5, అక్టోబర్ 2026, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (361) : భండారు శ్రీనివాసరావు

 

 

నా మీద నాకే అసూయ

 

"ఏమిటి మీ ఆరోగ్య రహస్యం?" అడిగాడు ఓ మిత్రుడు.

"ఏమీ లేదు, జ్ఞాపకాలను నమిలి తింటుంటాను"

 

కంటికి రెప్పలా చూసుకున్న మా ఆవిడ నిర్మల 2019 లో హఠాత్తుగా కన్నుమూసింది.

2024  ఫిబ్రవరి నాలుగున, నాకు కుడి భుజంగా వున్న నా రెండో కుమారుడు సంతోష్ తల్లి మీద ప్రేమతో ఆమె దగ్గరికే వెళ్ళిపోయాడు.

వాడికి తల్లి అంటే ప్రాణం. ఆమె చనిపోయినప్పుడు, ఎవరో పెద్దగా బాడీని తీసుకు రండి అంటుంటే వాడు కోపం ఆపుకోలేక పోయాడు. ' బాడీ ఏమిటి బాడీ. బుద్ది వుందా! ఆమె మా అమ్మ. అమ్మ.' అంటూ విరుచుకుపడ్డాడు. అంత ప్రేమ తల్లి అంటే.

అయిదేళ్ల వ్యవధిలో ఈ ఇద్దరూ నాకు కాకుండా పోయారు. అయినా దుక్కలా వున్నానంటే జ్ఞాపకాలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ వుంటే, చెప్పుకోలేని బాధ,  చెప్పరాని ఆనందం, రెండూ పడుగు పేకలుగా మనసును ముప్పిరిగొంటాయి. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియని స్థితి.

 

కొన్ని జ్ఞాపకాలు అంతే. తలచుకున్నప్పుడల్లా వయసును మురిపిస్తాయి. మనసుని వేధిస్తాయి.

 

దాదాపు ఓ అర్ధ శతాబ్దం నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి, కరోనా అంటే ఏమిటో తెలియకుండానే, ఆ పదం వినకుండానే, ఆ మహమ్మారి ఆగమనానికి ముందుగానే నేను పుట్టిన ఆగస్టులోనే, నా పుట్టిన రోజున ప్రేమతో కేకు తినిపించిన పదో రోజునే 2019లో కన్ను మూసింది.

వచ్చే పెన్షన్ తప్ప వేరే ఆధారం లేదు. కూడబెట్టుకున్నవీ లేవు. ఇవేవీ నా మనసుకు తాకలేదు.

కారణం నా ఇద్దరు పిల్లలు, నా కోడళ్ళు. తోడులేని మనిషికి తోడుగా నిలబడ్డారు. నా చుట్టపక్కాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు రోజూ నా యోగక్షేమాలు కనుక్కోకుండా నిద్రపోడు.

సాధారణ మనుషులకి నిజంగా ఇవన్నీ అసాధారణ విషయాలే. అందుకే నా మీద నాకు అసూయ. కానీ ఇంతటి ఆదరణకి నేను అర్హుడిని కాదు అన్న సంగతి నాకు తెలుసు.

ఏడుగురు అక్కయ్యలు. అది ఒక కారణం కావచ్చు, నాకు ఆడవాళ్లంటే గౌరవం. మా కోడళ్ళను చూసిన తరువాత అది రెట్టింపు అయింది.

పెద్ద కోడలు భావన అమెరికానుంచి ఫోన్ చేసి నా వెల్ఫేర్ కనుక్కుంటుంది. వాళ్ళు అక్కడ సిటిజన్లు. ఆమెకు విద్యార్హతలు చాలా వున్నా, పిల్లల కోసం ఇన్నేళ్ళు ఉద్యోగం చేయకుండా ఇల్లు చూసుకుంది. నా మనుమరాళ్లు ఇద్దరూ యూనివర్సిటీ చదువుల కోసం, ఉద్యోగాల కోసం  బయటి రాష్ట్రాలకు వెళ్ళారు. ఆ కాలంలో ఖాళీగా వుండడం ఇష్టంలేక వున్న ఊళ్లోనే క్వాలిఫికేషన్ కు తగిన ఉద్యోగానికి అప్లయి చేస్తే,  ఇన్నేళ్ళు ఏ ఉద్యోగం చేశావు?  అని మాట మాత్రం అడగకుండా అర్హతను చూసి మంచి ఉద్యోగం ఇచ్చారు.

