19, నవంబర్ 2011, శనివారం

తెరిపినపడ్డ కాంగ్రెస్


తెరిపినపడ్డ కాంగ్రెస్ – భండారు శ్రీనివాసరావు



ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఏంచేయాలి. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పాలి. కానీ సాధారణంగా జరిగేదేమిటి ?  పక్క వాటాలో కూడా కరెంట్ వుందో లేదో అని ఓ కంట కనిపెట్టిచూడడం మానవ నైజం. తనకు నష్టం జరిగిందన్న బాధ కన్నా పక్కవారికి కూడా అదే జరిగితే సంతోషించే రోజులివి.
సీ.బీ.ఐ. దర్యాప్తులకు న్యాయస్తానాలు ఆదేశిస్తున్న ఉదంతాలపై  ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు స్పందిస్తున్న తీరు కూడా ఈ స్వభావాన్నే సూచిస్తోంది.
ఏమయితేనేం! చేతులారా తెచ్చిపెట్టుకున్న సమస్యలతో కుడితినపడ్డ ఎలుకలా కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతోకాలం తరువాత చక్కని  ఊరట దొరికింది.
జగన్ అండ చూసుకుని కొరకరాని కొయ్యలుగా తయారయిన కొందరు ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక నిస్సహాయస్తితిలోవున్న అధికార కాంగ్రెస్ కు, కోర్టు ఆదేశాలపై సీ.బీ.ఐ. ప్రారంభించిన జగన్ ఆస్తుల కేసు విచారణ  కొంత ఊరటనిస్తే,  చంద్రబాబు అధికార దుర్వినియోగం గురించి హైకోర్టు ఆ  సీ.బీ.ఐ. నే దర్యాప్తుచేయమని తాజాగా ఆదేశించడం పూర్తి ఊరటను ఇచ్చింది. అటు  సీమాంధ్ర లో పూర్తిగా, ఇటు తెలంగాణలో ఓ మోస్తరుగా  ఏకుమేకై కూర్చున్న వైఎస్సార్ పార్టీని, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా యెలా ఎదుర్కోవాలో తెలియని పరిస్తితిలో బాగా డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామాలు కొత్త ఊపిరి పోస్తున్నాయి. సరికొత్త ఆశలు  చిగురింపచేస్తున్నాయి.
కారణాలు ఏమయితేనేం, కారణ’భూతం’ ఏదయితేనేం చాలాకాలం తరువాత, అదీ ఏడాది పాలన పూర్తిఅవుతున్న తరుణంలో ‘కిరణ్ సర్కార్’ కొంత తెరిపిన పడింది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే కాబోలు (18-11-2011)   


           

