18, మార్చి 2014, మంగళవారం

సంజాయిషీ కాదు వివరణ మాత్రమే.


తిరుపతి అనుభవాలను గురించి కరకుగా రాయడాన్ని కొందరు తప్పుపట్టారు. సరయిన ఏర్పాట్లు జరక్కపోవడం వల్ల అలా రాశానన్నది వారి అభిప్రాయంగా తోచింది. అందుకే ఈ నాలుగు విషయాలు.
ముందే రాశాను తిరుపతి పోయింది తక్కువసార్లే కాని పెట్టిపుట్టుకున్న వాళ్ల తరహాలో తేలిగ్గా దర్శనాలు చేసుకున్న సందర్భాలే  ఎక్కువని.  ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని మార్పులు వచ్చాయి. అందుకే ఎవరినీ ఏమీ అడగకుండా మామూలుగా వెళ్ళి రావడం జరిగింది. ప్రస్తుతం ఈవో గా వున్న శ్రీ ఎమ్జీ గోపాల్, ఖమ్మం  కాలేజీలో మా హిందీ లెక్చరర్ శర్మ గారి కుమారుడు.  అప్పటినుంచి తెలుసు. కెరియర్ రీత్యా సీనియర్ కాని వయసు రీత్యా జూనియర్. అందరికీ సాయపడాలనే తత్వం వున్నమనిషి.  'సమర్ధులైన అధికారులే ఈవోలు గా పనిచేశారు, చేస్తున్నారు' అని కూడా రాయడం ఇందుకోసమే. అలాగే పాలకమండలి చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు. హైదరాబాదులో మా బోటి వారందరికీ చిరపరిచితులు. ఆయన చైర్మన్ అయిన కొత్తలో తిరుపతి వెడితే దూరం నుంచే గమనించి 'ఏం సీనూ బాగున్నావా' అని కావలించుకున్నారంటే  ఆయనతో వున్న సాన్నిహిత్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. మనిషి భోలా శంకరుడు. ఆయన భార్య ఆయన కంటే నాలుగాకులు ఆధ్యాత్మికపరురాలు. ఆ భార్యా భర్తలు ఇద్దరూ, వారి ఇంటికి వెళ్ళినప్పుడు వద్దని వారించినా  మా ఆలుమగలకు  కాళ్ళకు దణ్ణాలు పెట్టేవాళ్ళు. ఆవిడ నిమ్స్, కేన్సర్ ఆసుపత్రులకు వారం వారం వెళ్ళి పళ్ళూ వగైరా పంచిపెడుతూ వుండడం మాకు తెలుసు. వాళ్లింట్లో హోమాలు అవీ జరిగితే మేము వెళ్ళి వస్తుండేవాళ్ళం. ఇన్ని పరిచయాలు వున్నప్పటికీ మామూలుగా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని రావాలన్న అభిలాష ఇంతపని చేయించింది. అప్పుడు కళ్ళ బడ్డ సంగతులే పూసగుచ్చి రాశాను.
జర్నలిష్టులకు వర్తించే సామెత ఒకటుంది.
'ఎక్కడయినా బావ కాని వంగతోట దగ్గర కాదు'

కడుపు నిండిన కబుర్లు


"ఏమిటి మీ విషయం. పెట్టి పుట్టినట్టున్నారు. అందుకే తీరిగ్గా కూర్చుని ఇలా ఎడాపెడా రాసేస్తున్నారు' అని అడిగారొక ఫేస్ లెస్ బుక్ మిత్రుడొకరు.
పెట్టి పుట్టిన బాపతు కాకపోయినా పుట్టి పెట్టిన సంగతి కొంత నిజమే. 'ఇన్నేళ్ళు ఉద్యోగాలు చేసి ఒక్క ఇల్లు కూడా ఏర్పరచుకోలేదా' అని ఎద్దేవా చేస్తుంటాడు నా పత్రికా మిత్రుడు నందిరాజు రాధాకృష్ణ  కూడా, అక్కడికి  తానో (సొంత) ఇంటివాడయినట్టు.
కొందరు ఆస్తుల్ని కూడబెట్టుకుంటారు. అదేమిటో చిత్రం నేను ఆస్తుల్ని కన్నాను, ఇద్దరు కొడుకుల రూపంలో. చిన్నతనంలో వాళ్లకు ఏం చేసామో యేమో గుర్తు లేదు (అసలు ఏమన్నా చేస్తే కదా గుర్తు వుండడానికని మా ఆవిడ సన్నాయి నొక్కులు). కానీ, ఇప్పుడు మా పెద్దతనంలో మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇక ఇళ్ళూ వాకిళ్ళూ లేవని బెంగ యెందుకు?
అందుకే ఇలా తిని కూర్చుని తీరిగ్గా 'కడుపు నిండిన కబుర్లు' చెప్పడం.

