23, డిసెంబర్ 2013, సోమవారం
తానే మారునా!........
బల్బు మాడింది
శంకరం
ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే ఏడేళ్ళ బుడుగు తండ్రిని అడిగాడు.
‘నేను ఇక్కడికి ఎక్కడినుంచి యెలా వచ్చాను?’
శంకరానికి
ముందా ప్రశ్న అర్ధం కాలేదు. అర్ధం అయినతర్వాత దానికి జవాబు ఏం చెప్పాలో ఓ పట్టాన
అర్ధం కాలేదు.
తల్లి
గర్భంలోనుంచి పిల్లలు యెలా వస్తారో చెప్పే ఈడు కాదు పిల్లాడిది. అందుకే సమాధానం
చెప్పకుండా దాటవేద్దామనుకున్నాడు. వాడి వయసా చిన్నది. కొన్నేళ్ళు పోతే వాళ్ళకే
తెలుస్తుంది అనుకునే సంస్కృతి ఇంటావంటా వొంటబట్టించుకున్న కుటుంబమాయె.
కానీ
కాసేపటి తరువాత శంకరం మనసు మార్చుకున్నాడు. ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఇంకా బూజు
పట్టిన పాత సంస్కృతినే పట్టుకుని వేలాడితే యెలా అని కూడా అనుకున్నాడు. అందుకే
స్త్రీల గర్భధారణ గురించీ, నవమాసాలు మోసి బిడ్డను కనే దాకా అతడు ఎక్కడినుంచి భూమిమీదకు యెలా వచ్చాడో
అంతా అరటిపండు వొలిచి చెప్పినట్టు పిల్లాడికి చెప్పేసి ‘అమ్మయ్య’
అనుకున్నాడు. తను అందరిలాటి తండ్రిని కాదు కొంత స్పెషల్ అని కూడా
అనుకున్నాడు.
మరి
కాసేపటికి బుర్రలో బల్బ్ వెలిగింది.
వున్నట్టుండి
బుడుగు ఎందుకా ప్రశ్న వేసాడు. అదే అడిగాడు.
“ఏం లేదు నాన్నా! నిన్న మన పక్క వాటాలో దిగిన సుందరం అంకుల్ పిల్లాడిని
మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే అమలాపురం నుంచి అన్నాడు. దాంతో మనం ఎక్కడి
నుంచి వచ్చామో తెలుసుకోవాలని నిన్నడిగాను. అంతే!”
బుడుగు జవాబుతో శంకరం బుర్ర గిర్రున తిరిగింది.
(నెట్లో
కానవచ్చిన ఇంగ్లీష్ ఆర్టికిల్ ఆధారంగా)
NOTE: Courtesy Image owner
ఈరోజు పీవీ తొమ్మిదో వర్ధంతి - ఓ జ్ఞాపకం
పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావిడి యెలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీ మార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు – ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
మాజీ ప్రధానిగా పీవీ రాజ భవన్ లో వున్నప్పుడు – నేనూ , ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావు గారు - గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి - ఆ పని పూర్తిచేసుకున్నతరవాత - రాజ్ భవన్ గెస్ట్ హౌస్ మీదుగా తిరిగి వెడుతూ అటువైపు తొంగి చూసాము. సెక్యూరిటీ మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము. అక్కడవున్న భద్రతాదికారిని ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అడిగాము. అతడు తాపీగా 'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూ లోపలకు అడుగు పెట్టాము.
పెట్టిన తరవాత – మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్ బాల్ మాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగుతోనే - మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నా వైపు చూస్తూ- 'మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా!' అని అడిగేసరికి నాకు మతి పోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు - మా అన్నయ్య పర్వతాలరావు గారు సమాచారశాఖ అధికారిగా ఆయనకు పీఆర్వో గా కొద్దికాలం పనిచేశారు. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీగారి గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది – కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని వొంటి చేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం వల్ల – కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత – కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది.
“ఆనో భద్రాః క్రతవో యన్తు విశ్వతః” అని రిగ్వేదం చెబుతోంది. అంటే అన్ని వైపులనుంచి ఉత్తమమైన భావాలు నాలో
ప్రవేశించు గాక అని అర్ధం.
పరీక్ష జరిగే హాలు
నిశ్శబ్దంగా వుంది. విద్యార్ధులందరూ జవాబులు రాసే క్రమంలో తలమునకలైవున్నారు.
(శ్రీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్)
పరీక్షరాసే వారిలో
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వున్నారు. తరగతి మొత్తంలో చాలా తెలివిగల విద్యార్ధి. అతడి
వెనుకనే మనీష్ కూర్చుని ప్రశ్నాపత్రాన్ని దీక్షగా చూస్తున్నాడు. సహజంగా మందబుద్ధి
అయిన మనీష్ కు ఆ పరీక్ష గట్టెక్కడం అన్నది ఒక పరీక్ష గా తయారయింది. అందుకే అతడు ఈ విషయంలో
తన స్నేహితుడయిన విద్యాసాగర్ సాయం కోసం ఎదురుచూస్తూ బిత్తర చూపులు చూస్తున్నాడు.
ఈలోగా ఈశ్వరచంద్ర విద్యాసాగ ర్ జవాబులురాసే పని పూర్తయింది. రాసిన సమాధానాలను
మరోమారు పరిశీలించుకునే పనిలో పడిపోయాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనీష్ మరో
మారు ఈశ్వర్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసాడు. తన స్నేహితుడు కోరుతున్నదేమిటో
ఈశ్వర్ కు సులువుగానే అర్ధం అయింది. కానీ ఈ విషయంలో స్నేహితుడికి సాయం చేయడానికి
అతడికి మనస్కరించ లేదు. కానీ, దీనంగా
అభ్యర్ధిస్తున్న స్నేహితుడి చూపులకు అతడి మనసు మెత్తపడింది. దాంతో అప్పటి వరకు
తాను రాసిన సమాధాన పత్రాన్ని మనీష్ కు రహస్యంగా అందించాడు. ఇది ఎవరూ
చూడలేదనుకున్నాడు కానీ, ఈశ్వర్
కాపీ అందిస్తూ వుండడం పరీక్ష హాలులో పర్యవేక్షణ చేస్తున్న ఉపాధ్యాయుడి కంటబడింది.
అయ్యవారు ఆగ్రహంతో వూగిపోతూ ఈశ్వర్ ని పట్టుకుని కఠినంగా శిక్షించాడు. నలుగురిలో
జరిగిన ఈ అవమానంతో స్వతహాగా అభిమానధనుడయిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఎంతగానో
కుంగిపోయాడు.
పరీక్ష పూర్తి కాగానే
ఉపాధ్యాయుడు ఈశ్వర్ ని తన గదికి పిలిపించుకున్నాడు.
“చూడు. ఈశ్వర్. నువ్వు చాలా తెలివైన విద్యార్ధివి. బాగా చదువుకుని
పైకి రావాల్సినవాడివి. నీలాటి తెలివయిన కుర్రవాడిని అలా శిక్షించినందుకు నాకెంతో
బాధగా వుంది” అంటూ
ఓదార్చే ప్రయత్నం చేసాడు.
స్నేహితుడికి సాయం చేయాలన్న
సదుద్దేశ్యం తప్ప దగా చేయాలన్న అభిప్రాయం తనకు యే కోశానా లేదని విద్యాసాగర్
సంజాయిషీ ఇచ్చుకున్నాడు.
డానికి ఉపాధ్యాయుడు ఇలా
జవాబు చెప్పారు.
“తప్పుచేసినవాడు పాపితో సమానం. కానీ తప్పుచేసేవాడికి సాయం చేసేవాడు
కూడా వాడితో సమానమే. అందుకే, నిన్నుశిక్షించాల్సి
వచ్చింది. నిజమే. నువ్వు మనీష్ కి సాయం చేయాలని అనుకున్నావు. కానీ అలా చేయడం
ద్వారా అతడిలోని బద్ధకానికి కూడా సాయం చేస్తున్న సంగతి మరచిపోయావు. అల్లా ఎవరో ఒకరు
నీలా సాయం చేస్తూ పోతుంటే, ముందు
ముందు తోటివారి సాయం తీసుకోకుండా అతడిక యేపనీ చేయలేడు”
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
వంటి మహా మేధావి స్వయంగా వెల్లడించిన ఈ ఉదంతం ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఒకటుంది.