 

నా రెండో కోడలు నిషా. ఆమెకు ఏదో పెద్ద కార్పొరేట్ సంస్థలో, దేశ దేశాల్లోని సిబ్బంది మీద అజమాయిషీ చేసే బాధ్యత కలిగిన పెద్ద ఉద్యోగం. అయినా ఇంటినీ, నన్నూ, నా అవసరాలను కనిపెట్టి చూస్తుంటుంది. ‘ఎందుకమ్మా ఇలా అవస్థ పడతావు?’  అంటే నవ్వి ఊరుకుంటుంది.

 

మా ఆవిడ వుండి వుంటే, ఈ వైభోగాలు చూస్తూ వుంటే, నా రెండో కొడుకే కనుక బతికి వుంటే, ఇక అప్పుడు  నన్ను పట్టడానికి పగ్గాలు వుండేవి కావు. దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కానీ ఏదీ మన చేతిలో పెట్టలేదు.

 

దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర వేసిన సావిత్రితో, ముసలి భర్త సీ.ఎస్.ఆర్. అంటాడు, 'చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఈ మచ్చ ఏమిట'ని.

చంద్రుడికే తప్పలేదు. మనమెంత?



2, అక్టోబర్ 2026, శుక్రవారం

గాంధీజీ, శాస్త్రీజీ – భండారు శ్రీనివాసరావు


గాంధీజీ, శాస్త్రీజీ లే కాదు, ఎవరిని గురించి అయినా సరైనా అంచనాకు రావాలి అంటే వాళ్ళని గురించి మనకు మనంగా తగిలించుకున్న కళ్ళద్దాలను తీసి చూడాలి. అంతవరకూ మనకు కనబడేది వారి అస్పష్ట స్వరూపమే. మన ఊహల్లో వున్న వారి వ్యక్తిత్వమే!

మహాత్మా గాంధీని, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ను నేను నా కళ్ళతో చూడలేదు. నా చిన్న తనంలో జవహర్ లాల్ నెహ్రు ఒకసారి బెజవాడ వస్తే, మా ఊరి వాళ్ళతో కలిసి వెళ్లి చూసాను చాలా దూరంనుంచి. ఆయన ఓపెన్ టాప్ జీపులో వెడుతూ, తన మెడలో జనం వేసిన పూల దండలను తిరిగి జనం మీదకే విసురుతున్న దృశ్యాలను నా కళ్ళతో చూసాను.

లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా వున్నది చాలా స్వల్ప కాలమే. అయినా ఆయన తన నిజాయితీతో, నిరాడంబరత్వంతో దేశ ప్రజల మనస్సులను చూరగొన్నారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత దృష్ట్యా , ప్రతి సోమవారం ఒక పొద్దు వుండాలని ( రాత్రి భోజనం మానుకోవాలని) ఆకాశవాణి ద్వారా పిలుపు ఇస్తే, జాతి యావత్తూ ఆయన మాటలను శిరసావహించిన రోజులు నా మదిలో పదిలంగా వున్నాయి.
గాంధీ, నెహ్రు, సుభాష్ చంద్రబోసు, తిలక్ వీరెవ్వరినీ తమ కళ్ళతో చూడకపోయినా, తెలుగునాట అనేకమంది తలితండ్రులు పిల్లలకు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు ఏకంగా తన నలుగురు పిల్లలకు, జవహర్ లాల్, సుభాష్ చంద్ర, లాల్ బహదూర్, రాజేంద్ర ప్రసాద్ అని నామకరణం చేసుకున్నాడు.

