19, ఆగస్టు 2023, శనివారం

ఫోటో – భండారు శ్రీనివాసరావు

 

నా చిన్ననాటి స్నేహితుడు, సహాధ్యాయి ప్లస్ మేనల్లుడు అయిన తుర్లపాటి సాంబశివరావు (శాయిబాబు) దగ్గర ఒక డబ్బా డొక్కు కెమెరా వుండేది. అది పనిచేసేదా కాదా తెలుసుకోవాలి అంటే పదో పదిహేనో రూపాయలు కావాలి. రీలు కొనడానికి ఓ పది, కడిగించి ప్రింట్లు వేయడానికి మళ్ళీ కొంతా ఇల్లాగన్న మాట.  అంత మొత్తం మాదగ్గర ఎలాగూ వుండదు కాబట్టి, అదో టాయ్ కెమేరాలాగా శాయిబాబు వద్ద చాలా కాలం ఉండిపోయింది.

ఒకరోజు దాని అవసరం వచ్చింది. అప్పటికి చదువు  పూర్తి కాకుండా, ఉద్యోగం సద్యోగం కనుచూపుమేరలో లేదన్న సంగతి నిర్ధారణగా తెలిసిన రోజుల్లో, పక్కింటి అమ్మాయితో (అంటే తదనంతర కాలంలో మా ఆవిడ) నా ప్రేమ వ్యవహారం నిరాఘాటంగా సాగిపోతున్న అద్భుత కాలంలో నాకు ఆ కెమెరా కావాల్సి వచ్చింది. కృష్ణా  బ్యారేజి దాకా నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి గూడు రిక్షాలో మంగళగిరి పానకాల స్వామి దర్శనం చేసుకుని రావాలనేది నా ప్లాను. మరో మేనల్లుడు రామచంద్రం మన కూడా వస్తేనే నేను వస్తానని నాకు కాబోయే ఆవిడ  షరతు పెట్టడంతో,  ముగ్గురం కలిసి వెళ్ళాము.  దర్శనం అదీ అయిన తర్వాత అక్కడి కొండపై ఇదిగో ఈ కింది ఫోటో దిగాము. తీసింది రామచంద్రం. కెమెరా ఇచ్చేటప్పుడే చెప్పాడు. రీల్లో ఆల్రెడీ తీసిన ఫోటోలు కొన్ని వున్నాయి. డబ్బులు లేక కడిగించలేదు, కాబట్టి ఒకటీ లేదంటే రెండు, అంతే అంతకంటే ఎక్కువ దిగకండి అని. దాంతో ఒక్కటంటే ఒక్క ఫొటోనే దిగి కెమెరా తిరిగి ఇచ్చేశాను. 

ఆ రీలు కడిగించే డబ్బులు కూడ బెట్టడానికి మరి కొన్ని నెలలు ఆగాల్సివచ్చింది. వీరన్న స్టూడియోలో ఇచ్చాము. రెండు రోజుల తర్వాత చూస్తే రీల్లో చాలా ఫోటోలు  ప్రింటుకు పనికిరానివని తేలింది. చివరికి ఐదో ఆరో బాగున్నాయి. కానీ అన్నీ ప్రింటు వేయించాలి అంటే డబ్బులు సరిపోవు. అంచేత ఓ మూడు వేయించాము. అందులో ఇదొకటి.



పెళ్ళికి ముందు ఫోటో కదా! అదో స్వీట్ మెమొరి.

(ఈరోజు, ఆగస్టు 19, వరల్డ్  ఫోటోగ్రఫీ డే అట కదా!)

