా కష్టమే అన్న సూత్రం నువ్వు పట్టించుకోలేదు. వంటకం పూర్తయింది. ఇక రుచి అంటావా. వేసే దినుసుల పాళ్ళని బట్టి వుంటుంది. అలాగే,  ఈ బొమ్మ బతుకూ అంతే.   తెలివితేటలు, బలాబలాలు, మేధస్సు యేది తీసుకున్నా ఎవరికీ తీసిపోని మాట నిజమే. కానీ పాళ్ళలోనే తేడా. అందువల్లే ఈ విషయాల్లో ఒక   స్త్రీకి మరో స్త్రీకీ ఎంతో తేడా. దండలో దారంలాగా అమ్మతనం ఒక్కటే ఆడవారందరికీ ఉమ్మడి ఆభరణం. అదొక్కటే ప్రపంచానికి కూడా  పెద్దదిక్కు, ఆ గౌరవంతోనే సరిపుచ్చుకుని మిగిలిన అన్నింటినీ తేలిగ్గా మరచిపోతుంది.  ఈ పుత్తడి  బొమ్మకు నేనిస్తున్న అదనపు వరం ఇదే'   
NOTE : Courtesy Image Owner                

9, ఏప్రిల్ 2014, బుధవారం

మారడం అంటే మాటలు కాదు

పాత అలవాట్లు ఓ పట్టాన మారవు. పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు మొహం దాచుకున్న అలవాటు ఎక్కడికి పోతుంది. గీసింది వేసింది బాపూ గారా మజాకా! వారికి చెప్పాల్సింది కృతజ్ఞతలు కాదు. పెట్టాల్సింది దణ్ణాలే!


ఏ కౌన్ హై?


'ఈడెవడు?'
'తెల్వదు సార్ ఇప్పుడే గోడదూకి వస్తున్నాడు'
'ఏ పార్టీ?'

'అదీ తెల్వదు సార్! ఈ క్షణం నుంచీ మన పార్టీయే అంటున్నాడు'   

పర్వా నై


"సార్ తొందర్లో అతగాడిని మన పార్టీ అభ్యర్ధిగా ప్రకటించకండి. మనం పొత్తు పెట్టుకుందామని చర్చలు జరుపుతున్న పార్టీలో కొద్ది సేపటి క్రితమే దూరి పోయి ఆ పార్టీ కండువా కప్పెసుకున్నాడు."

"పర్వా నై భాయ్. అయితే ఆ సీటును పొత్తుల్లో ఆ పార్టీకి ఇచ్చేస్తున్నట్టు ఒక ప్రకటన చేస్తే సరిపోతుంది. దీనికి గాభరా యెందుకు?"    

8, ఏప్రిల్ 2014, మంగళవారం

BEST EVER CONDUCT CERTIFICATE GIVEN TO A MAN IN THE HISTORY OF MANKIND


"రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము, నా కావ్యమ్మె వృధయగునమ్మా!" - వాల్మీకి  