నాయకుల మాటలకు చేతలకు పొంతన వున్నప్పుడు ప్రజల్లో వారి పట్ల ఆరాధనాభావం సహజంగా ఏర్పడుతుంది. ఇప్పటికీ అలాంటి నాయకులు లేరని కాదు, వారి సంఖ్య చాలా తక్కువ. పైగా అది వేగంగా క్షీణిస్తోంది. అదొక విషాదం.
లోపాలు లేని మనుషులు లోకంలో వుండరు. మనం త్రేతాయుగంలో లేము కదా! మంచి చెడులను బేరీజు వేసుకుని వారి వ్యక్తిత్వాలను అంచనా వేసుకోవాలి.
సద్విమర్శలు మంచి మార్పుకు దోహదం చేస్తాయి. కువిమర్శలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి.
నేటి రాజకీయాల్లో బాగా పెచ్చరిల్లుతోంది వ్యక్తిత్వ హననం. ఏ రాజకీయ పార్టీ కానీ, వారి అభిమానులు కానీ ఇందుకు మినహాయింపు కాదు.

ఈ రోజు, మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి (శాస్త్రి అన్నది ఆయన చదువుకున్న డిగ్రీ) పుట్టిన రోజులు. ఈ నాడు వారిద్దరూ మన నడుమ లేకపోయినా వారు చిరంజీవులే. అందుకే జయంతి అనే మాట వాడలేదు.

పుట్టినరోజున నాలుగు మంచి మాటలు పలకడం సాంప్రదాయం. సందర్భంతో నిమిత్తం లేకుండా నిందలు వేసేవారు, ఏడాదిలో ఇంకా ఎన్నో రోజులు మిగిలే వున్నాయని గుర్తు పెట్టుకోవాలి.
దేవుడిని పూజించేవారితో సమానంగానే కాదు, ద్వేషించేవారికి కూడా పుణ్య లోకాలు సిద్ధించడం పురాణాలు, ఇతిహాసాల్లో కనబడుతుంది. వారి నాలుకల మీద అనుక్షణం ఆడే హరి నామమే అందుకు కారణం అంటారు.

లంకపై యుద్ధంలో లంకేశ్వరుడి మరణానంతరం, రావణ బ్రహ్మ పార్ధివ దేహానికి సముచిత రీతిలో అంత్యక్రియలు జరపాల్సిందని, విభీషణుడిని అడుగుతాడు శ్రీరాముడు. అతడు సంక్షేపిస్తుంటే రాముడు అంటాడు.

“మరణంతో వైరం పోవాలి. ఆ ప్రాణి శరీరాన్ని విడిచిపెట్టగానే వైరం కూడా వెళ్ళిపోయింది. అందుకని ఇక వైరం పెట్టుకోకూడదు. నీకు అంగీకారం లేకపోతే చెప్పు. ఆ పుణ్య కార్యం నేను చేస్తాను. స్నేహితుడి అన్నగారు నా అన్నగారే”

ఇంతటి ఉత్తముడు కనుకనే రాముడు పురుషోత్తముడు అయ్యాడు.
నేటి రాజకీయాల్లో కూడా ఆ రాముడి కాలం రావాలి.

గాంధీ, వాజపాయ్ వంటి వారిని ఒక రాజకీయ పార్టీకి చెందిన వారిగా భావిస్తున్నంత కాలం వారిని, వారి వ్యక్తిత్వాలను, గొప్పతనాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు.
(02-10-2026)

30, సెప్టెంబర్ 2026, బుధవారం

పుణ్యక్షేత్రంలో పుట్టినరోజు : భండారు శ్రీనివాసరావు

  


మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారి పుట్టిన రోజు దైవ సన్నిధిలో జరుపుకోవాలని ఈరోజు బయలుదేరి యాదగిరిగుట్ట వెడుతున్నాము. రెండేళ్ల క్రితం పుట్టిన రోజున, ఇదే రోజు  కాశీ పుణ్యక్షేత్రంలో ఉన్నాము.

సెప్టెంబర్, 2024.

