కన్న కూతురు కాదు కానీ కన్న బిడ్డే! - భండారు శ్రీనివాసరావు
జీవనయానంలో ఎంతో మంది తారసపడుతుంటారు. అయితే కొద్ది మందే యాదిలో వుంటారు.
ఈ అమ్మాయి అంకిత మా ఇంటికి వచ్చి ఏడాది అవుతోంది.
అప్పటికి నా కొడుకు కోడలు ఉద్యోగస్తులు. మనుమరాలిని చూసుకోవడానికి మా ఆవిడ లేదు.
అంచేత ఏదో కంపెనీని సంప్రదించి ఓ కేర్ టేకర్ అమ్మాయిని పెట్టారు. ఆ అమ్మాయి పేరు తప్ప వాలకం నాకు ఏమాత్రం నచ్చలేదు. గాంధీ గారి కళ్ళజోడులాంటి గుండ్రటి పెద్ద కళ్లద్దాలు. ఆధార్ కార్డు ప్రకారం వయసు 22. కానీ ఆ పిల్ల పీలగా పద్నాలుగేళ్ళ అమ్మాయిలా వుంది.
అయినా ఛాయిస్ నాది కాదు.
మనుమరాలు జీవికని కనిపెట్టి చూసుకోవడమే ఆ అమ్మాయి పని.
ఇంట్లోనే వుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నా కంట్లో పడేది. చీదరించుకున్నట్టు చూసేవాడిని.
ఈలోగా ఘోరం జరిగిపోయి మా వాడు ఆకస్మిక గుండె పోటుతో చనిపోయాడు.
నాకు ప్రపంచం యావత్తూ శూన్యంగా మారింది. ఆరోగ్యం దెబ్బ తిన్నది. కనుచూపు మందగించింది. మా కోడలు నిషా శ్రద్ధ తీసుకుని కంటి ఆపరేషన్ చేయించింది.
కొన్ని రోజులు గంటగంటకీ కంట్లో చుక్కలు వేయాలి. ఆ పని అంకిత చూసింది. అలారం పెట్టుకుని కరక్టు టైముకి వేసింది.
ఆ తర్వాత బీపీ షుగర్ సమస్యలు. ఎప్పటికప్పుడు మిషన్ల మీద రీడింగ్ తీసుకుని ఒక పుస్తకంలో నోట్ చేసుకుని డాక్టర్లు అడగగానే చెప్పే బాధ్యత స్వచ్చందంగా తీసుకుంది. వేళకు గుర్తు పెట్టుకొని మందులు ఇచ్చేది.
ఈ నర్సింగ్ సర్వీసుతో ఆ అమ్మాయి పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.
ఆడపిల్లలు లేని నాకు ఈ అమ్మాయిని ఆ దేవుడే పంపాడు అని నిర్ధారణకు వచ్చాను.
అయితే ఒక విషయం చెప్పాలి.
ఇంత మొండిపిల్లను నా జీవితంలో చూడలేదు.
పాలవాడో, పేపరు వాడో వచ్చి డబ్బులు అడుగుతాడు.
అమ్మా అంకితా వెళ్లి నా ప్యాంటు జేబులో పర్స్ తీసుకురా అంటే ససేమిరా వినదు. హైదరాబాద్ లో ఉద్యోగానికి వచ్చేటప్పుడే మా అమ్మ ఇతరుల డబ్బు తాకవద్దు అని చెప్పి పంపింది అంటుంది.
నేనే చెబుతున్నా కదా అన్నా వినదు. తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు బాపతు.
ఈ కాలంలో ఇంత నిజాయితీ అరుదు.
సంక్రాంతి, దసరా వంటి పండుగలు, చీరలో డ్రెస్సులో కొనుక్కోమని వంటమనిషి వలలికి, (అసలు పేరు వనిత) పనిమనిషి అనితలతో పాటు డబ్బు ఇస్తే అంకిత తీసుకోదు. 'మీరు ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా జీతం పదిహేను వేలు లెక్క కట్టి ఇస్తున్నారు కదా! నా సంపాదనతోనే ఏదైనా కొనుక్కుంటాను, ఇక్కడ నాకు విడిగా పెట్టే ఖర్చు లేదు, నా ఆన్ని అవసరాలు మీరే చూసుకుంటున్నారు. ఓక వేయి నేను వుంచుకుని మిగిలింది మా అమ్మకు జీపే చేస్తాను' అంటుంది ధీమాగా, ఎంతో బాధ్యతగా.
అందుకే ఆ అమ్మాయి ముట్టె పొగరుని సహిస్తూ, భరిస్తూ వచ్చాను. ఆమెకున్న ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ వచ్చాను.
ఈ నెలాఖరుతో కాంట్రాక్ట్ ముగుస్తోంది. నవంబరులో వాళ్ళ కులదేవత పూజలు అవీ వున్నాయి. నెల రోజులు వుండను, వూరికి పోతాను అని ఏడాది కిందట పనిలో చేరేటప్పుడే చెప్పింది.
చంటి పిల్ల కోసం పెట్టుకున్న అమ్మాయి నా అవసరంలో నన్ను కంటికి రెప్పలా చూసుకుంది.
వెళ్ళిపోతోంది అంటే బాధగా వుంది.
ఆ అమ్మాయి దిగే స్టేషన్ వచ్చింది. దిగిపోతోంది. మంచి జ్ఞాపకాలు మిగిల్చి పోతోంది. అంతే అనుకోవాలి.
పనివాళ్ళు దొరుకుతారేమో కానీ పనిమంతులు దొరకడం కష్టం.
ఈ పోస్టు అంకితకే అంకితం.
తోకటపా:
మా పిల్లలలాగే అంకితకు కూడా తన ఫొటో సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేయడం అస్సలు ఇష్టం వుండదు. మా మనుమరాలు జీవికతో వున్న ఫోటోల్లో తాను వుంటే, అది ఎడిట్ చేసేదాకా వూరుకోదు. అంత మొండిఘటం.
నా స్నేహ బృందంలో ఒక్క Rajani Puccha గారు మాత్రమే ఈ అమ్మాయిని చూసారు.
కాకపోతే అంకిత INSTA లో వుంది.
అదీ ఎవరికోసం
మహేష్ బాబు కోసం.
తాను ఆ నటుడికి dhfm అంటే Die hard fan for Mahesh Babu ట.
2 కామెంట్లు:
December నుంచి మళ్లీ రమ్మనవచ్చు కదా
నిజానికి ఈ అమ్మాయి నా మనుమరాలి కేర్ టేకర్. నాకోసం పెట్టుకున్న అమ్మాయి కాదు. నా అనారోగ్యం కారణంగా వుండి పోయింది. నా మనుమరాలు ప్రస్తుతం కటక్ లో వుంది. ఇక్కడ కేర్ టేకర్ అవసరం లేదు. పైగా రెండు నెలలు ఉండను అని ముందే చెప్పింది. వస్తే మంచిదే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి