“వాల్మీకి
మహర్షి గొప్ప పండితుడే కాదు ఖగోళ
శాస్త్రవేత్త కూడా. అందుకే ఆయన శ్రీరామ చరితాన్ని రాస్తూ కొన్ని ముఖ్యమయిన సందర్భాలు, ఘట్టాలు గురించి వర్ణించే క్రమంలో అప్పటి గ్రహాలూ, నక్షత్రాల స్తాన వివరాలను కూడా ఉటంకించగలిగారు. ఇలాటి సమాచారాన్ని
ఆధారంగా చేసుకుని అప్పటి తిధి
నక్షత్రాలకు సమానమయిన ఇంగ్లీష్ తేదీలను కనుగొనే ‘ప్లానటేరియం’ అనే సాఫ్ట్
వేర్ ను పుష్కర్ భట్నాగర్ అనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఒకరు అమెరికా నుంచి సంపాదించారు. సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించే తేదీలను ఖచ్చితంగా లెక్కగట్టడానికి, భూమికీ, ఇతర గ్రహాలకీ
నడుమ వున్న దూరాన్ని గణించడానికీ ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది.
“రామాయణంలో
వాల్మీకి పేర్కొన్న గ్రహ రాశుల గతులను, నక్షత్రాల స్తానాల వివరాలను కంప్యూటర్
లోకి ఫీడ్ చేసి ఈ సాఫ్ట్ వేర్ సాయంతో చాలా ఆసక్తికరమయిన సమాచారాన్ని భట్నాగర్
తెలుసుకున్నారు. శ్రీరాముడి జననం
నుంచి పదునాలుగేళ్ళ వనవాసం అనంతరం
సీతాలక్ష్మణ సమేతుడై రాముడు
అయోధ్యకు తిరిగివచ్చి పట్టాభిషిక్తుడయ్యేవరకు రామాయణంలోని అనేక ముఖ్య
ఘట్టాల కాల పట్టికలను దాదాపు నిర్ధారించే విధంగా ఈ ఫలితాలు వున్నాయి.
“రామాయణం
బాలకాండ పందొమ్మిదో సర్గ, ఎనిమిది, తొమ్మిది శ్లోకాలలో శ్రీరాముడు చైత్ర మాసంలో నవమినాడు జన్మించినట్టు
వాల్మీకి పేర్కొన్నారు. శ్రీరాముని
జనన సమయంలో రవి మేషంలో, గురువు
కర్కాటకంలో, శని తులలో, శుక్రుడు మీనంలో, కుజుడు
కర్కాటకంలో ఉచ్చస్తులై వున్నారు. జాతకాలు తెలిసిన వారు చెప్పేదేమిటంటే ఈ
జాతకుడు మానవమాత్రుడు కాదు. నిజమే కదా! మానవుడిగా జన్మించిన సాక్షాత్తు శ్రీ
మహా విష్ణువే కదా ఈ శ్రీరాముడు.
“శ్రీరాముడు
జన్మించింది చాంద్రమానం ప్రకారం
చైత్రమాసంలో. తిధి నవమి.
కర్కాటక లగ్నం. లగ్నంలో గురువు ఉచ్ఛస్తితిలో
వున్నాడు. చంద్రుడు మిధునంలో
వున్నాడు. అంటే మిధున
రాశి. పునర్వసు నక్షత్రం. పగటి పూట, మధ్యాహ్న సమయం.
“ఈ వివరాలను
అన్నిటినీ ఈ సాఫ్ట్ వేర్ లోకి ఫీడ్ చేసి చూసారు. ఫలితం!
వీటికి సరిపోలిన విధంగా అంటే
ఇదేక్రమంలో గ్రహరాశులు కూడిన రోజు
క్రీస్తుకు పూర్వం 5114 జనవరి పదో
తేదీ అని తేలింది. అంటే, ఈ
పరిశోధనావ్యాసం రాసే సమయానికి 7121
సంవత్సరాలక్రితం ఆ తేదీన శ్రీరాముడు జన్మించాడన్నమాట. మన తిధుల ప్రకారం ఆ తేదీని పరిశీలిస్తే ఆ రోజు చైత్ర మాసం, శుక్ల పక్షం, నవమి. సమయం
మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట మధ్య.
అధిక మాసాలు, శూన్య మాసాలు ఈ
తేదీల లెక్కింపులో వచ్చిన కొన్ని
తేడాలకు కారణం అయివుండవచ్చు.
