19, ఫిబ్రవరి 2020, బుధవారం

అన్నయ్య గురించి అక్కయ్యలు ...పెద్ద అన్నయ్య, కీర్తిశేషులు భండారు పర్వతాలరావు గారి  ఏడూడికి ఆయన గురించి చిన్న పుస్తకం తెద్దామని అడిగితే, శారదక్కయ్య, సరసక్కయ్య, సావిత్రక్కయ్య, భారతక్కయ్య వెంటనే స్పందించారు. కారణాంతరాలవల్ల  ఆ సంకల్పం నెరవేరలేదు. కానీ పాత కాగితాల్లో వాళ్ళు రాసిన జ్ఞాపకాలు కనిపించాయి. ఆ రాతలకు అక్షర రూపం:  
అన్నయ్య గురించి.... కొలిపాక శారద
బాబు మాట్లాడుతుంటే పెద్దవాళ్ళం కూడా ఆశ్చర్యంతో, ఎవరూ చూడకుండా ముక్కుమీద వేలేసుకునేవాళ్ళం. అంత గొప్పగా ఉండేవి వాడి మాటలు. ఎదుటివారి మనసు గమనించి వారి మనసులోని మాటను మార్దవంగా చెప్పేవాడు. అది నిజానికి ఓ అపూర్వమైన శక్తి. భగవంతుడే పుట్టుకతో ఇచ్చాడు. మా బాబు బయటి వాళ్ళతో ఎలా వుండే వాడో తెలియదు కాని, బావగార్లందరినీ సమానంగా గౌరవిస్తూ, మర్యాద చేస్తూ, పాదాలకు నమస్కారం చేస్తూనే, చురక వేయాల్సిన సందర్భం వస్తే మాత్రం, ముఖ్యంగా బావల మీద వాడు వేసే చమత్కార బాణాలు వింటూ లోలోపల నవ్వుకునే వాళ్ళం. మావారితో మాట్లాడేటప్పుడు, దేశభక్తి, రాజకీయాలు ఏవేవో చర్చించేవాడు. మాట్లాడడంకన్నా ఎక్కువ వినడమే  చిన్నప్పటినుండి నాకలవాటు. నవ్వు వచ్చినప్పుడు దాచుకోవడం తెలియకపోయినా, సభ్యత పాటించాల్సిన సందర్భాల్లో దాన్ని చిరునవ్వుగా మార్చుకునేదాన్ని.
బాబు కుటుంబం పట్ల నెరవేరుస్తున్న బాధ్యతల బరువు చూసి రాధక్కయ్య ఎప్పుడూ అంటూవుండేది, ‘ నేను పెద్ద కొడుకుగా పుట్టి వుంటే మొత్తం కుటుంబానికి ఏ ఇబ్బందీ లేకుండా చూసేదాన్నని. అది దేవుడు విన్నట్టున్నాడు, దాని కడుపున రంగడు పుట్టాడు. బాబుకు కూడా రంగడు అంటే ప్రేమే కాదు, గౌరవం కూడా. తమ చదువూ, తెలివితేటలూ  కుటుంబానికే కాదు, నలుగురికీ ఉపయోగపడాలని వాళ్ళిద్దరూ తపించేవారు.
బాబుకి సాహిత్యంపై తగని ఆసక్తి. మేనమామల పోలికలు వచ్చాయేమో తెలియదు, మా పిల్లలకు కూడా ఆ వరస ఒంటబట్టింది. సాహిత్యపరంగా మా ఇంట్లో బాబుకెప్పుడూ సన్మానమే.
మొత్తం  భండారు బండికి ఇరుసు ఊడిపోయిందా అనిపిస్తుంది బాబు లేకుండా.
వాణ్ణి తీసుకువెళ్ళిన దేవుడు ఇచ్చిన ధైర్యంతో బండి నడుపుతూనే వున్నాం. తప్పదు కదా!
రఘు, రాణి, వేణి, వాణి కుటుంబాలకు ఆశీస్సులు.
కొలిపాక శారద