ఎనభయ్ ఏళ్ళ జీవితంలో నేను కాశీ వెళ్ళింది నాలుగంటే నాలుగు సార్లు. చాలా సార్లు ఎవరో వెడుతూ రమ్మంటే తోడు వెళ్లినట్టు వెళ్లి తిరిగి రావడమే. ఒకసారి మాత్రం మా అమ్మగారి మరణానంతర అంత్యక్రియలు అక్కడ జరపాలని మా పెద్దన్నయ్య నిర్ణయించడంతో మా కుటుంబంలో పెద్దలు, పిన్నలం అందరం కలిసి, ముప్పయి మందిమి రైల్లో కాశీ, ప్రయాగ, గయ క్షేత్రాలకు వెళ్లి వారానికి పైగా అక్కడే గడిపాము.  యాత్రకు యాత్రకు నడుమ పదేళ్ల వ్యవధానం వున్నా కూడా ఎప్పుడు వెళ్ళినా, కాశీ ఎలాంటి మార్పు లేకుండా ఒకే తీరున వుంది. ప్రతిసారీ ఆంధ్ర ఆశ్రమంలోనే మా బస.

రెండేళ్ల క్రితం కాశీ వెళ్ళినప్పుడు మేము మూడు రోజులు బస చేసింది చెన్నైకి చెందిన ప్రముఖ నగల వ్యాపార సంస్థ GRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిథి భవనంలో. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి కారులో గంట ప్రయాణం. సెప్టెంబరు 29 సాయంత్రం లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం బయటకు రాగానే, యాత్ర ఆరంభం అదిరింది. ట్రావెల్స్ తరపున కొందరు వచ్చి, హైదరాబాదు నుంచి వచ్చిన మా పద్నాలుగు మందికి మెళ్ళో దండలు వేసి మరీ స్వాగతం చెప్పారు, ఏదో స్టార్ హోటల్ మర్యాదల మాదిరిగా.

సిద్ధంగా వుంచిన మూడు ఇన్నోవా కార్లలో జీ ఆర్ టి గెస్ట్ హౌస్ కి చేరాము. భవనం మొత్తం గ్రానైట్ తో తీర్చి దిద్దారు. ఎక్కడ చూసినా అంతా గ్రానైట్ మయం. లోపలకు అడుగుపెట్టగానే గ్రానైట్ తో నిర్మించిన చిన్న వినాయకుడి గుడి. స్వామికి దణ్ణం పెట్టుకుని, పక్కనే గ్రానైట్ ఫ్రేం తో వున్న పెద్ద లిఫ్ట్ లో మాకు కేటాయించిన నాలుగో అంతస్తుకు చేరాము. చివరికి మంచాలు కూడా గ్రానైట్ వే కావడం విశేషం. పరుపులు, దిండ్లు మాత్రం మామూలువే. మా అందరికీ ఒకే అంతస్తులో గదులు ఇచ్చారు. ప్రతి గదిలో మూడు పడకలు. చక్కటి ఏసీ సదుపాయం. వారణాసిలో అక్టోబర్ మాసంలో అంతటి వేడి వాతావరణం వుంటుందని అస్సలు ఊహించలేదు.

GRT గెస్ట్ హౌస్ లో బస చేసినవారికి ఉదయం బెడ్ కాఫీ, తరువాత కాసేపటికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, సాయంత్రం కాఫీ/ టీ, రాత్రి డిన్నర్ ఉచితం. గది అద్దె రోజుకు 1680 రూపాయలు. అయితే అన్నీ టైము ప్రకారం జరుగుతాయి. కొంచెం ముందుగా కానీ, కాస్త ఆలస్యం అయినా కానీ సర్వీసు వుండదు. బయటకు పోవాల్సిందే. డైనింగ్ హాల్, కుర్చీలు, బల్లలు అన్నీ శుభ్రంగా వున్నాయి. వంటలు రుచిగా, శుచిగా తయారు చేశారు. వేడివేడిగా అన్నం, ఒక కూర, పప్పు, పాయసం, సాంబారు, రసం. బ్రేక్ ఫాస్ట్ లో ఊతప్పం, దోసె, చట్నీ సాంబారు. సాంబారు మాత్రం తప్పనిసరి. చెన్నై వంటవాళ్లు కాబట్టి సాంబారు రుచి స్పెషల్. బఫే పద్దతి. వడ్డన చేసే వాళ్ళు నవ్వు మొహంతో ఏదీ కాదనకుండా, లేదనకుండా అందర్నీ ఒకే మాదిరిగా కనుక్కున్నారు.