“శ్రీరాముడు
అయోధ్యలో జన్మించాడు. భారతీయ భాషల్లో వెలువడిన అనేక రామాయణాలు అంటే వాల్మీకి
రామాయణం, తులసీ రామాయణం, కాళిదాసు రఘువంశం మొదలయిన మహా కావ్యాల్లోనే కాకుండా బౌద్ధ
జైన సాహిత్యాలతో పాటు క్రీస్తుకు
పూర్వం, ఆ తరువాత
వచ్చిన విదేశీ రచయితల గ్రంధాల్లో సయితం రాముడు అయోధ్యలో జన్మించినట్టు ప్రస్తావనలు వున్నాయి.
అయోధ్యలోను, అయోధ్య రాజధానిగా వున్న
సామ్రాజ్యంలోను ఆనాడు నెలకొనివున్న
అద్భుతమయిన ఆలయాలు, ఆ దేవాలయాల్లో
నిక్షిప్తమయిన సుసంపన్న శిల్ప కళా వైభవం గురించి కూడా ఈ గ్రంధాల్లో పేర్కొన్నారు.
“అయోధ్య సరయూ నదీ తీరంలో వుంది.
ఏడువేల ఏళ్ళ క్రితం సంగతి అంటే చాలా పురాతనమయిన విషయం. సుదీర్ఘమయిన ఈ మధ్య
కాలంలో భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి సహజమయిన
విపత్తులు అనేకం సంభవించి వుండవచ్చు. వీటి ఫలితంగా నదుల ప్రవాహ దిశలు
మారడానికి అవకాశం వుంటుంది. అలాగే
విదేశీ దురాక్రమణలు, దండయాత్రల వల్ల నగరాలు నాశనం
అయిపోవడానికి,
సరిహద్దులు
మారిపోవడానికి వీలుంటుంది. అందువల్ల ఆనాటి నైసర్గిక వాస్తవాలను వెలికి తీయడం
ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ నాటి
అయోధ్యను ఆనాటి అయోధ్యతో పోలిస్తే విస్తీర్ణంలో కుదించుకునిపోయి వుండవచ్చు.
అలాగే,
నదీ
పరివాహక దిశలు కూడా ఉత్తర, దక్షిణంగా సుమారుగా నలభయ్ కిలోమీటర్లు అటూఇటుగా మారిపోయి
వుండవచ్చు.
“వాల్మీకి
రామాయణం ప్రకారం శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షితో కలసి యాగ సంరక్షణార్ధం
తపోవనానికి వెళ్ళిన సమయంలో ఆయన
వయస్సు పదమూడు సంవత్సరాలు. అక్కడి నుంచి జనక మహారాజు రాజధాని మిధిలకు
వెడతారు. శివ ధనుర్భంగం అనంతరం శ్రీరాముడు సీతను పెళ్ళాడతాడు. ఈ విషయం మీద
శోధనకు పూనుకున్న పరిశోధకులు, వాల్మీకి
రామాయణంలో పేర్కొన్న రీతిలో అదే మార్గంలో ప్రయాణించి 23 ప్రదేశాలను గుర్తించారు. శృంగి ఆశ్రమం, రాం ఘాట్, తడ్కా వన్, సిద్దాశ్రం, గౌతమాశ్రం, జనక్పూర్ (ప్రస్తుతం నేపాల్ లో వుంది), సీతాకుండ్ మొదలయినవి వీటిల్లో వున్నాయి. ఈ ప్రదేశాల్లో రామాయణంలో
వర్ణించిన ఘట్టాలకు తగిన చారిత్రిక ఆధారాలు కూడా వారికి లభించాయి.
“దశరధ మహారాజుది
మీన రాశి. రేవతీ నక్షత్రం. వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో పెద్ద కుమారుడయిన
శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని దశరధుడు సంకల్పిస్తాడు. దీనికి ఒక కారణం
వుంది. దశరధుడికి జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యం వుంది. రవి, కుజుడు, రాహువు ఒకే
కూటమిగా ఏర్పడినప్పుడు, ఆ సమయంలో రాజ్య పాలకుడికి మరణం సంభవించే అవకాశం
వుంటుంది. లేదా కుట్రలు కుతంత్రాలకు బలి అయ్యే ప్రమాదం పొంచి వుంటుంది. రవి,
కుజ, రాహు కూటమి ఏర్పడిన విషయం తెలిసిన వాడు కనుకనే యువ రాజయిన
రాముడిని సింహాసనం ఎక్కించాలనే
తొందరలో రామ పట్టాభిషేకానికి దశరధుడు అంతగా
ఆరాటపడ్డాడనుకోవాలి.