15, నవంబర్ 2011, మంగళవారం

ఎటు పోతున్నాం? – భండారు శ్రీనివాసరావు


ఎటు పోతున్నాం? – భండారు శ్రీనివాసరావు

సామాన్యుడికోసం రూపొందిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఇటీవలి కాలంలో అసామాన్యులకోసం నిర్విరామంగా పనిచేస్తున్న క్రమంలోఅవి  క్రమక్రమంగా తమ పూర్వ వైభవాన్ని కోల్పోతున్నాయనే చెప్పాలి. ఈ వ్యవస్థలు దారితప్పినప్పుడు సరిదిద్ది గాడిన పెట్టాల్సిన కర్తవ్యం  భుజస్కందాల మీద వున్న ‘మీడియా’ సైతం ఆరోపణల నీలినీడలను తప్పించుకోలేకుండా వుండడం మరో విషాదం.
ప్రత్యర్ధి పార్టీలను  నామరూపాలు లేకుండా చేయాలనుకోవడం రాజకీయ రంగంలో చాలా సహజమయిన విషయం. ఎన్నికల్లోనూ, ఇతరత్రా కూడా ఈ లక్ష్య సాధనకోసం రాజకీయ పార్టీలు పనిచేస్తూనే వుంటాయి. నైతికంగా ఇది తప్పే అయినా రాజకీయకోణం నుంచి చూస్తే వాటికి ఇది  తప్పనిసరి వ్యవహారం. అందుకే ఎన్నికల్లో తేలని విషయాలను న్యాయస్తానాల ద్వారా తేల్చుకోవాలని ప్రయత్నించడం ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. ఒకరకంగా చెప్పాలంటే సివిల్ కేసుల్లో సెటిల్మెంట్ మాదిరి. భూములు, ఆస్తి తగాదాలను పరిష్కరించే మిషతో లావాదేవీలు నడిపే పోలీసు అధికారులు, ఇతర సంబంధిత సిబ్బంది - ‘కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో! మిగిలిన విషయాలు మేము చూసుకుంటాం!’  అనే రీతిలో హామీలు ఇస్తుండడం కద్దు. కోర్టు నిర్ణయాలను ప్రశ్నించడం కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది కాబట్టి సెటిల్మెంట్  వ్యవహారాలు నడిపేవారికి మరింత వెసులుబాటుగా మారింది. ఇప్పుడిది రాజకీయ పార్టీలకు కొత్త అస్త్రంగా తయారయింది.
మొన్నటికి మొన్న జగన్ మోహన రెడ్డి పై ఇదే బాణం ఎక్కుబెట్టారు. మళ్ళీ ఈ రోజున అదే బాణం చంద్రబాబు వైపు తిరిగింది. అధికారం అండగా చేసుకుని ఆర్ధిక నేరాల ఆరోపణల్లో చిక్కుకున్న వారిపై దర్యాప్తులు జరిపి నేరం రుజువు చేస్తే తప్పుబట్టేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అలా కాకుండా ఇది కేవలం రాజకీయ కక్షలను సెటిల్ చేసుకునే  క్రమంలో సాగే వ్యవహారం అయితే పరిణామాలు దారుణంగా వుంటాయి. పొరుగున వున్న  తమిళనాడులో ఈ విష సంస్కృతి ఇప్పటికే  వూడలు దిగివుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అక్కడి పార్టీలు  ప్రత్యర్ధులపై కక్షలు తీర్చుకునే విధానాలు ఏ మేరకు దిగజారాయో అందరికీ తెలిసిన విషయమే. కాకపొతే  గుడ్డిలో మెల్ల అన్నట్టు    అక్కడి ప్రధాన పార్టీల వాళ్లు తమ  పోరాట క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే రీతిగా నడుచుకోరు. కానీ మన రాష్ట్రంలో పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. అందుకే రాజకీయ సెటిల్మెంట్ల వ్యవహారం ఇంతగా ఆందోళన కలిగిస్తోంది.
ఇది ఒక పార్శ్వం. దీన్ని మించిన  ప్రమాదకరమయిన పరిణామం మరొకటి వుంది.
జగన్ మోహన రెడ్డి మీద సీ.బీ.ఐ. దర్యాప్తుకు కోర్టు ఆదేశించినప్పుడు ఆయనకు చెందిన సాక్షి పత్రిక, సాక్షి టీవీ-   కొన్ని పత్రికలు, మరికొన్ని  మీడియా సంస్తలు అందిస్తున్న సమాచారంపై అనేక ఆరోపణలు చేశాయి. దర్యాప్తు క్రమంలో ప్రచురితమవుతున్న వార్తలను అభూతకల్పనలుగా కొట్టివేశాయి. నాలుగు గోడలమధ్య జరుగుతున్నవిచారణ సంగతులను  అక్షరం పొల్లుపోకుండా కళ్లకుకట్టినట్టు వైనవైనాలుగా వర్ణించి రాయడం  ఫక్తు  ‘ఎల్లో జర్నలిజం’ అని అభివర్ణించాయి. మీడియాలో ఒక వర్గం చంద్రబాబుకు కొమ్ముకాస్తోందని ఆరోపించాయి. గత కొద్ది రోజులుగా సాగుతూ వస్తున్న  తతంగం ఇది.
సాక్షి అభియోగాలను ఖండించాల్సిన అగత్యం ఆ మీడియాకు వుండకపోవచ్చు. కాకపొతే తాము ఇన్ని రోజులు నిస్పాక్షికంగా వార్తలు అందిస్తున్నామనీ, ఎవరిపైనో  బురదజల్లే వార్తాకధనాలు అందించడం లేదని నిరూపించుకునేందుకు  వాటికి ఇప్పుడొక సువర్ణావకాశం లభించింది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీ.బీ.ఐ. ఇక ముందు జరపబోయే దర్యాప్తు గరించి కూడా మునుపటి విధంగానే,  అదేవిధమయిన రీతిలో వార్తా కధనాలను అందించగలిగితే సాక్షి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోతుంది. రాజకీయ దురుద్దేశాలతో వార్తలు వండివారుస్తున్నారన్న అపప్రధ కూడా తొలగిపోతుంది. (15-11-2011)                   