మా కాశీ ప్రయాణానికి ఒక కారణం వుంది. సెప్టెంబర్ 30 మా అన్నయ్య రామచంద్ర రావు గారి పుట్టిన రోజు. ఆ రోజున కాశీ వెళ్లి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలి అనే ఆకాంక్షతో పెట్టుకున్న యాత్ర ఇది. ఆ రాత్రి గెస్ట్ హౌస్ లోనే సింపుల్ గా కేక్ కట్ చేయించి, కుటుంబ సభ్యులు అందరం మా అన్నావదినల ఆశీర్వాదం తీసుకున్నాం.

ఆన్ లైన్లో ముందుగానే బుక్ చేసిన హారతి దర్శనం కోసం అర్థరాత్రి రెండు గంటలకు కాశీ విశ్వేశ్వరుడి దేవాలయానికి వెళ్ళాము. అలాగే పక్కనే అమ్మవారి దర్శనం. ఈ దర్శనం కోసం బుక్ చేసుకున్న వాళ్ళు వెయ్యికి మించరు. కొంచెం క్యూ పద్దతి పాటిస్తే, తోపులాట లేకుండా పదిహేను ఇరవై నిమిషాల్లో అందరికీ చక్కటి దర్శనం లభించేది. గర్భగుడిలో లింగాన్ని చేతితో తాకి, స్పర్శ దర్శనం చేసి బయటకు వచ్చాము.

ముప్పయ్యేళ్ల క్రితం మాదిరిగా కాకుండా ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా తీర్చి దిద్దారు. గర్భగుడిలో తోపులాట గురించి కాస్త అసహనం వ్యక్తం చేసిన వారిని, మరో వైపు దేవుడ్ని దర్శించిన తృప్తితో, భక్తి పారవశ్యంతో బయటకు వచ్చిన వారిని ఒకే కంటితో చూస్తే ఒక సత్యం బోధపడింది. ఏదో గొప్పగా జరుగుతుందని ఊహించుకుని వచ్చిన వారు మొదటి రకం. వారికి దేవుడి మీద కంటే కూడా పరిసరాలను గమనించడంలోనే ఆసక్తి జాస్తి. ఇందులో నాబోటి వాళ్ళు కూడా వున్నారు. పొతే, మా బృందంలోనే చాలామంది, అలాగే భక్తుల్లో అనేకులు చక్కటి దర్శనం లభించింది అనే తృప్తితో గుడి నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే వారి దృష్టి ఆ దేవదేవుడిపైనే లగ్నమై వుంది. అర్ధనిమీలిత నేత్రాలతో శివ స్తోత్రాలు బిగ్గరగా చదువుతూ సాగుతున్న వారిని చూస్తే, వీరు కదా నిజమైన భక్తులు అనే భావన కలిగింది.

గంగమ్మ తల్లి వరద మీద వున్న కారణంగా బోట్లు తిరగడం లేదు అనే సమాచారం కొంత నిరాశ పరిచింది. బోటు నుంచి గంగా హారతి చూసే అవకాశం లేదు. చిన్న చిన్న సందుల్లో వెళ్లి చూసే ప్రయత్నం చేశాము. పితృ పక్షాల సమయం ఏమో తెలియదు, శివుడికి ప్రీతికరమైన సోమవారం మహత్యమో తెలియదు, ఊరి మీద ఊరు పడ్డట్టు ఎక్కడ చూసినా భక్త జన సందోహం. అంత జనంలో ఇంత మందిమి, అందులో ఒక చంటి పిల్ల మా మనుమరాలు జీవిక తప్పిపోకుండా చూసుకోవడం మరో పెద్ద సమస్య.