అన్నయ్య గురించి ..... తుర్లపాటి సరస్వతి
భక్తులకు ఆ భగవంతుడి కరుణ ఒక్కటే సమాదరణగా లభిస్తుంది. అదే మనిషి పుట్టుక పుడితే ఆప్యాయతలు, అనురాగాలు సాటి మనుషులకు సమానంగా  పంచడం అంత సులభం కాదు. ప్రతి మనిషికి సొంత ఇష్టాలు వుంటాయి. తోటి మనిషిని తనదైన రీతిలో అంచనాలు వేయడాలు వుంటాయి. అలాంటి అరలు తెరుచుకోకుండా తలుపులు వేసేసి, స్వచ్చమైన, స్పష్టమైన ఆలోచనలపై దృష్టి నిలపడం మామూలు మాట కాదు. పేగు పంచుకున్న, పేగు తెంచుకున్న బంధాలు వేరే. ఎవరి సంసారాలు వారివనే సంకుచిత దృష్టితో వ్యవహరించడం వల్లనే ఆప్యాయతలు, అనురాగాల్లో ఇన్ని తేడాలు. ఇలాంటివి ఎన్నో విన్నాం. మరెన్నో కన్నాం.
కానీ,
మా అక్కాచెల్లెళ్ళం మెట్టింట్లో అడుగుపెట్టి సంసారవృక్షం ఒక పక్క పెరుగుతున్నా, అత్తింటి సేవలు, మర్యాదలు కాపాడుకుంటూనే, కంభంపాడులో మా చిన్నతనంలో తల్లి చాటు పిల్లలుగా ఉన్నప్పటి తీయదనాలకు మేం ఎప్పుడూ దూరం జరగలేదు. జరగం కూడా.
ఏటా అందరం అప్ప తద్దినానికి కలిసేవాళ్ళం. పెళ్ళిలా వుండేది ఆ హడావిడి. వెంకప్ప ఏం చేస్తున్నాడో మూడో కంటికి తెలియకుండా అన్ని ఏర్పాట్లు చేసేవాడు. అక్కడ వుండేది ఒకటి రెండు రోజులైనా చిన్నప్పటి నుంచీ అక్కడే ఉంటున్న అనుభూతి కలిగేది.
ఇంటికి పెద్దవాడయిన  అప్ప తద్దినం అందరినీ కలిపే సందర్భంగా భావించేవాళ్ళం కానీ, ఇదేమిటి దేవుడు శపించినట్టుగా ఇంటికి పెద్ద కొడుకు బాబు ఏడూడికి కలవడం ఏమిటి? మా పెద్దవాళ్ళ దౌర్భాగ్యం కాకపొతే.
మా పుట్టింటి గౌరవాన్ని నిలిపింది మా బాబే. మా వారంటే బాబుకి అమితమైన గౌరవం. బాబంటే మా వారికి అమితమైన వాత్సల్యం. వయసులో చిన్నవాడయినా వాడి మాటంటే మా వారికి తగని గురి. బాబు జ్ఞాపక శక్తి అమోఘం. ఎదురుగా ఎవరు వుంటే వారి అభిరుచికి తగిన విషయాలు  ఆసక్తిగొలిపేలా చెబుతుండేవాడు. వాడు ముచ్చట్లు చెబుతుంటే మేమందరం ప్రపంచాన్ని మరచిపోయి వింటుండేవాళ్ళం.
బాబు బాబా దగ్గరికి వెళ్లి, అక్కడినుంచి ఆ దేవుడి దగ్గరికి వెళ్లి అప్పుడే ఏడాది గడిచిందా – భగవంతుడా!
తుర్లపాటి సరస్వతి

అన్నయ్య గురించి.... కౌటూరి సావిత్రి
బాబు ఖమ్మం ఎప్పుడు వచ్చినా, సరోజినితో కలిసి నడుచుకుంటూ మామిళ్ళగూడెంలోని మా ఇళ్ళన్నీ వరసగా చుట్టబెట్టేవాడు. వాడు ఖమ్మం వస్తే ముందు ఎవరింటికి వచ్చేవాడని ఎవరూ అనుకుండేవాళ్ళు కాదు, ఎందుకంటె ఓపిగ్గా అందరిండ్లకు వచ్చేవాడు. పెద్దల్నీ, పిల్లల్నీ ఆప్యాయంగా పలకరించేవాడు. వాడు వస్తేచాలు అన్నీ ముచ్చట్లే. రకరకాల కబుర్లు చెప్పేవాడు. అసలు ఖమ్మంతోనే దివ్యమైన అనుబంధం వుంది బాబుకి. అది నరసింహస్వామి గుట్ట. ఆ గుట్ట మీదికి ఎక్కి కలయచూస్తె ఖమ్మం అంతా ఇంతై కనిపిస్తుందని సరదాగా అనేవాడు. వాడి మాటలు నవ్వు తెప్పించేవి. కానీ తరచి చూస్తె అందులో నిగూఢమైన ఆధ్యాత్మిక భావం గోచరించేది.
అమ్మంటే బాబుకు యెనలేని గౌరవం. తల్లుల పట్ల పిల్లలకు అనురాగం వుండడం సహజమే. కానీ బాబుది విలక్షణమైన ప్రేమ. అప్పుడప్పుడూ అమ్మ కొన్నాళ్ళు ఖమ్మంలో మా ఇంట్లో వుండేది. అమ్మ కాళ్ళకు దణ్ణం పెట్టి రైలు స్టేషనుకు వెళ్ళేవాడు. రైలుకు పది నిమిషాలు టైం వుంటే చాలు, గబగబా వచ్చి మళ్ళీ అమ్మను చూసి వెళ్ళేవాడు.
సరోజినీ, విమల, అరుణ, నిర్మల ఈ నలుగురూ  భండారు వారి కోడళ్ళుగా కాదు, మాతో కలిపి పదకొండుమంది ఆడబిడ్డలుగా ఇమిడిపోయారు.
బాబును ఇలా అర్ధాంతరంగా తీసుకు వెళ్ళడం వెనక ఏముందో తెలవదు కానీ ఆ దేవుడికి బాబుతో ఏదో పనిపడే ఈ పని చేసి ఉంటాడు. నిజానికి వాడు ఎక్కడున్నా చేసేది దేవుడి పనేగా. వాడి చివరి రోజుల్లో మాకు బాబా దర్శనం ఏర్పాటు చేసి వాడు దేవుడి దగ్గరికే వెళ్ళిపోయాడు.
దేవుడా! నీకో దండం!
కౌటూరి సావిత్రి   
         