రాజకీయ నీరజాక్షులు - భండారు శ్రీనివాసరావు


 వార్త – వ్యాఖ్య

“........తను నిర్దోషినని నమ్ముతున్నట్టయితే  సీ.బీ.ఐ. దర్యాప్తుని నిర్భయంగా ఎదుర్కోవాలి.”
“........ఏ తప్పూ చేయకపోతే దర్యాప్తుకు సహకరించి అగ్ని పునీతుడిలా బయట పడాలి”
“........కోర్టు ఆదేశాల ప్రకారం జరిగే దర్యాప్తు. రాజకీయకక్షతో చేస్తున్నారన్న అనుమానాలు నిరాధారం”
నిన్నా ఇవ్వాళా వినబడుతున్న ఈ మాటలన్నీ ఈ మధ్యనే ఎక్కడో  విన్నట్టుంది కదూ. ఎవరో ఒకరు అన్నట్టుంది కదూ.
ఇదే రాజకీయం అంటే. ఈ రాజకీయ నీరజాక్షులు సమయం కోసం ఎదురు చూస్తుంటారు. రాగానే మాటకు మాట అప్పజెప్పి ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!’ అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పు వారిది కాదు కదా. అంతకు ముందు ‘ఈ ఆట’ మొదలుపెట్టినవారికి కూడా ఇందులో  కొంత భాగముంటుంది కదా.
అందుకే అన్నారు ఒకరిపై వేలెత్తి చూపితే నాలుగువేళ్ళు మనవైపు చూస్తుంటాయని. కాకపొతే, ఇది తెలియని అజ్ఞానులెవరూ లేరు. తెలియనట్టు వుంటారంతే. (15-11-2011)    

6, నవంబర్ 2011, ఆదివారం



మితిమీరిన మీడియా ఉత్సాహం




(సత్యం రామలింగరాజు ఆర్ధిక నేరాల ఆరోపణల ఉచ్చులో చిక్కుకుని అరెస్ట్ అయినప్పుడు – ఆ నాటి సత్యం సామ్రాజ్యానికి ‘షేర్ల’ రూపంలో పెట్టుబడులు పెట్టి ఆ తరవాత గగ్గోలు పెడుతున్న నేపధ్యంలో - ఆరోజుల్లో నేను  రాసిన ఒక ఆర్టికిల్  ని  – రాజు గారికి బెయిల్ దొరికి ఇంటికి చేరుకున్నారన్న సంగతి తెలిసి  దాన్ని మళ్ళీ  పోస్ట్ చేస్తున్నాను. రాజు గారికీ నాకూ ఏవిధమయిన వ్యక్తిగత పరిచయం లేదన్న విషయం గమనంలో వుంచుకోవాల్సిందిగా మనవి – భండారు శ్రీనివాసరావు - 06-11-2011-)









నిప్పులు చిమ్ము కుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో వీరు -

నెత్తురు కక్కుకుంటూ
నేలకు నేరాలిపోతే
నిర్ధాక్షిణ్యంగా వీరే!                     -శ్రీశ్రీ


ఒక మహావృక్షం కూకటి వేళ్లతో కూలిపోతున్న దారుణ దృశ్యం గతవారం విశ్వవ్యాప్తంగా ఆవిష్కృతమైంది.  శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని జీవిస్తున్న లెక్కకు మిక్కిలి బుద్ధిజీవులు,  సమృద్ధిజీవులు, మాన్యులు, సామాన్యులు, లబ్ధిదారులు, ప్రారబ్ధదారులు ఆ విషాదాంతాన్ని మౌనంగా, జాలిగా, కసిగా, ఆగ్రహంగా, బరువెక్కిన గుండెలతో, చెమ్మగిల్లిన కళ్లతో గమనిస్తూ వచ్చారు. కొందరికిది కడుపుకోత. మరికొందరికి కడుపుమంట. కొందరిది వేదన. మరికొందరిది ఆవేదన.