దేవాలయ సందర్శన అనేది ఒక పర్యాటక వ్యవహారంలా కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే పరిసరాలు కనపడవు, దేవుడు తప్ప. అలా కాకుండా విహార యాత్ర మాదిరిగానో, వీ. వీ. ఐ. పీ దర్శనాలు చేసుకునే ఇతరులతోనో పోల్చి చూసుకోవడంతోనే సరిపెడితే పరిసరాలు కనపడతాయి కానీ, దేవుడు కనపడడు అనేవారు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు. కానీ జర్నలిస్టు బుద్ధి కదా! కనపడకూడనివి మాత్రమే కనపడతాయి. దుర్గంధ భూయిష్టంగా వున్నఆ సందులన్నీ ఫోటో తీయాలనే తలంపు బలవంతాన మానుకున్నాను. పైగా మర్నాడే స్వచ్చభారత్ వార్షికోత్సవం. భక్తుల ఓరిమి మీద అధికారులకు పూర్తి నమ్మకం. పైగా సెక్యూరిటీ జోన్ కారణమా అన్నది తెలియదు, మొబైల్ ఫోన్లకు కనెక్టివిటీ సమస్య. గుంపులో తప్పిపోతే ఒకరినొకరం కలుసుకోవడం ఇబ్బంది. అంచేత వెంటనే బయలుదేరి గెస్ట్ హౌస్ కు వచ్చేశాము.

మర్నాడు అయోధ్య ప్రయాణం. దాదాపు అయిదు గంటలు రోడ్డు మార్గంలో. దోవలో వరసగా అనేక ఫ్లై ఓవర్లు నిర్మించారు. ఒకే రహదారిపై అన్ని ఫ్లై ఓవర్లు వరుసగా అనేక చోట్ల నిర్మించడం ఆశ్చర్యం అనిపించింది. అటూ ఇటూ కలిపి నాలుగు లేన్ల రోడ్డు. మధ్యలో ఓ యాభయ్ కిలోమీటర్లు సింగిల్ రోడ్డు.

కాశీలో మాదిరిగానే అయోధ్యలో కూడా గుడి చుట్టుపక్కల ఇరుకు సందులు.

మాకిచ్చిన టైం స్లాట్ ఒంటి గంట నుంచి మూడు. సమయానికి చేరగలుగుతామా లేదా అనే సందేహం. మా అన్నయ్య కుమారుడు సుభాష్ జీఎస్టీలో ఉన్నతాధికారి. ట్రాఫిక్ పోలీసులను ఒప్పించి దగ్గరి దారిలో తీసుకు వెళ్ళడం వల్ల సరిగ్గా మా స్లాట్ టైం ముగిసే లోగా గుడికి చేరగలిగాము.

ముందుగానే టిక్కెట్లు ఆన్ లైన్లో బుక్ చేసుకున్నoదు వల్ల శ్రమ లేకుండా బాల రాముడి దర్శనం సులభంగా, చాలా త్వరితంగా జరిగింది. 75 ఏళ్లు నిండిన మాలో ఆరుగురికి ఉచిత వీల్ చైర్ సౌకర్యం లభించింది. మాలో కొందరు రెండో మారు కూడా దర్శనం చేసుకున్నారు. అక్కడ ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. అవన్నీ పూర్తయిన నాడు, అయోధ్య రామమందిరం కన్నుల పండువగా తయారవుతుంది. తర్వాత అయోధ్యలో కొత్తగా నిర్మించిన స్టార్ హోటల్ ‘రామాయణం’లో భోజనాలు చేసి మళ్ళీ కాశీ చేరే సరికి బాగా పొద్దు పోయింది.

మర్నాడే తిరుగు ప్రయాణం. ఈలోగా ఒక కబురు తెలిసింది. గంగలో పడవలపై ఆంక్షలు తీసేసారు అని. వెంటనే పోలోమంటూ బయలుదేరి కేదార్ ఘాట్ చేరుకుని ఒక మోటారు బోటులో అన్ని ఘాట్లు చూసుకుంటూ గంగలో కలయ తిరిగాము. చుట్టూ గంగ పారుతూ వున్నా కూడా,  ప్రతి ఒక్కరికీ ఆ ఎండలో దిగ చెమటలు పట్టాయి. ఒకళ్లిద్దరం తప్పిస్తే మిగిలిన వాళ్ళు అందరూ బోటు దిగగానే గంగలో స్నానాలు చేశారు. గ్రీన్ ఆటోలు (బ్యాటరీతో నడిచేవి) పట్టుకుని అందరం గెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చేసరికి ఫ్లయిట్ టైమ్ అయింది. పన్నెండున్నర తర్వాత కానీ, గెస్ట్ హౌస్ లో లంచ్ మొదలు కాదు. నిరాహారంగానే బయలుదేరి కార్లు ఎక్కి కూర్చున్నాము. ఇంతలో ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి, కాశీకి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళడానికి వీలులేదు, మీకు అయిదు నిమిషాల్లో అన్నం వడ్డిస్తాను, రండి అని పిలిచాడు. అతని పేరు ముత్తు. గెస్ట్ హౌస్ క్యాంటీన్ ఇన్చార్జి.