“క్రీస్తుకు
పూర్వం 5089 సంవత్సరం జనవరి ఐదో తేదీన ఇదే విధమయిన అంటే రవి,కుజ, రాహువులతో కూడిన గ్రహ
కూటమి ఏర్పడి వున్న దాఖలాలు వున్నాయి. అదే రోజున తండ్రి ఆజ్ఞను శిరసావహించి
శ్రీరాముడు పదునాలుగేళ్ళ వనవాసం నిమిత్తం అయోధ్యను వొదిలి వెడతాడు. అంటే ఆ
నాటికి శ్రీరాముడి వయస్సు (5114- 5089) పాతికేళ్ళు. వనవాసం కోసం శ్రీరాముడు అయోధ్య నగరాన్ని విడిచి
వెళ్ళినప్పుడు ఆయన వయస్సు పాతికేళ్ళు అని పేర్కొంటూ వాల్మీకి రామాయణంలో అనేక శ్లోకాలు వున్నాయి.
“వనవాసకాలం
పదమూడో సంవత్సరం ద్వితీయార్ధంలో ఖరదూషణుడితో
రామలక్ష్మణులు యుద్ధం చేస్తారు. ఆ సమయంలో సూర్యగ్రహణం సంభవించినట్టు
రామాయణంలో ప్రస్తావన వుంది. ఆరోజు అమావాస్య అని, కుజుడు కేంద్రంలో వున్నాడనీ పేర్కొనడం జరిగింది. ఈ
సమాచారాన్ని అమెరికన్ సాఫ్ట్ వేర్ కు అందించినప్పుడు కంప్యూటర్లో లభించిన
సమాచారం కూడా దీన్ని నిర్దారించేదిగా వుంది. క్రీస్తుకు పూర్వం ఒకానొక
సంవత్సరంలో అక్టోబర్ ఏడో తేదీ అమావాస్య నాడు సూర్యగ్రహణం సంభవించినట్టు
సమాచారం వుంది. అప్పటి గ్రహాల అమరిక కూడా రామాయణంలో పేర్కొన్న విధంగానే
వుండడం విశేషం.
“అదేవిధంగా రామాయణంలోని వివిధ
స్కంధాలలో పేర్కొన్న గ్రహ రాశుల స్తితిగతులను పరిశీలించి చూస్తే, క్రీస్తుకు పూర్వం 5076 డిసెంబర్ నాలుగో తేదీన శ్రీరాముడితో జరిగిన పోరాటంలో రావణుడు మరణించాడని తెలుస్తుంది. శ్రీరాముడి
పదునాలుగేళ్ళ వనవాసం చైత్ర మాసం శుక్ల పక్ష పక్షం నవమినాడు పూర్తయింది.
దానికి సరిపోలిన ఇంగ్లీష్ తేదీ క్రీస్తుకు పూర్వం 5075 జనవరి రెండు గా కంప్యూటర్ సూచించింది. ఆ
విధంగా లెక్క చూస్తే, శ్రీరాముడు వనవాసం, రావణ వధ అనంతరం తన 39 వ ఏట (5114 – 5075) అయోధ్యకు తిరిగి వచ్చాడు.
“పోతే, డాక్టర్ రామావతార్ అనే పరిశోధకులు - శ్రీరాముడు వనవాస సమయంలో
దర్శించిన అనేక ప్రాంతాలపై లోతుగా అధ్యయనం జరిపారు. శ్రీరాముడు సంచరించినట్టు
రామాయణంలో పేర్కొన్న ప్రదేశాలనన్నింటినీ
ఆయన స్వయంగా కలయ తిరిగాడు. ఈ క్రమంలో రామావతార్ అయోధ్య నుంచి మొదలు పెట్టి
రామేశ్వరం వరకు పర్యటించారు.
రామాయణంలో సీతారాములకు సంబంధించి పేర్కొన్న 195 ప్రదేశాలను ఆయన స్వయంగా చూసారు. తమ్సాతల్ (మాండా), అలహాబాద్ సమీపంలోని భరద్వాజ ఆశ్రమం, అత్రి మహాముని ఆశ్రమం, మార్కండేయ మహాముని
ఆశ్రమం , గోదావరి నదీ తీరంలోని పంచవటి, పర్ణశాల, నాసిక్ దగ్గర
త్రయంబకేశ్వర్ లోని రాం కుండ్, కిష్కింధ, ధనుష్కోటి, రామేశ్వరం మొదలయినవి డాక్టర్ రామావతార్ దర్శించిన ప్రదేశాలలో
వున్నాయి.
“రామేశ్వరం, రావణుడి లంక నడుమ సముద్రంపై శ్రీరాముని సైనికులయిన వానరులు వారధి
నిర్మించినట్టు రామాయణంలో
వుంది. ఈ వారధి మీదుగా లంక చేరిన శ్రీరాముడు రావణుడిని యుద్ధంలో
ఓడించి అతడిని సంహరిస్తాడు.
“దీనికి రుజువు అన్నట్టుగా ‘నాసా’, ఇటీవల మానవ నిర్మిత
వంతెన తాలూకు అవశేషాల చిత్తరువులను విడుదల చేసింది. రామేశ్వరం లంకల నడుమ
పాక్ జలసందిపై నిర్మించిన వారధి చిత్రాలు అవి. శ్రీలంక లోని సీతావాటికను
పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి
చేయాలనే అభిలాషను ఈ మధ్యనే శ్రీ లంక
ప్రభుత్వం వ్యక్తం చేసింది. క్రీస్తుకు పూర్వం 5076 లో రావణుడు తను అపహరించి తీసుకువచ్చిన సీతాసాధ్విని ఈ వాటిక లోనే వుంచాడన్న నమ్మకం ఆ
దేశీయులలో ఇప్పటికీ వుండడమే ఇందుకు కారణం.
“శ్రీరాముడు సూర్య వంశానికి
చెందిన రాజుల్లో అరవై నాలుగోవాడని భారత ఇతిహాసాల్లో పేర్కొనడం జరిగింది.
రావు బహదూర్ సీతారాం ఎనభై ఏళ్ళ క్రితం రాసిన ‘అయోధ్య కా ఇతిహాస్’ అనే గ్రంధంలో శ్రీరాముడితో పాటు ఆయనకు
ముందు రాజ్యం చేసిన అరవై ముగ్గురు రాజుల పేర్లను ఉదహరించారు. రాజా దశరధుడితో
పాటు రఘు,
దిలీప్
చక్రవర్తులు వీరిలో వున్నారు. ‘రిగ్వేదం’ గురించి ప్రొఫెసర్ సుభాష్ కక్
రాసిన ఒక గ్రంధంలో ఈ వివరాలను పొందుపరిచారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి
వరకు,
బెంగాల్
నుంచి గుజరాత్ వరకు ప్రతిచోటా, ప్రత్యేకించి హిమాచల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఈశాన్య భారతంలోని గిరిజన
ప్రాంతాలలో శ్రీరాముడు చరిత్ర నిజమేనని నమ్మేవారు అధిక సంఖ్యలో ఈనాటికీ కానవస్తారు.
“రామాయణంలోని మరో విశిష్టత
ఏమిటంటే రామరాజ్యంలో- పుట్టుక ప్రాతిపదికపై ఏర్పడిన చాతుర్వర్ణ వ్యవస్థ
తాలూకు అవాంఛిత ప్రభావాలు కానరావు.
నిజానికి వాల్మీకి మహర్షి ఈనాటి షెడ్యూల్డ్ జాతులకు చెందిన కులానికి
చెందినవాడు. భర్తచే పరిత్యజించబడిన సీత అడవులకు చేరి వాల్మీకి ఆశ్రమంలోనే
తలదాచుకుంటుంది. సీతారాముల కవలపిల్లలయిన లవకుశులు వాల్మీకి ఆశ్రమంలోనే
పుట్టి పెరుగుతారు. వాల్మీకి గురించి మనం గర్వంగా చెప్పుకోదగిన మరో విషయం
ఏమిటంటే ఆయన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు.
ఆయన రామాయణంలో పేర్కొన్న గ్రహరాశులు, నక్షత్ర సముదాయాల గురించి
పేర్కొన్న అనేక విషయాలు కాలపరీక్షకు తట్టుకుని ఈ నాటికీ నిలిచాయి. ఈ
విషయంలో ఆయన గణించి పేర్కొన్న
అంశాలన్నీ సరయినవేనని అమెరికన్
సాఫ్ట్ వేర్ రుజువుచేసింది.
(02-12-2011)
|