ఏళ్ల తరబడి శిలా సదృశ్యంగా నిలబడి,  నిరంతర శ్రమతో,  నిర్విరామ కృషితో,  మొక్కవోని పట్టుదలతో-  ఆకాశం అంచులు తాకేలా నిర్మించుకున్న సువిశాల, సుందర సౌధం పునాదులు కళ్లెదుటే కదలిపోయాయి.


సత్యమేరా జీవితం - సత్యమేరా శాశ్వితం
 `సత్యమైట్లు' గా -  సగర్వంగా చెప్పుకుంటూ, వర్తమాన సమాజంలో పరువుతో, పరపతితో నెగ్గుకొస్తున్న వేలాదిమంది యువతీ యువకుల కలలన్నీ వారి కనురెప్పల కిందే కరగిపోయాయి. నిన్నటివరకూ ఎదురులేని సత్యం. నేటికది  చెదిరిన స్వప్నం.

ఒక మెగా సంస్థ మహా పతనం గురించీ, దానికి కారణాలు గురించీ పుంఖాను పుంఖాలుగా విశ్లేషణలతో, వార్తలతో, వార్తా కథనాలతో మీడియా రగిలించిన వేడి అంతా ఇంతా కాదు. సత్యం సంస్థ ఉత్థాన పతనాలకు కారకుడైన రామలింగరాజు కథ చంచల్‌గూడా జైలుకు చేరింది. ఈ పరిణామ క్రమాన్ని గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఈ ఉదంతంలో దాగున్న మరో కోణాన్ని స్పృశించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

ఆర్ధిక నేరాలు మనదేశానికి కొత్తవేమీకాదు. నూతన ఆర్థిక సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కూడా ఇవి జరిగాయి. స్వతంత్ర భారతంలో స్వదేశీ నౌకా పరిశ్రమ ఆవిర్భావానికి, అభివృద్ధికీ ఆద్యుడూ, మూలకారకుడూ అయిన తెలుగుతేజం జయంతి షిప్పింగ్‌ కార్పొరేషన్‌ సంస్థాపకుడు ధర్మతేజ చరిత్రే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

సత్యం రామలింగరాజును హర్షద్‌మెహతా, కృషి వెంకటేశ్వరరావు, కోలా కృష్ణమోహన్‌ వంటి వారితో ముడిపెట్టి వార్తాకథనాలు వెలువరించిన మీడియా అత్యుత్సాహం అర్థం చేసుకోలేని అధమస్థాయిలో ఉంది. సామాజిక సేవా కార్య కలాపాల విషయంలో కానీ, నిర్మాణాత్మక దక్షాదక్షతల విషయంలోకానీ, సిబ్బంది మంచి చెడులను కొసకంట కనిపెట్టి చూసేవిషయంలో కానీ -  రాజుకీ, వారికీ ఏమాత్రం సాపత్యం లేదు సరికదా నక్కకూ, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆశ, అత్యాశ, దురాశల నడుమ ఉన్న అంతరాన్ని అర్ధం చేసుకోవడంలో విశ్లేషకులు విఫలమయ్యారు. ఆశ చచ్చినా, దురాశపుట్టినా ఆ మనిషి చచ్చిన వాడితో సమానమంటారు. పెంచి పెద్ద చేసిన సంస్థను కాపాడుకోవాలనే ఆత్రంతో, అత్యాశతో వేసిన అడుగు రామలింగరాజుదయితే, రెండో వర్గంవారిది దురాశతో కూడిన దుస్తర మనస్తత్వం.

ఆర్థిక నేరాలకు పాల్పడిన వారు ఆ నేరాన్ని తమంతతాముగా, విచారణకు ముందే ఒప్పుకోవడం చాలా అరుదయిన విషయం. ఒక రకమైన విషవలయంలో చిక్కుకుపోయి మింగలేకా, కక్కలేకా డోలాయమానంలో కొట్టుకుంటుంటారు. అలాంటిది చేసిన దానికి, జరిగిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటూ, మరెవరి మీదా నెపం మోపకుండా, గరళం మింగిన శివుడిలా రామ `లింగ' రాజు జారీచేసిన `ఒప్పుకోలు' ప్రకటన ఆయన ధీరోదాత్త వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. స్వయం నిర్మిత సువిశాల వ్యాపార సామ్రాజ్యం కళ్లెదుటే కుప్పకూలిపోతున్న స్థితిలో కూడా తన వద్ద పనిచేసే సిబ్బంది బాగోగులను గమనంలో ఉంచుకోవడం ఆయన స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం.