మాతా అన్నపూర్ణేశ్వరి దయ, మన ప్రాప్తం అనుకుంటూ వెళ్లి, వేడి వేడిగా వడ్డించిన భోజనాలు చేసి ఎయిర్ పోర్ట్ చేరుకున్నాము. అసాధ్యం అనుకున్న గంగాస్నానంతో పాటు అన్నపూర్ణమ్మ తల్లి ప్రసాదం కూడా దొరకడం మా అదృష్టం.

ఇళ్ళల్లో కళ్ళముందే పెరిగి పెద్దయిన పిల్లలు, తమ తలితండ్రులకు ఒక దశలో కుడి భుజం అవుతారు. భుజాలు ఒక్కటే కాదు, కాళ్ళూ చేతులు కళ్ళూ అన్నీ వాళ్ళే అనడానికి మా ఈ కాశీ యాత్రే ఉదాహరణ. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, మా వదిన విమలాదేవి గారు ఈ విషయంలో మహా అదృష్టవంతులు. వెళ్లిన గ్రూపులో దెబ్బయి దాటిన వాళ్ళం ఆరుగురం వున్నాం. మా అన్నయ్య పిల్లలు జవహర్, సుభాష్, లాల్, వారి భార్యలు రేణు, హేమ, దీప, మా కోడలు నిషా, మా మేనల్లుడు రామచంద్రం భార్య కరుణ అస్తమానం వాళ్ళు కష్టపడుతూ, మేము ఏమాత్రం కష్టపడకుండా కనిపెట్టి చూసారు. వాళ్ళూ మరీ చిన్నవాళ్లేమీ కాదు, కానీ పెద్ద మనసున్న వాళ్ళు.

హైదరాబాదు నుంచి ఎప్పటికప్పుడు మా యోగ క్షేమాలు కనుక్కుంటూ అప్పటికప్పుడు అవసరమైన సాయం, లోకల్ ట్రాన్స్పోర్ట్, గంగలో తిరగడానికి బోటు వంటివి ఏర్పాటు చేసిన మరో గొప్ప వ్యక్తి వున్నారు. వారి పేరు రమేష్ గారు. మా అన్నయ్య పెద్ద కుమారుడు జవహర్ వియ్యంకులు. వీరందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు.

పోతే, రెండేళ్ల పైచిలుకు వయసున్న నా మనుమరాలు జీవిక అర్ధరాత్రి లేపినా, ఏడిపించకుండా లేచి బుద్దిగా స్నానం చేసి గుడికి వచ్చింది. వీల్ చైర్ లో నాతో పాటు కూర్చోమన్నా వినకుండా అంతంత దూరాలు నడిచే తిరిగింది.

వీటన్నిటి వెనుక మనకు తెలియని అర్థం కాని ఏదో అదృశ్య శక్తి వుంది అనుకోవడంలో తప్పేమీ లేదు.

అలాగే అనుకుంటూ యాత్ర పూర్తి చేసుకుని, తిరిగి ఇండిగో ఎక్కి ముందు అనుకున్న విధంగానే అక్టోబర్ రెండో తేదీ సాయంత్రానికి క్షేమంగా అందరం హైదరాబాద్ చేరాము.