“మనం చేసే ప్రతి పని వల్ల వచ్చే ఫలితం మంచి చెడుల సమ్మిశ్రమం. ఇతరుల
జీవితాలను మంచి వైపు నడిపించే దిశగా మనం చేసే పనుల ఫలితం వుండేలాగా చూసుకోవాలి.
అటువంటి చక్కటి భావనలు అన్ని వైపులనుంచి మన మనస్సులో ప్రవేశించేలా ఎప్పటికప్పుడు
ప్రయత్నం చేస్తూవుండాలి.”
లేబుళ్లు:
శ్రీ ఈశ్వరచంద్ర విద్యాసాగర్
22, డిసెంబర్ 2013, ఆదివారం
కోతి వీసా
అనగనగా ఒక వూరు. ఆ వూర్లో ఓ
జంతు ప్రదర్సన శాల.
అసలే ఇది చిట్టిపొట్టి కధ.
ఈ కధలో పదేపదే వచ్చే ఈ పదాన్ని అలా సాగదీసి రాయడం బాగోదు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ల
భాషలో పొట్టిగా ‘జూ’ అనుకుందాము.
ఆ జూ లోని ఓ బోనులో జూలు
బాగా పెంచుకున్న ఓ సింహం వుంది. రోజుకు కనీసం ఓ కిలో మాంసం కూడా తన మొహాన విదల్చడం
లేదని ఆ జూ అధికారులపై దానికి తగని కోపం. జూలు విదిల్చి, కాలు దువ్వాలని వుంది కానీ ఏం లాభం. తానున్నది అడవి కాదాయే.
పైగా ఆ జూ అధికారులు అడవి జంతువులకన్నా క్రూరులు.
వాళ్లకు తిక్క తిరిగిందంటే దొంగలెక్కలు
రాసి ఆ మాత్రం మాంసం కూడా పెట్టకుండా తన డొక్క మాడ్చగల సమర్ధులన్న సంగతి ఆ మృగ
రాజుకు తెలుసు. అందుకే ‘అనువుగాని
చోట అధికులమనరాదు’ అన్న
నీతి వాక్యం ప్రకారం మిన్నకుండి పోయింది.
కొన్ని రోజులకు ఏం జరిగిందో
తెలవదు. దాని గోడు విన్న తధాస్తు దేవతలు కరుణించారేమో తెలియదు. ఏదయితేనేమి,
దుబాయిలో వున్న ఓ జూ అధికారి
ఓ రోజు ఈ
జూ చూడడానికి వచ్చి, తగిన
ఆహారం లేక చిక్కిపోయిన ఈ సింహాన్ని చూశాడు. ‘చక్కనమ్మ చిక్కినా అందం’
అనుకున్నాడేమో దాన్ని తన దుబాయ్ జూ కు తీసికెళ్ళాడు.
ఎమిరేట్స్ విమానం ఎక్కిన
దగ్గరనుంచి సింహానికి ఆకాశంలో తేలిపోతున్న అనుభూతి కలిగింది. ఆ దేశంలో జూలన్నీ
సెంట్రల్ ఏసీ అని ఎవరో చెప్పగా విన్న సంగతి గుర్తు వచ్చి దాని వొళ్ళు పులకరించి
పోయింది. ఎంచక్కా చల్లటి బోనులో కూర్చుని దుబాయ్ జూ అధికారులు రోజూ ఆహారంగా పెట్టే
ఒకటి రెండు మేకలను కడుపారా తింటూ కడుపులో మాంసం కదలకుండా కాలక్షేపం చేసే సన్నివేశాలను
వూహించుకుంటూ ఆ సింహం దుబాయ్ జూ చేరుకుంది.