ఇక ఈ మొత్తం ఉదంతంలో రామలింగరాజుకూ, రాష్ట్రప్రభుత్వానికీ లంకెపెడుతూ వెలువడిన వార్తా కథనాలు పత్రికా విలువలకు తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. మితిమీరిన మీడియా ఉత్సాహం ఒక ప్రముఖ సంస్థ పతనాన్ని మరింత వేగిరం చేసింది. తప్పుదిద్దుకునే అవకాశాన్ని దూరం చేసింది.


 `బర్డు ఫ్లూ' వార్తలతో బెంబేలెత్తించి, లక్షలాది కోళ్ల సామూహిక సంహారానికి కారణమైన మీడియా, వేలాదిమంది సత్యం సిబ్బంది ప్రయోజనాలను కాపాడడానికి, తన సొంత ప్రయోజనాలను వదులుకోగలదని ఆశించడం అత్యాశే అవుతుంది.
అదే  జరిగింది కూడా.



 


 ఇక వాటాదారులు విషయం అంటారా!
 మోసం చేసి డబ్బు సంపాదించాలనుకునే నేరగాళ్లకీ, జూదం ఆడి డబ్బు గడించాలనుకునే జూదగాళ్లకీ పెద్ద తేడాలేదు.

సత్యం షేరు ధర చుక్కల్లో ఉన్నప్పుడు ఆ వాటాలు కలిగిన బడాబాబులు ఎంతగా బడాయిలకు పోయారో అందరికీ తెలుసు. ఆడేది జూదం అయినప్పుడు ఆటుపోట్లకి కూడా సిద్ధంగా ఉండాలన్న విషయం కూడా వారు తెలుసుకోవాలి. లక్షలు కోల్పోయామని బాధపడేవారు లక్షణమైన సంస్థను తిరిగి ఎలా నిలబెట్టాలా అన్న విషయం ఆలోచించాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నది అదే. నేరాలు చేసిన వారిని విచారించి, నిర్ధారణ చేసే సంస్థలు వేరే ఉన్నాయి. కానీ, తెలుగు గడ్డపై పురుడుపోసుకుని, దిగంతాలకు ఒక వెలుగు వెలిగిన సంస్థ ఆరిపోకుండా చూసుకోవాలి. తమ తెలివితో, మేధస్సుతో ఒక మహా సంస్థ నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బంది భవితవ్యాన్ని కాపాడుకోవాలి. పుడమితల్లి నలుదిక్కులా తెలుగు వెలుగులను విస్తరించిన దీపం కొడిగట్టకుండా కనిపెట్టి చూడాలి. రాజకీయాలన్నవి ఆ పరిధికే పరిమితం కావాలి కానీ, తెలుగు యువత ఉజ్వల భవితకు రేచీకటిగా మారరాదు. ఆ దిశగా అడుగులు వేయడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం.
 అంతేకానీ, ఎద్దుల పోట్లాటలో లేగదూడలు నలిగిపోకూడదు.