అమెరికన్ కాకమ్మ కధ


కాకమ్మ కధలు చెప్పేవాళ్ళు అమెరికాలో కూడా వుంటారు. అలాటి ఒక కధే ఇది.
కధ కాబట్టి, అందులోను అమెరికా కధ కాబట్టి  వూరికూరికే డౌట్లు అడక్కూడదు.
అనగనగా ఓ చదువుకోని నిరుద్యోగి మైక్రోసాఫ్టు ఆఫీసులో బంట్రోతు పనికోసం వెళ్ళి అక్కడి హెచ్ ఆర్ మేనేజర్ని కలిసాడు. (మైక్రోసాఫ్టు లాంటి సంస్థలో  బంట్రోతు ఉద్యోగం ఏమిటి అనే చొప్పదంటు ప్రశ్నలు మధ్యలో అడగరాదన్నది ఈ కాకమ్మ కధ చెప్పేవాడి కండిషన్.)
హెచ్ ఆర్ మేనేజర్ మనవాడి ఈ మెయిల్ అడిగాడు. 'పూటకు ఠికానా లేదు నాకో  కంప్యూటర్ పైగా ఓ ఈ మెయిల్ ఐడీ కూడానా' అని మనవాడు జవాబు చెప్పాడు. మేనేజర్ ఆశ్చర్యపోయాడు. 'నీకు  ఈమెయిల్ ఐడీ  కూడా లేదా. అదికూడా లేకుండా అమెరికాలో యెలా బతుకుతున్నావు?' అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే మనవాడు మొహం తిప్పుకుని బయట పడ్డాడు.
బయట పడ్డాడే కాని జీవితం పెట్టిన పరీక్ష నుంచి యెలా బయటపడాలో తెలియలేదు. అల్లా నడుచుకుంటూ వెడుతుంటే ఆదివారం సంత (?) కనబడింది. జేబులో పది డాలర్లు వున్నాయి. అవ్వే ఈనెలకు, కాదు  కాదు మొత్తం ఈ ఏడాదికీ మిగిలిన ఆఖరు మొత్తం. వెళ్ళి ధైర్యం చేసి పది డాలర్లు పెట్టి పది కిలోల టమాటాలు కొన్నాడు. ఓ సంచీలో వేసుకుని ఇల్లిల్లు తిరిగి అమ్మాడు. సాయంత్రం చూసుకుంటే ఇరవై డాలర్లు లాభం. ఓహో డబ్బు సంపాదించడం అంటే ఇదా అనుకున్నాడు. మళ్ళీ ఆ డబ్బులన్నీ పెట్టి టమాటాలు కొని మళ్ళీ వాటిని ఇంటింటికీ తిరిగి అమ్మాడు. పొద్దున  జేబులో వున్న పది డాలర్లు రాత్రికి ఇంటికి చేరేసరికి పిల్లలు పెట్టి  అరవై అయ్యాయి. తిరుగుడు, శారీరక శ్రమ తప్ప వేరే పెట్టుబడి లేదు. అతడికి తత్వం బోధపడింది. ఇక వెనుతిరిగి చూడలేదు.
నెల తిరిగేసరికల్లా బండి కొన్నాడు. మరోనెలకల్లా ట్రక్కు కొన్నాడు. మూడు నెలల్లో టోకు దుకాణం తెరిచాడు. ఐదేళ్ళల్లో ఏకంగా దేశంలో ఒక పెద్ద చైన్ సంస్థగా ఎదిగాడు. లక్షలకొద్దీ ఆదాయం, వేలకొద్దీ సిబ్బంది.
కుటుంబం కోసం ఏదయినా చేయాలనిపించి  ఒక ఇన్స్యూరెన్స్ సంస్థని సంప్రదించాడు. అతడు అడిగిందే భాగ్యం అనుకుని ఆ కంపెనీ తమ  మార్కెటింగ్ చీఫ్ నే అతడి ఇంటికి పంపింది.  అతగాడు వివరాలు తీసుకుంటూ యధాలాపంగా మనవాడి  ఈ మెయిల్ అడిగాడు. అలాటిదేదీ లేదన్నాడు. ఇన్స్యూరెన్స్ వాడు బిత్తరపోయాడు. ఇన్ని బిలియమ్ల టర్నోవర్ వున్న ఇంత భారీ సంస్థకు అధిపతి అయివుండి ఈ మెయిల్ కూడా లేకుండా ఇన్నిన్ని  వ్యాపారాలు యెలా చేయగలుగుతున్నారని అడుగుతూ అది కూడా వుంటే మీరు మరిన్ని కోట్లకు పడగలేట్టేవాల్లేమో అని నసిగాడు.
మనవాడు నవ్వాడు. అవతల మార్కెటింగు చీఫ్ గుండె పగిలేలా బిగ్గరగా నవ్వాడు.
నవ్వి అన్నాడు.
'అవును ఈ మెయిల్ అవీ వుండి వుంటే నేను ఈ పాటికి మైక్రోసాఫ్టు సంస్థలో ఆఫీసు బాయ్ గా వుండి  వుండేవాడిని'         
ఇలాటి కాకమ్మ కధలు బొచ్చెడు తెలుసంటారా? నాకు ఈ కధ చెప్పిన వాడితో నేనూ అదే అన్నాను.
(ఇంగ్లీష్ లో ఈ కధను పీవీవీజీ స్వామి గారు  నాకు మెయిల్ చేశారు. నేను దాన్ని ఇష్టం వచ్చినట్టు తెలుగులో చెక్కేసాను. షరా మామూలుగా స్వామిగారికి కృతజ్ఞతలు)