అర్ధం అయిందా ఫేస్ లెస్ (నేమ్ లెస్) బుక్ స్నేహితుడు గారూ!.     

అయోమయం పార్టీలు


గెలుపు తధ్యం అంటారు. ఎదుటి పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే సిద్ధమైపోయారని చెబుతారు. రాబోయే రాజ్యం తమదే అని కాబోయే సీఎం  తామే అని బల్లగుద్ది చెబుతుంటారు. అన్ని పెద్దపార్టీలదీ దాదాపు ఇదే వరస. మరి అంత భరోసా వుంటే పక్క గూటి పక్షులు వచ్చి చేరుతుంటే అంత సంతోషపడడాలు, కండువాలు కప్పి ఫోటోలు తీయించుకోవడాలు, పత్రికల్లో వేయించుకోవడాలు   ఎందుకో అర్ధం కాదు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడే సమయంలో కంచె దూకుతున్న జంపు జిలానీలు పార్టీలకి బలుపా వాపా. ఏవిటో అంత వరదలో కొట్టుకుపోతున్నట్టుగా వుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.       

17, మార్చి 2014, సోమవారం

బతికి పోయాం

వార్త : "........పద్నాలుగు రోజుల రిమాండ్ "
వ్యాఖ్య : "రాష్ట్రపతి పాలన పుణ్యం. లేకపోతే వాళ్లు ఈపాటికి మన పక్కవీధి బారులో చిందులేస్తూ వుండేవారు."

పాతికేళ్ళనాటి మాస్కో - 23


మాస్కోలో మెక్ డొనాల్డ్ 

1990 వ సంవత్సరం ప్రారంభంలో కాబోలు మాస్కోలో మొట్టమొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ మొదలయింది. అప్పుడు చూడాలి తమాషా. మాస్కో నగరంలో వున్న పిల్లలు,  యువతీ యువకులు అందరికీ అదొక అడ్డాగా మారిపోయింది.  అంటే హైదరాబాదులో ఒకప్పుడు ఇరానీ కఫేలు చాలామందికి రోజూ పరస్పరం కలుసుకునే ప్రదేశాలుగావుండేవి. అక్కడ కూర్చుని సమోసాలు, టై బిస్కెట్లు  తింటూ వేడి వేడి చాయ్ తాగుతూ, దక్కన్ క్రానికల్ పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ కుర్రకారు భలేగా  కాలక్షేపం చేసేవారు.  అయితే మాస్కో మెక్ డొనాల్డ్ విషయంలో కాసింత తేడా వుంది. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే సావకాశం వుండేది కాదు. ఎప్పుడు చూసినా కిలోమీటర్ల పొడుగునా క్యూలు దర్శనమిచ్చేవి. మా పిల్లలు అక్కడికి వెళ్లి పిజ్జా తిని కోక్ తాగిరావాలంటే ఒక పూటకు పైనే  పట్టేది.
 ఆ రెస్టారెంట్ కు కొద్ది దూరంలోనే  లెనిన్ సమాధి వున్న రాతి పలకలు పరచిన  మైదానం వుండేది. ఈ మెక్ డొనాల్డ్ వచ్చిన తరువాత అక్కడ క్యూలు పలచబడ్డవని హాస్యోక్తిగా చెప్పుకునే వారు.
ఇనుప తెర దేశంగా పేరు పొందిన సోవియట్ రష్యా లో గోర్భచెవ్ సంస్కరణల పుణ్యమా అని తలుపులు బార్లా తెరవడంతో మెక్ డొనాల్డ్ వంటి పాశ్చాత్య రెస్టారెంట్లకు అక్కడ కాలుమోపే అవకాశం దొరికింది.
మాస్కో మెట్రో సింబల్  ఇంగ్లీష్ అక్షరం ‘M’ని పోలివుంటుంది. సరిగ్గా దానిలాగే వుండే మెక్ డొనాల్డ్ సింబల్ కూడా మాస్కో యువతరాన్ని అమితంగా ఆకర్షించింది.
మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లలో బాగా అమ్ముడుపోయే బిగ్ మాక్ మాస్కో రెస్టారెంట్ లో బల్షోయీ మాక్ అనేవారు. రష్యన్లో బల్షోయీ అంటే పెద్ద అని అర్ధం. అప్పట్లో బిగ్ మాక్ ధర  రెండు రష్యన్ రూబుళ్లు. అంటే అమెరికా కరెన్సీలో చెప్పాలంటే మూడు  డాలర్ల ముప్పయ్ ఎనిమిది సెంట్లు. సగటు రష్యన్ పౌరుడి నెల జీతంలో వందో వంతు. కాకపొతే ఇవన్నీ గతకాలపు ముచ్చట్లు సుమా!
మాస్కో పౌరులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ మెక్ డొనాల్డ్ కధాకమామిషూ ఏమిటంటే-
1940 మే 15 వ తేదీన మొట్టమొదటి మెక్డొనాల్డ్ రెస్టారెంట్ ను- డిక్, మాక్ మెక్డొనాల్డ్ అనే సోదరులు కలసి కాలిఫోర్నియాలోని సాన్  బెర్నార్డినో అనే చోట ఏర్పాటుచేశారు. అలా మొదలయిన ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ రెస్టారెంట్లు కాలక్రమంలో 122  దేశాలకు ఎగబాకి మొత్తం ముప్పై వేల పైచిలుకు రెస్టారెంట్లతో యావత్ ప్రపంచ ప్రజానీకాన్ని తమదయిన  రుచులతో అలరించే  స్తాయికి చేరుకున్నాయి.
ఇక అమెరికాలో మెక్ డొనాల్డ్ ప్రభ యెలా వెలుగుతున్నదో తెలుసుకోవాలంటే కొన్ని గణాంకాలు అవసరం. 1970 లో మెక్డొనాల్డ్ అమ్మకాలు మొత్తం అమెరికాలో ఆరు బిలియన్ డాలర్లు వుండగా 2001 నాటికి అవి 110 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే ఆ దేశంలో ఉన్నత విద్య పైనా, కంప్యూటర్లు, మోటారు కార్లు, సినిమాలు, మాగజైన్లు, పుస్తకాలు, వీడియోలు వీటన్నిటి పైనా కలిపి ఆ దేశస్తులు ఖర్చు పెట్టే మొత్తం కంటే ఇది చాలా చాలా  ఎక్కువ.