-భండారు శ్రీనివాసరావు - జనవరి 2009

NOTE:All the images in the blog are copy righted to the respective owners

2, నవంబర్ 2011, బుధవారం

కాశ్మీర్ జోక్




కాశ్మీర్ జోక్
ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి ప్రసంగిస్తున్నాడు.
కాశ్మీర్ అంశంపై మాట్లాడడానికి ముందు భారత  పౌరాణిక ఇతిహాసంలోని  ఒక ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. పూర్వకాలంలో కాశ్యప మహర్షి అనే దేవముని వుండేవాడు. ఆయన పేరు మీదనే కాశ్మీర్ కు ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఆయన కాశ్మీర్ లో  సంచారం చేస్తుండగా ఒక చోట ఆయన పాదం ఓ బండ రాతికి తగిలింది. వెంటనే ఆ రాతినుంచి జలధార వెలువడి అక్కడ ఒక నీటి కొలను ఏర్పడింది. ఆ తటాకంలో స్నానం చేసి అనుష్టానాలు తీర్చుకోవాలనుకున్న కశ్యప ముని తన వొంటిపై వున్న నార  వస్త్రాలను గట్టున పెట్టి నీటిలోకి దిగాడు. స్నానం ముగించుకుని వొడ్డుకు చేరేసరికి అక్కడ వొదిలి వెళ్ళిన వస్త్రాలు కనిపించలేదు. ఒక పాకీస్తానీ జాతీయుడు కశ్యప ముని వస్త్రాలను అపహరించుకు పోయాడు....”
భారత ప్రతినిధి ప్రసంగానికి పాక్ ప్రతినిధి అడ్డుతగిలాడు.
“ అంత పురాతన కాలంలో పాకిస్తాన్ అన్నదే లేదు. ఇక మా జాతీయుడొకరు ముని వస్త్రాలను దొంగిలించాడని చెప్పడం భారత వాదనలోని డొల్లతనాన్ని సూచిస్తోంది.”
“అదే నేను కూడా చెబుతున్నాను. కాశ్మీర్ భారత దేశంలో ఎప్పటినుంచో అంతర్భాగం అన్న విషయాన్ని పాక్ ప్రతినిధి కూడా తెలిసో తెలియకో ఇప్పుడు అంగీకరించారు.”
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ చర్చను ఆలకిస్తున్న మిగిలిన దేశాలవాళ్ళు భారత ప్రతినిధి చేసిన ముగింపు  వ్యాఖ్యకు ఒక్కసారిగా గొల్లుమన్నారని వేరే చెప్పనక్కరలేదు.
తోక: నెట్లో కనబడ్డ ఓ ఇంగ్లీష్ జోక్ కు ఇది తెలుగు అనువాదమని నేను కూడా వేరే రాయనక్కరలేదు (02-11-2011) 

31, అక్టోబర్ 2011, సోమవారం

ఏడు పక్కన ఎన్ని సున్నాలు?


ఏడు పక్కన ఎన్ని సున్నాలు?

నిన్న మొన్నటి వరకు అదొక నిద్రాణమయిన పల్లె.
ఉత్తరప్రదేశ్ లోని  భగ్ పత్ జిల్లాలో సున్హేడా వంటి అనేక గ్రామాలున్నాయి. కానీ ఈ పల్లెకి ఒక్కదానికే ఉన్నట్టుండి అంతర్జాతీయ ఖ్యాతి రావడానికి ఒక పసికందు కారణమంటే ఆశ్చర్యమే. ఈ వ్యాసం రాసే సమ యానికి ఇంకా ఆ శిశువు పుట్టనే లేదు. సున్హేడా గ్రామంలో సచిన్, పింకీ పావర్ అనే పుణ్య దంపతులకు ఈ అపురూపమయిన బిడ్డ జన్మించబోతోంది. వాళ్లకి ఈ ఏడాది జనవరి ఎనిమిదో తేదీన వివాహమయింది. పెళ్ళయిన నెల రోజులకే పింకీ నెల తప్పింది. స్తానిక ప్రాధమిక వైద్య కేంద్రంలో పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి డాక్టర్లు తనకు పుట్టబోయే బిడ్డ గురించి మాత్రమే కాకుండా ఆమెకు పట్టబోయే అదృష్టం గురించి కూడా ఆవిడ చెవిన వేశారు. అంతేకాదు లండన్ నుంచి కూడా యూ ఎన్ అధికారులు ఫోన్ చేసి పింకీకి పుట్టబోయే శిశువు ప్రపంచ జనాభాను ఏడువందల బిలియన్ మార్క్ ను దాటించే అపురూప శిశువు కానున్న విషయాన్ని ధృవ పరిచారు. బిడ్డకు పెట్టబోయే పేరు గురించి కూడా వాళ్లు అడిగి తెలుసుకున్నారని పింకీ మురిసి పోతూ నలుగురికీ చెప్పింది.
జనాభా విషయంలో రెండో స్తానంలో వున్న మన దేశానికి ఆ జనాభాకు సంబంధించే మరో  అపూర్వ గౌరవం దక్కబోతోందన్న మాట. అదేమిటంటే -  యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ లెక్క ప్రకారం ప్రపంచ జనాభా ఈ రోజు నుంచి ఏడు బిలియన్ మార్క్ దాటబోతోందట. ఈ రికార్డ్ దక్కడానికి కారణమయిన  బిడ్డ ఆ వూళ్ళో పుట్టబోతోందట. అదీ ఆడ శిశువు కావడం ఆకాశంలో సగం అని కీర్తి గడించిన ఆడంగులందరికీ గర్వకారణం.  అలా అని,  సీ ఎన్ ఎన్ – ఐ బి ఎన్ మీడియా తన వార్తాకధనాల ద్వారా ఊదరగొడుతోంది.


 ఏడు బిలియన్లు అంటే ఏడువందల కోట్లు. ఏడు పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఈ సంఖ్య వస్తుందన్నది ఆ ఫండ్ వాళ్లనే అడగాలి. పనిలో పనిగా మరో ప్రశ్న కూడా అడగాలి. ఏ లెక్క ప్రకారం లెక్కలు వేసి ఆ శిశువు పలానా  వూళ్ళో పలానా మహిళకు పుట్టబోతున్నట్టు తేల్చారన్నది తేల్చి చెప్పమని కూడా  అడగాలి.
అయితే ఈ ప్రశ్నకు జవాబుగా వాళ్లు చాంతాడంత గణాంకాలు ఉదహరిస్తున్నారు. భారత దేశంలో ప్రతి నిమిషానికి అక్షరాలా యాభయ్ ఒక్కమంది శిశువులు జన్మిస్తున్నారట. మళ్ళీ ఒక్క ఉత్తర ప్రదేశ్ లోనే నిమిషానికి పదకొండుమంది పిల్లలు పుడుతున్నారట. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంచనాల ప్రకారం పుట్టబోయే ఆ ఏడు వందల కోట్ల ఒకటో బిడ్డ ఉత్తర ప్రదేశ్ లోని సున్హేడా గ్రామంలో పలానా తేదీన భూమిపై పడబోతున్నట్టు మీడియా కోడై కూస్తోంది.
“ఇదంతా బొత్తిగా ఉత్తిదే. మన దేశంలో చాలా గ్రామాలకు సరయిన రహదారులే లేవు. ఏ వూళ్ళో ఎప్పుడూ ఎంతమంది పిల్లలు పుడుతున్నారో లెక్కలు తీయడానికి అవకాశాలే లేవు. అలాటిది ఏడువందల కోట్ల ఒకటో శిశువు పలానా రోజు పలానా వూళ్ళో పలానా వారికి పలానా సమయానికి  పుట్టబోతున్నదని చెబితే నమ్మడానికి చెవులో పువ్వులు పెట్టుకోలేద”ని  కొట్టిపారేసే ‘డౌటేహ’ మనస్కులు కూడా  లేకపోనూ లేదు.
ఏదిఏమయినా ప్రపంచ రికార్డులు కైవసం చేసుకోవడానికి చాలా కష్ట పడాలి. అంత సీను మనకెలాగూ లేదు. అందుకని కష్టపడకుండా మన వాళ్లకి మాత్రమే చేతయిన పద్దతిలో లభిస్తున్న ఈ గౌరవాన్ని ఎందుకు కాదనాలి? కాబట్టి అందరం కలసి ఆ అపూర్వ శిశువుకు ఆహ్వానం పలుకుదాం.
మేరా భారత్ మహాన్!
ఇప్పుడే అందిన వార్త (బ్రేకింగ్ న్యూస్ అనాలా!)
సందేహాస్పదులు అన్నంతా అయింది.
ఈ రోజు, అంటే  అక్టోబర్ ముప్పయ్ ఒకటో తేదీన ఏడువందల కోట్ల ఒకటో బిడ్డ పుట్టింది. కాకపొతే ఉత్తర ప్రదేశ్ లోని మరో వూళ్ళో. (ఎందుకయినా మంచిది 'అట' అని చేరిస్తే మంచిదేమో!) ఆ రికార్డ్ శిశువు పేరు నర్గీస్ 'అట' 
కాదు కాదంటోంది మరో ఛానల్. ఫిలిప్పీన్స్ లో ఈ శిశువు జన్మించిందని ఘంటాపదంగా చెబుతోంది. ఎవరెన్ని రకాలుగా చెబుతున్నా ఒక విషయం మాత్రం ఒకే విధంగా చెబుతున్నారు. రోజూ ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాయి కదా ఈ చానళ్ళు. అందుకే కాబోలు 'రెండు చోట్లా పుట్టింది ఆడపిల్లే!'  
31-10-2011           
Statistics show that 51 babies are born every minute in India and of these 11 babies are born in Uttar Pradesh AFP