అది కలలు కన్నట్టే దానిని
ఒక ప్రత్యేక బోనులో వుంచారు. నీటుగా దుస్తులు ధరించిన జూ పనివాడు ఒకడు పొద్దున్నే
వచ్చి చాలా నీటుగా ప్యాక్ చేసిన ఆహారం పొట్లాన్ని అందించాడు. ఇక తన కష్టాలన్నీ తీరిపోయాయి
అని అనుకుంటూ సింహం ఆత్రంగా ఆ పాకెట్ విప్పింది. అందులో మూడు నాలుగు అరటి పండ్లు
వున్నాయి. అసలే పరాయి దేశం - భాష అర్ధం కాక పొరపడ్డారేమోనని మొదటి రోజు
సర్దిచెప్పుకుంది. కానీ రెండో రోజూ, ఆ మరునాడు కూడా పనివాడు అరటి పండ్లే పెట్టడంతో సింహానికి తిక్కరేగింది.
పండ్లు పట్టుకుని
వచ్చినవాడిని నిలబెట్టి దులిపేసింది.
‘ఏం ఇక్కడ మీ అందరికీ నన్ను చూస్తే తమాషాగా వుందా.
నేనెవరనుకుంటున్నారు. మొత్తం అడవికే రాజుని. అరటి పండ్లు తినడానికి నేనేమన్నా కోతి
ననుకుంటున్నారా?’ అని
గాండ్రించింది.
అయితే, సింహం గాండ్రింపులకు బెదిరిపోవడానికి
ఆ జూ పనివాడు అడవిలో ఏనుగు కాదు కదా. అందుకే అతగాడు తాపీగా జవాబు చెప్పాడు.
“నువ్వు సింహానివన్న విషయం ఇక్కడ పుట్టిన పిల్లులకు కూడా తెలుసు.
కాకపోతే నిన్నిక్కడికి ‘కోతి’ వీసా మీద తీసుకొచ్చిన సంగతే
నీకు తెలిసినట్టు లేదు”
నీతి:
పరాయి దేశంలో కోతిగా వుండడంకన్నా
మాతృదేశంలో సింహంగా బతకడం మేలు.
Note:
Courtesy Image Owner
శ్రీ తిరుమల రామచంద్ర గారి శత జయంతి
నా వయస్సు అరవై ఎనిమిది. అంటే నేను పుట్టకమునుపే
ఆయన విఖ్యాత పత్రికల్లో జర్నలిష్టు. ఒకటి రెండు భాషల్లో అరకొర అభినివేశం నాదయితే
అనేక భాషల్లో మంచి పట్టు సాధించిన ప్రజ్ఞాశీలి వారు. ఎక్కడో ఏదో జెర్రి పోతంత అదృష్ట
రేఖ కనీ కనబడకుండా వుందేమో. లేకపోతే నేనేమిటి ? అంతటి పండిత ప్రకాండుడి శత జయంతి
సందర్భంగా ఈరోజున జరిగే ఓ సమావేశానికి అధ్యక్షత వహించడం ఏమిటి? పెట్టిపుట్టకపోతే
ఇలాటిది సాధ్యమా!
తిరుమల రామచంద్ర గారి గురించి చెప్పడం ఆయనకే
సాధ్యం అని నా నమ్మకం. తనని గురించి తాను చెప్పుకున్నా అందులో సొంత గొప్పలు
కనబడవు. పైగా మానవ సహజమైన బలహీనతలను కూడా ఆయన ఎంతమాత్రం భేషజాలకు పోకుండా నిర్భీతిగా
రాసుకున్నారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి ఇదే గీటురాయి.
పుట్టిన వందేళ్ళ తరువాత ఆయన్ని గుర్తుంచుకుని
వేడుక చేస్తున్న సందర్భం ఇది. ఈ పుణ్యం కట్టుకున్నవాళ్ళు బహుధా అభినందనీయులు.