 (20-03-2012)

16, మార్చి 2014, ఆదివారం

జనమే దేవుడికి సమస్య


దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.
వున్నాడని నమ్మేవాళ్ళంటారు.
దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు.
దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.
వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.
తొక్కితే రాయి  మొక్కితే సాయి. అంతా నమ్మకం.
దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.

దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.
దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)
నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటానని ఎంత మొత్తుకున్నా వినేదెవరు?
చెట్టులో,పుట్టలో అంతటా నేనే అన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.
ఇక ఇప్పుడో! పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.

పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!
దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.
నమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య  అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది.


సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు. నిజానికి మనమే ఆయనకు సమస్య.

అద్భుతః


అద్భుతాల కోసం వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు. చూసే కళ్ళు, ఆస్వాదించే హృదయం వుండాలే మన చుట్టూనే వున్నాయి  ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు.
ఈ పాడు ప్రపంచంలోకి ఏడుస్తూ వచ్చిన పాపాయి కొద్ది రోజుల్లోనే తన బోసి నోటితో ముసి ముసి నవ్వులు నవ్వడం చూడండి. అంతకంటే అద్భుతం ఏముంటుంది.



కుండీలో వున్న పూల మొక్క మారాకు వేసి  పూతపూసి మొగ్గ తొడిగి పూవు విచ్చుకోవడం గమనించండి. యెంత అద్భుతంగా వుంటుందో ఆ దృశ్యం.
మండు వేసవిలో పెనంలా మారిన వాతావరణం. వున్నట్టుండి చెప్పాపెట్టకుండా  ఒక్క వాన కురుస్తుంది. వేల ఎయిర్ కండిషనర్లు కూడా ఇవ్వలేని చల్లదనం ఒక్కసారిగా అనుభవంలోకి వస్తుంది. యెంత గొప్ప అద్భుతం.

ఇలాటి ఎన్నో అద్భుతాల మధ్యనే మన జీవితాలు గడిచిపోతున్నాయి. అయినా ఇంకా మరేదో అద్భుతం చూడాలని  వెంపర్లాట.