6, ఆగస్టు 2023, ఆదివారం

రష్యన్ కనెక్షన్ – భండారు శ్రీనివాసరావు

 మిహాయిల్ గోర్భచెవ్ లక్ష్మణ కుమార్

అరవై పడిలో పడిన వారికి గోర్భచెవ్ ఎవరో తెలిసే వుండొచ్చు. కానీ లక్ష్మణకుమార్ అనే అచ్చ తెలుగు పేరున్న కన్నడిగుడైన వ్యక్తికి ఏం సంబంధం?
తొంభయ్యవ దశకంలో రేడియో మాస్కోలో పనిచేస్తూ వున్నప్పుడు ఆ అయిదేళ్ళ పాటు సోవియట్ ప్రైం టైం టీవీలో అస్తమానం ప్రముఖంగా కనిపించే వ్యక్తులు ఎవరయ్యా అంటే సోవియట్ యూనియన్ అధినాయకుడు మిహాయిల్ గోర్భచెవ్, ఆయనతో పాటు ఇదిగో ఈ లక్ష్మణకుమార్ గారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పిల్లల చదువు సంధ్యల కోసం ఎంబసీ వారు నెలకొల్పిన ఇండియన్ సెంట్రల్ స్కూల్లో యోగా టీచర్. అలనాటి అంటే దాదాపు ముప్పయ్ ఆరేళ్ల క్రితమే సోవియట్ పౌరులకు యోగాలో శిక్షణ ఇచ్చేందుకు వారానికి ఒకరోజు సోవియట్ ప్రైం టైం టీవీ ఛానల్ లో నిర్విరామంగా ఒక గంటకు పైగా యోగా పాఠాలు చెబుతూ కానవచ్చే వారు. బహుశా ఒక విదేశీ ప్రైం ఛానల్లో ప్రముఖంగా కనిపించే అవకాశం సకృత్తుగా కొందరికే లభిస్తుందేమో. అలాంటిది సోవియట్ యూనియన్ వంటి ఇనుపతెరల దేశంలో ఇది మరీ అసాధ్యం. అలాంటి అరుదైన మహత్తర అవకాశం లక్ష్మణ కుమార్ గారికి అయాచితంగా దొరికింది.
మా ఇద్దరు పిల్లలు మాస్కోలో అదే కేంద్రీయ పాఠశాలలో చదువుతున్నప్పుడు లక్ష్మణకుమార్ గారి పిల్లలు గిరిజ, గీతేశ్ మా పిల్లలు సందీప్, సంతోష్ క్లాస్ మేట్స్.
సరే! మా జీవితంలో ఒక అద్భుత ఘట్టానికి, సోవియట్ యూనియన్ అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విడిపోవడానికి ఒకేసారి తెర పడింది. దాంతో ఎక్కడివాళ్ళం అక్కడ తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి తరలి వచ్చాం.
మాస్కోలో కలిసి మెలిసి ఉన్న మా రెండు కుటుంబాలు మళ్ళీ కలవడం అన్నది పాతికేళ్ళ తర్వాత ఒకసారి జరిగింది. ఏదో పనిమీద హైదరాబాదు వచ్చిన లక్ష్మణ కుమార్ దంపతులు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు మా ఆవిడ వుంది. మళ్ళీ నిన్న కలిశాము ఆవిడ లేకుండా. చాలా బాధ పడ్డారు విషయం తెలిసి. ఏమీ చేయగలిగింది లేదు వాళ్ళు, నేనూ కూడా.
ఆయనకు 88, మనిషిలో తేడా లేదు, కొంచెం వినికిడి శక్తి తగ్గింది. నాకు 78. చిన్నప్పటి నుంచి ఎవరి మాటా వినే అలవాటు లేదు. అంచేత నాకూ చెవుడే. కులాసాగా పాత కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాము. భోజనం చేస్తూ పాత విషయాలు నెమరేసుకున్నాము.
తోకటపా
డెక్కన్ సేరాయ్ స్టార్ హోటల్ వాళ్ళు అతి ఖరీదైన డిష్ వడ్డించారు. అదే టమాటా పప్పు.
కింది ఫోటోల్లో : లక్ష్మణకుమార్ దంపతులను శాలువాలతో సత్కరిస్తూ నేను, గూపు ఫోటోలో అందరం. ఈ ఫోటోలో ఓ రష్యన్ గృహిణి వున్నారు. అపోలో ఆసుపత్రిలో పనిచేసే గుండె వైద్యుడు డాక్టర్ సతీష్ గారి నాన్నగారు భారత మిలిటరీలో అధికారి. రష్యన్ యువతి జోయా (ZOYA) అప్పుడు వారి నాన్నగారి ఉద్యోగ రీత్యా (ఆయన గారు కూడా రష్యన్ మిలిటరీ అధికారే, సోవియట్ ఎంబసీలో అధికారి) ఢిల్లీలో వుండగా పరిచయం. గుండె డాక్టర్ కదా, సతీష్ గారు, ఆవిడా గుండెలు మార్చుకుని ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. 1992 నుంచి ఇక్కడే వుంటూ తెలుగు బాగా నేర్చుకుని తెలుగు జోయా గారు అయిపోయారు. అదన్న మాట.






(04- 08- 2023)