ఎందుకంటే – అక్కిరాజు రమాపతిరావు గారు పేర్కొన్నట్టు రామచంద్ర గారు జీవించి వుండగా
వారికి ‘షష్టిపూర్తి జరగలేదు. సప్తతి లేదు. అశీతి అసలే లేదు. సహస్ర చంద్ర దర్శన
ఉత్సవం సమకూడలేదు. పూర్ణ జీవితం అనుభవించి కూడా రామచంద్రగారు త్రిదశుడు’ అన్నారు
అక్కిరాజువారు. అంటే ఏమిటట. ఎప్పుడూ ముప్పయ్యేళ్ళవాడిగానే జీవించారట. బాల్య,
కౌమార, యవ్వన, నిర్మల, నిర్భర, నిరంతర, సమధికోత్సాహ మనస్విత తోనే ఆయన ఎనభై
నాలుగేండ్ల జీవితాన్ని యదృచ్చాలాభ సంతుష్టంగానే గడిపారని అద్భుతమయిన కితాబు
ఇచ్చారు.
కొందరు కొన్నిట్లో తమ ప్రతిభ కనబరుస్తారు. కానీ
రామచంద్రగారో. ఆయన వేలు పెట్టని రంగం లేదు. పత్రికా రచయిత, కవి, గ్రంధకర్త,
విమర్శకుడు, బహుభాషా కోవిదుడు. అంతేనా అంటే అంతే కాదు. పదం బాగాలేదేమో కాని ఆయన దేశదిమ్మరి.
ఆయనలా వూళ్ళుపట్టుకుని తిరిగిన జర్నలిష్టు మరొకరు కనబడరు. జీవిక కోసం ఆయన ఎత్తని
అవతారం లేదు. అనంతపురం జిల్లాలో ఓ మారుమూల కుగ్రామం రాఘవం పల్లి(రాగంపల్లి) లో
పుట్టి, నాటి బళ్ళారి జిల్లా ఆనెగొందిలో ప్రాధమిక విద్య, తిరుపతి దేవస్థానం కళాశాలలో
చదువు, నెల్లూరు ఆయుర్వేద కళాశాల, చెన్నపట్నం మైలాపూర్ కాలేజీ ఇలా ఇలా సాగి లాహోరు,
బెలూచిస్తాన్, క్వెట్టా, చమన్ ప్రాంతాలు తిరిగి, కాన్పూర్ లో డెయిలీ టెలిగ్రాఫ్
పత్రికలో చేరడం వరకు సాగిపోయింది. అంతటితో ఆగితే ఆయన రామచంద్రగారు యెట్లా అవుతారు.
హైదరాబాదులో మీజాన్ ఉర్దూ పత్రిక, తరువాత ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్ర పత్రిక
దినపత్రికల్లో చాలాకాలం తన రచనలతో వాటికి ఒక విశిష్టతను తెచ్చిపెట్టారు.
‘హంపీ నుంచి హరప్పా దాకా’
అనే రచనలో తిరుమల రామచంద్ర గారు తన జీవితానుభవాలను రసరమ్యంగా కూర్చారు. ఈ శుభ
సందర్భంలో వారికి నా కైమోడ్పు. (22-12-2013)
లేబుళ్లు:
తిరుమల రామచంద్ర శతజయంతి,
Tirumala Ramachandra
21, డిసెంబర్ 2013, శనివారం
పాత సన్నిహితులతో కాసేపు....
రాష్ట్ర శాసనమండలి సమావేశాలు వాయిదా పడిన సందర్భంలో మండలి చైర్మన్ శ్రీ చక్రపాణి గారు నిన్న మధ్యాహ్నం మండలి ఆవరణలో పత్రికా విలేకరులకు విందు ఏర్పాటు చేశారు. నేను యాక్టివ్ రిపోర్టింగ్ లో లేకపోయినా పాత సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని వారు స్వయంగా ఆహ్వానించడం వల్ల నేను వెళ్లడం అనేకమంది పాత మిత్రులను కలుసుకోవడం జరిగింది. అవే ఈ చిత్రాలు. వీటిల్లో నా పాత్రికేయ మిత్రుడు విద్యారణ్య, అనేక సంవత్సరాలుగా సన్నిహిత పరిచయం వున్న మండలి విప్ శ్రీ పద్మరాజు వున్నారు.
PHOTO COURTESY SHRI SALEEM
PHOTO COURTESY SHRI SALEEM
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)