తోకటపా:

అయోధ్య వెళ్ళినప్పుడు నా కోడలు నిషా, మాకు ఎవరికీ తెలియకుండా, కూతురు జీవికను వెంటబెట్టుకుని వెళ్లి చనిపోయిన నా భార్య నిర్మల, నా కుమారుడు సంతోష్ పేరిట అక్కడి అన్నదాన క్షేత్రానికి విరాళం ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే ఆ క్షేత్రం వారు  అన్నదానం చేయడమే కాకుండా ఆ వీడియోను పంపారు.  

 

Note: అయోధ్యలో నిర్మాణాలు అప్పటికి ఇంకా పూర్తి కానందువల్ల ఈ కార్యక్రమాలను తాత్కాలిక షెడ్లలో నిర్వహిస్తున్నారు.

 

కింది ఫోటో :

కాశీ యాత్రలో మా కుటుంబం
















29, సెప్టెంబర్ 2026, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో : (360): భండారు శ్రీనివాసరావు

 


ఉద్యోగంతో ఆటలు

ఆలిండియా రేడియోలో ఉద్యోగాన్ని ఆడుతూ పాడుతూనే కాదు, ఓ ఆటలా కూడా చేశాను. అలా ఏడాది రెండేళ్లు కాదు, దాదాపు మూడు దశాబ్దాలు. అవన్నీ ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది, చిన్నతనమూ అనిపిస్తుంది.

జలగం వెంగళరావు గారు కేంద్ర మంత్రిగా వున్నప్పుడు, అప్పుడు ఖమ్మం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నా మేనల్లుడు అయిన కౌటూరి దుర్గాప్రసాద్ తో కలిసి, హైదరాబాదు, ద్వారకాపురి కాలనీలో వారి ఇంటికి వెళ్లాను. లోకయ్య ( వెంగళరావు గారి నమ్మిన బంటు) మమ్మల్ని చూడగానే లోపలకు తీసుకు వెళ్ళాడు.

వెంగళరావు గారు అప్పుడే బ్రేక్ ఫాస్ట్ చేయబోతూ మమ్మల్ని కూడా తనతో కూర్చోబెట్టుకున్నారు. ఈ లోపల ఉద్యోగ ధర్మంగా ఏదో అడగడం, ఆయన చెప్పడం జరిగింది. నేను వారి ఇంటినుంచే ఎస్టీడీ ఫోనులో విజయవాడ ఆలిండియా రేడియోకి చెప్పాను. న్యూస్ ఎడిటర్ ఆర్వీవీ కృష్ణారావు గారు రిసీవ్ చేసుకున్నారు. మేము టిఫిన్ చేస్తుండగానే రేడియోలో ఉదయం ప్రాంతీయ వార్తలు మొదలయ్యాయి. మొదటి హెడ్ లైన్ వెంగళరావు గారి వార్తతోనే మొదలయింది. అది విని ఆయన గారు ఆశ్చర్యంగా, ‘అరె! అప్పుడే ఎలా వచ్చింది, నేనింకా సాయంత్రం వార్తలు అనుకున్నా’ అన్నారు.

ఏ. మదన్ మోహన్ గారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. రాజ్ భవన్ రోడ్డులో ఓ ప్రభుత్వ భవనంలో వుండే వారు. మంచి ఆతిథ్యానికి పెట్టింది పేరు. అలా ఒకరోజు ఆయన ఇంట్లో కాలక్షేపం చేస్తుండగా, రేడియోలో వివిధ భారతిలో శ్రోతలు కోరిన పాటలు వేస్తున్నారు. నేను ఆయన పిల్లల పేర్లు అడిగి తెలుసుకుని, తరువాతి పాటలో ఆ పేర్లు చెప్పాల్సిందని మా డ్యూటీ రూముకు ఫోన్ చేసి చెప్పాను. మదన్ మోహన్ గారింట్లో ఓ చక్కటి పెంపుడు కుక్క వుంది. దాని పేరు పింకీ అనుకుంటా. ఆ పేరు కూడా చెప్పాను.

వెంటనే ఆ పేర్లన్నీ రేడియోలో వచ్చాయి. మదన్ మోహన్ గారు ఆ రోజు ఎంత సంతోషపడ్డారో, తన పెంపుడు కుక్క పేరు కూడా రేడియోలో వచ్చినందుకు.