గాడిద తెలివి


గాడిద తెలివి



అనగనగా ఓ గాడిద. తన యజమాని దగ్గర ఏళ్లతరబడి  గాడిద చాకిరి చేసి చేసి కొన్నేళ్లకు ముసలిదయిపోయింది. అది  బాగా వున్నన్నాళ్ళు  దానితో అడ్డమయిన చాకిరీ చేయించుకున్న యజమాని, గాడిద  ముసలిది కాగానే దాన్ని గురించి పట్టించుకోవడం మానేశాడు. అసలు గాడిదలంటేనే జనాలకు చులకన. ఇక పని చేయలేని, పనికి పనికిరాని గాడిదలను కనుక్కునేదెవరు?

రోజులు బాగాలేని ఆ గాడిద ఓ రోజు ఇంటి దగ్గరలోని  పాడుబడ్డ బావిలో పడిపోయింది.  దానితో పని లేదనుకున్న ఆ గాడిద యజమానికి   దాన్ని  బావిలోనుంచి  పైకి లాగి కాపాడడం అన్నది  డబ్బు దండగ వ్యవహారం  అనిపించింది. పెద్దగా ఆలోచించకుండానే అతడికి ఉభాయతారకమయిన ఉపాయం తట్టింది. పాడుపడ్డ ఆ బావిని  పూడ్చాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటూ వస్తున్నా ఆ పని ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.  ఇప్పడా బావిని మట్టితో పూడ్చేస్తే  ఆ పని  పూర్తిచేసినట్టూ  అవుతుంది. దానితో పాటే  ఆ ముసలి గాడిదను కూడా  అందులో పూడ్చిపెట్టినట్టూ  అవుతుంది.  అలా ఆలోచించి  అతగాడు ఆ పని మొదలు పెట్టాడు. పైనుంచి కూలీలు తట్టలతో మట్టిని  తన మీద పోస్తున్నప్పుడు కానీ బావిలో చిక్కుకుపోయిన  గాడిదకు అసలు  విషయం   అర్ధం కాలేదు. తను ఎట్లాగో  పనులకు పనికిరాదు. అందువల్ల బావిని పూడ్చే నెపంతో యజమాని తనను వొదుల్చుకోవాలని చూస్తున్నాడు. చావు ముంచుకు రాబోతున్న విషయం అర్ధం చేసుకున్న  గాడిద మరణ  భయంతో  గట్టిగా  వోండ్ర పెట్టసాగింది. అయితే, తనది కేవలం  అరణ్య రోదన అన్న విషయం కూడా దానికి త్వరలోనే బోధపడింది. ఇక తనకు చావు తప్పదు అని నిర్ణయించుకున్న తరవాత   ఆ  గాడిదకు వున్నట్టుండి చావు  తెలివి పుట్టుకొచ్చింది. తట్టల కొద్దీ  మట్టి  పైనుంచి తన మీద పడ్డప్పుడల్లా  గాడిద వొళ్ళు దులుపుకుంటూ కింద పేరుకుపోతున్న మట్టి కుప్పల మీదకు యెగిరి దూకడం మొదలు పెట్టింది.  కూలీలు పోస్తున్న మట్టితో ఆ పాడుపడ్డ బావి నిండిపోసాగింది. మట్టి మీద పడ్డ ప్రతిసారి దాన్ని దులుపుకుంటూ మట్టి కుప్పల మీదకు దూకుతూ  పైకిరావడం ఆ గాడిదకు అంత శ్రమ అనిపించలేదు. పైనుంచి  ఇదంతా  చూస్తున్న యజమానికి ముందు జరుగుతున్నదేమిటో  అర్ధం కాలేదు. అతడికి  అర్ధం అయ్యేటప్పటికల్లా ఆ గాడిద పైకే వచ్చేసింది. బతికి బయట పడ్డ గాడిద బతుకు జీవుడా అని ‘కొరగాని యజమాని  కొలువుకు’  ఓ దండం పెట్టి  తన దారి తాను  చూసుకుంది.
నీతి: తెలివి మనుషుల సొత్తు కాదు. అడ్డగాడిదలకు కూడా తెలివితేటలుంటాయి. (30-10-2011)


NOTE: Courtesy owner of the image used in this blog.