అన్నయ్య  గురించి ... తుర్లపాటి  భారతి
ప్రేమక్కయ్య. నేను దాన్ని ప్రేమనే పిలుస్తాను. ప్రేమకు అన్నయ్య అంటే ప్రేమతో కూడిన గౌరవం. అన్నయ్య ఎదుట నోరు విప్పేది కాదు. సంతోషం నిండిన మొహంతో అన్నయ్య ముందు మౌనంగా వుండేది. కానీ నేనలా కాదు. నోరు మూసుకుని వుండే తత్వం కాదు నాది. నా తరవాత ముగ్గురు తమ్ముళ్ళు వున్నా నేనే అందరికంటే చిన్నదాన్ని అనిపించేది. ఆ ఇది తోనే, అన్నయ్య అంటే కొంత చనువుగా మసిలేదాన్ని. అన్నయ్య తోటి ముఖతః చెప్పలేని విషయాలను ఉత్తరాల్లో కూర్చేదాన్ని. వెంటనే అన్నయ్య నుండి జవాబు వచ్చేది. నాఉత్తరం కొద్దిగా లేటయితే, ఎందుకోలే పోనీ  అని వూరుకునేవాడు కాదు. మళ్ళీ ఆయన నుంచి ఉత్తరం వచ్చేది. అన్నయ్య రాసే ఉత్తరాల్లో ఆయన కనిపిస్తున్నట్టే వుండేది. అదో చిత్రం. అన్నయ్య గురించి ఇలా రాయాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. ఆయన్ని ఇలా గుర్తు చేసుకోవాల్సి వస్తుందని కూడా ఊహించలేదు.
అన్నయ్య అన్నదాన్ని, నేను కాదని అన్న సందర్భాల్లో నాది గెలుపు కాదు, ఆయనది ఓటమి కాదు. నిజం చెప్పాలంటే నామీద ప్రేమతోనే ఆయన ఓడిపోయి ఉంటాడు.
బహుశా మా పేర్లు ప్రేమ భారతి అని అన్నయ్యే సూచించి ఉంటాడు. ఆ రెండూ ఆయన గుణానికి, స్వభావానికి సంబంధించినవి.
అదేమిటో అందరం ఒక గొడుగు కింద, ఎండొచ్చినా, వానొచ్చినా కలిసి ఉందామంటే, భగవంతుడు ఆ గొడుగును చిన్నగా చేస్తున్నాడేమో అనిపిస్తున్నది. దేవుడితో పోటీ ఏం పడతాం.
ఇక్కడ అందరం క్షేమంగా వుండాలని అన్నయ్య ఆత్మే పైనుంచి పెద్ద గొడుగు పట్టుకున్నట్టుగా అనిపిస్తోంది.
ప్రేమతో (కలిసి)
-తుర్లపాటి భారతి              

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మా ఇద్దరు పెదనాన్న గార్ల గురించి చదువుతున్నట్లుగానే అనిపించింది 🙏.

పైన వ్రాసినదాంట్లో “అప్ప” అంటే మీ తండ్రిగారి గురించాండీ?

మామిళ్ళగూడెం అంటే గుర్తొచ్చింది. నేను కొంతకాలం ఖమ్మంలో పని చేశాను (45 యేళ్ళ క్రిందటి సంగతి). అప్పుడు మామిళ్ళగూడెం లోనే జగన్నాథరావు టీచర్ గారింట్లో ఒక గదిలో అద్దెకున్నాను (బాచిలర్ ను). అప్పట్లో మీ ఎవరి పరిచయాలూ జరగలేదు లెండి.

నోస్టాల్జియా కలిగించే టపా పెట్టారు శ్రీనివాసరావు గారూ.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ విన్నకోట నరసింహారావు : అవునండీ. మా అక్కయ్యలు మా నాన్నని అప్ప అని పిలిచేవాళ్ళు(ట). నా చిన్నప్పుడు కదా! మామిళ్ళగూడెంలో మా ముగ్గురు బావగార్ల ఇళ్ళు పక్కపక్కనే వున్నాయి.